శనివారం, మే 23, 2009

కుంటి గేదె కొంపముంచింది..

అమ్మమ్మ వాళ్ళది చాలా విశాలమైన పెరడు.. రకరకాల పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, కాయగూరల మొక్కలు, పాదులు ఉండేవి అందులో.. పెరటికి, కొబ్బరి తోటకి మధ్య పెద్ద నుయ్యి, నూతిలో చిన్నవి, పెద్దవి కలిపి ఓ డజను తాబేళ్లు. ఆ నూతి గట్టుకి దగ్గరలో ఓ పెద్ద నేరేడు చెట్టు, వేప చెట్టు. ఈ రెండూ చాలా పెద్ద చెట్లు..మూడు తరాల పిల్లలు ఆటలాడుకున్నారు వాటి నీడలో..వాళ్ళలో మేము కూడా ఉన్నాము. మా కన్నా ముందు అమ్మ వాళ్ళు వాళ్ళ చిన్నప్పుడు ఆ చెట్ల కిందే మధ్యాహ్నాలు ఆడుకునే వాళ్ళు.

అమ్మ వాళ్ళ అక్కలకి ఓ స్నేహితురాలు ఉండేది.. ఆమె పేరు ముంతాజ్. 'రౌడీ పిల్ల' అని పేరు ఆమెకి. అమ్మ మూడో అక్కకి ఆమెకి మంచి స్నేహం. వాళ్ళిద్దరి ఆటపాటలు, అభిరుచులు బాగా దగ్గరగా ఉండేవి. అమ్మ వాళ్ళ ఏడుగురు అక్క చెల్లెళ్ళలో రెండో ఆమె బాగా నెమ్మదస్తురాలు. ఎవరి జోలికి వెళ్ళదు, తన పని ఏమిటో తనది. ఆమెకి స్నేహితురాళ్ళు కూడా తక్కువే. అమ్మమ్మ వెనుక తిరుగుతూ ఇంటి పనుల్లో సాయం చేస్తూ ఉండేది.

తాతగారికి వ్యవసాయం తో పాటు పాడి కూడా ఉండేది. ఎల్లవేళలా పెరట్లో కనీసం నాలుగు పాడి పశువులు ఉండాల్సిందే. అమ్మమ్మకి ఆవులంటే ఇష్టం..అందువల్ల కనీసం రెండు ఆవులు తప్పనిసరి. అమ్మకి ఆరేడేళ్ళ వయసప్పుడు వాళ్ళకో గేదె ఉండేది. ఆ గేదెకి ఒక కాలు 'సొట్ట కాలు' కావడంతో గుర్తు కోసం కుంటి గేదె అనేవాళ్ళు. వర్షాల రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో పశువులని ఎక్కువ సమయం చెట్ల కిందే కట్టేసి ఉంచే వాళ్ళు. అక్కడే వాటికి గడ్డి, కుడితి అందుబాటులో ఉంచేవాళ్ళు.

కుంటి గేదె నిలబడ లేదు కాబట్టి వేప చెట్టు కింద పడుకుని గడ్డిపరకలు నములుతూనో, నెమరు వేస్తూనో ఉండేది.. పాలు పితికే సమయంలో ఒకరు గేదెని పట్టుకుంటే మరొకరు పాలు పితికే వాళ్ళు. మిగిలిన రోజంతా ఆ గేదె చెట్టు కింద పడుకునే ఉండేది. ఆ వేప చెట్టు ప్రత్యేకత ఏమిటంటే కొమ్మలు పైకి కాకుండా కొంచం కిందకి ఉండడంతో పాటు పిల్లలు చెట్టు ఎక్కడానికి అనువుగా ఉండేది. పళ్ళు తోముకోడానికి పంథుం పుల్ల కావాలన్నా కూడా పిల్లలు కొమ్మెక్కి విరుచుకోవచ్చన్న మాట.

వేసవి మధ్యాహ్నాలు భోజనం కాగానే ముంతాజ్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసేది. ఆమె, అమ్మ వాళ్ళ మూడో అక్క కలిసి ఆడుకునే వాళ్ళు. ఉన్న ఆటలతో సరిపెట్టుకుంటే వాళ్ళు పిల్లలెందుకు అవుతారు? అందుకే వాళ్ళో కొత్త ఆట కనిపెట్టారు. ఆట ఏమిటంటే వాళ్ళిద్దరూ ఒకరి తర్వాత మరొకరు వేప చెట్టు ఎక్కడం, కొమ్మ మీద నుంచి కుంటి గేదె మీదకి దూకడం. వాళ్ళు ఎన్నిసార్లు దూకినా కుంటి గేదె తన పనిలో తాను ఉండేదే తప్ప కనీసం కదిలేది కాదు.

పిల్లలిద్దరికీ ఈ ఆట నచ్చడం తో రోజూ ఇదే ఆట ఆడడం కొనసాగించారు. ఎప్పుడూ తన పనేమిటో తానూ చూసుకునే రెండో అక్కకి ఈ ఆట ఎందుకో ఆసక్తిగా అనిపించింది. స్వతహాగా భయస్తురాలు కావడంతో, వీళ్ళ సాహసం ఆమెకి చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. పెరట్లో కూర్చుని వీళ్ళ ఆటని గమనించేది. ఆమెకి ఈ ఆట నచ్చిందని వీళ్ళిద్దరూ తెలుసుకుని, ఆమెని కూడా ఆడమని బలవంతం చేశారొక రోజున. ఒక్కొక్కరూ రెండేసి సార్లు దూకి చూపించాక ఈమెకి కొంచం ధైర్యం వచ్చింది.

లోపల్లోపల భయపడుతూనే వేప చెట్టెక్కింది. "మేమున్నాం నీకెందుక" ని ఇద్దరూ ధైర్యం చెప్పారు. కాసేపు తటపటాయించి, ఆమె చెట్టు మీద నుంచి గేదె మీదకి దూకేసింది. సరిగ్గా అప్పుడే కుంటి గేదె కి ఏమైందో కాని, ఒక్కసారిగా కదిలి పైకి లేచే ప్రయత్నం చేసింది.. అనుకోకుండా గేదె కదలడంతో కొంత, భయంతో మరికొంత, ఈమె బ్యాలన్స్ చేసుకోలేక కింద పడిపోయింది. వళ్ళంతా గీసుకుపోయి గాయాలు. జడుపు జ్వరం. ఓ నాలుగైదు రోజులు మంచం పట్టింది. ఈ కొత్త ఆట గురించి అమ్మమ్మకి తెలియడంతో ముంతాజు వాళ్లకి మళ్ళీ ఆ ఆట ఆడుకునే అవకాశం లేకపోయింది.

12 వ్యాఖ్యలు:

 1. You have a great talent in bringing to life those long forgotten afternoon games and scenes.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నిజంగా వాళ్ళు ఇంత ఎంజాయ్ చేసేవారన్నమాట!!!
  ఏం చేస్తాం చదివి ఆనందించడం తప్ప!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. చలా బాగుంది. తిట్టుకోవద్దు చిన్న పొరపాటో టైపాటో తెలియదు గాని అది పందెం పుల్ల కాదండి దాన్ని పంథుం పుల్ల అనాలి అని ఎక్కడో చదివినట్లు గుర్తు.

  టపా మాత్రం చలా బాగుంది ఇలంటివే మా అమ్మ కూడా కథలు కథలు గా చెప్తుంటుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. @కొత్తపాళీ, కత్తి మహేష్ కుమార్: ధన్యవాదాలు..
  @పద్మార్పిత: మన చిన్నప్పటి ఆటల గురించి మన తర్వాతి తరాల వాళ్ళు ఇలాగే చెప్పుకుంటారండి.. ధన్యవాదాలు.
  @విజయ మాధవ: సరిచేశానండి.. మీరు కూడా రాయడం మొదలు పెట్టండి ఆ కబుర్లు. ధన్యవాదాలు.
  #పరిమళం: ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 5. హాయిగా నవ్వుకున్నాను. బాగా వ్రాశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మేము కూడా ఇటువంటివి మరెన్నో కూడా చేసాం. ఉదాహరణకి, ఎండిపోయిన ఆనప పాదు పుల్లలు వెలించి ఆ పొగ పీలుస్తూ సిగరెట్టు తాగినంత ఆనందం పొందటం. మా మేడ మీద బానల్లో వాసిన కట్టి వుంచిన పొరుగింటివారి చింత కాయ పచ్చడి దొంగిలించి తినటం. మంచి టపా, కొత్తపాళి గరిదే నా అభిప్రాయమూను.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. వ్రాయాలనే ఉంది కానీ నాకు మీలాగా అందంగా వ్రాయడం రాదండి. నాకు సరిగా నా ప్రాజెక్ట్ రిపోర్ట్ రాయడమే రాదు. మనం రాతలో చాలా వీక్

  ప్రత్యుత్తరంతొలగించు
 8. @భవాని: ధన్యవాదాలు..
  @ఉష: బాగున్నాయండి మీ జ్ఞాపకాలు.. చక్కగా టపా రూపంలో వివరంగా పంచుకోరాదూ? ధన్యవాదాలు.
  @విజయ మాధవ: 'సాధనమున పనులు సమకూరు ధరలోన..' అన్నారు.. రాయడం మొదలు పెడితే చక్కగా పూర్తి చేస్తారు.. మీ టపాలు చదివాను..బాగా రాశారు.. కొనసాగించండి.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. హు!పత్తిపుల్లలు అంటించి రెండో వైపునుంచి పీలిస్తే పొగ వస్తుంది. వేసవి మధ్యాహ్నం ఆటల్లో అదొకటి.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. @సునీత: చాలా గుర్తొస్తాయండి, ఆలోచిస్తున్న కొద్దీ.. ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు