మంగళవారం, మే 19, 2009

అనంతపురం-ఆకాశమంత

గడిచిన రెండు వారాల్లో నేను రెండు సినిమాలు చూశాను. అవి అనంతపురం-1980, ఆకాశమంత. మొదటిది 'సుబ్రమణ్యపురం' అనే తమిళ సినిమాకి డబ్బింగ్ ఐతే రెండోది ద్విభాషా చిత్రం. రెండు సినిమాలూ నాకు చాలా నచ్చాయి. కథ, కథనం, నటీనటులు, సాంకేతిక నిపుణులు.. ఈ వరుసలో ఈ రెండు సినిమాలకీ ఎలాంటి పోలికా లేదు, కేవలం రెండు సినిమాలకీ మూలం తమిళమే అన్న ఒక్క విషయం తప్ప.

'అనంతపురం' కథకి నేపధ్యం ఫ్యాక్షన్, ప్రేమ. అయితే ఇది తెలుగు తెర ఫ్యాక్షన్ కి పూర్తి భిన్నంగా ఉంది. బాంబుల మోతలు, సుమోలు గాలిలోకి ఎగరడాలు లేకుండా కూడా ఫ్యాక్షన్ సినిమా తీయొచ్చు అనడానికి ఈ సినిమా ఓ ఉదాహరణ. కథాకాలాన్ని 1980 గా ఎన్నుకోవడం వల్ల బోల్డంత వైవిధ్యం చూపడానికి వీలైంది. మన తెలుగమ్మాయి స్వాతి ('కలర్స్' స్వాతి) లో ఉన్న నటిని వెలికితీసిందీ సినిమా.

తమిళ 'సుబ్రమణ్యపురా'న్నితెలుగు 'అనంతపురం' గా మార్చడం లో జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రామీణ నేపధ్యంలో సాగే కథలో రాయలసీమ గ్రామీణ మాండలికాన్ని ఉపయోగించడం ముఖ్యమైనది. అలాగే నాయికా నాయకుల మధ్య నేపధ్యంగా వచ్చే సినిమా పాట కోసం 'పూజ' సినిమా లోని 'ఎన్నెన్నో జన్మల బంధం..' పాట వాడడం అతికినట్టు సరిపోయింది. ఈ పాట వస్తుంటే థియేటర్లో విజిల్స్ వినిపించాయి.

ఫ్యాక్షన్ సినిమా కావడం తో హత్యలు కొంచం ఎక్కువగానే ఉన్నాయి. మొదటి సగం దాదాపు సాఫీగా జరిగినప్పటికీ రెండో సగం లో కథనం మరింత వేగవంతం కావడంతో పాటు హత్యా దృశ్యాలూ పెరిగాయి. కొన్ని హత్యలను వివరంగానూ, మరికొన్నింటిని ఇంచుమించు సింబాలిక్ గానూ చూపారు. ఊహించని మలుపులు రెండో సగం ప్రత్యేకత. డబ్బింగ్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అక్కడక్కడా తమిళ వాసనలు తప్పలేదు.

ఇక 'ఆకాశమంత' విషయానికొస్తే తండ్రులంతా - ముఖ్యంగా ఆడపిల్ల తండ్రులు - తప్పక చూడాల్సిన సినిమా. కూతుర్ని ఎక్కువగా ప్రేమించే తండ్రి, ఆమె స్వతంత్ర నిర్ణయాలను ఆమోదించలేక, వ్యతిరేకించలేక పడే ఆవేదనను చక్కగా చిత్రీకరించారు. ముఖ్యంగా కూతురు తన పెళ్లిని తానే నిర్ణయించుకునే సందర్భంలో తండ్రిగా ప్రకాష్ రాజ్ నటన గుర్తుండిపోతుంది. కొన్ని సన్నివేశాలను తెలుగు కోసం రి-షూట్ చేసిన ఈ తమిళ సినిమాలో కూడా అక్కడక్కడా తమిళ వాసనలున్నాయి.

అయితే కథా సమయానికి సంబంధించిన చిత్రీకరణ విషయంలో 'అనంతపురం' సినిమా బృందం తీసుకున్నంత శ్రద్ధ 'ఆకాశమంత' సినిమా వాళ్ళు తీసుకోలేదు. 'అనంతపురం' లో 1980 దృశ్యాలలో దుస్తులు, మేకప్, సెట్టింగ్స్, నేపధ్యంలో వచ్చే సినిమా పాటలు..ఇలా ప్రతి విషయంలోనూ శ్రద్ధ తీసుకున్నారు. అది తెర మీద కనిపించింది. 'ఆకాశమంత' లో ఇరవై ఏళ్ళ క్రితం దృశ్యాలు చూపించేటప్పుడు పాత్రధారులు మోడర్న్ జీన్స్, టీషర్టు లలో కనిపిస్తారు.

తన కూతురికి స్కూల్లో అడ్మిషన్ తీసుకునే సమయంలో ప్రకాష్ రాజ్ తమిళనాడు ముఖ్యపట్టణం 'చెన్నై' అంటాడు. అలాగే కూతురి బాల్యాన్ని అత్యాధునిక వీడియో కెమెరా తో చిత్రీకరిస్తాడు. ఇలాంటి లోపాలను పరిహరిస్తే 'ఆకాశమంత' ఇంకా మంచి సినిమా అయి ఉండేది. 'అనంతపురం' లో ఇలాంటి తప్పుల కోసం వెతికాను కానీ కనిపించలేదు.. రెండోసారి మరికొంచెం జాగ్రత్తగా చూడాలి, ఏమైనా దొరుకుతాయేమో..

13 వ్యాఖ్యలు:

 1. ఇరవయ్యేళ్ళ క్రితం జీన్స్ ,టీషర్ట్ లలో అన్నది కరెక్ట్ కాదు మురళి ...దానికి ముందు అయిదు ఏళ్ళు వెనుకవారు వేసుకున్నారు ..

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మీకో రహస్యం చెప్పనా? నాకు ఆకాశమంత సినిమా నచ్చలేదు.
  సుబ్రమణ్యపురంగా ఉన్నప్పుడే చూద్దామనుకున్నాను. సబ్‌టైటిల్స్ దొరక్క చూడలేదు. ఇప్పుడీ అనంతపురం చూడాలి మరి.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. తమిళ వైవిధ్యానికి ఈ సినిమాలు ఒక ఉదాహరణ మాత్రమే. వారి సంవత్సరపు టాప్ టెన్ సినిమాలు తీసుకుంటే ఆఖరి పదోచిత్రం స్థాయికి కూడా మన తెలుగు టాప్ వన్ చేరుకుంటుందా...అనే ప్రశ్న ఉదయిస్తూ ఉంటుంది నాకు.

  ఈ మధ్య వచ్చిన "వెన్నెలా కబడ్డి" చూడండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మొత్తానికి "అనంత పురం 1980 " చూడొచ్చంటారు..

  ప్రత్యుత్తరంతొలగించు
 5. పిల్లల వాదాల తర్వాత వెళ్ళినా,
  ఆహ్లాదంగా మనసుకి త్రుప్తి.
  సినిమా అంతా తానుగా నడిపిన
  ప్రకాష్ రాజ్ నటన గుర్తొస్తె ..పెదాలపై
  నవ్వూలపూలు పూస్తాయ్ ..బావుంది మీ టపా .

  ప్రత్యుత్తరంతొలగించు
 6. hi murali garu..me blog naku chala istam..me way of presenting mukyam ga...murali ane peru naku chala istam..ananthapuram lo kontechooputho song..super kada...

  ప్రత్యుత్తరంతొలగించు
 7. @చిన్ని: ప్రకాష్ రాజ్ వేసుకున్నవి ఇప్పటి లేటెస్ట్ ఫ్యాషన్స్ మరియు బ్రాండ్స్ అండి..అదీ సంగతి. ధన్యవాదాలు.
  @భవాని: నేను నిన్ననే రెండోసారి చూశానండి.. 'అనంతపురం' కూడా మరోసారి చూడాలి. ధన్యవాదాలు.
  @కత్తి మహేష్ కుమార్: 'వెన్నెలా కబడ్డీ' గురించి మరో మిత్రుడు కూడా చెప్పారు. తప్పక చూస్తానండి. ధన్యవాదాలు.
  @పరిమళం: చూడొచ్చండి.. అక్కడక్కడా తెర మీద రక్తం కనిపిస్తుంది.. ధన్యవాదాలు.
  @రిషి, శిరీష: ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. సుబ్రమణ్యపురం సినిమాకి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆ దర్శకుడు ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.. ఆయన స్వయంగా వేరే ఊళ్ళకి వెళ్ళి మరీ, 1980 లప్పుడు ఎలా ఉండేవి అని చూసి మరీ చిత్రీకరించారట.. కాబట్టి తప్పులు ఉండే అవకాశం తక్కువ :)

  ప్రత్యుత్తరంతొలగించు
 9. @మేధ: 'మానవ ప్రయత్నం' చేస్తానండి :) ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. murali garu

  i tried to write in telugu. but was unable to paste it here...

  anyways .. i did his interview the post prodction took more then eight or nine months ... the film costed around 3.5 crores.. technical ga brilluant film. but i didnt liked the violence and also a collage student loving a wayward are not logical to me...

  regarding the akashamanta ...
  the film has tons of flaws. main reason i didnt liked it is because of prakash raj saying that it is gift to his daughter.. whom he really does not care in real life..
  best wishes
  sri

  ప్రత్యుత్తరంతొలగించు
 11. @sriatluri: 'అనంతపురం' లో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే యువత ఫాక్షనిజం వైపు ఎలా వెళ్తారో చెప్పడం. తెలుగులో రాయడం గురించి మరికొందరు మిత్రులు కూడా చెప్పారండి. చూడాలి సమస్య ఏమిటో.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. If you start judging people, you have no time to love them - Mother Teresa.
  మురళి గారు, నాకు తెలిసి పై పోలిక సినిమాలకి కూడా వర్తిస్తుంది అనుకుంటాను. తప్పులు వెతకటానికి సినిమా చూడడం కంటే ఆనదించడానికి చూస్తే మేలు అని నా ఉద్దేశ్యం.
  By the way, మీరు బ్లాగ్ maintain చేసే తీరు చాలా బాగుంది. రాసే విధానం ఇంకా బాగుంది...ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 13. @jaganmohan: మీ భావం అర్ధమైందండీ. నేను సినిమాలు చూసేది సినిమా మీద ప్రేమతోనే.. లేకుంటే రెండోసారి చూడడం ఎందుకు చెప్పండి? ఇక తప్పులు వెతకడం అంటారా? సమిష్టి కృషితో తీసే సినిమాల్లో ఏదో ఒక శాఖ ఎక్కడో అక్కడ చేసే పొరపాట్ల వల్ల చిన్న చిన్న తప్పులు దొర్లక మానవు. ఇలాంటివి బయటికి వస్తే, కాబోయే దర్శకులు వీటిని దృష్టిలో పెట్టుకుని మరింత జాగ్రత్తగా సినిమాలు తీసే అవకాశం ఉందన్నది నా ఆశావాదం. చిన్నప్పుడు చదువుకున్న "తప్పులెన్ను వారు.." పద్యం ఇంకా మర్చిపోలేదండీ :-) ...ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు