గురువారం, మే 28, 2009

ఏమి సెట్?

ఏటా మూడు లక్షల మందికి పైబడి విద్యార్ధులు రాసే పరీక్ష..రాష్ట్రం లో జరిగే ప్రతిష్టాత్మకమైన పరీక్షలలో ఒకటి.. చాలా మంది విద్యార్ధులతో పాటు, వాళ్ళ తల్లిదండ్రులు సైతం జీవన్మరణ సమస్యగా తీసుకునే పరీక్ష.. ఇలాంటి పరీక్షను నిర్వహించడం లో ఏటా కనిపించేది అధికారుల నిర్లక్ష్యం.. కనీసం ఒక్క తప్పు లేకుండా ఒక్క సంవత్సరమైనా ప్రశ్న పత్రం తయారు చేయలేని పరిస్థితి.. అవును.. ఆ పరీక్ష ఎంసెట్.

ఇప్పుడు మనమంతా ఏదో రకంగా ఎంసెట్ తో సంబంధం ఉన్నవాళ్ళమే.. మన ఇంట్లో పిల్లలో, బంధువుల/స్నేహితుల పిల్లలో, పక్కింటి పిల్లలో లేదా మనతో పనిచేసే వాళ్ళ పిల్లలో ఇలా ఎవరో ఒకరు ఎంసెట్ కోసం సిద్ధం కావడం మనం చూస్తూనే ఉంటాం. మరికొంచెం గమనిస్తే ఎల్కేజీ నుంచి ఎంసెట్ కోచింగ్ అని బోర్డులు పెట్టే (ఇప్పుడు ఐఐటీ కూడా వచ్చి చేరింది) స్కూళ్ళూ కోకొల్లలు.

అబ్బాయో అమ్మాయో పదో తరగతిలోకి రాక ముందే ఇంటర్ ఏ కాలేజిలో చేర్పించాలని చర్చలు, ఫీజుల వివరాల సేకరణ తల్లిదండ్రుల వంతు. స్నేహితులతో మాట్లాడడం తో సహా ప్రతి చిన్న సంతోషాన్నీ త్యాగం చేసి పరీక్షకి సిద్ధం కావడం పిల్లల బాధ్యత. అవును మరి..ఎంసెట్ పరీక్షలో ఒక్క మార్కు కూడా జాతకాలు మార్చేస్తుంది..భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఇంత గొప్ప పరీక్ష కోసం ఆ మాత్రం సిద్ధం కాకపోతే ఎలా?

రెండేళ్ళ పాటు పిల్లలూ, వాళ్ళ తల్లిదండ్రులూ సర్వస్వం త్యాగం చేసి సిద్ధమయ్యే ఈ పరీక్ష ఎలా జగురుతుంది? అచ్చు తప్పుల ప్రశ్న పత్రాలతో.. సిలబస్ లో లేని, సుదీర్ఘమైన ప్రశ్నలతో. ఒకే ప్రశ్నకి రెండు మూడు సరైన సమాధానాలు చూపించి కన్ఫ్యూస్ చేసే ఆప్షన్స్ తో.. మూడు గంటల పరీక్ష కాలంలో మూడొంతుల సమయం ప్రశ్నలు చదువుకోడానికే సరిపోతే జవాబులు ఆలోచించేదేప్పుడు? టిక్కు పెట్టేదేప్పుడు?

ఈ సంవత్సరం పరీక్ష పూర్తయ్యాక ఘనత వహించిన ఎంసెట్ కన్వీనర్ గారు అధికారికంగా ధ్రువీకరించిన తప్పులు మూడు. జువాలజీ ప్రశ్న పత్రంలో ఒక ప్రశ్న ను తొలగించడంతో పాటు, మరో ప్రశ్నకి రెండు సమాధానాలు సరైనవని, కెమిస్ట్రీ లో ఒక ప్రశ్నకి రెండు సరైన సమాధానాలు ఉన్నాయని ప్రకటించారాయన. ఇక్కడితో ఆగితే బాగానే ఉండేది..కానీ అసలు కథ ఇక్కడే మొదలయ్యింది..

ఒకటి కాదు, రెండు కాదు..ప్రశ్న పత్రం లో మరో ఏడు తప్పులున్నాయన్నది సీనియర్ అధ్యాపకుల డిస్కవరీ. వీటిలో మూడు ప్రశ్నలు చాలా మంది విద్యార్ధులు 'టఫ్' గా ఉందని చెప్పిన కెమిస్ట్రీ విభాగం నుంచి కాగా, మిగిలిన నాలుగూ జువాలజీ విభాగం లో ఉన్నాయి. ఇలా ఎందుకు జరుగుతోందన్న ప్రశ్నకి వెంటనే వచ్చే సమాధానం "అధికారుల మధ్య కో-ఆర్డినేషన్ లేకపోవడం."

తెలుగు అకాడమి తయారు చేసే పాఠ్య పుస్తకాల నుంచి ఎంసెట్ లో ప్రశ్నలు అడుగుతారు. అసలు ఈ పుస్తకాలే తప్పుల కుప్పలు. ప్రశ్నలని ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పాఠాల నుంచి అడుగుతారు. ఒకే ప్రశ్నకి రెండు సంవత్సరాల పాఠ్య పుస్తకాల లోనూ పరస్పర విరుద్ధమైన సమాధానాలు ఉండడం ఈ పుస్తకాల గొప్పదనం. ఈ అకాడెమీ ని సంస్కరించే ఓపిక, తీరిక ఏలిన వారికి లేవు.

ప్రశ్నలు తయారు చేసేది, వాటిని ఫిల్టరు చేసేది, తుది ప్రశ్న పత్రం రూపొందించేది సబ్జక్ట్ ఎక్స్పర్టులే..కాని ఏ ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం ఉండదు. కేవలం ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన విద్యార్ధిని పరీక్ష హాల్లోకి రానివ్వనంత స్ట్రిక్ట్ గా నిబంధనలు అమలు పరిచే అధికారులు, తమ బాధ్యల నిర్వహణ లో జరుగుతున్నా 'పొరపాట్ల' గురించి సరైన సమాధానాలు ఇవ్వరు. హైకోర్టు సైతం ఎంసెట్ విషయం లో కన్వీనరు గారిదే తుది నిర్ణయం అని చెప్పడం ఇక్కడ కొసమెరుపు.

6 వ్యాఖ్యలు:

 1. చాల బాగా చెప్పారు అంత స్ట్రిక్ట్ గా వ్యవహరించేప్పుడు అంతే నిభద్దతతో మిగిలినవి కూడా చూడాలి ,రేపు జరగబోయే టీచర్స్ ఎక్షమ్ లో ఇలానే చెబుతున్నారు సమయ పాలన గురించి ,,కచ్చితంగా పాటించాలిసిందే కాని కొన్ని అనుకోని సందర్భాల్లో ఎంత ముందు బయలుదేరిన ఒక నిమిషం అటుఇటు కావొచ్చు ,,మానవత్వం చూపాలి

  ప్రత్యుత్తరంతొలగించు
 2. you made some points about time...
  "మూడు గంటల పరీక్ష కాలంలో మూడొంతుల సమయం ప్రశ్నలు చదువుకోడానికే సరిపోతే జవాబులు ఆలోచించేదేప్పుడు? టిక్కు పెట్టేదేప్పుడు?"
  this is relative exam...meeku time saripovatledante..andariki saripodhuu...nuvvu 10 bits correct chesi first rank techukoo...nenu 9 chesi second rank techukuntaa..

  one minute rule is only outcome of sadistic incharges of respective exam centres...this should be condemned.

  ఈ అకాడెమీ ని సంస్కరించే ఓపిక, తీరిక ఏలిన వారికి లేవు.--TRUE

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఏది ఏమైనా బలి అవుతున్నది మాత్రం విధ్యార్థులే కదండీ!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. Hmm .. I didn't know about such situation. I came to know that both IIT-JEE and EAMCET question papers go through several rounds of filtering before the final version is made. Perhaps they loosened that process some .. anyway, this is playing with students' future and highly irresponsible.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. @చిన్ని: ఈ ఒక్క నిమిషం రూల్ ఏమిటో మరీ విచిత్రం గా ఉండండి.. మన రోడ్లు, ట్రాఫిక్ ఇవేవీ ఆర్గనైజుడ్ గా ఉండవు. మిగిలిన రూల్స్ ఏవీ వంద శాతం ఫాలో అవ్వరు.. కోర్టు ఏమంటుందో చూడాలి.. ధన్యవాదాలు.
  @హరీష్: with regard to time, you are right. కానీ ఆబ్జెక్టివ్ టైపు పేపర్లో సుదీర్ఘ ప్రశ్నలు ఇవ్వడం ఓవరాల్ గా స్టూడెంట్స్ అందరికి అన్యాయం చేయడమేమో అనిపిస్తోంది. ధన్యవాదాలు.
  @పద్మార్పిత, కొత్తపాళీ, మేధ: ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు