మంగళవారం, మే 12, 2009

అభిప్రాయం

"ఒపీనియన్స్ చేంజ్ చేసుకోనివాడు పొలిటిషియన్ కానేరడు," అని చెప్పిన 'కన్యాశుల్కం' గిరీశాన్ని మొదట తలచుకోవాలి. కేవలం పొలిటీషియన్సే కాదు, మానవ మాత్రులంతా ఎప్పుడో అప్పుడప్పుడు కొన్ని అభిప్రాయాలను మార్చుకోక తప్పదు. కొన్ని సార్లు ఇది ప్రయత్న పూర్వకంగా జరిగితే, చాలాసార్లు మనకి తెలియకుండానే జరిగి పోతుంది. అంటే కాలం తెచ్చే మార్పన్న మాట. 'ఎలాంటివాళ్ళనైనా కాలం మారుస్తుంది' అంటారు ఇందుకేనేమో.

"అసలు అబ్బిప్రాయం అంటే ఏమిటి? మనకి అది ఉంటే మంచిదా? లేక పోతే మంచిదా?" ఇది అలమండ వాస్తవ్యుడు రొంగలి అమ్మన్న కి వచ్చిన సందేహం. మచిలీపట్టణం గోపాత్రుడు లేవనెత్తిన 'భూమాత ఆకారం' సమస్య విషయంలో అలమండ మొత్తం రెండుగా చీలిపోయిన సందర్భంలో అబ్బిప్రాయాన్ని గురించి చాలానే ఆలోచించాడు అమ్మన్న. (కే.యెన్.వై. పతంజలి నవల 'గోపాత్రుడు' ) తెలివైన వాడు కనుక అబ్బిప్రాయం లాభదాయకంగా ఉండాలని గుర్తించాడు.

అసలు అభిప్రాయాలు ఎలా ఏర్పడతాయి? ఇది కొంచం కష్టమైన ప్రశ్న. మనం పుట్టినప్పటినుంచీ మన అభిప్రాయాలు వెలిబుచ్చుతూనే ఉంటాం కానీ, పెద్దవాళ్ళు తమకి తాముగా మనకి మన అభిప్రాయం వెలిబుచ్చే అవకాశం ఇచ్చేది మాత్రం అన్నప్రాశన చేసినప్పుడు. మన ఎదురుగా బోల్డన్ని వస్తువులు ఉంచి ఏదో ఒకటి ముట్టుకోమంటారు. పెన్నో, పుస్తకమో పట్టుకుంటే సంతోషిస్తారు. అదే ఏ చాకో పట్టుకుంటే ఉలిక్కిపడతారు.

ఇంట్లో అమ్మ చేసే వంటల మొదలు, బళ్ళో మాష్టార్లు పాఠం చెప్పే విధానం వరకూ ప్రతి విషయం వరకూ మనకి అభిప్రాయాలు ఉంటాయి. మన అభిప్రాయాలని ఉన్నదున్నట్టుగా పైకి వ్యక్తం చేయడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలను నెమ్మది నెమ్మదిగా గ్రహిస్తాం, కొన్ని అనుభవాల తర్వాత. అమ్మ వంటలో ఉప్పుకారాల గురించి నా అభిప్రాయాలను వ్యక్తం చేయకూడదని తెలుసుకోడానికి కొన్ని టెంకి జెల్లలూ, మాస్టారు పాఠం మధ్యలో ఉండగా సందేహాలు అడగకూడదని గ్రహించడానికి చిన్నపాటి శిక్షలనూ మూల్యంగా చెల్లించాను నేను.

వంటల గురించి చిన్నప్పుడే ఏర్పడి పోయిన అభిప్రాయాలను మార్చుకోక తప్పని సందర్భం ప్రతి మగాడికీ ఎదురవుతుంది. అది పెళ్లి. అతనికి వంకాయంటే చిరాకు. ఆవిడకి వంకాయ కూరుంటే ఇంకేమీ అక్కర్లేదు. ఫలితం..వాళ్ళింట్లో వారానికి మూడు రోజులు వంకాయ కూర. బజార్లో వేరే కూరల్లేవనో, ఇదైతే వండడం సులువనో సమాధానం రావడంతో పాటు 'సద్దుకుపోవాలనే' కొసరు వ్యాఖ్య కూడా తప్పదు. చిన్నప్పుడు అమ్మ నాతో తరచూ "అమ్మ దగ్గర సాగినట్టు ఆలి దగ్గర సాగదు" అంటూ ఉండేది.

ఒక్క భోజనమేనా? ఇంకా చాలా విషయాల్లో మగ వాళ్ళు అభిప్రాయాలు మార్చుకోవాలి. ఆఫ్కోర్స్, ఆడవాళ్లక్కూడా ఇది వర్తిస్తుంది, కొన్ని కొన్ని విషయాల్లో. అభిమాన హీరోలు, హీరోయిన్లు, ఆటగాళ్ళు, సినిమాలు, సంగీతం, రాజకీయ నాయకులు.. ఒకటేమిటి దాదాపు అన్ని విషయాల్లోనూ అభిప్రాయాలు మారిపోతూనే ఉంటాయి. అభిప్రాయాలు మార్చడంలో పిల్లల పాత్ర కూడా తక్కువేమీ కాదు. దీని గురించి ఓ ప్రత్యేక టపా అవసరం. ఆఫీసులో ఫలానా కొలీగు చాలా మంచివాడని మన అభిప్రాయం. అవసరానికి అప్పివ్వకపోతేనే, మనకి పని సాయం చేయకపోతేనో మనం అదే అభిప్రాయాన్ని కొనసాగించగలమా?

పుస్తకాల విషయంలోనూ ఓ కొత్త అనుభవం ఎదురవుతోంది నాకు. గతంలో నన్ను ఉర్రూతలూగించిన పుస్తకాలు ఇప్పుడు అంతగా పస లేనట్టుగా అనిపిస్తున్నాయి. వీటినేనా ఒకప్పుడు నేను నిద్రమానుకుని బెడ్ లైట్ వెలుగులో చదివింది అనిపిస్తోంది కొన్ని పుస్తకాలు ఇప్పుడు తిరగేస్తుంటే. కొన్నాళ్ల క్రితం చదివి 'పర్లేదు' అని పక్కన పెట్టిన పుస్తకాలు ఇప్పుడు మళ్ళీ చదువుతుంటే అద్భుతంగా అనిపిస్తున్నాయి. మరి ఇది అభిప్రాయం మారడమే కదా? చూడాలి, భవిష్యత్తులో ఇంకెన్ని అభిప్రాయాలు మారతాయో..

9 వ్యాఖ్యలు:

 1. వంటలు, పుస్తకాలు, ఆటగాళ్ళు ఇలాంటివాటిమీద అభిప్రాయాలు మారుతూ ఉన్నా పర్వాలేదుగానీ సన్నిహితులైన (అనుకున్న) వాళ్ళ పై అభిప్రాయాలు మార్చుకోవాల్సిన తరుణం వస్తే మాత్రం అది దురదృష్టకరం...

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నిజం మురళి గారు. అభిప్రాయాలు అనుభవాలతో కొన్ని, ఆలొచనలతో కొన్ని మారతాయి తప్పకుండా.. మారక పోతే మనిషే కాదేమో...నాకు ఎప్పుడు ఒక టపా రాయాలని వుంటుంది నిజం అబద్దం, మంచి చెడు వీటికి ఎవరైనా ఖచ్చితమైన నిర్వచనం చెప్పగలరా అని? అది కూడా అభిప్రాయం లానేనా!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. కాలంతో పాటు కొన్నీ, జీవితంతో పాటు కొన్నీ, జీవితభాగస్వామితో కొన్నీ అభిప్రాయాలు మారతాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఆడవాళ్ళు మగోళ్ళు సమానంగా మార్చుకుంటారు, ఐతే, మగోడు పెళ్ళైయ్యాక పెళ్ళానికనుగుణంగా మార్చుకుంటాడు. అంతే తేడా!!

  :):)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మంచి విషయం, దాంటోనూ అనేక విషయాల్ని చక్కగా స్పృశించారు. పుస్తకాలు, సినిమాలు విషయంలో ఈ అభిప్రాయాల మార్పు నాకు బాగా అనుభవమే. మా ఉత్తమార్ధానికి నాకూ రుచుల విషయంలో భేదం లేకుండా పోబట్టి ఆమట్టుకి అదృష్టవంతుణ్ణే అనుకోవాలి. మనలో మాట మీకు వంకాయ పడదా? ఐతే మీతో వేగడం కష్టమే (pun intended)!
  అదలా ఉండగా .. నిషిగంధ గారు ప్రస్తావించిన మనుషుల్ని గురించి అభిప్రాయాలు మార్చుకోవలసి రావడం .. హమ్మ్ .. దాన్నే అనుభవం అంటారు! :)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. @నిషిగంధ: అదృష్టవశాతూ ఇప్పటివరకు అలాంటి పరిస్థితి రాలేదండి.. ధన్యవాదాలు.
  @భావన: మీ టపా కోసం ఎదురు చూస్తున్నాం.. త్వరగా రాయండి. ధన్యవాదాలు.
  @సునీత (నాబ్లాగు): తప్పదు కదండీ.. ధన్యవాదాలు.
  @భాస్కర్ రామరాజు: మీ శైలిలో చెప్పారు :) ధన్యవాదాలు.
  @కొత్తపాళీ: మీరు నన్ను అపార్ధం చేసుకున్నారు.. నాకు వంకాయ చాలా ఇష్టం. 'వంకాయ వంటి కూరయు' పద్యం కూడా.. కాబట్టి నాతో వేగడం సులువే :) మనుషుల గురించి అభిప్రాయాలు మారడం సహజమేనండి.. కావల్సినవాళ్ళు (నిషిగంధ గారు చెప్పినట్టు కనీసం మనం అలా అనుకున్న వాళ్ళు) గురించి మార్చుకోవాల్సి రావడం మాత్రం బాధాకరమే..

  ప్రత్యుత్తరంతొలగించు
 7. అభిప్రాయం మారడం అనేది అనుభవ రీత్యా జరుగుతుందండి ....ఒక్క వయస్సులో అపురూపంగా ఫీల్ అయ్యింది తరువాతి హాస్యాస్పదంగా తోచవచ్చు .....ఇలా అయ్యుండొచ్చు అనే ఊహ వేరు అనుభవం వేరుకదా ...ముఖ్యంగా స్నేహితులు ,ప్రేమికులు ..బార్య-భర్తల్లో ఎదురవ్వొచ్చు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. లేటుగా వచ్చినట్టున్నాను ....నిషిగంధ గారు, చిన్ని గారు చెప్పిన వాటితో నేనూ ఏకీభవిస్తాను . మంచి టపా రాశారు ..మమ్మల్ని మేం తరచి చూసుకునేలా ..

  ప్రత్యుత్తరంతొలగించు
 9. @చిన్ని, పరిమళం: ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు