మంగళవారం, మే 26, 2009

అధ్యక్షా...

చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త ప్రభుత్వంలో శాసన సభ కి స్పీకర్ కాబోతున్నారు. గత సభ తో పోలిస్తే ప్రతిపక్ష బలం బాగా పెరిగిన ప్రస్తుత శాసన సభ లో స్పీకర్ బాధ్యత నెరవేర్చడం కత్తి మీద సాము. 'నొప్పించక తానొవ్వక' విధి నిర్వహణ చేయాలి.. అదే సమయంలో 'తప్పించుకు తిరగ'రాదు కూడా.

మన శాసన సభలో తరచూ వినిపించే మాట సభా మర్యాద. సభ నడిచే తీరుని గమనించినప్పుడు ప్రతి సభ్యుడూ తాను తప్ప మిగిలిన సభ్యులంతా 'సభా మర్యాద' పాటించాలని ఆశిస్తారనిపిస్తుంది. వ్యక్తిగత దూషణలు, నిందారోపణలకి లోటు లేదు. స్వయానా ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు గత సభలో ఈ తరహా దూషణలకి దిగడాన్ని జనులంతా టీవీ చానళ్ళ సాక్షిగా వీక్షించారు.

ఇలాంటి సందర్భాలలో స్పీకర్ విధులు వీధి బడిలో మాష్టార్ల విధులని మరపిస్తాయి. పాఠం వినకుండా అల్లరి చేసే పిల్లల్ని మాష్టారు బెత్తం తో అదిలించి, అవసరమైతే ఒకరిద్దరిని దండించి క్లాసు కొనసాగించినట్టు, స్పీకర్ కూడా అప్పుడప్పుడు సభని 'అదుపులో' పెడుతూ ఉండాలి. ఓర్పుగా, నేర్పుగా వ్యవహరించాలి. తక్షణ నిర్ణయాలు తీసుకోవాలి..ఆ నిర్ణయాలు నిష్పాక్షికంగా ఉండాలి.

సమస్య అంతా ఈ 'నిష్పాక్షికం' అన్న దగ్గరే వస్తుంది. స్పీకర్ పదవి చేపట్టిన వ్యక్తికి పార్టీల విషయంలో తరతమ బేధం ఉండకూడదు. పార్టీలకి అతీతంగా పనిచేయాలి. ఆచరణలో ఇది వంద శాతం సాధ్యం కాదని గతంలో ఎన్నో సార్లు రుజువైంది. స్పీకర్ తన సొంత పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన ప్రతిసారీ ఆ పదవి వివాదాస్పదమైంది. ముఖ్యమంత్రి మార్పు మొదలు, ప్రతిపక్షాలకి సమయం కేటాయించడం వరకు ఎన్నో సందర్భాలలో స్పీకర్ 'నిష్పాక్షికత' ప్రశ్నార్ధకమైంది.

రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి కి ముఖ్యమంత్రి సన్నిహితుడని పేరు. తెలుగు దేశం పార్టీ మీద, ఆ పార్టీ అధ్యక్షుడి మీదా ఘాటు విమర్శలు చేయడానికి వచ్చిన ఏ అవకాశాన్నీ ఆయన ఇంతవరకు వదులుకోలేదు. క్రికెట్ నుంచి రాజకీయాలలోకి వచ్చిన ఈ నేత చీఫ్ విప్ హోదాలో కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద ప్రతిపక్షాల దాడులని సమర్ధంగా తిప్పి కొట్టారు. ఇక ముఖ్యమంత్రి కుమారుడి గురించి ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పుడు తాను 'చంద్రబాబు తనయుడి గురించి మాట్లాడాల్సి వస్తుందని' ఇంచుమించుగా బెదిరించారు.

ప్రతిపక్షం బలంగా ఉన్న సభలో పార్టీకి విధేయుడిగాను, తనకి అత్యంత అనుకూలుడిగాను పేరుపొందిన వ్యక్తిని స్పీకర్ స్థానానికి ఎంపిక చేయడం ముఖ్యమంత్రి వేసిన రాజకీయ ఎత్తుగడ కావొచ్చు. సభలో ప్రతిపక్షాలను కొంతమేరకు నిలువరించే ప్రయత్నంలో ఇది భాగం అయి ఉండొచ్చు. స్పీకర్ పదవి చేపట్టే వ్యక్తి కి ఉండవలసిన విషయ పరిజ్ఞానం, చట్టాల పై అవగాహన అలాగే వాటిల్లో ఉన్న లొసుగులు కిరణ్ కుమార్ రెడ్డికి బాగానే తెలుసనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.

అయితే ఈ పరిజ్ఞానాన్ని ఆయన స్పీకర్ గా తన బాధ్యతలని సమర్ధంగా నిర్వహించడానికి ఉపయోగిస్తారా? లేక సభలో ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీని రక్షించడానికి ప్రాముఖ్యత ఇస్తారా? అన్నది వేచి చూడాల్సిన అంశం. 'టెక్నో సావీ' గా పేరొందిన నాదెండ్ల మనోహర్ కి డిప్యుటీ స్పీకర్ పదవి లభించింది. ఇప్పటికే శాసన సభ రికార్డుల కంప్యూటరీకరణ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించడంలో కీలక పాత్ర పోషించిన మనోహర్, కొత్త హోదాలో అసెంబ్లీ ని మరెంత hi-fi గా మారుస్తారో చూడాలి.

6 వ్యాఖ్యలు:

 1. గత ప్రభుత్వం లో స్పీకర్ సురేష్ రెడ్డి నడిపిన విధానం ఆయన ఫైల్యూర్ ఏదైనా వుంటే ఇక్కడ మీరు ప్రస్తావిస్తే చాల బాగుండేది ..మంచి టపా..

  ప్రత్యుత్తరంతొలగించు
 2. >>అయితే ఈ పరిజ్ఞానాన్ని ఆయన స్పీకర్ గా తన బాధ్యతలని సమర్ధంగా నిర్వహించడానికి ఉపయోగిస్తారా? లేక సభలో ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీని రక్షించడానికి ప్రాముఖ్యత ఇస్తారా?
  ఇలాంటి పెద్ద పెద్ద ప్రశ్నలకి సమాధానం సెప్పటం వీజీకాదు అద్దెచ్చా!!
  ఎండి తెరపై (బుల్లి తెరపై) సూడాల్సిందే ఏటౌద్దో!!!

  టపాలు-వ్యాఖ్యలు

  * Total Posts: 84
  * Total Comments: 673
  ఇదెలా? దీనికేమైనా టెంప్లెట్ లేక స్క్రిప్ట్ ఉందా? ఉంటే ఇవ్వండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. @చిన్ని: కేవలం సురేష్ రెడ్డి మాత్రమే కాదండి, అంతకు ముందు ఆ పదవిలో ఉన్నవారు కూడా ఏదో రకంగా వివాదాస్పదం అయిన వాళ్ళే.. అధికార పక్షానికి మద్దతిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళే.. ధన్యవాదాలు.
  @పరిమళం: ధన్యవాదాలు.
  @భాస్కర్ రామరాజు: అవునవును..సూడాల్సిందే... ధన్యవాదాలు. మీరడిగిన సమాచారం కోసం ఈ లింక్ ఓసారి చూడండి అధ్యక్షా.. http://superblogtutorials.blogspot.com/2009/04/blog-post.html

  ప్రత్యుత్తరంతొలగించు
 4. @చిన్ని: ప్రతిపక్షం వాళ్లకి తగినంత సమయం ఇవ్వలేదనీ, మాట్లాడనివ్వ లేదనీ, అధికార పక్షాన్ని రక్షించడానికి ప్రతిపక్ష సభ్యులని పెద్ద యెత్తున సస్పెండ్ చేశారనీ ఆరోపణలు ఉన్నాయి కదండీ..

  ప్రత్యుత్తరంతొలగించు