బుధవారం, మే 13, 2009

ఫోను కష్టాలు

ఇది అష్టకష్టాల జాబితాలో లేని కష్టం. అష్టకష్టాల లెక్క రాసిన రోజుల్లో లేని కష్టం. 'కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ' అన్న చలం వాఖ్యని గుర్తు చేసుకోనవసరం లేదు. ఎందుకంటే ఫోనున్న ప్రతి ఒక్కరికీ ఏదో సమయంలో ఎదురయ్యే సమస్యే ఇది. రెండు వారాల క్రితం నా సెల్ ఫోన్ పాడయింది. నిజానికి ఇది చాలా ఆనందంగా ప్రకటించాల్సిన విషయం. కాని ఇక్కడ రెండు సమస్యలు. ఆ ఫోన్ వయసు కేవలం ఆరు నెలలు. రెండో సమస్య ఏమిటంటే ఇరవై నాలుగంటల్లో ఫోన్ లేకుండా ఒక్క గంట కూడా గడవని పరిస్థితి.

సెల్ ఫోన్ నిత్యావసర వస్తువుగా మారిన నాటినుంచీ నేను ఎంచుకున్తున్నది బేసిక్ మోడల్ హ్యాండ్ సెట్ నే. స్నేహితులంతా రకరకాల ఫీచర్లున్న ఫోన్లు వాడుతుంటే "కుక్క పని కుక్క, గాడిద పని గాడిద, ఫోన్ పని ఫోన్ చేయాలి" అని వాదించిన రోజులున్నాయి. ఐతే ఎప్పుడూ ఒకేలా గడిస్తే కాలం గొప్పదనం ఏముంది? ఓ బలహీన క్షణంలో ఫోన్ గురించి నా అభిప్రాయం మార్చుకున్నాను. ఇంకొకర్ని ఇబ్బంది పెట్టకుండా నచ్చిన పాటలు ఇయర్ ఫోన్స్ తో వినొచ్చు, ఎఫ్ఫెం రేడియో వింటూ ఇప్పటి కుర్రకారు ఆలోచనలు పట్టుకోవచ్చు, ఫోటోగ్రఫీ లో మన టాలెంట్ 'భంగిమా' అయినా ఫోనులో కెమెరా ఉంటె ఎప్పుడైనా ఫోటోలు తీయొచ్చు... ఇలా ఓ లిస్టు వేశాను.

వాడుతున్న ఫోన్ పనిచేయకపోవడం తో కొత్త ఫోన్ కొనాల్సిన సందర్భం రానే వచ్చింది. అప్పటికే ఓ నిర్ణయం తీసేసుకోవడంతో ఓ 'పెద్ద' పేరున్న షాపుకెళ్ళి కాసేపు రకరకాల సెట్లు చూసి ఒకటి ఎంపిక చేసేసుకున్నా.. ఫీచర్ల గురించి సేల్స్ వాళ్ళని కాసేపు విసిగించి బిల్లు కట్టేశాను. ఇదంతా ఆర్నెల్ల క్రితం సంగతి. ఫోన్ కొన్న నాలుగో రోజునో, ఐదో రోజునో ఓ సందేహం వచ్చింది. మాన్యువల్ ఆమూలాగ్రం చదివినా సమాధానం దొరకలేదు. ఇలా లాభం లేదని బిల్లుతో సహా షాప్కెళ్లా.. అక్కడ వాళ్ళు నన్ను ట్రీట్ చేసిన విధానం చూసి ఇంకా జీవితంలో ఈ షాపుకి రాకూడదని నిర్ణయించుకున్నాను.

ఫోన్ గురించి అడిగిన వాళ్ళందరికీ, ఫలానా 'పెద్ద' షాపుకి మాత్రం వెళ్ళ వద్దని చెప్పాను కొన్నాళ్ళు. సరే.. కొన్నాళ్ళు బాగానే గడిచింది. నెమ్మదిగా ఫోన్ మెమరీ లో డాటా పెరుగుతోంది. మెమరీ పుణ్యమా అని ఓ పుస్తకంలో ఫోన్ నంబర్లు రాసుకునే అలవాటు కూడా మానేశా. డాటాని బ్యాకప్ తీసుకునే పనిని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చాను. ఎప్పుడో కొంప మునుగుతుందని నా సిక్స్త్ సెన్స్ పాపం అప్పుడప్పుడూ హెచ్చరిస్తూనే ఉంది. 'ఇదెంత..పది నిమిషాల పని..' అని ఎప్పటికప్పుడు దాని నోరు నొక్కేశాను.

ఆవేల్టి శుభ తిధి, నక్షత్రం గుర్తు లేవు కానీ రెండు వారాల క్రితం ఓ ఉదయం నా ఫోన్ నోరు పడి పోయింది. బిల్లులో అడ్రస్ చూసుకుని రిపేరు షాప్ కెళ్లా. వాళ్ళు పదిహేను రోజుల తర్వాత రమ్మన్నారు. ఓ ఐదారు గంటలు ఫోన్ పనిచేయక పోయేసరికి మనుషులు నన్ను వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి వచ్చింది. (నేనెవరికీ బాకీలు లేనని మనవి చేసుకుంటున్నాను) అన్నాళ్ళ ఫోన్ వియోగం కుదరని పని అని అర్ధమై ఓ ఫ్రెండు దగ్గర స్పేర్ లో ఉన్న ఫోన్ తాత్కాలికంగా తీసుకున్నాను. అది మొదలు 'ఈ ఫోన్ కి ఏమైనా ఐతే..' అన్న భయమే.

నంబర్లన్నీ పోవడం మరో సమస్య. ఇదివరకేవరైనా 'మీ నెంబర్ మిస్ ఐంది.. ఫోన్ మార్చాను..' అంటే అప నమ్మకంగా చూసేవాడిని. నిజంగా మీకు ఆసక్తి ఉంటే అలా పోగొట్టుకుంటారా? అన్నట్టు. ఇప్పుడు అదే వివరణ నేను ఇవ్వాల్సి రావడం, అందరూ నా గురించి అలాగే అనుకుంటున్నారేమో అని సదేహం. ఇదో రకం కష్టం. ఇలా కథ సాగుతుండగా ఇవాల్టి ఉదయం ఫోన్ రిపేరు షాపు వాళ్ళు సంక్షిప్త సందేశం పంపారు. రిపేర్ పూర్తయ్యింది, వచ్చి ఫోన్ తీసుకెళ్ళమని. ఫోన్ తీసుకోగానే చేసిన మొదటి పని. ఫ్రెండు ఫోన్ తిరిగి అప్పచెప్పడం. ఫోన్ భద్రంగా ఇచ్చేస్తున్నానన్న ఆనందంలో పువ్వుల్లో పెట్టి ఇవ్వడం మర్చిపోయాను.

ఫోన్ మెమరీ లో ఒక్క నంబరూ, ఒక్క మెసేజీ లేక పోయినా నా ఫోను నాకు వచ్చేసిందన్న సంతోషం మిగిలింది. ఐతే అది ఎంతో సేపు నిలవలేదు. ఓ గంటైనా గడవక ముందే మళ్ళీ 'మూగనోము' పట్టింది నా ఫోన్. చలో రిపేర్ షాపు. 'ఫిఫ్టీన్ డేస్ సర్' స్టైలుగా చెప్పింది కౌంటర్ అమ్మాయి. 'విధి చేయు వింతలన్నీ..' పాట గుర్తొచ్చింది. ఇంక చేసేదేముంది.. ఓ బేసిక్ మోడల్ ఫోన్ కొనుక్కున్నా..

11 వ్యాఖ్యలు:

 1. అరె మురళి గారికి ఎన్ని ఫొను కష్టాలు (సినిమ కష్టాలు లా అన్నమాట) వచ్చాయి. నాకు ఈ పాట గుర్తు వచ్చింది మీ ఫొను కష్టాలు చదివితే. "ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు... విధి విధానమును తప్పించుటకు ఎవరు సాహసించెదరు ఊఊ .. అక్కడక్కడ గుర్రపు డెక్కల శబ్ధం నోటి తో చింపు చికుం సంగీతం వేసుకోండి ఏం... )

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మురళి గారూ ! మీలాగే నేనూ వాదించి చివరికో బలహీన క్షణంలో ...మావారు గిఫ్ట్ గా తీసుకోమంటే మీ ఫోను లక్షణాలన్నీ ఉన్న ఓ ఫోన్ కొన్నా ! నా అదృష్టం ఏమో గానీ పొరపాటుగా డాబా పైనుంచి పడి పార్టులన్నీ విడిపోయినా మళ్ళీ సెట్ చేయగానే భలే పనిచేస్తోంది . నమ్మశక్యంగా లేకపోయినా నిజం . డాటాని బ్యాకప్ చేసే విషయం నేనూ వాయిదా వేస్తూ వస్తున్నా ! మీ టపా చూశాక వెంటనే చేయాలని నిర్ణయించుకున్నా ...ఏ నిముషానికి ఏమి జరుగునో ....ఇలా మీ టపా ద్వారా మంచి హెచ్చరికలు తెలియచేసినందుకు థాంక్సండీ !

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఔను..ఫోను మూగపోతే చాలా కష్టం.
  ఐతే, ఒక ముఖ్య విషయం చెప్దాం అనుకుంటున్నా.
  ఈ మధ్య వచ్చే ఫోన్లు పాలీఫోనిక్ మరియూ ఎక్కువ మెమొరి, కలర్ డిస్ప్లే, ఒక చిన్న ఓయస్ లతో ఉన్నాయ్.
  వీటిల్లో కొన్ని విండోస్ సి.ఇ వి కొన్ని.
  కొన్ని సింబీన్ ఓయస్ తో వస్తాయ్.
  ఐ.ఫోన్ ఐ.ఫోన్ ఓయస్ తో వస్తుంది.
  (ఈ మధ్య, గూగుల్ ఓపెన్ సోర్స్ మొబైల్ ఓయస్ ని రిలీజు చేసాడు)
  ఐతే విండోస్ సి.ఈ తో కొన్ని సమస్యలు ఉన్నాయ్ అని విన్నా.
  రెండు, సాంసంగ్, ఎల్.జి లాంటి వాటిల్లో ఓయస్ కొంత స్లోగా ఉండటాన్ని గమనించా.
  వీటన్నిటితో పోలిస్తే -
  బెస్ట్ -
  ౧. ఐ.ఫోన్ (ఐ.ఫోన్ ఓయస్)
  ౨. నోకియా (నోకియా ఓయస్ నేదాంతో వస్తుంది. కొత్తగా కొన్ని సిరీస్ లు సింబియన్ తో వస్తున్నాయ్).
  ఫోన్ తీస్కునే ముంది చూడాల్సినవి -
  సర్వీస్ ఎగ్రిమెంట్.
  ఫోన్ నాణ్యత.
  ఫోన్ ఓయస్ యొక్క పనితనం.

  ఒక సారి హ్యాండ్ హెల్డ్ డివైస్ కి సమస్య వస్తే ఇక ఏదోకటి వస్తూనే ఉంటుంది అని చాలా మంది చెప్తుంటారు..అది నిజం అయిఉండవచ్చుకూడా. కారణం, సర్వీస్ చేసేప్పుడు సాఫ్ట్వేర్ లోపమైతే ఓయస్ రిలోడ్ చెయ్యటం లెక గెలకటం, అలాకాక హార్డ్వేర్ సమస్య అయితే డివైస్ మొత్తం తీసి పోయిన కాంపోనెంట్ వెయ్యాలి కాబట్టి కొన్నికొన్ని సార్లు ఒకటి సరిచెయ్యబొయ్యి ఇంకోదాన్ని గెలకే ఆస్కారం ఉంది.

  నా ఉద్దేశం, మీరు ఐ-ఫోన్ లాగించేయండి ఈసారికి.
  ఇంకొన్ని రోజులు ఆగితే ఐ.ఫోన్ ఉప్డేటెడ్ మోడల్ రాబోతోంది. దానికి టెండర్ పెట్టండి..

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నిజమే మీరు కన్స్యూమర్ గా గొడవ పెట్టలండి ..మరీ అంత నిర్లక్ష్యమా (మీక్కాదు).....మీకు కుదరకపోతే చెప్పండి దెబ్బలాటకి మనోళ్ళని పంపిద్దాం :) జాజిపూలతో మీ ఫ్రెండ్ ఫోన్ ఇవ్వాల్సిందేమో ....:)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. అందుకే స్టాండ్ బై ఫోన్ ఒకటి పెట్టుకుంటే పోలా..హహహహహ...(మనది కాకపోతే తాటిపట్టుకి ఎదురుడేకమన్నాడని కదా సామెత)..

  ప్రత్యుత్తరంతొలగించు
 6. బావున్నాయి మీ ఫోను కష్టాలు. ఇండియాలో ఉన్నప్పుడు నేను కూడా ఫోన్ బాగా వాడేదాన్ని.
  ప్రస్తుతానికి మాత్రం వారానికి ఒకటో రెండో కాల్స్ మాట్లాడుతున్నా అంతే.
  ఇలా అలవాటయ్యాక ఎక్కువసేపు ఫోనులో మాట్లాడాలంటే విసుగనిపిస్తుంది :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఈ బాధలన్నీ పడి ఫోను వాడటం మానేసి ఇప్పుడే కాస్త ప్రశాంతంగా ఉన్నానండీ. మా వారూ, పిల్లలూ విసుక్కుంటూనే ఉంటారు నీకు ఫోను వేస్ట్ అని అస్సలు కారీ చెయ్యను. అర్జెంట్ ఐతే తప్ప.పనికి వెళ్ళేటప్పుడు అలా కుదరదనుకోండి?

  ప్రత్యుత్తరంతొలగించు
 8. @భావన: అలాగేనండి :) ..ధన్యవాదాలు..
  @awareness of Indians: తదుపరి కర్తవ్యం అదేనండి.. ధన్యవాదాలు.
  @పరిమళం: నిజంగా ఇది మిరకిల్ అండి.. ఎక్కడో అదృష్టవంతులకి తప్ప ఇలా జరగదు.. ఆలస్యం చేయకండి.. ధన్యవాదాలు.
  @భాస్కర్ రామరాజు: చాలా ఉపయోగకరమైన సమాచారం అండి.. ఎవరికి టెండర్ పెట్టమంటారు? :) ధన్యవాదాలు.
  @చిన్ని: గొడవ పెట్టక తప్పేలా లేదండి.. జాజిపూలలో పెట్టి ఇద్దామంటే ఇంకా సీజన్ మొదలు కాలేదు.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. @మేధ: ధన్యవాదాలు.
  @శ్రీనివాస్ పప్పు: ఇప్పుడు కొన్నది స్టాండ్ బై ఫోనేనండి.. తప్పదు కదా... ధన్యవాదాలు.
  @మధురవాణి: నేను ఫోన్ వాడకం తగ్గిద్దామన్నా కుదరడం లేదు. సగటున రోజూ ఓ గంట మాట్లాడుతున్నా.. కొంచం ఆ తగ్గించే ఉపాయం ఏమిటో చెప్పి పుణ్యం కట్టుకోండి.. ధన్యవాదాలు.
  @సునీత (నాబ్లాగు): నాకింకా అంత అదృష్టం కలగలేదండి.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు