బుధవారం, మే 06, 2009

అద్దింటి కతలు

ఉద్యోగం అని ఊళ్ళు పట్టుకుని తిరిగే వాళ్లకి అన్ని చోట్లా సొంత ఇల్లు ఉండడం సాధ్యపడదు కదా.. కాబట్టి అద్దె ఇల్లు తప్పదు. అసలు సొంతిల్లు అనే భావన కోసం (ఎలాగూ ఎక్కువరోజులు ఉండలేం కదా) బోల్డంత డబ్బు ఖర్చు పెట్టడం వృధా అని 'డెడ్ ఇన్వెస్ట్మెంట్ ' అనీ చాలా రోజులు వాదించాను.

'అబ్బో అక్కడికేదో ఇన్వెస్ట్మెంట్లు మురిగిపోతున్నట్టు డెడ్ ఇన్వెస్ట్మెంట్ గురించి కబుర్లు..' అన్న వ్యాఖ్యల పుణ్యమా అని నా అభిప్రాయాలు నాలోనే దాచుకోవడం మొదలుపెట్టాను. సంచార జీవితంలో ఎలాగూ కేరాఫ్ అడ్రస్ అద్దిల్లే కాబట్టి 'అద్దిల్లే సౌఖ్యం' అనుకోవడమూ మొదలు పెట్టాను.

"అసలు సొంత ఇల్లు ఉన్నవాళ్ళు ఒక చోట ఉండాలి కానీ, మనకా అవసరం ఏముంది.. ఇల్లు నచ్చినన్నాళ్ళు ఉంటాం. నచ్చకపోతే మరో ఇల్లు వెతుక్కుంటాం" అని ఇల్లేరమ్మ చెప్పిన మాటలు నాకు ఎంత ఊరటనిచ్చాయో చెప్పలేను. వెతికేటప్పుడు విసుగొస్తుంది కానీ, ఇల్లు దొరికేకా వెతుకులాటని తల్చుకోడం భలే ముచ్చటగా ఉంటుంది.

ఎన్ని టూలెట్ బోర్డులు? ఎంతమంది ఓనర్లు? ఎన్ని రకాల కండిషన్లు? ఒకటా రెండా తల్చుకున్న కొద్దీ గుర్తొస్తూ ఉంటాయి. ఓ పట్టణం లో అద్దింటి వేట మొదలుపెట్టాను. వెతగ్గా, వెతగ్గా ఓ ఇల్లు పర్వాలే దనిపించింది. ఓనరు పెట్టిన ప్రాధమిక పరీక్ష గట్టెక్కేశాం. ఆ ఇల్లు చూపించినతను ఓనరుకి దగ్గర బంధువు అవడంతో పని కొంచం సులువైంది. రెండు మూడు రోజుల్లో వాళ్ళు రిపేర్లు చేయించడానికి, మర్నాడు అడ్వాన్సు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది.

ఇల్లు దొరికేసిందన్న ఆనందంతో చక్కగా నిద్రపోయి, మర్నాడు ఉదయం బుద్ధిగా తల దువ్వుకుని అడ్వాన్స్ పట్టుకెళ్ళా. అడ్వాన్స్ ఇవ్వబోతుండగా కాబోయే ఓనరుగారికి అప్పటికే అయిపోయిన భార్య (అంటే కాబోయే భార్య కాదన్న మాట) నుంచి 'మీరెవరు?' అని ప్రశ్న. అది విననట్టుగా నటించి "ఇల్లు చాలా నీట్ గా ఉంచుతాం. పెద్దగా బంధువులు ఎవరూ రారు. అద్దె కచ్చితంగా ఫస్టుకి ఇచ్చేస్తాం.." అని నా ధోరణి లో నేను చెప్పేస్తున్నా.. ఓనర్ ఎవరైనా కామన్ గా చెప్పాల్సిన మాటలివి.

ఆవిడ అదే ప్రశ్న మళ్ళీ సంధించి, నా సమాధానంతో సంతృప్తి చెందక "బాలా (వాళ్ళ బంధువు) తీసుకొస్తే మా వాళ్లనుకున్నా.. మీకివ్వడం కుదరదు" అని కరాఖండీగా చెప్పేశారు. సరే.. ఇంక చేసేదేముంది. మళ్ళీ తొలినుంచీ ప్రయత్నం మొదలు. సదరు బాలాని కొంచం కోప్పడ్డాను.. అతనేమో 'మీరు మేనేజ్ చేసేస్తారనుకున్నాను' అన్నాడు, తప్పంతా నాదే ఐనట్టు.

ఇంకో ఊళ్ళో మరో విచిత్రమైన కథ. ఓ ఇంటికి డైరెక్ట్ పవర్ సప్లై లేదు. నీళ్ళ సమస్య ఉంది. ఇంటికి వెంటిలేషన్ కూడా అంత బాగా లేదు. ఇంటాయన (ఓనరు) భగవద్గీత లో కృష్ణ పరమత్మలా అభయ హస్తం ఇచ్చేసి 'అన్నింటికీ నేనున్నా.. మీరు దిగిపొండి' అని బలవంతాలు. ఇల్లు చూపించడానికి ముందే ఆయన నా వివరాలు ఓ పుస్తకంలో రాసేసుకున్నారు. తర్వాత రెండు మూడు రోజులు ఫోన్లు చేసి మరీ చెప్పారు ఒప్పేసుకోమని. నేను ధైర్యం చేయలేదు కాని నా మిత్రుడు ఒకతను తెలియక ఒప్పుకుని తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాడు.

"మీకు ఏ పేపర్ వస్తుంది? ... మాకూ అదే వస్తుంది.. రేపటి నుంచి నేను మానిపించేస్తా.." అన్నారో ఓనరు, ఇంట్లోకి దిగగానే. ఆయన వీధిలో కాపు కాసి పేపర్ అందుకునే వారు. ఆయన ఆమూలాగ్రం చదివాకే పేపర్ నా దగ్గరికి వచ్చేది. ఉదయాన్నే పేపర్ మడత నేనే విప్పాలన్నది నాకున్న చిరు కోరికల్లో ఒకటి. ఆ ఇంట్లో ఉన్నంత కాలం ఆ కోరికను త్యాగం చేయాల్సొచ్చింది. ఒక్కరోజు కూడా మడత విప్పని పేపర్ తెరవ లేదు నేను. మిగిలిన ఏ విషయం లోనూ ఇబ్బంది లేక పోవడంతో నేనే సర్దుకుపోయాను.

"ఇల్లంతా బాగుంది. ఆ గదిలో మాత్రం వర్షం వచ్చినప్పుడు సీలింగ్ కొద్దిగా లీక్ అవుతుంది" అన్నారో ఓనరు, జానపద కథలో రహస్యం చెబుతున్నట్టు. ముచ్చటైన ఇండిపెండెంట్ ఇల్లు. ఇంటిముందు పూలతోట. మెయిన్ రోడ్డుకి మరీ దగ్గరా, మరీ దూరం కాని ప్రాంతం. అన్నిరకాలుగా నచ్చేసింది. ఈ ఆనందంలో "అతః కుంజరః" ని సరిగా వినకుండా దిగిపోయాం.

కొన్నాళ్ళు బాగానే గడిచాయి. ఓ శుభ ముహూర్తాన ఆకాశం ఉరిమింది. బెడ్రూం లో వర్షం కురిసింది. ఉన్నది బెడ్రూమ్లోనో, రోడ్డుమీదో అర్ధం కాలేదు. రాఘవేంద్రరావు లాంటి దర్శకుడికి పాట తీయడానికి ఓ మంచి కాన్సెప్ట్ అనిపించింది కానీ, అలాంటివి పైకి ప్రకటించే సందర్భం కాదు. సమస్య బెడ్రూం కి మాత్రమే పరిమితం కాలేదు. వంటింట్లో కూడా ఇంచుమించు అదే పరిస్థితి.

జీవితం లో మొట్టమొదటి సారిగా వర్షం ఆగిపోవాలని కోరుకున్నాను. కాలనీ వాళ్ళ చూపులకి అసలు అర్ధం అప్పుడు తెలిసింది. అప్పటివరకు చక్కటి ఇంట్లో ఉంటున్నందుకు జెలసీ అనుకున్నా.. చేసేదేం ఉంది.. మరో ఇల్లు వెతుక్కోడం తప్ప. అక్కడికీ ఇంటివాళ్ళకి బాగు చేయించే అవకాశం ఇచ్చినా, రిపేరు చేసేవాళ్ళు 'ఎంతోకొంత కురవక తప్పదు' అని చెప్పడం తో ఆశ వదిలేసుకోవాల్సి వచ్చింది.

అద్దె ఇళ్ళలో అన్నీ చేదు అనుభవాలే ఉండవు. బందువులకన్నా ఎక్కువగా దగ్గరయ్యి మిత్రులుగా మారే ఓనర్లూ ఉంటారు. ఫోన్ పలకరింపులూ, అప్పుడప్పుడూ కలుసుకోడాలూ ఉంటాయి. ఓ ఇంట్లో ఓనర్ వాళ్ళమ్మగారు ఎనభయ్యేళ్ళావిడ..ఆంగ్ల సాహిత్యం మీద చాలా పట్టున్నావిడ. ఇంటి ముందు కుర్చీలో కూర్చుని, ఏదో పుస్తకం చదువుకుంటూ కనిపించేవారు. అప్పుడప్పుడూ కబుర్లు, పుస్తకాల గురించి.

నా సంగతి తెలిసి ఆవిడ కొన్ని పుస్తకాలు అడిగారు. నేను వాటిని సంపాదించే లోపునే ఆవిడ చనిపోయారు. ఇప్పటికీ ఇంగ్లీష్ నవలలు చూసినప్పుడల్లా ఆవిడ గుర్తొస్తారు. ఒక్కోసారి అద్దిళ్ళ మీద వైరాగ్యం వచ్చినా, సొంతింట్లో ఉంటే ఈ అనుభవాలన్నీ మిస్ అవుతాము కదా అనిపిస్తూ ఉంటుంది.

15 వ్యాఖ్యలు:

 1. కొన్ని చోట్ల అద్దెకుండే వాళ్ళకి అస్సలు విలువే ఇవ్వరండీ ! ప్రోబ్లం మన ఓనర్స్ కాదు ...అపార్ట్ మెంట్ లో ఉండే మిగతా ఓనర్స్ .అందరూ అలా ఉండరు గాని ఒక్కోచోట ఒక్కొక్కడుంటాడు . ఇక్కడో గుడ్ కూడా ఉందండోయ్ !మనకెప్పుడు నచ్చకపోతే అప్పుడు మారిపోవచ్చు .అదే సొంతిల్లనుకోండి పక్కన ఎటువంటివారున్నా చచ్చినట్టు ఉండాల్సిందే కదా !

  ప్రత్యుత్తరంతొలగించు
 2. చాల బాగుందండి మీ అద్దింటికతలు...త్వరలో ఓ ఇంటివాళ్ళు { :( సొంతింటి వాళ్ళు } అవ్వండి .వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వితే మీ ఇల్లు మనవాల్లకేవరయిన ఇద్దాము .

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నేను మొట్ట మొదట్లో అంటే 1963 నుండీ 1974 దాకా అద్దె ఇంట్లోనే ఉండేవాడిని పూనా లో. 1972 లో పెళ్ళి అయిన తరువాత, ఆవిడ ఇంటికొచ్చిన వేళైతేనేమిటి, ఫాక్టరీ క్వార్టర్స్ లోకి మారాము. కానీ రెండేళ్ళు అద్దె ఇంటిలోనే కాపురం చేయాల్సి వచ్చింది. ఆ పాలెస్ గురించి నా బాతాఖానీ ఖబుర్లు--19 లో రాసేను, మిగిలినవి రాస్తాను. కానీ ఇక్కడ రాజమండ్రీ లో మాత్రం ఎటువంటి శ్రమా లేకుండా మంచి అపార్ట్మెంట్ దొరికింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మురళీ గారూ,

  భయపెట్టారు.వీసా రెన్యూ కాకపొతే నేను కూడా మొదలెట్టాలి ఇళ్ళ వేట .

  ప్రత్యుత్తరంతొలగించు
 5. అద్దింటి కతలు అంటే అలవాటు ప్రకారం మీరు చెప్పే ఎవరో రాసిన కథలేమో అనుకొని వచ్చా. తీరాచూస్తే ఇది మీ కథే అన్నమాట.

  అద్దింటి వేట సందర్భంగా ఓనర్లతో జరిగే సంభాషణ చాలా గమ్మత్తుగా ఉంటుంది. మాట్లాడే మాటలు ఒకెత్తు, ఆ మాటల వెనక నిగూఢార్ధాలు మరొకెత్తు. మాట్లాడుతూనే మన సామాజిక, ఆర్ధిక స్థాయిల్ని ఓనరు అంచనా వేస్తుంటే, మనకున్న అలవాట్లని బట్టి ఈ ఓనరు మనకి తగినవాడాకాదా, భవిష్యత్తులో ఏమాత్రం ఇబ్బంది కలగజేస్తాడో అని మన ఆలోచనలు సాగుతూ ఉంటాయి. మాటలదారి మాటలదే ఈ ఆలోచనల దారి ఆలోచనలదే. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. బాగున్నాయి మీ అద్దింటి కతలు.
  ఒకావిడ చెప్పింది ఇంటికి చుట్టాలూ, ఫ్రెండ్సూ రాకూడదంది.
  ఎందుకంటే గొడవా, నీళ్ళ వాడకం ఎక్కువైపోతాయట.
  చుట్టూ తుడవటానికి పనిమనిషిని పెట్టుకోవాలట.
  ఇల్లు తలుపులు తెరిచి ఉంచకూడదట. అన్నీ చెప్పి మీకు
  పిల్లలు లేరు కదా అని అడిగింది. అంటే పిల్లలుంటే?...
  అనుకొని మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా పరిగెట్టాం.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఇలా క్లుప్తంగా కాదుగానీ ఒక్కో ఎపిసోడూ ఒక్కో కథగా రాసెయ్య కూడదూ?

  ప్రత్యుత్తరంతొలగించు
 8. @పరిమళం: అద్దింటి వల్ల ఏకైక ఉపయోగం నచ్చనప్పుడు వెంటనే మరో ఇంటికి మారిపో గలగడమేనండి. ధన్యవాదాలు.
  @చిన్ని: ఊళ్ళో ఒక ఇల్లు ఉండండి.. రెండో ఇంటి వాడిని అవ్వాలి :) అదే.. మీరు చెప్పినట్టుగా సొంతిల్లు. బ్లాగులో టూలెట్ ప్రకటనలిచ్చే ఆలోచన బాగుందండి.. ధన్యవాదాలు.
  @ఫణిబాబు: మీ కబుర్లు క్రమం తప్పకుండా చదువుతున్నానండి.. ధన్యవాదాలు.
  @సునీత (నాబ్లాగు): ఏమీ భయం లేదండి.. మీ పాస్ పోర్ట్ రెన్యు అవుతుంది.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. @ఉమాశంకర్: నిజమేనండి.. ఒక రకగా ఇవి పెళ్లిచూపుల్లాంటివి :) మాట్లాడేదానికి, ఆలోచించేదానికి అస్సలు సంబంధం ఉండదు.. మీకూ చాలా అనుభవాలే ఉన్నట్టున్నై.. వీలు చూసుకుని రాయకూడదూ.. ధన్యవాదాలు.
  @భవాని: పాపం చాలామంది ఓనర్లకి చుట్టాల భయం అండి.. ముందు అలా చెబుతారు కానీ, ఎక్కడో తప్ప తర్వాత అభ్యంతరం పెట్టే వాళ్ళు ఉండరన్నది నా అనుభవం. ధన్యవాదాలు.
  @కొత్తపాళీ: 'సత్యభామ' సీరియల్ మొదటి భాగానికి వచ్చిన స్పందన చూసి సింగిల్ టపాయే సో బెటరు అనుకున్నానండి :) ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. మీ అద్దింతి కథలు చాల బాగున్నాయి...ఇంకా ఇంకా చదివెట్

  ప్రత్యుత్తరంతొలగించు
 11. నేను నా 8వ తరగతి నుండి అద్దె ఇంట్లోనే వుంటున్నను, మొదట్లొ పై చదువుల కోసం, తర్వాతా ఉద్యోగం కోసం, ఇప్పుదు పెల్లైంది. ప్రస్తుతం విదేశంలొ వున్నా అద్దె ఇల్లే. own house is my dream house. Not sure when will I fill it
  http://santhlavvi.in

  ప్రత్యుత్తరంతొలగించు