మంగళవారం, మే 05, 2009

చెకుముకి నిప్పు

మృత్యువు కథా వస్తువు గా వచ్చిన సాహిత్యం అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. అందుకే, పదమూడేళ్ళ క్రితం 'ఇండియా టుడే' ప్రచురించిన 'చెకుముకి నిప్పు' కథ ని జాగ్రత్త గా దాచుకున్నాను. బీనాదేవి రాసిన ఈకథ ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని చుట్టూ ఉన్న వాళ్ళ ప్రవర్తనలో వచ్చే మార్పుని ఎండగడుతుంది. హాస్య, వ్యంగ్య ధోరణిలో సాగే కథనం ఆసాంతం వదలకుండా చదివిస్తుంది. రచయిత గొంతునుంచి వినిపించే ఈ కథలో ప్రధాన పాత్రలు రెండు. రచయిత, అతని స్నేహితుడు ఆనంద రావు.

ఆరోయేట నుంచి దాదాపు ఆరు దశాబ్దాల పాటు తనకి ప్రాణ స్నేహితుడైన ఆనందరావు మరణించాడన్న వార్త రచయిత కి తెలియడంతో కథ ప్రారంభమవుతుంది. ఆనందరావుని (శవాన్ని అనడానికి రచయితకి మనసొప్పదు) చూడడానికి వాళ్ళింటికి వెళ్తే వింత అనుభవాలు ఎదురవుతాయి. ప్రీ-స్కూల్లో చదువుతున్న తనకొడుకుని ముందు గదిలో కూర్చోపెట్టుకుని హోం వర్క్ చేయిస్తూ ఉంటాడు పెద్దల్లుడు. పై చదువుకి విదేశాలకి ప్రయాణమవుతూ ఉంటుంది చిన్న కూతురు. రైల్లో రిజర్వేషన్ దొరకలేదని ప్రయాణం ఒక రోజు వాయిదా వేసుకుంటాడు పెద్ద కొడుకు.

చిన్న కొడుకు డీఎస్పీ కావడం తో పోలీసులంతా వచ్చి శవం మీద పూలదండలు పడేసి పోతూ ఉంటారు. బంధువులంతా టీవీల గురించి, సినిమాల గురించి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తూ ఉంటారు. "వీధి గదిలో ఆనందరావు శవం గనక లేకపోతే పెళ్ళివారిల్లు లా ఉంది." తన శవం పక్కనే కూర్చుని ఉన్న ఆనందరావు కనిపిస్తాడు రచయితకి. దండలు కుళ్ళిన వాసన భరించలేక పోతున్నాననీ, త్వరగా దహనం జరిగే ఏర్పాట్లు చూడమనీ మొర పెట్టుకుంటాడు ఆనందరావు. ఆ బాధ చూడలేక సంపంగి అత్తరు తెప్పించి ఆనందరావు మీద చల్లుతాడు రచయిత. యవ్వనం లో తను ప్రేమించిన 'సంపంగి' ని గుర్తు చేసుకుని అరమోడ్పు కన్నులతో ఏదో లోకానికి వెళ్ళిపోతాడు ఆనందరావు.

తను నమ్మిన ఆశయాలను ఆచరణలో చూపిన ఆనందరావు చివరి ఘడియలు ఇలా గడవడం భరించలేక పోతాడు రచయిత. సరిగ్గా అప్పుడే ఓ డెబ్భయ్యేళ్ళ వృద్ధుడు (దూరపు చుట్టం) ఇంట్లో కి వచ్చి, పిల్లలకి చీవాట్లు పెట్టి దహనం ఏర్పాట్లు చూడమంటాడు. "ఆనందరావు యజ్ఞం చేశాడు.. కాబట్టి వాడి శవానికి మామూలు నిప్పు పనికి రాదు..చెకుముకి నిప్పు పెట్టాలి" అని ప్రకటిస్తాడు ఆ వృద్ధుడు. ఈ చెకుముకి ఉపద్రవం ఏమిటో అర్ధం కాదు రచయితకి. అతనికి తెలిసి ఆనందరావుకి దేవుడిపైనే నమ్మకం లేదు. అదే విషయం ఆనందరావునే అడిగేస్తాడు. "నేను యజ్ఞం చేయడం ఏమిట్రా.. నా ఐదో ఏటో, ఆరో ఏటో మా తాత యజ్ఞం చేస్తుంటే ఆయన ఒళ్ళో కూర్చుని ఓ సమిధ విసిరాను.. అంతే.." అని సమాధానం వస్తుంది.

మర్నాడు అంత్యక్రియలు. పోలీసులు ఎక్కడినుంచో ఓ బస్తాడు రాళ్ళు తెచ్చి పడేస్తారు. ఐతే రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి నానిపోయి ఉంటాయి అవి. శాస్త్ర ప్రకారం తలకొరివి పెట్టాల్సింది పెద్ద కొడుకే అయినా, నిప్పు ఎవరైనా చేయొచ్చు కాబట్టి ఆ బాధ్యత తీసుకుంటాడు రచయిత. స్టవ్ మీద పెనం పెట్టి రాళ్ళని వేడి చేస్తాడు. జనం చుట్టూ మూగుతారు. చిన్నప్పుడు తనూ, ఆనందరావూ దొంగతనంగా సిగరట్లు కాల్చిన రోజులు గుర్తొస్తాయి. అప్పట్లో అగ్గిపుల్లని రాయిమీద గీసి వెలిగించడం ప్రాక్టీసు చేశారు ఇద్దరూ. ఆనందరావుకి ఎప్పుడైనా గురి తప్పేది కానీ, రచయితకి ఎప్పుడూ తప్పలేదు. రెండు రాళ్ళు తీసుకుని రహస్యంగా అగ్గిపుల్ల దాచి అగ్గి చేయడం మొదలుపెడతాడు.

కథలో చివరి వాక్యాలు: "నా గుండెలో చితి మండుతోంది. ఆనందరావు చితికి నేను నిప్పు చేయడవా? ఇది సంభవమేనా? చేతులు వణుకుతున్నాయి. ఒక్కసారి తలెత్తి చూసేను. అందరితోపాటు ఆనందరావు కూడా నామీదకి వంగి చూస్తున్నాడు. ఇప్పుడతని మొహంలో ఏడుపు లేదు. నవ్వుతూ "ఇదే ఆఖరి చూపు కదా" అన్నాడు. నా గుండెలో మండుతున్న చితికి భూగోళం బద్దలైంది. ఆకాశం ఆవిరైపోయింది. ప్రకృతి స్తంభించి పోయింది అంతే. అగ్గిపుల్లలున్న రాతితో రెండో దాని మీద "ఠక్" మని కొట్టేను. భగ్గున మంట వచ్చింది. నా కంటి నుంచి రాలిన కన్నీటి బొట్టు ఆ మంటని ఆర్పకుండా జాగ్రత్తపడి గిర్రున వెనక్కి తిరిగేను. ఇంకా నేను చేయాల్సింది, చూడాల్సింది ఏం లేదు. చెయ్యకూడనిది చేసేను. కనీసం చూడ కూడనిది చూడదల్చుకోలేదు. "చెకుముకి రాళ్ళతో చితికి నిప్పెట్టడం థ్రిల్లింగ్ గా ఉంది కదూ" అంటున్నారెవరో."

21 వ్యాఖ్యలు:

 1. కథ మొత్తం చదవాలనిపిస్తోంది మురళి గారూ! వీలైతే బ్లాగు లో పెట్టకూడదూ, అనుమతులూ వగైరా చూసుకుని!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మంచి కధ పరిచయం చేశారు .అలాగే యండమూరి గారి అంతర్ముఖం పరిచయం మీనుండి ఎదురు చూడొచ్చా ?

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నేనూ చదివినట్టున్నాను ఈ కథని..

  ప్రత్యుత్తరంతొలగించు
 4. @సునీత (నాబ్లాగు): ధన్యవాదాలు
  @సుజాత: ఈ కథ బీనాదేవి గారి 'కథలు-కబుర్లు' సంకలనం లో ఉండండి.. కాని ఆ పుస్తకం ఇప్పుడు ప్రింట్లో లేదు. మీ మెయిల్ ఐడీ పంపితే స్కాన్ చేయించి కాపీ పంపుతాను. ధన్యవాదాలు.
  @పరిమళం: నాకూడా ఇష్టమైన పుస్తకం అండి..కాబట్టి 'వచ్చు.' ధన్యవాదాలు.
  @ఉమాశంకర్: చదివే ఉంటారు బహుశా.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మురళి గారూ, మంచి కథను పరిచయం చేసారు. సంతోషం. ఒక్కొక్కరి మెయిల్ ఐడిలకు పంపడం కంటె ఆ కథను (అనుమతి తీసుకొని) మీ బ్లాగులో పెట్టండి. అన్నట్టు.. కా.రా.గారి "ముసురు" కథ చదివారా? అదీ చావుకు సంబంధించిన కథే. బాగుంటుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. కంది శంకరయ్య: ధన్యవాదాలు. కథల్ని బ్లాగు లో పెట్టడానికి కాపీరైట్ సమస్యలు ఉంటాయండి. రచయిత నుంచి, ప్రచురణ కర్త నుంచి అనుమతులు తీసుకోవాలి. కొంచం పెద్ద ప్రాసెస్. అందుకే ఇలా మెయిల్ పంపడం. మీ బ్లాగును ఒక్క టపాతో ఆపేశారేం? పద్యం బాగుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మురళి గారూ, నేను తెలుగుపండితుడిగా పనిచేసి రిటైర్ అయ్యాను. నాకు కంప్యూటర్ విజ్ఞానం అంతగా లేదు. సంవత్సరం క్రితం ఆరంభశూరత్వంతో బ్లాగును సృష్టించుకున్నాను. కాని దాన్ని ఎలా కొనసాగించాలో తెలియక మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు. బ్లాగు నిర్వహణకు సంబంధించిన పరిజ్ఞానాన్ని పెంచుకొని బ్లాగును కొనసాగిస్తాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. శంకరయ్యగారు, ఆరంభ శూరత్వం అనకండి.. ఓ కొత్త పని చేయాలన్న ఉత్సాహం అది.. రాస్తూ ఉండండి.. కంప్యుటర్ గురించి అదే తెలుస్తుంది.. ఇక్కడ చాలామందిమి మీలాగ మొదలు పెట్టిన వాళ్ళమే..

  ప్రత్యుత్తరంతొలగించు
 9. మంచి మంచి కథలనీ నవలలనీ చక్కగా పరిచయం చేస్తున్నారండి.
  నేను హాయిగా చదువుకొనే బ్లాగుల్లో మీదొకటి.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. @భైరవభట్ల కామేశ్వర రావు: ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 11. చావుకధలను గుండెతడితో చదువుకొనే నాకూ ఓ తోడు ఉన్నారన్నమాట. :-)
  దాదాపు ఇలాంటి నేపధ్యంతోనే సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన కధ ఒకటి ఉంటుంది. అందులో కొడుకు చెపుతూంటాడు కధ.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. @బొల్లోజు బాబా: ధన్యవాదాలు. సిరివెన్నెల గారి కథపేరు చెప్పరూ..

  ప్రత్యుత్తరంతొలగించు
 13. సిరివెన్నెల వ్రాసిన ఆ కధ పేరు ఎన్నోరంగుల తెల్లకిరణం.
  ఈ క్రింది లింకులో చదువుకోవచ్చును.

  http://www.koumudi.net/Monthly/2007/april/index.html

  ప్రత్యుత్తరంతొలగించు
 14. @బొల్లోజు బాబా: చాలా చాలా ధన్యవాదాలు.. ఇప్పుడే చదివానండి కథ.. చాలా బాగుంది..

  ప్రత్యుత్తరంతొలగించు
 15. బీనాదేవిగారి కథల కోసం చాలా రోజులుగా వెతుకుతున్నాను. మంచి తెలుగు కథలను తమిళంలో అనువదించాలని నా ప్రయత్నం. మీ దగ్గర ఉన్న బీనాదేవి కథల సంపుటిని స్కాన్ చేయించి పంపించగలరని కోరుతున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. మురళీ గారూ

  చాలా బాగుంది కథ పరిచయం. మంచి కధ. నా దగ్గర కూడా ఒకప్పుడు ఉండేది బీనా దేవి గారి కథలూ - కబుర్లూ. ఇప్పుడు పోగొట్టుకున్నాను లెండి. మళ్ళీ దొరకటం లెదు కొందామంటె.

  అలాగే సిరివెన్నెల గారి "ఎన్నో రంగుల తెల్లకిరణం" కూడా ఇదే కథా వస్తువుతొ ఉంటుంది.
  పద్మవల్లి

  ప్రత్యుత్తరంతొలగించు
 17. @శిరీష: :-) :-) ధన్యవాదాలండీ..
  @Gowri Kirubanandan: బీనాదేవి గారి 'కథలు-కబుర్లు' ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉందండీ.. కొంచం ఓపికగా వెతకాలి. ధన్యవాదాలు.
  @పద్మ: అవునండీ, 'ఎన్నోరంగుల తెల్ల కిరణం' నేనూ చదివాను. అన్నట్టు 'కథలు-కబుర్లు' దొరుకుతోంది. కాకపొతే డిస్ప్లే లో లేదు. మనం వెతుక్కోవాలి, ఓపికగా. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. Beendadevi gari kathalu konni chadivanu. Chaala baguntai. Anduke beenadevi peru tho search chesthe meeru post chesina katha dorikindi. Chala thanks.

  ప్రత్యుత్తరంతొలగించు
 19. @కృష్ణ: 'పుణ్యభూమీ కళ్ళుతెరు' నవల కూడా చాలా బాగుంటుందండీ... ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు