బుధవారం, మే 27, 2009

ఈతపళ్ళు-ముంజెల బండి

చిన్నప్పటి నా తీరని కోరికల జాబితా రాస్తే అది మా తోటలో ఉండే ముచ్చెట్టు కన్నా పెద్దది అవుతుంది. (మామూలు కొబ్బరి చెట్టుకన్నా రెట్టింపు పొడవున్న కొబ్బరి చెట్టుని ముచ్చెట్టు అంటారు). వేసవి కాలానికి సంబంధించిన అలాంటి రెండు తీరని కోరికలు (మరీ పూర్తిగా తీరనివి కాదు కానీ, సంతృప్తిగా అనిపించనివి) రెండున్నాయి. అవి ఈతపళ్ళు తినడం, ముంజెల బండి నడపడం.

వేసవి సెలవుల్లో బడికి వెళ్ళక్కర్లేదన్న ఆనందం ఉన్నా సెలవులిచ్చిన కొన్నాళ్ళకే ఆ ఆనందం కాస్తా ఆవిరైపోయేది. ఇందుకు కారణం బాగా విసుగ్గా అనిపించే మధ్యాహ్నాలు. మా ఇంట్లో అందరికీ మద్యాహ్నం భోజనం తర్వాత ఓ కునుకు తీయడం అలవాటు, నాకు తప్ప. ఎండలో బయటికి వెళ్ళకూడదు, క్లాసు పుస్తకాలు ఉండవు, వేరే పుస్తకాలు చదవకూడదు. ఏవి పడితే అవి తినకూడదు.

మధ్యాహ్నం భోజనం కాగానే అందరూ నిద్రలోకి జారుకుంటే, నేను మాత్రం కటకటాల ముందు గదిలో కూర్చుని రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని చూస్తూ ఉండేవాడిని. సాయంత్రం ఆటలకి కలిసినప్పుడు, వాళ్ళు పొలాల వెంటా, తోటల్లోనూ తిరిగి ఈతపళ్ళు ఎలా సంపాదించారో మిత్రులు కథలు కథలు గా చెబుతూ ఉంటే నోరు తెరుచుకుని వినడం చాలా కష్టంగానే ఉండేది. మధ్యాహ్నపు జైలు శిక్షలను తప్పించుకోవడం గురించి ఆలోచిస్తూ ఉండగా ఒక రోజు ఓ ఆలోచన తళుక్కున మెరిసింది.

మధ్యాహ్నం స్నేహితుల దగ్గరికి ఆటలకి వెళ్ళినా, వాళ్ళతో కలిసి తిరిగినా ఇంట్లో తెలుస్తుంది. నేనొక్కడినీ విడిగా ఎక్కడికైనా వెళ్లి వస్తే తెలిసే అవకాశం తక్కువ. ఇందులోనూ కొంచం రిస్కు ఉంది కానీ, జైలు శిక్ష తప్పించుకోడానికి ఆ మాత్రం రిస్కు తప్పదు. ఓ మధ్యాహ్నం కొంచం ధైర్యం చేశాను. తలుపు గడియలో అప్పటికే కొబ్బరి నూనె వేసి ఉంచడం వల్ల చప్పుడు లేకుండా తెరుచుకుంది తలుపు.

పిల్లిలా అడుగులేస్తూ మా పెరటి తోటలోకి వెళ్లాను. తోట చివర ఈత చెట్లు చూడగానే, ఈతపళ్ళు ఏరుకోవాలన్న కోరిక మొలకెత్తింది. చెట్ల కింద వెతికితే అన్నీ పచ్చి కాయలే. ఇవే ఏరుకుందాం అని వాటిని జేబులో నింపుకున్నాను. ఇంట్లో వాళ్ళు లేచే టైం తెలుసు కాబట్టి ముందుగానే ఇల్లు చేరుకున్నాను. ఈ పచ్చి కాయలని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే చటుక్కున ఓ ఆలోచన వచ్చింది.

అరటి కాయలని ముగ్గ బెట్టడానికి వాటిని గోనె సంచులతో కప్పి చెక్క పెట్లలో పెట్టే వాళ్ళు. ఈతకాయలను కూడా అలాగే ముగ్గపెట్టాను, రహస్యంగా.. మర్నాడు ఉదయం లేచి చూద్దును కదా.. ఈత కాయలన్నీ మిగల ముగ్గిపోయి ఉన్నాయి. నేనెప్పుడూ ఏనుగెక్కలేదు కానీ ఒకవేళ ఎక్కి ఉంటే కూడా అంత సంతోషం కలిగి ఉండేది కాదేమో.. ఇలా ఓ నాలుగైదు రోజులు గడిచాయంతే.. ఒక రోజు ఉదయాన్నే ఈతపళ్ళు నాన్న కంట పడ్డాయి.. కట్ చేస్తే..మళ్ళీ నాకెప్పుడూ ఈతపళ్ళ కోసం వెళ్లాలనిపించ లేదు.

ముంజెల బండిది మరో కథ.. తినేసిన మూడు ముంజెలతో చేసిన ఈ బండిని నడుపుతూ నా మిత్రులందరూ ఏదో కారు నడుపుతున్నట్టు ఫోజులు కొట్టేవాళ్ళు. ఓ చిన్న కర్ర ముక్కకి అటూ ఇటూ ముంజె కాయలు గుచ్చి చక్రాల లాగా చేసేవాళ్ళు. మరో పొడవాటి కర్రకి ఒక చివర మరో ముంజె కాయని గుచ్చి స్టీరింగ్ లాగా చేసి ఆ కర్ర రెండో చివరని చక్రాలకి అనుసంధానిస్తే ముంజెల బండి తయారు.

వేసవిలో మమ్మల్ని తాగినన్ని కొబ్బరి బొండాలు తాగనిచ్చే వాళ్ళు కానీ, ముంజెల జోలికే వెళ్తే తోలు వలిచే వాళ్ళు. ముంజెలు తినకుండా ముంజెల బండి ఎలా చేసుకోగలం? అందుకే ఆ బండి ఉన్న భాగ్యశాలుల వెంట పడే వాడిని. వాళ్ళని బతిమాలి కాసేపు ఆ బండి నడిపి ఆనందించే వాడిని. ఈ నడపడాన్ని కూడా ఇంట్లో వాళ్ళు చూడకూడదు. ఇంట్లో చాలా ఆట వస్తువులు ఉన్నాయి కదా, వాటితో ఆడుకోవచ్చు కదా అని వాళ్ళ వాదన. ఎప్పటికైనా సొంతంగా ఓ బండి చేసుకోవాలన్న కోరిక ఎప్పటికీ తీరలేదు..

28 వ్యాఖ్యలు:

 1. అబ్బ ఎంత చక్కగా ఉన్నాయండి మీ బాల్య అనుభవాలు...
  మధ్యాహ్నం మీరు ఎవరికీ తెలీకుండా బయటకు వెళ్ళటం..నేను కూడా చిన్నప్పుడు సేం టు సేం..
  ఎందుకు మీ ఇంట్లో వాళ్ళు తాటి ముంజేలు తిననిచ్చేవారు కాదు?? మెమైతే వేసవిలో తాటి ముంజెలు తెగ తినేవాళ్ళం. ఎడ్ల పందేలు లాగా ముంజెలు బళ్ళుతో పోటీలు పెట్టుకునేవాళ్ళం. మామిడి టెంకలతోనూ బళ్ళు తయారు చేసుకునే వాళ్ళం. మా ఊళ్ళో పనికిరాని ప్లాస్టిక్ సామానులకు వేసవిలో చెనగలకు బదులుగా ఈతపళ్ళు ఇచ్చేవారు. అందుకే వేసవిలో కాలనీలో, ఇంట్లో, ఖాళీ సీసా గాని, ఖాళీ ప్లాస్టిక్ డబ్బాలు గాని కనిపిస్తే పిల్లకాయలం ఒక ఉదుటున వాటిపై దూకి సొంతం చేసుకునే వాళ్ళం.
  మీ సొంత ముంజెల బండి కోరిక తీరకపోవటం భాదగా అనిపించింది నాకు.
  అలాంటి ఆట వస్తువుల ముందు రిమోట్ కంట్రోల్ తో నడిచే కారు అయినా చిన్నబోదూ!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మీ తీరని కోరికలు జాబితా సంగతి ఏమో కాని మీరు వ్రాసే మీ గత సృతులన్నీ చక్కని పల్లె వాతావర్ణాన్ని తలపించి మనసుని ఆనంద పరుస్తాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ముంజెలు మంచివేగా, తిననీకపోవడమెందుకు?

  ప్రత్యుత్తరంతొలగించు
 4. అటు ఇటు ముంజల్ని గుచ్చిన కర్రని, ఇరుసు అనుకుంటే, ఆ ఇరుసుని, మేము ఓ చిన్న పంగల కఱ్ఱతో నెట్టుకుంటా ఎళ్ళేవాళ్ళం. భలే జ్ఞాపకాలు. తాటి సెట్టెక్కటం వీజీనేమో కానీ, ఈతసెట్టెక్కటం మహా కష్టం. ఇక ఈతకాయ గెలలు, రాలిపడిన కాయలు మగ్గబెట్టి...భాలే గుర్తుచేసావు భాయ్. కానీ ఈతకాయ రుచి కేవలం ఆటికి అవే సాటి. మరి మనం ఎప్పుడైనా ఈతకల్లు తాగినావేటి?

  ప్రత్యుత్తరంతొలగించు
 5. హు !నేను రాద్దామనుకున్నా తాటిచెట్టు ముంజెలు మీరు రాసేసారు....మా ఊర్లో ఈత పళ్ళు గంపలో వరిగడ్డి కప్పేసి ఇలానే పండబెట్టాను లేకపోతె గంట గంటకి గడ్డి తీసి చూసేదాన్ని ..ప్చ్ పండేవు కాదుకాని ఎప్పుడు పొదుగుకోడిలా "ఆ గదిలో "ఎంచేస్తున్నావని పెద్దోళ్ళు తిట్టేవాళ్ళు . అలానే కోడిపెట్టల్ని ఎవరింట్లో గంప కింద పెట్టిన ఆ కోడి గుడ్డు పెట్టిందో లేదోనని నిమిష నిమిషంకి చూసేదాన్ని ....దేవుడు వరమడిగితే తిరిగి నాకు నా "భాల్యాన్ని "ఇమ్మని అడుగుతాను మీ టపా చాల బాగుంది .

  ప్రత్యుత్తరంతొలగించు
 6. " ఒక రోజు ఉదయాన్నే ఈతపళ్ళు నాన్న కంట పడ్డాయి.. కట్ చేస్తే..మళ్ళీ నాకెప్పుడూ ఈతపళ్ళ కోసం వెళ్లాలనిపించ లేదు."

  అబ్బ, మీ ఇంట్లో కూడా ఇంతేనా?:))


  అది సరే, ఇలాంటి బాల్య జీవితపు మధుర క్షణాలన్నీ గుర్తు చేసి మనసులు తొలిచే వ్రతం ఏదన్నా చేపట్టారా మీరూ, ఉషా మొదలైన వారంతా!

  ప్రత్యుత్తరంతొలగించు
 7. చిన్నప్పుడు నాకూ ముంజెల బండితో ఆడుకోవాలనిపించేది ...మా తమ్ముడూ వాడి స్నేహితులూ మీరన్నట్టే తెగ ఫోజు కొట్టేవాళ్ళు .కానీ ఆడపిల్లలు ముంజెల బండితో ఆడకూడదని ఆంక్ష ! హ్మ్ .....

  ప్రత్యుత్తరంతొలగించు
 8. మురళి గారు ఈతకాయల తాటి నుంజల ( మాకు ముంజెలు అంటే అదేదో మా భాష కానట్టువుంటుంది ) రుచులతో నోర్ంతా ద్రవించింది. పచ్చి తాటికాయలతో నేను చేసినన్ని బండి ప్రయోగాలు ఎవరూ చేసివుండరేమో....:). అలాగే అవి మరీ ఎక్కువ తిని కడుపు పట్టేసిన రోజులూ చాలానే.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. >>విసుగ్గా అనిపించే మధ్యాహ్నాలు. మా ఇంట్లో అందరికీ మద్యాహ్నం భోజనం తర్వాత ఓ కునుకు తీయడం అలవాటు, నాకు తప్ప. ఎండలో బయటికి వెళ్ళకూడదు, క్లాసు పుస్తకాలు ఉండవు, వేరే పుస్తకాలు చదవకూడదు. ఏవి పడితే అవి తినకూడదు
  same here... :)

  ప్రత్యుత్తరంతొలగించు
 10. నేను మాత్రం ముంజెల బళ్లూ ఎక్కి తిరిగిందే తిరగడం. మేం గుడబళ్లంటాం వాటిని. ఇవిగాక పెద్ద తాటికమ్మలూ మాకు వాహనాలే. వాటిమీద కూచుంటే మరొకరు లాగుతూ కళ్లందాకా తీసికెళ్లాలి, అక్కణ్నుంచి మనం వాళ్లను లాగి తేవాలి. అదీ ఒప్పందం. ఇందులో ఓ రాజకీయం ఉంది. మనకన్నా తేలికపాటి, చిన్నపిల్లలయితే మనం సులువుగా లాగొచ్చు. కానీ వాళ్లు మనల్ని లాగలేరు. మన సరదా తీరాలని ట్రిక్కులేసి కాస్త పెద్దపిల్లలతో స్నేహం చేశామంటే, వాళ్లని మనం లాగలేం. అడక్కండి చిన్నప్పుడు వేసవి కష్టాలు అన్నీఇన్నీ కావు. అయినా గౌన్లు చిరిగేదాకా తాటాకు మట్టల మీద కూచొని బండిలాగించుకోవడం . చేతులు నొప్పెట్టేదాకా లాగడం. ఇప్పుడు కార్లలో తిరుగుతున్నా ఆ సంతోషం రాదు. దుమ్ముకొట్టుకుపోయి వచ్చిన మమ్మల్ని మా అమ్మలు కూడా పోల్చుకోలేకపోయేవారు. :P స్నానాలు చేసి తెల్లటి బుల్లి జుబ్బాలు, గౌన్లు వేసుకున్న తర్వాతే దగ్గరకు రానిచ్చేవారు. ఆవకాయ కోసం ఎండపెట్టే మావిడి కాయ ముక్కల్ని మాత్రం దొంగతనం చేసి తినేసేవాళ్లం. దాచుకున్నవాళ్లు దొరికిపోయేవాళ్లు, చీమలు పట్టించేస్తాయి కదా. గొప్పరుచి అనుకోండి అవి.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. హ హ హ్హ.. నా చిన్నతనం లోనికి వెళ్ళాను చాల బాగా చెప్పారు..తాటికమ్మ ల మీద కూర్చొని పరేగ్దితు వుంటే ఆ ఆనందం చాలా బాగుండేది...చాలా బాగా రాసారు పోస్ట్

  ప్రత్యుత్తరంతొలగించు
 12. @శేఖర్ పెద్దగోపు: మావాళ్ళకి ఎందుకో ముంజెల మీద సదభిప్రాయం లేదండి.. తిననిచ్చేవాళ్ళు కాదు. 'పాత సామాన్లు..' వినగానే మరో జ్ఞాపకం తళుక్కుమంది.. కాసుకోండి..మరో టపా.. ధన్యవాదాలు.
  @పద్మార్పిత: పల్లె జీవితం చాలా చాలా బాగుంటుందండి.. మిస్సవ్వడం మొదలు పెట్టాక ఆ అందం, ఆనందం మరింత బాగా తెలిశాయి.. ధన్యవాదాలు.
  @తెరెసా: ఎందుకన్నది నేనెప్పుడూ అడగలేదండి.. మా చిన్నప్పుడు ఎదురు ప్రశ్నలు నిషేధం.. చెప్పింది చెయ్యడమే.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. @భాస్కర్ రామరాజు: ప్చ్.. ఈత కల్లు తాగే ఈడొచ్చేసరికి ఊరు విడిచి పెట్టేశా.. ధన్యవాదాలు.
  @చిన్ని: మీరూ రాయండి.. ఏ ఇద్దరి జ్ఞాపకాలూ ఒక్కలా ఉండవు కదా.. ధన్యవాదాలు.
  @సుభద్ర: ఇప్పుడింక ఆ అవకాశం లేదు లెండి.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. @సుజాత: మనసులు తొలిచే వ్రతం? యెంత మాట! ..ధన్యవాదాలు.
  @పరిమళం: ఆ అవకాశం దొరకని అబ్బాయిలు కూడా ఉన్నారని ఇప్పుడు తెలిసింది కదా.. ఇక నిశ్చింత... ధన్యవాదాలు.
  @భాస్కర రామిరెడ్డి: మీ నుంజెల గురించి, తాటికాయలతో ప్రయోగాల గురించి తెలుసుకోవాలని ఉంది.. ఒక టపా ప్లీజ్..

  ప్రత్యుత్తరంతొలగించు
 15. @మేధ: హమ్మయ్య.. నాలాగ మరికొందరు.. కానీ పెద్ద పనిష్మెంట్ అండి.. నిద్ర రాదు, మరే పనీ చేయలేం.. అలా అని నిద్రపోతున్న వాళ్ళని లేపలెం... ధన్యవాదాలు.
  @అరుణ పప్పు: అబ్బ.. ఎన్ని ఆటలు గుర్తు చేశారండి.. కమ్మ లాగే ఆట లో మిత్రులు ముందు నన్ను లాగే వాళ్ళు. నా వంతూ వచ్చేసరికి మా ఇంట్లో వాళ్ళు నన్ను పిలిచేసేవాళ్ళు.. అలా నేను లాగింది తక్కువ.. ఇద్దరు కలిసి లాగాల్సి వచ్చేది నా భారీ కాయాన్ని.. ధన్యవాదాలు.
  @హరే కృష్ణ: జ్ఞాపకాలలో ఉన్న గొప్పదనం అదేనండి.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. తాటికమ్మ = తాటిమట్ట. అవునా?
  తాడిమట్ట ప్రిసైజుగా!!

  ప్రత్యుత్తరంతొలగించు
 17. ఏంటో ఈ రోజు కూడలి తెరిస్తే అన్నీ నన్ను మా ఊరికి,నా చిన్నతనానికి తీసుకుపోయే పోస్టులే.బావున్నాయండి మీ జ్ఞాపకాలు.నేను నా బాల్యాన్ని మాగ్జిమం ఎంజోయ్ చేసేసాను.నావాళ్ళకి,నా ఊరికి ఎంతో ఋణపడివున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. ముంజెల బండేకాదు, మేము వర్షం పడ్డ తెల్లారి బంక మట్టితో ఎద్దులు, బండి చేసేవాళ్ళం.

  ప్రత్యుత్తరంతొలగించు
 19. @రాధిక: అప్పట్లో కొంచం విసుక్కుని, పెద్దవ్వడం కోసం ఎదురు చూసినా, ఇప్పుడు వెనక్కి వెళ్లి ఆలోచిస్తే ఆ రోజులు యెంతో మధురంగా గడిచాయనిపిస్తుందండి నాకు.. బహుశా అందరికీ అంతేనేమో... ధన్యవాదాలు.
  @సునీత: మేము బంక మట్టితో బొంగరాలు చేసే వాళ్ళం. కారు, రైలు లాంటి బొమ్మలు కూడా.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 20. హే హే నాకు మాత్రం "ఈతపళ్ళు తినడం, ముంజెల బండి నడపడం" చాలా సంతృప్తిగా తీరిపోయాయి. మా మళ్ళకి కట్టామంతా ఈత, తాటి చెట్లే. కల్లు గీసే వెంకటెసు, బాసి గాడు నాకు దోస్తులే. ఇంకా పుల్ల రేగి, సీమచింత, గొబ్బిపూలు చాలా వుండేవి. మా మునసబు గారి సీనుని [మేం ముందు ప్రెసిడెంటు గారి మనవలం, తర్వాత మేనకోడళ్ళం కనుక మాదే పై మాట] కరణం గారి నాని గాడ్ని వెంటేసుకుని అన్ని సందులు తిరిగొచ్చేదాన్ని. కర్ర బిళ్ళ, ఏడు పెంకులాట, కోతి కొమ్మచ్చి, పైరాకు-పచ్చనాకు, సబ్ జావ్ ఇండోర్, వెన్నెల్లో వెన్నముద్ద, చింతగింజలాటలు, తొక్కుడుబిళ్ళ, బంక మట్టి బొమ్మలు, తాటాకు బొమ్మల పెల్లిళ్ళు అమ్మో గుక్క తిప్పుకోలేనని ఆటలు ఆడాము. మీ పుణ్యమాని ఓ సారి మనసు ఆ జ్ఞాపకాల గదుల్లో మరోసారి తిరిగి వచ్చింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 21. @ఉష: మీరు నన్ను ఎక్కడికో తీసుకెళ్ళి పోతున్నారండి.. ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 22. మురళిగారు. ముంజలతో పాటు మా ఇంట్లో తేగ బద్దలు కుడ తిననిచ్చేవాళ్ళు కాదండి. మీరన్నట్టుగానె...ఎందుకు అని అడిగేంత ధైర్యం ఉండెది కాదు.
  చెప్పారు...ఫాలో అవ్వటమే అన్నట్టు ఉండేది. మీది పల్లెటూరి బాల్యం కాబట్టి ఇన్ని మధుర స్మృతులు...కాని నాది బెజవాడ బాల్యం...అందునా మీ అందరికంటే వయసులో చాల చిన్నవాణ్ణేమో... ఇన్ని జ్ఞాపకాలు లేవు. నాకు గుర్తున్నదల్లా మధ్యాన్నాలు ఇంట్లోవాళ్ళకి తెలియకుండా వెళ్ళి సందుల్లో క్రికెట్ ఆడటం. నా చిన్నప్పుడు మా సందుల్లో నేనే సచిన్ తెలుసా? :P

  ప్రత్యుత్తరంతొలగించు
 23. @శం కరోతి" - ఇతి శంకరః తేగల విషయంలో మేము అదృష్టవంతులమేనండి.. అసలు చిన్నవాళ్ళకే ఎక్కువ విషయాలు జ్ఞాపకం ఉండాలి కదండీ? ...ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 24. జ్ఞాపకం లేవని కాదు. కాని మీరన్నారు కాబట్టి చెబుతున్నాను మరి చూడండి.
  చిన్నప్పుడు...అంటే నాకు ఒక 5-6 సం. ఉంటాయేమో. ఆడుకోడానికి మా పక్కింటి చింటూ గాడిని పిలుచుకొద్దామని వాళ్ళింటికి వెళ్ళాను. వాళ్ళ పిన్ని ఇస్త్రీ చేస్తొంది. (ఇది జరిగి ఒక 15-16 సంవత్సరాలు జరింగింది...ఆ కాలంలో బహుశ ఇళ్ళళ్ళో ఇస్త్రీ పెట్టెలు తక్కువో...లేక నేను ఇస్త్రీ పెట్టెని చూడటం మొదటిసారో) నాకు కాస్త ముచ్చటవేసి ..కాసేపు చింటు గురించి మర్చిపోయి....తదేక దీక్షతో ఆ ఇస్త్రీ పెట్టెని...దాని పనితనాన్ని చూసాను. అప్పటికే నాకు భూతద్దం గురించి తెలుసు కాబట్టి....అప్పుడప్పుడు ఆ రూపాయి భూతద్దం తోటి ఎలాగైనా అగ్గి పుల్ల వెలిగించాలని గంటల తరబడి ఎండలో దాన్ని పట్టూకుని కూర్చునే వాణ్ణి కాబట్టి ఇది కుడా బహుశ ఎండ ద్వారా బట్టల్ని మడతలు లేకుండా చేస్తుంది కాబోలు..అనుకున్నా. కాని అలా సమాధాన పడితే ఎలా? దీని సంగటేంటో చుడాలి అనుకుని....ఆవిడ మరిన్ని చీరలు తేవడానికి వెళ్ళినప్పుడు...ఇదే అదును అనుకుని...అప్పటీదాక ఇస్త్రీ చెసిన చీరని ముట్టుకు చూసా...వేడిగా భలే ఉంది. పోనిలే అనుకుంటే....నా వెధవ మనసు కుడుటపడలేదే? పుర్రెకో బుద్ధి అన్నట్లు.... ఇస్త్రీ చేసిన చీరే ఇంతవేడిగా ఉంటే... ఇంక ఇస్త్రీ పెట్టె ఎంత వేడిగాఉంటుందో చుద్దాం అని...కాంగ్రెస్సు వారి హస్తం ముద్రలా నేను కుడా...నా అరచెయ్యి దానికి అంటిచ్చా. ఇంకేముంది....నా ప్రమేయం లేకుండానే ఒక పెద్ద కేక వచ్చెసింది నా నోటినుంచి. ఇంక ఆ తర్వాత..డాక్టర్లూ.... మందులూ...ఆయింటుమెంట్లూ మామూలే కదా. ఆ తర్వాత నుంచి ఎక్కడ పెట్టె కనిపించినా...వొళ్ళు దెగ్గరపెట్టుకుని...దానికి నాకు మంచి డిస్టన్స్ మెయింటైన్ చేసేవాడిని....ఇప్పటికీచేస్తున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 25. @"శం కరోతి" - ఇతి శంకరః బాగుందండి మీ అనుభవం.. నాకు 'పెళ్లి పుస్తకం' సినిమాలో రావి కొండలరావు-దివ్యవాణి కాంబినేషన్ సీన్ గుర్తొచ్చింది. పూజిత ని రాజేంద్రప్రసాద్ ఇంటికి తీసుకొచ్చిన కొండలరావు, అక్కడ దివ్యవాణిని చూసి ఇస్త్రీ పెట్టె మీద చెయ్యి వేయడం..... మొత్తానికి మీకు కొత్తవిషయాలు తెలుసుకోవాలనే కుతూహలం చాలా ఎక్కువన్న మాట!

  ప్రత్యుత్తరంతొలగించు
 26. ఇదివరకు నేను చదవని మీ నెమలికన్ను టపాలన్నీ వరసగా చదువుతున్నాను.

  ఎందుకన్నది నేనెప్పుడూ అడగలేదండి.. మా చిన్నప్పుడు ఎదురు ప్రశ్నలు నిషేధం.. చెప్పింది చెయ్యడమే..

  ఎదురుప్రశ్నలు వెయ్యకుండా.. తెలివిగా మా తాతగారికి నుండి తెలుసుకున్న సంగతి ఏంటంటే... ఇదివరకు కొన్ని పదార్ధాలు ఇంట్లో వాడనిచ్చే వాళ్ళు కాదుట.
  బహుశా అవి విశ్వామిత్ర సృష్టికి చెందినవి అని వాళ్ళ నమ్మకంట.
  ఉదాహరణకు చింతపండుకు విశ్వామిత్ర సృష్టి నిమ్మకాయ.
  కొబ్బరిచెట్టుకు విశ్వామిత్ర సృష్టి తాటిచెట్టు (ఏమో..!?) ఇలా చాల పదార్దాలే ఉన్నాయి.

  మనం చేసుకొనే ఉగాది పచ్చడిలో కూడా విశ్వామిత్ర సృష్టికి సంబందించిన పదార్ధాలు ఏమి వాడరు అనేది నేను గమనించిన విషయం :)

  తాటిముంజల బండి తో ఆడుకొనే అవకాశం నాకుకూడా రాలేదండి. కాని కొబ్బరిపుచ్చులతో రకరకాల బండ్లు, రధాలు తయారు చేసేవాణ్ణి.

  ప్రత్యుత్తరంతొలగించు