సోమవారం, జూన్ 28, 2021

గొల్ల రామవ్వ

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, రచయితా, కవీ కూడా. విశ్వనాథ సత్యనారాయణ 'వేయిపడగలు' నవలని 'సహస్ర ఫణ్' పేరిట హిందీలోకి అనువదించడమే కాదు, తన ఆత్మకథని 'ది ఇన్సైడర్' పేరుతో ఆంగ్ల నవలగా రాశారు కూడా (కల్లూరి భాస్కరం తెలుగు అనువాదం 'లోపలి మనిషి'). 'అయోధ్య 1992' పుస్తకం పీవీ మరణానంతరం ప్రచురణకి నోచుకుంది. ఇవి మాత్రమే కాదు, పీవీ కొన్ని కథలు, కవితలూ కూడా రాశారు. ఎంపిక చేసిన కొన్ని రచనల్ని ఆయన కుమార్తె సురభి వాణీదేవి (మొన్నటి ఎన్నికల్లో టీఆరెస్ నుంచి ఎమ్మెల్సీ గా గెలిచారు) తన సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ తరపున 'గొల్ల రామవ్వ మరికొన్ని రచనలు' పేరిట చిరుపొత్తంగా వెలువరించారు. ఇందులో కథకుడిగా పీవీకి ఎంతో పేరుతెచ్చిన 'గొల్ల రామవ్వ' కథతో పాటు పొలిటికల్ సెటైర్ కథ 'మంగయ్య అదృష్టం,' రెండు కవితలు, మూడు వ్యాసాలు ఉన్నాయి. 

తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో సాగే కథ 'గొల్ల రామవ్వ.' ఈ కథలో నాయకుడు పీవీయే అయ్యే అవకావశాలు ఉన్నాయి. సాయుధుడైన ఓ కాంగ్రెస్ కార్యకర్త పోలీసులకి, నిజం ప్రయివేటు సైన్యం రజాకార్లకీ వ్యతిరేకంగా పోరాటం చేస్తూ, ఓ రాత్రి ఇద్దరు పోలీసుల్ని తుపాకీతో కాల్చి చంపి గొల్ల రామవ్వ గుడిసెలో ఆశ్రయం పొందడం, అతని పట్ల సానుభూతి చూపించిన రామవ్వ ఎంతో ధైర్యాన్ని, యుక్తిని ప్రదర్శించి పోలీసుల బారి నుంచి రక్షించడం ఈ కథ. సాయుధ పోరాటం జరిగే నాటికి పీవీ కాంగ్రెస్ కార్యకర్త, తుపాకీ పట్టి పోరాటంలో పాల్గొన్నారు కూడా. ఈ వివరాలన్నీ 'లోపలి మనిషి' లో ఉన్నాయి. తెల్లవారు జామున గుడిసెలో ప్రవేశించిన వాడు రజాకారో, పోలీసో అని అనుమానించిన రామవ్వ వచ్చింది ఎవరైనా తన ప్రాణం, మనవరాలి మానం పోక తప్పదని నిశ్చయించుకుంటుంది. 

మనవరాలిని కాపాడుకోవడం కోసం వచ్చిన వాడి కాళ్ళమీద పడుతుంది. ఆ వచ్చిన వాడు అటు రజాకార్లకీ, ఇటు పోలీసులకి శత్రువే అని తెలిసినప్పుడు అతన్ని ఆదరిస్తుంది. అతని వొంటిని గుచ్చుకున్న ముళ్ళని తీసి కాపడం పెడుతుంది, తన గుడిసెలో ఉన్న తిండీ పెడుతుంది. కాల్పుల్లో చనిపోయింది పోలీసులు కావడంతో తెల్లారకుండానే ఊరిమీదకి పోలీసుల దండు దిగుతుంది. గుడిసె గుడిసెలోనూ గాలింపు మొదలవుతుంది. పోలీసులు రామవ్వ గుడిసె తలుపులూ తడతారు. ఆ యువకుడిని రక్షించేందుకు అనూహ్యమైన యుక్తి పన్నుతుంది రామవ్వ. పోలీసులకి రామవ్వ మీద అనుమానమే, ఆమె ఒక 'బద్మాష్' అని నిశ్చయం కూడాను. అయినా కూడా వాళ్ళ కళ్ళుకప్పే ప్రయత్నం చేస్తుంది రామవ్వ. కథ చదువుతున్నట్టుగా కాక, ఒక సన్నివేశాన్ని చూస్తున్నట్టుగా పాఠకులకి అనిపించేలా ఈ కథ రాశారు పీవీ. 1949 లో తొలిసారి ప్రచురింపబడిన ఈ కథ నిశ్చయంగా ఎన్నదగినది. 

'మంగయ్య అదృష్టం' కథ ఎప్పుడు రాశారన్న వివరం లేదు కానీ, కథాంశాన్ని బట్టి చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేయవలసి వచ్చిన అనంతర పరిస్థితుల నేపథ్యంలో రాసిన కథ అయి ఉండొచ్చుననిపించింది. బ్రహ్మదేవుడు, సరస్వతిల మధ్య అభిప్రాయం భేదం రావడం, దేవతలందరూ రెండు వర్గాలుగా విడిపోవడంతో మొదలయ్యే ఈ కథ, ఆ రెండు వర్గాలూ మంగయ్య అనే భూలోక వాసి జీవితాన్ని నిర్దేశించే ప్రయత్నాలలో ఎత్తుకి, పై ఎత్తులు వేసుకోవడంతో ఆసక్తిగా సాగుతుంది. ఈ కథ సోషియో ఫాంటసీ ఎంతమాత్రమూ కాదు, పూర్తి పొలిటికల్ సెటైర్. స్మగ్లర్లకి కడునమ్మకస్తుడిగా మారిన మంగయ్య, అనూహ్యంగా రాజకీయాల్లోకి రావడం, చకచకా పైకెదడగం వర్ణిస్తారు రచయిత. నాటి రాజకీయాలని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, 'మంగయ్య' ని పోల్చుకోవడం పెద్ద కష్టం కాదు. ఈ 'మంగయ్య'ని 'లోపలి మనిషి' లోనూ చూడొచ్చు. 

పుస్తకంలో ఉన్న రెండు కవితాల్లోనూ ఒకటి,  భారత స్వతంత్ర రజతోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో శాసన సభలో చదివింది. రెండోది తన ప్రియమిత్రుడు కాళోజీ నారాయణ రావు షష్టిపూర్తి సందర్భంగా అభినందిస్తూ రాసింది. వ్యాసాల్లో మొదటిది చివుకుల పురుషోత్తం తెలుగు నవల 'ఏది పాపం?' కి సూర్యనాథ ఉపాధ్యాయ హిందీ అనువాదానికి పీవీ హిందీలో రాసిన ముందుమాటకి తెలుగు అనువాదం. రెండోది 'వేయిపడగలు - పండిత ప్రశంస'. తన 'సహస్ర ఫణ్' కి రాసుకున్న ముందుమాటకి తెలుగు అనువాదం. మూడోది హిందీ కవయిత్రి మహాదేవి వర్మ షష్టిపూర్తి ప్రత్యేక సంచికకి రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం. సాహిత్యం పట్ల పీవీ 'దృష్టి' ఏమిటో తెలుసుకోవాలనుకునే వారికి ఇవి ఉపకరిస్తాయి. 

పుస్తకం చివర్లో ఇచ్చిన జీవన రేఖల్లో 'ప్రచురించిన రచనలు' జాబితాలో అనేక కథలు, కవితలు, నవలికలు అన్నారు. స్వయానా కూతురే ప్రచురించిన పుస్తకంలో కూడా ఇంతకు మించిన వివరాలు లేకపోవడం విషాదం. కనీసం ఎన్ని కథలు, కవితలు, నవలికలు అనే అంకెలు (సంఖ్యలు) కూడా ఇవ్వలేదు.  పీవీ తొలినాటి రచనలు కలం పేరుతో రాసినవే. 'గొల్ల రామవ్వ' ని 'విజయ' అనే కలం పేరుతో రాశారు. ఆయా రచనల వివరాలని ప్రకటించకపోతే మరుగున పడిపోయే ప్రమాదం ఉంది ఇందుకు కుటుంబ సభ్యులని మించి పూనుకోగలవారెవరు? రెండు ముద్రణలు పొందిన 'గొల్ల రామవ్వ' పుస్తకం 103 పేజీలు, వెల రూ. 100. ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. 

2 కామెంట్‌లు:

  1. నాకు ఊహ తెలిసినపటి నుండి నేను కొంత మంది రాజకీయ నాయకులను చూడటం జరిగింది. నా మూడో యేట గౌ. శ్రీ నందమూరి తారక రామారావు గారిని మా నాయనమ్మ తో వరంగల్ లోగల వర్ధన్నపేట లో వారి సభలోను, నా ఏడవ యేట గౌ. శ్రీ పాములపర్తి వేంకట నరసింహ రావు గారిని ఉక్కునగరం సెక్టర్ ౯ లో ఆరైయన్యల్ ను జాతికి అంకితమిచ్చిన సభలో చూడటం జరిగింది. అలానే గంగవరం పోర్ట్ ఇనాగరేషన్ చేసినాక శ్రీ యేడుగురి సందింటి రాజశేఖర రెడ్డి గారిని చూడటం జరిగింది. ఒకనొక సారి ఇండిగో ఫ్లైట్ లో సికింద్రాబాద్ పయనమపుడు అదే ఫ్లైట్ లో నా ముందు వరుసలో గౌ. నారా లోకేశ్ గారిని చూడడం జరిగింది, మురళి గారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పీవీని కలవలేక పోయానండీ.. ఒక్కసారైనా కలవగలిగితే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది. ధన్యవాదాలు.. 

      తొలగించండి