శనివారం, మే 16, 2009

ఝుమ్మందినాదం..

ఎదురుచూసిన ఎన్నిక ఫలితం వచ్చింది.. నేను రాష్ట్రం లో ఎవరు గెలుస్తారని ఎదురు చూడలేదు.. కేంద్రంలో ఏ కూటమి అధికారం లోకి వస్తుందా అన్న విషయంలో కూడా ఆసక్తి చూపించలేదు. గత కొద్ది రోజులుగా నేను ఎదురు చూస్తున్న ఒకే ఒక్క ఫలితం 'రాంపూర్.' అవును.. ఇంట ఓడిపోయి, రచ్చ గెలుస్తున్న రాజమండ్రి అమ్మాయి జయప్రద పొరుగు రాష్ట్రంలో రెండోసారి విజయం సాధించి తలెత్తుకుంటుందా, ఓటమితో తల వంచుకుని వస్తుందా? అన్న ప్రశ్న కొద్ది రోజులుగా నన్ను వెంటాడింది.

ముప్పయ్యేళ్ళ క్రితం జయప్రద నటించిన 'అంతులేని కథ' ఇవ్వాల్టికీ నా అభిమాన చిత్రాలలో ఒకటి. ఆ తర్వాత 'సిరిసిరి మువ్వ' 'సాగర సంగమం' ఇంకా మరికొన్ని సినిమాలు. ఐతే ఈ అభిమానం వెండితెరకే పరిమితం. చాలా మంది సిని నటుల్లాగే ఆమె రాజకీయాలలో ప్రవేశించినప్పుడు కొంచం ఆసక్తిగా గమనించాను. ఈమె కూడా 'చిలుక పలుకుల' తోనే రాజకీయ కెరీర్ మొదలుపెట్టింది. ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు రాజకీయాలలోకి వచ్చానని చెప్పిన జయప్రద 'వెన్నుపోటు' తర్వాత చంద్రబాబు నాయుడు వెంట ఉండడం కొంత ఆశ్చర్యపరిచింది.

రాజకీయాలకి ఆమె ఎంతవరకు 'సూటబుల్' అన్న ప్రశ్న పక్కన పెడితే, అప్పట్లో తెలుగు దేశం పార్టీ కోసం ఆమె కష్టపడిన మాట వాస్తవం. కొన్ని వివాదాలకూ ఆమె కేంద్ర బిందువయ్యింది. ఐతే ఆమె తెలుగుదేశం నుంచి బయటికి వెళ్ళిన పరిస్తితులు మాత్రం దారుణం. అత్యంత అవమానకర పరిస్థితుల్లో ఆమె పార్టీని విడిచి పెట్టాల్సి వచ్చింది. చాలా సెన్సిటివ్ గా కనిపించే జయప్రద ఇప్పుడేం చేస్తుంది, ఈ అవమానాన్ని ఎలా తట్టుకుంటుంది అనుకున్నాను నేను. ఆమె తలవంచుకుని బయటికి వెళ్ళిపోలేదు, అపజయాన్ని ఓ అవకాశంగా మలచుకుని జాతీయ రాజకీయాలలో ప్రవేశించింది.

ఐదేళ్ళ క్రితం జరిగిన ఎన్నికలలో సమాజ్ వాది పార్టీ తరపున ఆమె 'రాంపూర్' నుంచి పోటీ చేసినప్పుడు మరో రాంగ్ స్టెప్ వేస్తోందేమో అనుకున్నాను. బాలీవుడ్ సినిమాల పుణ్యమా అని అక్కడి ప్రజలకి ఆమె పరిచితురాలే అయినా ఆ అభిమానం వోట్లని తెచ్చిపెడుతుందా అన్న సందేహం ఉంది. సైకిల్ గుర్తుపై ఎంపీ గా గెలిచి పార్లమెంటులో ఆమె అడుగుపెట్టిన క్షణం లో జయప్రద తనను తాను నిరూపించుకుంది అనిపించింది. సహనటి శ్రీదేవితో తనకున్న గొడవల గురించి ఓపెన్ గా మాట్లాడిన సందర్భాలలో 'ఈమె ఇంత అమాయకురాలా?' అనిపిస్తుంది.

మొన్న తన పుట్టినరోజున 'నా వయసు పదహారు' అని ప్రకటించి మళ్ళీ వార్తల్లోకి వచ్చింది జయప్రద. రాంపూర్ టిక్కెట్ విషయంలో పార్టీ లో వచ్చిన గొడవల ఫలితంగా ఎన్నో తలనొప్పులనీ అనుభవించింది. రాజకీయనాయకులు ఎంతకైనా దిగజారతారనడానికి ఆమె ప్రత్యర్ధులు వేయించిన జయప్రద అశ్లీల పోస్టర్లే ఉదాహరణ. ఓ దశలో పోటీ నుంచి వైదొలగే నిర్ణయం తీసుకున్న జయప్రద మొండితనాన్ని ఆశ్రయించి ప్రచారం కొనసాగించింది. నిజానికి ఆమె గడిచిన ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చలేదు. పార్టీ లో ఇంటిపోరూ తక్కువేమీ కాదు. ఇంతటి వ్యతిరేక పరిస్థితుల్లో కూడా విజయ బావుటా ఎగరేసిన జయప్రద కి అభినందనలు.

8 కామెంట్‌లు:

  1. 'అంతులేని కథ' ,'సాగర సంగమం' నాకూ అభిమాన చిత్రాలే ....ముందు మీ ఆసక్తి చిత్రంగా అనిపించినా ....మీ విశ్లేషణ బావుంది .మా తరఫున కూడా మీ అభిమాన నటికి అభినందనలు .

    రిప్లయితొలగించండి
  2. ఒకప్పటి నా డ్రీం గర్ల్ జయప్రద గెలవడం నాక్కూడా చాలా సంతోషంగా వుంది.

    రిప్లయితొలగించండి
  3. తెలుగమ్మాయి జయప్రద రాంపూర్ లో గెలవటం హర్షదాయకం.

    రిప్లయితొలగించండి
  4. జయప్రదతో కలిసి చదువుకుని అమ్మమ్మైన మా కాంచనమాల అక్క సాక్షిగా చెప్తున్నాను ఆమె అందం ద్విగుణీకృతం అవుతుంది, "నా వయసు పదహారో, నా మనసు మహజోరో" అని చెప్పగల అర్హత ఆమెకివుంది. ఇకపోతే మన పురుషాధిక్య సమాజంలో స్త్రీలు అలా ప్రతిభని కనపరిచి, (వివాదాలు, నైతిక విలువలు అన్నవి అందరికి వర్తిస్తాయి కనుక - వాటి జోలికిపోవటం లేదు) పైకి రావటం నాకేంతో ఆనందం. కాకపోతే ఈమె నాకేదైన స్ఫూర్తినిస్తుందా అంటే లేదనే నా సమాధానం వస్తుంది. ఆరకంగా మరెన్నో వేవేలు వున్నారు. అసలు టపా విషయానికి వస్తే ఆమె గెలుపుకీ, మీ సంతసానికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. జయప్రద గెలుపు సంతొషం
    ఎంత అభివ్రుద్ది చెందినా ,
    స్త్రీ విషయంలొ..ఆమె,ను అవమానించె
    మార్గం ఆమె స్త్రీ త్వం ..ఎన్నొ విధాలు గా
    అవమానపద్ద ..గెలుపు మంచి పరిణామం .

    రిప్లయితొలగించండి
  6. @పరిమళం: ధన్యవాదాలు..
    @'శరత్'కాలం: మీ డ్రీం గర్ల్స్ జాబితా చాలా పెద్దదనుకుంటాను :) ...ధన్యవాదాలు.
    @సి.బి. రావు: ధన్యవాదాలు.
    @ఉష: అలనాటి జయప్రద (అప్పుడు లలితా రాణి) మీ అక్కగారి అనుభవాలు ఓ టపా రూపంలో పంచుకుంటారని ఎదురు చూస్తున్నానండి..
    @రిషి: అన్ని అవమానాలను ఎదుర్కొని ఆమె తనని తానూ నిరూపించుకోవడమే నాకు చాలా నచ్చిందండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. ఆమెపై జరిగిన చాలా హేయమైన దాడి చేశారు.
    ఆమె చాలా ఓర్పుతో, ధైర్యంతో ఎదుర్కుంది.
    అందుకు నిజంగా ఆమె అభినందనీయురాలు.

    రిప్లయితొలగించండి
  8. @భవాని: నిజమేనండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి