శనివారం, మే 09, 2009

నాయికలు-ప్రమద్వర

యండమూరి వీరేంద్రనాథ్ 'వెన్నెల్లో గోదారి' నవలని మొదటి సారి చదివినప్పుడు నాకు బాగా నచ్చిన పాత్ర ప్రమద్వర. ఆ తర్వాత ఆ నవలని చాలాసార్లు చదివాను. మొదటిసారి చదివినప్పటి ఉత్కంఠత లేదు, కథ తెలిసిపోవడం వల్ల. ఐతే ప్రమద్వర మీద ఇష్టంలో ఏమాత్రం మార్పు లేదు. కథ, కథనాల్లో నాటకీయత పాళ్ళు ఎక్కువగా ఉన్నట్టూ, ప్రమద్వర అతిమంచి తనాన్ని చూపించడం కోసం మరో నాయిక తరళ ను అతి మూర్ఖం గా చిత్రించినట్టూ అనిపించింది..అయినా కూడా ప్రమద్వర నచ్చింది.

గోదారొడ్డున ఉన్న ఓ పల్లెటూళ్ళో ఓ వేశ్య కూతురు ప్రమద్వర. పెద్ద అందగత్తె కాదు. తల్లిని ఎదిరించి డిగ్రీ చదివింది. తనని కులవృత్తిలోకి దింపాలన్న తల్లి ప్రయత్నాలని అడ్డుకుంది. ఆ ఊరికే కాక, చుట్టుపక్కల పదూళ్ళకి కోటీశ్వరుడైన జి.ఫై.రావు ఏకైక కూతురు తరళ, ప్రమద్వర ప్రాణ స్నేహితులు. చదువు పూర్తిచేసుకుని ప్రమద్వర తన భవిష్యత్తుని నిర్ణయించుకునే సమయానికి ఆమెకి ఆనందరావు పరిచయ మవుతాడు. చదువుకున్నవాడు. ఓ ఎరువుల కంపెనీలో సేల్స్ ఉద్యోగం చేస్తున్నవాడు.. అదే పల్లెలో ఉంటున్న వాడు.

ప్రమద్వర, ఆనందరావు నాటకీయంగా జరిగిన తొలి పరిచయంలోనే ఒకరినొకరు ఇష్టపడతారు..కానీ వ్యక్తపరుచుకోరు. మరోపక్క కూతుర్ని వృత్తిలోకి దింపే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది ప్రమద్వర తల్లి. ఆనందరావుని పెళ్లి చేసుకోవడం ద్వారా మురికూపం లాంటి ఇంట్లోనుంచి బయటపడా లనుకుంటుంది ప్రమద్వర. సరిగ్గా అప్పుడే తరళ కి ఆనందరావుతో పరిచయం అవుతుంది. తొలి పరిచయం లోనే తానతని ప్రేమలో పడిపోయానని ప్రమద్వరకి చెబుతుంది తరళ. తాను ఇష్టపడేదీ, పెళ్లి చేసుకోబోయేదీ ప్రమద్వరనే అని, ప్రమద్వరకి చెబుతాడు ఆనందరావు.

అటు ఆనందరావు కానీ, ఇటు ప్రమద్వర కానీ తామిద్దరం ప్రేమించుకుంటున్న విషయం తరళకి చెప్పరు. తను ఆనందరావుని ప్రేమిస్తున్నానన్న సంగతి తన తండ్రికి చెబుతుంది తరళ. కూతురు ఏనుగు బొమ్మ అడిగితే నిజం ఏనుగుని కొని తెచ్చే జి.పి. రావు పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఓ చిన్న మోసంతో ఆనందరావు ని తన అల్లుడిగా చేసుకుంటాడు. తప్పని పరిస్థితుల్లో తన మేనమాన భైరవమూర్తి ని పెళ్లి చేసుకుంటుంది ప్రమద్వర. జరిగిన మోసం తెలిశాక దాదాపు పిచ్చివాడవుతాడు ఆనందరావు.

ఆనందరావుని మనిషిని చేసి, తరళ కాపురం బాగు చేయడం కోసం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుంది ప్రమద్వర. అతనితో ఓ పందెం కడుతుంది. పాతికేళ్ళ తర్వాత మాత్రమే కలుసుకుందా మంటుంది. ఎన్నో కష్టాలు పడుతుంది. ఎదుటివారిని బాధపెట్టని దయాగుణం, కష్టపడే తత్త్వం, ఆత్మవిశ్వాసం.. ఈ మూడు గుణాలనూ విడిచి పెట్టకుండా తనవాళ్ళందరికీ దూరంగా జీవన పోరాటం చేస్తుంది ప్రమద్వర. కేవలం ప్రమద్వరకిచ్చిన మాట కోసం మామూలు మనిషవుతాడు ఆనందరావు. పాతికేళ్ళ తర్వాత ఆమె ఆనందరావుని కలిసిందా? పందెం గెలిచిందా? అన్నది నవల ముగింపు. చదవగానే శరత్ నవలలు గుర్తొచ్చే 'వెన్నెల్లో గోదారి' ని 'నవసాహితి' ప్రచురించింది. (అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు, వెల రూ. 50)

6 కామెంట్‌లు:

  1. పరిచయం బాగుంది. ఇది నేనూ చదివాను. ఈ నవల్లో యండమూరి శైలి కనిపించదెందుకో. ఏదో శరత్ బాబు నవల్లా వుంటుంది.

    రిప్లయితొలగించండి
  2. ఆ నవల పేరు చూసి ..దాని గురించి మీలాంటి ఓ స్నేహితుని వద్ద విని చదివాను ....ప్చ్ ...ఎందుకో నా మనస్సుని హత్తుకోలేదు .

    రిప్లయితొలగించండి
  3. యండమూరిగారి మార్కు అంతగా కనపడకపోయిన మాట నిజమే ! ఏదో సినిమాకు రాసిన కధలా ఉంటుంది . అయినా బహుశా రచయిత మీద అభిమానం , టైటిల్ నవల నచ్చేలా చేశాయి . మీరు పరిచయం చేసిన తీరు బావుంది .

    రిప్లయితొలగించండి
  4. @మెహర్, చిన్ని, పరిమళం: ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  5. Meeru raase stories intro bagunnayi. Avi ekkadanna online loo untee links ivvagalara ?? plz.

    రిప్లయితొలగించండి
  6. @andhrapilla: నాకు తెలిసినవి లింక్ ఇస్తున్నానండి..మరికొన్నింటికి బ్లాగు మిత్రులు తమ వ్యాఖ్యలలో లింకులు సూచిస్తున్నారు. ధన్యవాదాలు. అన్నట్టు మీకో సూచన.. ఈ లింక్ ఉపయోగించి మీరు తెలుగు లో రాయొచ్చు... https://www.google.co.in/transliterate/indic/telugu

    రిప్లయితొలగించండి