గురువారం, మే 07, 2009

సత్యభామ-చివరి భాగం

(సత్యభామ-1, 2 తర్వాత)
చెరువు గట్టు కిటకిటలాడుతోంది. చుట్టుపక్కల నాలుగైదు ఊళ్ళ నుంచి జనం వచ్చేశారు. నిజానికి ఊళ్ళో అమ్మవారి జాతరకి కూడా ఎప్పుడూ అంత జనాన్ని చూడలేదు ఊళ్ళో వాళ్ళు. భక్తుల ఆధ్వర్యంలో మైకులు ఏర్పాటయ్యాయి. గ్రామఫోన్ రికార్డులు మోగుతున్నాయి. కానీ జనం అంటా ఎవరి గొడవలో వాళ్ళు ఉన్నారు. 'నీళ్ళ మీద నడవడం సాధ్యమేనా?' అనే అంశం మీద వాదోపవాదాలు జరుగు తున్నాయి. 'మరి కాసేపట్లో సత్యభామ గారు మనూరి చెరువు మీద నడవబోతున్నరహో..' అని దండోరా బయలుదేరింది.

ఆవేళ సత్యభామ డ్యూటీ అమ్మ వాళ్ళది. అమ్మ, వాళ్ళక్క, చెల్లి. ముగ్గురూ పొద్దున్నే చద్దన్నం తిని బయలుదేరారు. 'బడెక్కడికీ పోదు కదా..ముందు ఈ సత్యభామ సంగతి చూసి అప్పుడు బళ్లోకి వెళ్దాం' అనుకున్నారు ముగ్గురూ. ఇంట్లో వాళ్ళెవరూ చూడడం లేదని నిశ్చయించుకుని, చెరువు గట్టున ఓ చెట్టు కిందకి చేరారు. వరద గోదారి నీటిమట్టంలా క్షణ క్షణానికీ జనం పెరుగుతున్నారు. పిల్లల్ని తీసుకుని ఎడ్ల బళ్లమీద దిగిపోతున్నారు చెరువు గట్టున.

కాఫీ హోటలూ, చిరు తిళ్ళు అమ్మే అంగళ్ళూ వెలిశాయి చెరువు గట్టున. సత్యభామ ఇంటి దగ్గర కోలాహలం గా ఉంది. భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. సత్తెమ్మ గారు ఉదయానే జామ చెట్టు (ఆవిడ భాషలో పొన్న వృక్షం) ఎక్కేశారు. కామాక్షి, వామాక్షి భజనలు మొదలు పెట్టారు. కుచేలుడు అప్పుడప్పుడు ఆశ్రమం నుంచి బయటికి వచ్చి 'మరి కాసేపట్లో అమ్మ చెరువు మీద నడుస్తారు' అని ప్రకటిస్తున్నాడు. మా అమ్మ వాళ్లకి మాత్రం అదంతా వింతగా ఉంది. 'ఆ నడిచేదేదో త్వరగా నడిచేస్తే మనం వెళ్లిపోవచ్చు కదా' అనుకుంటున్నారు వాళ్ళు.

చూస్తుండగానే మద్యాహ్నం అయ్యింది. భక్తుల రాక క్రమంగా తగ్గింది. దూరం నుంచి వచ్చిన వాళ్ళు తిరుగు ప్రయాణం ఆలోచనలో ఉన్నారు. పొద్దున్న తిన్న చద్దన్నం అరిగిపోయి అమ్మ వాళ్లకి ఆకలి మొదలైంది. చిరుతిళ్ళు దొరుకుతున్నాయి కానీ చేతిలో అర్ధణా లేదు. పోనీ ఇంటికి వెళ్ళిపోదామా అంటే తీరా ఇంటికెళ్ళాక నడుస్తుందేమో, మళ్ళీ రాడానికి కుదరదు అని బాధ. మిగిలిన వాళ్ళు తిండి ఏర్పాటు చూస్తారనుకుంటే వాళ్ళు బడినుంచి భోజనానికి వెళ్లి మళ్ళీ తిరిగి రాలేదు. ఈ గొడవకి బడికి ఓ పూట సెలవు ఇచ్చేశారు.

మైకులో పాటలు వస్తూనే ఉన్నాయి. సత్తెమ్మగారు పొన్న వృక్షం దిగడం లేదు. కాసేపు వేణువు ఊదుతూ, మరి కాసేపు ధ్యానం చేస్తూ గడుపుతున్నారు. భక్తులతో మాట్లాడడమే లేదు. పాద పూజలు కూడా అంగీకరించడం లేదు. "శ్రీ కృష్ణుల వారిపై అమ్మ అలిగారు. ఆ స్వామే వచ్చి అమ్మని బతిమాలుకుంటారు" అని కామాక్షి, వామాక్షి చెబుతున్నారని చూసి రాడానికి వెళ్ళిన మా పిన్ని అమ్మ వాళ్లకి చెప్పింది. "కృష్ణులవారు మనక్కూడా భోజనం ఏర్పాటు చేస్తే బాగుండునే.. ఒకటే ఆకలి" అన్నదట మా పెద్దమ్మ.

భక్తుల సంఖ్య బాగా తగ్గిపోయింది. పొరుగూరి వాళ్ళు వెళ్ళిపోగా, ఊళ్ళో పని లేని వాళ్ళు, ఇదేదో చూడాలని పట్టుదలగా ఉన్నవాళ్ళు మాత్రం ఉన్నారు చెరువు గట్టున. మరి కాసేపట్లో సూర్యాస్తమయం అవుతుందనగా కుచేలుడు వచ్చి ప్రకటించాడు. "ఇవాళ చెరువు మీద నడవొద్దని అమ్మని శ్రీ కృష్ణులవారు ఆదేశించారు. మళ్ళీ ఎప్పుడు నడిచేదీ, స్వామి అమ్మ ద్వారా సెలవిస్తారు.." సత్యభామని తిట్టుకుంటూ అమ్మ వాళ్ళు దొడ్డి దారిన ఇల్లు చేరుకున్నారు.

విచిత్రం ఏమిటంటే పొరుగూళ్ళ వాళ్లకి ఆ సాయంత్రం ఏం జరిగిందో తెలియదు. వాళ్లకి తెలిసిందల్లా చెరువు మీద నడుస్తానన్న సత్యభామ ప్రకటన. దానితే సత్యభామ చేరువుమీద నడిచిందనీ, చాలా మహిమ కలదనీ ప్రచారం జరిగిపోయింది. (శిష్యులే ఆ ప్రచారం చేశారని చాలామంది అనుమానించారట). దానితో సత్తెమ్మ గారిని ఇంటికి పిలిచి పాద పూజ చేసుకోడానికి జనం క్యూలు కట్టారట. పుట్టిన పిల్లలకి పేర్లు పెట్టడం మొదలు, గృహ ప్రవేశాలకి ముఖ్య అతిధిగా హారజవడం వరకూ సత్తెమ్మ గారి ప్రభ వెలిగిపోయిందిట. అసలు అదృష్టం కాకాసురుడుది, ప్రహ్లాదుడుదిదీను. వద్దంటే డబ్బు వాళ్లకి.

ఇప్పటికీ టీవీల్లో స్వామీజీల ప్రవచనాలు చూస్తూ అప్పుడప్పుడూ అమ్మ సత్యభామని తల్చుకుని బాధ పడుతూ ఉంటుంది. "అప్పట్లో ఇన్ని టీవీలు లేవు. లేకపోతె మా సత్తెమ్మ కూడా టీవీలో కనిపించును కదా.." అని. నాకు మాత్రం ఈ మాటలు టీవీ చానళ్ళ మీద సెటైర్లలా అనిపిస్తాయి, ఆవిడకి ఆ ఉద్దేశం లేకపోయినా..

9 కామెంట్‌లు:

  1. అప్పుడప్పుడు మనకి తెలియని మాయలో పడుతుంటాము చదువుకుని ,,ఆపై ఆలోచించే మనలాటి వాళ్ళు కూడా :)....బాగుందండి ...

    రిప్లయితొలగించండి
  2. మా చేత కూడ ఎదురుచూసేలా చేసారు....ఆవిడ ఏదో ఒక విధంగా నీటిపైన నడిచిందేమో అనుకున్నాను గానీ మరీ ఇలా తుస్..తుస్..డాం..డాం!! అనిపించేస్తుందనుకోలేదు.

    రిప్లయితొలగించండి
  3. మురళిగారు, కబుర్ల రూపంలో చెప్పాల్సిందంతా తీరిగ్గా , బాగా చెప్పారు. ఇప్పటికీ అమాయకులెంతమందో !

    రిప్లయితొలగించండి
  4. కథంతా ఒకెత్తు, మీ ముగింపు ఇంకో యెత్తు.
    భలే.

    రిప్లయితొలగించండి
  5. హు! మొత్తానికి ఏదో సాధించిన ఫీలింగ్...:)

    రిప్లయితొలగించండి
  6. వ్యాఖ్య రాసిన బ్లాగు మిత్రులందరికీ ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  7. మురళి గారూ..
    మొత్తం అన్ని భాగాలు చదివొచ్చానండీ.. చివరికి నీళ్ళపై నడవనేలేదా :-(
    అదేదో సామెత చెప్పినట్టు... ఇదిగో తోక అంటే అదిగో పులి సామెతలాగా మనం పుకార్లు తేవడంలో ముందు వరసలో ఉంటాం. అసలు తోక కూడా అవసరం లేదనుకుంటాలే... కదా.?
    మీరు మాత్రం ఒక సస్పెన్స్ త్రిల్లెర్ నవల రాయడానికి శ్రీకారం చుట్టచ్చు. ఆ పనిలో ఉండండి మరి.. :-)

    రిప్లయితొలగించండి
  8. @మధురవాణి: సీరియల్ :) :) ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. In the 60s, there used to be a famous haThayogi, Mr. Rao, in Bombay. He announced that he could walk on water. Googling about him showed the following.

    --
    The stage magician Milbourne Christopher recounts one of his experiences. ‘I was in India in 1966 when the newspapers announced that Lakshamanasandra Srikanta Rao, a hatha yogi who in the past had eaten nails, needles, razor blades, and glass, and who had walked on fire, would walk on water in Bombay. Some of the five thousand spectators paid as much as $70 for the choicest seats. An oblong concrete tank, twenty feet long and six feet wide, had been built for the occasion and filled with water. The white-bearded mystic ascended the steps to the edge of the basin. There he paused and prayed. With complete confidence he stepped on the surface of the water. As the huge audience gasped, Rao sank immediately to the bottom.’
    --
    Satyabhaama seemed to have fared much better :-)

    రిప్లయితొలగించండి