బుధవారం, జులై 30, 2014

కృష్ణవేణి-13

ఉగాది పండగ దగ్గర పడుతూండగానే ఊళ్ళో హడావిడి మొదలయ్యింది. గుడి దగ్గర లైటింగ్ పెడుతున్నారు. చిన్నచిన్న బల్బుల సీరియల్ దండలతో పందిరి వేస్తున్నారు కుర్రాళ్ళు. చందర్రావు దగ్గరుండి పని చేయిస్తున్నాడు.

తెల్లారితే మైక్ సెట్టు బిగించాలి. వ్యాపారంలోకి దిగాక ఊళ్ళో వచ్చిన మొదటి బేరం. పైగా దేవుడి కార్యం. నాలుగు డబ్బులు మిగుల్చుకోడం కన్నా, పేరు తెచ్చుకోడం మీదే దృష్టి పెట్టేడు.

మెడ్రాసు, బొంబాయి చూసొచ్చిన వాడని అప్పటికే అందరూ ప్రత్యేకంగా చూస్తున్నారు. బెల్బాటం ఫ్యాంట్లు, పూల చొక్కాలతో మాంచి హడావిడి చేసేస్తున్నాడు పెళ్లి కావాల్సిన చందర్రావు.

"ఇంట్లో లైటెలగడం లేదు. మొగోడికి ఇయ్యేయీ పట్టవు. ఓసారొచ్చి సూత్తావా?" చందర్రావు ముఖంలోకి చూస్తూ అడిగింది మంగళగౌరి.

చీకటి పడ్డాక వెళ్ళాడు. పడకగదిలో లైటు పది రోజులై పనిచేయడం లేదు. ముక్కాలిపీట మీద నిలబడి, బేట్రీ లైటు చూపించమన్నాడు.

"ఇయ్యింట్లో బేట్రీ లైటు కూడానా?" అని సాగదీస్తూ దీపం పట్టుకొచ్చింది. 

జేబులో ఉన్న టెస్టర్ తో హోల్డర్ పరీక్షిస్తున్న చందర్రావు ఎందుకో వెనక్కి తిరిగి చూసేసరికి దీపం వెలుగులో తనని కళ్ళతోనే తడిమి తడిమి చూస్తూ కనిపించింది మంగళగౌరి. మరుక్షణం పీటమీద నుంచి జారి పడబోయాడతను.

ఒంటి చేత్తో అతన్ని ఒడుపుగా పట్టుకుంది మంగళగౌరి. ఆమె రెండో చేతిలో ఉన్న దీపం ఒక్క క్షణం రెపరెపలాడి, మరుక్షణం ఆరిపోయింది. గంట తర్వాత రుమాలుతో ముఖం తుడుచుకుంటూ బయటికి నడిచాడు చందర్రావు.

అది మొదలు, ప్రతి సాయంత్రం శ్రద్ధగా తయారవ్వడం మొదలుపెట్టింది మంగళగౌరి. చాలా రోజుల తర్వాత పూలు బేరం చేసి కొనడమే కాదు, చీకటి పడుతూనే స్నానం చేసి, చాకింటి చీర, జడలో పూలతో సిద్ధమవుతోంది.


ఓ పక్క లైటింగు, మైకుసెట్టు చూసుకుంటూనే,  కాస్త రాత్రవ్వగానే వచ్చి తలుపు కొడుతున్నాడు చందర్రావు. బొంబాయి నుంచి కొని  తెచ్చుకున్న సెంట్లు, కొత్త మోడల్ బనీన్లు బయటికి తీశాడు. పండగ హడావిడి పూర్తయ్యి, లైటింగ్ విప్పే నాటికి మంగళగౌరి ఇంట్లోకి నేరుగా వచ్చేసేంత చనువొచ్చేసింది చందర్రావుకి.

వాళ్ళిద్దరి రహస్యం ఆ వీధిని దాటి, ఊరి పొలిమేరని చుట్టే సమయానికి సూరమ్మ ఎదురుగా  కూర్చుని ఉన్నాడు రంగశాయి.

"అమ్మకి రోజులైపోయేయి.. ఎల్లిపోయింది..  పోయిందాంతో మనవూ పోలేం కదరా బాబా.. ఇలగైపోతే ఎలాగరా తమ్ముడా," తమ్ముణ్ణి చూసి బావురుమంది సూరమ్మ.

రాజాబాబుని ఆడిస్తున్న రంగశాయి పట్టి చూస్తే తప్ప గుర్తుపట్టలేని విధంగా ఉన్నాడు. మనిషి చిక్కిపోయాడు. మాసిన తల, గడ్డం, లోతుకి పోయిన కళ్ళు.. ఎప్పుడూ ఏదో పరధ్యానం.

చిన్న కూతురి పెళ్లి ముహూర్తం దగ్గర పడడంతో పనులతో ఊపిరి సలపడం లేదు సూరమ్మకి.

"పండగొచ్చెల్లింది.. నీకేవన్నా తెలిసిందేరా?" టీ ఇస్తూ అడిగిన ప్రశ్నకి జవాబు రాలేదు.

"సూసుకుని తొక్కరా సైకిలు.. బుర్రెక్కడో ఎట్టుకుంటే రోడ్డు మీద కట్టంరా బాబా," సైకిలెక్కిన రంగశాయికి జాగ్రత్త చెప్పింది సూరమ్మ.

రాజాబాబు ని చూడ్డానికి వెళ్లి వచ్చినట్టు తెలిసి రంగశాయి మీద విరుచుకు పడిపోయింది మంగళగౌరి.

"పాల్డబ్బా కొంటం సేతకాదు కానీ, పేవలు మల్లీనీ.. ఈటికేం లోట్లేదు మనకి.." తను అనదల్చుకున్నవన్నీ అనేసింది కానీ, రంగశాయి విన్నట్టు లేడు.

"నీతో మాట్టాడినా ఒకటే.. గోడతో మాట్టాడినా ఒకటే.. అంత మాట్టాన్నోడివి ఇంటికెందుకూ రాటం? నీకోసం ఇక్కడెవులూ ఎదురు సూసెయ్యటం లేదు.."

పరాగ్గా ఉన్న రంగశాయి ఒక్కసారి తేరిపార చూశాడు మంగళగౌరిని. అతన్ని సాధిస్తూనే అన్నం కంచం తెచ్చి ముందు పెట్టింది. ముద్ద కలిపి నోట్లో పెట్టుకుంటున్నా ఆమె నోరు మూతపడలేదు. కాసేపు అన్నం కెలికి చెయ్యి కడిగేసి, సినిమా హాలుకి బయల్దేరాడు.

ఎక్కడో ఆలోచిస్తూ రిజర్వుడు గేటు దగ్గర టిక్కెట్లు చించుతున్న రంగశాయి ఉన్నట్టుండి ఉలిక్కి పడ్డాడు. తన ఎదురుగా ముగ్గురు ఆడవాళ్ళు.. మధ్యలో ఉన్నది కృష్ణవేణి!  ఆమె కూడా పరాగ్గానే ఉంది. రంగశాయిని చూడనేలేదు.

వాళ్ళు లోపలి వెళ్ళాక, కర్టెన్ కొద్దిగా తప్పించి ఎక్కడ కూర్చున్నారో చూశాడు. అతని కళ్ళలోకి నెమ్మది నెమ్మదిగా వెలుగొస్తోంది. ఇంటర్వెల్ టైం కి పూర్తిగా మనుషుల్లో పడ్డాడు రంగశాయి. కేంటీన్ కి వెళ్లి మూడు ఆర్టోస్ డ్రింకు సీసాలు తీసుకున్నాడు.

ఇంటర్వల్ బెల్ మోగగానే, నేరుగా వాళ్ళ సీట్ల దగ్గరికి వెళ్లి ముగ్గురి చేతుల్లోనూ కూల్డ్రింక్ సీసాలు పెట్టాడు. అప్పుడు చూసింది కృష్ణవేణి రంగశాయిని పరీక్షగా. అతన్ని గుర్తు పట్టిన సూచనగా ఆమె కళ్ళలో చిన్నగా మొదలైన వెలుగు పెరిగి పెద్దదైంది.

"ఎంత కట్టపడ్డా అక్కని బతికిచ్చుకోలేపోయేను. ఇక్కడకి తీస్తెచ్చుకుందారంటే రానని గొడవ. డాట్టర్ల కాడికి తిప్పేను... వొయిజ్జం సేయించేను. సివరాకరికి ఈ సేతుల్లోనే దాన్సివర్రోజులు ఎల్లిపోయేయి.. మాయమ్మ కన్న సంతానంలో నేనొక్కద్దాన్నే అయిపోయేను," రంగశాయి భుజం మీద తలపెట్టుకుని ఉద్వేగంగా చెబుతోంది కృష్ణవేణి. ఆమె ఇంట్లో ఉన్నారు ఇద్దరూ. 

"నువ్వేటిలా అయిపోయేవు?" అడిగింది ఉన్నట్టుండి. తన తల్లి అనారోగ్యం మొదలు తను రాజమండ్రి వెళ్లి రావడం వరకూ అన్నీ వివరంగా చెప్పాడు రంగశాయి.

"నువ్వు మల్లీ రామిండ్రీ రాపోయేతలికి నాకేం తెల్లేదు.  ఇంతలోకే అక్కలా సేస్సింది.. మొన్నే వొచ్చేనిక్కడికి.. ఊసూ పలుకూ లేకుండా కూకుంటన్నానని మా సిన్నమ్మోల్ల పిల్లలు బలంతాన సినిమాకి లేవదీసేరు.. రాటం మంచిదే అయ్యిందిలే.. ఉండు, వొంట సేత్తాను.."

వంటగదిలోకి వెళ్ళిన కృష్ణవేణిని, ఖాళీ బియ్యం డబ్బా పలకరించింది.

(ఇంకా ఉంది) 

2 కామెంట్‌లు:

  1. మంగళగౌరికి హీరో దొరికేసాడన్నమాట! భలే ట్విస్ట్ కదా!

    మన హీరో జీవితంలోకీ ఆర్టోస్ డ్రింక్ తో వెలుగొచ్చేసినట్టుంది. నైస్!! :)

    రిప్లయితొలగించండి
  2. @కొత్తావకాయ: 'ఆర్టోస్ డ్రింకుతో వెలుగు..' హహ్హా.. వెలుగొచ్చాకే డ్రింక్ అండీ :)) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి