శుక్రవారం, జులై 11, 2014

కృష్ణవేణి-5

రిహార్సల్ జరిగే పెంకుటిల్లు రోజూ కన్నా కోలాహలంగా ఉంది. వీధరుగు నిండా జనం నిలబడిపోయి ఉన్నారు. ఎప్పుడూ లేనిది వీధి గుమ్మం తలుపు లోపల నుంచి గడియ వేసేసి ఉంది. ఉన్న రెండు కిటికీల దగ్గరా  ఒకరినొకరు తోసుకుంటూ లోపలికి తొంగి చూస్తున్నారు పిల్లా పెద్దా. 

లోపలున్న పెద్ద వసారాలో ఉన్న నాలుగు కుర్చీలూ  ఓ గోడ వారకి వేసి ఉన్నాయి. పంతులుగారు, మరికొందరు వాటిలో కూర్చుని ఉన్నారు. మరో గోడ వార పరిచిన చాపల మీద నటులు కూర్చుని ఉన్నారు. కృష్ణవేణి, రంగశాయి, నారాయణరావు ఓ పక్కగా నిలబడి చూస్తున్నారు. 

కొంగు చుట్టూ తిప్పి, చీర కుచ్చిళ్ళతో కలిపి రొంటిన దోపి మెరుపు తీగలా డేన్స్ చేస్తోంది రమాదేవి. పచ్చని పసిమి ఛాయ. చెయ్యెత్తు మనిషి. ఎత్తుకు తగ్గ బరువు. ముక్కుపొడుం రంగు సాదా చీర కట్టుకుంది. మెళ్ళో పసుపుతాడు లోపలికి, కట్టుతీగకి  చుట్టిన ముత్యాల దండ పైకీ వేసుకుంది. పిలక జడలో పువ్వులు పెట్టుకోలేదు.

భుజాలు, నడుము కదిలిస్తూ ఉన్న ఆ కాస్త చోటులోనే గిరగిరాలు తిరుగుతూ రమాదేవి డేన్స్ చేస్తుంటే చూస్తున్న అందరూ రెప్ప వెయ్యడం మర్చిపోయారు.ఇంకొక్క మాట చెప్పాలంటే, ఆ పూట కృష్ణవేణి ని చూసినవాళ్ళు ఎవరూ లేరు. ఆమె కూడా రమాదేవి డేన్స్ నే చూస్తోంది, తదేకంగా.డేన్స్ ముగించి, పైట కొంగుతో ముఖం తుడుచుకుంటూ పంతులు గారి దగ్గరకి వచ్చి నిలబడింది రమాదేవి. 

"నా యిజ్జ మీకు తెలంది కాదు బాబుగోరూ. మాటనుకునే ముందు సేసి సూపింతం ఇదాయకం గదా. మీరే పాటంటే అది. ఎల్లారీస్వరి రికార్డులన్నీ ఉన్నాయి నా కాడ. పలానీ పాటకి డేన్స్ కట్టు రమాదేవీ అనండి.. రెండో మాట లేకుండా సేత్తాను," చేతులు జోడించింది.

"ఉంకో మాట.. ముందే సెప్పలేదనేరు.. మీరింకా నాటకం లైటింగుకి ఎవర్నీ బుక్ సెయ్యలేదంట గదా. ఆ బుకింగు కూతంత మా మాయకి ఇప్పిచ్చేరంటే..." ఆమె మాట పూర్తవుతూ ఉండగానే పంతులు గారు లేచి నిలబడ్డారు. ఆ వెంటే మిగిలిన పెద్ద మనుషులు కూడా. వాళ్ళతో పాటు రమాదేవి, మాయ  పెరటివైపుకి వెళ్ళారు. 

"చూడమ్మా రమాదేవీ.. కుర్రాళ్ళు సరదా పడుతున్నారని నాటకం వేస్తున్నాం తప్ప బాగా డబ్బులుండి కాదు. పందిట్లో మిగిలిన కార్యక్రమాలన్నీ షరా మామూలే. ఇది ఎగస్ట్రా ప్రోగ్రాం. ఇప్పటివరకూ కృష్ణవేణికి ఇస్తున్నదొక్కటే ఖర్చు మాకు. ఆ అమ్మాయిది హీరోయిన్ వేషం.. ఏదో తిప్పలు పడుతోంది.. నీకున్నది ఒక్క పాటే.. మరి నీ తాంబూలం విషయం, లైటింగ్ విషయం ఓ మాట అనేసుకుంటే.." పంతులు గారి మాట పూర్తవ్వలేదు.

"ఎంతమాట బాబుగారూ. డబ్బు మడిసినా నేను? మీ ఊరోళ్ళు మరేదత్తులని లక్ష్మి సెప్పింది. పెల్లయ్యిందాన్ని బాబూ.. పొట్ట తిప్పల కోసం ఈ డేన్సులు..మరేద ముక్కెం. అయినా ఆడదానికి అన్నేయం సేసే మడుసులా మీరు? ఈ ఆడదాని సొమ్ము మీకెందుకు?" రమాదేవి ఇంకా మాట్లాడేదే.. 

"ఎహె.. అయ్యన్నీ కాదు.. పోగ్రాంకి ఎంతిమ్మంటావో సెప్పు ముందు?" ఓ పెద్దమనిషి కస్సుమన్నాడు. రమాదేవి చెప్పిన అంకె విని ఉలిక్కి పడ్డారు అందరూ.

"ఏటమ్మా? ఏటసలు? సినిమా స్టారు రేటు సెప్పేత్తన్నావ్.. ఈరోయిన్ ఏసానికి బుక్ సేసిన కృష్ణేనికే అంత రేట్లేదు.. ఒక్క పాటకి.. మరీ అన్నేయం రమాదేవీ.." ఆ పెద్దమనిషే మాట్లాడాడు. అరగంట తర్వాత రమాదేవి తాంబూలం, లైటింగ్ చార్జీల బేరం పూర్తయ్యింది. 

"బాబుగోరూ, మీ ఊల్లో ఆడాలన్సెప్పి శానా తక్కూకి ఒప్పుకున్నాను.. ఎంతిత్తన్నారో బయటికి రాకండా సూడండి కాంత.." అంది రమాదేవి. 

"వీళ్ళకి నాలుగు పాటలున్నాయి. నువ్వో నాలుగు స్టెప్పులు నేర్పి వెళ్తే బావుంటుందమ్మా. మధ్యలో ఓ రోజు వీలు చేసుకుని వచ్చావంటే ఇంకా సంతోషం," అన్నారు పంతులుగారు. 

"మీరింతలా సెప్పాలా బాబుగారూ.. మన కారేక్రమం కదా.. నాకూ బాజ్జెత ఉన్నాది కదా," అంటూనే హీరోలకీ, హీరోయిన్ కీ డేన్స్ మెళకువలు నేర్పడం మొదలుపెట్టింది రమాదేవి.


ఇక ఆ పూటకి జనమంతా ఆకలి దప్పులు మర్చిపోయారు. వాళ్ళ కళ్ళూ, నోళ్ళూ తెరచుకునే ఉండిపోయాయి సాయంత్రం వరకూ. అందరికీ దండాలు పెట్టి, వాళ్ళ మాయ సైకిలెక్కేసింది రమాదేవి. అదిగో అప్పుడు తిరిగింది అందరి దృష్టీ కృష్ణవేణి వైపు.

కట్టుకున్న నీలం చీర కాస్త నలిగి ఉంది. జాకెట్ తడిసి ఒంటికి అతుక్కుపోయింది. పూలదండలో పూలు చాలా వరకూ రాలిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే లంఖణం చేసిన దానిలా అయిపోయింది కృష్ణవేణి. 

"డేన్సింగ్ అలాట్లేదు కదా కృష్ణేనీ నీకు.. ఉంకోసారి సేత్తే అలాటైపోద్ది.. మేవంతా ఉన్నాం గదా.. గాబరడిపోకు," ధైర్యం చెబుతున్న సత్యమూర్తిని ఏమాత్రం పట్టించుకోలేదు. 

"రేయ్ సచ్చెవా.. కృష్ణేనికి కాంత టీ ఉన్నాదేమో సూడ్రా," ఈ పురమాయింపుని విననట్టుగా ఊరుకున్నాడు 'మేకప్' సత్యం. 

"ఉండిపోవచ్చు కదా.. పలావు సెయ్యింతాను," పాత పాటే మళ్ళీ పాడాడు సత్యమూర్తి. 

తనని కాదన్నట్టుగా ఊరుకుని, నేరుగా రంగశాయి దగ్గరికి వెళ్లి "కూతంత మా ఇంటికాడ దింపేద్దురూ నన్ను.. సీకటడిపోతంది" అంది కృష్ణవేణి. రంగశాయికి ఒక్క నిమిషం ఏమీ అర్ధం కాక చుట్టూ చూశాడు. ముందుగా తేరుకున్నది సత్యమూర్తే. 

"డేన్స్ కట్టి సిరాగ్గా ఉన్నట్టున్నాది కృష్ణేనికి. బేగీ దింపేసి రారా సాయిగా," అన్నాడు చుట్ట వెలిగించుకుంటూ.

పదినిమిషాల్లో ఊరి పొలిమేర దాటింది సైకిలు. మట్టి రోడ్డు పక్కనే పంట కాలవ. రెండు వైపులా పంట కెదిగిన వరిచేలు. వాటి పొలిమేరల్లో దూరంగా కనిపిస్తున్న కొబ్బరి తోటలు. చల్ది పొద్దు తిరిగింది. గబగబా సైకిలు తొక్కుతున్నాడు రంగశాయి.

"ఓపాలి ఆగుదారి," సైకిలెక్కాక కృష్ణవేణి మాట్లాడిన మొదటి మాట అది. సైకిలాపి అయోమయంగా చూశాడు రంగశాయి. 

"ఎదర కూకుంటాను," అంది కృష్ణవేణి. భుజానున్న తువ్వాలు తీశాడు. 

"సచ్చిమూర్తి గోరెప్పుడూ పలావనో, నీసు కూరనో అంటానే ఉంటాడు..ఏటో గానీ మరీ," అంది కబుర్లు మొదలెడుతూ. 

"ఎల్లి సూడోపాలి.. నీకే తెలుత్తాది," నవ్వాపుకుంటూ అన్నాడు.

"ఊకే బుజాలు, నడువూ తిప్పేసుకుంటే డేన్స్ అయిపోతాది కామాల.." కక్షగా అంది. 

"ఏటోలే.. క్లబ్బు సాంగంట. మన్దేటీ లేదు గదా.. నియ్యైతే మొత్తం నాలుగు డేన్సులు,"  లెక్క పెట్టాడు. 

"ఒప్పుకున్నాక తప్పుతాదా?" ముభావంగా అంది కృష్ణవేణి. ఇల్లొచ్చింది. సైకిలు దిగలేదు రంగశాయి. 

"బెట్టుసరి కామాల.. ఎవురు బతివాల్తారు బాబా మొగోన్నీ.." దీర్ఘం తీస్తూండగా, నవ్వుతూ సైకిలు దిగాడు. ఆమె తాళం తీస్తుంటే, గుమ్మంలో ఉన్న తామరాకు పొట్లాన్ని వంగి అందుకున్నాడు. 

"మాయాయినప్పుడే ఒచ్చెల్లిపోయాడు. ఈ రిగాల్సలు కాదు కానీ, ఆడి మొకం సూసి ఎన్నాల్లైపోతందో.."

చాలా ప్రశ్నలే అడగాలనుకున్న రంగశాయి పెదవి విప్పలేదు. 

"ఒల్లు పులిసిపోయింది బాబూ.. ఉడుకు నీల్లెడతాను.. తానం సేద్దారి.." కొంటెగా నవ్వింది కృష్ణవేణి. 

(ఇంకా ఉంది)

2 కామెంట్‌లు:

  1. కథనంతో దృశ్యాన్ని కళ్ళక్కట్టిస్తూనే ఫోటోతో మరింత బాగా తీర్చిదిద్దుతున్నారండీ. Apt అసలు! :)

    రిప్లయితొలగించండి
  2. @కొత్తావకాయ: ఫోటోల సంగతి మావాళ్ళు చూసుకుంటున్నారండీ.. క్రెడిట్ వాళ్ళదే!! ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి