"ఏటమ్మగోరూ.. నే యిన్నది నిజవేనా? మనూల్లో మల్లీ నాటకం
ఆడతన్నారంట.." చాకింటి రేవు నుంచి తెచ్చిన బట్టలు లెక్కపెట్టి పక్కన పెడుతూ
అడిగింది రత్తాలు.
"నీ అమ్మ కడుపు బంగారం గానూ.. అప్పుడే నీదాకా
వచ్చేసిందిటే.." నవ్వుతూ అడిగింది సరస్వతమ్మ.
"మాట దాగుద్దేటమ్మా.. అయినా
మనూరెంత? మొత్తం కలిసి ఐదొందల గడపన్నా ఉంటాదో, లేదో.. ఇంక రగిస్సాలు కూడానా?"
తడువుకోలేదు రత్తాలు.
"పంతులు గారివి నాలుగు పేంట్లు, ఆరు చొక్కాలు, మూడు
పంచెలు పొడిస్త్రీ. రెండు దుప్పట్లు, నాలుగు తువ్వాళ్ళు ఉతుక్కి," కేలండర్
వెనకాల రాసిపెట్టుకున్న పద్దు చూసి చెప్పింది సరస్వతమ్మ.
"ఈపాలెవులో కిట్నేనంట గదమ్మా.. ఆడ మడిసి ఒక్కిర్తేనంట.. గత మాటు
గావాల లచ్చివి అని ఆడ మడిసి, ఐదారు మంది మొగోల్లూ ఒచ్చి ఆడేరు నాటకం,"
రత్తాలు గుర్తుతెచ్చుకుంది.
"అవునే.. ఈసారి మనూరి వాళ్ళే ఆడుతున్నారు. హీరోయిను వేషానికి మాత్రం అమ్మాయిని తీసుకొచ్చారు. చిన్న మావగారిల్లు ఖాళీగానే ఉంది
కదా.. అక్కడే రిహార్సలో ఏదో చేసుకుంటున్నారు," తనకి తెలిసిన సంగతులు చెప్పింది సరస్వతమ్మ.
"ఎట్టెట్టా? అంతా మనూరోల్లేనా! ఈల్లకేం
ఒత్తాదమ్మా నాటకం ఎయ్యడం? డేన్సులు కట్టగల్రా ఒకుల్లైనా? అసలు మనూల్లో
ఎన్టీ వోడిలాగా డేన్సు కట్టే మొగోడు ఉన్నాడా అనీ.." దీర్ఘం తీసింది
రత్తాలు.
"చూద్దూగాని లేవే.. ఉగాది పండక్కి వేసేస్తారు కదా.. నీకు సరదాగా ఉంటే
రిహార్సలు చూసెడుతూ ఉందువు," బియ్యం కొలుస్తూ అంది సరస్వతమ్మ.
"కూతంత పచ్చడి బద్దెట్టండమ్మా.. నోరు సవి సచ్చిపోయింది," బియ్యం
మూటకట్టుకుంటూ అడిగింది రత్తాలు.
అరిటాకు ముక్కలో చుట్టబెట్టిన ఊరగాయని
జాగ్రత్తగా అందుకుంటూ "అమ్మా, సిన్న మాట" అంది గొంతు తగ్గిస్తూ. ఏవిటన్నట్టు చూసింది సరస్వతమ్మ.
"సాకల్దాని మాటని ఒగ్గీయకండి.. పంతులుగోరు
బంగారం.. ఆ బాబుని అనుకుంటే కల్లోతాయి.. కానమ్మా అవతల ఆడ మడిసి.. పైగా ఆ
ఊరి మడిసి.. మీ జాగర్తలో మీరుండండి. ఇలాగనీసినానని అనుకోకండి..బెమ్మకైనా
పుట్టును రిమ్మ తెగులు.. కీడెంచి మేలెంచాల.. వొస్తానమ్మా.."
రత్తాలు
వెళ్ళిన వైపే చూస్తూ పరధ్యానంగా నిలబడిపోయింది సరస్వతమ్మ. గతేడాది నాటకంలో
హీరోయిన్ వేషం వేసిన లక్ష్మికి ఇంట్లో ఓ పూట భోజనం పెట్టి,
పడుకోనిచ్చినందుకే తోడబుట్టిన వాళ్ళతో సహా అందరూ తనని తప్పు పట్టారు.
జాగ్రత్తలు చెప్పారు.
అయిందేదో అయిపోయిందిలే అనుకుంటూ ఉంటే ఇప్పుడు
మళ్ళీ నాటకం.. హీరోయినూ. తాడిచెట్టు కింద నిలబడి పాలే తాగినా, లోకం అనేది
ఒకటి చూస్తూ ఉంటుంది కదూ.. ఇంట్లో మగాడికి తెలీదో, తెలిసినా పట్టించుకోడో
అర్ధం కాదు.. దెబ్బలాడాల్సిన విషయాలా ఇవి? అలా అని ఊరుకుంటే.. ఎంతకాలం ఇలా?
..వీధిలోంచి వస్తూ పంతులుగారు కనిపించే వరకూ ఆవిడ ఆలోచనలు సాగుతూనే
ఉన్నాయి. ఆయన్ని చూస్తూనే గిరుక్కున తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది.
"వంటయ్యిందా? బోయినాలు చేశాక రిహార్సల్స్ పెట్టుకుందాం అంటున్నారు వాళ్ళు..
కొత్త మోజు కదా..." ఆయన మాటలు పూర్తికాకుండానే పీట వాల్చింది సరస్వతమ్మ.
"భాస్కర్రావు పాలంపుతానన్నాడు. వచ్చాక కాస్త టీ పెట్టి పంపు. పది
పన్నెండు మంది ఉంటారు మొత్తం," వెండి భరిణె లో ఉన్న వక్క పలుకు తీసుకుంటూ
అన్నారు పంతులు గారు. ఆయన తిన్న కంచంలో ఆవిడ అన్నం వడ్డించుకుంటూ ఉండగానే
రిహార్సల్ కి రమ్మంటూ కబురొచ్చింది.
అందరూ ఆయన్ని చూస్తూనే లేచి నిలబడ్డారు. ఆకుపచ్చ రంగు ఉలిఉలీ చీరకట్టుకుంది
కృష్ణవేణి. తలంటిన జుట్టుకి సవరం చేర్చకుండా జడవేసి, కనకాంబరాల మాల, గులాబీలతో
సింగారించింది. ముఖం మీద పడుతున్న జుట్టుని వెనక్కి
తోసుకుంటూ, చేతికి కొత్తగా పెట్టుకున్న రిస్టు వాచీని మాటిమాటికీ చూసుకుంటోంది .
నారాయణరావుకీ కృష్ణవేణి కీ లవ్ సీను. పంతులు గారు సీను చదివి వినిపించి
వాళ్ళిద్దరినీ నటించమన్నారు. ఇద్దరూ ఒకళ్ళ మొఖం ఒకరు
చూసుకున్నారు మొదట. తర్వాత చుట్టూ చూశారు. అందరూ చూస్తూ ఉండడంతో మళ్ళీ
ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుని, కూడబలుక్కున్నట్టుగా ఇద్దరూ బిక్క మొహాలతో పంతులు
గారిని చూశారు.
ఆయన విడివిడిగా రెండు పాత్రలూ చేసి చూపించారు. మళ్ళీ
చెయ్యమన్నప్పుడు కృష్ణవేణి కాస్త పర్వాలేదు కానీ, నారాయణరావు మరీ
తేలిపోతున్నాడు. అతన్ని జాగ్రత్తగా చూడమని చెప్పి, కృష్ణవేణి తో
కలిసి ఆ సీన్ నటించారు పంతులు గారు. ఆయనలా కృష్ణవేణి చేతులు పట్టుకుని
డైలాగులు చెప్పడం ఏదోగా అనిపించింది అక్కడున్న వాళ్ళలో కొందరికి. అయితే,
ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఈసారి కాస్త పర్లేదనిపించాడు నారాయణరావు.
"పర్వాలేదు పర్వాలేదు.. కొత్తకదా.. నాలుగు సార్లు చేస్తే అదే వచ్చేస్తుంది," ధైర్యం చెప్పారు పంతులు గారు.
మాట్లాడకుండా వెళ్లి నారాయణరావు సైకిలెక్కింది కృష్ణవేణి. రిహార్సల్ లో డైలాగు చెప్పడానికి నోరు పెగలని నారాయణరావు, సైకిలు ఊరు దాటకముందే మాటల్ని కోటలు దాటించాడు.
"పర్వాలేదు పర్వాలేదు.. కొత్తకదా.. నాలుగు సార్లు చేస్తే అదే వచ్చేస్తుంది," ధైర్యం చెప్పారు పంతులు గారు.
రెండో సీను రిహార్సల్
అవుతూ ఉండగానే టీ వచ్చింది. గ్లాసుల్లో పోసిచ్చాడు సత్యం. ఏదో వంకన
కృష్ణవేణిని పలకరించాలని అందరికీ ఉంది. కానీ, పంతులు గారి భయానికి ఎవరూ
నోరిప్పడం లేదు. సత్యమూర్తి నోరు తెరిచాడు.
"ఎప్పుడూ స్టేజీ
ఎక్కలేదన్నావ్.. రిహాల్సలింగే అదరగొట్టేత్తన్నావ్ గదా కృష్ణేనీ.."
సత్యమూర్తిని
ఓరగా చూసి, ముసిముసిగా నవ్వుతూ పైట సర్దుకుంది కృష్ణవేణి. ఓ
గంట తర్వాత, ఆవేల్టికి రిహార్సల్ పూర్తయ్యింది అన్నారు పంతులుగారు.
కృష్ణవేణిని ఎవరు దింపాలి? అప్పుడు గుర్తొచ్చాడు రంగశాయి అందరికీ.
"సాయి
గాడు రాలేదా ఇయ్యాల?" అన్నాడు సత్యమూర్తి. ఎటో చూస్తూ ఊరుకుంది కృష్ణవేణి.
"ఒరే నారాయనా.. కూతంత ఆ పిల్లని ఆల్లింటికాడ దింపేసి ఒచ్చెయ్ రా.. మీ
ఇంట్లో నే సెప్తాన్లే," మళ్ళీ సత్యమూర్తే అన్నాడు.
మాట్లాడకుండా వెళ్లి నారాయణరావు సైకిలెక్కింది కృష్ణవేణి. రిహార్సల్ లో డైలాగు చెప్పడానికి నోరు పెగలని నారాయణరావు, సైకిలు ఊరు దాటకముందే మాటల్ని కోటలు దాటించాడు.
"మా వాడకట్టు మొత్తానికి హైస్కూల్లో
సదివింది నేనొక్కన్నే
తెల్సా.. మావోల్లు దూరవని పంపలేదు కానీ లేపోతే కేలేజీక్కూడా ఎల్లేవోన్ని..
అప్పుడంటే ఊరుకున్నాను కానీ, ఉప్పుడు నా మాటే పైనలు మా ఇంట్లో.. మాయమ్మ,
నాన,
మాయావిడ.. అందరికీ నామాంటంటే మా సెడ్డ గురి..." అతను చెబుతున్న కబుర్లలో
సగం గాల్లో
కలిసిపోతున్నాయి.
కబుర్లేవీ వినకపోయినా, అతనికి వినిపించేలా మధ్య మధ్యలో
"ఊ.. ఆ.." అంటోంది. నారాయణరావు బాల్యం, తొలియవ్వనం ఇంకా
పూర్తవ్వనేలేదు, కృష్ణవేణి ఇల్లు దగ్గర పడింది.
"ఆపేయ్..
ఆపేయ్.. ఇక్కడ
దిగిపోతాను.. నీ సైకిలెక్కి వొచ్చినట్టు తెలిత్తే మా నాన్నగారు
కోపంసేత్తారు బాబూ.." అంది, నారాయణరావు నిరాశని ఏమాత్రం పట్టించుకోకుండా.
"ఎల్లొచ్చీ.. సందలడి పోతంది.. మీ వోల్లు సూత్తా ఉంటారు.." అంటూ అతన్ని
సాగనంపి, తన ఇంటివైపు నడిచింది.
తాళం వేసిన గుమ్మం, గడప దగ్గర తామరాకు
పొట్లం పలకరించాయి కృష్ణవేణిని.
(ఇంకా ఉంది)
బావుందండీ.. తరువాతి ఎపిసోడ్ రేపా?
రిప్లయితొలగించండిఓను సొంతం ష్టోరీ లాగుంది.. బాగుంది.. బేగ సెప్పీండి ..
రిప్లయితొలగించండి@చాణక్య: రాయాలి కదండీ.. రేపటికి ప్రయత్నిస్తాను.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@రిషి: ఆయ్..బలేటోరే.. మీగ్గాకపొతే ఇంకెవులికి సెబుతావండీ.. :)) ధన్యవాదాలు..
మీది కోనసీమలాగా ఉందే. మీరు వేసిన పెంకుటిల్లు ఫొటో, పొలం ఫొటో టిపికల్ కోనసీమ సీను (నా చదువు కోనసీమలోనే గడిచిందిలెండి. అందుకని ప్రత్యేకాభిమానం). కధ బాగుంది. తూర్పు గోదావరి జిల్లా యాస "శ్రవణానందంగా" ఉంది.
రిప్లయితొలగించండిఇది వ్రాస్తున్నది నెమలికన్ను మురళి గారేనా? లేక పసలపూడి వంశీ గారా?
రిప్లయితొలగించండి@విన్నకోట నరసింహారావు: అవునండీ, కోనసీమలో పుట్టి పెరిగాను.. ఓ సారి చూసిన వాళ్ళకే నచ్చేసే ప్రాంతం కదండీ మరి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@బోనగిరి: పసలపూడి వంశీ రచనల్ని, సినిమాలని ఇష్టపడే 'నెమలికన్ను' మురళీ అండీ :) ..ఆ ప్రభావం కనిపిస్తోందంటారా ఇంతకీ? ...ధన్యవాదాలు..
కృష్ణవేణిని కళ్ళక్కట్టిస్తున్నారుగా! వంశీ ప్రభావాన్ని తీసిపారేయలేను కానీ, మాండలీకం మినహాయిస్తే మీ తరహా కథనమే.
రిప్లయితొలగించండి"నారాయణరావు బాల్యం, తొలియవ్వనం ఇంకా పూర్తవ్వనేలేదు, కృష్ణవేణి ఇల్లు దగ్గర పడింది." ఇదన్నమాట మీ మార్క్ అంటే.. :)
@కొత్తావకాయ: ప్రభావం తప్పదేమోనండీ, ప్చ్...
రిప్లయితొలగించండికీన్ గా చదువుతున్నందుకు ధన్యవాదాలు..