సోమవారం, జులై 21, 2014

కృష్ణవేణి-9

"నిన్ను సూత్తాకి నీ బాబొచ్చేడొరేయ్.. ఆడేదో పెద్ద కలకటేరో, జడిజీవో అనుకుంటావు కామాల. సినేమా ఆల్లో గేటు కీపరు.. కానొరే, కలకటేరుకైనా పెల్లాం, బిడ్డల కోసం టయం ఉంటాది.. నీ బాబుకి మాత్తరం అస్సలు ఉండదురోయ్," చంటి పిల్లాడిని ఒళ్ళో వేసుకుని ముద్దులాడుతోంది మంగళగౌరి.

రంగశాయి వెళ్లేసరికి అతని తల్లి రాజమ్మ అక్కడే ఉంది. మంచినీళ్ళ గ్లాసుతో వచ్చి పలకరించింది సూరమ్మ. కాళ్ళూ, చేతులూ కడుక్కుని పిల్లాడిని చేతుల్లోకి తీసుకున్నాడు రంగశాయి. అప్పటిదాకా ఆడుతున్నవాడు కాస్తా ఉన్నట్టుండి 'కెవ్వు' మన్నాడు పిల్లాడు. శివాలెత్తేసింది మంగళగౌరి.

ఆ హడావిడి సద్దుమణిగాక రాజమ్మే విషయం కదిపింది, కూతుర్నీ, కొడుకునీ ఎదురుగా కూర్చోపెట్టుకుని. "సూడండొలే.. సంటోడికి మూడో నెలొచ్చేసింది. బారసాల్జేసుకుని తీసికెల్టం ఇదాయకం. అల్లుడికి సెప్పి ఆ యేర్పాటేదో సేత్తే..."

ఆమె మాటలు పూర్తవ్వనే లేదు, అడ్డు తగిలాడు రంగశాయి. "ఎందుకమ్మా.. నన్ను సూత్తానే మీదడిపోతంది. ఒచ్చి మాత్రం ఏం సేత్తాది సెప్పు.. ఈదెక్కి డేన్సు కట్టటవే గదా.." ఉలిక్కి పడింది సూరమ్మ.

"అలగనెయ్యకురా బాబా. ఇదీ, నువ్వూ కాపోతే నాకెవులున్నార్రా.. నేనే సెబుతున్నాను కదా. నా కూతురు అందర్లాటిది కాదు. దాని బాబు దాన్నలా తయ్యారు జేసేడు. నేను మంచీ సెడ్డ సెబుతానే ఉన్నాను కానీ, ఏనాడూ నా మాట పెడసెవ్వే.." అంటూ తమ్ముడి వైపు తేరిపార చూసింది. చూపు తిప్పుకున్నాడు రంగశాయి.

"మీ ఇద్దరూ దాన్ని కాయకపోతే నేనేవైపోతాన్రా.. ఇంకో పిల్ల పెల్లికెదిగింది.. ఇద్దరు కుర్రోల్లున్నారు.. ఆల్ల మంచీ సెడ్డా సూడాలి. కట్టుకున్నోడు సూడబోతే ఒట్టి పెడద్రపు సచ్చినోడు.. నా మొకం సూడండ్రా కాంత.." కళ్ళనీళ్ళు తిరిగిపోయాయి సూరమ్మకి. కూతుర్నలా చూసి నిలువునా నీరయిపోయింది రాజమ్మ.

"ఊరుకోలే.. ఏడుత్తావెందుకు? ఆడుమాత్రం ఏలుకోనన్నాడా? మొగోన్నలా ఎంట్రుకి ముక్క కింద తీసి పారేత్తంటే ఆడికి మాత్తరం ఎలాగుంటాది సెప్పు? నువ్వూ కాపరం సేసేవు, నలుగు బిడ్డల్ని కన్నావు. దాన్లాగే ఉన్నావంటే? ఉంటే నిన్ను బతకనిచ్చేవోల్లా? కూతంత మంచీ సెడ్డా సెప్పంపవే దానికి.. నేనేదో ముసిల్దాన్ని. కట్టుకున్నోడి మాటన్నా సెవినెట్టాలిగదంటే..." రాజమ్మింకా ఏదో మాట్లాడేదే, మధ్యలో మంగళగౌరి వచ్చి కలగజేసుకోక పోతే.

"ఏటీ గూడుపుటానీ? ముగ్గురూ కూడేరంటే నామీదే గావాల. సూడండొలే.. నేనిల్లాగే ఉంటాను. ఎవుడు అరిసి గీపెట్టినా, ఏడిసి మొత్తుకున్నా ఇల్లాగే ఉంటాను. ఇట్టవయ్యిందా, తీసుకెల్లండి. లేపోతే ఇక్కడే ఇడిసిపెట్టెయ్యండి..నాకో ముద్ద నా బాబుకి బలువు కాదు. సెవులు కొరుక్కోటాలు, ఏడిసి ముకం తుడుసుకోడాలు అక్కల్లెద్దు," గబగబా చెప్పేసి పడగ్గది వైపు చర్రున వెళ్ళిపోయింది మంగళగౌరి.

ముగ్గురిలో ఒక్కరూ నోరిప్పలేదు. మర్నాడు వెళ్లి బారసాలకీ. ప్రయాణానికీ ముహూర్తం పెట్టించుకుని వచ్చింది సూరమ్మ.


"సంటోడి పేరు రాజుగాడన్న మాట! బావున్నాది కదా మాయ్యా," సంబరపడ్డాడు గణపతి.

"రాజాబాబు" సరిచేసింది మంగళగౌరి. చంటి పిల్లాడిని జాగ్రత్తగా ఒళ్ళో వేసుకుని ముఖంలో ముఖం పెట్టి "రాజాబాబూ.. రాజాబాబూ" అంటూ ముద్దులాడుతున్నాడు గణపతి.

గూడు కట్టిన ఒంటెద్దు బండి గుమ్మంలో ఆగి ఉంది. సారి కావిడి, ట్రంకుపెట్టి, రెండు చేతి సంచులు బండిలోకి చేర్చారు అప్పటికే. ఎండుగడ్డి మీద చాప పరిచి మంగళగౌరినీ, రాజమ్మనీ బండి ఎక్కించారు.

గణపతి దగ్గరనుంచి రాజాబాబుని అందుకుని ముద్దాడి మంగళగౌరికి అందిస్తూ "జాగరత్తొలే," అని మాత్రం అంది కూతురితో.

"ఒచ్చి దింపుదారన్నా ఇక్కడ జరుగుబాట్నేదమ్మా.. నువ్వే సూసుకోవాల," తల్లికి చెబుతూ కళ్ళు తుడుచుకుంది సూరమ్మ. బండి వెనుకే సైకిలు మీద బయల్దేరాడు రంగశాయి.

చీర ఉయ్యాల్లో నిద్రపోతున్న రాజాబాబుని చూస్తూనే ఆలోచనలు మరోవైపుకి వెళ్ళడం లేదు రంగశాయికి. నోట్లో వేలేసుకుని అమాయకంగా నిద్రపోతున్న పిల్లవాడిని అలా ఎంతసేపు చూసేవాడో, మంగళగౌరి వచ్చి పక్కన కూర్చోకపొతే.

చిన్న ప్రింటున్న తెల్ల వాయిల్ చీర, తెల్ల జాకెట్ వేసుకుంది. జడలో మల్లెదండ భుజం మీద పడుతోంది. పిఠాపురం సెంటు వాసన తెలుస్తోంది. నములుతున్న వక్క పలుకు ఇంకా నోట్లోనే ఉంది.

"ఏటలా సూత్తన్నావ్?" అడిగింది. ఏమీ మాట్లాడలేదు రంగశాయి.

"ఓయబ్బో.. మాకు తెల్దేటీ.. నేనే కదా మొగోణ్ణి.. కొడుకుని కనేసేను అనే కదా" కిలకిలా నవ్వింది.ఆమెవైపు చూసి చిన్నగా నవ్వాడు.

"ఎన్నాల్లై పోయిందో తెల్సా" అతని మెడ చుట్టూ చేతులేసింది. ఇద్దరూ మంచం మీద వాలిన క్షణానికి ఉన్నట్టుండి చల్లబడిపోయాడు రంగశాయి.

గదిలోనుంచి బయటకి వెళ్తుంటే వెనకనుంచి "య్యే... వొంట్లో గీనీ తేడా సేస్సిందా?" అన్న ప్రశ్న వినిపించింది.

వీధరుగు మీద కూర్చుని బీడీ వెలిగించాడు. కొంచం దూరంలో కనిపిస్తున్న స్టేజీని చూడగానే కృష్ణవేణి గుర్తొచ్చింది. ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాయి. రంగశాయి గదిలోకి వెళ్లేసరికి, రాజాబాబుని పక్కలో వేసుకుని గాఢ నిద్రలో ఉంది మంగళగౌరి.

(ఇంకా ఉంది)

2 కామెంట్‌లు: