సోమవారం, జులై 28, 2014

కృష్ణవేణి-12

అమావాస్య రాత్రులు కావడంతో ఊరంతా చీకటిగా ఉంది. నట్టింట్లో పడక్కుర్చీలో వాలి రేడియోలో వస్తున్న నాటకాన్ని శ్రద్ధగా వింటున్నారు పంతులుగారు. రేడియో మీద ఓ చెవి వేసి, వంటింట్లో రాత్రి వంట చేస్తోంది సరస్వతమ్మ.

నాటకం పూర్తవుతూ ఉండగా వీధిలో ఏదో అలికిడి అవ్వడంతో కుర్చీలోంచి లేచి "ఎవరదీ?" అంటూ బయటికి వచ్చారు పంతులు గారు.

రోడ్డు వారగా రెండు సైకిళ్ళు ఆగి ఉన్నాయి. నలుగురు మనుషులు మసగ్గా కనిపిస్తున్నారు. ఓ ఆకారం ఆడమనిషిదని స్పష్టంగా తెలుస్తోంది.

"నమస్తండీ.. నేను బాబుగారూ లష్మిని," అందా స్త్రీ, ఓ మగవాడితో కలిసి లోపలి వస్తూ. ఆమె నడకలో చిన్న ఇబ్బంది తెలుస్తోంది.

"ఏమ్మా.. ఇంత చీకటడి వచ్చారు.. రండి రండి," అని ఆహ్వానిస్తూనే "లక్ష్మీ వాళ్ళూ వచ్చారు" అని లోపలికి ఓ కేకేశారు పంతులుగారు. అరుగు మీద కూర్చుంది లక్ష్మి. వాకిట్లో ఉన్న కొబ్బరిచెట్టుకి ఆనుకుని నిలబడ్డాడతను.

"కాలికేమయ్యిందమ్మా?" అడిగారు మంచినీళ్ళు ఇస్తూ.

ఎత్తిపోసుకుని, చెంబు జాగ్రత్తగా పక్కన పెట్టి "అదంతా పెద్ద కద బాబుగారూ.. ఏం సెప్మంటారు," అని ఒక్క క్షణం ఆగింది లక్ష్మి.

"గతేడాది సంవచ్చరాదికి మీ ఊల్లో నాటకం ఆడేరు కదా. నాక్కుదరాపోతే కృష్ణేన్ని బుక్ సేసేరు.. మేవప్పుడు అమలాపారం పక్కనూల్లో నాటకవాడేం. మీకిక్కడ సిమ్మెంటు స్టేజీ ఉన్నాది కానండీ, అక్కడ సెక్క బల్లల్తో స్టేజీ కట్టేరు. రెండ్రంగాలయిపోయి మూడో రంగంలో నేను డేన్సు కడతా ఉంటే ఉన్నట్టుండి స్టేజీ కూలిపోయింది.." గుర్తు చేసుకుంటూ ఆగింది.

"అయ్యయ్యో.. తెలియలేదమ్మా మాకు" అన్నారు పంతులుగారు.

"గబాల్న కిందడిపోయేనండి. కాలి మీదో బల్లడిపోయింది.. లేవలేపోయేను.. నాటకవాగిపోయింది. అప్పుటికప్పుడు అమలాపారం ఆస్పత్రికి తీసూపోయేరు. పేనం పోతాదనుకున్నాను బాబుగారూ.. కాలిరింగిందన్నారండి. ఎక్కడెక్కడో తిరిగేం. సివరాకరికి ఎల్లూరండి, అరవ దేశం.. అక్కడ ఆప్రేసన్ సేసేరండి. అంతా బానే ఉన్నాది కానీ సిన్న అవుకు నిలిసిపోయిందండి," ఆగింది లక్ష్మి.

"అయ్యో.. పెద్ద కష్టమే అమ్మా.. కాలక్షేపం ఎలా మరి?" అడిగారు పంతులు గారు.

"పొట్ట తిప్పలు తప్పవు కదా బాబుగోరూ. కూతంత నయవయ్యేక మా ఊల్లోనే కాపీ ఒటేలు ఎట్టేనండి. ఈయన మా బావగోరండి.. ఈరంతా సహాయంగా ఉంటన్నారు మాటకీ, మంచికీ," చెట్టు కింది మనిషిని పరిచయం చేసింది.

లోపలినుంచి టీలు వచ్చాయి. వాళ్ళిద్దరికీ ఇచ్చి, రోడ్డు మీద వాళ్ళని కూడా పిలవమన్నారు పంతులుగారు. వచ్చి టీలు పుచ్చుకున్నారు వాళ్ళు.

"ఏవిటోనమ్మా భగవంతుడి లీల. పడే వాళ్ళకే పెడతాడు పరీక్షలన్నీ. ఇంతకీ, నావల్లయ్యేది ఏవన్నా ఉందా?" అడిగారు పంతులుగారు.


"ఉపకారం కావాలి బాబుగారూ. మీ వల్లే అవ్వాలి. ఏడెనిమిదేల్లుగా ఫీల్డులో ఉన్నాను. నాటకం అంటే నాకెంతిదో మీకు పెచ్చేకం సెప్పక్కర్లెద్దు. కుర్రోల్లు నలుగుర్ని సేర్సి డ్రామా ఒకటి తయ్యారు సేసేను. రిగాల్సల్సు కూడా సేత్తన్నాం. పండగొత్తన్నాది కదా బాబూ.. మాయందు దయుంచి ఒక్క సేన్సు ఇప్పిచ్చేరంటే.. మీకు తెల్సు కదా ఈ లష్మి స్టేజీ మీద ఎలా సేత్తాదో..."

పంతులుగారు ఆలోచనలో ఉండిపోయారు.

"ఇద్దరు ఈరోయిన్లండి. ఒకేసం నేను కడతాను. ఇంకో ఏసానికి మా వోల్ల పిల్లనే తయ్యారు సేత్తన్నాను. కావాలంటే క్లబ్బు డేన్సు కూడా ఎట్టింతాను. తాంబూలం దెగ్గిర కూడా పేసీ లేదు బాబుగారూ.. మీరెలాగంటే అలాగే.. నేను పేసీ మడిసిని కాదు.. మీకు తెలందేవుంది.." అంటూ పంతులుగారి వైపు చూసింది.

"కుర్రాళ్ళు నాటకం అంటే ఒప్పుకోడం లేదమ్మా. గతేడాది వేసిన వాళ్ళలో ఒకళ్ళిద్దరు ఊగేరు, ఈ ఏడు కూడా నాటకం ఆడదాం అని. కానీ, ఎవరూ కలిసి రావడం లేదు. అందరూ సినిమాల మీద పడిపోయారు. వీధిలో తెరకట్టి సినిమాలేస్తుంటే ఇంకా నాటకం ఏవిటి అంటున్నారు. వాళ్ళని బట్టి పోవాల్సిన వాళ్ళం కదమ్మా మనం.." చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు పంతులు గారు.

"మీరే ఇంతమాటనేత్తే ఎల్లాగ బాబుగారూ.. మీ మాటెవురు కాదంటారు సెప్పండి? మీరు దయదల్డం లేదు.. అవుక్కాలేసుకుని ఇదేం నాటకం ఆడతాడని కామాల," బాధగా అంది లక్ష్మి.

"అయ్యయ్యో.. అదేం మాటమ్మా.. నా చేతిలో ఉంటే చెయ్యనా నేను? ఇంతల్లా అడిగించుకునే మనిషినా?" అన్నారు పంతులు గారు.

"కష్టపెట్టుకోకండి బాబుగారూ.. మీ మీద ఆసెట్టుకుని వొచ్చేను. మల్లీ ఒక్కసారి స్టేజీ ఎక్కితే సాలనున్నాది. కుర్రోల్లూ కలిసొచ్చేరు. ఉంకొక్కసారాలోసించండి బాబూ," బతిమాలింది లక్ష్మి. ఒక్క క్షణం ఆగి, నోరు విప్పారు పంతులుగారు.

"చందర్రావనీ.. మా ఊరి కుర్రాడేనమ్మా. కొత్తగా లైటింగు, మైకుసెట్ల వ్యాపారంలోకి దిగాడు. అతనే సినిమాలు కూడా తెచ్చి వేస్తానన్నాడు. మా వాళ్ళు నాలుగు సినిమాలు బుక్ చేసేశారు. ఒక్క నాటకం ఖర్చుకే నాలుగు సినిమాలు వస్తున్నాయని లెక్క చెప్పారు.." మాట్లాడకుండా ఉండిపోయింది లక్ష్మి.

పంతులుగారు లోపలికి వెళ్లి, కొంత డబ్బు తీసి సరస్వతమ్మ చేతికి ఇచ్చారు. చెక్క బీరువా లోంచి జాకెట్ ముక్క తీసి, మడతల్లో ఆ డబ్బు పెట్టింది సరస్వతమ్మ.

"అయితే ఉట్టి సేతుల్తోనే అంపుతున్నారన్న మాట. శానా ఆసెట్టుకునొచ్చేను బాబుగారూ.. ఇలాగవుతాదనుకోలేదు.. అమ్మగారెలా ఉన్నారు? సెప్పేసి సెలవుచ్చుకుంటాను," అంటూండగానే "రామ్మా లక్ష్మీ లోపలికి" అని పిలిచింది సరస్వతమ్మ.

"విన్నానమ్మా.. పాపం, ఊహించని ప్రమాదం కదా.." అంది ఆమే.

"కనిపించెల్దారని అమ్మగారూ.. ఎల్లొత్తాను," అంది లక్ష్మి.

"బొట్టుంచుతాను, ఉండమ్మా.." అంటూ కుంకుమ భరిణె, జాకెట్ ముక్కతో వచ్చింది సరస్వతమ్మ. జాకెట్ ముక్క అందుకుని, రెండు చేతులూ ఎత్తి దండం పెట్టింది లక్ష్మి, "చల్లగా ఉండండమ్మా" అంటూ.

"చీకట్లో వచ్చారు.. జాగ్రత్తగా వెళ్లి రండి" అన్నారు పంతులుగారు.

"మాకాడ బేట్రీ లైట్లున్నాయి బాబుగారూ" అంది లక్ష్మి, సైకిలెక్కుతూ.

(ఇంకా ఉంది)

2 కామెంట్‌లు: