"నీకు నాలుగ్గింజలు కొల్టం నాకేం బలువు కాదు బుల్లే..
పరాయిదానివి కాదుగదా. కానొలే, ఇంటికి మొగోడొస్తా ఎల్తా ఉండగా నువ్విలా
అప్పుచ్చుకోటవేటే?" ..వెనుక గుమ్మం వైపు నుంచి ఓ ఆడగొంతు నెమ్మదిగా
వినిపించడంతో మెలకువ వచ్చింది రంగశాయికి.
పక్కన కృష్ణవేణి లేదు. చూడబోతే ఇంకా పూర్తిగా తెల్లవారినట్టే లేదు. కదలకుండా పడుకున్నాడు. బయటి మాటలు వద్దన్నా వినిపిస్తున్నాయి.
"నెమ్మది సిన్నమ్మా.. ఆ మడిసి లెగుత్తాడు," ..అది కృష్ణవేణి గొంతే, బాగా తగ్గించి గుసగుసగా మాట్లాడుతోంది.
"సూడొలే.. మనకాడికి మొగోడెందుకొత్తాడు? ఆడికి పెల్లం కాడ దొరకందేదో
మనకాడ దొరుకుతాదని.. మనవెందుకు రానింతాం? నాల్డబ్బులు సంపాదిచ్చుకుందారని..
మొగోడంటే పడి సచ్చిపోయి కాదుగదా.. అందుకనీ, వొచ్చిన మొగోడి కాడ
డబ్బుచ్చుకోవాలి. ఇచ్చుకోలేనోన్ని గుమ్మంలో అడుగెట్టకుండా సెయ్యాలి.."
ఉన్నట్టుండి కోడి కుయ్యడంతో కొన్ని మాటలు వినబడలేదు.
"నీకు తెల్దని కాదు బుల్లే.. డబ్బుచ్చుకోపోగా, కూకోపెట్టి పోసింతానంటే, మర్నీ పొట్ట గడిసే దారీ సూసుకోవాలి గదా..వొయిసులో వున్నప్పుడే ఇల్లాగుంటే,
ఇంక వొయిసైపొయ్యేక పరిత్తితేటే " కాస్త ధాటీ గానే మాట్లాడుతోంది
పెద్దావిడ.
"ఏం సెప్పను సిన్నమ్మా? ఆ మడిసిని డబ్బడగలేన్నేను.. నువ్వేటన్నా అనుకో గీనీ.." తర్వాతి మాటలు వినిపించడం లేదు.
"ఓ మాట సెబుతానినుకుంటావా.. మా పెద్దమ్మ కూతురొకత్తుండేది.. నీకు
తెల్దులే.. నువ్వప్పటికి బాగా సిన్న పిల్లవి. డ్రామాల్లో ఏసేది,
నీకుమల్లిగానే. ఓ పాలి నన్నూ తీసికెల్లింది. అదేదో కన్యా సులకవంట నాటకం.
ఇది కట్టినేసం మదురోని.." గొంతు తగ్గించింది కొంచం.
"మన కులం పిల్లే.. ఆ మదురోనంటాదీ అంగడోడికి మిటాయి మీద ఆసి, సాన్దానికి
వొలపూ మనసులోనే ఉండాలంట. బంగారం లాటి మాట గదంటే.. అందుకేకావాల ఇన్నాల్లైనా
గురుతుండిపోయింది. కాబట్టి పిల్లా, పేవలూ అయ్యీ పెట్టుకోకు. మీయక్కకి
నువ్వున్నావు కాబట్టి కడతేరిసేవు. మర్నీకెవులున్నారే? ఆలోసిచ్చుకో..."
ఒక్క క్షణం నిశ్శబ్దం.
"సర్లే సిన్నమ్మా.. ఇయ్యాల్టిగ్గింజలు కొలు. ఏదోలాగ
తీరిసేత్తాను.. ఉంచుకునే మడిసిని కాదు," నిష్టూరం వినిపిస్తోంది కృష్ణవేణి
గొంతులో.
"ఓయమ్మ.. కోపం సెయ్యకే.. పరాయిదానివంటే నువ్వు? పెద్ద
దాన్నిగదా, కూతంత మంచీ సెడ్డ సెబుదారనిపిచ్చింది.. ఎవులంతటోల్లు ఆలమ్మా..
ఉచ్చుకో గింజలు.."
తర్వాత మాటలు వినిపించలేదు రంగశాయికి. తలగడలో మొహం పెట్టుకుని బోర్లా
పడుకున్నాడు. కృష్ణవేణి గదిలోకి వచ్చి, చూసి వెళ్ళిన అలికిడి తెలిసినా
కళ్ళు తెరవలేదు చాలాసేపటి వరకూ.
నిద్ర లేచిన రంగశాయి చాలా మామూలుగా ఉండడంతో ఊపిరి పీల్చుకుంది కృష్ణవేణి. పెందలాడే భోజనం కానిచ్చి సినిమా హాలుకి బయలుదేరాడతను.
సాయంకాలమైంది. సైకిల్ బెల్ శబ్దానికి వీధిలోకి వచ్చిన కృష్ణవేణి,
రంగశాయినలా చూస్తూ ఉండిపోయింది. హ్యాండిల్ కి బరువుగా వేలాడుతున్న రెండు
సంచులు, వెనుక కేరియర్ కి బియ్యం మూట. ఒక్కోటీ తెచ్చి లోపల పెట్టాడు. ఏమీ
మాట్లాడకుండా మంచినీళ్ళ గ్లాసు అందించింది కృష్ణవేణి.
నీళ్ళ గ్లాసు అందుకోబోతూ, బనీనులో చెయ్యి పెట్టి తామరాకు పొట్లం బయటికి
తీశాడు రంగశాయి. పొట్లం జాగ్రత్తగా విప్పి ఆమె దోసిట్లో పెట్టాడు.
ఒక్కసారిగా
అతన్ని చుట్టుకుని భోరుమంది కృష్ణవేణి. వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమెని
ఎలా ఊరుకోబెట్టాలో అర్ధం కాక వెన్ను రాస్తూ ఉండిపోయాడు.
కాసేపటికి తేరుకున్న కృష్ణవేణి ముఖం కడుక్కుని వచ్చింది. ముందుగా
టీ కాచి ఇచ్చింది. అతనితో కబుర్లు చెబుతూ, సంచుల్లో కాగితం పొట్లాలని
డబ్బాల్లోకి మార్చింది. చకచకా వంట చేసేసింది.
అతన్ని స్నానానికి
పంపి, తనూ స్నానం చేసి వచ్చింది. అద్దకం ఉన్న తెల్ల గ్లాస్కో చీర కట్టుకుని
జడ నిండా పూలు తురుముకుంది. భోజనం అవుతూనే అతనితో చాలా మాట్లాడాలనుకుంది
కానీ ఆమెకి నోరు తెరిచే అవకాశం ఇవ్వలేదు రంగశాయి.
అర్ధరాత్రి వేళ వడగళ్ళ వాన పడుతున్న శబ్దానికి వీధిలోకి వచ్చారు
ఇద్దరూ. నలిగిపోయిన పూలదండని జడలో నుంచి తీసేసింది. గుమ్మంలో ఎదురు
చూస్తోన్న తామరాకు పొట్లాన్ని చేతుల్లోకి తీసుకుంది.
"మీయాయిన తెచ్చినియ్యి కామాల," నవ్వుతూ అన్నాడు రంగశాయి.
"నా సిన్నప్పన్నించీ ఏ రోజన్నా తిండి తినకండా ఉన్నానేమో కానీ,
పూలెట్టుకోకుండా లేను. అంతిట్టం పూలంటే. మా వోల్లందరూ పిచ్చంటారు. పూలమ్మే
వోడు వొతనుగా ఏసేసి ఎల్తాడు. ఆడు కనిపింతే సాలు.. అదుగోలే నీ మొగుడొచ్చేడు
అని యేడిపింతారు మావోల్లు.. ఆడికి నా మొగుడనే పేరు కాయం సేస్సేరు.."
మాట్లాడుతూనే జడ అల్లుకుని, పూలు తురిమేసుకుంది.
"నా కాతాలన్నీ మా సిన్నమ్మ కూతుల్లకి బెత్తాయించేత్తాను. అసులు మొగుడొచ్చేసేకా ఈల్లందరితోటీ పనేట్నాకు.." అంది కృష్ణవేణి.
ఆమె జళ్ళో పూలు మళ్ళీ నలిగాయి.
(ఇంకా ఉంది)
గోదారొడ్దంత సహజంగా ఉంది భాష
రిప్లయితొలగించండికన్యాశుల్కంపై మీకున్న ప్రేమ అసామాన్యమండీ! గోదారి యాసలో మధురం మాటలు గమ్మత్తుగా ఉన్నాయసలు!
రిప్లయితొలగించండిచివర్లో కృష్ణవేణీ మళ్ళీ మధురవాణినే తలపించింది. మగవాడికైనా ఆడదానికైనా నీతి ఉండాలని రామప్పంతుల్ని దూరం పెట్టిన పిల్ల.. అగ్గిపుల్ల!!
ఈ ఎపిసోడ్.. పదో ఎపిసోడ్ స్థానాన్ని ఆక్రమించేసేలా ఉంది. :)
@జ్యోతిర్మయి: ఆయ్.. శానా సంతోసవండి.. ఇడిసిపెట్టకుండా సదంతవే గాకుండా, ఎప్పుటిదప్పుడే సెప్పేతన్నారు.. శానా ఉపకారవండి నాకు.. ఆయ్!!
రిప్లయితొలగించండి@కొత్తావకాయ: గొప్పదనం గురజాడ వారిదండీ.. మర్చిపోగలిగే నాటకమా అది!! ఇక్కడ సందర్భం అలా కుదిరింది.. స్పందనకి ధన్యవాదాలు..