సోమవారం, జులై 07, 2014

కృష్ణవేణి-3

"అంటే.. కట్టుకున్న పెల్లం కన్నా ఎదవుజ్జోగం ఎక్కువైపోయిందన్న మాట్నీకు. ఆ  నాగేసర్రావు నీ కాడికొచ్చి బాబొరే రంగసాయీ నువ్వు గేటుకాన్నిలబడి టికీట్లు సింపితే తప్ప నా బొమ్మాడదురా బాబా అని బతివాలుకున్నాడా? మొకం సూడు మొకం..." అలుపు తీర్చుకోడానికి ఒక్క క్షణం ఆగింది మంగళ గౌరి. 

ఆమె మాట్లాడుతుంటే కదులుతున్న నల్లని పెదాలనీ, ముందు పళ్ళ రెండింటి మధ్యనా ఉన్న ఖాళీనీ తదేకంగా చూస్తున్న రంగశాయి అప్పటివరకూ నోరిప్పలేదు. 

"పురిటికంపేత్తే అదింక ఉన్నాదో పోయిందో సూడక్కర్లేదు కామాల.. లోకంలో మొగోల్లందరూ ఇలాగే ఉంటన్నారా? ఆడనా సయితులందరూ ఇలాగే కాపరాల్సేత్తన్నారా?" జవాబు కోసం ఆగింది.

"ఎందుకే.. గుమ్మం లోకొచ్చిన మొగుడి మీద ఓ ఇరుసుకు పడిపోతావ్.. ఉప్పుడే కదా సైకిలు దిగేడు.. ఓ సిటం ఆగొచ్చు కదంటే.." రంగశాయికి మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ కూతుర్ని కోప్పడింది సూరమ్మ. 

"ఓహో.. తమ్ముడని కావాల.. ఊకే ఎనకేసుకొచ్చేత్తన్నావు. పట్టుమని పది మైల్ల దూరం లేదు.. పది రోజులకా మొకం సూపించటం? పెల్లానికి కడుపు సెయిటం కాదు మొగతనం.. దాని మంచీ సెడ్డా సూడాల.." మంగళ గౌరి మాటల ప్రవాహం సాగిపోతూనే ఉంది. ఖాళీ చేసిన నీళ్ళ గ్లాసు అరుగుమీద పెట్టి, ఒక్క క్షణం ఆమె వైపు చూసి ఏటిగట్టు వైపు అడుగులేశాడు రంగశాయి. 

మాఘ మాసపు సాయంత్రం.. పల్చటి మంచుతెర కమ్ముకుంటున్నట్టుగా ఉంది గోదారి. అక్కడోటీ అక్కడోటీ పడవలు కనిపిస్తున్నాయి దూరంగా. ఏటి గట్టెక్కుతూనే గోదారి గాలి పలకరించింది. నారింజ రంగుకి తిరిగిన సూర్యుడు ఏ క్షణాన్నైనా గోదారిలోకి బుడుంగున జారిపోయేలా ఉన్నాడు. 

పక్షుల బారులు ఉండుండీ సూర్యుడి మీదుగా ఎగిరి వెళ్తున్నాయి. రావిచెట్టు కింద కూర్చుని గోదారినే తదేకంగా చూస్తున్న రంగశాయి, మోకాళ్లమీద తల పెట్టుకుని భోరున ఏడవాలనే బలమైన కోరికని కష్టమ్మీద నిగ్రహించుకున్నాడు. లేచి నిలబడి గట్టు వెంటే నడుస్తూ మనసు మళ్ళించుకునే ప్రయత్నంలో పడ్డాడు. 

"సూత్తానే సివంగిలా మీదడిపోద్దెందుకో?" ఆ ప్రశ్న వేసుకోడం ఎన్నోసారో లెక్క పెట్టుకోలేదు ఎప్పుడూ. 

చూస్తుండగానే కను చీకటి పడింది. ఎక్కడా మబ్బన్నది లేదు ఆకాశంలో. పాల చెంబులు, కాయగూరల బుట్టలతో పడవ దిగుతున్నారు రైతులు. ఎక్కడిదో రేడియో పాట ఉండుండీ వినిపిస్తోంది. 

"ఇక్కడున్నావా మాయ్యా.. అమ్మ నిన్ను బేగీ రమ్మంటంది.. అన్నానికి...," వగరుస్తూ వచ్చాడు గణపతి, మంగళ గౌరి తమ్ముడు. 

"నువ్వు నడిసీ మాయ్యా.. నేనుప్పుడే కొట్టు కాడికెల్లొచ్చేత్తాను.. అమ్మడిగితే నీ ఎనకమాలే ఒచ్చేతన్నానని సెప్పూ..." అంటూ పరిగెత్తాడు గణపతి.


వీధిలో పడక్కుర్చీలో కూర్చుని వేరుశనగ పప్పుండ కొరుక్కు తింటోంది మంగళగౌరి. "సైకిల్నున్న  సంచీ సవిరించేసిందన్న మాటప్పుడే" అనుకుంటున్న రంగశాయి వైపు నిస్సాకారంగా ఓ చూపు చూసి, తినడంలో పడిపోయింది మళ్ళీ.

"ఇంట్లో ఆడది తిన్నాదో లేదో కనుక్కోవాలి.. " కృష్ణవేణి మాటలు గుర్తొచ్చి, "అన్నం తిన్నావా?" అని అడిగాడు మంగళగౌరిని. 

"నీయంత గొప్పుజ్జోగం కాపోయినా మా నానా సంపాదిత్తన్నాడు.. పిల్లలకెట్టకుండా మాడిసేసే మడిసి కాదు," కోరగా వచ్చింది సమాధానం. 

కాళ్ళు కడుక్కుని, వసారాలో వాల్చిన పీటమీద కూర్చునేలోగా "కడుపుతో ఉన్న ఆడది టయానికి తినాలి.. ఏలా పాలా సూసుకోవాలి.. మనకేవన్నా తెలిత్తే కదా అసలూ.." అలుపొచ్చే వరకూ అంటూనే ఉంది మంగళగౌరి. 

"బాబు నోట్లోంచి ఊడి పడిందిరా బాబా.. అదే కోపం మడిసికి. ఆడితో నేను పడతన్నాను.. దీంతో నువ్వు పడాల," వీధి గుమ్మం వైపు ఓ కన్ను, తమ్ముడి విస్తరి వైపు మరోకన్ను వేసి మాట్లాడుతోంది సూరమ్మ.

"దానికి నేనేటీ సెప్పట్లేదు అనుకోమాకు. ఈ కూతురికి, ఆ తండ్రికి సెపుతానే ఉన్నా. ఇద్దరికిద్దరే నా పేనానికి.. ఆడదాన్ని, అలాటయ్యిందాన్ని. ఆణ్ణి కట్టుకున్నందుకు, దీన్ని కన్నందుకు నాకు తప్పదనుకో. సూత్తా సూత్తా నీకు కట్టబెట్టేనే అని బాద పడతా ఉంటాను.." చెంగుతో ముఖం తుడుచుకుంది.

"దానికి తెల్దు, సెప్తే ఇనిపించుకోదు.. ఎంచేపూ అజ్జెప్పినట్టే జరగాలంటాది. ఎట్టా కుదురుద్ది సెప్పు? సెప్పీ సెప్పీ నా పేణం ఇసిగింది కానీ, దాని మాట దాందే అనుకో. అలాగని బుర్ర తక్కువదా అంటే కాదు. మాసెడ్డ పట్టుదల మడిసి," అడుగుల చప్పుడు విని ఒక్కసారిగా మాట్లాడ్డం ఆపేసింది. 

గణపతిని చూసి "అక్కేం జేత్తందిరా?" అని అడిగింది. "గెదిలో మంచంమీదున్నాది"  అని చెప్పేసి, స్నానానికి వెళ్ళాడు గణపతి.

"ఇద్దరు మొగోల్ల మజ్జెన పుట్టిన ఆడ కూతురని నెత్తి నెట్టుకున్నాడు దాని బాబు. నానేమో ఇది పుట్టగానే నీ పెల్లాం అని పేరెట్టేసేడు. పైకెల్లిపొయి ఆయన బాగానే ఉన్నాడు. నువ్వు సూత్తే బొత్తిగా నోట్లో నాలిక లేనోడివి అయిపోయేవు.. ఇదేం తిండిరా నాయినా.. కూతంత పొరుటు కలపరా.." 

పెరట్లో తారట్లాడుతున్న కోడిని గంపకింద పెట్టేసి వచ్చి, మళ్ళీ అందుకుంది. "బయిటోడు ఎవడన్నా అయితే ఈపాటికి దీన్ని ఇడిసి పెట్టి పొయ్యే వోడు. సిన్నదానికి సమ్మందం ఏదీ రాకుండా పోయేది. ఉప్పుడు ఒచ్చీ ఓల్ల కోరికలూ... ఓయబ్బో సెప్పటాకి లేదులే..  రోజులెప్పుడూ ఒకలాగుండవురా.. కానుపైతే మడిసిలో ఏవన్నా మారుపొత్తాదేమో సూద్దారి.. అదేదో అంటా ఉంటాది, మనసులో ఎట్టుకోకు.. సరేగానొరే ఈస్వర బాబెలా ఉన్నాడ్రా?" పెద్ద తమ్ముడి వివరం అడిగింది సూరమ్మ.

"ముగ్గురు పిల్లలు కదక్కా.. ఆడిదాడికి సరిపోద్దేమో.. వొదిన గుట్టు మడిసి లేయే.. మాట బయటకి రానిత్తాదేటి?" అన్నగారి మీద అసూయ పడుతున్నానా అనిపించింది రంగశాయికి. ఒకే ఇంట్లో రెండు భాగాల్లో ఉంటున్నా పెద్దగా మాటల్లేవు అన్నదమ్ములు ఇద్దరికీ.

"ఏమాటకామాటేరా.. సుగుణమ్మ కాబట్టి ఆణ్ణి రోడ్డుమీద కీడిసేయకండా  నెత్తినెట్టుకుంటంది. పోన్లే.. ఆడదురుట్టం.. దాని పుట్టింటోల్లూ కాంత సూసేవోరే.. ఏదో లేరా.. ఇంటికో కత.." ఎంగిలి కంచం పెరట్లోకి పట్టుకెళ్ళింది సూరమ్మ. 

మంగళగౌరి అప్పటికి మాంచి నిద్దట్లో ఉంది. కొబ్బరి చెట్టు కింద వాల్చిన మడత మంచం మీద నడుం వాల్చాడు రంగశాయి. చల్లగాలి ఒళ్ళంతా తడుముతూ ఉంటే కృష్ణవేణి గుర్తొచ్చింది. ఆవేళ రాత్రి.. ఆ ముసురులో.. ఒక్క నిమిషం కూడా నిద్రపోనివ్వని కృష్ణవేణి. బోర్లా తిరిగిన రంగశాయికి ఎప్పటికో పట్టింది నిద్ర. 

(ఇంకా ఉంది)

2 వ్యాఖ్యలు:

శ్రీ చెప్పారు...

abba entandi babu ila madyalo aapesaroooo... meerunnare muraligaaru .. :):)

మురళి చెప్పారు...

శ్రీ: తప్పడం లేదండీ :)) రెగ్యులర్ గా చదువుతున్నందుకు ధన్యవాదాలు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి