బుధవారం, జులై 23, 2014

కృష్ణవేణి-10

హ్యాండిల్ బార్ కి ఒకవైపు వేలాడదీసిన చిన్న ఇనప బకెట్టు నిండా మైలుతుత్తం వేసి ఉడికించిన మైదా, రెండోవైపు ఉన్న సంచీలో దొంతులుగా వాల్ పోస్టర్లు. వెనుక కేరేజీకి ఓ పెద్ద కట్ట పోస్టర్లు. ఎండ చుర్రు మంటోంది. హ్యాండిల్ ని జాగ్రత్తగా బ్యాలన్సు చేసుకుంటూ సైకిలు తొక్కుతున్నాడు రంగశాయి.

చుట్టుపక్కల పది పన్నెండు ఊళ్ళకి సైకిలు మీద వెళ్లి పోస్టర్లు అతికించి రావాలి. హాలు వాళ్ళ దగ్గర నుంచి జీతం కాకుండా నాలుగు రాళ్ళు రాలేది ఇప్పుడే. రాజాబాబు వచ్చాక తెలియకుండానే ఇంటిఖర్చు పెరిగింది. పైగా, మంగళగౌరి ఖర్చు పెట్టిందంటే ఇక అడగడానికి కూడా ఏమీ ఉండదు.

"ఎదరెదర ఎలాగుంటాదో.." అని ఆలోచించుకుంటూ సైకిలు పోనిస్తున్న రంగశాయి, తననెవరో పిలిచినట్టు అనిపించి బ్రేకేశాడు.

"కూతంత కాపీ పుచ్చుకుని ఎల్దురు రండి బాబా," కాఫీ హొటేలు శెట్టి మర్యాదగా పిలుస్తున్నాడు.

చెట్టుకి సైకిలు చేరేసి, పాక హోటల్లోకి అడుగు పెట్టాడు. కొబ్బరాకు దడిమీద ఎర్రమట్టితో మెత్తి, ఆపై సున్నం కొట్టారు. నున్నగా అలికిన నేలమీద సున్నం ముగ్గులు మెరుస్తున్నాయి. ఉన్న రెండు బల్లల్లోనూ ఒకదానిమీద కూర్చున్నాడు రంగశాయి.

సత్తుగ్లాసుతో మంచినీళ్ళు పట్టుకొచ్చి పెట్టి "ఏడేడిగా రొట్టి ముక్క కాలుత్తాను.. నా సంతోసానికి బాబా," అంటూనే పొయ్యిలో మంట ఎగసందోశాడు శెట్టి.

కాసిన్ని నీళ్ళు ముఖాన జల్లుకుని, తువ్వాలుతో తుడుచుకుంటున్న రంగశాయితో "ఎన్టీ వోడి బొమ్మా బాబా? శాన్నాల్నించి వోయిదా పడతాన్నట్టున్నాది గదా," అడిగాడు శెట్టి.

జవాబు కోసం చూడకుండా, "మా మీద్దయ సూపించాల్తవరు.. ఎన్టీ వోడి కొత్త పోస్టరు మనోటల్లో ఏసేరంటే మొత్తం ఒటేలంతా కలకల్లాడిపోద్ది," అన్నాడు బతిమాలుతున్నట్టుగా.

రొట్టి ముక్క తిని చెయ్యి కడుక్కుని పోస్టర్ ఒకటి తెచ్చి హోటల్లో అతికించాడు రంగశాయి. శెట్టి ముఖం మతాబాలా వెలిగిపోయింది.

"ఎంతబాగున్నాది.. సాచ్చాత్తూ ఎన్టీ వోడే మన ఒటేలుకి ఒచ్చేసినట్టున్నాది," అంటూ మురిసిపోయి, మీగడ వేసి ప్రత్యేకంగా చేసిన టీ ని గాజు గ్లాసులో పోసి అందించాడు భక్తిగా.

"రేపన్నించి కుర్రకారంతా మన ఒటేల్లోనే ఉంటారు బాబా," సంబరపడ్డాడు.

రంగశాయి బయల్దేరబోతూ ఉంటే గల్లాపెట్టె నుంచి ఓ నోటు తీసి బలవంతంగా అతని చేతిలో పెట్టాడు శెట్టి.

"మద్దినేలయితే బోయినం ఎట్టుకుందును.. ఏదీ కాని ఏలయిపోయింది," అన్నాడు బయటికి వచ్చి సాగనంపుతూ.


"పాల్డబ్బా ఏదీ?" గుమ్మం లోనే నిలదీసింది మంగళగౌరి.

రెండు రోజులుగా రంగశాయి బయల్దేరుతుంటే గుర్తుచేస్తోంది, రాజాబాబుకి పాల డబ్బా తెమ్మని. ఏమీ మాట్లాడలేదు రంగశాయి. ఉండబట్టలేక రాజమ్మ కలగజేసుకుంది.

"నీ కాడ పాలున్నాయి గదంటే.. సంటోడికుప్పుడు డబ్బా పాలెందుకూ?"

అంతెత్తున లేచింది మంగళగౌరి. "మూడో నెల దాటేక అందరూ డబ్బా పాలే పోత్తన్నారు. ఉంటే మాత్తరం డబ్బా పాలోత్తే తప్పేటీ?"

కోపాన్ని తమాయించుకుని "డబ్బా పాలు మంచియి కాదే.. తప్పాపోతే అది ఏరే దారి," అంది రాజమ్మ.

కాళ్ళు కడుక్కుని వచ్చిన రంగశాయిని మళ్ళీ నిలదీసింది "రేపట్టుకొత్తావా?" ...అప్పటికీ ఏమీ మాట్లాడలేదు రంగశాయి. ఉయ్యాల్లో నిద్దరోతున్న రాజాబాబుని చూస్తూ, మంగళగౌరి తిట్లు వినడానికి సిద్ధ పడిపోయాడు. అయితే, ఆమె నోరిప్పలేదు.

రాత్రి భోజనాలయ్యి, ఆమె పడకింటికి వచ్చేసరికి రాజాబాబుని ఒళ్లో వేసుకుని ముద్దులాడుతున్నాడు రంగశాయి. పిల్లాడిని అందుకుని, తన పక్కలో వేసుకుని అటువైపు తిరిగి పడుకుంది మౌనంగా.

మర్నాడు ఉదయాన్నే రాజాబాబుని చంకనేసుకుని బయల్దేరింది మంగళగౌరి.

"ఇంత పొద్దున్నే ఎందాకే?" అన్న రాజమ్మకి "ఏట్లోకి" అని శాంతంగా సమాధానం చెప్పింది. చూస్తూ ఉండిపోయాడు రంగశాయి.

మూడోరోజు పదిగంటల వేళకి ఒంటరిగా గుమ్మంలోకి వచ్చిన మంగళగౌరిని చూసి "సంటోడేడే" అని కంగారుగా అడిగింది రాజమ్మ. వీధరుగు మీద సైకిలు తుడుచుకుంటున్నాడు రంగశాయి.

"పాల్డబ్బా కొన్లేని మొగోడికి కొడుకెందుకంటా? మా నానకాడ ఇడిసిపెట్టి ఒచ్చేసేను. మనకంటే పిల్లలక్కర్లెద్దు కానీ, సంటోడికి లోటు సేసే మడిసి కాదు మా నాన" చాలా మామూలుగా చెప్పింది మంగళగౌరి.

"ఇంకా పాలిడిసిపెట్లేదే" బాధ పడింది రాజమ్మ.

"ఇత్తా ఉంటే ఎన్నాలైనా తాగుతాడు.." మంగళగౌరి ఇంకా మాట్లాడుతూనే ఉంది, సైకిలెక్కేశాడు రంగశాయి.

కోపాన్నంతటినీ కాళ్ళలోకి తెచ్చుకుని సైకిలు తొక్కుతున్నాడేమో, అతనికి తెలియకుండానే కృష్ణవేణి ఇంటిముందు ఆగింది సైకిలు. గుమ్మానికి వేసిన తాళంకప్ప పలకరించింది.

"ఆలక్కోలింటికి ఎల్లింది బాబుగోరూ.. శాన్నాల్లయ్యింది.. ఇంకా రాలేదు" పక్కింటి ముసలమ్మ చెప్పింది.

"అదొత్తే ఏటన్నా సెప్మంటారా.." ముసలమ్మ ప్రశ్న గాలిలో ఉండగానే సైకిలు ఆ వీధి దాటేసింది.

ఎండని పట్టించుకునే స్థితిలో లేడు రంగశాయి. ఆకలిదప్పులు అతన్ని ఆపడం లేదు. గుండెల్లో మొదలయిన మంట పిక్కల్లోకి పాకి బలంగా సైకిలు తొక్కిస్తోంది అతనిచేత. కేవలం అతని అదృష్టం, ఏ ప్రమాదమూ జరక్కుండా రాజమండ్రి చేరుకున్నాడు, కనుచీకటి పడే వేళకి.

కృష్ణవేణి చెప్పిన గుర్తులు జ్ఞాపకం చేసుకుంటూ మెరక వీధికి చేరుకోగానే పెద్దగా కష్ట పడకుండానే కనిపించిందామె. ఓ చిన్న పాతకాలపు డాబా ఇంటి వీధరుగు మీద కూర్చుని ఉంది. పసుప్పచ్చ చీర, ఎర్ర జాకెట్టు.. జడలో మల్లెలు, గులాబీలు. అప్పుడే స్నానం చేసి వచ్చినట్టుగా ఉంది.

చెమటలు కక్కుతూ, ఎర్రటి కళ్ళతో సైకిలు దిగిన రంగశాయిని చూసి విస్తుపోయింది కృష్ణవేణి. వీధి తలుపేసి, అతన్ని లోపలి తీసుకెళ్ళి ముందుగా మంచినీళ్ళిచ్చింది. ఆ వెనుకే టీ పట్టుకొచ్చింది. తాగుతూ ఉండగానే, లుంగీ చేతిలో పెట్టి స్నానం చేసి రమ్మంది.

తల తుడుచుకుంటూ వచ్చిన రంగశాయిని మంచం మీద కూర్చోబెట్టి, కంచంలో వేడి వేడి అన్నం, బంగాళా దుంపల కూర తెచ్చి అందించింది. ఆత్రంగా అన్నంలో కూర కలిపిన రంగశాయి మొదటి ముద్దని ఆమె నోటికి అందించాడు. అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది ఒక్క క్షణం.

భోజనం అయ్యాక, మంచానికి రెండో చివర కూర్చుని అతని కాళ్ళు ఒత్తడం మొదలు పెట్టింది. ఒక్కుదుటన లేచి ఆమె ఒళ్ళో తలపెట్టుకున్నాడు రంగశాయి. అతని వెన్ను రాస్తూ ఉండిపోయింది కృష్ణవేణి, నిశ్శబ్దంగా.

(ఇంకా ఉంది)

4 కామెంట్‌లు:

  1. bavundandi...
    baga rastunnaru..
    naaku inka santhosham entante twaraga rastunnaru :) ilage continue cheyandi..

    రిప్లయితొలగించండి
  2. గోదారి నేపథ్యంలో చాలా కథలే వచ్చాయ్ కానండీ, మీ 'కృష్ణవేణి' ముందు వరసలో ఉంటుంది. ఇప్పటిదాకా నేను చాలా ఎక్కువసార్లు చదివిన ఎపిసోడ్ ఇదే.

    మామూలుగా కనిపించే బలమైన పాత్ర రంగశాయి. ఆఖరి పేరా అద్భుతం.

    రిప్లయితొలగించండి
  3. @కొత్తావకాయ: చాలా పెద్ద ప్రశంసండీ... ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి