బుధవారం, ఆగస్టు 03, 2011

పెంకుటిల్లు

బాగా డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉంటారు. ఏమీ లేని వాళ్ళు పూరి గుడిసెలో నివాసం ఉంటారు. మరి, ఉన్నవాళ్ళకి తక్కువగానూ, లేని వాళ్లకి ఎక్కువగానూ ఉన్న మూడో వర్గం? 'మధ్య తరగతి' అని తమని తను గర్వంగా పరిచయం చేసుకునే ఈ వర్గం జనాభా, ఇప్పుడెలా ఉన్నా ఓ ముప్ఫై నలభై ఏళ్ళ క్రితం మాత్రం పెంకుటిళ్ళలో నివాసం ఉండేది. ఈ తరగతిని ఇంత చక్కగా ప్రతిబింబిస్తుంది కాబట్టే, ఓ మధ్యతరగతి కుటుంబాన్ని ఇతివృత్తంగా తీసుకుని సుమారు నలభయ్యేళ్ళ క్రితం తను రాసిన నవలకి 'పెంకుటిల్లు' అని పేరు పెట్టారు రచయిత కొమ్మూరి వేణుగోపాల రావు.

కొన్ని కొన్ని విలువల విషయంలోనూ, సంప్రదాయాల విషయంలోనూ మిగిలిన రెండు వర్గాల కన్నా పట్టింపులు కొంచం ఎక్కువ ఈ మధ్యతరగతికి. చిదంబరశాస్త్రి కుటుంబ సభ్యులూ అంతే. వృద్ధురాలైన తల్లి, భార్య శారదాంబ, ముగ్గురు కూతుళ్ళు అన్నపూర్ణ, రాధ, ఛాయ, ముగ్గురు కొడుకులు నారాయణ, ప్రకాశ రావు, వాసుదేవరావు ఇదీ చిదంబరశాస్త్రి కుటుంబం. పిల్లల్లో అన్నపూర్ణకి పెళ్లిచేసి పంపించారు. రాధ యుక్తవయస్కురాలు. ఛాయ ఇంకా చిన్నపిల్ల. కుటుంబం కోసం చదువు మధ్యలోనే ఆపేసి పెద్ద కొడుకు నారాయణ బ్యాంకు ఉద్యోగంలో ప్రవేశించగా, రెండోవాడు ప్రకాశం మద్రాసులో లా చదువుతూ ఉంటాడు. బళ్ళో చదువుకుంటూ ఉంటాడు ఆఖరివాడు వాసూ.

తాతల నుంచి సంక్రమించిన రెండెకరాల పొలం, ఓ పెంకుటిల్లూ తప్ప ఇతరత్రా ఆస్తిపాస్తులేవీ లేవు చిదంబర శాస్త్రికి. అయినా, అతనికి ఒకరి కింద పనిచేయడం ఇష్టం ఉండదు. వ్యాపారం చేయడం రాదు. ఈ కారణానికి ఇంట్లోనే ఉండి మిత్రులతో తీరికలేకుండా పేకాడుతూ కాలం గడుపుతూ ఉంటాడు. ఇంట్లోనే ఉంటూ ఎలా కాలం గడపాలో అర్ధం కాదు రాధకి. సంప్రదాయం ఆమెని గడప దాటి బయటికి వెళ్ళనివ్వదు. పొలం మీద వచ్చే కొద్దిపాటి ఆదాయం, నారాయణకి వచ్చే వందరూపాయల జీతం మాత్రమే ఆ కుటుంబానికి ఆధారం. ఇంటి ఖర్చులతో పాటు ప్రకాశం చదువు ఖర్చు కూడా వీటిలోనే.



తను బీదవాడిననే భావన కుంగదీసేస్తూ ఉంటుంది ప్రకాశాన్ని. అతను అద్దెకి ఉండే ఇంటి యజమాని రామారావు, ఆయన కూతురు శకుంతల ఎంతో మంచి వాళ్ళు, సహృదయులు. వాళ్ళ కలిమికి తోడు, కులం పట్టింపు కారణంగా ప్రకాశం వాళ్లకి దూరంగానే మసలుతూ ఉంటాడు. అతనెంత దూరంగా ఉండాలనుకుంటాడో పరిస్థితులు అంతగా దగ్గర చేస్తాయతన్ని ఆ కుటుంబానికి. ఇటు అతని ఇంట్లో ఒకదానిమీద ఒకటిగా సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. వాసుకి రోడ్డు ప్రమాదం జరగడం, ముసలావిడకి అనారోగ్యం, చావుబతుకుల్లో ఉన్న ఆవిడ నారాయణ పెళ్లి చూడాలని పట్టు పట్టి కూర్చోడం, కొన్ని బాధ్యతలైనా నేరవేర్చాక పెళ్లి చేసుకోవాలనుకున్న నారాయణ, కుటుంబ సభ్యుల బలవంతం వల్ల సుగుణని పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోతాయి.

రాధ ఇంట్లో అందరిలోకీ భిన్నంగా ఆలోచించే అమ్మాయి. ఆమెకి కుటుంబం కోసం ఏదన్నా చేయాలని ఉంటుంది, కానీ ఏమీ చేయలేని పరిస్థితులు. ఇంట్లో అందరికీ తలలో నాలుకలా ఉండే రాధకి సమస్యలు బోలెడు. అందగత్తె కావడంతో ఆమెని ప్రేమించామని వెంట పడేవాళ్ళు, కోరిక తీర్చమనే వాళ్ళు.. తన సమస్యలు ఇంట్లో చెప్పి వాళ్లకి మరింత సమస్య కాలేదు, అలాగని తనలోనే దాచుకోలేదు. కొన్ని అనుకోని పరిణామాల అనంతరం, చిదంబర శాస్త్రి జైలుకి వెళ్ళాల్సిరావడం, ఆ కుటుంబం పెంకుటిల్లు ఖాళీ చేయాల్సి రావడం ఒకే సారి జరుగుతుంది. ఆ కుటుంబం ఆ ఇంటిని నిలబెట్టుకోగలిగిందా? నారాయణ తను బాధ్యతలు తీర్చుకున్నాడా? ప్రకాశం కథ ఏమయ్యింది? ఇత్యాది ప్రశ్నలకి జవాబిస్తూ ముగుస్తుందీ నవల.

కొమ్మూరికి 'ఆంధ్రా శరత్' బిరుదు తెచ్చి, 'పెంకుటిల్లు' వేణుగోపాలరావుగా కీర్తినార్జించిన నవల ఇది. ఒకటి రెండు నాటకీయమైన మలుపులని మినహాయిస్తే అచ్చంగా మన పక్కింట్లోనో, ఎదురింట్లోనో జరిగినట్టుగా అనిపించే కథ. ఇంటి పెద్ద తన బాధ్యతని విస్మరిస్తే, ఆ కుటుంబం ఎలాంటి ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వస్తుందో కళ్ళకి కట్టిన నవల. అన్నింటికీ మించి కాలంతో పాటుగా తప్పనిసరిగా మారే మధ్యతరగతి విలువల పరిణామ క్రమాన్ని రికార్డు చేసిన నవలగా 'పెంకుటిల్లు' ది సుస్థిర స్థానం. 'పెంకుటిల్లు' తర్వాత ఈ తరహా నవలలు చాలానే వచ్చాయి, కానీ ఇంతటి సునిశిత చిత్రణ అరుదు. ఎమెస్కో ప్రచురించిన 280 పేజీల ఈ నవల వెల రూ. 70. ఓ నవల చదువుతున్నట్టుగా కాక, డాక్యుమెంటరీని చూస్తున్నట్టుగా అనిపించడం ఈ 'పెంకుటిల్లు' ప్రత్యేకత. ఈ నవల, 'హౌస్ సర్జన్' చదివితే, ఇవి రెండూ రాసిన రచయిత ఒకరేనా? అని ఆశ్చర్యం కలుగుతుంది.

12 కామెంట్‌లు:

  1. నిజమే,పెంకుటిల్లు నవల తెలుగులో ఉత్తమ నవలల్లో ఒకటిగా భావిస్తారు.ఆయన హౌస్ సర్జన్ నవల హౌస్ సర్జన్ అనుభవాలనివర్ణిస్తుంది. రమణారావు.ముద్దు

    రిప్లయితొలగించండి
  2. గౌరవనీయులైన మురళి గారికి,

    మీ బ్లాగ్ చాలా బాగుందండి. ఈ మధ్యే చదవడం స్టార్ట్ చేసాను.2 సంవత్సరాలుగా మీరు రాస్తున్న టపాలన్నీ 10 రోజులలో దాదాపు చదివేసానండి.

    అన్ని టపాలు బాగా నచ్చాయి కానీ శేఖర్ కమ్ముల గారి గురించి మాత్రం మీతో ఏకీభవించలేకపోయాను. మీ పదాలలో చెప్పాలంటే 'పంటి కింద రాయి ' లా అనిపించింది.

    మీరు ఇలాగే టపాలు రాస్తూ మమ్మల్ని అలరించాలని కోరుతూ,

    మీ అభిమాని.

    రిప్లయితొలగించండి
  3. ఏనాటి పెంకుటిల్లు!! వీధి చివర నిష్ఠల సుబ్బారావు గారి లైబ్రరీ నుంచి పది గంటల వేళప్పుడు తెచ్చుకొని భోజనానికి పిలిచేలోపు పూర్తి చేసేసి, ఎడాకటి వేళ ఏ జంతికలో తింటూ మళ్ళీ ఇంకో సారి చదివి యేభైపైసల అద్దె కిట్టించుకున్న పుస్తకం. నేను ఇండియా వస్తే, నాతో పుస్తకాల షాపింగ్ కి గానీ వస్తారేంటి సారూ! మీకూ ఓ బండెడు పుస్తకాలు కొనిపెడతా దక్షిణగా. హమ్మయ్యో! మీకెన్ని పుస్తకాల గురించి తెలుసో!

    రిప్లయితొలగించండి
  4. మురళీ గారూ తెలుగు సాహిత్యం లో ఆణి ముత్యాల్లాంటి నవలలలో ఒకటైన పెంకుటిల్లు ని బ్లాగర్లకి పరిచయం చేస్తున్నందుకు ముందుగా మీకు అభినందనలు.

    ఎప్పుడో చిన్నప్పుడు చదివానండీ ఈ నవల. అప్పట్లో దీనికి పెద్దగా ప్రాధాన్యమివ్వలేదు. బహుశా అప్పటికి ఈ కథలో లోతు అర్ధం చేసుకునే వయసూ కాదేమో. :). సర్కస్ చూడటానికి పావలా అప్పు చేసిన వాసు ఆ అప్పు తీర్చడానికి తప్పు మీద తప్పు చేయడం మాత్రం గుర్తుంది(ఇప్పుడు చదివితే ఆఫ్ట్రాల్ పావలా కోసం అంత మానసిక సంఘర్షణ పడ్డాడా అనిపించచ్చేమో కానీ కథాకాలానికి, ఆ మాటకొస్తే నా చిన్నప్పటికీ వాసు వయసులో పావలాకి విలువేక్కువే). ఈయనదే హౌస్ సర్జన్, కాపాడే కత్తి మాత్రం చదివిన గుర్తున్నాయి.. ఆ తరవాత చాలా రోజులకి మొన్నీమధ్య తృష్ణ గారి బ్లాగులో ఈ నవల గురించి చదివినప్పుడు పదిహేడు, పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఆయన పెంకుటిల్లు లాంటి నవల రాశారని, ఈ నవలతోనే ఆయన్ను ఆంధ్రా శరత్ గా పేరొచ్చిందని చదివి దీనికోసం ఎంత వెతికినా ఇంట్లో కనిపించలేదు. ఆంధ్రా శరత్ అన్నాక ఆగుతామా? వెంటనే వెళ్లి పుస్తకం కొనుక్కొచ్చి ఏకబిగిన చదివేశా. మీరన్నట్టు మనం ఎదురుగా నిలబడి చూస్తున్నట్టుగానే ఉంటుంది. ఆ పుస్తకం తాలూకా ట్రాన్స్ లోంచి బయటకి రాడానికి చాలా సమయం పట్టింది. అంత చిన్న వయసులో ఇంత లోతుగా మధ్యతరగతి జీవన చిత్రణ చేయడం అద్భుతమనిపించింది. పాత్రల మానసిక సంఘర్షణ ముఖ్యంగా ఆనందరావు ఇంటినుంచి వస్తున్నప్పుడు రాధ పడే సంఘర్షణ, కాలు పోయి మంచం మీద ఉన్నప్పుడు వాసుకి, ప్రకాశం కి మధ్య సంభాషణ నాకు చాలా బాగా నచ్చాయి. సినిమాగా తీయడానికి కావలసిన అన్ని అర్హతలు ఈ నవలకి ఉన్నా మరి ఎందుకో ఎవరూ ఆ దిశగా ఆలోచించినట్టు కనిపించదు. ఈ నవల గురించి రాయాలని నేను అనుకుంటూనే ఎప్పటికప్పుడు బద్ధకిస్తూ ఉన్నాను. మీరు కథా క్రమం ,పాత్రల పరిచయ వివరణచేస్తే, ఆవిడ కథాక్రమం, పాత్రల సంఘర్షణ పై విశ్లేషణ చేసి మొత్తం మీద ఇంక నాకు రాయడానికి ఏమీ మిగల్చలేదు. వా :(((((((((((((((
    (కామెంటే చిన్న సైజు పోస్ట్ లా తయారయిందా :)))) )

    పెంకుటిల్లుకి తృష్ణ గారి పరిచయం ఇదిగో : http://trishnaventa.blogspot.com/2010/09/blog-post_17.html

    రిప్లయితొలగించండి
  5. నా మిత్ర్లులోకరు మొట్టమొదటిసారి మా ఇంటికి వస్తూ నాకా పుస్తకం బహుమతిగా తెచ్చారండీ ఇవ్వడమేకాకుండా ఆ పుస్తకం చదివేవరకు అడిగేవారు చదివాన లేదా అని :-) చక్కని పుస్తకం ఆసక్తికరంగా సాగుతుంది .

    ఒకప్పుడు అంటే చిన్నతంలో కొమ్మూరి ఫ్యాన్ ని ఆయన రాసిన హౌస్సర్జన్ చాల ఇష్టం కళ్ళ కి కట్టినట్లు రాసారు .కొమ్మురివారి రచనలన్నీ ఒక్కొక్కటి పరిచయం చేయండీ .

    రిప్లయితొలగించండి
  6. నేనొకసారి మిమ్మల్ని పెంకుటిల్లు గురించి వ్రాయమని అడిగాను, గుర్తుందా మురళిగారు! బాగుందండి. నాకెందుకో గాని రాధ కారెక్టర్ అంటే చాలా ఇష్టం.

    రిప్లయితొలగించండి
  7. @కమనీయం: ధన్యవాదాలండీ..
    @స్వాతి; మీ సమయాన్ని వెచ్చించి, ఓపికగా నా టపాలన్నీ చదివి, మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలండీ.. మీరు ఏకీభవించలేక పోయిన పాయింట్ ఏమిటన్నది చెబితే, నేనేమన్నా జవాబు ఇవ్వగలిగే వీలు ఉంటుందండీ..
    @కొత్తావకాయ: అబ్బే.. నేను తెలుసుకోవాల్సిన పుస్తకాలు ఇంకా బోలెడు ఉన్నాయండీ.. మీరు పుస్తకాలు షాపింగ్ చేయాలనుకుంటే ఓ నాలుగైదు రోజులు బ్లాగుల ముందు కూర్చుంటే ఓ మంచి జాబితా తయారు చేసేసుకోవచ్చు.. ఓ కాపీ మీ బ్లాగులో ఉంచితే అందరికీ ఉపయోగం కూడా.. మీ లెండింగ్ లైబ్రరీ అనుభవం బాగుందండీ.. వీలయితే ఇలాంటివి మీ బ్లాగులో ఓ టపాగా రాయండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. @శంకర్.ఎస్. : సినిమా/సీరియల్ ఆలోచన నాకు చదివిన ప్రతిసారీ వస్తుందండీ.. కానీ ఇప్పుడు తీయడం మొదలు పెడితే ఈ కథని ఎన్ని ఖూనీలు చేస్తారో అని భయంగా కూడా ఉంది.. ధన్యవాదాలు.
    @చిన్ని: తప్పకుండానండీ.. ధన్యవాదాలు.
    @జయ: అవునండీ.. 'హౌస్ సర్జన్' రాసినప్పుడు అడిగారు.. కొమ్మూరి వారిదే మరో నవల వెంటనే ఎందుకు అనుకున్నాను అప్పట్లో.. ఆ వాయిదా వాయిదా ఇప్పటికి కుదిరింది మళ్ళీ :)) ..ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  9. మురళి గారూ,

    నేను ఏకీభవించలేకపోయిన విషయం, హపీడేస్ సినిమా గురించండీ. నేను ఇంజినీరింగ్ చేసానండి. నేను సినిమా తో పూర్తిగా కనెక్ట్ కాగలిగాను. కొన్ని, కొన్ని సినిమాటిక్ గా ఉన్నా, నన్ను నా ఫ్రెండ్స్ ని స్క్రీన్ మీద చూసినట్టు అనిపించిందండి. సినిమా అనేది సందేశం కోసం కాకుండా ఎంటెర్టైన్మెంట్ కోసం చూస్తే ఈ సినిమా నచ్చుతుందని నా అభిప్రాయమండి. లీడర్ సినిమా కూడా నాకు బాగా నచ్చిందండి. శేఖర్ గారిలో దర్శకత్వ లోపాలు ఐతె ఉన్నాయండి. కాని తన attempts మెచ్చుకోవచ్చండి. రొటీన్ సినిమాలకి భిన్నంగా బావుంటాయని నా అభిప్రాయం.

    మీరు కొత్తావకాయ గారితో చెప్పినట్టు, మీ బ్లాగు ముందు కూచుని కొనవలసిన పుస్తకాల జాబితా తయారు చేస్కున్నానండి. 'avkf.org' గురించి కూడా మీ బ్లాగు లోనె తెలుసుకున్నాను. ఇలా మంచి పుస్తకాలని మాకు పరిచయం చేస్తున్నందుకు మరొక్కసారి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. @స్వాతి: ఈమధ్య కాలంలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన మరికొందరు బ్లాగ్మిత్రులు కూడా 'హ్యాపీడేస్' విషయం లో నా అభిప్రాయాలతో విభేదించారండీ.. నేననేది ఏమిటంటే, బయట కాలేజీల్లో కూడా ఈ సినిమాలో చూపించినట్టుగానే జరుగుతూ ఉండొచ్చు, ర్యాగింగులు, పరిక్షలప్పుడు మాత్రమే చదవడాలు లాంటివన్నీ.. కానీ ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి అనుకున్న దర్శకుడు వాటినే తెరకెక్కించడం ద్వారా 'మీరు చేసేది సరైన పనే' అని పిల్లల్ని ప్రోత్సహించినట్టు అవ్వదా? అన్నది నా ప్రశ్న. ఏమైనప్పటికీ, మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. అన్నట్టు కేవలం నా బ్లాగు మాత్రమే కాదండీ, ఇంకా చాలా బ్లాగుల్లోనూ పుస్తకాలకి సంబంధించిన సమాచారం దొరుకుతుంది మీకు..

    రిప్లయితొలగించండి
  11. నేను హ్యాపీడేస్ వచ్చేప్పటికి ఫార్మసీ చదువుతూ ఉన్నాను. దాదాపు ఇంజనీరింగు మూసలోనే ఉంటుంది కరిక్యులం(ప్రతిరోజు ల్యాబులుండడం లాంటివి తప్ప). అప్పట్లో ఈ సినిమా బాగా నచ్చింది. కానీ మా క్లాస్ మేట్లు ఆ సినిమా క్యారెక్టర్లలో పోల్చుకోవడం, వాళ్లని అనుకరించి పిచ్చిపనులు చెయ్యడం, స్టూడెంట్లు చేసే ప్రతీ పనికిమాలిన పనీ హీరోయిజంగా భావించడం చూసాకా ఈ సినిమా దుష్ప్రభావం తెలిసింది. ఎలా తిరిగినా చివరకు క్యాంపస్ సెలక్షన్ లో జాబ్స్ వచ్చేస్తాయని అనుకున్నవాళ్లు ఎందరో.

    రిప్లయితొలగించండి
  12. @పక్కింటబ్బాయి: నా సందేహాల్లో కొంచమైనా నిజముందన్న మాట, అయితే.. !! ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి