నాయికలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నాయికలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

బుధవారం, మార్చి 08, 2017

కొందరు నాయికలు

తెలుగు సాహిత్యంలో ఇప్పుడు స్త్రీవాదం అంటే అయితే పేరాలకొద్దీ రుతుక్రమ వర్ణన, శానిటరీ నాప్కిన్లు వినియోగించే విధానం... కాకుంటే భర్త కన్నుకప్పి మేనల్లుడితోనో, మేనేజరుతోనో సంబంధం పెట్టుకోవడం.. తప్పితే పురాణ పాత్రల పేర్లని మాత్రమే తీసుకుని నచ్చినట్టుగా ఉపన్యాసాలు ఇప్పించడం.. కొత్తగా చదవడం మొదలు పెట్టినవాళ్ళకి ''ఇంతేనా ఫెమినిజం అంటే?" అని భావన కలిగించేలా ఉంటున్నాయి మెజారిటీ రచనలు. స్త్రీల లైంగికత ఇతివృత్తంగా రచనలు రాకూడదని కాదు, కానీ బూతు రచయితలని మించి రచయిత్రులే స్త్రీ అంగాంగ వర్ణన చేయడం, అదేదో చాలా గొప్ప సాహసోపేతమైన రచనగా భావించి ప్రచారం చేసుకుంటూ ఉండడమే బాధ కలిగిస్తున్న విషయం.

తెలుగు సాహిత్యంలో స్త్రీ లైంగికతని గురించి చర్చ ఇవాల్టిది కాదు. వందేళ్ళకి పూర్వమే మొదలయ్యింది.. ఇంకా కొనసాగుతూనే ఉంది. భర్తతో సుఖం లేక, అమీరుతో లేచిపోయిన 'మైదానం' నాయిక రాజేశ్వరి, తెలుగు సాహిత్యంలో మహిళల లైంగికతను గురించి విస్తృతంగా చర్చకు పెట్టిన మొదటి నాయిక. చలం సృష్టించిన రాజేశ్వరి గానుగెద్దు సంసారంలో సుఖం లేదని గ్రహించింది. తొలిచూపులోనే అమీరుపై మోహం కలగడం, అతడూ ఆమెని మోహించడంతో వాళ్లిద్దరూ పచ్చని పచ్చికలు, జలపాతాలూ ఉన్న మైదానంలోకి స్వేచ్ఛగా ప్రయాణం కట్టారు. అక్కడ ఆకలి దప్పుల ప్రసక్తి లేకుండా, శృంగారమే జీవితంగా కాలం గడిపారు.

కొన్నాళ్ళు గడిచేసరికి అమీరుకి మరో స్త్రీపై మనసయింది. అతడి కోసం ఆ స్త్రీని బతిమాలి ఒప్పించింది రాజేశ్వరి.. ఇది ఆమె ప్రేమ ప్రకటన. అంతే కాదు, రాజేశ్వరి సైతం అమీర్ బంధువుల కుర్రాడు మీరా పై మనసు పడింది. తదనంతర పరిణామాలు అమీర్ హత్యకి గురవ్వడానికీ, ఆ నేరం తనమీద వేసుకుని ఆమె జైలుకి వెళ్ళడానికీ దారితీశాయి. లేచిపోయిన రాజేశ్వరి ఏం సాధించింది? అని ప్రశ్నించుకుంటే, ఆమె కోరుకున్న శృంగార జీవితాన్ని తృప్తిగా అనుభవించింది అన్న సమాధానం దొరుకుతుంది. 'అంతకు మించి ఇంకేం చేయగలదు' అన్న ప్రశ్నకి జవాబిస్తుంది రత్నావళి, విశ్వనాథ సత్యనారాయణ 'చెలియలికట్ట' నవలా నాయిక. రాజేశ్వరికి అమీరుపైన కలిగిన మోహం లాంటిదే, రత్నావళి కి తన మరిది రంగారావు మీద కలిగింది. దానికామె ప్రేమ అని పేరు పెట్టుకుంది.

పదిహేనేళ్ల అమాయకపు గృహిణిగా గడప దాటిన రత్నావళి, కేవలం శృంగారం మాత్రమే జీవితం అనుకోలేదు. శృంగారంతో పాటుగా ఇంకా చాలా విషయాలున్నాయని గ్రహించింది. ముఖ్యంగా విద్య ఆవశ్యకత తెలిసొచ్చిందామెకి. చదువుకుని, ఉద్యోగంలో చేరి స్త్రీ సాధికారికతకి ఉదాహరణగా నిలిచింది. ఇందుకు రంగారావు సహాయమూ చాలానే ఉంది. అంతే కాదు, గడపదాటిన రత్నావళి, రంగారావు మినహా మరో పురుషుడిని దగ్గరకి చేరనివ్వలేదు. అలా చేరనిచ్చి ఉంటే ఆమె చదువుని, ఉద్యోగాన్ని సాధించడం జరిగి ఉండేదా అన్న ప్రశ్న వస్తుంది. రాజేశ్వరి కథ జైల్లో ముగిస్తే, చెలియలికట్ట దాటిన రత్నావళి కథ సముద్రగర్భంలో ముగుస్తుంది. బహుశా, చలం సంప్రదాయ వాదులని సంతృప్తి పరచడానికీ, స్వయంగా సంప్రదాయ వాది అయిన విశ్వనాథ గడప దాటే స్త్రీని గురించి తన అభిప్రాయం వెల్లడించడానికి ఈ ముగింపులు ఇచ్చి ఉండొచ్చు.

ఒకటి రెండు దశాబ్దాలు గడిచేసరికి, గడప దాటనవసరం లేకుండానే లైంగిక అవసరాలు లేదా వాంఛలని తీర్చుకునే మార్గాలు తొక్కిన నాయికలు తారస పడతారు. కుటుంబం అనే భద్ర చట్రంలో ఉంటూనే, సంతానం నిమిత్తం తన బావ దయానిధితో కూడుతుంది అమృతం. బుచ్చిబాబు 'చివరకు మిగిలేది' నవలలో ప్రత్యేకంగా కనిపించే ఈ స్త్రీపాత్ర, దయానిధితో సంబంధాన్ని కేవలం ఒక్క రాత్రికే పరిమితం చేసుకుంది. ఆమె భర్తకి మరో స్త్రీతో సంబంధం ఉందని రూఢిగా తెలుసు కాబట్టి, వైవాహిక జీవితాన్ని నిలబెట్టుకోడానికి సంతానం అవసరం కాబట్టీ అమృతం ఆ మార్గం తొక్కినట్టు అనిపిస్తుంది. నిజానికి, ఆమె తల్చుకుంటే ఆ సంబంధాన్ని కొనసాగించేదే.. కానీ, కుటుంబం అనే చట్రం నుంచి బయటికి రాడానికి ఇష్టపడలేదు అమృతం.

తొలితరం ఉద్యోగినులకు ప్రతినిధిగా చెప్పగలిగే పాత్ర ఇందిర. బాధ్యతలేని సోమరి తండ్రిని ఉద్యోగం చేసి పోషిస్తూనే, తనకంటూ ఓ తోడునీ, భద్ర జీవితాన్నీ వెతుక్కోవలసిన అవసరం కలుగుతుంది ఇందిరకి. డాక్టర్ పి. శ్రీదేవి నవల 'కాలాతీత వ్యక్తులు' లో ప్రధాన పాత్ర అయిన ఇందిరకి లోకం మీద కక్ష. సంఘం తాలూకు విలువల మీద పెద్దగా గౌరవం లేదు. అలా అని సంఘాన్ని ఎదిరించే ఆలోచనా లేదు. తనకంటూ ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలనే తాపత్రయంలో, తన ఇంటి పై వాటాలో అద్దెకి ఉండే మెడికో ప్రకాశంతో సంబంధం పెట్టుకుంటుంది ఇందిర. ఆమె వరకూ, ఈ సంబంధం అతన్ని పూర్తిగా లొంగదీసుకోవడం కోసమే తప్ప అతనిమీద ప్రేమతోనో, మోహంతోనో కాదు. ప్రకాశం చేజారిపోయినప్పుడు, బాధపడుతూ కూర్చోకుండా మరొక వ్యక్తిని వెతుక్కునే ప్రయత్నం మొదలుపెడుతుంది ఇందిర.

మోహంతోనో, ప్రేమతోనో కాక కుటుంబ అవసరాలు గడిపే నిమిత్తం పరాయి మగవాళ్ళతో శృంగార సంబంధాలు నెరిపిన స్త్రీ పాత్రలూ మనకి కనిపిస్తాయి. చాసో కథ 'లేడీ కరుణాకరం' నాయిక శారద ఇందుకు ఓ ఉదాహరణ. అత్యాశాపరుడైన తండ్రి ఆమెని వ్యభిచారంలోకి దింపితే, అటు తర్వాత ఆమెని పెళ్లిచేసుకున్న కరుణాకరం తన ఎదుగుదల కోసం ఆమె సంబంధాలని ఆమోదిస్తాడు. నిజానికి, విలువల కన్నా డబ్బుదే పైచేయి అన్న విషయాన్ని ఆచరణలో గ్రహించిన శారద అతన్ని ఒప్పిస్తుంది. అనతికాలంలోనే ఆర్ధికంగా పైపైకెదిగిన ఆ జంట సమాజం దృష్టిలో ఆదర్శ దంపతులు. శారద పరిస్థితుల కన్నా కొంచం భిన్నమైనవి 'శారద' (ఎస్. నటరాజన్) రాసిన 'రక్తస్పర్శ' కథలో నాయిక అనసూయ పరిస్థితులు. కొంత జీవితం చూశాక వితంతువుగా మారడం, తమ్ముడి చదువు కొనసాగించేందుకు మగ దక్షత అవసరం కావడంతో తనకి పనికొచ్చే వాళ్ళని ఎంచుకుని వాళ్ళతో గుట్టుగా సంబంధాలు కొనసాగిస్తుంది.

వీళ్ళందరికీ భిన్నంగా, అననుకూల దాంపత్యంలో కూడా భర్త తోడిదే లోకంగా బతికిన రామసీత కథ 'ఒఖ్ఖ దణ్ణం.' జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి (జరుక్ శాస్త్రి) రాసిన ఈ కథ చదువుతున్నంత సేపూ, "రామసీత ఇంకా ఎందుకతన్ని భరించడం.. తనదారి తాను చూసుకోవచ్చు కదా" అనిపించేస్తూ ఉంటుంది. సహనానికి మారుపేరుగా ఉన్న రామసీత కూడా భర్తకి దూరంగా జరిగేందుకు సిద్ధపడడం ఈ కథకి ముగింపు. ముందుగా చెప్పినట్టుగా, ఈ నవలలు, కథలు రాసిన రచయిత (త్రు) లు స్త్రీ లైంగికతని భిన్న కోణాల్లో చర్చకి పెట్టారు తప్ప పాఠకుల్లో ఉద్రేకం పెంచే విధంగా అంగాంగ వర్ణనల్ని ఇరికించే ప్రయత్నం చేయలేదు. మరోసంబంధంలోకి వెళ్ళడానికి పూర్వం, వెళ్లిన తర్వాత స్త్రీకి ఎదుర్కొన్న పరిస్థితుల్ని తమదైన దృష్టికోణంగా వాస్తవికంగా చిత్రించారు తప్ప, ఆ సంబంధాలని మాత్రమే వర్ణించి ఊరుకోలేదు. నేటితరం ఫెమినిస్టు రచయితలు ఈ విషయాన్ని గుర్తిస్తే బావుంటుందేమో..

శుక్రవారం, మార్చి 03, 2017

నాయికలు-రత్నావళి

బతికి చెడిన జమీందారీ కుటుంబంలో పుట్టింది రత్నావళి. ఆ కుటుంబం అంతా విద్యావంతులే. ఆమెకూడా కొద్దిగా చదువుకుంది. డబ్బు కష్టాలకి తోడు, చిన్నప్పుడే తండ్రి చనిపోవడం మరో కష్టం ఆమెకి. బంధువులు ఆమె పెళ్లి బాధ్యతని తీసుకుని, నలభై ఐదేళ్ల సీతారామయ్యకి రెండో భార్యగా పదిహేనేళ్ల రత్నావళిని ప్రతిష్టాపురం పంపి, చేతులు దులుపుకున్నారు. సీతారామయ్య భార్య రత్నమ్మ కూతుర్ని, కొడుకుని కని, కూతురి పెళ్ళిచూసి, అనారోగ్యంతో కన్నుమూసింది. తల్లి మాణిక్యమ్మ, వితంతువై పుట్టింటికి తిరిగొచ్చిన చెల్లెలు సరస్వతి, పట్నంలో చదువుకుంటున్న తమ్ముడు రంగారావు బాధ్యతలు సీతారామయ్యవే. ఆ ఇంట అడుగుపెట్టిన రత్నావళి 'చెలియలికట్ట' ని దాటే పరిస్థితులని వివరంగా కళ్ళకి కట్టారు విశ్వనాథ సత్యనారాయణ.

అన్నగారి కష్టంతో బీఏ పూర్తి చేసి, ఎమ్మే ఎల్లెల్బీ చదువుతున్న రంగారావు అభ్యుదయవాది. వివాహం కారణంగా స్త్రీ స్వేచ్చకి భంగం కలుగుతోందని అతని నమ్మకం. రత్నావళికి సీతారామయ్య ఏమాత్రమూ సరిజోడు కాదని తీర్మానించుకున్న రంగారావు, ఆమెలో తిరుగుబాటు ధోరణిని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుని అభ్యుదయ సాహిత్యం చదివిస్తాడు. పట్నం నుంచి రంగారావు పుస్తకాలు పంపడం, వాటిని రత్నావళి చదువుతూ ఉండడం పట్ల ఆ ఇంట్లో ఎవరూ అభ్యంతర పెట్టరు. సీతారామయ్య వ్యవసాయమూ, కరణీకమూ నిర్వహిస్తూ నిత్యమూ ఎదురయ్యే ఆర్ధిక సమస్యల ఒడిదుడుకుల్లో తలమునకలయ్యే మనిషి.

మాణిక్యమ్మకి రత్నావళి మీద వల్లమాలిన ప్రేమ. కోడలిని కాలు కింద పెట్టనివ్వదు. సరస్వతివి స్వతంత్ర భావాలు. కుటుంబవ్యవస్థని గురించి బలమైన అభిప్రాయాలు ఉన్న స్త్రీ ఆమె. వదినెగారు ఇంటి పనుల్లో భాగం పంచుకోకపోవడం ఎంతమాత్రమూ సహించదు సరస్వతి. రంగారావుతో పుస్తకాల దగ్గర మొదలైన స్నేహం, రత్నావళికి అతనితో పక్క పంచుకోవడం వరకూ వెళ్తుంది. పెద్ద చదువులు చదువుతున్న రంగారావు ఆ సంబంధాన్ని 'స్త్రీ జనోద్ధరణ' గా భావిస్తాడు. పదిహేనేళ్ల రత్నావళి కొత్త రుచిని ఆస్వాదిస్తుంది. ఈ సంబంధాన్ని భరించలేని సీతారామయ్య, తమ్ముడికి ఆస్తిలో భాగం రాసిచ్చి, రత్నావళితో బంధాన్ని తెంపేసుకుని, వాళ్ళిద్దరినీ ఇంటినుంచి బయటికి పంపేస్తాడు.

పెళ్లినాడు సీతారామయ్య బహుమతిగా ఇచ్చిన బంగారు నగలను ఒంటి నిండా ధరించి, రంగారావుతో కలిసి చెన్నపట్నం ప్రయాణమవుతుంది రత్నావళి. తన స్నేహితులంతా అభ్యుదయ భావాలు కలవారనీ, ఆదర్శాలు పాటించే యువకులనీ, వారిలో తనకి నచ్చిన ఒక యువకుడిని రత్నావళి వివాహం చేసుకోవచ్చనీ ప్రతిపాదిస్తాడు రంగారావు. తాను రంగారావుని ప్రేమించినప్పటికీ, అతనికి తనపై ప్రేమలేదని తెలిశాక, అతని ప్రతిపాదనని అంగీకరిస్తుంది రత్నావళి. చేతిలో ఉన్న డబ్బు కరిగిపోతున్న కొద్దీ, అటు పట్నవాసం మీద మోజుతో పాటు ఇటు ఒకరిపై ఒకరికి ఆవరకూ ఉన్న మోజు కూడా కరిగిపోవడం ఆరంభిస్తుంది రత్నావళీ రంగారావులకి. అతడు చెప్పినట్టుగానే, రంగారావు స్నేహితులు ఆ ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటారు. కొందరామెని వాంఛిస్తారు కూడా.. అయితే ఎవరూ వివాహ ప్రతిపాదన చేయరు.

రంగారావు మినహా మరెవరితోనూ శారీరక సంబంధాన్ని ఏర్పరుచుకోదు రత్నావళి. కాలం గడిచేకొద్దీ ఆమె ఆలోచనల్లో మార్పు వస్తుంది. గత వైవాహిక జీవితాన్ని, ప్రస్తుత జీవితాన్నీ పోల్చి చూసుకోవడం ఆరంభిస్తుంది. రంగారావు ఆమె మీద అధికారం చెలాయించినప్పుడల్లా గత, ప్రస్తుత జీవితాలని పోల్చుకుని తర్కించుకుంటూ ఉంటుంది. తన దృష్టిని వివాహం నుంచి, విద్య మీదకి మరల్చుకుని రంగారావు, అతని స్నేహితుల సాయంతో చదువుకుని, అధ్యాపక వృత్తి ఆరంభిస్తుంది. అప్పటికే, చదువు కొనసాగించే మార్గం లేని రంగారావు పత్రికా సంపాదకుడిగా ఉద్యోగంలో చేరతాడు. రత్నావళిని వాఛించి ఆమె తిరస్కారానికి గురైన రంగారావు స్నేహితులు వాళ్ళిద్దరి గురించీ దుష్ప్రచారం ఆరంభిస్తారు.

ఈ దశలో తనని పెళ్లిచేసుకోమని రత్నావళిని కోరతాడు రంగారావు. తానామెని ప్రేమిస్తున్నానని చెబుతాడు. అయితే, ఆ ప్రతిపాదనని తిరస్కరిస్తుంది రత్నావళి. రంగారావు పక్షవాతంతో మంచాన పడడంతో తన భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపిస్తుందామెకి. అతనికి బాగయ్యాక, 'తర్వాత ఏమిటి?' అన్న ప్రశ్న ఉదయిస్తుంది. కొంతకాలం సన్యాస జీవితం గడుపుతుంది. సరస్వతి కొడుకు నీలాంబరుడు చదువుకోసం పట్నం రావడం, ఇంటికి రాకపోకలు సాగించడం, అతనిలో సీతారామయ్య పోలికలు ప్రస్ఫుటంగా కనిపించడంతో తప్పు చేశానన్న భావన మరీ మరీ పెరిగిపోతుంది రత్నావళిలో. జీవితం మీద అనురాగాన్ని పూర్తిగా కోల్పోయిన రత్నావళి తన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఏం చేసిందన్నదే 1935 లో తొలిసారి ముద్రితమైన 'చెలియలికట్ట' ముగింపు.

పదిహేనేళ్ల గృహిణిగా పాఠకులకి పరిచయమై, తర్వాతి పదిహేనేళ్ల జీవితం అనేక మలుపులు తిరిగినప్పుడు ఎదుర్కొన్న సంఘర్షణ, తీసుకున్న నిర్ణయాలు.. ఇవన్నీ రత్నావళి పాత్ర మీద ఓ ప్రత్యేకమైన అభిప్రాయాన్ని ఏర్పరుస్తాయి. మొదట వయసుకన్నా తక్కువగా ఆలోచిస్తోందనిపించిన రత్నావళి, ఉన్నట్టుండి వయసుకి మించిన పరిణతిని ప్రదర్శించడం ఆరంభిస్తుంది. ఆమె నిదానం, నేర్పు, జీవితం పట్ల ఉన్న స్పష్టత, చక్కదిద్దుకునేందుకు చేసే ఆలోచనలు, ప్రయత్నాలు.. ఇవన్నీ రత్నావళిని ఓ ప్రత్యేకమైన పాత్రగా నిలుపుతాయి.

మంగళవారం, డిసెంబర్ 24, 2013

నాయికలు-వరూధిని

కంటినిండా కలలు నింపుకుని ప్రపంచాన్ని చూడాల్సిన యవ్వనంలో ఆమె కష్టాలనీ, కన్నీళ్ళనీ చూసింది. ఒకప్పుడు వైభవంగా బతికిన తన కుటుంబం, దారిద్ర్యపు అంచులలో నిలబడడాన్ని చూసింది. తోడబుట్టిన వాళ్ళ స్వార్దాన్నీ, కన్నవాళ్ళ నిస్సహాయతనీ కళ్ళారా చూసింది. మిగిలిన తోబుట్టువుల అందరి పెళ్ళిళ్ళూ అంగరంగ వైభవంగా చేసిన తండ్రి, తన దగ్గరికి వచ్చేసరికి కనీసం అయినింటి సంబంధం వెతకడానికి కూడా తటపటాయించడాన్ని మౌనంగా గమనించింది.. అలాంటి ఆమెకి కూడా ఒక రోజు వచ్చింది.. ఓ కుటుంబాన్ని శాసించగలిగే స్థాయి వచ్చింది.. అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయాలు ఆమె జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయి? ఆమె చేతిలో కీలుబొమ్మగా మారిన ఆ కుటుంబం ఏమయ్యింది? ఈ ప్రశ్నలకి జవాబులు వెతుక్కోడానికి ముందు ఆమెని గురించి తెలుసుకోవాలి. ఆమె పేరు వరూధిని.

వ్యవసాయ రంగాన్ని ఇతివృత్తంగా తీసుకుని నాలుగున్నర దశాబ్దాల క్రితం డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి రాసిన నవల 'మట్టిమనిషి' లో నాయిక వరూధిని. గుంటూరు జిల్లాలో ఉన్న ఓ పల్లెటూళ్ళో భూస్వామ్య కుటుంబంలో పుట్టింది. తండ్రి బలరామయ్య ఆ ఊరికంతటికీ పెద్దమనిషి. చదువు, ఆటపాటలతోనూ, సినిమాలు, షికార్లతోనూ బాల్యం ఆనందంగా గడిచింది వరూధినికి. యవ్వనంలోకి అడుగు పెడుతూ ఉండగానే పట్నవాసంతో పూర్తిగా ప్రేమలో పడిపోయింది ఆమె. పరిస్థితులు అనుకూలిస్తే, పట్నంలో ఉన్న ఏ గొప్ప ఇంటికో ఆమె కోడలయి ఉండేది. కానీ, అలా జరగలేదు. వరూధినికి పెళ్లివయసు వచ్చేసరికి ఆ కుటుంబం ఆర్ధిక పరిస్థితి పూర్తిగా తిరగబడి పోయింది. అన్నలు ఆస్తులని మాత్రమే పంచుకుని, ఆమె పెళ్లిని తండ్రి బాధ్యతల్లోకి నెట్టేశారు.

పేరులో మాత్రమే జమీందారీని నిలుపుకున్న బలరామయ్యతో వియ్యమందడానికి జమీందార్లు ఎవరూ సిద్ధంగా లేరు. కాబట్టే, తన కూతుర్ని ఊరుబోయిన వెంకయ్య మనవడు, సాంబయ్య కొడుకు అయిన వెంకటపతి కి ఇచ్చి పెళ్లి చెయ్యడానికి సిద్ధ పడ్డాడు బలరామయ్య. వెంకయ్య ఆ ఊరికి వ్యవసాయ కూలీగా వచ్చి, బలరామయ్య తండ్రి వీరభద్రయ్య ఇంట పాలేరుగా జీవితం మొదలు పెట్టాడు. నెమ్మదిగా రైతుగా ఎదిగాడు. అతని కొడుకు సాంబయ్య రెక్కల కష్టాన్ని మాత్రమే నమ్ముకుని ఇంచుమించు ఓ వంద ఎకరాల భూమిని కొడుకు వెంకటపతి కి వారసత్వంగా అందించాడు. వెంకటపతికి పెద్ద మొత్తంలో కట్న కానుకలతో పిల్లనిస్తామంటూ ఎన్నో సంబంధాలు వచ్చినా, వాటన్నింటినీ రెండో ఆలోచన లేకుండా తిరగ్గొట్టేశాడు సాంబయ్య. తన తండ్రి పాలేరుగా పనిచేసిన ఇంటినుంచే కోడల్ని తెచ్చుకోవలన్నది సాంబయ్య పట్టుదల.

వెంకటపతి మొరటు మనిషి. చదువూ సంధ్యా లేనివాడు. తాతతండ్రుల బాటలో నేలని మాత్రమే నమ్ముకున్నాడు. పట్నవాసం అంటే ఏమిటో బొత్తిగా తెలియదు అతనికి. ఉండడానికి లంకంత ఇల్లు ఉన్నా, వెంకటపతి పుడుతూనే అతని తల్లి దుర్గమ్మ మరణించడం, సాంబయ్య మరో పెళ్లి చేసుకోకపోవడంతో అది ఆడదిక్కు లేని సంసారం. అలాంటి ఇంట్లో అడుగుపెట్టింది, పట్నవాసపు వాసనలున్న వరూధిని. ఆ ఇంట్లో కోడలిగా తను ఇమిడి పోడానికి శతవిధాలా ప్రయత్నం చేసింది. తన వల్ల ఎంతమాత్రం కాదని అర్ధం కావడంతో, నెలతప్పగానే కాపురాన్ని బస్తీకి మార్చింది. అప్పటికే వెంకటపతి వరూధిని చేతిలో కీలుబొమ్మ. పెళ్ళికి ముందు వరకూ తండ్రిమాట వేదవాక్కు వెంకటపతికి. అతను తనకంటూ సొంత ఆలోచనలు లేని వాడు కావడంతో, వెంకటపతిని తన దారికి తెచ్చుకోడం పెద్ద కష్టం కాలేదు వరూధినికి.

బస్తీలో, సినిమా హాల్ యజమాని రామనాధ బాబుతో స్నేహం మొదలుపెట్టింది వరూధిని. ఆ స్నేహం, అతని భాగస్వామ్యంతో బస్తీలో కొత్త సినిమా హాల్ కట్టేంత వరకూ వెళ్ళింది. వెంకయ్య, సాంబయ్యల చెమట, బస్తీలో సినిమా హాలుగా రూపాంతరం చెందింది. సాంబయ్య, వెంకటపతి ల మధ్య అంతరం మరింతగా పెరిగింది. మట్టి ఆనుపానులు మాత్రమే తెలిసిన వెంకటపతికి బస్తీలో చేసేందుకు ఏపనీ లేదు. రామనాధ బాబు ప్రోత్సాహంతో తాగుడికి అలవాటు పడ్డాడు. ఇంటి పెత్తనం మొత్తం వరూధినిదే అయ్యింది. రామనాధ బాబుతో ఆమె స్నేహం చాలా దూరమే వెళ్ళింది. వయసు మీద పడ్డ సాంబయ్య పల్లెటూరికే పరిమితం అయిపోయాడు. వెంకటపతిది కేవలం వరూధిని భర్త హోదా మాత్రమే. అటు వ్యాపార వ్యవహారాల్లోనూ, ఇటు ఇంటి విషయాల్లోనూ నిర్ణయాలు రామనాధ బాబువే. అలాంటి రామనాధ బాబు, తనకి దూరం అవుతున్నాడు అని తెలిసినప్పుడు వరూధిని ఏం చేసింది?

'రెండు తరాల మధ్య అందమైన వారధి స్త్రీమూర్తి' అంటారు గొల్లపూడి మారుతిరావు తన 'సాయంకాలమైంది' నవలలో. వరూధిని, మట్టిమనిషి సాంబయ్యకి, అతని మనవడు రవి కి మధ్య వారధిగా నిలబడింది. అటు సాంబయ్య ని, ఇటు వెంకటపతిని వాళ్ళు నమ్ముకున్న మట్టికి దూరం చేసింది. "ఎందుకు?" అన్న ప్రశ్న ఎప్పుడూ రాదు, 'మట్టిమనిషి' చదువుతూ ఉంటే. ఎందుకంటే, వరూధినికి ఆ క్షణంలో తనకి అనిపించింది చేయడం తప్ప దీర్ఘ కాలికమైన ప్రణాళికలు అంటూ లేవు. తనకి నచ్చినట్టు జీవించడానికే ఆమె వోటు. తనని కట్టుకున్నవాడి మీద జాలి, తను కన్నవాడి పట్ల బాధ్యత ఇవి మాత్రమే ఆమె దగ్గర ఉన్నవి. అందుకే, తను నమ్ముకున్న వాడు తనని నిలువుగా ముంచేయడానికి సిద్ధపడినప్పుడు, ఆమె మొదట ఆగ్రహించింది, అటుపై ప్రతీకారానికి సిద్ధపడింది.. కానీ, అతనిమీద ఆమెకి ఉన్న ప్రేమదే పైచేయి అయ్యింది.. 'మట్టిమనిషి' చదువుతూ ఉంటే, వరూధిని నాయికా? లేక ప్రతినాయికా? అన్న సందేహం చాలాసార్లే కలుగుతుంది.. వరూధిని కోణం నుంచి చూసినప్పుడు, ఆమె నాయికే..

మంగళవారం, మార్చి 19, 2013

నాయికలు-నరేంద్ర ప్రభ

ఆమె అధ్బుతమైన సౌందర్య రాశి కాదు. నిజానికి అందం కన్నా, ఆకర్షణే ఎక్కువ ఆమెలో. అదిగో, ఆ ఆకర్షణే సాక్షాత్తూ కాశ్మీర చక్రవర్తినే ఆమెతో పీకలోతు ప్రేమలో మునిగిపోయేలా చేసింది. అంతటి గొప్పవాడు ప్రేమిస్తున్నా, ఆమె ఆ ప్రేమని స్వీకరించే స్థితిలో లేదు. అతనిమీద తనకి ఉన్న ఇష్టాన్ని ప్రకటించేందుకు బదులుగా, దానిని ఆగ్రహంగా మార్చేసుకుంది. ఎందుకంటే, ఆమె అందమైన భవిష్యత్తుని కలలుకనే పదారేళ్ళ కన్నెపిల్ల కాదు. బాధ్యతాయుతమైన గృహిణి. చక్రవర్తికే అప్పు ఇవ్వగల ఆర్ధిక స్తోమతు ఉన్న వజ్రాల వర్తకుడు నోణక శ్రేష్ఠి భార్య. పేరు నరేంద్ర ప్రభ.

కాశ్మీరంలో  ఓ మామూలు మధ్యతరగతి ఇంట పుట్టింది నరేంద్ర ప్రభ. కళల మీద ఉన్న మక్కువ చేత చిన్నప్పుడే వీణ, నృత్యం అభ్యసించింది. యుక్త వయసు వచ్చిన ప్రభని, ఆర్ధికంగా ఎన్నో మెట్లు పైనున్న నోణక శ్రేష్ఠి ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. చెల్లెలు ఓ గొప్పవాడికి భార్య అయినందుకు ఎంతో సంతోషించారు ఆమె అన్నలు. అయితే, ఆర్ధిక వ్యత్యాసాల ప్రభావం పుట్టింటి తో ఆమె అనుబంధం మీద బాగానే ప్రభావం చూపింది. మరీ ముఖ్యంగా, తండ్రి మరణం తర్వాత ఆ దూరం బాగా అర్ధమయింది నరేంద్ర ప్రభకి.

అన్నీ ఉన్నా, సంతానం లేదనే లోటు పీడించడం మొదలు పెడుతుంది నోణక శ్రేష్ఠిని. అతని బాధ చూడలేని నరేంద్ర ప్రభ తన దూరపు బంధువు కమలాలయని ఇచ్చి మరీ తన భర్తకి రెండో వివాహం జరిపిస్తుంది. కొంతకాలం ఏ పొరపొచ్చాలు లేకుండానే ఉంటారు ముగ్గురూ. ఉన్నట్టుండి, చక్రవర్తి ప్రతాపాదిత్యుడు నోణక శ్రేష్ఠి దగ్గర నాణ్యమైన వజ్రాలు కొనాలని సంకల్పించి, తనకు తానుగా బయలుదేరి శ్రేష్ఠి ఇంటికి రావడంతో ప్రభకి కష్టాలు మొదలవుతాయి. చక్రవర్తి గౌరవార్ధం వీణ కచేరీ చేసిన ప్రభని చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు చక్రవర్తి.

తన భవంతికి చక్రవర్తి రాకపోకలు పెరగడం ఎంతగానో సంతోష పెడుతుంది నోణక శ్రేష్ఠిని. అతని వ్యాపారం ఊహించనంత పెరుగుతుంది. ఉన్నట్టుండి చక్రవర్తి రాకపోకలు ఆగిపోతాయి. ప్రధానమంత్రి ద్వారా శ్రేష్ఠి తెలుసుకున్నది ఏమంటే, చక్రవర్తి ప్రభని ఇష్టపడుతున్నాడని, అయితే ధర్మం తప్పని వాడు అవ్వడం వల్ల, తన ప్రేమని ప్రకటించకుండా ఉండడం కోసం, ఆమెకి దూరంగా మసలుతున్నాడనీను. చక్రవర్తి ధోరణి వల్ల తన వ్యాపారానికి ఎంత నష్టమో ఇట్టే అంచనా వేసుకున్న శ్రేష్ఠి, కాశ్మీర దేశంలో అప్పటికి అమలులో ఉన్న ధర్మం ప్రకారం ప్రభకి తాను విడాకులు ఇచ్చి ఆమెని అంతఃపురానికి సమర్పించడానికి సిద్ధ పడతాడు.

భర్త ప్రతిపాదనకి ససేమిరా అంటుంది నరేంద్ర ప్రభ. అటు శ్రేష్ఠి, ఇటు కమలాలయ ఆమెని దూరం పెడతారు. భవంతిలో పనివాళ్ళు సైతం ఆమె మాట వినని పరిస్థితి. భర్తా, సవతీ కలిసి తనకి పొగ పెడుతున్నారని గ్రహించుకున్న ప్రభ, పుట్టింటికి ప్రయాణం అవుతుంది. అక్కడా ఆదరం అంతంత మాత్రమే కావడంతో వారం రోజులన్నా గడవక మునుపే తిరుగు ప్రయాణం అవుతుంది. భర్త చాటున కాపురం చేసుకుంటున్న తనను ఈ స్థితికి తెచ్చిన చక్రవర్తి మీద పట్టరాని ఆగ్రహం కలుగుతుంది ఆమెకి. అతనిపై అంతకు మునుపు కలిగిన అభిమానం ఆవిరై పోతుంది.

అంతఃపురానికి వెళ్ళడానికి ఏ మాత్రమూ ఇష్టపడని ప్రభకి ఇంట్లో నిలబడలేని పరిస్థితులు కల్పిస్తారు శ్రేష్ఠి, కమలాలయ. బాగా ఆలోచించుకున్న నరేంద్ర ప్రభ దేవదాసిగా మారిపోడానికి సిద్ధ పడుతుంది. తనని అంతఃపురానికి కాక ఆలయానికి అర్పించమని కోరుతుంది భర్తని. శ్రేష్ఠి అందుకు ఇష్టపడక పోవడంతో, తనని ఆలయానికి అప్పగించని పక్షంలో, స్వచ్చందంగా వేశ్యావాటిక లో చేరిపోతానని బెదిరిస్తుంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో, అంగరంగ వైభవంగా ఓ వేడుక జరిపి, ఆమెని దేవదాసిని చేస్తాడు శ్రేష్ఠి. స్వతంత్ర జీవితం మొదలు పెట్టిన ప్రభ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయన్నది పిలకా గణపతి శాస్త్రి రాసిన 'కాశ్మీర పట్టమహిషి' నవలలో తెలుసుకోవల్సిందే..

శనివారం, సెప్టెంబర్ 01, 2012

నాయికలు-నతాష

నతాష అందమైన అమ్మాయి. నికోలాయ్-అన్నా దంపతుల ఏకైక కుమార్తె. వాళ్ళింట్లోనే పెరిగిన వాన్యా, నతషని ఎంతగానో ఆరాధించాడు. ఆవిషయం బాగా తెలుసు నతాషకి. కానీ, అతని ప్రేమకి ఆమె అవునని చెప్పలేదు. అలాగని కాదనీ చెప్పలేదు. పేదరికం నుంచి ప్రిన్స్ స్థాయికి ఎదిగిన వాల్కొవిస్కీ నికోలాయ్ తో స్నేహం చేస్తాడు. నికోలాయ్ నిజాయితీ, శ్రమించే తత్వం నచ్చి, ఎస్టేట్ వ్యవహారాల బాధ్యతని అతనికి అప్పగిస్తాడు. అంతే కాదు, లోకజ్ఞానం లేని తన కొడుకు అయోషాని కూడా నికోలాయ్ ఇంట్లో ఉంచుతాడు ప్రిన్స్.

నతాష-ఆయోష ఒకరితో ఒకరు ప్రేమలో పడతారు. ఆయోషలో, నతాషకి నచ్చింది ఏమిటి? అని అడిగితే జవాబు చెప్పడం కష్టం ఆమెకి. అతని అమాయకత్వం, స్వచ్చత ఆకట్టుకుంటాయ్ ఆమెని. అతను మిగిలిన కుర్రాళ్ళ కన్నా భిన్నం అని తెలుసు. జ్ఞానంలో తనకన్నా ఓ మెట్టు తక్కువేననీ బాగా తెలుసు నతాష కి. అయినప్పటికీ అతనంటే విపరీతమైన ప్రేమ. ఆ ప్రేమ ఎంతటిదంటే, దానికోసం తనని ఎంతగానో ప్రేమించిన తల్లిదండ్రులని విడిచిపెట్టేయడానికి సైతం వెనకాడదు నతాష.

జరిగింది ఏమిటంటే, నతాష-ఆయోషల ప్రేమ గురించి విన్న ప్రిన్స్ భగ్గుమంటాడు. నతాష అంతస్తు తన అంతస్తుకి ఏమాత్రం తూగదు మరి. కూతుర్ని తన కొడుకు మీదకి ఉసిగొలిపాడని నికోలాయ్ మీద ఎగిరిపడతాడు. ఎస్టేట్ వ్యవహారాల వంకన నికోలాయ్ ని కోర్టుకి ఈడుస్తాడు. ఫలితం, ఆయోష తో కూతురి ప్రేమని ఏమాత్రం ఆమోదించడు నికోలాయ్. ఆయోష కోసం ఇల్లు విడిచిపెడుతుంది నతాష. ఓ చిన్న ఇంట్లో నతాష ని ఉంచుతాడు ఆయోష. అప్పుడప్పుడూ వచ్చి చూసి వెడుతూ, పెళ్ళి చేసుకుంటానని హామీలు ఇస్తూ ఉంటాడు.

ఆయోషకి తన మీద ఉన్న ప్రేమమీద అంతులేని నమ్మకం నతాషకి. అయితే, ఆ నమ్మకానికి బీటలు పడే పరిస్థితులు వస్తాయి. నతాష విషయంలో కొడుకుని నయానో, భయానో ఒప్పించడానికి ప్రయత్నించి భంగపడ్డ ప్రిన్స్ అతనికోసం మరో గొప్పింటి సంబంధం చూస్తాడు. ఆ గొప్పింటి అమ్మాయి పేరు కాత్య, ఓ జమీందారీకి ఏకైక వారసురాలు. ఆయోషకి స్థిరమైన అభిప్రాయాలు లేవని బాగా తెలుసు నతాషకి. అతను తండ్రి చేతిలో పావుగా మారడం, కాత్యలో ప్రేమలో పడడం ఆమె దృష్టిని దాటిపోవు.

తల్లిదండ్రులని విడిచి వచ్చిన నతాష కి మిగిలింది వాన్య మాత్రమే. అతని దగ్గర ఆమెకి దాపరికాలు ఏవీ లేవు. నతాష-వాన్యాల స్నేహం గురించి బాగా తెలుసు అయోషకి. అతనికి కూడా వాన్య అంటే ఇష్టం. ఎంతగా అంటే, తను అటు నతాషా ప్రేమకీ, ఇటు కాత్య  ప్రేమకీ మధ్య నలిగిపోయినప్పుడు వాన్యని సలహా అడిగేటంత. ఓపక్క ఆయోష, కాత్యాలని దగ్గర కానిస్తూనే, ఆయోషతో పెళ్ళి జరిపిస్తానని నతాష కి మాట ఇస్తాడు ప్రిన్స్, అది కూడా తన కొడుకు, వాన్యాల సమక్షంలో.

ప్రిన్స్ ఎలాంటివాడో నతాషకి బాగా తెలుసు. తన తండ్రికి జరిగిన అన్యాయం ఆమె మర్చిపోయేది కాదు. అలాంటి అన్యాయాన్నే తనకీ తలపెడుతున్నాడని సులభంగానే అర్ధం చేసుకుంది. మరోపక్క ఆయోష ఊగిసలాట కూడా తెలుసు నతాషకి. పరిస్థితులు తనకి పూర్తిగా ఎదురు తిరిగినా, ఆమె ఆయోష పక్షాన్నే నిలబడుతుంది. ఆయోష విషయమై, కాత్య తనని కలుసుకున్నప్పుడు సైతం ఎంతో స్థిత ప్రజ్ఞత చూపుతుంది నతాష.

చిన్న వయసులోనే జీవితంలో ఊహించని ఎదురు దెబ్బలు తిన్న ఆ అమ్మాయి, వ్యతిరేక పరిస్థితులని ఎదుర్కొన్న విధానం, తన భవిష్యత్తుని నిర్ణయించుకున్న తీరు ఆమె మనకి గుర్తుండిపోయేలా చేస్తాయి. సమస్యల నుంచి ఎన్నడూ పారిపోలేదు నతాష. అలాగే, ఆయోష మీద ఆమె ప్రేమలోనూ ఎలాంటి మార్పూ లేదు. అతని స్వచ్చత మీద ఎలాంటి సందేహమూ లేదామెకి. ఈ లక్షణాలే నతాషని ప్రత్యేకంగా నిలుపుతాయి. రష్యన్ రచయిత దస్తయే వస్కీ నవల 'తిరస్కృతులు' లో ఒక నాయిక నతాష. ఈమెతో పాటుగా, మరోనాయిక నీలీ సైతం పాఠకులని వెంటాడుతుంది, పుస్తకం పక్కన పెట్టాక చాలా రోజులపాటు.

శనివారం, ఆగస్టు 04, 2012

నాయికలు-స్రవంతి

జీవితాన్ని గురించి స్థిరమైన అభిప్రాయాలు ఉన్నవాళ్ళూ, తమకి ఏం కావాలో స్పష్టంగా తెలిసిన వాళ్ళూ కొందరే ఉంటారు. వాళ్ళలో కూడా, కావలసినదాన్ని సాధించుకునే చొరవా, తెగువా ఉన్నవాళ్ళు తక్కువే. ఈ లక్షణాలన్నీ ఓ అమ్మాయికి ఉంటే, ఆమె 'స్రవంతి' అవుతుంది. జీవితం పూలపానుపు కాదు స్రవంతికి. వయసులో బాగా పెద్దవాడూ, తనని నిర్లక్ష్యం చేసినవాడూ అయిన భర్త. ఐదుగురు స్త్రీలతో సంబంధం పెట్టుకున్న అతగాడు, ఓ రాత్రివేళ హత్యకి గురవుతాడు. శవాన్ని గుర్తించడమే కష్టమవుతుంది పోలీసులకి.

భర్త మరణం ఇరవై ఏడేళ్ళ స్రవంతికి స్వేచ్చని ఇస్తుంది. సౌకర్యంగా బతకడానికి అవసరమైన డబ్బునీ ఇస్తుంది. అయితే, ఓ వయసులో ఉన్న స్త్రీకి జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి ఇవి మాత్రమే సరిపోతాయా? తనకి చాలవని స్పష్టంగా తెలుసు స్రవంతికి. కావలసినవి ఏమిటో కూడా తెలుసు. భర్త సంవత్సరీకం రోజున దైవ దర్శనం కోసం తిరుపతి వెళ్ళిన స్రవంతికి కనిపిస్తాడు శ్రీనివాస్. తను ఉంటున్న హైదరాబాద్ లోనే ఉంటూ, అంతకు మునుపే కొద్దిపాటి పరిచయమైన శ్రీనివాస్ తో అనుబంధం పెంచుకోవాలని నిర్ణయించుకుంటుంది ఆమె.

స్వతహాగా తెలివైన అమ్మాయి స్రవంతి. తొందరపడి నిర్ణయం తీసుకోదు. ఒకసారి తీసుకున్నాక, వెనక్కి తగ్గదు. అనుకున్నది సాధించుకోవడం ఎలాగో ఆమెకి తెలిసినంత బాగా ఇంకెవరికీ తెలియదు. ఓ ప్రైవేట్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేసే ముప్ఫై నాలుగేళ్ల శ్రీనివాస్ కి భార్య ఇందిర, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇందిరతో సఖ్యంగానే ఉంటున్న శ్రీనివాస్ దృష్టిలో మరో స్త్రీ లేదు. జీవితం సంతోషంగానే ఉంది అతనికి. ఓ మొక్కు తీర్చుకోడానికి ఒంటరిగా తిరుపతి వెళ్ళిన శ్రీనివాస్ పక్క కాటేజీలోనే తనూ గది తీసుకుంటుంది స్రవంతి. ఓ రాత్రివేళ అతనికి దగ్గరవుతుంది. శ్రీనివాస్ దృష్టిలో ఆ పరిచయం ఆ రాత్రికే పరిమితం.. కానీ స్రవంతి ఆలోచన వేరు. ఆమెకి అతను కావాలి.

హైదరాబాద్ తిరిగి వచ్చాక కూడా, స్రవంతితో అనుబంధం కొనసాగుతుంది శ్రీనివాస్ కి. స్రవంతి చొరవే ఇందుకు కారణం. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న స్రవంతి, ఒంటరిగా ఉంటోంది ఓ అపార్ట్ మెంట్లో. ఆ ఇంటి డూప్లికేట్ తాళం చెవి శ్రీనివాస్ కి ఇస్తుంది, అతను ఏ వేళలో అన్నా ఆమె ఇంటికి రాడానికి వీలుగా. అర్ధరాత్రి వచ్చినా తలుపు తట్టనవసరం లేకుండా. తన జీవితంలో అతను తప్ప మరో మగాడు లేడని చెప్పకనే చెబుతుందామె. పూర్తిగా మధ్యతరగతి మనస్తత్వం శ్రీనివాస్ ది. ఏ ఖర్చూ లేకుండా దొరికే శారీరక సౌఖ్యం సంతోష పెడుతుంది అతన్ని. అంతకు మించి, ఇందిరకి అన్యాయం చేస్తున్నానన్న భావన నిలువనివ్వదు. ఇంట్లో ఉన్నంతసేపూ భార్యని ఎక్కువ ప్రేమగా చూసుకుంటూ, ఆ లోటుని భర్తీ చేసుకుంటున్నట్టుగా భావించుకుని తృప్తి పడుతూ ఉంటాడతను.

స్రవంతికి తెలుసు, ఇందిర విషయంలో శ్రీనివాస్ మానసిక సంఘర్షణ. కానీ, ఆమెకి శ్రీనివాస్ కావాలి. శ్రీనివాస్ మాత్రమే కావాలి. ఎందుకంటే, అతన్ని మనస్పూర్తిగా ప్రేమించింది ఆమె. మొదట్లో కేవలం శారీరక సుఖం కోసమే స్రవంతి ఇంటికి వెళ్ళిన శ్రీనివాస్ కి ఆమెతో ప్రేమలో పడడానికి, మానసిక అనుబంధం ధృడ పడడానికీ ఎక్కువ సమయం పట్టదు. పట్టనివ్వదు స్రవంతి. అతని సమక్షంలో అతనికి నచ్చే మాటలే మాట్లాడుతుంది, ఇష్టమైన పనులే చేస్తుంది. అతనిలో ఉన్న బద్ధకాన్నీ, చిన్న చిన్న చెడు అలవాట్లనీ వదిలిస్తుంది. మొత్తంగా, అతని జీవితం మీద తనదైన ముద్ర వేస్తుంది స్రవంతి. అయినప్పటికీ, అతని విషయంలో ఆమెలో ఏదో అభద్రత.

స్రవంతి భయపడినట్టే జరుగుతుంది. ఉన్నట్టుండి, ఆమెకి దూరంగా జరగాలని ప్రయత్నాలు మొదలు పెడతాడు శ్రీనివాస్. దూరం ఊరికి బదిలీ కోరతాడు కూడా. ఆమె ఇంటికి వెళ్ళకుండా ఉండడానికి తీవ్రంగా ప్రయత్నించి, కొంత మేరకు విజయం సాధిస్తాడు. కానీ, అతని మనసుని పూర్తిగా ఆక్రమించుకున్న స్రవంతి, అతన్ని దూరంగా ఉండనివ్వదు. తన నిర్ణయాన్ని ఆమెకి చెప్పేసి, విడిపోవడం కోసం ఆమె ఇంటికి వెళ్ళిన శ్రీనివాస్ ని, ఆ నిర్ణయాన్ని కేవలం రెండు నెలలు వాయిదా వెయ్యమని కోరుతుంది స్రవంతి. అయితే, ఆ రెండు నెలల కన్నా ముందే ఆశ్చర్యకరంగా అతని జీవితం నుంచి తప్పుకుంటుంది ఆమె.

జీవితంలో మనకి ఎదురయ్యే అందరినీ తప్పొప్పుల తూకంలో వేయలేం. ఎందుకంటే ఈ తప్పూ, ఒప్పూ అనేవి పరిస్థితులని బట్టి మారిపోతూ ఉంటాయి. స్రవంతిని కూడా అంతే. తనకి కావల్సిందేమిటో తెలిసిన స్రవంతి, దానిని సాధించుకునే ఓర్పూ, నేర్పూ ఉన్న స్రవంతి... అందుకోసం ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. శ్రీనివాస్ సంఘర్షణని అర్ధం చేసుకుని అతన్ని ఊరడించినది. అతన్ని కేవలం తన అవసరం తీర్చుకునే సాధనంగా కాక, తనవాడిగా ప్రేమించింది. జీవితాన్ని ఎంత బాగా గడపొచ్చో అతనికి నేర్పించింది. అతని ఎదురుగా తను లేకపోయినా, అతని ఆలోచనలలో ఎప్పటికీ ఉండిపోయేలాంటి అనుభవాలనీ, అనుభూతులనీ పంచింది.

"భగవంతుడు వజ్రానికుండే కాఠిన్యాన్ని, పులికుండే క్రూరత్వాన్ని, గుంటనక్కకుండే జిత్తులమారి తనాన్ని, మేఘానికుండే కన్నీటిని, గాలికి ఉండే చలనాన్ని, తేనెకుండే తీయదనాన్ని, ఉదయపుటెండకుండే వెచ్చదనాన్ని, పక్షి ఈకకుండే మృదుత్వాన్ని, లేడిపిల్లకుండే చురుకుదనాన్ని, పురివిప్పి ఆడే నెమలికుండే ఆకర్షణని, కుందేలుకుండే భయాన్ని తీసుకున్నాడు. వాటికి సామర్ధ్యాన్ని కలిపి, ఆ మొత్తాన్ని బాగా రంగరించి, ఆ మిశ్రమం లోంచి ఒక యువతిని తయారు చేశాడు. ఆమెని మగవాడికి బహుమతిగా ఇచ్చాడు." స్రవంతిని గురించి ఆమె సృష్టికర్త, ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి చేసిన పరిచయం ఇది. 'స్రవంతి' నవల చదువుతున్నప్పుడో, లేక చదివి పక్కన పెట్టాకో "ఇలాంటి స్త్రీ పరిచయం అయితే బాగుండు" అని కనీసం ఒక్క క్షమన్నా ప్రతి పాఠకుడూ అనుకుంటాడనడం అతిశయోక్తి కాదు.

('స్రవంతి' నవల ప్రస్తుతం అందుబాటులో లేదు. త్వరలోనే కొత్త ప్రింట్ మార్కెట్లోకి వస్తుందని భోగట్టా.. స్రవంతిని గురించి నాలుగు మాటలు రాయమని సూచించిన మిత్రులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు)

శనివారం, ఆగస్టు 06, 2011

నాయికలు-సంయుక్త

సంయుక్త బాగా కలిగిన కుటుంబంలో పుట్టింది. కష్టమంటే ఏమిటో తెలీదు. సౌందర్య, సంగీతల తర్వాత పుట్టిన సంయుక్త అంటే తండ్రి భరద్వాజకి ప్రత్యేకమైన అభిమానం. తల్లి భానుమతికి మాత్రం సంయుక్త కన్నా మిగిలిన ఇద్దరు పిల్లలంటేనే ప్రేమ ఎక్కువ. కారణం, సంయుక్తది అంతా తండ్రి పధ్ధతి. అనవసర ఆడంబరాలకీ, ఆర్భాటాలకీ వ్యతిరేకం. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడమే మొదటి నుంచీ అలవాటు. తమదైన ప్రపంచాన్ని నిర్మించుకుని అందులో తామే రాణులుగా బతుకుతున్న తల్లికీ, అక్కలకీ సంయుక్త వైఖరి ఏమాత్రమూ కొరుకుడు పడదు.

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. కష్టమంటే ఏమిటో తెలియని సంయుక్తని ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టాయి. తండ్రికి చేదోడు వాదోడుగా ఉండి బిజినెస్ వ్యవహారాల లెక్కలు చూస్తున్న సంయుక్త వ్యాపారం నష్టాల్లో పడ్డ సంగతిని ముందుగానే పసిగడుతుంది. ఖర్చు తగ్గించుకోమని సలహా ఇచ్చి తల్లికీ, అక్కలకీ మరింతగా శతృవు అవుతుంది. నష్టాలూ అప్పులూ పెరిగి ఇల్లు వేలం వేసే పరిస్థితి వచ్చినప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోలేదు సంయుక్త. కానీ, రెండు రోజుల్లో ఇల్లు వేలం వేస్తారన్న నోటీసు అందుకున్న తండ్రి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆమె స్థాణువే అయ్యింది.

అంతకు మించి, అప్పటివరకూ తనని ప్రేమిస్తున్నానంటూ వెంటపడి, పెళ్లికి తన అంగీకారం కోసం చుట్టూ తిరిగిన వాడు ఒక్కసారిగా దూరమైపోయినప్పుడు ప్రపంచం అంటే ఏమిటో అర్ధం కావడం మొదలుపెడుతుంది ఆమెకి. అప్పటివరకూ తమ చుట్టూ తిరిగి పనులు చేయించుకున్న వాళ్ళూ, తమచేత డబ్బు ఖర్చు పెట్టించిన వాళ్ళూ ఒక్కసారిగా ముఖం చాటేస్తున్నా వాస్తవాలు తెలుసుకోలేరు ఆమె తల్లీ, అక్కలూ. ఆ కష్ట సమయంలో వాళ్ళని ఆదుకున్నది సంయుక్త మేనత్త విమలమ్మ, ఆమె కొడుకు వసంత్.

వీళ్ళని ఇంట్లో పెట్టుకుని వాళ్ళింట్లో వాళ్ళే పరాయి వాళ్ళుగా బతుకుతున్న విమలమ్మ, వసంత్ అంటే చిన్నచూపే భానుమతికీ, సౌందర్యకీ, సంగీతకీ. ఒక్క సంయుక్తకి మాత్రమే వాళ్ళు చేసిన సాయం ఎంత గొప్పదో అర్ధమవుతుంది. అంతకు మించి, చాలీ చాలని సంపాదనతో ఇబ్బంది పడుతున్న వసంత్ కి తనవంతుగా సాయపడడానికి నడుం బిగిస్తుంది. తల్లిని ఎదిరించి ఉద్యోగంలో చేరుతుంది సంయుక్త. ఒక తరహా జీవితానికి అలవాటు పడిపోయిన తల్లిని మార్చడం కష్టమని అర్ధం చేసుకుని, కనీసం అక్కలనైనా బయటి ప్రపంచంలోకి తీసుకురాడానికి ప్రయత్నం చేస్తుంది సంయుక్త.

డబ్బుమీద విపరీతమైన మోజు చూపించే సౌందర్య తన తండ్రి వయసున్న సహదేవవర్మని డబ్బుకోసం పెళ్లి చేసుకున్నప్పుడూ, మంచి గాయని అయిన సంగీతని ఆర్కెస్ట్రా నిర్వహించే చక్రపాణి ప్రేమలోకి దింపి రహస్యంగా పెళ్ళాడినప్పుడూ కూడా సంయుక్త కేవలం మౌన ప్రేక్షకురాలు మాత్రమే. కేవలం ఐశ్వర్యం, ఆడంబరాలు మాత్రమే జీవితం కాదన్న సత్యాన్ని తెలుసుకున్న సంయుక్త, తన జీవితాన్ని తనకి నచ్చినట్టుగా మలచుకునే ప్రయత్నాలలో పడుతుంది. డబ్బులేని తనం ఆమెని బాధించదు. అంతకు మించి ఎవరి మీదా ఆధారపడకుండా బతకడం ఆనందాన్ని ఇస్తుంది. కేవలం కష్టాన్ని మాత్రమే నమ్ముకునేలా చేసిన ఆనందం అది.

వసంత్ తనకి తగినవాడని నిర్ణయించుకున్న సంయుక్త అతన్ని పెళ్లి చేసుకుంటుంది, తన తల్లిని ఒప్పించి. వైవాహిక జీవితంలో తృప్తి ఉన్నా, ప్రశాంతత దొరకదు ఆమెకి. అక్కలిద్దరి వైవాహిక జీవితాల్లో వచ్చిన ఇబ్బందులు ఆమె జీవితం మీద ప్రభావాన్ని చూపించడం మొదలెడతాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మానసిక స్థైర్యాన్ని కోల్పోని సంయుక్త, ధైర్యంగానే వాటిని ఎదుర్కొంటుంది. తండ్రి నేర్పిన విలువలనీ, కష్టపడే తత్వాన్నీ అక్షరాలా అమలు చేస్తుంది. జీవితంలో వచ్చే సమస్యలు తాత్కాలికమేననీ, డబ్బు మాత్రమే అన్ని సమస్యలనీ పరిష్కరించలేదనీ అర్ధం చేసుకున్న సంయుక్త, తన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాల్లోనూ సౌరభాన్ని నింపడం ద్వారా అక్కలిద్దరికీ ఆదర్శంగా నిలబడుతుంది.

దాదాపు పదిహేనేళ్ళ క్రితం 'ఇండియాటుడే' పక్ష పత్రికలో సీరియల్గా వచ్చిన యద్దనపూడి సులోచనారాణి నవల 'జీవన సౌరభం' లో నాయిక సంయుక్త. యద్దనపూడి సృష్టించిన మెజారిటీ నాయికలకి నేలమీద నడిచే అలవాటు ఉండదు. వాళ్లకి భిన్నంగా అనిపించింది సంయుక్త. కేవలం ఈ పాత్ర కోసమే ఆ సీరియల్ క్రమం తప్పకుండా చదివాను అప్పట్లో. "చిన్ని నవ్వులో ఎన్ని ఆశలు.." టైటిల్ సాంగ్ తో ఈటీవీలో డైలీ సీరియల్గా ప్రసారమయినప్పుడు, అప్పటివరకూ బాలనటిగా సినిమాల్లో చేసిన సునయన టీవీ నాయికగా ప్రమోటయ్యింది, సంయుక్త పాత్రని ధరించి. 'జీవన సౌరభం' నవలని ఎమెస్కో ప్రచురించింది. పేజీలు 200, వెల రూ. 60. అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ దొరుకుతోంది.

గురువారం, జూన్ 02, 2011

నాయికలు-అక్షత

అక్షత కెనడా నుంచి ఇండియా వచ్చింది. ఆ ప్రయాణం ఆమె తన మూలాలని వెతుక్కుంటూ చేసింది కాదు. అయితేనేం? తన కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలుసుకుంది. అప్పటివరకూ ఆమెకి ఉన్నట్టే తెలియని తన మేనమామ కేశవని గురించి, ఊరికోసం, నదికోసం అతను పడ్డ తపన గురించీ, అతను ప్రాణప్రదంగా ప్రేమించిన బంగారి గురించీ చివరికి అనూహ్యంగా సంభవించిన అతని మరణాన్ని గురించి కూడా తెలుసుకుంది అక్షత, చంద్రలత నవల 'దృశ్యాదృశ్యం' లో ఒక ప్రధాన పాత్ర.

కెనడాలో స్థిరపడ్డ తెలుగు డాక్టర్ దంపతులు యశోద-సురేంద్రల ఏకైక సంతానం అక్షత. తల్లీ తండ్రీ ఇద్దరూ బిజీ కావడంతో ఆమె ఆలనా పాలనా అంతా దగ్గరుండి చూసుకున్నది ఆమె అమ్మమ్మ కౌసల్య. అమ్మమ్మ పెంపకంలో తెలుగు భాష మాత్రమే కాదు, సంస్కృతినీ వంట పట్టించుకుంది అక్షత. చదువవుతుండగానే భారీ నీటి పారుదల ప్రాజెక్టుల మీద పరిశోధన కోసం తన ప్రొఫెసర్ సూచన మేరకు అమ్మ పుట్టిన ఊరికి బయలుదేరుతుంది.

మామ పట్టాభి ఎంపీ. అత్తమ్మ వత్సల, వాళ్ళ ఇద్దరు పిల్లలు, వాళ్ళు చూపించే ఆదరాభిమానాలు చవిచూసిన అక్షత తన పని నిమిత్తం సిటీ నుంచి ఊరికి బయలుదేరుతుంది. తన తాతయ్య భూపాలయ్య కట్టించిన బంగ్లా ఏటి ఒడ్డున ఠీవిగా నిలబడి ఉంటుంది. ఆ ఇంటికి ఏకైక పెద్ద దిక్కు రాగవ్వ, ఇంటి మనిషిగా కలిసిపోయిన పనిమనిషి. రాగవ్వ మొదలు, ఊరి కరణం దశయ్య వరకూ అందరికీ అక్షతని చూడగానే అవ్యక్తమైన అనురాగం పుడుతుంది. దృశ్యంగా తమ కళ్ళెదుట స్థిర పడిన అక్షతలో వారికి అదృశ్యమైపోయిన కేశవ కనిపిస్తాడు.

రాగవ్వ నోటివెంట 'కేశవమామ' గురించి మొదటిసారిగా వింటుంది అక్షత. ఆ తర్వాత దశయ్యతో పాటు మరికొందరు సైతం అక్షతని చూస్తూనే కేశవని గుర్తు చేసుకోవడం ఆశ్చర్య పరుస్తుంది ఆమెని. అక్షత తల్లే కాదు, పెంచిన అమ్మమ్మ కూడా ఏనాడూ కేశవని గురించి చెప్పలేదు. అప్పటివరకూ అక్షత దృష్టిలో మామంటే పట్టాభి మాత్రమే. ఆ పెద్ద బంగ్లాలో అక్షత తను ఉండడానికి ఎంచుకున్న గది, అంతకు రెండు దశాబ్దాల క్రితం కేశవ వాడిందే కావడం యాదృచ్చికం. అనుకోకుండా కేశవ నోట్సులు, డైరీ అక్షత కంట పడతాయి.

ఓ పక్క నది గురించి, నదిమీద కట్టిన భారీ ప్రాజెక్టు గురించీ, ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన ఊరి జనాన్ని గురించీ తన 'స్టడీ' ని కొనసాగిస్తూనే, కేశవ నోట్సులు, డైరీ ద్వారా అతని గురించి తెలుసుకుంటూ ఉంటుంది అక్షత. సివిల్ ఇంజనీరింగ్ చదివిన కేశవ, తన స్వహస్తాలతో తన ఊరిని ముంపు ప్రాంతంగా మార్కు చేస్తాడు, ప్రభుత్వ ఇంజనీర్ హోదాలో. తనకి సమయం చిక్కినప్పుడల్లా రాగవ్వ, దశయ్యల నుంచి కేశవ సంగతులని చెప్పించుకుంటూ ఉంటుంది అక్షత. ఆనకట్ట కారణంగా నిర్వాసితులైన కుటుంబాల్లో ఓ కుటుంబానికి చెందిన శ్రీను, అక్షతకి సహాయకుడిగా ఉంటాడు.


మిద్దె పైనుంచి ఓ రాత్రి వేళ దూరంగా కనిపిస్తున్న మంటలని చూసి అవేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం మొదలవుతుంది అక్షతలో. రాగవ్వ వాటిని 'కొరివి దెయ్యాలు' అని కొట్టి పారేస్తుంది కానీ, అక్షత నమ్మదు. మర్నాడు శ్రీనుతో కలిసి లాంచీలో ప్రయాణం చేసి అటవీ ప్రాంతానికి వెళ్ళిన అక్షతకి, అడవి మధ్యలో నివాసం ఉంటున్న గిరిజనులు కనిపిస్తారు. తమ గూడెం ఎందుకు మునిగిందో వారికి తెలీదు. ఎక్కడికి వెళ్ళాలో అంతకన్నా తెలీదు. తమ అడవిలో తామే పరాయివారిగా బతుకుతున్న ఆ గిరిజనులని చూసి కదలిపోతుంది అక్షత.

అక్షతకి పట్టుదల ఎక్కువ. ఏదన్నా తలచిందంటే సాధించి తీరాల్సిందే. అయితే ఇందుకోసం ఎవర్నీ నొప్పించలేని మొహమాటం ఆమె సొంతం. మాట మన్ననకి పెట్టింది పేరు ఆమె. అందుకేనేమో ఆమె బిగించిన పెదవుల వెనుక ఉన్న పట్టుదలనీ, ఎంతో పరిణతితో ఆలోచిస్తూనే అంతలోనే చిన్నపిల్లగా మారిపోగలగడాన్నీ చూసినవాళ్ళంతా ఆమెలో తమ కేశవని చూసుకోగాలిగారు. ఒక్క రూపం మాత్రమే కాదు, గుణంలోనూ ఆమెది మేనమామ పోలికే.

కేశవ డైరీల ద్వారా యశోదని మెడిసిన్ చదివించడానికి అతను చేసిన పోరాటం, కుటుంబ సభ్యులని ఒప్పించిన తీరూ తెలుసుకున్న అక్షత తన తల్లిమీద కోపం తెచ్చుకుంటుంది, అన్న పట్ల కనీస కృతజ్ఞత చూపనందుకు. సిటీ నుంచి పట్టాభి, వత్సల పల్లెకి రావడంతో ఆ ఇంట్లో సందడి మొదలవుతుంది. పుస్తకాల్లో కనిపించే కేశవనీ, ఎదురుగా కనిపిస్తున్న పట్టాభినీ పోల్చి చూసుకుని తన మామలిద్దరూ భిన్న ధ్రువాలని తెలుసుకుంటుంది అక్షత. కేశవ ప్రేమించిన బంగారిని గురించి అతని అక్షరాల్లో చదివిన అక్షత, ఇటు బంగారి-వత్సలలనీ పోల్చే ప్రయత్నం చేస్తుంది.

రానురాను వత్సల ఓ అర్ధం కాని పజిల్లా మారిపోతూ ఉంటుంది అక్షతకి. యెంతో చక్కగా ఎంబ్రాయిడరీ చేయగల వత్సల, శకుంతల పటాన్ని రంగుదారాలతో కుట్టి, పూర్తైన పటాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకునే సున్నిత హృదయ. బింగన్న పురుగులని చంపినప్పుడు మాత్రమే వాటి అందమైన రెక్కలు దొరుకుతాయని తెలిసీ, ఆ రెక్కలతో తన చీర మీద నెమలికన్నులు ఎంబ్రాయిడరీ చేసుకోగల పాషాణ హృదయ కూడా. వత్సలే అర్ధం కావడం లేదనుకుంటే, రాగవ్వ వత్సలపై చూపించే ఆధిపత్యం అంతకన్నా అయోమయానికి గురిచేస్తుంది అక్షతని.

తను విసుక్కుంటున్నా అమ్మమ్మ కౌసల్య తనని విడవకుండా ఎందుకంత ప్రేమ చూపిందో, ఆ ఇంట్లో రాగవ్వ స్థానం ఏమిటో, కేశవ మామ బంగారి ఏమయ్యిందో, కేశవ అదృశ్యం కావడానికి కారణాలేమిటో ఒక్కొక్కటిగా తెలుస్తాయి అక్షతకి. చివరికి అంతటి పట్టాభీ ఆమె ముందు సంజాయిషీగా జరిగినదానిలో తన పాత్రని, అందుకు దారితీసిన పరిస్థితులని తలవంచుకుని చెబుతాడు. ఉద్యోగంలో ఇమడలేక బయటికి వచ్చిన కేశవ, నదిని రక్షించడం కోసం తయారు చేసిన ప్లాన్లు అక్షతకి దొరుకుతాయి. వాటిని ఆమె ఏం చేసిందన్నది నవల ముగింపు. అక్షతనీ, కేశవనీ, నదినీ వేరుచేసి చూడలేం. అక్షత, కేశవలతో పాటుగా, వత్సల, రాగవ్వలనీ మర్చిపోలేం.

సోమవారం, మార్చి 28, 2011

నాయికలు-వనజ

సాయుధ పోరాటానికి పూర్వపు తెలంగాణాని కళ్ళముందుంచుతూ దాశరధి రంగాచార్య రాసిన నవల 'చిల్లర దేవుళ్ళు.' ఈ నవలలో ప్రధాన పాత్ర వనజ ని గురించిన పరిచయ వ్యాసం ఈ నెల 'వనితామాలిక' లో. టపాని ప్రచురించిన 'వనితామాలిక' బృందానికి కృతజ్ఞతలు.

***

సమాజం అధమ వృత్తులుగా ఎంచిన వాటిలో వేశ్యా వృత్తి ఒకటి. జీవిక కోసం శరీరాన్నే ఆధారంగా చేసుకున్న స్త్రీల జీవితాల్లో చీకటి కోణాలని ఎన్నో కథలు, మరెన్నో నవలలు విపులంగా చిత్రించాయి. అయితే మధురవాణి (గురజాడ అప్పారావు రచన 'కన్యాశుల్కం' ) దుగ్గిరాల శేషాచలం (శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి  కథ 'కలుపు మొక్కలు') వంటి అతికొద్ది పాత్రలని మినహాయిస్తే, మిగిలిన పాత్రలన్నీ దాదాపు ఒకేరకంగా అనిపిస్తాయి. నమ్మినవాళ్ళు మోసం చేయడం వల్లనో, తప్పనిసరి పరిస్థితుల వల్లనో వేశ్యా వృత్తిలోకి వచ్చిన స్త్రీల జీవితాలని చిత్రించిన కథలూ, నవలలే అధికం.

వేశ్యలకన్నా కడు హీనమైన జీవితం గడిపే 'ఆడబాప' లని పరిచయం చేసిన నవల దాశరధి రంగాచార్య 'చిల్లర దేవుళ్ళు.' సాయుధ పోరాటానికి పూర్వపు తెలంగాణాని కళ్ళముందు ఉంచిన ఈ నవల, ఆ కాలంలో ఆ ప్రాంతంలో అమలులో ఉన్న 'ఆడబాప' ఆచారాన్ని అద్దంలో చూపించింది 'వనజ' పాత్ర ద్వారా. తెలంగాణా లోని ఓ చిన్న పల్లెటూళ్ళో ఠీవిగా నిలబడ్డ దేశముఖ్ రామారెడ్డి గడీ (భవంతి) లో ఆడబాప వనజ, పుట్టుకతోనే దురదృష్టాన్ని వెంట తెచ్చుకున్న స్త్రీ.  

ఆ ఊళ్ళో రామారెడ్డి అధికారానికీ, దాష్టీకానికీ బలవ్వని వాళ్ళు ఎవరూ లేరనే చెప్పాలి. దేశముఖ్ హోదాలో నిజం ప్రభుత్వం దఖలు పరిచిన అపరిమితమైన అధికారాలన్నింటినీ దుర్వినియోగం చేసిన రామారెడ్డిది విలాసవంతమైన జీవితం. అతని కంటికి ఇంపుగా కనిపించిన ఏ స్త్రీ అయినా రాత్రికి పడకగదికి రావాల్సిందే. ఆ స్త్రీ ఆ వూరి ఆడపడుచు కావొచ్చు, కోడలు కావొచ్చు లేదా ఆ దారినే వెళ్తున్న బాటసారి కావొచ్చు. వనజ తల్లి దొర కంటపడింది అలానే. కొత్తగా పెళ్ళైన ఆమె పెనిమిటితో కలిసి గడీ ముందుగా పోతూ దొర కంట్లో పడింది. గడీలో ఆడబాపగా స్థిరపడిపోయింది. 

తల్లి వారసత్వం కొనసాగించక తప్పని పరిస్థితి వనజకి. గడీ ఆచారాన్ని అనుసరించి, వనజ వ్యక్తురాలవ్వగానే రామారెడ్డి బావమరిది ఇంద్రారెడ్డి ఆమెకి కన్నెచెర విడిపించాడు. ఆనాటి నుంచీ గడీకి వచ్చిన వాళ్ళందరికీ విలాస వస్తువైపోయింది వనజ. దొరలేవరైనా గడీకి వస్తే భోజనాలూ, ఫలహారాలూ మోసుకెళ్ళాలి.  వాళ్ళ కోర్కెలకి తను లొంగిపోవాలి. వాళ్ళు పశువుల్లా ప్రవర్తిస్తుంటే తను బొమ్మలా ఉండాల్సిందే కానీ కిమ్మనడానికి వీల్లేదు. యంత్రవతుగా వ్యవహరించాలి. 

రామారెడ్డి తన తండ్రి అని వనజకి తెలుసు. అంతే కాదు, రామారెడ్డి కూతురు మంజరికి తను సేవిక అన్న సత్యమూ తెలుసు. వీటన్నింటినీ మించి తన కంటినుంచి కన్నీరు జారితే జరిగే పరిణామాలు ఇంకా బాగా తెలుసు. గడీ నుంచి పారిపోవాలని చాలాసార్లే అనుకుంది ఆమె. కానీ తను ఎక్కడున్నా దొర పట్టి తెప్పిస్తాడన్న సత్యం ఆమెని ఆపేసింది. అంతే కాదు. ఎక్కడికి పారిపోవాలి? ఏం చేయాలి? ఆడబాపగా బతికిందానికెవడైనా అండ చూపుతాడా? ఈ ప్రశ్నలకి జవాబులు లేవు వనజ దగ్గర. 

తనని తాను యంత్రంగా మార్చుకుని జీవితాన్ని వెళ్ళదీస్తున్న వనజకి  తనూ మనిషే అన్న సత్యాన్ని బోధ పరిచిన వాడు సారంగపాణి, విజయవాడ ప్రాంతం నుంచి జీవనోపాధిని వెతుక్కుంటూ ఆ పల్లెకి వచ్చిన సంగీతప్పంతులు. అప్పటివరకూ గడీలో దిగిన దొరలకీ, పాణికీ చాలా భేదం ఉందన్న విషయం అర్ధం కావడానికి ఎక్కువ రోజులు పట్టలేదు వనజకి. అతని పలుకులు ఆమెకెంతో ఆప్యాయతని ఇచ్చాయి. ఏదో తెలియని ఆనందం మైకంలా కమ్మిందామెని. 

తనకి తెలియకుండానే పాణితో ప్రేమలో పడిపోయింది వనజ. అతణ్ణి చూడడం కోసం, గొంతు వినడం కోసం ఎంతగానో ఎదురు చూడడం మొదలు పెట్టింది. పాణి సాంగత్యంలో అంతకు ముందు తెలియని ఆనందమేదో అనుభవంలోకి వచ్చింది ఆమెకి. పాణి తనతో యెంతో సౌమ్యంగా వ్యవహరిస్తున్నప్పటికీ అతనికి తనపై ప్రేమ ఉన్నదా? అన్న విషయం అర్ధం కాదు వనజకి. అందరితోనూ ఆపేక్షగా ఉండడం పాణి నైజం కావడమే ఇందుకు కారణం. 

పాణిని గురించిన ఆలోచనలతో ఆనందంగా రోజులు గడుపుతున్న వనజకి 'అతనికి తను తగినదేనా?' అన్న ప్రశ్న ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. 'తానెవరు?' అని ప్రశ్నించుకున్నప్పుడు 'వేశ్యకన్నా కడు హీనం' అన్న జవాబు వస్తుంది వనజకి. వేశ్య డబ్బుకి తనని తాను అమ్ముకుంటుంది. తన తల్లీ, తన ఆచారాలూ తనను అమ్మి వేశాయి, జంతువుని అమ్మినట్టు. తాను బ్రతికి ఉన్నన్నాళ్లూ ఈ దొరకు బానిసే. వేశ్య తాను వద్దనుకుంటే, తనకు డబ్బు అవసరం లేదనుకొంటే తనను అమ్ముకోవాల్సిన పని లేదు. కానీ తాను? తనకు ఇష్టం ఉన్నా లేకున్నా, అవసరం ఉన్నా లేకున్నా అర్పించేయాల్సిందే కోరిన వారికి -- గడీకి వచ్చిన వారికి. 

పాణిని పెళ్లి చేసుకుని, గడీ బతుకు నుంచి బయట పడి తనకంటూ ఓ కుటుంబాన్ని ఏర్పరుచుకోవాలని కలలు కన్న వనజకి  దైవంలాంటి అతనికి కుళ్ళిన పండు లాంటి తనని అర్పించుకోవడం సమంజసం అనిపించదు. ఆ ఆలోచనల నుంచే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఫలితం.. నిన్నటి రాతి మనిషి నేడు దేవత అయిపోయింది. తన నిర్ణయాన్ని ఆమె పాణికి చెప్పినప్పుడు "నేనంటే ప్రేమ లేదా?" అని అడిగాడతడు. "నేను నీకు తగినదానిని కాను. నువ్వు దేవుడివి. బండవంటి నన్ను మనిషిని చేసినవు. గొడ్డువంటి దాన్కి ప్రేమ చూపినవు. అటువంటి నీకు మచ్చ పడ్డ నా మనసెట్టిద్దును? నా పుటక దరిద్రపుది. నా బతుకు దరిద్రంది..." అంటూ తన కథంతా చెప్పేసింది. 

వనజ నిర్ణయం వాళ్ళిద్దరి మధ్యనే ఉండిపోవడం కారణంగా గడీలో జరిగిన పరిణామాలు వనజకి ఇబ్బందులని తెచ్చాయి. మంజరి చేతిలో ఆమెకి ఎన్నో అవమానాలు జరగడానికి కారణమయ్యాయి. వాటన్నింటినీ భరించింది వనజ. తనలో చలనం తెచ్చిన పాణి ఆమెకి ఎప్పటికీ ప్రత్యేకమైన వాడే. నవల పతాక సన్నివేశంలో రామారెడ్డి మరణించగానే, అప్పటివరకూ 'దొరా' అని పిలిచినా వనజ, 'నాయ్నా..' అంటూ అతని శవం మీద పడి భోరున విలపించడం పాఠకులని కదిలించడం మాత్రమే కాదు, వనజని ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా చేస్తుంది.

గురువారం, డిసెంబర్ 23, 2010

నాయికలు-హేమసుందరి

మనిషికెప్పుడూ తనకి దొరకని దానిని ఎలా అయినా సాధించుకోవాలన్న తపన ఉంటుంది. అలా సాధించుకునే ప్రయత్నంలో ఎదురయ్యే కష్టనష్టాలని భరించడం పెద్ద పనిగా అనిపించదు. రాజసౌధంలాంటి విశాలమైన భవనంలో విలాస జీవితం గడిపే హేమసుందరికి అందుబాటులో లేనివంటూ లేవు, పిడికెడు ప్రేమాభిమానాలు తప్ప. వాటిని తనకి అందించాడనే ఒకేఒక్క కారణంతో ఆమె ఓ సామాన్యుడైన రంగనాయకుడి తో ప్రేమలో పడిపోయింది. పీకలోతు కష్టాలని ఆనందంగా భరించింది.

నవరసాలనూ తగు పాళ్ళలో రంగరించి నలభై నాలుగేళ్ల క్రితం పిలకా గణపతి శాస్త్రి రాసిన 'విశాల నేత్రాలు' నవలలో నాయిక హేమసుందరి. కాంచీ రాజ్య ప్రధాన నగరం నిచుళాపురంలో పేరుగాంచిన వృద్ధ వేశ్య శృంగారమంజరి చిన్న కూతురు. నిజానికి ,హేమ శృంగారమంజరికి సొంత కూతురు కాదు. తను యవ్వనంలో ఉండగా ఇద్దరు బాలికలని చేరదీసి పెద్ద చేసింది శృంగారమంజరి. వారిలో ఒకరు మాణిక్యవల్లి మరొకరు హేమసుందరి.

శృంగారమంజరి పెంపకంలో లోటన్నది ఎరగకుండా పెరిగింది హేమసుందరి. సకల కళలనీ అభ్యసించింది. దొరకనిదల్లా ప్రేమ. తన సొంత వాళ్ళెవరో తనకి తెలీదు. చుట్టూ ఉన్న వారెవరూ తనవారు కాదు. తల్లి తనని వృత్తిలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలోనే రంగనాయకుడి కంట పడింది హేమసుందరి. సాముగరిడీలలో దిట్టైన రంగనాయకుడికి ఓ అందమైన ఆడపిల్లని దగ్గరనుంచి చూడడం, ఆపై చూపు తిప్పుకోలేక పోవడం అదే తొలిసారి.

అది మొదలు రంగనాయకుడి జీవితం మారిపోతుంది. హేమసుందరి దర్శన భాగ్యం కోసం తపించిపోతాడతడు. హేమసుందరి తనని ప్రేమించడం తన అదృష్టంగా భావిస్తాడు. రాత్రిపూట శరీరానికి మసి పూసుకుని శృంగార మంజరి భవంతిలోకి ప్రవేశించడానికి సైతం వెనుకాడడు అతడు. మరోపక్క, కేవలం తనకోసం రంగనాయకుడు అంతటి సాహసాలు చేస్తుండడంతో అతనిపై పుట్టిన ప్రేమ రెట్టింపవుతుంది హేమసుందరికి.

తన ఇంట్లో ఎవరినీ మనస్పూర్తిగా నమ్మని హేమసుందరి, మొదటిసారిగా అక్క మాణిక్యవల్లిని నమ్మి తన ప్రేమకథ చెబుతుంది. అప్పటివరకూ తనని మించిన అందగత్తె అయిన హేమ తన వ్యాపారానికి అడ్డం వస్తుందని మథన పడుతున్న మాణిక్యవల్లికి హేమని అడ్డు తొలగించుకోడానికి ఇదో చక్కని అవకాశంగా కనిపిస్తుంది. చెల్లెలు రంగానాయకుడితో కలిసి శ్రీరంగం పారిపోడానికి పరోక్షంగా సహకరిస్తుంది మాణిక్యవల్లి.

తనకంటూ ఒక ఇల్లు, భర్త, సంఘంలో గౌరవం.. ఈ కొత్త జీవితం ఎంతగానో సంతృప్తిని ఇస్తుంది హేమసుందరికి. వివాహం చేసుకోకపోయినా శ్రీరంగంలో భార్యాభర్తలుగా చెలామణి అవుతారు హేమ, రంగనాయకుడు. అయితే ఆ సంతృప్తి, సంతోషం ఎంతోకాలం ఉండవు. ఒక్కసారిగా దొరికిన స్వేచ్ఛ రంగనాయకుడిని వ్యసనపరుడిని చేస్తుంది. అత్యంత సౌందర్యవతి అయిన హేమ పక్కనే ఉన్నా పరస్త్రీ వ్యామోహంలో పడతాడు. ఇదేమని ప్రశ్నించిన హేమకి జవాబు దొరకదు.

రంగనాయకుడి వ్యసనాలని భరిస్తున్న హేమకి, అతడికి వృద్ధుడైన రామానుజ యతితో ఏర్పడ్డ అనుబంధం మాత్రం కలవరాన్ని కలిగిస్తుంది. రంగనాయకుడు సన్యసిస్తాడేమో అనే సందేహం ఆమెని యతిని కలుసుకునేలా చేస్తుంది. తనకి పిడికెడు ప్రేమని అందించిన రంగనాయకుడి పై సముద్రమంత ప్రేమని కురిపించిన హేమసుందరి జీవితం ఏ మలుపు తిరిగింది? ఆమెకి తను కోరుకున్నది దొరికిందా? అన్నది నవల ముగింపు. నవల పూర్తయ్యాక కూడా ఏళ్ళ తరబడి వెంటాడే పాత్ర హేమసుందరి.

బుధవారం, సెప్టెంబర్ 15, 2010

నాయికలు-సుభద్ర

జీవితం అంటే..?? ఇది అందరూ ఒకే సమాధానం చెప్పే ప్రశ్న కాదు. ప్రశ్న ఒక్కటే అయినా సమాధానాలు వేనవేలు.. సుభద్రకి మాత్రం జీవితం అంటే ఎదురు చూపు.. ఒక సుదీర్ఘమైన ఎదురు చూపు. గతాన్ని నెమరు వేసుకుంటూనే భవిష్యత్తుకోసం చూసే ఎదురు చూపు. అలా అని ఆమె వర్తమానాన్నీ, తన కర్తవ్యాన్నీ మర్చిపోలేదు.. జ్ఞాపకాల సమాధిలో కూరుకుపోలేదు. జి. కళ్యాణ రావు రచన 'అంటరాని వసంతం' లో ఒక ముఖ్య పాత్ర సుభద్ర. పుస్తకం పూర్తి చేసి పక్కన పెట్టినా పదే పదే వెంటాడే పాత్రల్లో ఒకటి.

ఎన్నెలదిన్నెలో పుట్టింది సుభద్ర. పిట్టోడి కూతురు ఆమె. "మాలింట పుట్టినా మాలక్ష్మిలా ఉంది" అని ఎన్నెలదిన్నెఊరు ఊరంతా అనుకుంది. పెద్దింటి ఆడవాళ్ళు కూడా తన కూతురిని ప్రత్యేకంగా చూసేలా పెంచాడు పిట్టోడు. ఆ పల్లెలో మోకాలి కిందకి చీర కట్టిన తొలి పడుచు ఆమె. మెడకీ, చెవులకీ బంగారాన్నీ అలంకరించుకున్నదీ, కాళ్ళకి తోలు చెప్పులు తొడిగిందీ ఆమె. అంత గారంగా పెంచాడు పిట్టోడు.. అంత అపురూపంగా పెరిగింది సుభద్ర.

అలాంటి సుభద్ర ఎల్లన్నని ప్రేమించింది. ఎల్లన్న అంటే ఆటెల్లడు, పాటెల్లడు. ఆటా పాటా అతని జీవితంలో ఒక భాగం. తల్లీ తండ్రీ ఉన్నా మేనత్త బూదేవి పెంపకంలో పెరిగాడు ఎల్లన్న. సుభద్ర మనసు తెలిసిన క్షణం నుంచీ ఎల్లన్న పాటంతా సుభద్రే అయ్యింది. చుక్కల ముగ్గుకర్ర అన్నాడు, పచ్చి పగడానివి అన్నాడు. పండు వెన్నెలవనీ అన్నాడు. బూదేవి చొరవతో వాళ్ళిద్దరి పెళ్ళీ జరిగింది.. తండ్రికి ఎదురు చెప్పి మరీ ఎల్లన్నని పెళ్లి చేసుకుంది సుభద్ర.

ఆ తర్వాత? ఎల్లన్న కోసం ఎదురు చూపులు మొదలయ్యాయి సుభద్రకి. అప్పటికే నాటకాల్లో పేరు తెచ్చుకున్న ఎల్లన్న, తన గురువు నాగన్నతో కలిసి ప్రదర్శనలకి పొరుగూళ్ళకి వెళ్ళడం మొదలు పెట్టాడు. మొదట పౌరాణిక నాటకాలే ఆడినా, తన కులానికి జరిగిన అన్యాయాలు ఒక్కొక్కటిగా తెలిశాక, తమ ఊరికథనే పాటగా మలిచాడు.. పాడడం మొదలు పెట్టాడు. ఆ పాటకి ముగింపు కేవలం శ్రోతల కళ్ళనుంచి జారే కన్నీరు కారాదనీ, వాళ్ళలో ఆలోచన మొదలవ్వాలనీ ఆశించాడు.

"కాస్త పనుంది..ఎల్లోస్తా" అని సుభద్రకి చెప్పి బయలుదేరాడు ఎల్లన్న. ఆ కాస్త పనీ అన్ని సంవత్సరాల ఎడబాటు అనుకోలేదు సుభద్ర. ఎల్లన్న ప్రతి పాట లోనూ సుభద్రని ఉంచాడు. సుభద్రకి చెబుతున్నట్టే పాడాడు. అతని పాటకి పల్లవి సుభద్ర. అల్లికకి అసలైన దారం. శివయ్యకి జన్మనిచ్చిన సుభద్ర ఎల్లన్న కోసం ఎదురు చూస్తూనే కొడుకుని పెంచి పెద్ద చేసింది. ఏనాడూ గడప దాటి ఎరగనిది కూడా, పంట పొలానికి రావాల్సిన నీళ్ళ కోసం ఊరిని ఎదిరించి, పారతో గట్టు తెగ్గొట్టింది.

ఊరు ఆమెని చూసి భయపడింది. ఆ భయం నుంచి ఆమెని ఒక దేవతని చేసేసింది. అయినా ఏమీ మాట్లాడలేదు సుభద్ర. తన పనేదో తనది. తిరిగే ఎల్లన్న కోసం ఎదురు చూడడం, పెరిగే శివయ్య కోసం చేల గట్లకు శక్తినంతా ధారపొయ్యడం తప్ప సుభద్రకి చెయ్యాల్సింది ఇంకేమీ లేదు. అంతా ఆశే. ఎల్లన్న ఎప్పటికైనా వస్తాడన్న ఆశ. శివయ్య తండ్రి దగ్గర లేకపోయినా గొప్పగా ఎదగాలనే ఆశ.

వలస కూలీల పిల్ల శశిరేఖ పాడిన పాటలో ఎల్లన్న జాడ పట్టుకోగలిగింది సుభద్ర. "మిన్నూ పానుపు మీద.. దూదీ దుప్పటి పైన.. సుక్కాల పూలగుత్తి సూబద్రా.. నువ్వు పచ్చీ పగడానివే సూబద్రా.." అంటూ ఆ పిల్ల పాడిన పాట తనవాడు అల్లినదే అని గుర్తు పట్టింది. ఎల్లన్న-సుభద్రల సమాగమం గుండెని పిండే ఒక సన్నివేశం. సుభద్రని మర్చిపోవడం అంత తేలిక కాదు..ఎల్లన్నకే కాదు, పాఠకులకి కూడా..

మంగళవారం, ఫిబ్రవరి 16, 2010

నాయికలు-పద్మావతి

పద్మావతి నాకు చాలా చిత్రంగా పరిచయమయ్యింది. నాకు చిన్నప్పుడే పుస్తకాలు చదవడం అలవాటవ్వడం అమ్మకి సంతోషం కలిగించింది. అప్పట్లో అమ్మ నాకు ఒకే ఒక్క నిబంధన పెట్టింది. "పెద్దాడివి అయ్యే వరకూ చలం పుస్తకాలు చదవకు. అవి తప్ప ఇంకేం చదివినా నీ ఇష్టం" అని. వద్దన్నపని చెయ్యాలనే మానవ సహజమైన కుతూహలం వల్ల చలం అనే ఆయన రాసిన పుస్తకాలు ఎక్కడైనా కనిపిస్తాయా అని వెతికాను కానీ, ఎక్కడా దొరకలేదు.

నేనప్పుడు నాలుగో తరగతో, ఐదో తరగతో. రోజూ లాగే ఉదయం బడికి వెళ్ళడానికి తయారవుతూ రేడియో వింటున్నా. "ఇప్పుడు నవలా పరిచయ కార్యక్రమం.. ఈ వారం నవల 'దైవమిచ్చిన భార్య,' రచన గుడిపాటి వెంకటా చలం..." ఒక్కసారిగా చెవులు రిక్కించాను. ప్రతి అక్షరం శ్రద్ధగా విన్నాను. ఎంతగా అంటే ఇప్పటికీ ఈ నవల చదువుతున్న ప్రతిసారీ రేడియోలో వచ్చిన కార్యక్రమం నా చెవుల్లో వినిపిస్తూ ఉంటుంది. ఈ నవలలో నాయికే పద్మావతి, ఓ జమీందారు గారి అమ్మాయి.

పద్మావతి పక్కింటి అబ్బాయి రాధాకృష్ణ. పూర్వాచారాలని పాటించే కుటుంబం అతనిది. పద్మావతి కుటుంబం కొంచం ఆదర్శ భావాలున్నది. సెలవుల్లో తన అన్నలిద్దరితో పల్లెటూరికి వచ్చిన పద్మావతికి రాధాకృష్ణతో స్నేహం కుదురుతుంది. మొదట అతని ఆహార్యాన్ని చూసి పట్నం పిల్లలు ముగ్గురూ ఆటపట్టించినా, త్వరలోనే పిల్లలు నలుగురూ స్నేహితులవుతారు. ముఖ్యంగా పద్మావతి-రాధాకృష్ణ ల మధ్య స్నేహం బలపడుతుంది.

ఆ సెలవుల్లోనే పద్మావతి కి 'న్యాయమూర్తి' తో పెళ్ళవుతుంది. పెళ్లవ్వగానే పై చదువులకి ఇంగ్లండు వెళ్తాడు న్యాయమూర్తి. మధ్యలో కొంత ఎడబాటు తర్వాత, యుక్త వయస్కులయ్యాక మళ్ళీ కలుసుకుంటారు పద్మావతి-రాధాకృష్ణ. చిన్నప్పటి ఆటపాటల్ని గుర్తు చేసుకుంటారు ఇద్దరూ. స్నేహం ప్రేమగా మారి, ఒకరిపై మరొకరికి మోహం పుట్టడానికి కారణం అవుతుంది. ఓ వెన్నెల రాత్రి వాళ్ళిద్దరూ ఏకమవుతారు.

ఓ పక్క న్యాయమూర్తి తో కాపురం చేస్తూనే, రాధాకృష్ణ తో స్నేహాన్ని కొనసాగిస్తుంది పద్మావతి. ఆమెని ఎప్పటికీ తనతో వచ్చేయమని కోరతాడు రాధాకృష్ణ. "నువ్వు నాతో ఉంటే చాలు.. ఇంకేమీ అక్కర్లేదు" అంటాడు. "ఎందుకు అక్కరలేక పోవాలి? నాకోసం నువ్వు అన్నీ ఎందుకు వదులుకోవాలి? నీకు ఇదా ప్రేమ చేసే ఉపకారం? నిన్ను కలుసుకోడమంటే నాకెంతో ఇష్టం. నీ దగ్గర్నించి వెళ్ళిపోయి, నిన్ను కొన్నాళ్ళు చూడకుండా ఉండడం మరీ ఇష్టం! మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు మరీ బాగుంటుందిగా" అంటుంది పద్మావతి.

ఒక రోజు పద్మావతి-రాధాకృష్ణ న్యాయమూర్తి కంట పడతారు. పద్మావతిని వదులుకోడానికి సిద్ధ పడడు న్యాయమూర్తి. ఆమె రాధాకృష్ణతో కలవడానికి వీల్లేదంటాడు. న్యాయమూర్తిని వదిలేసి తనతో వచ్చేయమంటాడు రాధాకృష్ణ. తమ ఇద్దరిలో ఎవరు కావాలో నిర్ణయించుకోమంటాడు. "ఇద్దరిలో ఎవరినో ఏరుకోడం ఏమిటి? ఎందుకు యేరుకోవాలి? ఎవరో ఒకరు ఉండి తీరాలా ఏమిటి నాకు మొగనాధుడు? మీ ఇద్దరూ ఎందుకిలా బొమిక ముక్క కోసం కుక్కల్లాగా పోట్లాడుతారు? ఇది నా ఇల్లు. నేనిక్కడ ఉంటాను," అంటుంది స్థిరంగా.

ఈపోరులో న్యాయమూర్తే గెలుస్తాడు. పద్మావతికీ, రాధాకృష్ణకీ ఎడబాటు తప్పదు. అది ఒప్పందం, పద్మావతి అంగీకరించిన ఒప్పందం. రాధాకృష్ణ కి శకుంతలతో వివాహం జరగడం, అతను దేశాంతరం వెళ్ళడం, తిరిగి వచ్చి ఓ పత్రిక నడపడం, ఇద్దరు పిల్లల్ని కనడం...మరో పక్క పద్మావతికి ఇద్దరు పిల్లలు కలగడం జరిగాక, వాళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారు యాదృచ్చికంగా. పెద్ద గాలి దుమారం లేస్తుంది పద్మావతి ఇంట్లో. రాధాకృష్ణ మీద ప్రేమ అంతకంతకూ పెరుగుతుంది పద్మావతికి, మరో పక్క రాధాకృష్ణ పరిస్థితి కూడా అదే.

తనతో వచ్చెయ్యమని మరోసారి ప్రతిపాదిస్తాడు రాధాకృష్ణ, ఈసారి కొంచం బలహీనంగా. తన భార్య, ఇద్దరు పిల్లలూ గుర్తొచ్చారు మరి. న్యాయమూర్తి ఆగ్రహంతో రగిలి, రాధాకృష్ణ ని కోర్టుకి ఈడ్చేందుకు నిర్ణయించుకుంటాడు. శకుంతల నలిగిపోతుంది, ఈ గొడవల్లో. ఈ ప్రేమకథకి పద్మావతి ఇచ్చిన (చలం ఇచ్చిన) ముగింపు తెలుసుకోవాలంటే 96 పేజీల 'దైవమిచ్చిన భార్య' నవల చదవాల్సిందే. (అరుణా పబ్లిషింగ్ హౌస్ ప్రచురణ. వెల రూ.30, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

మంగళవారం, డిసెంబర్ 22, 2009

నాయికలు-అరుణ

"నేను ప్రకాశాన్ని పెళ్లి చేసుకుంటాను.. అప్పుడు నేను స్వేచ్ఛగా ఉండొచ్చు.." అంటుందో ఇరవై రెండేళ్ళ అమ్మాయి తన స్నేహితురాలితో. "అందరూ పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛ పోతుందని గోల పెడుతుంటే, నువ్వు స్వేచ్ఛ కోసం పెళ్లి చేసుకుంటానంటే నవ్వు రాదూ.." అంటుందా స్నేహితురాలు, నవ్వాపుకుంటూ. మూడేళ్ళ సంసార జీవితం తర్వాత, ఓ పాపకి తల్లైన రెండేళ్ళకి, స్నేహితురాలి మాటలు అర్ధమవుతాయి ఆమెకి. ఆమె పేరు అరుణ.

తెలుగు పాఠకులకి వోల్గా గా పరిచయమైన పోపూరి లలిత కుమారి ఇరవై రెండేళ్ళ క్రితం రాసిన 'స్వేచ్ఛ' నవలలో నాయిక అరుణ. మధ్య తరగతి అమ్మాయి. ఇంట్లో తల్లి, తండ్రి, అన్న వదిన, చివరికి తల చెడి వాళ్ళ పంచన చేరిన మేనత్త అందరూ ఆమెని కట్టడి చేసేవాళ్ళే. ఆమె ఏ పని చేయాలన్నీ వీళ్ళందరి అనుమతీ తీసుకోవాల్సిందే. తండ్రికి ఆమెకి పెళ్లి చేసే ఆర్ధిక స్తోమతు లేకపోవడం వల్ల కష్టపడి ఎమ్మే చదవ గలిగింది అరుణ. అప్పుడే యూనివర్సిటీ లో పరిచయమై ప్రాణ స్నేహితురాలిగా మారింది ఉమ. అప్పటి స్నేహితుడు ప్రకాశం, తర్వాత ఆమెకి భర్తగా మారాడు.

చిన్నప్పటినుంచీ తను ఖర్చు పెట్టే ప్రతి పైసాకీ ఇంటిల్లపాది నుంచీ అనుమతి సంపాదించాల్సి రావడం వల్ల, ఆర్ధిక స్వాతంత్రం విలువ చిన్న వయసులోనే అర్ధమవుతుంది అరుణకి. అందుకే ఏదైనా ఉద్యోగం వచ్చేవరకూ పెళ్లి మాట తలపెట్ట వద్దంటుంది, అప్పటికే ఉద్యోగస్తుడైన ప్రకాశాన్ని. ఒక కాలేజీలో తెలుగు లెక్చరర్ గా చేరిన నెల్లాళ్ళకి, ఇంట్లో వాళ్లకి చెప్పకుండా ప్రకాశాన్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటుంది అరుణ. పుట్టింటితో సంబంధాలు శాశ్వతంగా తెగిపోతాయి ఆమెకి. స్నేహితురాలు ఉమ పై చదువుల కోసం వెళ్తుంది.

కాలం గడుస్తున్న కొద్దీ ప్రకాశం అర్ధం కావడం మొదలుపెడతారు అరుణకి. తామిద్దరి మధ్యా ఉన్న భేదం కూడా తెలుస్తూ ఉంటుంది ఆమెకి. అరుణ కేవలం తను, తన సంసారం అనుకుంటూ ఉండలేదు. జీతాల కోసం చేసే ఉద్యమం కావొచ్చు, బాధార్తుల జీవితాలని వెలుగులోకి తెచ్చే పత్రిక కావొచ్చు, వాటిలో పనిచేయడంలో ఆనందం, తృప్తీ లభిస్తాయి ఆమెకి. సంఘం లో ఉన్న సమస్యలకి తాను బాధ్యుడిని కాదు కాబట్టి, వాటి పరిష్కారంతో తనకి సంబంధం లేదంటాడు ప్రకాశం.

జీవితాన్ని కాచి వడపోసిన అత్తగారు కమలమ్మ పెద్ద అండ అరుణకి. కేవలం పాపని చూసుకోడమే కాదు, అరుణకి కావాల్సిన మానసిక స్థైర్యం కూడా ఇస్తూ ఉంటుందామె. కొడుకూ, కోడలూ కీచులాడుకుంటూ ఉండకూడదన్నది ఆమె కోరిక. ఇద్దరికీ చెప్పలేక సతమతమవుతూ ఉంటుంది. అప్పుడప్పుడూ ఉమ రాసే ఉత్తరాలు పెద్ద ఊరట అరుణకి. 'వెలుగు' అనే పత్రిక కోసం అరుణ నెలకి వందరూపాయలు చందా ఇవ్వడం, ఆ పత్రిక కోసం సమాచారం సేకరించి వ్యాసాలు రాయడం అస్సలు నచ్చదు ప్రకాశానికి. ఆ పనిలో యెంతో ఆనందం దొరుకుతుంది అరుణకి.

"పెళ్ళయితే ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరి పాత్రలనూ ప్రకాశమే పోషిస్తాడేమో.." అని ఒకప్పుడు ఉమ అన్న మాటలు గుర్తొస్తాయి అరుణకి. నిజానికి అరుణ దృష్టిలో ప్రకాశం చాలామంది మగవాళ్ళకన్నా మంచివాడు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే తను చేసేవి అతనికి నచ్చవు, అతనికి నచ్చేట్టుగా తను ఉండలేదు.. ఉంటే స్వేచ్ఛకి అర్ధం ఉండదు. తమ ఇద్దరి దారులూ వేరన్న విషయం అర్ధం కాగానే అరుణ ఎలాంటి నిర్ణయం తీసుకుందన్నది ఈ నవల ముగింపు.

'చతుర' నవలల పోటీలో ప్రధమ బహుమతి గెలుచుకున్న ఈ నవల అప్పట్లో ఒక సంచలనం. ఎన్నో వివాదాలకి కేంద్ర బిందువు. ప్రగతిశీల ఉద్యమాల్లో పనిచేసే మగవాళ్ళు తమ ఇంటి స్త్రీలని మిగిలిన అందరు మగవాళ్ళ లాగే చూస్తారనీ, తమతో పని చేసే స్త్రీల ఇబ్బందులని ఏమాత్రం పట్టించుకోరనీ రాయడం సహజంగానే చాలామందికి కోపం తెప్పించింది.

కథా వస్తువుతో పాటు, రచయిత్రి వ్యక్తిగత జీవితం కూడా చర్చల్లోకి వచ్చింది. వోల్గా రచనల్లో ఎక్కువ సార్లు పునర్ముద్రణలు పొందిన నవల బహుశా ఇదే. తనకి నచ్చినట్టుగా జీవించాలనుకున్న ఒక సాధారణ స్త్రీకి పరిస్థితులు ఎలాంటి పాఠాలు నేర్పుతాయన్నది సమగ్రంగా చిత్రించిన నవల 'స్వేచ్ఛ.' (స్వేచ్ఛ ప్రచురణలు, పేజీలు 155, వెల రూ. 60 అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

మంగళవారం, నవంబర్ 17, 2009

నాయికలు-కిరణ్మయి

చదివిన చదువును జీవితానికి అన్వయించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ కొందరి కోవకి వస్తుంది కిరణ్మయి. ఆమె మనస్తత్వ శాస్త్రం లో పీజీ చేసింది. ఊహించని కష్టం వచ్చి పడినప్పుడు, అందమైన పొదరిల్లు లా ఉండాలని తను కోరుకున్న తన వైవాహిక జీవితం పునాది దశలోనే కూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ మనస్తత్వ శాస్త్రాన్నే తనకి ఆసరాగా చేసుకుంది కిరణ్మయి. పోలీసులకి దీటుగా అపరాధ పరిశోధన చేసి తన భర్తని రక్షించుకుంది. ఈ క్రమంలో 'లేడీస్ హాస్టల్' లో జరుగుతున్న అక్రమాలెన్నింటినో వెలుగులోకి తెచ్చింది.

కిరణ్మయిది విచిత్రమైన కుటుంబం. ఉద్యోగం నుంచి సస్పెండైన తండ్రి, ఇంటి బాధ్యత పట్టించుకోని అన్నలు. ఇంట్లో రాజకీయాలు చేసే వదినలు. ఏ ఇద్దరి మనుషుల మధ్యా అనుబంధం లేదా ఇంట్లో. 'తన' ఇల్లు అలా ఉండకూడదని కిరణ్మయి కోరిక. ఆమెకి పెళ్లి చేయడం కన్నా ఉద్యోగానికి పంపితే తనకి వెసులుబాటుగా ఉంటుందని ఆలోచిస్తాడు ఆమె తండ్రి. అలాంటి పరిస్థితుల్లోనే ఆమెకో పెళ్లి సంబంధం వస్తుంది. పెళ్లి కొడుకు రంజీ క్రికెట్ ప్లేయర్.. పేరు రాయన్న. ఆమె కన్నా తక్కువ చదువుకున్నాడు. అయినా వాళ్ళ పెళ్లి జరిగిపోయింది.

మనస్తత్వ శాస్త్రం ఆధారంగా మొదటి రాత్రి తన భర్తని అంచనా వేసే ప్రయత్నం చేస్తుంది కిరణ్మయి. తన ఆశ, శ్వాస క్రికెట్టే అనీ, భారత జట్టుకి ఎంపికవ్వాలన్నది తన ధ్యేయమని రాయన్న చెప్పినప్పుడు, "రెండేళ్ళ పాటు ఉద్యోగం మానేసి ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టండి.. ఈ రెండేళ్ళూ నేను ఉద్యోగం చేస్తాను.." అంటుంది, అప్పటివరకూ క్రికెట్ గురించి పెద్దగా అవగాహన లేని కిరణ్మయి. ఆమెతో తన జీవితం బాగుంటుందన్న నమ్మకం లుగుతుంది రాయన్నకి. తనకి ఏ అమ్మాయితోనూ శారీరక సంబంధం లేదని భార్యకి చెబుతాడతను. అమ్మాయిలు వచ్చి ఆటోగ్రాపులు తీసుకుంటారనీ, అంతకు మించి ఎవరితోనూ పరిచయం లేదనీ చెబుతాడు.

రాయన్నతో జీవితం తను కోరుకున్నట్టుగా ఉండబోతోందన్న నమ్మకం కిరణ్మయి కి కలుగుతున్న సమయంలోనే తలుపు చప్పుడవుతుంది. అర్ధరాత్రి వేళ వచ్చిన పోలీసులు రాయన్న ని అరెస్టు చేస్తారు.. లేడిస్ హాస్టల్ లో ఉంటున్న అపురూప లక్ష్మి అనే అమ్మాయి ఆత్మహత్యకి కారణమయ్యాడన్న అభియోగంపై. "నాకే పాపమూ తెలీదు.. కనీసం నువ్వైనా నమ్ము" అని భార్యకి చెప్పి పోలీసు జీపెక్కుతాడు రాయన్న. ఆ అర్ధరాత్రి వేళ తన మనో నిబ్బరం కోల్పోకుండా ఉండడం కోసం కిరణ్మయి చేసిన పని ఓ పుస్తకం తీసుకుని చదువుకుంటూ కూర్చోడం. ఆ మర్నాడే సెలక్షన్స్ కోసం పిలుపొస్తుంది రాయన్నకి.

అతనికి బెయిల్ ఇప్పించడం మొదలు సెలక్షన్స్ లో ఆడడానికి అతన్ని మానసికంగా సిద్ధం చేయడం వరకూ కిరణ్మయి చేసిన కృషి అసామాన్యమైనది. అతను సెలక్షన్స్ కి వెళ్ళగానే లాయర్ తో కలిసి భవిష్యత్ కార్యక్రమం ఆలోచించి, రాయన్న నిర్దోషి అని నిరూపించే ఆధారాలను వెతికే పనిలో పడుతుంది ఆమె. ఓ పక్క రాయన్న దోషి అని బలంగా నమ్ముతున్న పోలీసులు, మరోపక్క అతను నేషనల్ టీం లో సెలక్ట్ కాకూడదని పావులు కదుపుతున్న క్రికెట్ ప్రత్యర్ధులు, ఇంకోపక్క జరుగుతున్నా పరిణామాల వల్ల తనమీద తనకే నమ్మకం పోతున్న స్థితిలో ఉన్న రాయన్న.. కుటుంబ సభ్యులెవరూ సాయం చేయడానికి ముందుకు రాని నేపధ్యంలో పరిస్థితులతో పోరాటానికి సిద్ధపడుతుంది కిరణ్మయి.

రాయన్న భార్యగా కాక, ఓ విద్యార్ధిని గా హాస్టల్లో చేరిన కిరణ్మయికి రాయన్నని అనుమానించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఓ పక్క రాయన్నకి కావాల్సిన మనో ధైర్యాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే, అతని నిర్దోషిత్వాన్ని నిరూపించే ఆధారాలు సేకరించడం మొదలు పెడుతుంది కిరణ్మయి. రాయన్న అపురూపలక్ష్మికి 'కొంత' సన్నిహితుడన్న విషయం తెలిసినప్పుడూ, ఆ అమ్మాయి రాయన్నని ప్రేమించిందన్న నిజం బయట పడినప్పుడు కలత చెందుతుంది కిరణ్మయి. అంతమాత్రాన తన బాధ్యతని మరచిపోదు. హాస్టల్ అమ్మాయిలతో స్నేహం చేసి జరిగినదేమిటో తెలుసుకుంటుంది. యండమూరి వీరేంద్రనాథ్ నవల 'లేడీస్ హాస్టల్' చదివిన ప్రతి ఒక్కరినీ చాలా రోజులపాటు వెంటాడే పాత్ర కిరణ్మయి. తనదైన శైలిలో ఆమె వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు యండమూరి.

ప్రతి అంశాన్నీ తనదైన దృక్కోణం నుంచి ఆలోచించడం, మానసికంగా బలహీనమైనప్పుడు సైతం ఆలోచనల్లో లాజిక్ ని విడిచిపెట్టక పోవడం కిరణ్మయి ప్రత్యేకత. చివరి ఆధారం దొరికే వరకూ రాయన్న నేరం చేసే ఉండొచ్చన్న ఆలోచన ఏమూలో గుచ్చుతూనే ఉంటుంది ఆమెని. వైవాహిక జీవితాన్ని గురించి సంతోషంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న సమయంలోనే పిడుగుపాటులా అనిపించే భర్త అరెస్టు మొదలు, ఇంటా బయటా అతనిపై వచ్చిన నిందలు, చుట్టూ ఉన్న మనుషుల నిజ స్వరూపాలు మరోసారి బహిర్గతం అవడం వల్ల కలిగే శూన్యత.. వీటన్నింటినీ ఎదుర్కొని తన లక్ష్యాన్ని సాధించిన కిరణ్మయి ని అభినందించకుండా ఉండలేం. ('లేడీస్ హాస్టల్,' రచన: యండమూరి వీరేంద్రనాథ్, 'నవసాహితి' ప్రచురణ, వెల రూ. 70, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

బుధవారం, నవంబర్ 04, 2009

నాయికలు-కజు

ఆమె తన మూడవ ఏట జరిగిన మారణకాండకి ప్రత్యక్ష సాక్షి. ఆ గాయం తాలూకు గుర్తులు చెరగక ముందే పెంపుడు తల్లితో కలిసి పొరుగు దేశానికి ప్రయాణమయ్యింది. సంఘర్షణ ఆమె జీవితంలో ఒక భాగమయ్యింది. పెంపుడు తల్లి ఎలాంటి లోటూ చేయకపోయినా వయసుతో పాటు ఆమెలో పెరిగిన కోరిక ఒక్కటే.. ఎప్పటికైనా "తన వాళ్ళని" కలుసుకోవాలని.. చదువు పూర్తవ్వడంతోనే, అమెరికా నుంచి ఇండియా కి ప్రయాణమయ్యింది, బంధువులని చూసే వంకతో. మూలాలని వెతుక్కుంటూ ఆ అమ్మాయి చేసిన అన్వేషణే సోనాలి బోస్ రాసిన ఆంగ్ల నవల 'అము.' కథానాయిక కజు.. కజోరి రాయ్.

అమెరికా వర్ణ వివక్ష కారణంగా ఇబ్బందులు పడుతున్న మూడో ప్రపంచ దేశాల పౌరుల కోసం పనిచేసే ఉద్యమకారిణి కేయ రాయ్ పెంపుడు కూతురు కజు. ఢిల్లీ శివార్లలోని చందన్ హోలా అనే పల్లెటూళ్ళో అంటు వ్యాధి ప్రబలి చాలా మంది చనిపోయారనీ, అప్పుడే తాను మూడేళ్ళ కజు ని పెంపకానికి తీసుకున్నాననీ కూతురికి చెబుతుంది కేయ. తన ఊరిని చూడాలని, తనవారంటూ ఎవరైనా ఉంటే వాళ్ళని కలుసుకోవాలనే కోరిక వయసుతో పాటే పెరుగుతుంది కజు కి. తను తన గతాన్ని తలచుకోవడం తల్లికి ఇష్టం లేదని తెలుసు ఆమెకి. అందుకే చదువు పూర్తవ్వగానే, అమ్మమ్మనీ (కేయ తల్లి), మావయ్య కుటుంబాన్నీ చూసే వంకతో ఢిల్లీ బయలుదేరుతుంది.

స్వతంత్ర భావాలున్న కేయ పెంపకం, అమెరికా వాతావరణం నేపధ్యంలో పెరిగిన కజు ది విలక్షణమైన వ్యక్తిత్వం. తను అనుకున్నది ఎలాగైనా సాధించే పట్టుదల ఉన్న అమ్మాయి. అయితే అందుకోసం ఎవరినీ ఇబ్బంది పెట్టలేని మొహమాటం కూడా ఉంది. ఎలాంటి విషయాన్నైనా తల్లితో ధైర్యంగా చర్చించగలదు. తన పదమూడో ఏట కలిగిన 'తొలి ముద్దు' అనుభవాన్ని ఆమె మొదట చెప్పింది కేయకే.

చిన్నతనంలో తన స్నేహితుల కుటుంబాలని చూసి, తనకీ తల్లీ, తండ్రీ వాళ్లకి ఉదయం నుంచీ సాయంత్రం వరకూ మాత్రమే ఉండే ఉద్యోగాలు, చక్కటి సాయంత్రాలు, ఆహ్లాదకరమైన వారాంతాలు ఉంటే బాగుండేవని అనుకుంటుంది కజు. అయితే వయసు పెరిగే కొద్దీ తల్లి చేసే పనుల్లో గొప్పదనం అర్ధమవుతుంది ఆమెకి. ముఖ్యంగా తన స్నేహితులంతా తల్లిని అడ్మిరేషన్ తో చూస్తున్నప్పుడు ఆమె కూతురు అయినందుకు గర్వపడుతుంది కజు. ఆమెతో పాటే ఉద్యమాలలో పాల్గొంటూ ఉంటుంది, తనకి వీలైనప్పుడల్లా.. పేదలనూ, వాళ్ళ కష్టాలనూ చూసి చలించిపోయే మనస్తత్వం ఆమెది.

ఢిల్లీ లో ఉంటున్నా బెంగాలీ సంప్రదాయాలని క్రమం తప్పకుండా పాటించే మావయ్య కుటుంబంతో, ముఖ్యంగా తన ఈడుదే అయిన మావయ్య కూతురు తుకి తో తొందరలోనే అనుబంధం పెరుగుతుంది కజు కి. ఇండియా వచ్చిన నెల్లాళ్ళకి పల్లెటూరు చూడాలనే వంకతో చందన్ హోలాకి ప్రయాణం చేస్తుంది కజు. ఆమెని ఒంటరిగా బయటకు పంపడానికి ఇష్టపడని మేనమామ కుటుంబం ఆమె వెంటే వస్తుంది. ఎంతగా ప్రయత్నించినా ఆ గ్రామం తో తనకి ఎలాంటి అనుబంధం ఉన్నట్టు అనిపించదు కజు కి.

ఓ గురుద్వారా నుంచి వినిపించే గుర్బానీ యెంతో పరిచయమైనదిగా అనిపిస్తుంది కజుకి. 'ఎందుకు' అన్న విషయం లో స్పష్టత ఉండదు ఆమెకి. తుకి బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ స్నేహితుడైన కబీర్ తో పరిచయమవుతుంది ఆమెకి. సీనియర్ బ్యూరోక్రాట్ అరుణ్ సెహగల్ కొడుకైన కబీర్ తో మాటల యుద్ధంతో మొదలైన పరిచయం, అతనితో కలిసి ఒక మురికి వాడని చూడడానికి వెళ్ళేలా చేస్తుంది. ఢిల్లీ యూనివర్సిటీ సమీపంలో దాబా నడిపే గోబింద్ భయ్యా ఇల్లు, ముఖ్యంగా దగ్గరలోనే ఉన్న రైల్వే ట్రాక్ తనకి బాగా తెలిసినవిగా అనిపిస్తాయి కజుకి.

తనని ఎవరో తరుముతున్నట్టుగానూ, తనని తాను రక్షించుకోవాలని అంతరాత్మ చెబుతున్నట్టుగానూ అనిపించి ఒకరకమైన ఉద్వేగానికి లోనవుతుంది కజు. కబీర్ సాయంతో తన జన్మ రహస్యం తెలుసుకునే పని మొదలు పెడుతుంది. పాత రికార్డులు చూడడం ద్వారా తన మూడో ఏట చందన్ హోలలో అంటు వ్యాధి ప్రబలి పెద్ద యెత్తున జనం చనిపోయిన సంఘటన ఏదీ జరగలేదని తెలిసి ఆశ్చర్య పోతుంది. ప్రతి విషయాన్నీ తనతో చర్చించే కేయ ఇంత పెద్ద అబద్ధం ఎందుకు చెప్పిందో అర్ధం కాదు ఆమెకి. అది మొదలు తన ప్రయత్నాలు మరింత తీవ్రతరం చేసి జన్మరహస్యాన్ని చేధిస్తుంది.

ఇండియన్ అమెరికన్ రచయిత్రి సోనాలి బోస్ రాసిన 'అము' నవల్లో కజుతోపాటు కేయ పాత్రకూడా చాలా బలమైనదే. తనకి ఏమీ కాని పసి పిల్ల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన స్త్రీ కేయ. గతం తెలుసుకోడానికి కజు పడే తపన, చేసే ప్రయత్నాలు అలెక్స్ హెలీ 'రూట్స్' నవలని గుర్తు చేస్తాయి. ఇలాంటి కథాంశం తో వచ్చే సాహిత్యంపై 'రూట్స్' ప్రభావం పడకుండా ఉండడం సాధ్యం కాదేమో. మార్కిస్టు రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం నుంచి రావడం వల్ల కావచ్చు, సోనాలి బోస్ రచనలో చాలా చోట్ల 'ఎరుపు' నీ 'ఎర్రజెండా' నీ సింబాలిక్ గా వాడారు. రాజకీయాంశాల చర్చలో ఆమె మార్క్సిస్టు పార్టీ భావజాలాన్నే బలపరిచారు.

'అము' పేరు తో కజు పాత్రలో కొంకణ సేన్ శర్మ, కేయ పాత్రలో తన పిన్ని, మార్కిస్టు పార్టీ నేత బృందా కరత్ లతో సోనాలి తను తీసిన ఆంగ్ల చిత్రానికి 2004 సంవత్సరానికి గాను 'గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ నేషనల్ అవార్డు' అందుకున్నారు. స్క్రీన్ ప్లే ని కొద్ది మార్పులతో నవలగా విడుదల చేశారు. నాలుగేళ్ల క్రితం తొలిసారిగా చదివిన ఈ నవలని, మాజీ ప్రధాని ఇందిర హత్య జరిగి పాతికేళ్ళు గడిచిన సందర్భంగా దేశ రాజధానిలో జరిగిన ప్రదర్శనల నేపధ్యంలో మరో సారి తిరగేశాను. గతం లో లాగే కజు, కేయ పాత్రలు వెంటాడుతున్నాయి. ('amu,' పేజీలు 142, వెల రూ. 200, పెంగ్విన్ ప్రచురణ).

మంగళవారం, అక్టోబర్ 20, 2009

నాయికలు-వసుంధర

వసుంధరకి పేదరికమంటే ఏమిటో అనుభవ పూర్వకంగా తెలీదు. ఎందుకంటే ఆమె డబ్బులో పుట్టి పెరిగింది. ఓ పల్లెటూరి భూస్వామ్య కుటుంబంలో చిన్న కోడలు అయ్యింది. కానీ వసుంధర ఆలోచనలెప్పుడూ పేద వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఇందుకు కారణం కేవలం ఆమె ఆర్ధిక శాస్త్రం లో ఎమ్మే చదవడం మాత్రమే కాదు, చిన్నప్పటి నుంచీ ఆమెకి సామాజిక స్పృహ కొంచం ఎక్కువే. ఇరవై మూడేళ్ళ క్రితం సి.సుజాత రాసిన 'సుప్త భుజంగాలు' నవలలో ప్రధాన పాత్ర వసుంధర.

కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని ఇష్టంగా చదువుకుని, పేద సాదల పట్ల లోపల్లోపల సానుభూతిని పెంచుకుని కూడా తన కళ్ళెదురుగానే వాళ్లకి అన్యాయం జరుగుతుంటే నోరు విప్పి మాట్లాడ లేని నిస్సహాయ స్థితి వసుంధరది. తన ఇద్దరు కొడుకులనీ అడ్డుపెట్టుకుని ఇంటి పెత్తనం చేసే అత్తగారు వీర రాఘవమ్మ, వ్యవసాయ పనుల్లో తలమునకలుగా ఉండే బావ రంగశాయి, వ్యాపారం లో ఊపిరి పీల్చుకునేందుకు కూడా టైము దొరకని భర్త రవి, పెద్దగా చదువుకోని తోడికోడలు యశోద, పట్నంలో చదువుకునే పిల్లలు.. ఇదే వసుంధర చుట్టూ ఉన్న ప్రపంచం.

కేవలం వీళ్ళు మాత్రమే కాదు.. పొలంలో పనిచేసే నారాయణ, ఇంట్లో పని చేసే అతని భార్య వెంకాయి, కూతురు రవణి, ఊళ్ళో కాన్వెంటు నడుపుతున్న అవివాహిత లలిత, జీవితాన్ని, సంపాదనలో సింహ భాగాన్నీ కమ్యూనిస్టు ఉద్యమానికే ధారపోసిన స్కూలు మాస్టారు కూతురు అన్నపూర్ణా.. వీళ్ళంతా కూడా వసుంధర ని ఆలోచింపజేస్తూ ఉంటారు. రోజంతా పనిచేసి సాయంత్రం ఇచ్చిన కూలి పుచ్చుకుని, ఆపై యజమానుల చేత తిట్లు తినే కూలీలను చూసి కాపురానికి వచ్చిన కొత్తలో చలించి పోతుంది వసుంధర. కూలీలకి చదువు చెప్పి వాళ్ళ ఆలోచనల్లో మార్పు తేవాలని వృధా ప్రయత్నం చేస్తుంది.

పుస్తకాలలో చదువుకున్న పెట్టుబడిదారీ విధానం ఆచరణలో కళ్ళ ముందు కనిపిస్తుంటే ఆశ్చర్య పోతుంది వసుంధర. కాలేజీ రోజుల్లో తను కార్ల్ మార్క్స్ గురించి మాట్లాడుతుంటే స్నేహితులు "నువ్వలా మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందే" అని ఎందుకు అన్నారో అర్ధమవుతుంది ఆమెకి. కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోకూడదన్నది ఆమె ఒకప్పటి ఆదర్శం. "ఇది ఆస్తిలో నీ వాటా.. అన్నయ్యతో పాటు నీకూ వాటా వద్దూ?" అని ఒప్పిస్తుంది తల్లి. వ్యాపారంలో వచ్చే లాభాల కన్నా మరేదీ ఆనందాన్నివ్వదు రవికి. పుస్తకాల్లో సిద్ధాంతాలకీ, జరుగుతున్నవాస్తవాలకీ బేరీజు కుదరక ఆలోచనల్లో పడుతుంది వసుంధర.

ఇమడలేని వాతావరణంలో ఉండడం కన్నా రవి నుంచి విడిపోతే? అన్న ఆలోచన వస్తుంది వసుంధరకి. తనకంటూ చదువు, ఆస్తి ఉన్నాయి కాబట్టి జీవనానికి ఇబ్బంది ఉండదు. కానీ అదే సమయంలో అవివాహిత లలిత, డ్రామా ఆర్టిస్టు పద్మావతిల అనుభవాలు ఆమెలో రెండో ఆలోచన కలిగిస్తాయి. భర్త వల్ల లభించే 'సోషల్ సెక్యూరిటీ' గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. భర్త అండ లేని స్త్రీలకి సమాజంలో ఎదురయ్యే ఇబ్బందులు ఆమెని పునరాలోచించుకునేలా చేస్తాయి.

ఎన్నో చేయాలని ఉన్నా ఏమీ చేయలేక పోతున్నానని వసుంధర సంఘర్షణ అనుభవించే సమయంలోనే ఆ ఊరి కూలి జనంలో చిన్నపాటి విప్లవం మొదలవుతుంది. భూస్వాములతో వచ్చిన తగాదా వల్ల కూలీలెవరూ ఊళ్ళో పని చేయరాదని నిర్ణయించుకుని, పొరుగూళ్ళలో పనులు వెతుక్కుంటారు. అంతేకాదు, పొరుగూరి కూలీలెవరినీ ఊళ్ళో అడుగు పెట్టనివ్వరు. ఈ పరిణామం చాలా ఉత్సాహాన్నిస్తుంది వసుంధరకి. బహుశా ఆ స్పూర్తితోనే కావొచ్చు, పల్లెటూరి ఉమ్మడి కుటుంబపు సంప్రదాయానికి విరుద్ధంగా అత్తగారినీ, బావగారినీ ఎదిరించి పేదల పక్షాన మాట్లాడుతుంది వసుంధర.

కథా రచయిత్రిగా మంచి పేరు తెచ్చుకున్న సి. సుజాత తొలి రచన 'సుప్త భుజంగాలు' 1986 లో ప్రచురితమయ్యింది. వర్గ పోరాటాన్ని చిత్రించిన ఈ నవలలో రచయిత్రి పేదల కష్టాలనీ, భూస్వాముల దుర్మార్గాలనూ వివరించారు. పేదలకి సాయం చేయాలని భూస్వాములకి ఉన్నా, ఏకారణాల వల్ల వాళ్ళు ఆ పని చేయలేరో వివరించే ప్రయత్నం చేశారు. ఆసక్తి కరమైన కథనం ఈ నవల ప్రత్యేకత. ప్రస్తుతం ఈ నవల మార్కెట్లో అందుబాటులో లేదు.

ఆదివారం, సెప్టెంబర్ 20, 2009

నాయికలు-సుజాత

ఆమె అతన్ని ప్రేమించింది. అతని కోసం అంతవరకు ఆమెని అన్నీ తానే అయి పెంచిన 'పెంపుడు' తండ్రిని ఎదిరించింది. పుట్టింటితో తన సంబంధాన్ని శాశ్వతంగా తెంచుకోడానికి సిద్ధపడింది. పెళ్ళయ్యాక అతని పట్ల ప్రేమ రెట్టింపయ్యింది ఆమెకి. ఓ కొడుక్కి తల్లయ్యాక, అతనిపట్ల ఆమెకి అనుకోకుండా మొదలైన ఓ అనుమానం పెనుభూతమయ్యింది.. అతన్ని విడిచి వెళ్లడానికి కారణమయ్యింది. ఆమె పేరు సుజాత.

తల్లీతండ్రీ లేని అనాధ పసికూనగా బళ్ళో పని చేసే ప్యూనుకి దొరుకుతుంది సుజాత. ఆ ప్యూను ఆమెని తన సొంత కూతుర్లా పెంచుకుంటూ బడిలో చదివిస్తుండగా, ఒక రోజు ప్రసంగించడానికి బడికి వచ్చిన యాభయ్యేళ్ళ అవివాహితుడు పండిత పరమేశ్వర శాస్త్రి ఆమెని చూసి ముచ్చట పడి, అల్లారు ముద్దుగా ఆమెని పెంచుకుంటాడు. ఇందుకోసం సంఘాన్ని సైతం ఎదిరిస్తాడు ఆ పండితుడు.

పెంపుడు తండ్రిని ఒప్పించి ఇంగ్లిషు చదువు చదివిన సుజాత, ఆధునిక భావాలున్న రచయిత కేశవమూర్తి ని ప్రేమిస్తుంది. సంప్రదాయాన్ని నరనరానా జీర్ణించుకున్న పరమేశ్వర శాస్త్రి వారి కులాంతర వివాహానికి అంగీకరించకపోవడంతో ఇంటినుంచి బయటికి వచ్చేస్తుంది సుజాత. అత్తా, ఆడబిడ్డ తను 'అనాధ' అని హేళన చేసినా ఓరిమితో భరిస్తుంది. భర్త తనని అర్ధం చేసుకున్నందుకు సంతోష పడుతుంది.

కేశవమూర్తి రచనల వెనుక సుజాత కృషి యెంతో ఉంది. అతని శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూడడం మొదలు, మానసికంగా ఉల్లాసంగా ఉంచడం, పదే పదే గుర్తు చేసి గ్రంధ రచన పూర్తి చేయించడం.. అతను డిక్టేట్ చేస్తుంటే తాను రాసిపెట్టడం.. ఇలా అన్నీ తానే అవుతుంది. వివాహం తర్వాత సినిమాలకి రచన చేసే అవకాశం దొరుకుతుంది కేశవమూర్తికి. భార్యతో సహా మద్రాసుకి ప్రయాణమవుతాడు.

సుజాత దగ్గర ఎలాంటి రహస్యమూ లేదు కేశవ మూర్తికి. సంపాదన అంతా తెచ్చి ఆమె చేతికే ఇస్తాడు. సినిమాల్లో వేషాల కోసం కేశవమూర్తి సిఫార్సు కోరిన కన్యకామణి, అతని రచనలని అభిమానించే సుభాషిణి.. ఇలా అతని స్నేహితులంతా ఆమెకీ స్నేహితులే. మిత్రులంతా కేశవమూర్తి-సుజాతల దాంపత్యాన్ని ఎంతగానో పొగుడుతూ ఉంటారు. వారందరినీ మనస్పూర్తిగా ఆదరిస్తుంది సుజాత.

కేశవమూర్తి మిత్రుల పట్ల ఎంత ఆదరంగా ఉంటుందో, అతని శత్రువుల పట్ల అంత కఠినంగానూ ఉంటుంది సుజాత. "ఏమి మనిషి ఈ సుజాత, ఇన్నాళ్ళ నుంచి నేను ఆమెతో కలిసి జీవిస్తున్నా ఇంతవరకు ఆమె హృదయంలోని లోతులు నాకు అంతు పట్టలేదు. ఆమెలో ఎప్పటికప్పుడు క్రొత్త శక్తులు కనిపిస్తూనే ఉంటై. ఈ మహత్యం స్త్రీ సృష్టిలోనే ఉంది కాబోలు.." అనుకుంటాడు కేశవమూర్తి, ఒక సందర్భంలో.

సినిరచయితగా కేశవమూర్తి బిజీగా ఉన్న సమయంలో మగబిడ్డని ప్రసవిస్తుంది సుజాత. పెంపుడు తండ్రి మీద ప్రేమతో కొడుక్కి'పరమేశ్వర్' అని పేరు పెట్టుకుంటుంది. యెంతో సున్నిత మనస్కుడూ, అలౌకికుడూ అయిన కేశవమూర్తికి సుజాత ఒక రక్షణ కవచం. ఆమెకి తెలియకుండా అతను ఏపనీ చేయడని ఆమెకి తెలుసు. కన్యకామణి, సుభాషిణి లతో అతనికి ఉన్న స్నేహం ఎలాంటిదో కూడా ఆమెకి బాగా తెలుసు.

కానీ.. వరుసగా ఆకాశ రామన్న ఉత్తరాలు రావడం మొదలు పెడతాయి. వాటి సారాంశం ఒకటే.. సుజాత కన్నుగప్పి కేశవమూర్తి సుభాషిణి, కన్యకామణి లతో శారీరక సంబంధం కొనసాగిస్తున్నాడని. ఆ ఉత్తరాలని మొదట పట్టించుకోదు సుజాత. నెమ్మదిగా ఆమెలో అనుమానం మొలకెత్తుతుంది. అతి త్వరలోనో అది పెరిగి మహా వృక్షమవుతుంది. పుట్టింటి తలుపులు మూసుకుపోడంతో ఎక్కడికి వెళ్ళాలో తెలీదు ఆమెకి.

కేశవ మూర్తి పట్ల మనసు పూర్తిగా విరిగిపోవడంతో ఇంట్లో ఉండడానికి మనస్కరించదు. ఆమె సంసారాన్ని ఛిద్రం చేయడానికి పూనుకున్నది ఎవరు? సుజాత జీవితం ఏ మలుపు తిరిగింది? ఆమె జన్మ రహస్యం ఏమిటి? ఈ ప్రశ్నలకి సమాధానం కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన తొలి తెలుగు నవల 'పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా.' యాభై మూడేళ్ళ క్రితం గోపీచంద్ రాసిన నవలని 'అలకనంద ప్రచురణలు' ఇటీవలే పునర్ముద్రించింది. (వెల: రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

మంగళవారం, సెప్టెంబర్ 08, 2009

నాయికలు-శాంతి

చదువుకున్న, మధ్యతరగతి గృహిణి శాంతి. ఇద్దరు పిల్లల తల్లి. యెంతో భావుకత్వం ఉన్న స్త్రీ. ఆమె భర్త భాస్కరరావు ఓ ఉద్యోగి. బాధ్యతాయుతమైన గృహస్తు. భార్యా పిల్లలంటే ప్రేమ ఉన్నవాడు. అయితే, భావుకత్వం ఏమాత్రమూ లేనివాడు. ఎంత కచ్చితమైన మనిషంటే..హనీమూన్ కి వెళ్ళినప్పుడు ఓ బిచ్చగత్తె పాడిన పాట యెంతో నచ్చి శాంతి ఆమెకి ఒక రూపాయి ఇస్తే, హోటల్ రూముకి రాగానే అతను తన డైరీ తెరిచి 'ధర్మం ఒక రూపాయి' అని లెక్క రాసుకునేంత.

తన భావుకత్వాన్ని ఒక డైరీ కి పరిమితం చేసుకుని, భర్త గురించి అప్పుడప్పుడూ బాధ పడుతూ అంతలోనే సర్దుకుపోతూ ఉండే శాంతి 'మల్లాది' మార్కు నాయిక. చెల్లెలి పురిటి కోసం రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళిన శాంతికి అనుకోకుండా పరిచయమవుతాడు ప్రియతమ్. బ్యాంకు ఉద్యోగి. తనని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మృదుల, ముగ్గురు పిల్లలు శ్రేష్ఠ, శ్వేత, ఉపేష్. 'అందమైన జీవితం' ప్రియతమ్ ది.

ప్రియతమ్ పరిచయం శాంతిపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది అన్నదే దాదాపు మూడు దశాబ్దాల క్రితం మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన 'అందమైన జీవితం' నవల్లో కథ. ప్రియతమ్ ని ప్రతి విషయంలోనూ భాస్కరరావుతో పోల్చుకోకుండా ఉండలేదు శాంతి. అదే సమయంలో మృదుల పై రవ్వంత అసూయ కూడా కలుగుతుంది ఆమెకి. భాస్కర రావు పట్ల తనకున్న అసంతృప్తి ని ప్రియతమ్ దగ్గర ఏమాత్రం వ్యక్తం చేయదు ఆమె.

చెల్లెలున్న ఆస్పత్రికి వెళ్ళిరావడం కోసం శాంతి, తన బ్యాంకుకి వెళ్లి రావడం కోసం ప్రియతమ్ ప్రతిరోజూ లోకల్ రైల్లో ప్రయాణిస్తూ ఉంటారు. ఆ ప్రయాణం లో వాళ్ళిద్దరి మధ్యా ఎన్నో కబుర్లు. ప్రియతమ్ నోరు తెరిస్తే చెప్పేది మృదుల గురించీ, పిల్లల గురించీ.. ఐతే శాంతి ఇందుకు భిన్నం. ఆమె తన బాల్య జ్ఞాపకాలు నెమరు వేసుకోడంలో ఆనందాన్ని వెతుక్కుంటుంది. తన పిల్లల అల్లరి గురించి అప్పుడప్పుడూ తల్చుకుంటుంది.

మంచునీ, వాననీ, వెన్నెలనీ, సూర్యోదయాన్నీ, సూర్యాస్తమయాన్నీ ఆస్వాదించగలరు వాళ్ళిద్దరూ.. చిగురులు తొడిగే కొమ్మ, చిన్నపాప బోసినవ్వు ఇలా సమస్తమూ వాళ్లకి సంతోషాన్ని ఇచ్చేవే. ప్రియతమ్ ని చూసిన ప్రతిసారీ శాంతికి ఒకటే సందేహం. "ఇలాంటి మగవాడు, ఒక భర్త, ఒక తండ్రి ఉండడం సాధ్యమేనా?" అని. సాధ్యమే అని నిరూపిస్తున్నాడు తన ఎదురుగా ఉన్న ప్రియతమ్, కమల్ హాసన్ అంతటి అందగాడు.

ఇద్దరు పిల్లల తల్లైనా తనలో ఆకర్షణ తగ్గలేదని తెలుసు శాంతికి. అయినా ప్రియతమ్ తననేప్పుడూ 'ఆ' దృష్టి తో చూడకపోవడమూ ఆశ్చర్యమే ఆమెకి. అనేక రకాలుగా అతన్ని పరీక్షిస్తుంది.. అతనిలో ఎలాంటి 'చెడు' ఉద్దేశమూ లేదని గ్రహిస్తుంది. రాను రానూ అతను ఆమెకో మిష్టరీగా మారిపోతాడు. జీవితాన్ని రొటీన్ కి భిన్నంగా ఎలా గడపొచ్చో ఉదాహరణలతో వివరిస్తూ ఉంటాడు ప్రియతమ్. రాజమండ్రి వెళ్ళాకా వాటిని అమలు చేయాలని అనుకుంటూనే, భాస్కర రావు ఎలా స్పందిస్తాడో అని సందేహ పడుతూ ఉంటుంది శాంతి.

శాంతికి హైదరాబాద్ ని చాలా కొత్తగా చూపిస్తాడు ప్రియతమ్. సినిమా హాల్లో ప్రొజెక్టర్ రూం, చోర్ బజార్, ఇంకా ఆమె అభిమానించే రచయిత చక్రపాణి ఇలా.. శ్మశానానికి తీసుకెళ్ళి జీవితపు అంతిమ ఘట్టాన్ని చూపించడం ద్వారా, జీవితం ఎంత చిన్నదో, విలువైనదో చెబుతాడామెకి. కుటుంబ సభ్యుల మధ్య అనురాగం పెరగడానికి తాము ఏమేం చేస్తూ ఉంటామో తరచూ వివరిస్తాడు. ఒకసారి ఆమెని తన ఇంటికి తీసుకెళతాడు కానీ అక్కడ మృదుల, పిల్లలు ఉండరు. అత్యవసరమైన పని మీద బయటకి వెళ్తున్నామని మృదుల రాసిన లెటర్ ఉంటుంది ఇంట్లో.

ప్రియతమ్ గురించి శాంతి 'పూర్తిగా' తెలుసుకోడం, ఇద్దరూ ఉత్తరాలు రాసుకోవాలనీ, స్నేహాన్ని కొనసాగించాలనీ నిర్ణయించుకోడం ఈ నవల ముగింపు. నవలలో కొన్ని కొన్ని సన్నివేశాలు చదువుతుంటే ఏదో ఇంగ్లీష్ నవల ప్రభావం అనిపించక మానదు. మధ్య మధ్య మల్లాది మార్కు జోకులకి, చిట్కాలకీ కొదవ లేదు. రెండు మూడేళ్ళ క్రితం వచ్చిన '10th క్లాస్' అనే తెలుగు సినిమాలో (సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ తొలి చిత్రం) లో ఈ నవలని ఎనభై శాతం వరకూ వాడుకున్నారు. మల్లాదికి తెలుసో, తెలీదో మరి. ఇప్పటికీ మల్లాది నవలల్లో నాకు ఇష్టమైన నవల 'అందమైన జీవితం.'

మంగళవారం, ఆగస్టు 25, 2009

నాయికలు-ఇందిర

'యద్భావం తద్భవతి' అని ఒక వాడుక. అంటే మనం ఏం చూడాలనుకుంటున్నామో అదే చూడగలం. ఇందిర ని గురించి చెప్పడానికి ఈ వాక్యం సరిగ్గా సరిపోతుంది అనిపించింది నాకు. ఆమెని ఎలా అయినా అనుకోవచ్చు.. బతక నేర్చినది అనో, తను అనుకున్నది సాధించుకోడానికి ఎంతకైనా తెగించే జాణ అనో, పరిస్థితులకి ఎదురు నిలిచి పోరాడగల ధీర అనో.. ఆమె ఎలాంటిది అన్నది చూసే మన దృష్టిని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇందిర మామూలు వ్యక్తి కాదు.. 'కాలాతీత' వ్యక్తి.

అర్ధ శతాబ్దానికి పూర్వం డాక్టర్ పి. శ్రీదేవి రాసిన నవల 'కాలాతీత వ్యక్తులు' లో నాయిక ఇందిర. నిజానికి నాయకుడు అనాలేమో. బలమైన పురుష పాత్ర లేని ఈ నవల్లో ప్రతి పాత్రా ప్రత్యక్షం గానో, పరోక్షం గానో ఇందిర చుట్టూ తిరిగేవే. తనకంటూ ఒక ఇల్లూ, నేనున్నాను అని అండగా నిలబడే భర్తా, సంతానం.. ఇవీ ఇరవయ్యేళ్ళు నిండిన ఇందిర కలలు. ('అంతులేని కథ' నాయిక సరిత గుర్తొస్తోంది కదూ?)

కానీ ఇందిర వాస్తవ జీవితం వేరు. ఇంటరుతో ఆగిపోయిన చదువూ, బాధ్యత పట్టని, తన మీద ఆధారపడ్డ తండ్రీ.. ఆ తండ్రిని పోషించడం కోసం చాలీచాలని సంపాదన ఇచ్చే ఉద్యోగమూ.. విశాఖపట్నంలో అద్దింటి జీవితం ఆమెది. హోటలు భోజనం, స్నేహితులతో షికార్లూ.. పర్సులో పైసా లేకపోయినా దర్జా వెలగబెట్ట గలదు.. ఆమె షికార్లకీ, స్నేహాలకీ అడ్డు చెప్పడు తండ్రి ఆనందరావు. ప్రతిగా అతని పేకాట, తాగుడు వ్యసనాలకి డబ్బిచ్చి ప్రోత్సహిస్తూ ఉంటుంది ఇందిర.

తనవాడుగా చేసుకోదగ్గ మగవాడికోసం ఇందిర కళ్ళెప్పుడూ వెతుకుతూనే ఉంటాయి. అదిగో ఆ వెతుకులాటలో ఆమెకి కనిపించినవాడు ప్రకాశం. మెడికల్ కాలేజి స్టూడెంట్.. ఆమె ఉండే ఇంట్లోనే పై వాటాలో ఉంటున్నాడు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి మేనమామ పెంపకంలో పెరిగిన 'పిరికి' ప్రకాశాన్ని తనదారికి తెచ్చుకోడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుంది ఇందిర.. అతనితో వెళ్ళాల్సినంత దూరమూ వెళ్తుంది. ఆ ప్రకాశం తను ఆశ్రయం ఇచ్చిన కళ్యాణి పట్ల ఆకర్షితుడవుతున్నాడని తెలిసి తట్టుకోలేకపోతుంది.

కళ్యాణిని ఇంటి నుంచి వెళ్ళగొట్టి, గాలివాటం మనస్తత్వం ఉన్న ప్రకాశం మళ్ళీ ఆమెని కలుసుకోకుండా చేస్తుంది ఇందిర. ప్రకాశం ఉత్త 'చెవల వాజమ్మ' అని అర్ధం కాగానే అతని స్నేహితుడు కృష్ణమూర్తి తో స్నేహం మొదలుపెడుతుంది. కృష్ణమూర్తి డబ్బున్నవాడు, డబ్బంటే లెక్కలేని వాడు. ఈ కారణానికి అతడు ఆనందరావుకి కూడా నచ్చుతాడు. ఇంతలో మేనమామకి భయపడ్డ ప్రకాశం అతను చూసిన సంబంధం చేసుకోడానికి ఒప్పేసుకుంటాడు..

అయినా అధైర్య పడదు ఇందిర.. తనకి కావాల్సింది తనకి ధైర్యం ఇచ్చేవాడనీ, తన కొంగు చాటున దాక్కునే వాడు కాదనీ చెబుతుంది. ఈసారి కృష్ణమూర్తితో వెళ్ళాల్సినంత దూరం వెళ్తుంది ఇందిర. "మనమందరం శుద్ధ నూనె మిఠాయి సరుకు మనుషులం కృష్ణమూర్తీ! ఏమిటేమిటో అనుకుంటాం. రెక్కలున్నాయనుకుని ఎగరడానికి ప్రయత్నించుతాం. రెక్కలు లేవు మనకు. ఉన్నా, అవి తడిసి పోయాయి. నా రెక్కల్ని బీదరికం తడిపేసింది. నీ రెక్కల్ని మితిమీరిన డబ్బు తడిపేసింది. అంచేత మనిద్దరి పరుగులాటలూ ఒకటే.." అని జీవిత సత్యం బోధపరుస్తుంది అతనికి.

మిన్ను విరిగి మీద పడ్డా నిశ్చలంగా ఉండగల ఇందిర, తనలో భావాలనీ వాటి సంచలనాన్నీ ఏమాత్రం బయట పడనివ్వని ఇందిర, కృష్ణమూర్తి తనని పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించినప్పుడు మాత్రం ఆశ్చర్యపోతుంది. అతనితో వాదిస్తుంది.. ఆ వాదనలో ఓడిపోతుంది. కృష్ణమూర్తికి భార్య అవుతుంది. ('కాలాతీత వ్యక్తులు' విశాలాంధ్ర ప్రచురణ, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

బుధవారం, ఆగస్టు 12, 2009

నాయికలు-వేదసంహిత

కొన్ని కొన్ని పుస్తకాలు మొదటి సారి చదివినప్పుడు చాలా బాగా అనిపిస్తాయి..కొన్ని పాత్రలు మనకి మరీ దగ్గరగా అనిపిస్తాయి.. మనకి తెలియకుండానే ఆ పాత్ర (ల) తో ప్రేమలో పడిపోతాం. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లా అన్నమాట.. అలా నేను ప్రేమలో పడ్డ అనేక పాత్రల్లో ఒకామె వేదసంహిత. ఆంత్రోపాలజీ రీసెర్చ్ స్కాలర్, అపాచీ కల్చర్ మీద పీహెచ్.డీ. చేయడమే కాదు, ఆ అపాచీల నాయకుడి మనసునూ గెలుచుకున్న అమ్మాయి. అంతే కాదు, తాగి వచ్చి భార్యపై కత్తిపీటతో దాడి చేసే ఓ భర్తకి భార్య కూడా!

సుమారు రెండు దశాబ్దాల క్రితం అనుకుంటా.. 'ఆంధ్రజ్యోతి' వారపత్రిక ఓ ప్రయోగం చేసింది. 'ప్రేమ' అనే సబ్జెక్ట్ ఎంపిక చేయడంతో పాటు, ముఖ్య పాత్రల పేర్లనూ నిర్ణయించి, ముగ్గురి చేత సీరియల్స్ రాయించి ప్రచురించింది. మూడు సీరియళ్ళ టైటిళ్ళూ 'ప్రేమ,' ప్రధాన పాత్రల పేర్లు అభిషేక్, సంహిత, చలం. యద్దనపూడి సులోచనా రాణి, వెన్నలకంటి వసంత సేన, యండమూరి వీరేంద్రనాథ్ లు ఆ సీరియళ్ళు రాశారు. ముగ్గురు సంహితల్లోనూ నాకు బాగా నచ్చింది యండమూరి వేదసంహిత.

బ్రహ్మదేవుడు తను సృష్టించిన అమ్మాయి గురించి తనే తన్మయంగా మాట్లాడి సరస్వతీదేవి కి కోపం తెప్పించడం లాంటి అపసవ్యపు ప్రారంభం చికాకు తెప్పించినప్పటికీ, గోదారి ఒడ్డున పల్లెటూరు ఆదిత్యపురానికీ, గాజాలో రెడ్ ఇండియన్ల స్వతంత్ర పోరాటానికీ వేదసంహిత అనే అందమైన అమ్మాయిని వంతెనగా చేసి ఆశ్చర్య పరుస్తాడు రచయిత. ఒంటరిగా ఆదిత్యపురం వచ్చిన వేదసంహిత పల్లెటూళ్ళ మీద రిసెర్చ్ మిష మీద సోమయాజిగారింట్లో అద్దెకి దిగుతుంది.

అప్పటికి సివిల్ సర్విస్ పరిక్షలు రాసి వస్తుంది వేదసంహిత. ఆధునికంగా ఆలోచిస్తూనే సంప్రదాయాన్ని విడిచిపెట్టకపోవడం ఆమె ప్రత్యేకత. పదిమంది చుడీదార్ అమాయిల్లో ఓ లంగా వోణీ అఅమ్మాయి తను. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతారు ఆ ఊరి కుర్రాళ్ళు చలం, అరుణ్. వాళ్ళతో తాను 'వివాహితను' అని చెబుతుంది, మెడలో ఉన్న తాళిబొట్టు తీసి చూపిస్తుంది.

ఆమె వచ్చిన కొన్నాళ్ళకే ఆమెని వెతుక్కుంటూ ఆ ఊరొస్తాడు అభిషేక్. 'అపాచీలు' అనే ఆటవిక తెగకి నాయకుడతడు. ఈ ప్రపంచంలో 'ప్రేమ' తో సాధించలేనిది ఏదీ లేదని నమ్మిన వాడు. "స్త్రీకి కష్టాలు లేకపోవడమే సంతోషమా? భర్త కష్టాల నుంచి బయటపడితే చాలా?" ఇవి వేదసంహితని వేధించే ప్రశ్నలు. సమాజాన్ని సంతోషాన్ని వెతుక్కోవాలన్న అభిషేక్ సూచన ఆమెని ఆలోచనలో పడేస్తుంది. భర్తనుంచి తాను ఆశించే ప్రేమని అభిషేక్ నుంచి పొందుతుంది వేదసంహిత.

ఇప్పుడు ఈనవల మళ్ళీ చదువుతుంటే, అప్పటి ఉత్కంఠత గుర్తొచ్చి నవ్వొచ్చింది. కథలో నాటకీయత తో పాటు, కథనంలో లోపాలూ చాలానే కనిపించాయి. ముఖ్యంగా పల్లెటూళ్ళ గురించి, సంస్కృతీ సంప్రదాయాల గురించీ రచయిత ఇచ్చే సుదీర్ఘ ఉపన్యాసాలు విసుగు కలిగించాయి. అయితే అప్పటికీ, ఇప్పటికీ మారనది ఒకటి ఉంది.. వేదసంహిత మీద అభిమానం. బహుశా తొలిప్రేమ బలమేమో?!! ('ప్రేమ,' నవసాహితి ప్రచురణ, వెల రూ. 50.)