గురువారం, డిసెంబర్ 23, 2010

నాయికలు-హేమసుందరి

మనిషికెప్పుడూ తనకి దొరకని దానిని ఎలా అయినా సాధించుకోవాలన్న తపన ఉంటుంది. అలా సాధించుకునే ప్రయత్నంలో ఎదురయ్యే కష్టనష్టాలని భరించడం పెద్ద పనిగా అనిపించదు. రాజసౌధంలాంటి విశాలమైన భవనంలో విలాస జీవితం గడిపే హేమసుందరికి అందుబాటులో లేనివంటూ లేవు, పిడికెడు ప్రేమాభిమానాలు తప్ప. వాటిని తనకి అందించాడనే ఒకేఒక్క కారణంతో ఆమె ఓ సామాన్యుడైన రంగనాయకుడి తో ప్రేమలో పడిపోయింది. పీకలోతు కష్టాలని ఆనందంగా భరించింది.

నవరసాలనూ తగు పాళ్ళలో రంగరించి నలభై నాలుగేళ్ల క్రితం పిలకా గణపతి శాస్త్రి రాసిన 'విశాల నేత్రాలు' నవలలో నాయిక హేమసుందరి. కాంచీ రాజ్య ప్రధాన నగరం నిచుళాపురంలో పేరుగాంచిన వృద్ధ వేశ్య శృంగారమంజరి చిన్న కూతురు. నిజానికి ,హేమ శృంగారమంజరికి సొంత కూతురు కాదు. తను యవ్వనంలో ఉండగా ఇద్దరు బాలికలని చేరదీసి పెద్ద చేసింది శృంగారమంజరి. వారిలో ఒకరు మాణిక్యవల్లి మరొకరు హేమసుందరి.

శృంగారమంజరి పెంపకంలో లోటన్నది ఎరగకుండా పెరిగింది హేమసుందరి. సకల కళలనీ అభ్యసించింది. దొరకనిదల్లా ప్రేమ. తన సొంత వాళ్ళెవరో తనకి తెలీదు. చుట్టూ ఉన్న వారెవరూ తనవారు కాదు. తల్లి తనని వృత్తిలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలోనే రంగనాయకుడి కంట పడింది హేమసుందరి. సాముగరిడీలలో దిట్టైన రంగనాయకుడికి ఓ అందమైన ఆడపిల్లని దగ్గరనుంచి చూడడం, ఆపై చూపు తిప్పుకోలేక పోవడం అదే తొలిసారి.

అది మొదలు రంగనాయకుడి జీవితం మారిపోతుంది. హేమసుందరి దర్శన భాగ్యం కోసం తపించిపోతాడతడు. హేమసుందరి తనని ప్రేమించడం తన అదృష్టంగా భావిస్తాడు. రాత్రిపూట శరీరానికి మసి పూసుకుని శృంగార మంజరి భవంతిలోకి ప్రవేశించడానికి సైతం వెనుకాడడు అతడు. మరోపక్క, కేవలం తనకోసం రంగనాయకుడు అంతటి సాహసాలు చేస్తుండడంతో అతనిపై పుట్టిన ప్రేమ రెట్టింపవుతుంది హేమసుందరికి.

తన ఇంట్లో ఎవరినీ మనస్పూర్తిగా నమ్మని హేమసుందరి, మొదటిసారిగా అక్క మాణిక్యవల్లిని నమ్మి తన ప్రేమకథ చెబుతుంది. అప్పటివరకూ తనని మించిన అందగత్తె అయిన హేమ తన వ్యాపారానికి అడ్డం వస్తుందని మథన పడుతున్న మాణిక్యవల్లికి హేమని అడ్డు తొలగించుకోడానికి ఇదో చక్కని అవకాశంగా కనిపిస్తుంది. చెల్లెలు రంగానాయకుడితో కలిసి శ్రీరంగం పారిపోడానికి పరోక్షంగా సహకరిస్తుంది మాణిక్యవల్లి.

తనకంటూ ఒక ఇల్లు, భర్త, సంఘంలో గౌరవం.. ఈ కొత్త జీవితం ఎంతగానో సంతృప్తిని ఇస్తుంది హేమసుందరికి. వివాహం చేసుకోకపోయినా శ్రీరంగంలో భార్యాభర్తలుగా చెలామణి అవుతారు హేమ, రంగనాయకుడు. అయితే ఆ సంతృప్తి, సంతోషం ఎంతోకాలం ఉండవు. ఒక్కసారిగా దొరికిన స్వేచ్ఛ రంగనాయకుడిని వ్యసనపరుడిని చేస్తుంది. అత్యంత సౌందర్యవతి అయిన హేమ పక్కనే ఉన్నా పరస్త్రీ వ్యామోహంలో పడతాడు. ఇదేమని ప్రశ్నించిన హేమకి జవాబు దొరకదు.

రంగనాయకుడి వ్యసనాలని భరిస్తున్న హేమకి, అతడికి వృద్ధుడైన రామానుజ యతితో ఏర్పడ్డ అనుబంధం మాత్రం కలవరాన్ని కలిగిస్తుంది. రంగనాయకుడు సన్యసిస్తాడేమో అనే సందేహం ఆమెని యతిని కలుసుకునేలా చేస్తుంది. తనకి పిడికెడు ప్రేమని అందించిన రంగనాయకుడి పై సముద్రమంత ప్రేమని కురిపించిన హేమసుందరి జీవితం ఏ మలుపు తిరిగింది? ఆమెకి తను కోరుకున్నది దొరికిందా? అన్నది నవల ముగింపు. నవల పూర్తయ్యాక కూడా ఏళ్ళ తరబడి వెంటాడే పాత్ర హేమసుందరి.

4 వ్యాఖ్యలు:

మేధ చెప్పారు...

మొన్న పుస్తకప్రదర్శనలో ఈ నవల గురించి అడిగితే లేదన్నారు.. అది చదివిన తరువాత మీ టపా చదువుతా :)

'Padmarpita' చెప్పారు...

మీరు పరిచయం చేసే నాయికలు ఉన్న నవలలన్నీ ఎప్పుడు చదువుతానో ఏమో!!!
Iam fine....thank Q!
Nice to see your comment in my blog!

మురళి చెప్పారు...

@మేధ: 'విశాలాంధ్ర' వాళ్ళ దగ్గర ఉందండీ.. మీరు వాళ్ళ స్టాల్ గురించి అసంపూర్తి టపాలు రాస్తున్న విషయం తెలిసిపోయి లేదనేసి ఉంటారు :-) ..ధన్యవాదాలు.
@పద్మార్పిత: మొదలుపెడితే ఎంతసేపు చెప్పండి? ..ధన్యవాదాలు.

ప్రణీత స్వాతి చెప్పారు...

పుస్తకం సంగతేమో కానీ మీ టపా చాలా బాగుంది మురళీ గారూ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి