బుధవారం, మార్చి 08, 2017

కొందరు నాయికలు

తెలుగు సాహిత్యంలో ఇప్పుడు స్త్రీవాదం అంటే అయితే పేరాలకొద్దీ రుతుక్రమ వర్ణన, శానిటరీ నాప్కిన్లు వినియోగించే విధానం... కాకుంటే భర్త కన్నుకప్పి మేనల్లుడితోనో, మేనేజరుతోనో సంబంధం పెట్టుకోవడం.. తప్పితే పురాణ పాత్రల పేర్లని మాత్రమే తీసుకుని నచ్చినట్టుగా ఉపన్యాసాలు ఇప్పించడం.. కొత్తగా చదవడం మొదలు పెట్టినవాళ్ళకి ''ఇంతేనా ఫెమినిజం అంటే?" అని భావన కలిగించేలా ఉంటున్నాయి మెజారిటీ రచనలు. స్త్రీల లైంగికత ఇతివృత్తంగా రచనలు రాకూడదని కాదు, కానీ బూతు రచయితలని మించి రచయిత్రులే స్త్రీ అంగాంగ వర్ణన చేయడం, అదేదో చాలా గొప్ప సాహసోపేతమైన రచనగా భావించి ప్రచారం చేసుకుంటూ ఉండడమే బాధ కలిగిస్తున్న విషయం.

తెలుగు సాహిత్యంలో స్త్రీ లైంగికతని గురించి చర్చ ఇవాల్టిది కాదు. వందేళ్ళకి పూర్వమే మొదలయ్యింది.. ఇంకా కొనసాగుతూనే ఉంది. భర్తతో సుఖం లేక, అమీరుతో లేచిపోయిన 'మైదానం' నాయిక రాజేశ్వరి, తెలుగు సాహిత్యంలో మహిళల లైంగికతను గురించి విస్తృతంగా చర్చకు పెట్టిన మొదటి నాయిక. చలం సృష్టించిన రాజేశ్వరి గానుగెద్దు సంసారంలో సుఖం లేదని గ్రహించింది. తొలిచూపులోనే అమీరుపై మోహం కలగడం, అతడూ ఆమెని మోహించడంతో వాళ్లిద్దరూ పచ్చని పచ్చికలు, జలపాతాలూ ఉన్న మైదానంలోకి స్వేచ్ఛగా ప్రయాణం కట్టారు. అక్కడ ఆకలి దప్పుల ప్రసక్తి లేకుండా, శృంగారమే జీవితంగా కాలం గడిపారు.

కొన్నాళ్ళు గడిచేసరికి అమీరుకి మరో స్త్రీపై మనసయింది. అతడి కోసం ఆ స్త్రీని బతిమాలి ఒప్పించింది రాజేశ్వరి.. ఇది ఆమె ప్రేమ ప్రకటన. అంతే కాదు, రాజేశ్వరి సైతం అమీర్ బంధువుల కుర్రాడు మీరా పై మనసు పడింది. తదనంతర పరిణామాలు అమీర్ హత్యకి గురవ్వడానికీ, ఆ నేరం తనమీద వేసుకుని ఆమె జైలుకి వెళ్ళడానికీ దారితీశాయి. లేచిపోయిన రాజేశ్వరి ఏం సాధించింది? అని ప్రశ్నించుకుంటే, ఆమె కోరుకున్న శృంగార జీవితాన్ని తృప్తిగా అనుభవించింది అన్న సమాధానం దొరుకుతుంది. 'అంతకు మించి ఇంకేం చేయగలదు' అన్న ప్రశ్నకి జవాబిస్తుంది రత్నావళి, విశ్వనాథ సత్యనారాయణ 'చెలియలికట్ట' నవలా నాయిక. రాజేశ్వరికి అమీరుపైన కలిగిన మోహం లాంటిదే, రత్నావళి కి తన మరిది రంగారావు మీద కలిగింది. దానికామె ప్రేమ అని పేరు పెట్టుకుంది.

పదిహేనేళ్ల అమాయకపు గృహిణిగా గడప దాటిన రత్నావళి, కేవలం శృంగారం మాత్రమే జీవితం అనుకోలేదు. శృంగారంతో పాటుగా ఇంకా చాలా విషయాలున్నాయని గ్రహించింది. ముఖ్యంగా విద్య ఆవశ్యకత తెలిసొచ్చిందామెకి. చదువుకుని, ఉద్యోగంలో చేరి స్త్రీ సాధికారికతకి ఉదాహరణగా నిలిచింది. ఇందుకు రంగారావు సహాయమూ చాలానే ఉంది. అంతే కాదు, గడపదాటిన రత్నావళి, రంగారావు మినహా మరో పురుషుడిని దగ్గరకి చేరనివ్వలేదు. అలా చేరనిచ్చి ఉంటే ఆమె చదువుని, ఉద్యోగాన్ని సాధించడం జరిగి ఉండేదా అన్న ప్రశ్న వస్తుంది. రాజేశ్వరి కథ జైల్లో ముగిస్తే, చెలియలికట్ట దాటిన రత్నావళి కథ సముద్రగర్భంలో ముగుస్తుంది. బహుశా, చలం సంప్రదాయ వాదులని సంతృప్తి పరచడానికీ, స్వయంగా సంప్రదాయ వాది అయిన విశ్వనాథ గడప దాటే స్త్రీని గురించి తన అభిప్రాయం వెల్లడించడానికి ఈ ముగింపులు ఇచ్చి ఉండొచ్చు.

ఒకటి రెండు దశాబ్దాలు గడిచేసరికి, గడప దాటనవసరం లేకుండానే లైంగిక అవసరాలు లేదా వాంఛలని తీర్చుకునే మార్గాలు తొక్కిన నాయికలు తారస పడతారు. కుటుంబం అనే భద్ర చట్రంలో ఉంటూనే, సంతానం నిమిత్తం తన బావ దయానిధితో కూడుతుంది అమృతం. బుచ్చిబాబు 'చివరకు మిగిలేది' నవలలో ప్రత్యేకంగా కనిపించే ఈ స్త్రీపాత్ర, దయానిధితో సంబంధాన్ని కేవలం ఒక్క రాత్రికే పరిమితం చేసుకుంది. ఆమె భర్తకి మరో స్త్రీతో సంబంధం ఉందని రూఢిగా తెలుసు కాబట్టి, వైవాహిక జీవితాన్ని నిలబెట్టుకోడానికి సంతానం అవసరం కాబట్టీ అమృతం ఆ మార్గం తొక్కినట్టు అనిపిస్తుంది. నిజానికి, ఆమె తల్చుకుంటే ఆ సంబంధాన్ని కొనసాగించేదే.. కానీ, కుటుంబం అనే చట్రం నుంచి బయటికి రాడానికి ఇష్టపడలేదు అమృతం.

తొలితరం ఉద్యోగినులకు ప్రతినిధిగా చెప్పగలిగే పాత్ర ఇందిర. బాధ్యతలేని సోమరి తండ్రిని ఉద్యోగం చేసి పోషిస్తూనే, తనకంటూ ఓ తోడునీ, భద్ర జీవితాన్నీ వెతుక్కోవలసిన అవసరం కలుగుతుంది ఇందిరకి. డాక్టర్ పి. శ్రీదేవి నవల 'కాలాతీత వ్యక్తులు' లో ప్రధాన పాత్ర అయిన ఇందిరకి లోకం మీద కక్ష. సంఘం తాలూకు విలువల మీద పెద్దగా గౌరవం లేదు. అలా అని సంఘాన్ని ఎదిరించే ఆలోచనా లేదు. తనకంటూ ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలనే తాపత్రయంలో, తన ఇంటి పై వాటాలో అద్దెకి ఉండే మెడికో ప్రకాశంతో సంబంధం పెట్టుకుంటుంది ఇందిర. ఆమె వరకూ, ఈ సంబంధం అతన్ని పూర్తిగా లొంగదీసుకోవడం కోసమే తప్ప అతనిమీద ప్రేమతోనో, మోహంతోనో కాదు. ప్రకాశం చేజారిపోయినప్పుడు, బాధపడుతూ కూర్చోకుండా మరొక వ్యక్తిని వెతుక్కునే ప్రయత్నం మొదలుపెడుతుంది ఇందిర.

మోహంతోనో, ప్రేమతోనో కాక కుటుంబ అవసరాలు గడిపే నిమిత్తం పరాయి మగవాళ్ళతో శృంగార సంబంధాలు నెరిపిన స్త్రీ పాత్రలూ మనకి కనిపిస్తాయి. చాసో కథ 'లేడీ కరుణాకరం' నాయిక శారద ఇందుకు ఓ ఉదాహరణ. అత్యాశాపరుడైన తండ్రి ఆమెని వ్యభిచారంలోకి దింపితే, అటు తర్వాత ఆమెని పెళ్లిచేసుకున్న కరుణాకరం తన ఎదుగుదల కోసం ఆమె సంబంధాలని ఆమోదిస్తాడు. నిజానికి, విలువల కన్నా డబ్బుదే పైచేయి అన్న విషయాన్ని ఆచరణలో గ్రహించిన శారద అతన్ని ఒప్పిస్తుంది. అనతికాలంలోనే ఆర్ధికంగా పైపైకెదిగిన ఆ జంట సమాజం దృష్టిలో ఆదర్శ దంపతులు. శారద పరిస్థితుల కన్నా కొంచం భిన్నమైనవి 'శారద' (ఎస్. నటరాజన్) రాసిన 'రక్తస్పర్శ' కథలో నాయిక అనసూయ పరిస్థితులు. కొంత జీవితం చూశాక వితంతువుగా మారడం, తమ్ముడి చదువు కొనసాగించేందుకు మగ దక్షత అవసరం కావడంతో తనకి పనికొచ్చే వాళ్ళని ఎంచుకుని వాళ్ళతో గుట్టుగా సంబంధాలు కొనసాగిస్తుంది.

వీళ్ళందరికీ భిన్నంగా, అననుకూల దాంపత్యంలో కూడా భర్త తోడిదే లోకంగా బతికిన రామసీత కథ 'ఒఖ్ఖ దణ్ణం.' జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి (జరుక్ శాస్త్రి) రాసిన ఈ కథ చదువుతున్నంత సేపూ, "రామసీత ఇంకా ఎందుకతన్ని భరించడం.. తనదారి తాను చూసుకోవచ్చు కదా" అనిపించేస్తూ ఉంటుంది. సహనానికి మారుపేరుగా ఉన్న రామసీత కూడా భర్తకి దూరంగా జరిగేందుకు సిద్ధపడడం ఈ కథకి ముగింపు. ముందుగా చెప్పినట్టుగా, ఈ నవలలు, కథలు రాసిన రచయిత (త్రు) లు స్త్రీ లైంగికతని భిన్న కోణాల్లో చర్చకి పెట్టారు తప్ప పాఠకుల్లో ఉద్రేకం పెంచే విధంగా అంగాంగ వర్ణనల్ని ఇరికించే ప్రయత్నం చేయలేదు. మరోసంబంధంలోకి వెళ్ళడానికి పూర్వం, వెళ్లిన తర్వాత స్త్రీకి ఎదుర్కొన్న పరిస్థితుల్ని తమదైన దృష్టికోణంగా వాస్తవికంగా చిత్రించారు తప్ప, ఆ సంబంధాలని మాత్రమే వర్ణించి ఊరుకోలేదు. నేటితరం ఫెమినిస్టు రచయితలు ఈ విషయాన్ని గుర్తిస్తే బావుంటుందేమో..

3 వ్యాఖ్యలు:

మైత్రేయి చెప్పారు...

eppatilaane goppaga undi visleshana. thank you.

Lalitha TS చెప్పారు...

వారి పరిధిలో ధీరలైన నాయికల పరిచయం చేశారు - బావుంది.

మురళి చెప్పారు...

@మైత్రేయి: ధన్యవాదాలండీ
@లలిత టీఎస్: ధన్యవాదాలండీ

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి