మంగళవారం, నవంబర్ 23, 2010

చిల్లర దేవుళ్ళు

పోరాటాల చరిత్రలో తెలంగాణా సాయుధ పోరాటానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. యావత్ ప్రపంచపు దృష్టినీ ఆకర్షించిన పోరాటాల్లో ఇదొకటి. మిగిలిన దేశం యావత్తూ పరాయిపాలకులని తరిమికొట్టడం కోసం పోరుని ఉద్ధృతం చేసిన సమయంలో, నిజాం పాలనని అంతమొందించడం కోసం ఆయుధం పట్టారు తెలంగాణా ప్రజ. అమాయకులైన ప్రజలని ఇంత పెద్ద పోరాటం చేసేలా ప్రేరేపించిన పరిస్థితులు ఏమిటి? నిజాం పాలనలో ప్రజల జీవితం ఎలా ఉండేది? లాంటి ఎన్నో ప్రశ్నలకి జవాబిచ్చే పుస్తకం నాలుగున్నర దశాబ్దాల క్రితం దాశరధి రంగాచార్య రాసిన 'చిల్లర దేవుళ్ళు.'

తెలుగు పాఠకులకి దాశరధి రంగాచార్యని పరిచయం చేయాల్సిన పనిలేదు. మూడుతరాల రచయితలు, పాఠకులకి వారధి ఈ బహుభాషా పండితుడు. నిజాం అకృత్యాలకి ప్రత్యక్ష సాక్షి. తెలంగాణా పోరాటం పూర్వాపరాలని అక్షరబద్ధం చేయాలనే ఆకాంక్షతో నవలా రచన ప్రారంభించిన రంగాచార్య ఇందుకోసం 1964 లో 'చిల్లర దేవుళ్ళు' తో శ్రీకారం చుట్టారు. కథాకాలం అంతకు రెండు దశాబ్దాలకి పూర్వం. కథాస్థలం తెలంగాణలోని ఓ కుగ్రామం. సంగీతోపాధ్యాయుడు సారంగపాణి బ్రతుకుతెరువు వెతుక్కుంటూ విజయవాడ నుంచి ఆ ఊరికి చేరుకోడం కథా ప్రారంభం.

ఊరిమద్యలో ఠీవిగా నిలబడి ఉంటుంది దేశముఖ్ రామారెడ్డి 'దొర' గడీ. ఊరిమొత్తానికి అదొక్కటే భవంతి. కరణం వెంకట్రావు తో పాటు మరి కొద్దిమందివి మాత్రమే చెప్పుకోదగ్గ ఇళ్ళు. మిగిలినవన్నీ గుడిసెలే. దొర, కరణం ఆ ఊరిని పాలిస్తూ ఉంటారు. నిజాం ప్రభుత్వం దఖలు పరిచిన అపరిమితమైన అధికారం పుణ్యమా అని వారిద్దరూ చిల్లర దేవుళ్ళుగా వెలిగిపోతూ ఉంటారు ఆ పల్లెలో. సంగీతం పట్ల కొంత ఆసక్తి ఉన్న దొర, పాణి కి తన గడీలో ఆశ్రయమిస్తాడు. రోజూ పాణి పాటని వినడం అలవాటు చేసుకోడంతో పాటు, ఊళ్ళో రెండు మూడు పాఠాలు కూడా ఏర్పాటు చేస్తాడు. పాణి శిష్యురాళ్ళలో కరణం కూతురు తాయారు కూడా ఉంది.

ఊరిమీద దొర పెత్తనం ఎలాంటిదో నెమ్మది నెమ్మదిగా అర్ధమవుతుంది పాణికి. కథలో అతడిది కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే. ఊళ్ళో దొర మాట శిలాశాసనం. అతని కంట పడ్డ ఏ స్త్రీ తప్పించుకోలేదు. అంతే కాదు చిన్న తప్పుకు సైతం దొర విధించే శిక్ష అత్యంత కఠినంగా ఉంటుంది. తన అధికారాన్ని నిలబెట్టుకోడానికి దొర ఎంతకైనా వెనుకాడడని తెలుస్తుంది పాణికి. దొరకీ-కరణానికీ మధ్య వైరం, జనం విషయానికి వచ్చేసరికి ఇద్దరూ ఏకం కావడం చూస్తాడతడు.

గడీ లోపల ఒక్కక్కరిదీ ఒక్కో కథ. 'ఆడబాప' గా పనిచేస్తున్న వనజది వేశ్య కన్నా నికృష్ట జీవితం. ఆమె పాణి మీద మనసు పడుతుంది. మరోపక్క పరదాల చాటున పెరిగే దొర కూతురు మంజరి సైతం 'సంగీతప్పంతులు' మీద మనసు పారేసుకుంటుంది. ఇంకోపక్క కరణం కూతురు తాయారు, తనని పెళ్లి చేసుకుంటే తండ్రి కరణీకం పాణికి ఇప్పిస్తానని ప్రతిపాదించడం మాత్రమే కాదు, తన కోరికని అంగీకరించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తుంది కూడా.

అలా అని ఇదేమీ ముక్కోణపు ప్రేమకథ కాదు. సాయుధ పోరాటానికి పూర్వం తెలంగాణా ప్రజల బతుకు పోరాటాన్ని చిత్రించిన నవల. భూతగాదాలో లంబాడీలను కరణం మోసగిస్తే, న్యాయం చేయాల్సిన పోలీసులు కరణానికి మద్దతుగా లంబాడీలపై కాల్పులు జరుపుతారు. నిజాం మనుషులు రోజు కూలీలని బలవంతంగా ముస్లిం మతంలోకి మారిస్తే, ఆ తర్వాత వాళ్ళు ఇటు హిందువులుగానూ, అటు ముసల్మానులుగానూ చెలామణి కాలేక, రెండు మతాల చేతా వెలివేయబడి పడే బాధలు వర్ణనాతీతం. దొర బండి రోడ్డున వెళ్తుంటే, గడీ గౌరవానికి చిహ్నంగా బండికి ముందు ఒక మనిషి పరుగు పెట్టడం లాంటి సంప్రదాయాలని చిత్రించడం మాత్రమే కాదు, అలా పరుగు పెట్టే మనిషి పడే కష్టాన్నీ కళ్ళకు కట్టారు రచయిత.

నిజాం పాలనలో ఉనికి కోల్పోతున్న తెలుగు భాషా సంస్కృతులని కాపాడడానికి మాడపాటి హనుమంతరావు వంటి తెలుగు వాళ్ళు చేస్తున్న కృషిని తెలుసుకుంటాడు పాణి. తను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మాడపాటి తో మాట్లాడి తన సందేహాలని నివృత్తి చేసుకుంటాడు కూడా. హైదరాబాద్ నుంచి అతను కొని తెచ్చిన కెమెరా, వాటితో అతను తీసిన ఫోటోలు దొరకి నచ్చడంతో ఆ కుటుంబానికి మరింత దగ్గరవుతాడు పాణి. ఊహించని విధంగా పాణి మీద దొర చేయి చేసుకోవడం, ఆ తర్వాత పాణి ఊరు విడిచి వెళ్ళడంతో కథ నాటకీయమైన ముగింపు దిశగా పయనిస్తుంది.

పాణి, మంజరి అనే రెండు పాత్రలు మినహాయిస్తే, మిగిలిన పాత్రలన్నీ నిజ జీవితం నుంచి పుట్టినవే అనడం నిస్సందేహం. కథానాయకుడిది పాసివ్ పాత్ర కావడం వల్ల కావొచ్చు, కథకి సినిమాటిక్ ముగింపు ఇచ్చారు రచయిత. కథని పక్కన పెట్టి, రచయిత పరిశీలనాశక్తి ని దృష్టిలో పెట్టుకుని చదివినప్పుడు ఈనవల మనకెన్నో విషయాలు చెబుతుంది. అనేక వాస్తవాలని కళ్ళముందు ఉంచుతుంది. అందుకే కావొచ్చు రాష్ట్రంలోని మూడు విశ్వవిద్యాలయాలలో (ఉస్మానియా, కాకతీయ, శ్రీవెంకటేశ్వర) ఈ నవలపై అధ్యయనం జరిగింది. రాష్ట్ర సాహిత్య అకాడెమీ 1971 సంవత్సరానికి బహుమతి ప్రకటించింది. (విశాలాంధ్ర ప్రచురణ; పేజీలు 131 వెల రూ.50).

17 వ్యాఖ్యలు:

karthik చెప్పారు...

thanks for the good intro.. will definitely read it..

sunita చెప్పారు...

ee book naenu chadivaanoechch!Hammayya mee paata sTyle lokocchindi mee nemalikannu.

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ చెప్పారు...

కథ విషయం పక్కనబెడితే దాశరథి రంగాచార్య గారి శైలి నాకు నచ్చలేదు.ఎటువంటి వర్ణనలు లేకుండా చాలా ప్లెయిన్‌గా సాగిపోతుంది నవల.అక్కడే చాలా నిరుత్సాహానికి గురయ్యాను.

జయ చెప్పారు...

చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. తప్పకుండా చదువుతాను. అసలే మాడపాటి హనుమంతరావు గారు మా తాతగారు. అయన్ని నేను చూడలేకపోయినా చాలా విషయాలే తెలుసుకున్నాను.

విజయవర్ధన్ చెప్పారు...

మురళి గారు, మీకు తెలిసి తెలంగాణా సాయుధ పోరాటం నేపథ్యంగా వున్న నవలలు ఇంకా వుంటే తెలుపగలరు.

రమణ చెప్పారు...

సినిమా తరహా ముగింపునివ్వటం ఇంత మంచి నవల స్థాయిని తగ్గించేటట్లుగా అనిపిస్తుంది. అది మినహా అప్పటి తెలంగాణా పరిస్థితులను, వారి వ్యవహారిక భాషను నవల్లో ప్రభావవంతంగా చిత్రించారు.

spoorthi చెప్పారు...

nenu ii navalani chadavalani chaannalluga anukuntunnanandi. ii sari thappakaunda koni chadavali. manchi pusthakam gurinchi tapa rasinanduku miku thanks

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

ఒక ఆరేళ్ళ క్రితం ఈ పుస్తకం కొన్నాను కానీ పూర్తిచేయలేకపోయానండి, తన శైలి అంతగా నచ్చలేదు ఆ వ్యవహారిక భాష ఫాలో అవడం కష్టమయింది అలానే కొన్ని వాడుకలతో కూడా సింక్ అవలేకపోయాను అతి కష్టం మీద కొంత చదివి పక్కన పెట్టాను. నాకు సాథారణంగా విజువలైజ్ చేసుకుంటూ చదవడం అలవాటు. ఈ పుస్తకం నాకు అస్సలు తెలీని ప్రపంచాన్ని స్పష్టంగా చూపలేకపోవడంతో పూర్తిచేయలేకపోయాను. చందమామలు, యండమూరి నవల్లు కాక నే చదివిన మూడో పుస్తకం అనుకుంటా ఇది. మీ సమీక్ష చదువుతుంటే పాత్రలు గుర్తొస్తున్నాయి, మళ్ళీ ఒక సారి బయటకి తీసి ముగించగలనేమో చూడాలి.

మురళి చెప్పారు...

@కార్తిక్: ధన్యవాదాలండీ..

@సునీత: అవునండీ.. కొంచం తీరిక చిక్కింది :-) ..ధన్యవాదాలు.

@బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్: ఇది ఆయన తొలి రచన అండీ.. పైగా తెలంగాణా జీవిత చిత్రణ, పోరాట నేపధ్యం వివరించడమే నవల లక్ష్యమని చెప్పారు కదా.. మీరు 'మోదుగపూలు' చదివారా? ..ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@జయ: అంత గొప్పవారి మనవరాలితో ఈవిధంగా పరిచయం కావడం చాలా సంతోషంగా ఉందండీ.. నవలలో ఆ భాగం రంగాచార్య గారు మాడపాటి వారితో సంభాషించి రాశారట.. తప్పక చదవండి.. ధన్యవాదాలు.

@విజయవర్ధన్: వట్టికోట ఆళ్వారుస్వామి రాసిన 'ప్రజల మనిషి' 'గంగు' నవలల కోసం ప్రయత్నించండి. 'గంగు' ఇప్పుడు ప్రింట్ లో లేదు కానీ పెద్ద లైబ్రరీలలో దొరకొచ్చు. రంగాచార్య 'మోదుగుపూలు' 'జనపదం' నవలల్లో పోరాటం తర్వాతి తెలంగాణా చిత్రాన్ని చూడొచ్చు. ధన్యవాదాలు.

@రమణ: మొదటిసారి చదివినప్పుడు ముగింపు మీది కుతూహలంతో చివరికంటా చదివి, చివర్లో నిరాశ పడిపోయానండీ.. తర్వాత చదివినప్పుడల్లా నాటి సామాజిక, రాజకీయ పరిస్థితులని గమనిస్తున్నాను.. పాణి, మంజరి పాత్రలు ఊహాత్మకాలు కావడం వల్ల (మిగిలిన పాత్రలన్నీ ఎక్కడో అక్కడ కనిపించే అవకాశం ఉంది) ముగింపు అలా ఇచ్చి ఉంటారనుకున్నా.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@స్ఫూర్తి: విశాలాంధ్ర లో దొరుకుతోందండీ.. కాకపొతే డిస్ప్లే లో ఉండదు.. అడిగి తీసుకోవాలి.. ధన్యవాదాలు.

@వేణూ శ్రీకాంత్: పుస్తకం చివర్లో అర్ధాలు ఇచ్చారు చూడండి.. అవి మీకు ఉపయోగపడతాయి. ఒక పది పదిహేను పేజీలు కొంచం కష్ట పడితే తర్వాత సులువుగానే సాగిపోతుంది పఠనం.. ధన్యవాదాలండీ..

మురళి చెప్పారు...

@స్ఫూర్తి: విశాలాంధ్ర లో దొరుకుతోందండీ.. కాకపొతే డిస్ప్లే లో ఉండదు.. అడిగి తీసుకోవాలి.. ధన్యవాదాలు.

@వేణూ శ్రీకాంత్: పుస్తకం చివర్లో అర్ధాలు ఇచ్చారు చూడండి.. అవి మీకు ఉపయోగపడతాయి. ఒక పది పదిహేను పేజీలు కొంచం కష్ట పడితే తర్వాత సులువుగానే సాగిపోతుంది పఠనం.. ధన్యవాదాలండీ..

సుబ్రహ్మణ్య ఛైతన్య చెప్పారు...

ఇంతకాలం పేరు గుర్తుకురాక గింజుకుంటూన్నా. నాకొలీగ్ ఒకమ్మాయి హైదరాబాదునుంచి వచ్చేటప్పుడు నాకు పుస్తకాలేమైనా కావాలా అనడిగితే కొన్నిచెప్పాను. అప్పుడు పేరుకోసం ఎంతప్రయత్నించినా ఉర్తురాలేదు. ఈసారి వెళ్ళినప్పుడు తెప్పించాలి. ఆయన తెలంగాణాకోసం తుపాకీపట్టినాయన అని మొదటిసారి తెలిసినప్పుడు నమ్మలేకపోయాను. నామాలు పెట్టుకుని, వేదాధ్యయనం చేసే బ్రామ్మడు అడవుల్లో పోరాడాడు అంటే పరశురాముని అంశలాగా కనిపించాడు.
@ విజయవర్థన్: తెలంగాణా సాయుధపోరాటం గురించి లోపలిమనిషిలో, దాశరథి కృష్ణమాచార్యగారి యాత్రాస్మృతిలో, హైదరాబాద్- ఏ బయోగ్రఫీలో చాలామంచి సమాచారం ఉంటుంది

విజయవర్ధన్ చెప్పారు...

మురళి గారు, సుబ్రహ్మణ్య ఛైతన్య గారు, Thank you.

మురళి చెప్పారు...

@సుబ్రహ్మణ్య చైతన్య: రంగాచార్య గారి 'జీవనయానం' చదవండి, వీలయితే. ఆయన ఆత్మకథ. అప్పట్లో వార్త ఆదివారం అనుబంధం లో సీరియల్ గా వచ్చింది. ధన్యవాదాలు.
@విజయవర్ధన్: ధన్యవాదాలండీ..

మురళి చెప్పారు...

@సుబ్రహ్మణ్య చైతన్య: రంగాచార్య గారి 'జీవనయానం' చదవండి, వీలయితే. ఆయన ఆత్మకథ. అప్పట్లో వార్త ఆదివారం అనుబంధం లో సీరియల్ గా వచ్చింది. ధన్యవాదాలు.
@విజయవర్ధన్: ధన్యవాదాలండీ..

SANJAY MENGANI చెప్పారు...

You can find this book at the following location

http://www.teluguone.com/grandalayam/novels/%E0%B0%8E%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8B%E0%B0%A1%E0%B1%8D-1-844-14464.html

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి