మంగళవారం, డిసెంబర్ 22, 2009

నాయికలు-అరుణ

"నేను ప్రకాశాన్ని పెళ్లి చేసుకుంటాను.. అప్పుడు నేను స్వేచ్ఛగా ఉండొచ్చు.." అంటుందో ఇరవై రెండేళ్ళ అమ్మాయి తన స్నేహితురాలితో. "అందరూ పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛ పోతుందని గోల పెడుతుంటే, నువ్వు స్వేచ్ఛ కోసం పెళ్లి చేసుకుంటానంటే నవ్వు రాదూ.." అంటుందా స్నేహితురాలు, నవ్వాపుకుంటూ. మూడేళ్ళ సంసార జీవితం తర్వాత, ఓ పాపకి తల్లైన రెండేళ్ళకి, స్నేహితురాలి మాటలు అర్ధమవుతాయి ఆమెకి. ఆమె పేరు అరుణ.

తెలుగు పాఠకులకి వోల్గా గా పరిచయమైన పోపూరి లలిత కుమారి ఇరవై రెండేళ్ళ క్రితం రాసిన 'స్వేచ్ఛ' నవలలో నాయిక అరుణ. మధ్య తరగతి అమ్మాయి. ఇంట్లో తల్లి, తండ్రి, అన్న వదిన, చివరికి తల చెడి వాళ్ళ పంచన చేరిన మేనత్త అందరూ ఆమెని కట్టడి చేసేవాళ్ళే. ఆమె ఏ పని చేయాలన్నీ వీళ్ళందరి అనుమతీ తీసుకోవాల్సిందే. తండ్రికి ఆమెకి పెళ్లి చేసే ఆర్ధిక స్తోమతు లేకపోవడం వల్ల కష్టపడి ఎమ్మే చదవ గలిగింది అరుణ. అప్పుడే యూనివర్సిటీ లో పరిచయమై ప్రాణ స్నేహితురాలిగా మారింది ఉమ. అప్పటి స్నేహితుడు ప్రకాశం, తర్వాత ఆమెకి భర్తగా మారాడు.

చిన్నప్పటినుంచీ తను ఖర్చు పెట్టే ప్రతి పైసాకీ ఇంటిల్లపాది నుంచీ అనుమతి సంపాదించాల్సి రావడం వల్ల, ఆర్ధిక స్వాతంత్రం విలువ చిన్న వయసులోనే అర్ధమవుతుంది అరుణకి. అందుకే ఏదైనా ఉద్యోగం వచ్చేవరకూ పెళ్లి మాట తలపెట్ట వద్దంటుంది, అప్పటికే ఉద్యోగస్తుడైన ప్రకాశాన్ని. ఒక కాలేజీలో తెలుగు లెక్చరర్ గా చేరిన నెల్లాళ్ళకి, ఇంట్లో వాళ్లకి చెప్పకుండా ప్రకాశాన్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటుంది అరుణ. పుట్టింటితో సంబంధాలు శాశ్వతంగా తెగిపోతాయి ఆమెకి. స్నేహితురాలు ఉమ పై చదువుల కోసం వెళ్తుంది.

కాలం గడుస్తున్న కొద్దీ ప్రకాశం అర్ధం కావడం మొదలుపెడతారు అరుణకి. తామిద్దరి మధ్యా ఉన్న భేదం కూడా తెలుస్తూ ఉంటుంది ఆమెకి. అరుణ కేవలం తను, తన సంసారం అనుకుంటూ ఉండలేదు. జీతాల కోసం చేసే ఉద్యమం కావొచ్చు, బాధార్తుల జీవితాలని వెలుగులోకి తెచ్చే పత్రిక కావొచ్చు, వాటిలో పనిచేయడంలో ఆనందం, తృప్తీ లభిస్తాయి ఆమెకి. సంఘం లో ఉన్న సమస్యలకి తాను బాధ్యుడిని కాదు కాబట్టి, వాటి పరిష్కారంతో తనకి సంబంధం లేదంటాడు ప్రకాశం.

జీవితాన్ని కాచి వడపోసిన అత్తగారు కమలమ్మ పెద్ద అండ అరుణకి. కేవలం పాపని చూసుకోడమే కాదు, అరుణకి కావాల్సిన మానసిక స్థైర్యం కూడా ఇస్తూ ఉంటుందామె. కొడుకూ, కోడలూ కీచులాడుకుంటూ ఉండకూడదన్నది ఆమె కోరిక. ఇద్దరికీ చెప్పలేక సతమతమవుతూ ఉంటుంది. అప్పుడప్పుడూ ఉమ రాసే ఉత్తరాలు పెద్ద ఊరట అరుణకి. 'వెలుగు' అనే పత్రిక కోసం అరుణ నెలకి వందరూపాయలు చందా ఇవ్వడం, ఆ పత్రిక కోసం సమాచారం సేకరించి వ్యాసాలు రాయడం అస్సలు నచ్చదు ప్రకాశానికి. ఆ పనిలో యెంతో ఆనందం దొరుకుతుంది అరుణకి.

"పెళ్ళయితే ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరి పాత్రలనూ ప్రకాశమే పోషిస్తాడేమో.." అని ఒకప్పుడు ఉమ అన్న మాటలు గుర్తొస్తాయి అరుణకి. నిజానికి అరుణ దృష్టిలో ప్రకాశం చాలామంది మగవాళ్ళకన్నా మంచివాడు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే తను చేసేవి అతనికి నచ్చవు, అతనికి నచ్చేట్టుగా తను ఉండలేదు.. ఉంటే స్వేచ్ఛకి అర్ధం ఉండదు. తమ ఇద్దరి దారులూ వేరన్న విషయం అర్ధం కాగానే అరుణ ఎలాంటి నిర్ణయం తీసుకుందన్నది ఈ నవల ముగింపు.

'చతుర' నవలల పోటీలో ప్రధమ బహుమతి గెలుచుకున్న ఈ నవల అప్పట్లో ఒక సంచలనం. ఎన్నో వివాదాలకి కేంద్ర బిందువు. ప్రగతిశీల ఉద్యమాల్లో పనిచేసే మగవాళ్ళు తమ ఇంటి స్త్రీలని మిగిలిన అందరు మగవాళ్ళ లాగే చూస్తారనీ, తమతో పని చేసే స్త్రీల ఇబ్బందులని ఏమాత్రం పట్టించుకోరనీ రాయడం సహజంగానే చాలామందికి కోపం తెప్పించింది.

కథా వస్తువుతో పాటు, రచయిత్రి వ్యక్తిగత జీవితం కూడా చర్చల్లోకి వచ్చింది. వోల్గా రచనల్లో ఎక్కువ సార్లు పునర్ముద్రణలు పొందిన నవల బహుశా ఇదే. తనకి నచ్చినట్టుగా జీవించాలనుకున్న ఒక సాధారణ స్త్రీకి పరిస్థితులు ఎలాంటి పాఠాలు నేర్పుతాయన్నది సమగ్రంగా చిత్రించిన నవల 'స్వేచ్ఛ.' (స్వేచ్ఛ ప్రచురణలు, పేజీలు 155, వెల రూ. 60 అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

10 కామెంట్‌లు:

  1. పరిచయం ఎప్పటిలానే బాగుంది. అందరి కట్టడి మధ్య పెరిగిన నాయిక నచ్చినతన్ని పెళ్ళి చేసుకుని స్వేచ్చగా ఉండాలి అని కోరుకోవడంలో తప్పులేదు కాని అతనిని సరిగా అంచనా వేయడంలోనే తప్పటడుగు వేసిందనమాట.

    రిప్లయితొలగించండి
  2. మీరు క్లైమాక్స్ చెప్పకపోయినా ఫర్వాలేదోచ్ ....నేనీ నవల చదివానోచ్ .....:) :)

    రిప్లయితొలగించండి
  3. నేను చాల సార్లు చదివిన పుస్తకాల్లో ఇదొకటి ,దీనితోపాటే 'అంపశయ్య ' కూడా చదివాను .స్వేచ్చ అనగానే రెండు గుర్తొస్తాయి .
    స్వేచ్చ ఒకరు ఇచ్చేది కాదని చాల ఆలస్యంగా తెలిసింది .-:)

    రిప్లయితొలగించండి
  4. చాలా మంచి పుస్తకం. నేను తరచు గా చదివే వోల్గా గారి పుస్తకాలలో ఇది ఒకటి.

    రిప్లయితొలగించండి
  5. ఏంటో మీరిలా మమ్ముల్ని గుక్కతిప్పుకోనీకుండా టపాల మీద టపాలు వ్రాసేస్తుంటే మేము ఇవన్నీ ఎప్పటికి చదవాలి?

    ఓల్గా స్వేచ్చ గురించి ఇంతకు ముందు సుజాత గారు చెప్పారు కానీ చదవటం పడలేదు..కొనాలి.

    అన్నట్టు మురళి గారూ, ఈ రోజు సుమన్ బాబు గారి పుట్టినరోజనుకుంటాను కదా..మీ బాబు గారికి శుభాకాంక్షలు చెప్పలేదేమండి?

    రిప్లయితొలగించండి
  6. @వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ.
    @పరిమళం: ఇంతకీ మీకు నచ్చిందో లేదో చెప్పలేదు.. ధన్యవాదాలు.
    @చిన్ని: ఆలస్యంగానైనా తెలిసింది కదండీ :):) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. @భావన: ఎందుకో అనిపించిందండీ.. మీరు చదివి ఉంటారని.. ధన్యవాదాలు.
    @సిరిసిరిమువ్వ: తప్పక చదవండి.. బాబు కి దిష్టి తగులుతుందని చెప్పలేదండీ :):) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. సమకాలీన మధ్యతరగతి సమాజాన్ని చాలా లోతుగా పరిశీలించి, ఎక్కడా రొమాంటిసైజ్ చెయ్యకుండా, నినాదాలు పలక్కుండా చక్కని వాస్తవిక దృక్పథంతో వచ్చిన రచన ఇది. మేము అభ్యుదయ వాదులం మేము సమకాలీనులం అనుకునే స్త్రీ పురుషులందరూ చదవాల్సిన నవల. వివాహ వ్యవస్థ గురించి వోల్గా రాసిన పెద్ద కథ ప్రయోగం, మధ్యతరగతి మారుతున్న జీవనాన్ని గురించి పి. సత్యవతి గారి పెద్దకథ పెళ్ళి ప్రయాణం కూడా ఇటువంటి లోతైన పరిశీలనని అండజేస్తాయి.
    మురళిగారూ, చక్కటి పరిచయం.

    రిప్లయితొలగించండి
  9. @కొత్తపాళీ: అరుణ ని ఏ భావజాలానికీ చెందని వనితగా చిత్రించడంతోనే వోల్గా సగం విజయం సాధించారని అనిపిస్తుందండీ నాకు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. నేను ఈ పుస్తకం చాల రోజుల క్రితం చహివను. ధన్యవాదాలు, క్లుప్తంగా రాసిన కధ మొత్తం రాశారు. మళ్ళి ఆ జ్ఞాపకలోకి వెళ్లి పోయాను. నిజంగా చాల బాగా చెప్పారు, స్రీ స్వేఛ్చ అంటే ఏమిటో. ఇలాంటివి మన ఆలోచనలు చాల ప్రభావితం చేస్తాయి.

    రిప్లయితొలగించండి