మంగళవారం, మార్చి 19, 2013

నాయికలు-నరేంద్ర ప్రభ

ఆమె అధ్బుతమైన సౌందర్య రాశి కాదు. నిజానికి అందం కన్నా, ఆకర్షణే ఎక్కువ ఆమెలో. అదిగో, ఆ ఆకర్షణే సాక్షాత్తూ కాశ్మీర చక్రవర్తినే ఆమెతో పీకలోతు ప్రేమలో మునిగిపోయేలా చేసింది. అంతటి గొప్పవాడు ప్రేమిస్తున్నా, ఆమె ఆ ప్రేమని స్వీకరించే స్థితిలో లేదు. అతనిమీద తనకి ఉన్న ఇష్టాన్ని ప్రకటించేందుకు బదులుగా, దానిని ఆగ్రహంగా మార్చేసుకుంది. ఎందుకంటే, ఆమె అందమైన భవిష్యత్తుని కలలుకనే పదారేళ్ళ కన్నెపిల్ల కాదు. బాధ్యతాయుతమైన గృహిణి. చక్రవర్తికే అప్పు ఇవ్వగల ఆర్ధిక స్తోమతు ఉన్న వజ్రాల వర్తకుడు నోణక శ్రేష్ఠి భార్య. పేరు నరేంద్ర ప్రభ.

కాశ్మీర  ఓ మామూలు మధ్యతరగతి ఇంట పుట్టింది నరేంద్ర ప్రభ. కళల మీద ఉన్న మక్కువ చేత చిన్నప్పుడే వీణ, నృత్యం అభ్యసించింది. యుక్త వయసు వచ్చిన ప్రభని, ఆర్ధికంగా ఎన్నో మెట్లు పైనున్న నోణక శ్రేష్ఠి ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. చెల్లెలు ఓ గొప్పవాడికి భార్య అయినందుకు ఎంతో సంతోషించారు ఆమె అన్నలు. అయితే, ఆర్ధిక వ్యత్యాసాల ప్రభావం పుట్టింటి తో ఆమె అనుబంధం మీద బాగానే ప్రభావం చూపింది. మరీ ముఖ్యంగా, తండ్రి మరణం తర్వాత ఆ దూరం బాగా అర్ధమయింది నరేంద్ర ప్రభకి.

అన్నీ ఉన్నా, సంతానం లేదనే లోటు పీడించడం మొదలు పెడుతుంది నోణక శ్రేష్ఠిని. అతని బాధ చూడలేని నరేంద్ర ప్రభ తన దూరపు బంధువు కమలాలయని ఇచ్చి మరీ తన భర్తకి రెండో వివాహం జరిపిస్తుంది. కొంతకాలం ఏ పొరపొచ్చాలు లేకుండానే ఉంటారు ముగ్గురూ. ఉన్నట్టుండి, చక్రవర్తి ప్రతాపాదిత్యుడు నోణక శ్రేష్ఠి దగ్గర నాణ్యమైన వజ్రాలు కొనాలని సంకల్పించి, తనకు తానుగా బయలుదేరి శ్రేష్ఠి ఇంటికి రావడంతో ప్రభకి కష్టాలు మొదలవుతాయి. చక్రవర్తి గౌరవార్ధం వీణ కచేరీ చేసిన ప్రభని చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు చక్రవర్తి.

తన భవంతికి చక్రవర్తి రాకపోకలు పెరగడం ఎంతగానో సంతోష పెడుతుంది నోణక శ్రేష్ఠిని. అతని వ్యాపారం ఊహించనంత పెరుగుతుంది. ఉన్నట్టుండి చక్రవర్తి రాకపోకలు ఆగిపోతాయి. ప్రధానమంత్రి ద్వారా శ్రేష్ఠి తెలుసుకున్నది ఏమంటే, చక్రవర్తి ప్రభని ఇష్టపడుతున్నాడని, అయితే ధర్మం తప్పని వాడు అవ్వడం వల్ల, తన ప్రేమని ప్రకటించకుండా ఉండడం కోసం, ఆమెకి దూరంగా మసలుతున్నాడనీను. చక్రవర్తి ధోరణి వల్ల తన వ్యాపారానికి ఎంత నష్టమో ఇట్టే అంచనా వేసుకున్న శ్రేష్ఠి, కాశ్మీర దేశంలో అప్పటికి అమలులో ఉన్న ధర్మం ప్రకారం ప్రభకి తాను విడాకులు ఇచ్చి ఆమెని అంతఃపురానికి సమర్పించడానికి సిద్ధ పడతాడు.

భర్త ప్రతిపాదనకి ససేమిరా అంటుంది నరేంద్ర ప్రభ. అటు శ్రేష్ఠి, ఇటు కమలాలయ ఆమెని దూరం పెడతారు. భవంతిలో పనివాళ్ళు సైతం ఆమె మాట వినని పరిస్థితి. భర్తా, సవతీ కలిసి తనకి పొగ పెడుతున్నారని గ్రహించుకున్న ప్రభ, పుట్టింటికి ప్రయాణం అవుతుంది. అక్కడా ఆదరం అంతంత మాత్రమే కావడంతో వారం రోజులన్నా గడవక మునుపే తిరుగు ప్రయాణం అవుతుంది. భర్త చాటున కాపురం చేసుకుంటున్న తనను ఈ స్థితికి తెచ్చిన చక్రవర్తి మీద పట్టరాని ఆగ్రహం కలుగుతుంది ఆమెకి. అతనిపై అంతకు మునుపు కలిగిన అభిమానం ఆవిరై పోతుంది.

అంతఃపురానికి వెళ్ళడానికి ఏ మాత్రమూ ఇష్టపడని ప్రభకి ఇంట్లో నిలబడలేని పరిస్థితులు కల్పిస్తారు శ్రేష్ఠి, కమలాలయ. బాగా ఆలోచించుకున్న నరేంద్ర ప్రభ దేవదాసిగా మారిపోడానికి సిద్ధ పడుతుంది. తనని అంతఃపురానికి కాక ఆలయానికి అర్పించమని కోరుతుంది భర్తని. శ్రేష్ఠి అందుకు ఇష్టపడక పోవడంతో, తనని ఆలయానికి అప్పగించని పక్షంలో, స్వచ్చందంగా వేశ్యావాటిక లో చేరిపోతానని బెదిరిస్తుంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో, అంగరంగ వైభవంగా ఓ వేడుక జరిపి, ఆమెని దేవదాసిని చేస్తాడు శ్రేష్ఠి. స్వతంత్ర జీవితం మొదలు పెట్టిన ప్రభ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయన్నది పిలకా గణపతి శాస్త్రి రాసిన 'కాశ్మీర పట్టమహిషి' నవలలో తెలుసుకోవల్సిందే..

2 కామెంట్‌లు:

  1. దేవదాసీ వ్యవస్థ ఇలాంటి గొప్ప పరిస్తితులను ఎదుర్కొనడానికెనేమొ కానీ కాల క్రమేనా దాన్ని చెడ్డగా వాడటం మొదలెట్టినారెమో...ఎంతైనా మనిషి మాంచి ప్రావీణ్యం కలవాడు కదా మంచి కోసం శృష్టించిన వాటిని చెడు కోసం వాడడం లో....!

    రిప్లయితొలగించండి
  2. @నరసింహ: నిజమండీ... కాలంతో పాటు చాలా మార్పులు వచ్చేసిన అనేక వ్యవస్థల్లో దేవదాసీ వ్యవస్థ ఒకటి.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి