సోమవారం, మార్చి 28, 2011

నాయికలు-వనజ

సాయుధ పోరాటానికి పూర్వపు తెలంగాణాని కళ్ళముందుంచుతూ దాశరధి రంగాచార్య రాసిన నవల 'చిల్లర దేవుళ్ళు.' ఈ నవలలో ప్రధాన పాత్ర వనజ ని గురించిన పరిచయ వ్యాసం ఈ నెల 'వనితామాలిక' లో. టపాని ప్రచురించిన 'వనితామాలిక' బృందానికి కృతజ్ఞతలు.
***

సమాజం అధమ వృత్తులుగా ఎంచిన వాటిలో వేశ్యా వృత్తి ఒకటి. జీవిక కోసం శరీరాన్నే ఆధారంగా చేసుకున్న స్త్రీల జీవితాల్లో చీకటి కోణాలని ఎన్నో కథలు, మరెన్నో నవలలు విపులంగా చిత్రించాయి. అయితే మధురవాణి (గురజాడ అప్పారావు రచన 'కన్యాశుల్కం' ) దుగ్గిరాల శేషాచలం (శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి  కథ 'కలుపు మొక్కలు') వంటి అతికొద్ది పాత్రలని మినహాయిస్తే, మిగిలిన పాత్రలన్నీ దాదాపు ఒకేరకంగా అనిపిస్తాయి. నమ్మినవాళ్ళు మోసం చేయడం వల్లనో, తప్పనిసరి పరిస్థితుల వల్లనో వేశ్యా వృత్తిలోకి వచ్చిన స్త్రీల జీవితాలని చిత్రించిన కథలూ, నవలలే అధికం.

వేశ్యలకన్నా కడు హీనమైన జీవితం గడిపే 'ఆడబాప' లని పరిచయం చేసిన నవల దాశరధి రంగాచార్య 'చిల్లర దేవుళ్ళు.' సాయుధ పోరాటానికి పూర్వపు తెలంగాణాని కళ్ళముందు ఉంచిన ఈ నవల, ఆ కాలంలో ఆ ప్రాంతంలో అమలులో ఉన్న 'ఆడబాప' ఆచారాన్ని అద్దంలో చూపించింది 'వనజ' పాత్ర ద్వారా. తెలంగాణా లోని ఓ చిన్న పల్లెటూళ్ళో ఠీవిగా నిలబడ్డ దేశముఖ్ రామారెడ్డి గడీ (భవంతి) లో ఆడబాప వనజ, పుట్టుకతోనే దురదృష్టాన్ని వెంట తెచ్చుకున్న స్త్రీ.  

ఆ ఊళ్ళో రామారెడ్డి అధికారానికీ, దాష్టీకానికీ బలవ్వని వాళ్ళు ఎవరూ లేరనే చెప్పాలి. దేశముఖ్ హోదాలో నిజం ప్రభుత్వం దఖలు పరిచిన అపరిమితమైన అధికారాలన్నింటినీ దుర్వినియోగం చేసిన రామారెడ్డిది విలాసవంతమైన జీవితం. అతని కంటికి ఇంపుగా కనిపించిన ఏ స్త్రీ అయినా రాత్రికి పడకగదికి రావాల్సిందే. ఆ స్త్రీ ఆ వూరి ఆడపడుచు కావొచ్చు, కోడలు కావొచ్చు లేదా ఆ దారినే వెళ్తున్న బాటసారి కావొచ్చు. వనజ తల్లి దొర కంటపడింది అలానే. కొత్తగా పెళ్ళైన ఆమె పెనిమిటితో కలిసి గడీ ముందుగా పోతూ దొర కంట్లో పడింది. గడీలో ఆడబాపగా స్థిరపడిపోయింది. 

తల్లి వారసత్వం కొనసాగించక తప్పని పరిస్థితి వనజకి. గడీ ఆచారాన్ని అనుసరించి, వనజ వ్యక్తురాలవ్వగానే రామారెడ్డి బావమరిది ఇంద్రారెడ్డి ఆమెకి కన్నెచెర విడిపించాడు. ఆనాటి నుంచీ గడీకి వచ్చిన వాళ్ళందరికీ విలాస వస్తువైపోయింది వనజ. దొరలేవరైనా గడీకి వస్తే భోజనాలూ, ఫలహారాలూ మోసుకెళ్ళాలి.  వాళ్ళ కోర్కెలకి తను లొంగిపోవాలి. వాళ్ళు పశువుల్లా ప్రవర్తిస్తుంటే తను బొమ్మలా ఉండాల్సిందే కానీ కిమ్మనడానికి వీల్లేదు. యంత్రవతుగా వ్యవహరించాలి. 

రామారెడ్డి తన తండ్రి అని వనజకి తెలుసు. అంతే కాదు, రామారెడ్డి కూతురు మంజరికి తను సేవిక అన్న సత్యమూ తెలుసు. వీటన్నింటినీ మించి తన కంటినుంచి కన్నీరు జారితే జరిగే పరిణామాలు ఇంకా బాగా తెలుసు. గడీ నుంచి పారిపోవాలని చాలాసార్లే అనుకుంది ఆమె. కానీ తను ఎక్కడున్నా దొర పట్టి తెప్పిస్తాడన్న సత్యం ఆమెని ఆపేసింది. అంతే కాదు. ఎక్కడికి పారిపోవాలి? ఏం చేయాలి? ఆడబాపగా బతికిందానికెవడైనా అండ చూపుతాడా? ఈ ప్రశ్నలకి జవాబులు లేవు వనజ దగ్గర. 

తనని తాను యంత్రంగా మార్చుకుని జీవితాన్ని వెళ్ళదీస్తున్న వనజకి  తనూ మనిషే అన్న సత్యాన్ని బోధ పరిచిన వాడు సారంగపాణి, విజయవాడ ప్రాంతం నుంచి జీవనోపాధిని వెతుక్కుంటూ ఆ పల్లెకి వచ్చిన సంగీతప్పంతులు. అప్పటివరకూ గడీలో దిగిన దొరలకీ, పాణికీ చాలా భేదం ఉందన్న విషయం అర్ధం కావడానికి ఎక్కువ రోజులు పట్టలేదు వనజకి. అతని పలుకులు ఆమెకెంతో ఆప్యాయతని ఇచ్చాయి. ఏదో తెలియని ఆనందం మైకంలా కమ్మిందామెని. 

తనకి తెలియకుండానే పాణితో ప్రేమలో పడిపోయింది వనజ. అతణ్ణి చూడడం కోసం, గొంతు వినడం కోసం ఎంతగానో ఎదురు చూడడం మొదలు పెట్టింది. పాణి సాంగత్యంలో అంతకు ముందు తెలియని ఆనందమేదో అనుభవంలోకి వచ్చింది ఆమెకి. పాణి తనతో యెంతో సౌమ్యంగా వ్యవహరిస్తున్నప్పటికీ అతనికి తనపై ప్రేమ ఉన్నదా? అన్న విషయం అర్ధం కాదు వనజకి. అందరితోనూ ఆపేక్షగా ఉండడం పాణి నైజం కావడమే ఇందుకు కారణం. 

పాణిని గురించిన ఆలోచనలతో ఆనందంగా రోజులు గడుపుతున్న వనజకి 'అతనికి తను తగినదేనా?' అన్న ప్రశ్న ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. 'తానెవరు?' అని ప్రశ్నించుకున్నప్పుడు 'వేశ్యకన్నా కడు హీనం' అన్న జవాబు వస్తుంది వనజకి. వేశ్య డబ్బుకి తనని తాను అమ్ముకుంటుంది. తన తల్లీ, తన ఆచారాలూ తనను అమ్మి వేశాయి, జంతువుని అమ్మినట్టు. తాను బ్రతికి ఉన్నన్నాళ్లూ ఈ దొరకు బానిసే. వేశ్య తాను వద్దనుకుంటే, తనకు డబ్బు అవసరం లేదనుకొంటే తనను అమ్ముకోవాల్సిన పని లేదు. కానీ తాను? తనకు ఇష్టం ఉన్నా లేకున్నా, అవసరం ఉన్నా లేకున్నా అర్పించేయాల్సిందే కోరిన వారికి -- గడీకి వచ్చిన వారికి. 

పాణిని పెళ్లి చేసుకుని, గడీ బతుకు నుంచి బయట పడి తనకంటూ ఓ కుటుంబాన్ని ఏర్పరుచుకోవాలని కలలు కన్న వనజకి  దైవంలాంటి అతనికి కుళ్ళిన పండు లాంటి తనని అర్పించుకోవడం సమంజసం అనిపించదు. ఆ ఆలోచనల నుంచే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఫలితం.. నిన్నటి రాతి మనిషి నేడు దేవత అయిపోయింది. తన నిర్ణయాన్ని ఆమె పాణికి చెప్పినప్పుడు "నేనంటే ప్రేమ లేదా?" అని అడిగాడతడు. "నేను నీకు తగినదానిని కాను. నువ్వు దేవుడివి. బండవంటి నన్ను మనిషిని చేసినవు. గొడ్డువంటి దాన్కి ప్రేమ చూపినవు. అటువంటి నీకు మచ్చ పడ్డ నా మనసెట్టిద్దును? నా పుటక దరిద్రపుది. నా బతుకు దరిద్రంది..." అంటూ తన కథంతా చెప్పేసింది. 

వనజ నిర్ణయం వాళ్ళిద్దరి మధ్యనే ఉండిపోవడం కారణంగా గడీలో జరిగిన పరిణామాలు వనజకి ఇబ్బందులని తెచ్చాయి. మంజరి చేతిలో ఆమెకి ఎన్నో అవమానాలు జరగడానికి కారణమయ్యాయి. వాటన్నింటినీ భరించింది వనజ. తనలో చలనం తెచ్చిన పాణి ఆమెకి ఎప్పటికీ ప్రత్యేకమైన వాడే. నవల పతాక సన్నివేశంలో రామారెడ్డి మరణించగానే, అప్పటివరకూ 'దొరా' అని పిలిచినా వనజ, 'నాయ్నా..' అంటూ అతని శవం మీద పడి భోరున విలపించడం పాఠకులని కదిలించడం మాత్రమే కాదు, వనజని ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా చేస్తుంది.

3 కామెంట్‌లు:

 1. దాశరథి రంగాచార్య వారి నవల "చిల్లర దేవుళ్ళు" ఇంతకు క్రితం ఎప్పుడో ఒక వార పత్రిక లో సీరియల్ గ వచ్చినట్టు గుర్తు..

  రిప్లయితొలగించు
 2. ఈ మధ్యే చదివా..చాలా పెయిన్ ఫుల్ స్టొరీ అండీ..

  రిప్లయితొలగించు
 3. @కథాసాగర్: ఇప్పుడు విశాలాంధ్ర వాళ్ళు ఆయన నవలలన్నీ వరుసగా ప్రచురిస్తున్నారండీ.. ధన్యవాదాలు.

  @ప్రణీత స్వాతి: అవునండీ...నిజమే.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు