బుధవారం, మార్చి 30, 2022

భారతీయ సీయీవో

కేరళ మూలాలున్న ప్రవాస భారతీయుడు రాజ్ సుబ్రమణియం 'ఫెడెక్స్' సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా  ఎంపిక కావడంతో భారతీయుల నాయకత్వ లక్షణాలపై మరోసారి చర్చ మొదలైంది. మైక్రోసాఫ్ట్, గూగుల్ మొదలుకుని ట్విట్టర్ వరకూ దాదాపు ఇరవై భారీ మల్టి-నేషనల్ కంపెనీల్లో కీలక స్థానాల్లో భారతీయులు రాణిస్తుండడంతో రాజ్ నియామకం మరీ పెద్ద వార్త కాలేదు. కొంచం స్పష్టంగా చెప్పాలంటే 'భారతీయ సీయీవో'  అనేది ప్రపంచానికి అలవాటైపోయినట్టుగా అనిపిస్తోంది. నావరకు సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ ల ఎంపిక జరిగినప్పటి హడావిడి గుర్తొచ్చింది. గడిచిన ఏడెనిమిదేళ్లలో ఏడాదికి రెండు మూడు కంపెనీలన్నట్టుగా భారతీయుల్ని కీలక స్థానాల్లో కూర్చోబెడుతున్నాయి. సదరు వ్యక్తులు కూడా పదవుల్ని అలంకారంగా భావించకుండా, తమ శక్తి సామర్ధ్యాలని కంపెనీల అభివృద్ధికి వెచ్చిస్తూ అహరహం శ్రమిస్తున్నారు. వాళ్ళ విజయాలు కూడా తాజా ఎంపికలో ఎంతోకొంత పాత్ర పోషిస్తూ ఉండొచ్చు, మిగిలిన వాటితో పాటుగా. 

పెద్దపెద్ద అమెరికన్ కంపెనీలు కీలక స్థానాల్లో భారతీయుల్ని ఎందుకు కూర్చోబెడుతున్నాయి? అన్న ప్రశ్నకి అనేక జవాబులు తడుతున్నాయి. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది సంఖ్యాబలం. అమెరికా వలసదారుల్లో, ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు చేసే వాళ్లలో అధిక సంఖ్యాకులు భారతీయులే. నాలుగున్నర దశాబ్దాల క్రితం వలసలకి అమెరికా తలుపులు తెరిచినప్పుడు, ముప్ఫయ్ ఏళ్ళ క్రితం నిబంధనల్ని మరింత సరళతరం చేసినప్పుడూ, మరీ ముఖ్యంగా అగ్ర రాజ్యాన్ని వణికించిన 'వైటూకే' సందర్భంలోనూ పెద్ద ఎత్తున ఆ దేశంలో అడుగు పెట్టిన వాళ్ళు భారతీయులే.  జనాభా ఎక్కువ, అవకాశాలు తక్కువా ఉన్న దేశం కనుక సహజంగానే పెద్ద ఎత్తున నిపుణుల్ని సరఫరా చేయగలిగింది. (వలసల సంఖ్యలో భారత్ కి దరిదాపుల్లో ఉన్నది అత్యధిక జనాభా ఉన్న మరోదేశం చైనా కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం.) తత్ఫలితంగా  అమెరికాలోని కీలక ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ భారతీయలు బాగా కుదురుకోగలిగారు. 
Google Image

సంఖ్యాబలం ఉన్నంత మాత్రాన ఉన్నతోద్యాగాలు వెతుక్కుంటూ వచ్చేస్తాయా? కీలకమైన పోస్టులకి ఎంపిక చేసేస్తారా? ఇవి కూడా చాలా సహజమైన ప్రశ్నలే. ఉద్యోగం వెతుక్కుంటూ ఇప్పుడు ఆ దేశానికి బయల్దేరే వాళ్ళకన్నా, ముందు నుంచీ అక్కడ ఉంటున్న/ఆ దేశానికి అలవాటు పడ్డవాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నది కాదనలేని నిజం. హైదరాబాదులో ఉద్యోగానికి, హైదరాబాదు నుంచి ఒకరూ, ఆముదాలవలస నుంచి ఒకరూ అప్లై చేసినప్పుడు, ఎంత సమానావకాశాలు ఇచ్చే వాళ్ళైనా హైదరాబాద్ అభ్యర్థికే తొలి ఓటు వేస్తారు. రెండు మూడు తరాలకి ముందు మొదలైన భారతీయుల అమెరికా విస్తరణ, ఇప్పటి తరానికి వినియోగానికి వస్తోంది. ఈ భారతీయ సీయీవోల్లో కొందరు అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళైతే, మరికొందరు ఉన్నత విద్య కోసం వెళ్లి అక్కడే ఉద్యోగంలోనూ, జీవితంలోనూ స్థిరపడిపోయిన వాళ్ళు. వీళ్ళలో మెజారిటీ భారతీయులం అని చెప్పుకుంటారు తప్ప, భారత్ కి తిరిగి వెళ్లడం అనే ఆలోచన పెట్టుకోరు, పెట్టుకోలేరు కూడా. 

ఇంతకీ నాయకత్వ లక్షణాలు అనగా ఏవి? విజేతల చరిత్రలు తిరగేసినప్పుడు వాళ్ళందరూ చాలా క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని గడుపుతారని, సమయపాలనకి విలువ ఇస్తారని, చాలా సహనంగానూ, దయతోనూ ఉంటారనీ, స్థితప్రజ్ఞత వారి సొత్తనీ, ఒక పని పూర్తి చేసేందుకు వంద మార్గాలని ఆలోచించి పెట్టుకుంటారనీ, పోరాట పటిమ కలిగి ఉంటారనీ... ఇలా ఓ పెద్ద జాబితా కనిపిస్తుంది. సూక్ష్మంగా పరిశీలిస్తే కెరీర్ లో పైకెదగాలనే తపన ఉన్న భారతీయులందరికీ వీటిలో చాలా లక్షణాలు సహజాతాలు. వీళ్లంతా ఎంసెట్ ర్యాంక్ కోసం ఎల్కేజీ నాటి నుంచీ కష్టపడి చదివిన వాళ్ళే. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అడుగు పెట్టనివ్వని పరీక్షలు రాసి రేంకులు తెచ్చుకున్న వాళ్ళే. 'స్కూలు బస్సు రాకపోతే బడిమానేద్దాం' అనే ఆలోచన లేకపోగా, ప్రేయరుకి ముందే బళ్ళో ఉండడానికి మార్గాలు అన్వేషిస్తూ పెరిగిన వాళ్ళే. చిన్నప్పటి నుంచీ వీళ్ళు నెగ్గుకొచ్చేది అల్లాటప్పా పోటీలో కాదు, కట్ త్రోట్ కాంపిటీషన్లో. 

ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే, ఈ భారతీయ సీయీవోల్లో మెజారిటీ మధ్యతరగతి నేపధ్యం నుంచి వచ్చిన వాళ్ళే. 'బతకడానికి నీకున్న ఒకేఒక్క దారి చదువు మాత్రమే' అన్న బోధలు నిత్యం వింటూ పెరిగిన వాళ్లే. ఇంట్లో చదువుకునే వాతావరణం ఉండడం, అదే సమయంలో పరిమితమైన వనరులు, అపరిమితమైన పోటీ వీళ్ళని యుద్ధానికి సిద్ధపడేలా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించి ఉంటాయి. ఎదగాలనే తపనని ఉగ్గుపాలతో రంగరించి మరీ నింపి ఉంటారు వీళ్ళ పెద్దలు. ప్రతిభని మెరుగు పరుచుకోడం, ఆపైన తమకి తగిన అవకాశాలని వెతుక్కుంటూ ఎంతదూరమైనా వెళ్ళడానికి మానసికంగా సిధ్దపడడం వాళ్లకి తెలియకుండానే రక్తంలో ఇంకి ఉంటుంది. సర్దుకు పోవడం, సర్దుబాటు చేసుకోవడం లాంటి లక్షణాలు కూడా వృత్తిలో ఎదగడానికి దోహదం చేసే ఉంటాయి. బహుశా అందుకే తమ భారతీయ మూలాలని కొంచం తరచుగా గుర్తు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. 'సీయీవో' అనే చక్కెర పూత వెనుక ఉన్న చేదు వాళ్లకన్నా బాగా ఇంకెవరికి తెలుసు?

సోమవారం, మార్చి 28, 2022

పండు పండు పండు ...

ఉగాది కన్నా ముందే ఎండలు మండిపోతున్నాయి. డీహైడ్రేషన్, వడదెబ్బ నుంచి ఎవరిని వారు రక్షించుకోవాల్సిన తరుణం వచ్చేసింది. కనబడ్డ ఓ జ్యూస్ షాపు లోకి అదాటున వెళ్లి, మెనూ చూడకముందే ఆర్డర్ ఇచ్చేసి, తాపీగా కూర్చుని మెనూ తిరగేస్తుండగా పక్క టేబుల్ నుంచి ఆర్డర్ వినిపించింది 'బటర్ ఫ్రూట్ జ్యూస్'. మెనూలో స్పెషల్ ఐటమ్స్ కేటగిరీలో కనిపించింది 'అవొకాడో' బొమ్మతో. ఆహా! ఏ దేశపు ఫలాన్నైనా ఆపళంగా తినేయడం ఒక్కటే కాదు, జ్యూస్ పిండుకుని తాగేయగలుగుతున్నాం కూడా కదా అని ఆశ్చర్యం కలిగింది. ప్రపంచం ఓ కుగ్రామంగా మారిపోవడం అంటే ఏమిటో మరోమారు అనుభవానికి వచ్చింది. నోరు తిరగని పేర్లున్న రకరకాల ఫలాలని, స్థలకాలాదులతో నిమిత్తం లేకుండా ఆరగించగలగడాన్ని ఒకప్పుడు ఎవరూ ఊహించలేదు. 

ఇప్పుడిప్పుడు పెద్ద పెద్ద మాల్స్ లో మాత్రమే కాదు, వీధి చివర సూపర్ బజార్ల లోనూ ఇప్పుడు అవొకాడోలూ, ఫిగ్సూ, కివీ పళ్ళూ ఇంకా అనేకానేక విదేశవాళీ ఫలాలూ ప్రత్యేక ప్యాకింగుల్లో నోరూరిస్తున్నాయి.ధరవరల గురించి మాట్లాడ్డం ఓల్డ్ ఫ్యాషన్ కాబట్టి ఆ జోలికి వెళ్లొద్దు కానీ, ఇలా చప్పన్నారు దేశాలకీ పళ్ళని ఎగుమతి చేయడం వల్ల ఆయా రైతులు ఏమాత్రం ఆర్జిస్తున్నారు? మన రైతులు వాళ్ళ పంటల్ని ఇలాగే ఎగుమతి చేయగలుగుతున్నారా? ఆయా విదేశీ పంటల్ని మన దగ్గర పండించేందుకు చేసే ప్రయత్నాల వల్ల లాభనష్టాలేంటి? లాంటి ప్రశ్నలతో బుర్ర మరికొంచం వేడెక్కింది. షాపులో రద్దీ చూస్తే ఆర్డర్ నా నోటిదగ్గరకి రాడానికి బాగానే సమయం పడుతుందని అర్ధమై, ప్రశ్నల మీదే దృష్టి పెట్టాను. 

Google Image

'వెన్న ఫలం' గా తెనిగించ గలిగే అవొకాడో జన్మస్థలం మెక్సికో. అల్లప్పడు డోనాల్డ్ ట్రంపు సరిహద్దు గోడ కట్టేస్తానని బెదిరించిన అమెరికా పొరుగు దేశం. ఈ అవొకాడోలు తొలుత అమెరికాకీ, అక్కడినుంచి గ్లోబులో ఉన్న చాలా దేశాలకీ మొదట పరిచయమై, అటు పైని వదల్లేని అలవాటయ్యాక మెక్సికో రైతులకి అక్షరాలా పంట పండింది. మిగిలిన అన్నిదేశాల్లోలాగే అక్కడా మధ్య దళారులు బాగా డబ్బు చేసుకున్నా, వెన్న పళ్ళు పండించిన రైతులు కూడా చెప్పుకోదగ్గ లాభాలనే ఆర్జిస్తున్నారు. మెక్సికోలో ఉన్న నీళ్లన్నీ అవొకాడోలు పండించదానికే చాలడంలేదంటూ మీడియా కోడై కూయడం మొదలుపెట్టింది. మనకి 'ఈనాడు' 'సాక్షి' ఉన్నట్టే అన్ని స్థాయిల్లోనూ పరస్పర విరుద్ధ పత్రికలు ఉంటాయి కదా. ఆ రెండో వర్గమేమో చికెనూ, మటనూ కోసం కోళ్ళనీ, మేకల్నీ పెంచడానికయ్యే నీళ్ల ఖర్చు కన్నా, అవొకాడోలు పండించడానికి వ్యయమయ్యే నీళ్లు బహుతక్కువనే లెక్కలతో వచ్చింది. 

అన్నట్టామధ్య మన మీడియా 'డ్రాగన్ ఫ్రూట్ సాగుతో సీమలో సిరుల పంట' అంటూ హోరెత్తింది గుర్తుందా? సదరు డ్రాగన్ ఫ్రూట్ కూడా విదేశీ ఫలమే. స్పష్టంగా చెప్పాలంటే అమెరికన్ మూలాలున్న పండు. దిగుమతుల ఖర్చు తగ్గించుకోడానికీ, వీలయితే ఎగుమతులు చేసి డాలర్లు ఆర్జించడానికీ ప్రభుత్వం వారు రైతుల్ని డ్రాగన్ ఫ్రూట్ సాగుకి విపరీతంగా ప్రోత్సహిస్తున్నారని చెప్పింది మన మీడియా. 'అరకు లో యాపిల్ సాగు' అంటూ ఇంకో రకం వార్తలు కూడా అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి చదివినప్పుడు నాకేమనిపిస్తుందంటే మన నేలలో విదేశీ పంటలు పండించడం వల్ల, మనవైన పంటలు పండించుకునే చోటుని నష్టపోతున్నాం కదా అని. దీనికి జవాబు బ్రెయిన్ డ్రైన్ అనబడే మేధోవలసలకు జవాబంత పెద్దదని కూడా తెలుసు కాబట్టి, ఎవరితోనూ చర్చ పెట్టలేదు.

జిహ్వకో రుచి ఉండడంలో ఆశ్చర్యం లేదు కానీ, అన్ని జిహ్వలకీ అమెరికా/విదేశీ పళ్లే ఎందుకు రుచి అవుతున్నాయి అన్నది ఆశ్చర్య పరిచే విషయం. మనవైన తాటి ముంజలు, రేగు, ఈత, నేరేడు పళ్ళ లాంటివి ఇంతే విస్తృతంగా మార్కెట్లో ఎందుకు కనిపించడం లేదన్నది బొత్తిగా అర్ధంకాని విషయం. ఈ విదేశీ పళ్ళన్నీ అందమైన పేకింగుల్లో, సూపర్ అద్దాల పెట్టెల వెనుక నుంచి షోగ్గా రారమ్మని పిలుస్తుంటే, మనవైన పళ్ళు మాత్రం ఇంకా సైకిలు వెనుక బుట్టలకీ, చెట్టు కింది గోనె పట్టాలకీ మాత్రమే పరిమితమై పోవడం బొత్తిగా అర్ధం కాని విషయం. పోనీ, విదేశాల్లో ఏవన్నా ఇవి మహారాణీ భోగం అనుభవిస్తున్నాయా అంటే అదీ లేదు. మావిడి మినహా మిగతా ఏ పళ్ళకీ ఆ భాగ్యం దక్కినట్టు లేదు. మనం మాత్రం మనవైన పళ్ళని బలిపెట్టి మరీ విదేశీ ఫలాలని నెత్తిన పెట్టుకుంటున్నాం అని గుర్తొచ్చి చివుక్కుమనిపించింది. మెనూని మరింత జాగ్రత్తగా పరిశీలించడం మొదలుపెట్టాను, మళ్ళీసారి వచ్చినప్పుడు అప్పటికి కొత్తగా వచ్చిచేరిన జ్యూసులని పసిగట్టడంకోసం... 

గురువారం, మార్చి 24, 2022

శ్రీబాలాజీ టాకీస్ 

'ప్రేమ ప్రబంధం' అనేది ఈ నవలకి రచయిత ఇచ్చిన ఉపశీర్షిక. ఇది చూడగానే పాతికేళ్ల క్రితం చిన్నగా మొదలై హవాగా మారిన 'యూత్' సినిమాలు గుర్తొచ్చాయి. వాటికి టైటిల్ తో పాటు, టాగ్ లైన్ తప్పనిసరిగా ఉండేది, ఓ సెంటిమెంట్ లాగా. కేవలం శీర్షిక చూస్తేనే కాదు, నవల చదువుతున్నంతసేపూ కూడా యూత్ సినిమా చూస్తున్న అనుభూతే కలిగింది. మణిరత్నం 'ఘర్షణ' సినిమా రిలీజవ్వడం మొదలు, 'గీతాంజలి' సినిమా రికార్డులు బద్దలు కొట్టడం వరకూ జరిగిన మధ్య కాలంలో చిత్తూరు జిల్లా పీలేరు టౌన్ లోని కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఓ అబ్బాయీ, అమ్మాయీ ప్రేమలో పడి, ఆ ప్రేమని గెలిపించుకోడం కోసం చేసిన పోరాటమే ఈ నవల. అబ్బాయి పేరు జీకే నాయుడు, అమ్మాయి పేరు స్నేహలతా రెడ్డి. 

కథలోకి వెళ్లేముందు, రచయిత గురించి చెప్పుకోవాలి. 'బారతం బొమ్మలు' 'కానగపూల వాన' లాంటి నిరూపమానమైన కథల్ని రాసిన 'కథా మాంత్రికుడు' గోపిని కరుణాకర్ రాసిన తొలి నవల ఇది. నవల సబ్జెక్టుకి అనుగుణంగా కాబోలు, తన పేరుని 'కరణ్ గోపిని' గా మార్చుకున్నారు. కథ చెప్పడంలో గోపినిది ఓ విలక్షణమైన శైలి. తన కథలన్నీ పల్లెటూరి మట్టివాసనల్ని చిమ్ముతూ, జానపద బాణీలో సాగుతాయి. కథాంశాన్ని తాను పూర్తిగా జీర్ణించుకుని, పూర్తిగా తనదైన పద్ధతిలో ప్రతీకాత్మకంగానూ, కొంత మార్మికంగానూ చెప్పడం గోపిని శైలి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ నవల దగ్గరికి వచ్చేసరికి ఆ శైలిని పూర్తిగా విడిచిపెట్టేశారు. కథనంలో బిగి, ప్రకృతిని కథలో భాగం చేయడం లాంటి వాటిని మాత్రం ఎక్కడా విడిచిపెట్టలేదు. 

పీలేరు గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ చదివే జీకే నాయుడికి తన ఖర్చులు తానే సంపాదించుకోవాల్సిన పరిస్థితి. చిన్న చిన్న పనులెన్నో చేసి, చివరికి శ్రీ బాలాజీ టాకీస్ లో బుకింగ్ క్లర్కు గా కుదురుకుంటాడు. రోజూ ఉదయాన్నే కాలేజీ, మధ్యాహ్నం నుంచీ థియేటర్ పని చేస్తూ ఉంటాడు. అదే కాలేజీలో, అతనితోపాటు చదివే అమ్మాయి స్నేహలతా రెడ్డి, పీలేరు టౌన్ లోనే రాజకీయ పలుకుబడి ఉన్న కాంట్రాక్టరు కూతురు. తాపీగా సాగే కథనంలో నాటకీయమైన మలుపుల మధ్య వాళ్ళిద్దరి మధ్యా ప్రేమ పుడుతుంది. క్రమేణా అది పెరిగి పెద్దదవుతుంది. మెజారిటీ ప్రేమకథల్లో లాగే ఇక్కడా వాళ్ళ ప్రేమకి కులమూ, డబ్బూ అడ్డు పడతాయి. వాళ్ళ ప్రేమ చిగిర్చినది మొదలు ఫలించే వరకూ చుట్టూ ఉండే మిత్రులతో పాటు ప్రధానమైన పాత్ర పోషించింది శ్రీ బాలాజీ థియేటర్. 

ఈ ప్రేమకథకి నేపధ్యంగా కాలేజీ, సినిమా థియేటర్ తో పాటుగా సాహిత్యాన్నీ వాడుకున్నారు రచయిత. లైబ్రరీలో నాయకుడు నాయికను చూసినప్పుడు అతని రెండు చేతుల్లోనూ చెరో పుస్తకం ఉంటాయి. వాటి మధ్య నుంచి ఆమెని చూస్తాడు. ఒకటి చలం 'మైదానం' రెండోది విశ్వనాథ 'చెలియలికట్ట'. ఆమెతో ఇంకా ప్రేమలో పడక మునుపే "తప్పక చదువు" అని చెప్పి యద్దనపూడి సులోచనారాణి 'ప్రేమలేఖలు' నవల ఇస్తాడు - ఓ మోసగాడికి ప్రేమలేఖలు రాసి చిక్కుల్లో పడ్డ అమ్మాయి కథ. భిన్న జాతులకి చెందిన వారైన కారణంగా ప్రేమలో ఓడిపోయిన రోమియో-జూలియట్ ల కథ క్లాస్ రూమ్ పాఠంగా వస్తుంది (నవల్లో నాయికా నాయకులిద్దరివీ వేర్వేరు కులాలు). ఇలాంటివన్నీ ఓ పక్క కథని ముందుకు తీసుకెళ్తూనే, పాఠకుల్ని నాస్టాల్జియా లోకి తీసుకెళ్తాయి. సందర్భానికి తగినట్టుగా పుస్తకాలని భలే ఎంచుకున్నారు. 

పుస్తకాల తర్వాత అంత విరివిగా ప్రస్తావించింది సినిమా పాటల్ని. సినిమా థియేటర్ కూడా ఒక పాత్రగా నడిచే కథలో సినిమా పాటల ప్రస్తావన సహజమే కానీ, చాలాచోట్ల పాటల సాహిత్యాన్ని తప్పుగా రాయడమూ, కొన్ని చోట్ల గాయనీ గాయకుల పేర్లు తప్పు పడడమూ (వాణీ జయరాం పాడిన 'మిన్నేటి సూరీడు' ని జానకి ఖాతాలో వేయడం లాంటివి) జరిగాయి. సినిమాలనీ, పాటల్నీ ఇష్టపడే వాళ్ళకి ఇవి పంటికింద రాళ్లు. పీలేరు పరిసర ప్రాంతాలన్నింటినీ కథలో భాగం చేసేయడం బాగుంది కానీ, ఈ క్రమంలో దొర్లిన పునరుక్తుల్ని పరిహరించుకుంటే బాగుండేది. నాయికా నాయకుల ఫ్రెండ్స్, వాళ్ళ లెక్చరరూ అచ్చం యూత్ సినిమాల్లో పాత్రల్లాగే ప్రవర్తిస్తారు. నాయిక కుటుంబాన్ని పరిచయం చేశారు తప్ప, నాయకుడి కుటుంబాన్ని ఎక్కడా ప్రత్యక్షంగా చూపలేదు - తమ్ముడికి, చెల్లికీ ఫీజు కట్టాలి అనే పరోక్ష ప్రస్తావన తప్ప. 

ఇది కేవలం నాయికానాయకుల చుట్టూ తిరిగే కథ కాదు. బలమైన సహాయ పాత్రలున్నాయి. వాటిలో ముఖ్యమైన పాత్ర రసూల్. అతని ప్రేమకథ, చిన్న స్థాయి నుంచి ఎదిగిన వైనం ఇవన్నీ బాగా గుర్తుండిపోతాయి. నాకైతే రసూల్ కథని మెయిన్ ప్లాట్ గానూ, నాయుడి కథ సబ్-ప్లాట్ గానూ నవల రాసి ఉంటే బాగుండేది అనిపించింది. నవల నడక మొత్తం సినిమాలాగే సాగింది. కొన్ని మలుపులు ఊహించగలిగేవి, మరికొన్ని కొత్తగా ఉండి ఆశ్చర్యపరిచేవి. అక్కడక్కడా కొంచం  నాటకీయత, హీరో ని ఎలివేట్ చేసే సన్నివేశాలు. సగానికొచ్చేసరికి నవల కాక, సినిమా స్క్రిప్ట్ చదువుతున్న భావన కలిగింది. ఫిక్షన్ ఇష్టపడే వాళ్ళకి నచ్చేసే నవల ఈ 'శ్రీ బాలాజీ టాకీస్'. పాలపిట్ట ప్రచురించిన ఈ 344 పేజీల పుస్తకం వెల రూ. 250, పుస్తకాల షాపుల్లోనూ, ఆన్లైన్ లోనూ కొనుక్కోవచ్చు. 

మంగళవారం, మార్చి 22, 2022

కన్నీటిచుక్క

శానిటైజర్లో నానిన చేతుల్ని లిక్విడ్ సోపుతో కడుక్కుని, డిస్పెన్సర్ నుంచి అలవాటుగా పేపర్ నాప్కిన్ అందుకుంటూండగా గుర్తొచ్చింది నీటిచుక్క ఆకారంలో ఉండే శ్రీలంక. కాగితం కొరత కారణంగా విద్యార్ధులకి జరగాల్సిన అన్ని పరీక్షలనీ నిరవధికంగా వాయిదా వేసింది గతవారం. బిల్లులు ప్రింటు చేయడానికి కాగితం లేక అక్కడి విద్యుత్ సంస్థలు బిల్లులు పంపిణీ చేయలేదు. ఆ చిన్నదేశాన్ని చుట్టుముట్టిన ఆర్ధికసంక్షోభపు వికృత రూపాన్ని ప్రపంచానికి సులువుగా అర్ధమయ్యేలా చెప్పే ఉదాహరణ ఇది. ఇంతేనా? చమురు, సహజవాయువు ధరలు చుక్కలంటాయి. నిత్యావసరాలని అత్యధిక ధరలు చెల్లించి కొనడానికి జనం సిద్ధపడ్డా తగినంత సరుకు లేదు మార్కెట్లో. ప్రజలు ఆకలితో అలమటిస్తూ ఉండగా, ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య సంస్థలతో చర్చలు ప్రారంభించింది. ఈ చర్చలు ముగిసేదెప్పుడు? జనం ఆకలి కేకలు ఆగేదెప్పుడు? 

సరిగ్గా ఐదేళ్ల క్రితం శ్రీలంకని గురించి ఘనమైన వార్తా కథనాలు వచ్చాయి -  మనదేశంలో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా. అప్పుడు, అంటే 2017 సంవత్సరానికి గాను శ్రీలంక జీడీపీ భారత జీడీపీని మించింది. పరిణామంలో భారత్ లో యాభయ్యో వంతు, కేవలం రెండు కోట్ల పైచిలుకు జనాభాతో - భారత్ తో పోల్చినప్పుడు ఆరొందలో వంతు - ఉన్న చిన్న దేశం, ఇంకా చెప్పాలంటే ఈ దేశంలో ఓ రాష్ట్రం పాటి చేయని దేశం వృద్ధిలో భారత్ ని మించిపోవడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రత్యేక తమిళ దేశంకోసం సుదీర్ఘమైన ఉద్యమం చేసిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీయీ) ని సమర్ధవంతంగా అణచి వేయడం ద్వారా శ్రీలంక ప్రభుత్వం దేశంలో శాంతి భద్రతల్ని పెంపొందించిందనీ, అందువల్లనే అభివృద్ధి సాధ్యపడిందనే విశ్లేషణలు జోరుగా సాగాయి. అయితే ఈ మురిపెం ఎన్నాళ్ళో సాగలేదు. 

సరిగ్గా రెండేళ్ల తర్వాత, 2019 లో ఈస్టర్ పండుగ నాడు ఆ దేశంలో జరిగిన బాంబు పేలుళ్లతో శ్రీలంక మాత్రమే కాదు, మొత్తం ప్రపంచమే ఉలికిపడింది. మొత్తం మూడు చర్చిలు, మూడు హోటళ్ల మీద వరుసగా జరిగిన బాంబు దాడుల్లో ఏకంగా 270 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటివరకూ దేశానికి ప్రధాన వనరుగా ఉన్న పర్యాటకరంగ ప్రగతి మసకబారడం మొదలయ్యింది. నిజానికి ఈస్టర్ బాంబు పేలుళ్ల వల్ల కన్నా తర్వాత జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గోటబాయ రాజపక్స గెలవడం వల్లనే ఎక్కువ నష్టం జరిగిందన్న వాదన ఉంది. ఎన్నికల్లో తన గెలుపు కోసమే బాంబు దాడులు జరిపించారన్న ఆరోపణలనీ గోటబాయ ఎదుర్కొంటున్నారు. రాజపక్స అన్నదమ్ములు నలుగురూ, వాళ్ళ పిల్లలూ శ్రీలంక పాలనలో కీలకమైన పదవుల్లో ఉన్నారు. మొత్తం దేశం బడ్జెట్లో డెబ్బై శాతం నిధులు ఈ కుటుంబం ఆధ్వర్యంలో నడిచే మంత్రిత్వ శాఖల్లోనే ఖర్చవుతాయి!

Google Image

ఈస్టర్ పేలుళ్ల కారణంగా తగ్గడం మొదలైన టూరిజం ఆదాయం, కోవిడ్ వ్యాప్తితో మరింతగా తగ్గి, తాజాగా ఉక్రెయిన్ మీద రష్యా ప్రకటించిన యుద్ధం కారణంగా పూర్తిగా క్షీణించిపోయింది. ఉక్రెయిన్ యుద్ధం నిజానికి ఉక్రెయిన్ తో సమంగా శ్రీలంకకీ నష్టం చేస్తోంది. శ్రీలంకకి వచ్చే పర్యాటకుల్లో అత్యధికులు రష్యా, ఉక్రెయిన్ల నుంచే వస్తారు. శ్రీలంకలో ప్రధానమైన తేయాకు పంటకి అతిపెద్ద మార్కెట్ కూడా ఈ రెండు దేశాలే. అటు పర్యాటకుల్నీ, ఇటు తేయాకు మార్కెట్నీ కోల్పోయింది శ్రీలంక. వీటికి తోడు పాలనా పరమైన లోపాలు సరేసరి. గతేడాది ఉన్నట్టుండి కృత్రిమ ఎరువుల వాడకాన్ని నిషేధించింది శ్రీలంక ప్రభుత్వం. ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం మంచిదే అయినా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నిరసనలకి తలొగ్గి కొంచం ఆలస్యంగా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పంటల దిగుబడి తగ్గి ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. 

ఆదాయం పడిపోవడం ఓపక్క, ఆహార ధాన్యాల కొరత మరోపక్క చుట్టుముట్టినా ప్రభుత్వం వేగంగా స్పందించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. పొరుగు దేశాలు  సహాయం అందించేందుకు సిద్ధపడినా శ్రీలంక ప్రభుత్వం అందుకోడానికి తిరస్కరించడం, ద్రవ్యలోటుకి సంబంధించిన కీలక నిర్ణయాలని వాయిదా వేస్తూ రావడం లాంటి తప్పిదాలు కూడా నేటి శ్రీలంక సంక్షోభానికి కారణాలని చెప్పాలి. నిజానికి అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ ఏదో ఒక సమయంలో ఇలాంటి సంక్షోభాలని ఎదుర్కొన్నవే. నూతన ఆర్ధిక సంస్కరణలని ఆహ్వానించడానికి ముందు భారతదేశ పరిస్థితి కూడా ఇదే. బంగారు నిల్వలు మొత్తం విదేశీ బ్యాంకుల తాకట్టులో ఉండి, ఎక్కడా అప్పు పుట్టని పరిస్థితుల్లో దిగుమతులన్నీ క్లియరెన్స్ లు దొరక్క పోర్టుల్లో పేరుకుపోయిన పరిస్థితిని ఈ దేశమూ అనుభవించింది. పైగా అప్పుడు రాజకీయ అస్థిరత పతాక స్థాయిలో ఉంది కూడా. 

అంతటి సంక్షోభపు అంచుల నుంచి దేశాన్ని బయట పడేసిన నాటి ప్రధాని పీవీ నరసింహారావు ని మళ్ళీ ఓసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇవాళ శ్రీలంక ఐఎంఎఫ్ చేతుల్లోకి వెళ్లిపోతుందేమోనని ప్రపంచం సందేహిస్తున్న వేళ, నాటి సంక్షోభం నుంచి భారత్ గట్టెక్కిన వైనాన్ని గుర్తు చేసుకోవాలి. అంతర్జాతీయ షరతుల్ని గుడ్డిగా ఆమోదించకుండా, పరిమితుల మేరకి మాత్రమే ప్రయివేటు పెట్టుబడుల్ని ఆహ్వానించి దేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టిన నాయకుడిని స్మరించుకోవడం తప్పు కాదు. ప్రస్తుతం శ్రీలంకకి కొరవడింది ఇలాంటి నాయకత్వమే.  కోతిపుండు బ్రహ్మరాక్షసిగా మారినట్టుగా ఆహార ధాన్యాల కొరతతో మొదలైన సమస్య, రికార్డు స్థాయి ఆహార, ఆర్ధిక సంక్షోభం వరకూ పెరిగిపోయినా పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్న గట్టి దాఖలా ఏదీ కనిపించడం లేదు. సంక్షోభం పెరిగే కొద్దీ బేరమాడే శక్తి (బార్గెయినింగ్ పవర్) తగ్గిపోతుందనీ, ద్రవ్య సంస్థలు పెట్టే షరతులన్నింటికీ అంగీకరించాల్సిన పరిస్థితిలోకి వెళ్లిపోతామనీ ఆ దేశపు నేతలకి తట్టకపోవడం దురదృష్టకరం. నీటి చుక్క దేశపు కన్నీరు ఎప్పటికి ఆగేనో... 

సోమవారం, మార్చి 21, 2022

గోరింట పూసింది .. గోరింక కూసింది ..

చిరంజీవికి విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ని, రాత్రికి రాత్రే స్టార్ స్టేటస్ నీ తీసుకొచ్చిన సినిమా ఖైదీ (1983). మాధవి, సుమలత హీరోయిన్లు. చిరంజీవి డాన్సులు, ఫైట్లు, అలాగే చిరంజీవి-మాధవి జోడీకి క్రేజ్ పెరిగిందీ ఈ సినిమా నుంచే. చిరంజీవి-మాధవిల కోసం వేటూరి రాసిన హృద్యమైన యుగళగీతం 'గోరింట పూసింది..  గోరింక కూసింది..' సాహిత్యానికి తగ్గట్టుగా సంగీతం, గానం, చిత్రీకరణ, సినిమాలో ప్లేస్మెంట్.. ఇలా అన్నీ చక్కగా కుదిరిన పాట ఇది. 

లలితగీతంలాగా, భావకవితలాగా అనిపించే సాహిత్యం తర్వాతి కాలంలో చిరంజీవికి చాలా తక్కువ పాటలకే సాధ్య పడింది. 'ఖైదీ' తో ఒక్కసారిగా మాస్ వెల్లువ ఆవహించేసింది కదా మరి.తమ కష్టాలు తీరి, మంచిరోజులు వచ్చాయని, రానున్న రోజులన్నీ తానూ తన ప్రియుడూ సంతోషంగా గడపబోతున్నామనే నాయిక ఊహల నుంచి పుట్టిన డ్రీమ్ సాంగ్ ఇది. 


గోరింట పూసింది.. గోరింక కూసింది
గొడవేమిటే రామ చిలక.. నే తీర్చనా తీపి అలక


అన్నీ మంచి శకునాలు కనిపిస్తున్నాయి కదా, ఇంకా అలకెందుకు? అన్నది అతని ప్రశ్న.

గోరింక వలచింది.. గోరింట పండింది
కోరిందిలే రామచిలక.. నీ ముద్దుల ముక్కుపుడక


నువ్వు నన్ను వలచావు, నా చేతిలో గోరింట పండింది. నేను కోరుతున్నది నీ ముద్దుని అంటోంది ఆమె.

పొగడ పూతేనెల్తో పొదరిల్లు కడిగేసి
రతనాల రంగుల్తో రంగవల్లులు తీర్చి
ఎదలోన పీటేసి ఎదురొచ్చి కూర్చుంటే
సొదలేమిటే రామచిలక .. సొగసిచ్చుకో సిగ్గు పడక

చిలకాగోరింకల కోసం పొదరింటిని ఎంత అందంగా సిద్ధం చేశారో!! పొగడపూల తేనెతో కడిగి, రతనాల రంగులతో ముగ్గులేశారు. నీ ఎదలో పీఠం వేసుకున్నాను, ఎదురుగా వచ్చి కూర్చున్నాను, ఇంకా కబుర్లతో కాలయాపన దేనికి? అన్న అతని ప్రశ్న సహేతుకమే కదా.

విరజాజి రేకుల్తో విరిశయ్య సవరించి
పండు వెన్నెల పిండి పన్నీరు చిలికించి
నిదరంతా మింగేసే నిశి రాత్రి తోడుంటే
కొదవేమిటే గోరువంక..  కడకొంగుతో కట్టుపడక

జాజిపూలతో శయ్య వేసి, పండు వెన్నెలని పిండేసి పన్నీరుగా మార్చి చిలకరించాను. మనతో జాగారం చేయడానికి చిక్కటి రాత్రి సిద్ధంగా ఉండగా, చెంగుముడికి ఇంకా కావాల్సిందేవిటి? అంటోంది ఆమె. ప్రేమికులు మాట్లాడుకునే స్వీట్ నథింగ్స్ ని కూడా అర్ధవంతంగా మలచగలిగే కవి ఉన్నప్పుడు, ప్రేమగీతమంటే కేవలం ట్యూన్ ని నింపే పదాల కూర్పుగా మాత్రమే ఉండదు. అలాగని సమాస భూయిష్టంగా నోరు తిరగని విధంగానూ ఉండదు.

పరాగ్గా వింటే ఇళయరాజా బాణీ అనిపించే ఈ పాటకి చక్రవర్తి స్వరం చేశారు. బాలు-సుశీల పాడారు. కోయిల కూతని గుర్తు చేసే ప్రారంభాన్నీ, మధ్యలో వినిపించే జానపద బాణీ కోరస్ నీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  సాహిత్యానికి తగ్గట్టుగానే తొలి చరణాన్ని పగటి పూట, మలి చరణాన్ని రాత్రి వేళ చిత్రీకరించారు దర్శకుడు కోదండరామి రెడ్డి. చిత్రీకరణలో ఎక్కడా భారీతనం, ఒళ్ళు విరిగే స్టెప్పులు  ఉండవు, కానీ పాటని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. చిరంజీవి-మాధవి హిట్ పెయిర్, అభిమానులకి మోస్ట్-వాంటెడ్ పెయిర్ ఎందుకయ్యారో తెలుసుకోడానికి ఈ పాటొక్కటీ చూస్తే చాలు.

శుక్రవారం, మార్చి 18, 2022

పాదిరిగారి అబ్బాయి, మరికొన్ని కథలు

ఇండస్ మార్టిన్ రాసిన పన్నెండు కథలు, రెండు కవితల సంపుటి 'పాదిరిగారి అబ్బాయి, మరికొన్ని కథలు'. ఎనిమిది కథలు పాదిరిగారి అబ్బాయివి, నాలుగు కథలు వేర్వేరు అంశాలని ఇతివృత్తాలుగా తీసుకుని రాసినవీను. బ్రిటిష్ పాలనతో పాటుగా భారతదేశంలో ప్రవేశించిన మతం క్రైస్తవం. పాఠశాలలు, ఆస్పత్రుల నిర్మాణాలతో మొదలు పెట్టి, అనేక విధాలుగా ఇతర మతాల వారిని తమ మతంలోకి ఆకర్షిస్తూ, నేటికి ప్రతి ఊళ్ళో రెండు మూడు చర్చీలుగా వికసించింది. క్రైస్తవం పుచ్చుకున్న వారి జీవితాలని గురించి అడపాదడపా తెలుగు సాహిత్యంలో ప్రస్తావనలు వచ్చినా, చర్చీల్లో 'ఫాదర్' (పాదరీ)గా పనిచేసిన వాళ్ళని గురించి వివరాలు ఎక్కడా రికార్డు కాలేదనే చెప్పాలి. ఆ లోటుని పూడ్చే కథలివి. క్రైస్తవంలోకి మారిన కుటుంబంలో పుట్టి, బైబిల్ని అభ్యసించి, చర్చి ఫాదర్ గా జీవించిన రెవ. మోజెస్ గంగోలు ఈ కథల్లో పాదిరి గారు. కథకుడు ఇండస్ మార్టిన్, వారి అబ్బాయి. 

భోజనం చేసే ముందు, విస్తట్లోకి అన్నాన్ని అందించిన పరమాత్మకి కృతజ్ఞత చెప్పడం దాదాపు అన్నిమతాల్లోనూ కనిపిస్తుంది, ఒక్కో మతంలోనూ ఒక్కో పధ్ధతిలో. క్రైస్తవులు ప్రార్ధన చేస్తారని తెలుసు కానీ, ఆ ప్రార్ధన ఎలా ఉంటుంది? మరీ ముఖ్యంగా పాదరీ గారింట్లో ప్రార్ధన ఎలా ఉంటుందో చెబుతుంది సంపుటిలో తొలి కథ 'ప్రార్ధన'. ఇండస్ కథన శైలి హాస్యం, వ్యంగ్యాల కలగలుపు అని తొలి కథ చదువుతుండగానే అర్ధమవుతుంది. పిల్లలకి చాదస్తంగా అనిపించే అమ్మ చేసే సుదీర్ఘ ప్రార్ధనతో మొదలుపెట్టి (అది కూడా వేడివేడి అన్నం, ఘుమాయించే కూర గిన్నెలు ముందు కుటుంబం మొత్తాన్ని కూర్చోబెట్టి), అంత గొప్ప పాదరి గారికి ఓ రిక్షా అబ్బి చేతిలో జరిగిన అవమానం గురించి చెప్పడంతో ముగుస్తుంది. 'ఓ మామూలు రిక్షా అతను పాదరీ గారిని అంతమాట అనే సాహసం చేస్తాడా?' అనే ప్రశ్న ఉదయిస్తుంది పాఠకుల్లో. 

జీవహింస గురించి పెద్ద పెద్ద లెక్చర్లిచ్చే మిత్రుడే, ఒకానొక సందర్భంలో ఓ హత్య చేయడానికి కథకుడికి సుపారీ ఆశ చూపడం 'కనికరం' కథాంశం. "నాలో ఒక కిరాయి రౌడీని ఎట్టా చూశాడా?" అన్న కథకుడి ప్రశ్న ఆలోచనలో పడేస్తుంది. అదే  సమయంలో, బ్రాడీపేట నాలుగు బై తొమ్మిదిలో గట్టిగా ఎనిమిది సెంట్ల స్థలంలో కట్టిన పుచ్చిపోయిన చెక్క తలుపు ఇంట్లో ఉండే గుడి పూజారి కొడుకు పిల్లలమఱ్ఱి ప్రసాదు - కారంచేడు నరమేధం జరిగిన 1985లో - ఏకంగా యాభైవేల రూపాయలు  సుపారీగా ఇవ్వచూపడాన్ని జస్టిఫై చేసి ఉంటే బాగుండేది. కారంచేడు నరమేధానికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన ఏసీ కాలేజీ విద్యార్థుల్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్న వైనాన్ని చెప్పే కథ 'నాజీరు'. "మండల్ కమీషనప్పుడు ఆసావుల  పిల్లలు పలగగొట్టిన బొసులూ, రైళ్ళూ, గవుర్నమెంటు   ఆపీసులూ  గుర్తుకొస్తాయి. ఆళ్ళను ఎవుడూ ఏవీ ఎందుకనలేదో తెలీలేదు" అన్నారు కానీ ఇది సత్యదూరం. నాకు తెలిసిన ఇద్దరు (ఒకరు బ్రాహ్మణ, మరొకరు వైశ్య) యాంటీ-మండల్ కేసుల కారణంగానే కెరీర్ కోల్పోయారు. తెలియని వాళ్ళు ఇంకా ఎందరో. 

నపుంసకుడైన నాంచారయ్య ప్రభువు ఆదరణకి పాత్రుడవుతాడా? అనే ప్రశ్నకి జవాబు 'పరలోకరాజ్జం' కథ చెబుతుంది. బైబిలుని అరకొరగా చదివి తీర్పులు చెప్పడం తప్పనీ, పూర్తిగా చదివి అర్ధం చేసుకోవాలనే సందేశం ఇచ్చే కథ ఇది. ఈ సందేశం అన్ని మత గ్రంధాలనికీ వర్తిస్తుంది నిజానికి. సరదాగా సాగుతూనే గుర్తుండిపోయే కథ 'మంత్రగత్తె'. 'పాదరిగారి అబ్బాయి' అనే హోదాని మోయడం వెనుక బరువుని చెబుతుంది. విజ్ఞాన వేదికల వారు సైతం వివరంగా మాట్లాడ్డానికి  మొహమాట పడే స్వస్థత కూటములు, ప్రార్ధనలని గురించి ఉన్నదున్నట్టుగా చెప్పిన కథ 'జరుగుబాటు'. ఈ ప్రార్ధనల కారణంగా క్రైస్తవులు కొత్త క్రైస్తవం వైపు ఆకర్షితులు కావడం, పాత పాదరీల జరుగుబాటు ప్రశ్నార్ధకం కావడాన్ని చర్చిస్తుందీ కథ. క్రైస్తవ యువజనుల జీవితాన్ని నిశితంగా చిత్రించిన పెద్ద కథ 'తెర చినిగెను'. "అప్పటివరకూ సోదరుల్లా కలిసి ఉన్న మాల-మాదిగల మధ్య రిజర్వేషన్ ఉద్యమం చిచ్చు పెట్టింది" అని వి. చంద్రశేఖరరావు రాశారు కానీ, ఆ రెండు వర్గాల మధ్య విభేదాలు మధ్యలో వచ్చినవి కావనీ, తొలినుంచీ ఉన్నవేననీ చెప్పే కథ ఇది. 

మాండలీకంలో రాస్తే బూతులు ఉండాల్సిందే అనే అలిఖిత నియమం ఒకటి ఇటీవలి సాహిత్యంలో కనిపిస్తోంది. ఈ సంకలనమూ ఇందుకు మినహాయింపు కాదు. పాదిరిగారి అబ్బాయిగా రాసిన ఎనిమిది కథల్లోనూ బూతు జోలికి వెళ్లని ఇండస్ మార్టిన్, తర్వాతి నాలుగు కథల్లోనూ ఆ దినుసుని విస్తారంగా వాడేశారు. మాలపల్లిలో పుట్టిన బట్టలకుక్క కథ 'గత్యంతరం' ప్రతీకాత్మకంగా రాసిన కథ. పులస చేపల మీద సెటైర్ వేసేందుకు చేసిన ప్రయత్నం 'పులసోపాఖ్యానం'. రాజు గారింట్లో పుట్టి పెరిగే కోడిపుంజు కథ 'మగత' ని కోడిపందేల మీద సెటైర్ అనుకుంటూ చదవడం మొదలుపెట్టాను కానీ, కోడి తొక్కిన చల్ల మిరపకాయల్ని - కథలోకి అదాటున ప్రవేశించిన - ఓ బ్రాహ్మలావిడ పెంటమీద పారబోయడం దగ్గరికి వచ్చాకా ఓ సారి వెనక్కి వెళ్లి మళ్ళీ మొదటి నుంచీ ప్రతీకల్ని గమనిస్తూ చదివాను. ఆత్మగౌరవాన్ని గురించి చెప్పే కథ 'కరేపాకు'. అప్పటి వరకూ జరిగిన ట్యూనింగ్ వల్లకాబోలు, రాఘవ శర్మ అనే పాత్ర కనిపించగానే విలన్ అనేసుకున్నాను కానీ, కాదు. 

మొత్తం 162 పేజీల పుస్తకంలో 48వ పేజీ నుంచి కథలు మొదలవుతాయి. కథల పూర్వరంగం చెప్పడంతో పాటు, కథల్ని పరామర్శిస్తూ విపులమైన ముందుమాటలు రాశారు సత్యరంజన్ కోడూరు, ఏకే ప్రభాకర్. రచయిత కూడా ఆంధ్రలో క్రైస్తవం విస్తరణ మొదలు, ఫాదరీల కుటుంబాలు వాళ్ళ జీవన విధానం లాంటి అనేక విషయాలతో 'ఇంత పర్యంతం' పేరుతో 27 పేజీల ముందుమాట రాశారు. క్రైస్తవ సాహిత్యానికి, తెలుగు సాహిత్య చరిత్రలో చోటు దక్కలేదన్న రచయిత, తన కథలు జరిగిన కాలానికి, అదే ప్రాంతానికి, నేపధ్యానికి చెందిన కళాకారుడు చీమకుర్తి నాగేశ్వరరావుని గురించి ఈ కథల్లో ఎక్కడా కనీస ప్రస్తావన కూడా చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. తెలుగు సమాజంలో ఓ భాగంగానే ఉంటూ, తమదైన జీవన విధానాన్ని అవలంబించిన చర్చి ఫాదర్ల జీవితాలని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. (పర్స్ పెక్టివ్స్ ప్రచురణ, వెల రూ. 160, పుస్తకాల షాపుల్లోనూ, ఆన్లైన్ లోనూ కొనుక్కోవచ్చు). 

బుధవారం, మార్చి 16, 2022

సద్గతి

'పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు ఏవీ కట్టుకుని పోము' లాంటి తత్వాలు పాడుకోడానికి, వినడానికి బాగుంటాయి కానీ ఆచరణలో అన్నివేళలా సాధ్యం కాదు. పుట్టుక దగ్గర ఎలా ఉన్నా,  మరీ ముఖ్యంగా చావు దగ్గర. ఓ మనిషిని అతను జీవించి ఉన్న రోజుల్లో చుట్టూవున్న నలుగురూ దాదాపు ఒకే దృష్టితో చూడొచ్చు, కానీ ఆ మనిషి తనువు చాలించిన వెంటనే ఆ నలుగురే ఒక్కొక్కరూ ఒక్కోలా చూస్తారు. బతికుండగా అవసరం పడని చాలా విషయాలు, పోయాక అత్యవసరం అవుతాయి. మృత్యువు సమవర్తే కానీ, పాంచ భౌతిక దేహాన్ని ప్రకృతిలో కలపడానికి మాత్రం అనేక పద్ధతులు, అవి కూడా మనిషి పుట్టిన నేపధ్యాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. ఈ విషయాలన్నీ ఓ కథలో ఇమిడ్చి, ఆద్యంతమూ ఆపకుండా చదివించేలాంటి ఆసక్తికరమైన కథ రాశారు మధురాంతకం నరేంద్ర. ఆ కథ పేరు 'సద్గతి'. 

సైకిలు మీద ఇంటింటికీ తిరిగి తనకి తెలిసిన వైద్యం చేసే సంచికట్టు వైద్యుడు 'బహదూర్ సారు' తన పేషేంట్లలో ఒకరైన రాఘవరెడ్డి ఇంటి అరుగు మీద పడక్కుర్చీలో కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఒరిగిపోయాడు. అయన ప్రాణం పోయిందని నమ్మడానికి రెడ్డి ఇంట్లో వాళ్ళకి సమయం పట్టింది. బహదూర్ ఇక లేకపోవడం నిజమే అని అర్ధమయ్యాక ఆయన తాలూకు వాళ్ళ కోసం వెతుకులాట మొదలయ్యింది. ఇరవయ్యేళ్లుగా బహదూర్ ఏ ఇంట్లో అయితే అద్దెకున్నాడో, ఆ ఇంటి ఓనరే బహదూర్ ఊరు ఫలానా అని చెప్పలేకపోయాడు. బహదూర్ ఎప్పుడూ ఎక్కడికీ వెళ్ళలేదు, అతనికోసం బంధు మిత్రులెవరూ ఇంటికి రాలేదు. అంత్యక్రియలు చేయడానికి రాఘవరెడ్డి ముందుకొచ్చాడు. తన బిడ్డకి వైద్యం చేసి బతికించడమే కాకుండా, అపర ధన్వంతరిలా తన ఇంటిల్లిపాదికీ మందులిచ్చి కాపాడిన బహదూర్ కి అంత్యక్రియలు చేయడం తన అదృష్టం అంటాడు. తాను చేస్తున్న కార్యాన్ని గురించి బంధువులందరికీ కూడా తెలియాలి కాబట్టి, వాళ్ళకీ వార్త చెప్పమని కొడుక్కి పురమాయించాడు. 

శవాన్ని దహనం చేయాలా, పూడ్చిపెట్టాలా లాంటి సంశయాలన్నీ దాటి ఇహనో ఇప్పుడో బహదూర్ అంతిమ యాత్ర ప్రారంభం అవుతుందనగా టౌన్ నుంచి ఓ వ్యక్తి దిగి,  ప్రతి రంజాన్ కి, బక్రీదుకి  బహదూర్ మసీదుకి వచ్చేవాడనీ, అతను ముస్లిం అనడానికి అంతకన్నా ఆధారం ఏం కావాలని ప్రశ్నిస్తాడు. ఊళ్ళో సాయిబులంతా బహదూర్ శవాన్ని తమ వాడకి తీసుకెళ్లిపోతారు. ముస్లిం పద్ధతిలో ఖననానికి ఏర్పాట్లు మొదలవుతాయి. తన భార్యకి పెద్ద జబ్బు చేసినప్పుడు మందిచ్చి బాగుచేసిన బహదూర్ అంతిమయాత్ర తన ఆధ్వర్యంలోనే జరగాలని పట్టుబడతాడు పాచ్చా సాయిబు. రాఘవరెడ్డి ఇంటి ముందు టెంటు  బిగించిన మదీనా సప్లయర్స్ కుర్రాళ్ళు, శవం వెనుకే టెంటుని తీసుకుని సాయిబు ఇంటి ముందు బిగిస్తారు. పనుల మీద పక్కూర్లకి వెళ్లిన సాయిబులకి కబుర్లు పంపడం, గంధం తీయడం, వేడినీళ్లు కాచడం పనులన్నీ ఆఘమేఘాల మీద జరుగుతూ ఉంటాయి. బహదూర్ అంత్యక్రియలు చేసే అవకాశం తనకి తప్పిపోయినందుకు బాధపడుతూ, జరుగుతున్న తతంగాన్ని గమనిస్తూ ఉంటాడు రాఘవరెడ్డి.

బహదూర్ పూర్తి పేరు బహదూర్ జాన్ అనీ, చాన్నాళ్లుగా తమ చర్చికి చందా కడుతున్నాడనీ క్రైస్తవులకి తెలుస్తుంది. చర్చి పాస్టర్ కూడా అయినా రైల్వే స్టేషన్ మాస్టరు జాన్ పాల్ హుటాహుటిన శవాన్ని తన ఇంటికి తీసుకుపోయి, శవపేటిక కోసం ఆర్దరిస్తాడు. బహదూర్ సార్ లాంటి పయస్ క్రిస్టియన్ శవాన్ని బరీ చేయడం తన అదృష్టంగా భావిస్తాడు, శవం వెనుకే మదీనా సప్లయర్స్ వారి టెంటు స్టేషన్ మాస్టర్ ఇంటికి చేరుతుంది. తమ మనుషులతో రాఘవరెడ్డి, పాచ్చా సాయిబూ కూడా అక్కడికి చేరుకుంటారు. కొత్తగా పాన్ బ్రోకర్ వ్యాపారం మొదలుపెట్టిన పొరుగు రాష్ట్రపు వ్యాపారికి బహదూర్ పూర్తి పేరు 'బహదూర్ జైన్' ఏమో అని సందేహం వస్తుంది. వడ్రంగం పనిలో తనకెన్నో మెళకువలు చెప్పాడని, ఆయన వడ్రంగే అయి ఉండొచ్చని అంటాడు ఊరి వడ్రంగి. దళిత వాడలో ఏ పెళ్లి  జరిగినా తప్పక హాజరయ్యే బహదూర్ తమ వాడేమోనని అక్కడివాళ్లు అనుకుంటారు. అతడు ఏ మతాన్ని అవలంబించాడు అనే విషయంలో ఎవరికీ స్పష్టత లేదు. జాన్ పాల్ జబర్దస్తీ చేసి క్రైస్తవ పద్ధతిలో ఖననం చేసేస్తున్నాడని భావిస్తారు అందరూ. ఇంతకీ బహదూర్ అంత్యక్రియలు ఎలా జరిగాయన్నదే 'సద్గతి' కథ ముగింపు. 

కథా రచనలో నరేంద్రది అందెవేసిన చేయి. పైగా కథా స్థలం చిత్తూరు జిల్లాలో బస్తీ వాసనలు సంతరించుకుంటున్న పల్లెటూరు. తమ పెత్తనం చెల్లాలని భావించే మణెగారు, రాఘవరెడ్డి లాంటి మనుషులతో పాటు, మారిన కాలానికి అనుగుణంగా ఆధునికత సంతరించుకున్న పాత్రలూ కనిపిస్తాయి. వాళ్లందరికీ బహదూర్ పట్ల చాలా గౌరవం ఉంది. అయితే, శవానికి అంతిమ సంస్కారం జరపడం ద్వారా తమ చిన్న చిన్న ప్రయోజనాలని నెరవేర్చుకోవాలనే తాపత్రయమూ ఉంది. మనుషుల్లో ఈ తాపత్రయమే లేకపోతే అనాధ ప్రేత సంస్కారం అనేది ఓ పెద్ద విషయం అయి ఉండేది కాదు. చుట్టూ ఉండే వాళ్ళ భిన్నమనస్తత్వాలతో పాటు, కథా ప్రారంభంలోనే శవంగా మారిపోయిన బహదూర్ పాత్ర చిత్రణ ఈ కథని ప్రత్యేకంగా నిలిపింది. అతడు వైద్య విద్య అభ్యసించిన వాడు కాదు. తనకి తెలిసిన మందుల్ని ఊరూరా తిరుగుతూ అవసరమైన వాళ్ళకి ఇచ్చి వైద్యం చేసేవాడు. 'హస్తవాసి' ని నమ్మే కాలం కావడంతో జనానికి అతనిమీద గురి కుదిరింది. ఎందరు పెద్ద డాక్టర్లు బోర్డులు కట్టినా, రాఘవరెడ్డి లాంటి వాళ్లకి వైద్యుడంటే బహదూరే. ఉత్కంఠభరితంగా సాగే కథకి రచయిత ఇచ్చిన హృద్యమైన ముగింపు పాఠకులు బహదూర్ ని మర్చిపోకుండా చేస్తుంది. 'వెదురుపువ్వు' కథా సంకలనంలో ఉందీ కథ.

సోమవారం, మార్చి 14, 2022

చెయ్యిస్తుందా?

స్వాతంత్రం వచ్చిన పదేళ్లలోపే భారతదేశం ఎదుర్కొన్న మొదటి సమస్య ఆహార సంక్షోభం. అప్పటి అమెరికా ప్రభుత్వం సాయానికి ముందుకొచ్చింది. ఆహారధాన్యాలు ఎగుమతి చేయడం మొదలు పెట్టింది, 'పీఎల్ 480' లో భాగంగా. తిండిగింజలతో పాటే ఓ కలుపు మొక్క దేశంలోకి ప్రవేశించింది. దానిపేరు 'పార్తీనియం'. ఈ మొక్క త్వరగా విస్తరించడమే కాదు, నివారణకి లొంగదు. ఈ మొక్క పుప్పొడి కారణంగా మనుషులకీ, పశువులకీ కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి. భూసారాన్ని పీల్చుకోడానికి, పరిసరాలని కలుషితం చేయడానికి పెట్టింది పేరు. పొలంగట్ల మీద, తోటల్లోనూ ఇష్టారాజ్యంగా పెరిగే ఈ మొక్కల్ని పీకడానికి ఇప్పటికీ రైతులు ఏటా పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతున్నారు. ఈ మొక్క మన దేశానికి రావడం వెనుక అమెరికా కుట్ర ఉన్నదని ఓ ప్రచారం ఉంది. తెలుగులో 'వయ్యారిభామ' అనే అందమైన పేరుకూడా ఉన్న ఈ మొక్కని వాడుకలో 'కాంగ్రెస్ గడ్డి' అంటారు రైతాంగం. కాంగ్రెస్ కాలంలో దేశంలోకి వచ్చింది కదా మరి.

మా ఊరి కాంగ్రెస్ అరుగు (రచ్చబండ పేరు) దగ్గర రోజూ చేరి కష్టసుఖాలు మాట్లాడుకునే రైతుల మాటల్లో ఈ 'కాంగ్రెస్ గడ్డి' ప్రస్తావన తప్పక వచ్చేది. యేవో కారణాలకి ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్నవాళ్ళు "ఈ కాంగ్రెస్సూ, కాంగ్రెస్ గడ్డీ ఎప్పటికీ మనకి తప్పవు" అనేవాళ్ళు. ఈ మాట బాగా గుర్తుండిపోయింది. గత వారం ఉత్తర ప్రదేశ్ తో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రావడం, ఐదుచోట్లా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవ్వడం, 'ఇక కాంగ్రెస్ పని అయిపోయింది' అంటూ మీడియా అంతా కోడై కూస్తున్న సందర్భంలో మా ఊరి రైతుల మాట మళ్ళీ గుర్తొచ్చింది. దేశానికి స్వాతంత్య్రం తెచ్చి, అరవయ్యేళ్లు చక్రం తిప్పిన పార్టీ ఇప్పుడిలా చతికిలపడడం ఆశ్చర్యాన్ని కలిగించడం కన్నా ఎక్కువగా ఆలోచనల్లో పడేస్తోంది. ఎందుకంటే, జాతీయ స్థాయిలో ఓ బలమైన ప్రత్యామ్నాయం ఉండాల్సిన అవసరం ఎప్పుడూ లాగే ఇప్పుడూ ఉంది. సొంత ఇమేజి, బలమైన సంస్థాగత నిర్మాణం, ఇప్పటికీ తనదైన ఓటు బ్యాంకూ ఉన్న సీనియర్ మోస్ట్ రాజకీయ పార్టీ, బొత్తిగా ఉనికిని చాటుకోలేని పరిస్థితుల్లో పడిపోవడం తాలూకు ప్రభావం రానున్న రోజుల్లో దేశం మీద ఏమేరకు ఉండబోతోందోనని ఓ ఆలోచన.

వయసైపోయిన మామిడి చెట్టుకి బదనికలు రావడం, పూల చెట్లకి రానురానూ గుంటపూలు పూయడం అసహజమైన విషయాలేవీ కాదు. కానైతే, యజమాని వాటినలా చూస్తూ ఉండిపోకుండా చేతనైన చికిత్సలు చేసో, చేయించో మళ్ళీ పూతా, కాపూ వచ్చేలా చేస్తాడు. ఇక్కడ కాంగ్రెస్ అనే రాజకీయ పార్టీ/మహాసంస్థ యాజమాన్యం ఘనత వహించిన గాంధీ కుటుంబం చేతిలో ఉంది. వారసత్వంగా వచ్చిన కుటుంబ ఆస్తిని రక్షించుకుందామనే ధోరణి ఆ కుటుంబానికి ఉందో లేదో తెలియడం లేదు. ప్రధాని పదవిని తృణప్రాయంగా తిరస్కరించిన 'త్యాగమూర్తి' సోనియా గాంధీ నాయకత్వంలో పార్టీ రెండు ఎన్నికలు గెలిచి పదేళ్ల పాటు దేశాన్ని పాలించింది. యేవో స్కాములూ అవీ వెలుగు చూశాయంటే, రాజకీయాల్లో అవన్నీ మామూలే. ఆ పార్టీ ఉక్కు మహిళ ఇందిరా గాంధీనే 'కరప్షన్ ఈజ్ గ్లోబల్ ఫినామినా' అని ప్రకటించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. వయోభారం, అనారోగ్యం తదితర కారణాలతో సోనియా పార్టీ పగ్గాలని ఒదులు చేశాక, వాటిని అందుకోవాల్సిన యువకిశోరం రాహుల్ గాంధీ అందుకు అంతగా సముఖత చూపకపోవడంతో సంక్షోభం మొదలైంది.

Google Image

తాతలు, తండ్రులు చక్రాలు తిప్పిన చోట వారసులు బొంగరాలు తిప్పడం ఒక్క కాంగ్రెస్ పార్టీకే పరిమితమైన సమస్య కాదు. కుటుంబ పార్టీలుగా ముద్ర పడ్డ చాలా ప్రాంతీయ పార్టీలకీ ఈ సమస్య ఉంది. యువరాజుల్ని పట్టాభిషేకానికి సిద్ధం చేయకపోవడం, వాళ్ళు సిద్ధ పడిపోతే తమ కాళ్ళ కిందకి నీళ్లొస్తాయేమో అని పెద్ద తరం కాస్త వెనుకముందాడడం, సదరు వారసులకి రాజకీయాలకన్నా ఇతరేతర విషయాల మీద ఆసక్తి మెండుగా ఉండడం లాంటి కారణాల వల్ల చాలా రాష్ట్రాల్లో యువతరం పార్టీ పగ్గాలు పూర్తిగా అందుకోలేదు. పగ్గాలు అందుకున్న వాళ్ళు కూడా స్వతంత్రంగా కాకుండా సవాలక్ష ఆంక్షల మధ్య పనిచేయాల్సి రావడం, ఈ కారణంగా పార్టీ మీద పెట్టాల్సినంత దృష్టి పెట్టకపోవడం జరిగాయి. రాహుల్ కూడా ఇందుకు మినహాయింపు కాదనీ, కొత్త ఆలోచనలతోనే వచ్చినా, ఊహించని కట్టడుల కారణంగా పార్టీ వ్యవహారాల మీద అతనికి శ్రద్ధ తగ్గిపోయిందనీ కొందరు కాంగ్రెస్ కురు వృద్ధులు ప్రచారం చేస్తున్నారు. లోగుట్టు పెరుమాళ్ళకెరుక.

కాంగ్రెస్ పార్టీకున్న ప్రధానమైన సమస్య వృద్ధ నాయకత్వం. దశాబ్దాల తరబడి పార్టీలో విశ్వాసపాత్రులుగా కొనసాగుతున్న వాళ్ళని పొమ్మనలేరు, పక్కన పెట్టలేరు. వాళ్ళు సలహాలు ఇవ్వక మానరు. ఈ కాలానికి అవి ఎంతవరకూ పనికొస్తాయన్న ప్రశ్న ఒకటైతే, పరస్పర విరుద్ధమైన సలహాలిచ్చే గ్రూపులు మరో సమస్య. ఈ గ్రూపులు పార్టీ సంస్కృతిలో భాగమైపోయాయి. తన అవసరాల కోసం ఒకప్పడు పార్టీ అధినాయకత్వమే వీటిని పెంచి పోషించింది. ఇప్పుడు తుంచలేదు. ఈ నాయకులు, గ్రూపుల బాధ పడలేక, పార్టీలో ఇమడలేక, సొంత వ్యక్తిత్వం, ఆత్మ విశ్వాసం ఉన్న నాయకులు ఇతర పార్టీలకి మళ్లిపోయారు. 'పోయింది పొల్లు' అనుకోడానికి లేకుండా, అలా వెళ్లిన వాళ్లలో చాలామంది ఇవాళ ప్రముఖ రాజకీయ నాయకులుగా పరిణమించారు.  పార్టీలో విపరీతంగా పెరిగిపోయిన 'అంతర్గత ప్రజాస్వామ్యం' కారణంగా మిగిలిన నాయకుల్లో కూడా సయోధ్య లేదు. ఎందుకో అందుకు పార్టీని వీధిన పెడుతూనే ఉన్నారు. పార్టీ వీళ్ళని భరించలేదు, పొగబెట్టి పొమ్మననూ లేదు. అనేకానేక ఆత్మహత్యా సదృశ నిర్ణయాల తర్వాత, ఇవాళ అంపశయ్య మీదకి చేరే పరిస్థితిని చేతులారా తెచ్చుకుంది.

కాంగ్రెస్ పార్టీ పుట్టి మునిగితే దేశానికి వచ్చిన నష్టం ఏమిటి? 'కత్తికి ఎదురు లేకపోవడం' అన్నది రాచరికంలో చెల్లుతుంది కానీ, ప్రజాస్వామ్యంలో కాదు. ప్రతిపక్షం లేని చోట ప్రజాస్వామ్యానికి, రాజరికానికీ తేడా ఉండబోదు. 'చెక్స్ అండ్ బేలన్సెస్' ని పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదే. ఏకపార్టీ స్వామ్యం ఇష్టారాజ్యం కాకుండా చూడడం కోసం ప్రతిపక్షం ఉండాలి. ఓ జాతీయ పార్టీ కళ్ళముందే అంతరించిపోతున్నప్పుడు చర్చ జరగాల్సింది ప్రత్యామ్నాయాన్ని గురించి. ఒకప్పుడు విఫలమైన 'ఫ్రంట్' ప్రయోగం మళ్ళీ జరిగే అవకాశం ఉన్నా, అనేక చీలిక పీలిక పార్టీలని ఏకతాటిపై తెచ్చే నాయకులెవరన్న ప్రశ్న వస్తోంది. సంస్థాగత సమస్యల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల నాయకులెవరైనా జాతీయ నేతలుగా ఆవిర్భవిస్తారా? ఎవరంతటి వారు వారైన మిగిలిన నేతలు ఈ నాయకత్వాన్ని అంగీకరిస్తారా? అన్నీ ప్రశ్నలే కనిపిస్తున్నాయి. 'సమోసాలో ఆలూ ఉన్నంత వరకూ బీహార్ రాజకీయాల్లో లాలూ ఉంటాడు' అన్నది లాలూ ప్రసాద్ యాదవ్ ప్రచారంలో పెట్టిన స్లోగన్. ఇప్పుడా నాయకుడు లైంలైట్ లో లేడు. సమోసా స్టఫింగ్ లోనూ  చాలా మార్పులు  వచ్చేశాయి. ఎక్కడో తప్ప ఆలూ సమోసా కనిపించడం లేదు. ఇంతకీ, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అంతరించిపోతే మన రైతుల 'కాంగ్రెస్  గడ్డి' సమస్య పరిష్కారమవుతుందా??

శుక్రవారం, మార్చి 11, 2022

వేయిపడగలు

"వేయిపడగల పాము విప్పారుకొని వచ్చి
కాటందుకున్నది కలలోన రాజును..."

...ఈ పాము పడగ విప్పింది విజయవాడకి కాస్త దూరాన ఉన్న సుబ్బన్నపేట అనే (కల్పిత) గ్రామంలో. ఆ గ్రామం పుట్టుక మొదలు తర్వాతి రెండు శతాబ్దాల కాలపు చరిత్రకి అక్షర రూపం  'కవిసమ్రాట్' విశ్వనాథ సత్యనారాయణ బృహన్నవల 'వేయిపడగలు'. మొదటి నూట ఎనభయ్యేళ్ళ కథని క్లుప్తంగానూ, తర్వాత జరిగిన సంఘటనలన్నీ సవిస్తారంగానూ చెప్పే నవల ఇది. ఎవరి ఇష్టాయిష్టాలతోనూ సంబంధం లేకుండా కాలంతో పాటు అనివార్యంగా వచ్చి పడేది 'మార్పు'. ఈ మార్పుని మొదట ఎవరూ ఆహ్వానించరు, రానురానూ కొందరు అలవాటు పడతారు, మరికొందరు సర్దుకుపోతారు, చాలా కొద్దిమంది మాత్రం మార్పుని అంగీకరించలేక, అలాగని ఆపనూలేక నలిగిపోతారు. గత కాలాన్ని బెంగగా నెమరు వేసుకుంటూ ఉంటారు.  ధర్మారావు ఈ కొద్దిమంది కోవలోకీ వచ్చే మనిషి. ఇతడే 'వేయిపడగలు' నవలలో కథానాయకుడు, “నేనును బ్రవాహ గామినే గాని యెదురీదెడి వాడను గాను. యెదురీదియు బ్రవాహము వెంట పోవుచుంటిని" అని చెప్పుకున్నవాడూను.

ధర్మారావు గురించి చెప్పుకోవాలంటే ముందుగా సుబ్బన్నపేటని గురించి తెలుసుకోవాలి. కథా ప్రారంభానికి రెండు వందల ఏళ్ల క్రితం నిర్మితమైన సుబ్బన్నపేటకి  పద్మావతీ శ్రీనివాసుల పరిణయ గాధ లాంటి కథ ఉంది. అడవిలాంటి ఆ ప్రాంతంలో అక్కడక్కడా కొన్ని గుడిసెలు. అక్కడ నివాసముండే ఓ కాపు కి 'కపిల' అనే ఆవు ఉంది. ఆ ఆవు పాలతో ఆ కుటుంబం చల్లగా గడిచిపోతోంది. ఉన్నట్టుండి కపిల పాలివ్వడం మానేసింది. కారణం అన్వేషించడానికి బయల్దేరిన కాపుకి, సాయంత్రం వేళ కపిల ఓ పుట్ట లో పాలధార కురిపించడం, ఓ పాము తన శిరస్సులతో ఆ పాలు తాగడం కంట పడుతుంది. ఆ రాత్రే కలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనిపించి తనకి గుడి కట్టించమంటాడు. చుట్టు గుడిసె, కపిల మినహా మరో ఆస్తి లేని పేద కాపు ఆలయం ఎలా నిర్మించగలడు? స్వామి మీదే భారం వేశాడతను.

స్వామి లీలలు చుట్టుపక్కల ప్రచారమవ్వడంతో వాస్తు పండితుడైన ఓ బ్రాహ్మణ జ్యోతిష్య వేత్త అక్కడికి తన నివాసం మార్చుకుని, చిరకాల కోరిక తీరి సంతానవంతుడవుతాడు. ఆ జ్యోతిష్య వేత్తని వెతుక్కుంటూ ఒక వ్యక్తి వస్తాడు. అతను టిప్పు సుల్తాను దండయాత్రకి బళ్ళు తోలిన వ్యక్తి. తనకి కూలీగా ఇచ్చిన ఓ ఇంట్లో విలువైన నగలు దొరకడంతో రాత్రికి రాత్రే ఐశ్వర్యవంతుడై, ఓ కోట కట్టుకోవాలని సంకల్పిస్తాడు. జ్యోతిష్యవేత్త, సుబ్రహ్మణ్య స్వామికి గుడి కట్టించి, పక్కనే కోట కట్టుకోమని, 'సుబ్బన్న పేట' అని పేరు పెట్టమనీ, ఆ ఊరు రెండు వందల ఏళ్ళు సుభిక్షంగా ఉంటుందనీ భవిష్యత్తు చెబుతాడు. కోటకట్టిన వెలమ ప్రభువవుతాడు, జ్యోతిష్యుడు దివాను అవుతాడు. కాపు ఇంటి ఆడబిడ్డ గణాచారి అవుతుంది. ప్రతి తరంలోనూ ఆ యింట తొలిచూలు ఆడపిల్లే పుడుతుంది, ఆమె వివాహం చేసుకోకుండా స్వామి సేవలో గణాచారిగానే జీవితం గడుపుతుంది. ఇది అనూచానంగా ధర్మారావు తండ్రి రామేశ్వర శాస్త్రి తరం వరకూ కొనసాగుతుంది.

రామేశ్వర శాస్త్రిది ఓ చిత్రమైన కథ. ఆయన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర స్త్రీలని ఒక్కొక్కరి చొప్పున వివాహమాడడమే కాకుండా, రత్నగిరి అనే భోగాంగనని తన ఒద్దికలో ఉంచాడు. బ్రాహ్మణ స్త్రీ వల్ల కలిగిన ధర్మారావు, శాస్త్రి వారసుడిగా కొనసాగగా, మిగిలిన స్త్రీల సంతానం తమ తల్లులకి వారసులుగా కొనసాగి, ఆయా కులాల జీవన విధానాలని అనుసరిస్తారు. (అన్నీ శాస్త్రీయ వివాహాలే, అయినా ఈ మెలిక ఎందుకన్నది ఎక్కడా చెప్పలేదు). రత్నగిరికి పుట్టిన 'గిరిక' కి అన్న ధర్మారావు అంటే ప్రాణం. (అసలు నవల్లో నాలుగైదు మినహా మిగిలిన అన్ని పాత్రలకీ ధర్మారావంటే ప్రాణంతో పాటు భయమూ, భక్తీ కూడా).  రామేశ్వర శాస్త్రి దివానుగా ఉండగా ప్రభువు కృష్ణమనాయుడు. అతని కొడుకు రంగారావు పూర్తిగా ఆధునిక పద్ధతులకి ఆకర్షితుడవుతాడు. పూర్వాచారాలతో పాటు, ధర్మారావు పట్లా రంగారావుకి విముఖతే.

రామేశ్వర శాస్త్రి అకాల మరణం నాటికి వాళ్ళ ఆస్తి అంతా కరారావుడు చుట్టేయడంతో, ధర్మారావుకి చదువు ఆపేయాల్సిన పరిస్థితి వస్తుంది. మొదట కృష్ణమనాయుడు, తర్వాత ఆయన భార్య రుక్మిణమ్మారావు, అటుపైని స్నేహితుడు సూర్యపతి సహాయం చేయడంతో బీఏ పూర్తిచేస్తాడు. నిజానికి ధర్మారావు చదువులలోని సారమెల్ల చదివిన వాడు. అతనికి తెలియని విషయం లేకపోవడమే కాదు, ప్రతి విషయంలోనూ స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటాడు కూడా. కించిదావేశంతో కూడిన అతడి వాగ్ధాటి శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. చిన్ననాడే  అతడు పెళ్లాడిన మేనమామ కూతురు అరుంధతి వ్యక్తురాలై, కాపురానికి వచ్చేనాటికి ధర్మారావుకి ఊళ్ళో ఇల్లు మాత్రం మిగులుతుంది. సుబ్బన్నపేటలో  ఏర్పాటు చేసిన కళాశాలలో కొన్నాళ్ళు ఉద్యోగం చేసినా, అక్కడి వారితో అభిప్రాయ భేదాలు రావడంతో విరమించుకుంటాడు. 

తాతతండ్రుల్లాగా కులవిద్య కాకుండా తను బీఏ చదివినా, వాళ్లలాగే దివాన్ గిరీ చేయాలన్నది ధర్మారావు అంతరంగం. అది వేయిపడగల సుబ్రహ్మణ్య స్వామి తనయందుంచిన బాధ్యతగా భావిస్తాడు. జమిందారుగా పట్టాభిషిక్తుడైన రంగారావు, తన అంతరంగికుణ్ణి దివానుగా నియమించుకున్నా, జమిందారుకి, తనకీ మధ్య వైమనస్యం పెరుగుతూనే ఉన్నా, ఇంటి ఆర్ధిక పరిస్థితి నానాటికీ క్షీణిస్తున్నా, జీవిక కోసం మరో పని చేసేందుకు ధర్మారావు ప్రయత్నం చేయడు. దేశంలో స్వాతంత్రోద్యమం ఉధృతంగా సాగుతుండడంతో ఉద్యోగావకాశాలూ అంతంతమాత్రంగానే ఉంటాయి. అతడు నాటి ఆంధ్ర దేశాన ప్రముఖుడైన కవి కూడా అన్న ప్రస్తావన నవలలో తరచూ కనిపిస్తూ ఉంటుంది కానీ, రచనల వల్ల పేరే తప్ప డబ్బొచ్చిన దాఖలా లేదు. భగవద్భక్తిని గురించి గిరికకి, మిగిలిన సమస్తమైన విషయాలని గురించి కొందరు శిష్యులకి అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా బోధ పరుస్తూ ఉంటాడతడు. కేవలం ధర్మారావు ప్రభావంతోనే గిరిక తనని తాను శ్రీకృష్ణుడి భార్యగా భావించుకుని, దేవుడిలో ఐక్యమవ్వడం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.

"ధర్మమూర్తులే మీరట! అబద్ధము, ధర్మము నొకటియే కాబోలు! అసలు మీరేది చేసిన అదియే ధర్మము!" అని ఒకానొక ప్రారంభ సన్నివేశంలో అరుంధతి చేత పలికిస్తారు రచయిత. ఈ నవల మొత్తంలో ధర్మారావు ఏది చేస్తే అదే ధర్మం. అతడు కొన్ని పనులు చేయడానికి, మరికొన్ని పనులు చేయకపోడానికి బలమైన వాదన సిద్ధంగా ఉంటుంది. ధర్మారావుని అగ్నికో, యముడికో ప్రతీకగా చిత్రించారా? అన్నది నాకో గట్టి సందేహం. సుబ్బన్నపేటలో - స్నేహితులు మినహా -  ధర్మారావుకి దగ్గరైన ప్రతి వ్యక్తీ ఇహలోక యాత్ర చాలించేస్తారు. వీరిలో కొందరి మరణాలు మరీ అనూహ్యం. ఆద్యంతమూ సీరియస్ గా సాగే కథనంలో ధర్మారావు శిష్యుడు కుమారస్వామి పాత్ర ఒక్కటే కాస్త రిలీఫ్. ఇతడి ఆలోచనలు ధర్మారావుకి నకలే కానీ మాట్లాడే పధ్ధతి హాస్యస్ఫోరకంగా ఉంటుంది ('చివరకు మిగిలేది' లో అమృతం తమ్ముడు జగన్నాధ్ లాగ). నిజానికి ఒక పాసివ్ పాత్ర కథానాయకుడిగా కథ నడపడం కష్టం. రచయిత కల్పించే పరిస్థితులే కథని ముందుకి నడపాలి. గ్రంథ విస్తరణకి ఇది కూడా ఓ కారణం అని చెప్పాలి.

ఆధునికుడైన రంగారావు జమీందారు హయాంలో సుబ్బన్నపేట పట్టణంగా  అభివృద్ధి చెందడం, ఆ క్రమంలో పాత సంప్రదాయాలు ఒక్కొక్కటీ మరుగున పడిపోవడం, వాటిని ప్రేమించే ధర్మారావు ఈ మార్పుని నిస్సహాయంగా చూస్తూండడం, స్వామి పడగలు ఒక్కొక్కటీ మాయమవడం... ఈ పరిణామాన్ని చాలా విశదంగా చిత్రించారు రచయిత. 'వేయిపడగలు' కి చాలా ప్రత్యేకతలే ఉన్నప్పటికీ, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది భాష. ఒకరకంగా దీనిని ఉభయ భాషా నవల అనొచ్చేమో. కథ, సంభాషణలు గ్రాంధికపు తెలుగులోనూ, (సుదీర్ఘమైన) వర్ణనలన్నీ సంస్కృత సమాసాలతోనూ  ఉంటాయి. జరుక్ శాస్త్రి గా ప్రసిద్ధులైన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రిని విశ్వనాథ "ఏం చేస్తున్నావు నాయనా?" అని పలకరిస్తే, "వేయిపడగలుని తెలుగులోకి అనువదిస్తున్నా" అని చమత్కరించారట. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 'సహస్ర ఫణ్' పేరిట హిందీలోకి అనువదించారీ నవలని. కొన్ని భారతీయ భాషల్లోకీ అనువాదాలు జరిగాయి. బ్లాగ్మిత్రులు 'కొత్తపాళీ' నారాయణ స్వామి గారు మరికొందరు మిత్రులతో కలిసి 'Thousand Hoods' పేరిట ఆంగ్లంలో అనువదించారు ఏడేళ్ల క్రితం. జాతీయ స్థాయి అవార్డులు ఏవీ రాకపోవడం వల్ల కాబోలు, ఈ నవలకి పేరడీ రాయలేదెవరూ.

లెక్కకు మిక్కిలి పాత్రలు ఈ నవలని తొలిసారి చదివే పాఠకులకి అడ్డుపడుతూ ఉంటాయి. అచ్చులో ఎనిమిది వందల పేజీలకి మించి ఉన్న ఈ నవలని ఒక్క రోజులో చదవడం కష్టం. మొదటిసారి చదివేప్పుడు పాత్రల కంటిన్యుటీని గుర్తు పెట్టుకోడం ఇంకా కష్టం. ఇది విశ్వనాథ స్వయంగా రాసిన నవల కాదు. ఆయన ఆశువుగా చెబుతుండగా తమ్ముడు వెంకటేశ్వర్లు 28 రోజుల్లో 999 అర ఠావుల మీద రాసిన నవల. ఎడిటింగ్ పని పెట్టుకోకుండా, ఆఫళాన అచ్చుకి పంపేశారనిపిస్తుంది. మొదటిసారి చదివేవాళ్ళు ఓ కాగితం మీద ఒక్కో పాత్ర గురించీ క్లుప్తంగా నోట్స్ రాసుకోని పక్షంలో నవల సగానికి వచ్చేసరికి పాత్రల్ని గురించి తికమక ఏర్పడే ప్రమాదం ఉంది. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు నవలల పోటీ (బహుమతిని 'వేయిపడగలు' కి అడివి బాపిరాజు 'నారాయణరావు' కీ చెరి సమానంగా పంచారు) కోసం 1934 లో రాసిన ఈ నవలపై గడిచిన ఎనభయ్యేళ్లలో ఎన్నో చర్చలు జరిగాయి, విమర్శ వ్యాసాలెన్నో వచ్చాయి. వాటిలో ప్రముఖ ఆంగ్ల నవల 'గాన్ విత్ ది విండ్' తో పోలుస్తూ కల్లూరి భాస్కరం రాసిన వ్యాస పరంపర ఆసక్తికరంగా అనిపించింది. 

నేను బ్లాగు రాయడం మొదలు పెట్టిన కొత్తలో, ప్రవాసం నుంచి పాఠకులొకరు మెయిల్ రాశారు, 'వేయిపడగలు' గురించి క్లుప్తంగా చెప్పమని. నేనురాసిన జవాబులో నాకు బాగా గుర్తుండిపోయిన వాక్యం "వేయిపడగలు చదవడం ఒక అనుభవం". ఈ బృహన్నవలలో రచయిత అభిప్రాయాలతో మనకి పేచీలొచ్చే సందర్భాలు చాలానే ఉన్నాయి. ధర్మారావు పట్ల రచయిత చూపించే అవ్యాజమైన ప్రేమను భరించడం కష్టమయ్యే సందర్భాలూ ఉంటాయి. అలాగని ఇది విస్మరించాల్సిన పుస్తకం కాదు. కొన్ని పాత్రలూ, చాలా సన్నివేశాలూ వెంటాడతాయి. కొన్ని కల్పనలు అబ్బురపరిస్తే, మరికొన్ని వాదనలు అయోమయ పరుస్తాయి. విశ్వనాథకి పాములంటే ప్రత్యేకమైన ఇష్టం. ఆయన ప్రతి రచనలోనూ ఇది ఎక్కడో అక్కడ కనిపిస్తుంది. ఈ నవల పేరే 'వేయిపడగలు' కావడంతో కనీసం ప్రతి పది పేజీలకీ ఓ చోట అన్నట్టుగా పాముల ప్రస్తావన ఉంటుంది.  ఈమధ్యనే మళ్ళీ ఈ నవల చదువుతుంటే, ముప్పై ఏళ్ళ క్రితం 'ప్రపంచీకరణ' పట్ల అనేక సందేహాలనూ, భయాలనూ వ్యక్తం చేస్తూనూ, తీవ్రంగా వ్యతిరేకిస్తూనూ వెల్లువెత్తిన కథలు గుర్తొచ్చాయి. ఆ కథల్ని ఇప్పుడు మళ్ళీ చదివితే వాటిలో అనేకమంది 'ధర్మారావు' లు దర్శనమిస్తారు, బహుశా.

(వెయ్యో టపా!!)

బుధవారం, మార్చి 09, 2022

నట్టింట వినోదం

'ఒకే దెబ్బకి రెండు పిట్టలు' అనే సామెత ఇక్కడ ఎంతవరకూ సరిపోతుందో తెలియడం లేదు కానీ, ప్రపంచాన్ని వణికించిన కరోనా సినిమా పరిశ్రమకి, ప్రత్యేకించి తెలుగు సినిమా పరిశ్రమకి, ఓ మేలు చేసింది. చాన్నాళ్లుగా పరిష్కారం లేకుండా ఉన్న, అసలు పరిష్కారం అవుతుందా లేక నానాటికీ పెరిగి పెద్దదవుతుందా అని సందేహిస్తున్న ఓ దీర్ఘకాలిక సమస్యకి పరిష్కారాన్ని వెతికిపెట్టింది. ఈ పరిష్కారాన్ని అంది పుచ్చుకోవడం, అనువుగా ఉపయోగించుకోవడం అన్నది ఇప్పుడు సినిమా పరిశ్రమ చేతిలో ఉంది. ప్రేక్షకులు కోరింది మాత్రమే తీసే పరిశ్రమ, అదే ప్రేక్షకుల అభిరుచిలో వచ్చిన మార్పుని ఎంతవరకూ గమనిస్తుంది, వారు కోరుతున్నదే చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్న విషయం.

కరోనా కి ముందు వరకూ సినిమా పరిశ్రమకి చెందిన చిన్న నిర్మాతలు, ఇంకా పెద్దవాళ్ళు  కాని హీరోల నుంచి వినిపించిన ప్రధాన ఫిర్యాదు తమ సినిమాలకి థియేటర్లు దొరకడం లేదని. పెద్ద సినిమాలు లెక్కకి మిక్కిలి థియేటర్లలో విడుదలవుతూ ఉండడం, థియేటర్లన్నీ 'ఆ నలుగురి' చేతుల్లో కేంద్రీకృతం అవ్వడం వల్ల, చిన్న సినిమాల విడుదల గాలిలో దీపంగా మారిందనీ, సినిమా మంచి టాక్ తెచ్చుకుని, నిలబడే అవకాశాలు ఉన్నా, పెద్ద సినిమాకి దారివ్వడం కోసం థియేటర్ల నుంచి బలవంతంగా ఎత్తేస్తున్నారనీ వెల్లువగా ఫిర్యాదులు వినిపించాయి. "అప్పట్లో ఇలాంటి పరిస్థితి ఉంటే 'శంకరాభరణం' సూపర్ హిట్ అయ్యి ఉండేదా?" అని ఆవేశంగానూ, ఆవేదనతోనూ ప్రశ్నించిన నిర్మాతల్ని మనం టీవీల్లో చూశాం.

మిగిలిన అన్ని రంగాల్లోనూ తెచ్చినట్టే, ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి సినిమాలకి సంబంధించి విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. లాక్ డౌన్ వల్ల సినిమాహాళ్లు మూతపడి, టీవీ చానళ్ళు మూస కార్యక్రమాల నుంచి బయట పడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు (ఆ కార్యక్రమాలని కూడా కొన్నాళ్ళు ప్రసారం చేయలేకపోయినప్పుడు) ఓవర్ ది టాప్ (ఓటీటీ) వినియోగదారుల సంఖ్య ఒక్కసారిగా పెరగడం మొదలయ్యింది. మార్కెట్ బాగుండడంతో కొత్త పెట్టుబడిదారుల దృష్టి పడి, తక్కువ కాలంలోనే ఓటీటీ ఓ లాభదాయకమైన పరిశ్రమగా మారింది. మనకి సంస్కృతి అయినా, వినోదం అయినా సినిమానే కాబట్టి ఈ ఓటీటీ కంటెంట్ లోనూ సినిమాలు, సినిమా ఆధారిత కార్యక్రమాలే సింహభాగాన్ని ఆక్రమించాయి. అవకాశాలు తగ్గిన సినిమా వాళ్ళకి, కొత్తగా ఈ రంగంలో అదృష్టం పరీక్షించుకుందామనుకునే వారికీ ఓటీటీ పునరావాస కేంద్రంగా మారింది.

Google Image

కొత్తగా ఏం వచ్చినా ఆదరించే ప్రజలు ఓటీటీలనీ బాగానే ఆదరించారు. కొన్ని సినిమాలు ప్రయోగాత్మకంగా 'డైరెక్ట్ ఓటీటీ రిలీజ్' బాట పట్టడంతో రిలీజైన సినిమాని, రిలీజు నాడే ఏ ఇబ్బందీ లేకుండా డ్రాయింగ్ రూములో ఇంటిల్లిపాదీ కలిసి కూర్చుని చూసే అవకాశం వచ్చింది. టీవీ చానళ్ళు సినిమాలని వేసినా ఆ బ్రాడ్ కాస్ట్ థియేటర్ రిలీజ్ జరిగిన కొన్ని నెలల తర్వాత ఉండేది. అప్పుడు కూడా వాళ్ళు చెప్పిన టైముకి సవాలక్ష ప్రకటనలతో పాటుగా ఓపిగ్గా సినిమా చూడాల్సి వచ్చేది. సినిమా రన్ టైం కన్నా ప్రకటనల ప్రసారానికి ఎక్కువ సమయం పట్టిన సందర్భాలు లెక్కలేనన్ని. ఓటీటీలో ఈ గొడవలేవీ లేవు. బ్రాడ్ కాస్ట్ టైం కోసం ఎదురు చూడక్కర్లేదు, మనకి నచ్చినప్పుడు ట్యూన్ చేసుకుని చూడొచ్చు. నచ్చిన పాటలో, సన్నివేశంలో వెనక్కి తిప్పీ, నచ్చని వాటిని గెంతించీ కూడా చూడొచ్చు. ప్రకటనల గొడవ లేనేలేదు. కొన్ని టీవీ చానళ్ల ఏడాది చందా కన్నా, కొన్ని ఓటీటీల వార్షిక చందా తక్కువ. పైగా, స్మార్ట్ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా సినిమాలు చూసే సౌకర్యం ఉంది. 

థియేటర్లు దొరకడం లేదని, తమ ప్రతిభ జనానికి తెలిసే దారి లేకుండా పోతోందనీ ఆవేదన చెందుతున్న సినిమా వాళ్ళకి నిజానికి ఈ ఓటీటీ మంచి వరం.  ఎన్నిరోజులు ఆడుతుందో, పెట్టిన డబ్బులు వస్తాయో రావో అన్న బెంగ అక్కర్లేదు. పెట్టిన ఖర్చు మీద కొంత లాభాన్ని వేసుకుని ఓటీటీకి అమ్మే వీలుంది. ఇవాళ్రేపు యూట్యూబర్లు, టిక్ టాకర్లు కూడా స్టార్లుగా పరిణమిస్తున్న వేళ, బాగా నటిస్తే ఓటీటీ నటులకీ పేరుకి కొదవుండదు. ప్రతిభని ప్రదర్శించి, పేరు తెచ్చుకుంటే అవకాశాలు అవే వస్తాయి. కావాల్సిందల్లా జనాన్ని రంజింపజేయడం. థియేటర్ల మోనోపోలీ, టీవీ ఛానళ్ల ప్రైమ్ టైం మోనోపోలీలకి ఇక్కడ అవకాశం లేదు. ఒక్కసారి కొనుక్కున్న తర్వాత, ప్రచారం చేసుకోవాల్సిన బాధ్యతని సదరు ఓటీటీలే తీసుకుంటున్నాయి కాబట్టి, నిర్మాతలకి ప్రచార ఖర్చు కూడా కలిసొచ్చినట్టే. కావాల్సిందల్లా సరుకులో నాణ్యత. సినిమాల్లో జనరంజకత్వం.

గడిచిన ఏణ్ణర్ధంలో ఓటీటీలో వచ్చిన సినిమాల్లో అధికశాతం నిరాశ పరిచాయి. కొన్నైతే, ఓటీటీ రిలీజ్ జరగడం వల్ల ఆయా నిర్మాతలు నష్టాల నుంచి బయట పడ్డారు కూడా. అయితే కొత్తదనం ఏమాత్రం లేకుండా అదే పడికట్టు పద్ధతిలోనూ, లేకపోతే సెన్సార్ గడబిడ ఉండదు కాబట్టి మసాలాలు దట్టించీ తీసిన సినిమాలని ఓటీటీలోకి వదిలారు. వీటిలో రివైండ్ చేసి చూసుకున్న వాటికన్నా, స్కిప్పులు కొట్టినవే ఎక్కువ కావడం విషాదం. 'ఓటీటీ అంటే ఇంత చిన్నచూపా?' అనిపించే లాంటి సినిమాలూ వచ్చి పడ్డాయి. ఈ చిత్రరాజాలు థియేటర్లలో విడుదలై ఉంటే బోల్డంత డబ్బు ఖర్చు పెట్టుకుని చూసిన ప్రేక్షకులు గగ్గోలు పెట్టి ఉండేవాళ్ళు. అందుబాటులోకి వచ్చిన ఓ కొత్త మాధ్యమాన్ని ఉపయోగించడం కన్నా, దుర్వినియోగం చేసేవాళ్ళే ఎక్కువయ్యారు. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం జనాలు ఓటీటీ సినిమా అంటే భయపడే రోజు ఎంతో దూరంలో ఉండదు. ఓటీటీలో ఒక్క 'శంకరాభరణం' కూడా ఎందుకు రాలేదన్నది కోటి రూపాయల ప్రశ్న. 

సోమవారం, మార్చి 07, 2022

ప్రేమలేఖ రాశా ...

సినిమా కథానాయకుడిదో, నాయికదో (అసలు) పేరునో, నాయకుడి ఇంటిపేరునో పాట సాహిత్యంలో ఔచిత్యం చెడకుండా చొప్పించడం వేటూరికి ఓ సరదా. తనకి నచ్చిన సినిమా వ్యక్తుల ప్రస్తావనలో ఉంటూంటాయి. తరచి చూస్తే చాలా ఉదాహరణలే కనిపిస్తాయి తన సినిమా సాహిత్యంలో. 'ముత్యమంత ముద్దు' (1989) సినిమా కోసం రాసిన ఓ డ్యూయెట్ పల్లవిలో ఆ సినిమా సంగీత దర్శకుడు 'హంసలేఖ' పేరునీ, చరణంలో  మాటల మాంత్రికుడు పింగళి నాగేంద్రరావు పేరునీ అలవోకగా చేర్చారు.

ప్రేమలేఖ రాశా .. నీకంది ఉంటదీ..
పూల బాణమేశా .. ఎదకంది ఉంటదీ..

పూలబాణం తగిలి ఎద కంది ఉంటది.. వేసిన పూలబాణం ఎదకి అంది ఉంటది.. ముచ్చటైన శ్లేష.

నీటి వెన్నెల .. వేడెక్కుతున్నదీ..
పిల్ల గాలికే .. పిచ్చెక్కుతున్నదీ..

'నీటి వెన్నెల' అనేది కవి ప్రయోగంలా అనిపిస్తోంది. శరదృతువులో చంద్రుడు నీళ్లతో కడిగినట్టుగా చల్లగానూ, స్పష్టంగానూ ఉంటాడని కదా పూర్వకవుల ఉవాచ.

మాఘమాసమా .. వేడెక్కుతున్నదీ..
మల్లె గాలికే .. వెర్రెక్కుతున్నదీ..
వస్తే ..గిస్తే ..వలచీ .. వందనాలు చేసుకుంట..

నిజానికి మాఘమాసం మల్లెలమాసం కాదు. త్వరపడి పూసిన పూలనుంచి అతనికి మల్లెగాలి తగిలిందో, లేక ఆ ఋతువులో పూసే ఇంకేదైనా రకపు మల్లెగాలి సోకిందోమరి.. వేడీ, వెర్రీ తగ్గాలంటే ఆమె రావాలి.. వస్తే వలచి, వందనాలు చేసుకుంటాడట.

హంసలేఖ పంపా నీకంది ఉంటదీ..
పూలపక్క వేశా అది వేచి ఉంటదీ..

దమయంతి పంపిన హంసలేఖ మాత్రమే కాలేదు, సినిమా సంగీత దర్శకుడు హంసలేఖ కూడా గుర్తు రావాల్సిందే..

ఆడ సొగసు ఎక్కడుందొ చెప్పనా ..
అందమైన పొడుపు కథలు విప్పనా..
కోడెగాడి మనసు తీరు చెప్పనా ..
కొంగుచాటు కృష్ణ కథలు విప్పనా..

ఇద్దరికీ ఒకరిగురించి మరొకరికి బాగానే తెలుసు, ప్రేమలో ఉన్నారు కదా మరి.

సత్యభామ అలకలన్ని పలకరింతలే ..
అన్నాడు ముక్కుతిమ్మన..
మల్లె తోట కాడ ఎన్ని రాసలీలలో ..
అన్నాడు భక్త పోతన..

అతడు 'పారిజాతాపహరణం' కోట్ చేస్తే, నేనేం తక్కువ తినలేదంటూ ఆమె పోతనామాత్యుడి  'భాగవతం' ప్రస్తావించింది..

వలచి వస్తినే వసంతమాడవే ..
సరసమాడినా క్షమించలేనురా..
కృష్ణా ..గోదారుల్లో .. ఏది బెస్టొ చెప్పమంట..

వసంతమాడేందుకు ఆమెకి ఇంకా ఏదో అభ్యంతరం ఉండడం అతనికి నచ్చలేదు.. తను దూకెయ్యడానికి  కృష్ణ, గోదారి నదుల్లో ఏది బెస్టో చెప్పమని ఆమెని బెదిరిస్తున్నాడు.

మాఘమాస వెన్నెలెంత వెచ్చనా ..
మంచి వాడివైతె నిన్ను మెచ్చనా..
పంటకెదుగుతున్న పైరు పచ్చనా ..
పైట కొంగు జారకుండ నిలుచునా..

మాటకు మాట అనుకోవడంలో ఎవరూ తగ్గడం లేదు, రెండో వారిని తగ్గించడమూ లేదు.

సినీమాల కథలు వింటె చిత్తు కానులే ..
చాలించు నీ కథాకళీ..
ఆడవారి మాటకు అర్థాలె వేరులే ..
అన్నాడు గ్రేటు పింగళీ..

ఆమె సినిమాల ప్రస్తావన తేగానే అతడు గ్రేటు పింగళిని జ్ణాపకం చేసుకున్నాడు. వేటూరి అభిమాన సినీ కవుల్లో పింగళి నాగేంద్రరావు ఒకరు.

అష్ట పదులతో అలాగ కొట్టకూ ..
ఇష్టసఖివనీ ఇలాగ వస్తినే..
నుయ్యో గొయ్యో  ఏదో అడ్డదారి చూసుకుంట..

ఇంకా ఆమె ప్రసన్నం కాకపోవడంతో నుయ్యో, గొయ్యో చూసుకుంటానని బెదిరింపుకి దిగాడు.. ఇదంతా ప్రణయ కలహంలో భాగమే...

నిజానికిది ట్యూనుకి రాసిన పాట. 'ముత్యమంత ముద్దు' కి ఏడాది ముందు కన్నడలో వచ్చిన 'అంజాద గండు' సినిమాకి తానే చేసిన ట్యూన్ 'ఆకారదల్లి గులాబి రంగిదే' ని యధాతధంగా వాడేశారు ఈ పాటకి. డిస్కోశాంతి, కొండచిలువతో నర్తించిన రొమాంటిక్ హారర్ నృత్య గీతమిది. ఎక్కడా కిట్టింపులు అవసరం లేకుండా, ట్యూనుకి సరిగ్గా సరిపోయేలా యుగళగీతాన్ని అల్లేశారు వేటూరి. జానకి, బాలూలు పోటీపడి పాడేశారు. రీమేక్ సినిమాల ద్వారా ఎక్కువ పేరు తెచ్చుకున్న దర్శకుడు రవిరాజా పినిశెట్టి, యండమూరి నవల 'థ్రిల్లర్' ఆధారంగా తీసిన సినిమా ఇది. సింపుల్ లొకేషన్లో, సింపుల్ స్టెప్స్ తో కంపోజ్ చేసిన పాట వినడానికే కాదు, చూడ్డానికీ బాగుంటుంది. చిత్ర నాయికానాయకులు సీత, రాజేంద్ర ప్రసాద్ అభినయించారు.

శుక్రవారం, మార్చి 04, 2022

అనురాగమూర్తులు

ఒక వ్యక్తి జీవించి ఉన్న సమయంలో వ్యక్తిగతంగా కలిసి ఇంటర్యూ చేసి ఆ వివరాల ఆధారంగా జీవిత చరిత్ర రాయడం ఒక పధ్ధతి. ఆ వ్యక్తి మరణించిన చాలా ఏళ్ళ తర్వాత అతడికి సంబంధించిన అందరితోనూ మాట్లాడి, రిఫరెన్సులు సంపాదించి పుస్తకం రాయడం మరో పధ్ధతి. మొదటి దానితో పోలిస్తే ఈ రెండోది కష్టమైన పని. సమగ్రమైన వివరాలు సేకరించడం, పుస్తకం కూర్చడం ఓ ఎత్తయితే, రాసిన దాంట్లో ఏవన్నా తేడాపాడాలొస్తే అందుకు బాధ్యత వహించాల్సి రావడం మరో ఎత్తు. అసిధారా వ్రతం లాంటి ఈ రెండో పద్ధతిలో రచయిత ఓలేటి శ్రీనివాస భాను వెలువరించిన పుస్తకం 'అనురాగమూర్తులు'. ఒకరు కాదు, ఇద్దరి జీవితచరిత్ర. ఆ ఇద్దరూ వెనుకటి తరం తెలుగు, తమిళ సినిమా పరిశ్రమ ప్రముఖులు మమ్మీ, డాడీ అని పిలుచుకున్న శాంతకుమారి, పి. పుల్లయ్య.  ఆమె నటి, నేపధ్య గాయని, అతడు సినిమా దర్శకుడు, నిర్మాత. 

కడప జిల్లా ప్రొద్దుటూరు సమీపంలో ని వెల్లాలలో పుట్టి పెరిగిన సుబ్బమ్మకి చిన్నప్పటినుంచీ చదువు కన్నా సంగీతం మీద మక్కువ ఎక్కువ. శాస్త్రీయ సంగీతం నేర్చుకుని, సంగీతం టీచరుగా ఉద్యోగం సంపాదించుకుంది కూడా. ఆ రంగంలోనే కృషి చేసి ఉంటే ప్రముఖ శాస్త్రీయ సంగీత విదుషి అయి ఉండేది బహుశా. అయితే, ఊహాతీతంగా ఆమెకి సినిమా అవకాశాలొచ్చాయి. ఆ అవకాశాలని తెచ్చిపెట్టడం వెనుక ఆమె గాత్రానిదే  ప్రధాన పాత్ర. అయితే, సినిమా రంగ ప్రవేశం అంత సులువుగా జరగలేదు. ఆమె అమ్మమ్మ, తన మనవరాలు సినిమాల్లోకి వెళ్లడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మనుషుల్ని కెమెరాలో పెట్టి నలిపిన తర్వాతే సినిమా తెరమీద వాళ్ళు కనిపిస్తారన్న అపోహ ఇందుకు కారణం! మొత్తమ్మీద సుబ్బమ్మ శాంతకుమారిగా మారింది. వెండితెరమీద నాయికగా అవతరించింది. 

నెల్లూరు జిల్లా నవాబుపేటకి చెందిన పోలుదాసు పుల్లయ్యది మరో విచిత్ర గాధ. చిన్ననాడే తల్లితండ్రులని పోగొట్టుకుని, అనాధగా బంధువుల సాయంతో పెరిగిన ఆ కుర్రాడు చదువు ద్వారా మాత్రమే జీవితంలో ఏదైనా సాధించగలమని నమ్మాడు. వ్యతిరేక పరిస్థితుల్లో కూడా ఆ రోజుల్లోనే డిగ్రీ పూర్తి చేశాడు. ఒకట్రెండు ఉద్యోగాలూ చేశాడు. మిత్రులతన్ని సినిమా రంగంలోకి తీసుకొచ్చారు. నమ్మి దర్శకత్వపు అవకాశం ఇచ్చారు. వారి నమ్మకాన్ని అతడు వమ్ము చేయలేదు. బొంబాయి సినిమా పారిశ్రమని దగ్గర నుంచి చూసిన అనుభవం, చిన్నప్పుడే అలవడిన పుస్తక పఠనం, కావాల్సింది సాధించుకునే తత్త్వం.. ఇవన్నీ కలిసి అతడు దర్శకుడిగా నిలదొక్కుకోడానికి దోహదం చేశాయి. దక్షిణ భారత దేశంలో సినిమా పరిశ్రమ బలంగా వేళ్లూనుకుంటున్న రోజుల్లో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి, పరిశ్రమతో పాటే పెరిగి పెద్దయిన పుల్లయ్య ఆనతి కాలంలోనే నిర్మాతగానూ మారారు. 

ఆ నటీమణీ ఈ దర్శకుడూ కలుసుకున్నది 1937లో. స్థలం బొంబాయిలోని ఫిలింసిటీ, సందర్భం 'సారంగధర' సినిమా షూటింగ్. ఆమె కథానాయిక, అతడు దర్శకుడు. ఆ షూటింగ్ జరిగే కాలంలోనే మనసులు ఇచ్చి పుచ్చుకుని, ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆమె తరపు పెద్దల అభీష్టానికి వ్యతిరేకంగా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అటుపైన కూడా ఎవరి కెరీర్ వారిదే. అప్పటికే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పుల్లయ్య, పెళ్లయ్యాక నిర్మాత కాగలిగారు. ఆమె కూడా ఎప్పటిలాగే తన నాయిక వేషాలని, నేపధ్య గానాన్ని కొనసాగించారు. క్రమంగా సొంత కుటుంబమూ, సినిమా కుటుంబమూ కూడా పెరిగి పెద్దదయ్యింది. హీరోలు అమ్మా, నాన్నా అని పిలవడం మొదలు పెడితే, సావిత్రి తదితర నాయికలు అత్తయ్య, మావయ్య అని పిలిచే వాళ్ళు.  చిన్నా పెద్దా అన్న భేదం లేకుండా ఏ టెక్నీషియన్ కి ఏ కష్టం వచ్చినా పుల్లయ్య నేనున్నానంటూ వెళ్లి వాలిపోతే, లేడీ ఆర్టిస్టులు తమ కష్టసుఖాలని శాంతకుమారితో పంచుకునే వాళ్ళు. 

రెండు సార్లు తీసిన 'శ్రీ వెంకటేశ్వర మహత్యం' అంజలి-నాగేసర్రావు జంటగా తీసిన 'జయభేరి' సినిమాలు పుల్లయ్యకి మంచి పేరు తెచ్చాయి. (బాలచందర్-చిరంజీవిల 'రుద్రవీణ' కి 'జయభేరి' తో దగ్గర పోలికలు కనిపిస్తాయి). మొదటిసారి తీసిన 'శ్రీ వెంకటేశ్వర మహత్యం' లో శాంతకుమారి పద్మావతి పాత్రలో కనిపిస్తే, ఎన్టీఆర్, సావిత్రితో తీసిన సినిమాలో వకుళమాతగా కనిపించారు. సొంత సినిమాల్లో నటించే నాయికలకి తన బంగారు నగలనే అలంకరించే శాంతకుమారి అలవాటు, "అత్తయ్యా, నేనెప్పుడైనా ఇంత ఖరీదైన నగలను కొనగలనా?" అని 'అర్ధాంగి' షూటింగ్ అప్పుడు సావిత్రి అమాయకంగా అడగడం, అదే సావిత్రి 'సిరిసంపదలు' సినిమా నాటికి ఎస్. జానకి గొంతులో అప్పటికే రికార్డు చేసిన 'ఈ పగలు రేయిగా' పాటని సుశీల చేత పాడించమని పట్టు పట్టడం లాంటి విశేషాలు చాలానే పొందుపరిచారు ఈ పుస్తకంలో. 

పుల్లయ్య నిర్మించిన సినిమాలన్నింటినీ వరుసగా విశ్లేషించడంతో పాటు, నాటి పత్రికల్లో వచ్చిన ఆయా సినిమా రివ్యూలని పొందుపరచడం అదనపు ఆకర్షణ. వీటితో పాటుగా, శాంతకుమారి పాడిన పాటల సీడీనీ జతపరిచారు పుస్తకంతో పాటుగా.  శాంతకుమారి-పుల్లయ్యల ప్రేమకథతో కొంచం నాటకీయంగా మొదలయ్యే పుస్తకం, వాళ్ళిద్దరి నేపధ్యాలు వివరిస్తూ సాగి, పుల్లయ్య సినిమాలు, షష్టిపూర్తి విశేషాలు, అందుకున్న అవార్డులు తదితరాలని కవర్ చేస్తూ ముగుస్తుంది. విషయసేకరణకి, సమాచారాన్ని ఓ క్రమంలో పెట్టడానికి రచయిత పడ్డ శ్రమ కనిపిస్తుంది పుస్తకం అంతటా. అరుదైన ఛాయాచిత్రాలని జతపరిచారు. పుల్లయ్య గురించి ఇచ్చిన సమాచారంతో పోల్చితే, శాంతకుమారి సినిమాలు, పాటలని గురించి విశ్లేషణ బహు తక్కువగా ఉండడం ఒక లోటు. 'డు ము వు లు' పేరిట ముందుమాట రాసిన వీఏకే రంగారావు ఈ లోటుని కొంత వరకూ పూరించారు, ఆమెని గురించిన అరుదైన విశేషాలు పంచుకోడం ద్వారా. క్రియేటివ్ లింక్స్ వారి ముద్రణ బాగుంది. పాత సినిమాలని ఇష్టపడే వారిచేత ఆసాంతమూ ఆసక్తిగా చదివించే ఈ  244 పేజీల పుస్తకం వెల రూ. 300. ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు, ఆన్లైన్ లోనూ దొరుకుతోంది. 

బుధవారం, మార్చి 02, 2022

వైద్య విద్య

'రక్షించాల్సింది ఉక్రెయిన్ లో చిక్కుబడ్డ విద్యార్థులనే కాదు, ఇక్కడ చదువు కొనలేక అక్కడికి వెళ్లేలా చేసిన మన విద్యా వ్యవస్థని కూడా' గడిచిన రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్న మెసేజ్ ఇది. ఒకప్పటి సోవియట్ యూనియన్ లో భాగమైన ఉక్రెయిన్ మీద రష్యా దండెత్తడం, ప్రాణాలు అరచేత పెట్టుకుని ఉక్రెయిన్ లో ఉన్న విద్యార్థులు స్వదేశాలకి చేరుకునే ప్రయత్నాలు తీవ్రతరం చేయడం మొదలయ్యాక సహజంగానే యుద్ధ సంబంధ విషయాలు వార్తల్లోనూ, సోషల్ మీడియాలోనూ సింహభాగాన్ని ఆక్రమించాయి. ఈ యుద్ధం పట్ల భారతదేశం తటస్థ వైఖరి తీసుకున్నప్పటికీ ఆలోచనాపరుల్లో కొందరు రష్యావైపు, మరికొందరు ఉక్రెయిన్ వైపు నిలబడి మాట్లాడుతున్నారు. బలహీన దేశం అవ్వడం చేత కావొచ్చు, ఉక్రెయిన్ కి కొంచం ఎక్కువ మద్దతే దొరుకుతోంది. 

కర్ణాటకకి చెందిన వైద్య విద్యార్థి నవీన్ శేఖరప్ప ఉక్రెయిన్ లో జరిగిన కాల్పుల్లో మరణించడంతో చర్చ 'విదేశీ విద్య' వైపుకి మళ్లింది. విదేశాల్లో - మరీ ముఖ్యంగా ఉక్రెయిన్ లో వైద్య విద్య అభ్యసిస్తున్న ఇరవై వేల మంది విద్యార్థులని గురించి ప్రస్తావనలు కనిపిస్తున్నాయి. వేలాది మంది విద్యార్థులు అక్కడ చదవడం వల్ల భారతీయులకి చెందిన కోట్లాది రూపాయలు ఆ దేశానికి చేరుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మనదేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ విద్య సమృద్ధిగా దొరుకుతోంది. ఏటా పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులు 'ఉన్నత విద్య' కోసం విదేశాలకి, మరీ ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలకి, ప్రయాణం అవుతున్నారు. ఎందుకన్నది బహిరంగ రహస్యమే. కానీ, వైద్య విద్య కథ పూర్తిగా వేరు. 

మన దేశంలో మెడిసిన్ లో ప్రవేశం కోసం నిర్వహించే 'నీట్' పరీక్షకి ఏటా సుమారు పదహారు లక్షల మంది హాజరవుతూ ఉండగా, ఉత్తీర్ణులవుతున్న వారి సంఖ్య కేవలం ఏడు లక్షలు మాత్రమే. వీరిలో కూడా మెడిసిన్ చదివే అవకాశం కేవలం రెండులక్షల లోపు మందికి మాత్రమే ఉంది. ఎందుకంటే మన దేశం మొత్తం మీద ఉన్న సీట్ల సంఖ్య అంతే కాబట్టి. మరి, వైద్య విద్య చదవాలని కోరుకునే మిగిలిన విద్యార్థుల పరిస్థితి? ఇక్కడే 'విదేశాల్లో వైద్య విద్య' అక్కరకొస్తోంది. పేపర్లలోనూ, టీవీల్లోనూ  'చైనాలో ఎంబీబీఎస్' తరహా ప్రకటనలు విస్తారంగా దర్శనమిస్తున్నాయి. "మా అబ్బాయికి మెరిట్ ఉన్నా, ప్రభుత్వ కాలేజీలో సీటు రాలేదు. ప్రయివేటు కాలేజీలో కోటి రూపాయలు పైగా ఫీజు చెల్లించే స్తోమతు లేక ఉక్రెయిన్ పంపించాం" కాల్పుల్లో చనిపోయిన విద్యార్థి తండ్రి చెప్పిన ఈ మాటలు ఇండియాలో వైద్య విద్య ఎంత ఖరీదో చెప్పకనే చెబుతున్నాయి. 

Google Image

కోట్లాది రూపాయలు విదేశాలకి తరలి పోవడాన్ని గురించి ఆందోనళ చెందిన ప్రధానమంత్రి, అలా ఎందుకు జరుగుతోందన్న ప్రశ్న వైపుకి వెళ్ళలేదు. 'జవహర్లాల్ నెహ్రు తగినన్ని మెడికల్ కాలేజీలు ప్రారంభించక పోవడం వల్ల' అనే జవాబు విజ్ఞులైన ప్రజలందరికీ దొరికేసి ఉంటుందని ప్రధాని భావించి ఉండొచ్చు. అయితే, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాత్రం విదేశాల్లో వైద్య విద్య చదువుతున్న భారతీయ విద్యార్థుల 'అర్హత' ని శంకించారు. "వారిలో చాలా మంది నీట్ పరీక్ష ఉత్తీర్ణులు కాలేదు" అని ప్రకటించారు. ఆసరికి, నీట్ పాసైన అందరికీ దేశంలో మెడిసిన్ సీట్లు దొరికేస్తున్నట్టు. పోనీ మంత్రి గారి సందేహం నిజమే అనుకుందామన్నా, అలా చదువుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన వాళ్ళు అర్హత పరీక్ష పాసైతే తప్ప ఇక్కడ వైద్య వృత్తి ప్రారంభించలేరు. కాబట్టి, వాళ్ళ వల్ల దేశానికి ఇతరత్రా నష్టాలేవీ లేనట్టే. వాళ్ళ డబ్బు విదేశాలకి తరలిపోకుండా చూడడం అన్నది తరలిపోతోందని ఆవేదన చెందినంత సులువు కాదు.

మరీ ఇంజనీరింగ్ కాలేజీలంత పెద్ద సంఖ్యలో కాకపోయినా, మన దేశంలో మెడికల్ కాలేజీలు బొత్తిగా విస్తరించక పోడానికి కారణం ఏమిటన్నది ఆసక్తికరమైన ప్రశ్న. ప్రభుత్వానికైనా, ప్రయివేటు వారికైనా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం అన్నది బాగా ఖర్చుతో కూడిన వ్యవహారం (ఇంజనీరింగ్ కాలేజీల కన్నా అనేకరెట్లు ఎక్కువ). పైగా నిర్వహణ భారమూ ఎక్కువే. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం తన పాత్రని పన్నుల వసూళ్లకు మాత్రమే కుదించుకుంటున్న నేపథ్యంలో, ప్రయివేటు రంగాన్ని గురించి మాత్రమే ఆలోచించినా అంత ఖర్చు చేసి కాలేజీలు ఏర్పాటు చేస్తే సీట్ల సంఖ్య మొదలు ఫీజులెంత వసూలు చేయాలోవరకూ సమస్త విషయాల్లోనూ ప్రభుత్వమే పెత్తనం చేస్తుంది, నియంత్రణ పేరుతో. పెట్టుబడి, నిర్వహణ వ్యయం, వాటికి వడ్డీలు కలిపి తడిపి మోపెడు. మేనేజ్మెంట్ కోటా సీట్లు అమ్ముకోగలగడం లాంటి చిన్న చిన్న సౌలభ్యాలు ఉన్నప్పటికీ, మెడికల్ కాలేజీ ఖర్చుతో నాలుగైదు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి త్వరగానూ, బాగానూ ఆర్జించే వీలు కనిపిస్తోంది. 

మరి విదేశాలు తక్కువ ఫీజుకే వైద్య విద్యని ఎలా అందించగలుగుతున్నాయి? ఎందుకంటే, ఆయా కాలేజీలు ఇప్పుడు నిర్వహణ వ్యయాన్ని మాత్రం ఆర్జించుకుంటే సరిపోతుంది. ఉక్రెయిన్ విషయమే తీసుకుంటే కాలేజీలన్నీ గతకాలపు సోవియట్ రోజుల్లో మొదలైనవే. కాబట్టి పెట్టుబడి తాలూకు రాబట్టుకోవడం అనే బాదరబందీ వాటికి లేదు. విద్యా వ్యవస్థని రక్షించాలంటున్న సోషల్ మీడియా మెసేజీల దగ్గరికి వస్తే, ఓ పక్క ఉన్న ఆస్తులనే అయినకాడికి  తెగనమ్ముకుంటున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం వైపునుంచి మన విద్యార్థుల సంఖ్యకి తగినన్ని కాలేజీల ఏర్పాటుని ఆశించలేం. పైగా విద్య, వైద్యం ప్రభుత్వం పనికాదన్న వాదన ఒకటి ఏలినవారి పనుపున బాగా ఊపందుకుంది.  ప్రైవేటు కాలేజీలు ఏర్పాటైనా తక్కువ ఫీజు అన్నది ఆచరణలో సాధ్య పడేది కాదు. కాబట్టి, మెజారిటీ విద్యార్థులు చదువు కొనక తప్పదు. సోషల్ మీడియాదేముంది, మరో కొత్త విషయం దొరికితే అటు మళ్లిపోతుంది.