శుక్రవారం, మార్చి 11, 2022

వేయిపడగలు

"వేయిపడగల పాము విప్పారుకొని వచ్చి
కాటందుకున్నది కలలోన రాజును..."

...ఈ పాము పడగ విప్పింది విజయవాడకి కాస్త దూరాన ఉన్న సుబ్బన్నపేట అనే (కల్పిత) గ్రామంలో. ఆ గ్రామం పుట్టుక మొదలు తర్వాతి రెండు శతాబ్దాల కాలపు చరిత్రకి అక్షర రూపం  'కవిసమ్రాట్' విశ్వనాథ సత్యనారాయణ బృహన్నవల 'వేయిపడగలు'. మొదటి నూట ఎనభయ్యేళ్ళ కథని క్లుప్తంగానూ, తర్వాత జరిగిన సంఘటనలన్నీ సవిస్తారంగానూ చెప్పే నవల ఇది. ఎవరి ఇష్టాయిష్టాలతోనూ సంబంధం లేకుండా కాలంతో పాటు అనివార్యంగా వచ్చి పడేది 'మార్పు'. ఈ మార్పుని మొదట ఎవరూ ఆహ్వానించరు, రానురానూ కొందరు అలవాటు పడతారు, మరికొందరు సర్దుకుపోతారు, చాలా కొద్దిమంది మాత్రం మార్పుని అంగీకరించలేక, అలాగని ఆపనూలేక నలిగిపోతారు. గత కాలాన్ని బెంగగా నెమరు వేసుకుంటూ ఉంటారు.  ధర్మారావు ఈ కొద్దిమంది కోవలోకీ వచ్చే మనిషి. ఇతడే 'వేయిపడగలు' నవలలో కథానాయకుడు, “నేనును బ్రవాహ గామినే గాని యెదురీదెడి వాడను గాను. యెదురీదియు బ్రవాహము వెంట పోవుచుంటిని" అని చెప్పుకున్నవాడూను.

ధర్మారావు గురించి చెప్పుకోవాలంటే ముందుగా సుబ్బన్నపేటని గురించి తెలుసుకోవాలి. కథా ప్రారంభానికి రెండు వందల ఏళ్ల క్రితం నిర్మితమైన సుబ్బన్నపేటకి  పద్మావతీ శ్రీనివాసుల పరిణయ గాధ లాంటి కథ ఉంది. అడవిలాంటి ఆ ప్రాంతంలో అక్కడక్కడా కొన్ని గుడిసెలు. అక్కడ నివాసముండే ఓ కాపు కి 'కపిల' అనే ఆవు ఉంది. ఆ ఆవు పాలతో ఆ కుటుంబం చల్లగా గడిచిపోతోంది. ఉన్నట్టుండి కపిల పాలివ్వడం మానేసింది. కారణం అన్వేషించడానికి బయల్దేరిన కాపుకి, సాయంత్రం వేళ కపిల ఓ పుట్ట లో పాలధార కురిపించడం, ఓ పాము తన శిరస్సులతో ఆ పాలు తాగడం కంట పడుతుంది. ఆ రాత్రే కలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనిపించి తనకి గుడి కట్టించమంటాడు. చుట్టు గుడిసె, కపిల మినహా మరో ఆస్తి లేని పేద కాపు ఆలయం ఎలా నిర్మించగలడు? స్వామి మీదే భారం వేశాడతను.

స్వామి లీలలు చుట్టుపక్కల ప్రచారమవ్వడంతో వాస్తు పండితుడైన ఓ బ్రాహ్మణ జ్యోతిష్య వేత్త అక్కడికి తన నివాసం మార్చుకుని, చిరకాల కోరిక తీరి సంతానవంతుడవుతాడు. ఆ జ్యోతిష్య వేత్తని వెతుక్కుంటూ ఒక వ్యక్తి వస్తాడు. అతను టిప్పు సుల్తాను దండయాత్రకి బళ్ళు తోలిన వ్యక్తి. తనకి కూలీగా ఇచ్చిన ఓ ఇంట్లో విలువైన నగలు దొరకడంతో రాత్రికి రాత్రే ఐశ్వర్యవంతుడై, ఓ కోట కట్టుకోవాలని సంకల్పిస్తాడు. జ్యోతిష్యవేత్త, సుబ్రహ్మణ్య స్వామికి గుడి కట్టించి, పక్కనే కోట కట్టుకోమని, 'సుబ్బన్న పేట' అని పేరు పెట్టమనీ, ఆ ఊరు రెండు వందల ఏళ్ళు సుభిక్షంగా ఉంటుందనీ భవిష్యత్తు చెబుతాడు. కోటకట్టిన వెలమ ప్రభువవుతాడు, జ్యోతిష్యుడు దివాను అవుతాడు. కాపు ఇంటి ఆడబిడ్డ గణాచారి అవుతుంది. ప్రతి తరంలోనూ ఆ యింట తొలిచూలు ఆడపిల్లే పుడుతుంది, ఆమె వివాహం చేసుకోకుండా స్వామి సేవలో గణాచారిగానే జీవితం గడుపుతుంది. ఇది అనూచానంగా ధర్మారావు తండ్రి రామేశ్వర శాస్త్రి తరం వరకూ కొనసాగుతుంది.

రామేశ్వర శాస్త్రిది ఓ చిత్రమైన కథ. ఆయన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర స్త్రీలని ఒక్కొక్కరి చొప్పున వివాహమాడడమే కాకుండా, రత్నగిరి అనే భోగాంగనని తన ఒద్దికలో ఉంచాడు. బ్రాహ్మణ స్త్రీ వల్ల కలిగిన ధర్మారావు, శాస్త్రి వారసుడిగా కొనసాగగా, మిగిలిన స్త్రీల సంతానం తమ తల్లులకి వారసులుగా కొనసాగి, ఆయా కులాల జీవన విధానాలని అనుసరిస్తారు. (అన్నీ శాస్త్రీయ వివాహాలే, అయినా ఈ మెలిక ఎందుకన్నది ఎక్కడా చెప్పలేదు). రత్నగిరికి పుట్టిన 'గిరిక' కి అన్న ధర్మారావు అంటే ప్రాణం. (అసలు నవల్లో నాలుగైదు మినహా మిగిలిన అన్ని పాత్రలకీ ధర్మారావంటే ప్రాణంతో పాటు భయమూ, భక్తీ కూడా).  రామేశ్వర శాస్త్రి దివానుగా ఉండగా ప్రభువు కృష్ణమనాయుడు. అతని కొడుకు రంగారావు పూర్తిగా ఆధునిక పద్ధతులకి ఆకర్షితుడవుతాడు. పూర్వాచారాలతో పాటు, ధర్మారావు పట్లా రంగారావుకి విముఖతే.

రామేశ్వర శాస్త్రి అకాల మరణం నాటికి వాళ్ళ ఆస్తి అంతా కరారావుడు చుట్టేయడంతో, ధర్మారావుకి చదువు ఆపేయాల్సిన పరిస్థితి వస్తుంది. మొదట కృష్ణమనాయుడు, తర్వాత ఆయన భార్య రుక్మిణమ్మారావు, అటుపైని స్నేహితుడు సూర్యపతి సహాయం చేయడంతో బీఏ పూర్తిచేస్తాడు. నిజానికి ధర్మారావు చదువులలోని సారమెల్ల చదివిన వాడు. అతనికి తెలియని విషయం లేకపోవడమే కాదు, ప్రతి విషయంలోనూ స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటాడు కూడా. కించిదావేశంతో కూడిన అతడి వాగ్ధాటి శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. చిన్ననాడే  అతడు పెళ్లాడిన మేనమామ కూతురు అరుంధతి వ్యక్తురాలై, కాపురానికి వచ్చేనాటికి ధర్మారావుకి ఊళ్ళో ఇల్లు మాత్రం మిగులుతుంది. సుబ్బన్నపేటలో  ఏర్పాటు చేసిన కళాశాలలో కొన్నాళ్ళు ఉద్యోగం చేసినా, అక్కడి వారితో అభిప్రాయ భేదాలు రావడంతో విరమించుకుంటాడు. 

తాతతండ్రుల్లాగా కులవిద్య కాకుండా తను బీఏ చదివినా, వాళ్లలాగే దివాన్ గిరీ చేయాలన్నది ధర్మారావు అంతరంగం. అది వేయిపడగల సుబ్రహ్మణ్య స్వామి తనయందుంచిన బాధ్యతగా భావిస్తాడు. జమిందారుగా పట్టాభిషిక్తుడైన రంగారావు, తన అంతరంగికుణ్ణి దివానుగా నియమించుకున్నా, జమిందారుకి, తనకీ మధ్య వైమనస్యం పెరుగుతూనే ఉన్నా, ఇంటి ఆర్ధిక పరిస్థితి నానాటికీ క్షీణిస్తున్నా, జీవిక కోసం మరో పని చేసేందుకు ధర్మారావు ప్రయత్నం చేయడు. దేశంలో స్వాతంత్రోద్యమం ఉధృతంగా సాగుతుండడంతో ఉద్యోగావకాశాలూ అంతంతమాత్రంగానే ఉంటాయి. అతడు నాటి ఆంధ్ర దేశాన ప్రముఖుడైన కవి కూడా అన్న ప్రస్తావన నవలలో తరచూ కనిపిస్తూ ఉంటుంది కానీ, రచనల వల్ల పేరే తప్ప డబ్బొచ్చిన దాఖలా లేదు. భగవద్భక్తిని గురించి గిరికకి, మిగిలిన సమస్తమైన విషయాలని గురించి కొందరు శిష్యులకి అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా బోధ పరుస్తూ ఉంటాడతడు. కేవలం ధర్మారావు ప్రభావంతోనే గిరిక తనని తాను శ్రీకృష్ణుడి భార్యగా భావించుకుని, దేవుడిలో ఐక్యమవ్వడం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.

"ధర్మమూర్తులే మీరట! అబద్ధము, ధర్మము నొకటియే కాబోలు! అసలు మీరేది చేసిన అదియే ధర్మము!" అని ఒకానొక ప్రారంభ సన్నివేశంలో అరుంధతి చేత పలికిస్తారు రచయిత. ఈ నవల మొత్తంలో ధర్మారావు ఏది చేస్తే అదే ధర్మం. అతడు కొన్ని పనులు చేయడానికి, మరికొన్ని పనులు చేయకపోడానికి బలమైన వాదన సిద్ధంగా ఉంటుంది. ధర్మారావుని అగ్నికో, యముడికో ప్రతీకగా చిత్రించారా? అన్నది నాకో గట్టి సందేహం. సుబ్బన్నపేటలో - స్నేహితులు మినహా -  ధర్మారావుకి దగ్గరైన ప్రతి వ్యక్తీ ఇహలోక యాత్ర చాలించేస్తారు. వీరిలో కొందరి మరణాలు మరీ అనూహ్యం. ఆద్యంతమూ సీరియస్ గా సాగే కథనంలో ధర్మారావు శిష్యుడు కుమారస్వామి పాత్ర ఒక్కటే కాస్త రిలీఫ్. ఇతడి ఆలోచనలు ధర్మారావుకి నకలే కానీ మాట్లాడే పధ్ధతి హాస్యస్ఫోరకంగా ఉంటుంది ('చివరకు మిగిలేది' లో అమృతం తమ్ముడు జగన్నాధ్ లాగ). నిజానికి ఒక పాసివ్ పాత్ర కథానాయకుడిగా కథ నడపడం కష్టం. రచయిత కల్పించే పరిస్థితులే కథని ముందుకి నడపాలి. గ్రంథ విస్తరణకి ఇది కూడా ఓ కారణం అని చెప్పాలి.

ఆధునికుడైన రంగారావు జమీందారు హయాంలో సుబ్బన్నపేట పట్టణంగా  అభివృద్ధి చెందడం, ఆ క్రమంలో పాత సంప్రదాయాలు ఒక్కొక్కటీ మరుగున పడిపోవడం, వాటిని ప్రేమించే ధర్మారావు ఈ మార్పుని నిస్సహాయంగా చూస్తూండడం, స్వామి పడగలు ఒక్కొక్కటీ మాయమవడం... ఈ పరిణామాన్ని చాలా విశదంగా చిత్రించారు రచయిత. 'వేయిపడగలు' కి చాలా ప్రత్యేకతలే ఉన్నప్పటికీ, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది భాష. ఒకరకంగా దీనిని ఉభయ భాషా నవల అనొచ్చేమో. కథ, సంభాషణలు గ్రాంధికపు తెలుగులోనూ, (సుదీర్ఘమైన) వర్ణనలన్నీ సంస్కృత సమాసాలతోనూ  ఉంటాయి. జరుక్ శాస్త్రి గా ప్రసిద్ధులైన జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రిని విశ్వనాథ "ఏం చేస్తున్నావు నాయనా?" అని పలకరిస్తే, "వేయిపడగలుని తెలుగులోకి అనువదిస్తున్నా" అని చమత్కరించారట. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 'సహస్ర ఫణ్' పేరిట హిందీలోకి అనువదించారీ నవలని. కొన్ని భారతీయ భాషల్లోకీ అనువాదాలు జరిగాయి. బ్లాగ్మిత్రులు 'కొత్తపాళీ' నారాయణ స్వామి గారు మరికొందరు మిత్రులతో కలిసి 'Thousand Hoods' పేరిట ఆంగ్లంలో అనువదించారు ఏడేళ్ల క్రితం. జాతీయ స్థాయి అవార్డులు ఏవీ రాకపోవడం వల్ల కాబోలు, ఈ నవలకి పేరడీ రాయలేదెవరూ.

లెక్కకు మిక్కిలి పాత్రలు ఈ నవలని తొలిసారి చదివే పాఠకులకి అడ్డుపడుతూ ఉంటాయి. అచ్చులో ఎనిమిది వందల పేజీలకి మించి ఉన్న ఈ నవలని ఒక్క రోజులో చదవడం కష్టం. మొదటిసారి చదివేప్పుడు పాత్రల కంటిన్యుటీని గుర్తు పెట్టుకోడం ఇంకా కష్టం. ఇది విశ్వనాథ స్వయంగా రాసిన నవల కాదు. ఆయన ఆశువుగా చెబుతుండగా తమ్ముడు వెంకటేశ్వర్లు 28 రోజుల్లో 999 అర ఠావుల మీద రాసిన నవల. ఎడిటింగ్ పని పెట్టుకోకుండా, ఆఫళాన అచ్చుకి పంపేశారనిపిస్తుంది. మొదటిసారి చదివేవాళ్ళు ఓ కాగితం మీద ఒక్కో పాత్ర గురించీ క్లుప్తంగా నోట్స్ రాసుకోని పక్షంలో నవల సగానికి వచ్చేసరికి పాత్రల్ని గురించి తికమక ఏర్పడే ప్రమాదం ఉంది. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు నవలల పోటీ (బహుమతిని 'వేయిపడగలు' కి అడివి బాపిరాజు 'నారాయణరావు' కీ చెరి సమానంగా పంచారు) కోసం 1934 లో రాసిన ఈ నవలపై గడిచిన ఎనభయ్యేళ్లలో ఎన్నో చర్చలు జరిగాయి, విమర్శ వ్యాసాలెన్నో వచ్చాయి. వాటిలో ప్రముఖ ఆంగ్ల నవల 'గాన్ విత్ ది విండ్' తో పోలుస్తూ కల్లూరి భాస్కరం రాసిన వ్యాస పరంపర ఆసక్తికరంగా అనిపించింది. 

నేను బ్లాగు రాయడం మొదలు పెట్టిన కొత్తలో, ప్రవాసం నుంచి పాఠకులొకరు మెయిల్ రాశారు, 'వేయిపడగలు' గురించి క్లుప్తంగా చెప్పమని. నేనురాసిన జవాబులో నాకు బాగా గుర్తుండిపోయిన వాక్యం "వేయిపడగలు చదవడం ఒక అనుభవం". ఈ బృహన్నవలలో రచయిత అభిప్రాయాలతో మనకి పేచీలొచ్చే సందర్భాలు చాలానే ఉన్నాయి. ధర్మారావు పట్ల రచయిత చూపించే అవ్యాజమైన ప్రేమను భరించడం కష్టమయ్యే సందర్భాలూ ఉంటాయి. అలాగని ఇది విస్మరించాల్సిన పుస్తకం కాదు. కొన్ని పాత్రలూ, చాలా సన్నివేశాలూ వెంటాడతాయి. కొన్ని కల్పనలు అబ్బురపరిస్తే, మరికొన్ని వాదనలు అయోమయ పరుస్తాయి. విశ్వనాథకి పాములంటే ప్రత్యేకమైన ఇష్టం. ఆయన ప్రతి రచనలోనూ ఇది ఎక్కడో అక్కడ కనిపిస్తుంది. ఈ నవల పేరే 'వేయిపడగలు' కావడంతో కనీసం ప్రతి పది పేజీలకీ ఓ చోట అన్నట్టుగా పాముల ప్రస్తావన ఉంటుంది.  ఈమధ్యనే మళ్ళీ ఈ నవల చదువుతుంటే, ముప్పై ఏళ్ళ క్రితం 'ప్రపంచీకరణ' పట్ల అనేక సందేహాలనూ, భయాలనూ వ్యక్తం చేస్తూనూ, తీవ్రంగా వ్యతిరేకిస్తూనూ వెల్లువెత్తిన కథలు గుర్తొచ్చాయి. ఆ కథల్ని ఇప్పుడు మళ్ళీ చదివితే వాటిలో అనేకమంది 'ధర్మారావు' లు దర్శనమిస్తారు, బహుశా.

(వెయ్యో టపా!!)

17 కామెంట్‌లు:

  1. 'వేయి పడగలు' సంక్షిప్తంగా చెప్పటానికి ప్రయత్నించినందుకే మిమ్మల్ని మెచ్చుకోవాలి. ఆ నవల వ్రాయటం, వివిధ పాత్రలని సమయానుకూలంగా రంగంలోకి దింపటం, వాటిని ఆడిస్తూ, ఎల్లా ఆడుతున్నాయో గమనిస్తూ, నవల 28 రోజులలో పూర్తిచేయటం, అది విశ్వనాధ గారికే చెల్లు. మరి ఇల్లు గడవాలంటే తప్పదుకదా!
    నేను పుస్తకం చదవలేదు. కారణం చదువుదామని ప్రయత్నించి నప్పుడు పేజీలు ముందరికి కదలలేదు. కధ తెలుసుకోవాలనే కోరిక 'కిరణ్ ప్రభ టాక్ షో'(యూట్యూబ్) ద్వారా తీరింది.
    వెయ్యో టపాలో వేయిపడగలని క్లుప్తంగా చెప్పటానికి ప్రయత్నించినందుకు క్యూడోస్ టు యు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమేనండీ, క్లుప్తంగా రాయడం కష్టం.. నావరకు సమీక్షలు చదివినా, ఆడియో బుక్ విన్నా లేదా టాక్ షోలు చూసినా కూడా అవేవీ పుస్తకం 'చదివిన' అనుభవానికి సాటిరావు.. మళ్ళీ మళ్ళీ చదువుకున్నా అదే ఆనందాన్ని ఇచ్చే పుస్తకాలూ ఉన్నాయి.. విశ్వనాథే చెప్పినట్టు 'ఎవరి రుచి బతుకులు వారివి' కదా.. ధన్యవాదాలు.. 

      తొలగించండి
  2. అడగక పోయినా అనుకున్న మాట-మీరు వేయి పడగల గురించి రాయలేదు అని ?
    500 , 1000 రెండు పోస్టులూ "మార్పు" గురించే :) కంగ్రాట్స్

    గత సంవత్సరం చదివి చాలా ప్రశ్నలు పోగేసి కూర్చున్నాను మిమ్మల్ని అడగాలని

    మరొక్క మారు 1000 టపాల అభినందనలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 'Change is the only constant' అంటోంది కదండీ ప్రపంచం, 'మార్పు' గురించినవే అవ్వడం యాదృచ్చికం కాదు. కానీ, ఎంత శ్రద్ధగా గమనిస్తున్నారా కదా అసలు?!! మీ ప్రశ్నలు సంధించండి, జవాబుల మాటెలా ఉన్నా ప్రశ్నలు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది.. ధన్యవాదాలు.. 

      తొలగించండి
  3. హృదయపూర్వక అభినందనలు మురళి గారూ! సాహిత్యాభిమానం విషయంలో కర్మయోగి మీరు. ఈమాట నిజమని మీ బ్లాగ్ అభిమానులందరూ ఒప్పుకునితీరుతారు. బొబ్బిలి చెప్పినట్టు దేన్నైనా కూరొండుకుని తింటున్న రోజులివి.. నిరపేక్షగా చదువుకోవడమూ, రాసుకోవడమూ కూడా ఒక యోగమే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. 'కర్మయోగి' మరీ పెద్దమాటేమో కానీ, ప్రస్తుతానికి అలా నడుస్తోందండీ.. నడవనివ్వడమే నాకూ బాగుంది.. ధన్యవాదాలు.. 

      తొలగించండి
  4. అయ్యబాబోయ్ వెయ్యోదా ? సరిగా లెక్కెట్టారా? :)

    కంగ్రాట్స్ అండీ..

    చదవటమే అనుకుంటే చదివిన వాటిగురించి రాయాలన్న ఆసక్తీ, దానికి సమయం కేటాయించటమూ .హేట్సాఫ్ ..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లెక్కపెట్టటం అవసరంలేదండీ. బ్లాగరు డిజైనర్ సైటులోనే కనిపించే సంగతే కదండీ. వేయికే బాబోయ్ అంటున్నారే. శ్యామలీయంలో ఇప్పటికి 2467 టపాలున్నాయి.

      తొలగించండి
    2. మీకి రెండున్నర "బాబోయ్" లు

      తొలగించండి
    3. @ఉమాశంకర్:  లెక్కల్లో నేను వీకండీ, లెక్కపెట్టే పని పెట్టుకోలేదు.. డాష్ బోర్డు చెప్పింది నమ్మేశాను..
      సంఖ్య ఘనంగానే ఉంది కానీ, తిరిగి చూసుకుంటే 'కాలానికి నిలబడేవెన్ని?' అన్న ప్రశ్నార్ధకం వేలాడుతోంది.. తొలినుంచీ చదువుతున్న పాఠకుల్లో మీరూ ఒకరు, మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.. 
      @శ్యామలీయం: అభినందనలండీ.. 
      @Chiru Dreams: :) 

      తొలగించండి
  5. నేను యూట్యూబ్లో తెలుగు డబ్బింగ్ సీరియల్ (వేయి పడగలు) చూస్తున్నాను. పీవీ నరసింహారావు గారి ప్రోద్బలంతో హిందీ లో తీసినట్టున్నారు కానీ చాలా మంది తెలుగు సీరియల్ నటులు (వారి కెరీర్ ఆరంభ దశలో) ఉన్నారు. చాలా ప్రసిద్ధి చెందిన నవల అని తెలుసు తప్ప ఈ పుస్తకం గురించి నాకు మరేమి తెలీదు. ఊహించినట్టే ఈ నవలనీ సీరియల్నీ పోల్చలేము. ఈ రివ్యూ చదివాక సముద్రం ముందు స్పూనెడు సాగరంలా తోచింది టీవీ సీరియల్. కథ నాకు అద్భుతంగా అనిపించింది. పూర్వం పద్ధతులు, ఇత్తడి పాత్రలు, చిన్నప్పుడు ఇంట్లో పెద్దవారు మాట్లాడే మాటలు, ఇలా ఎన్నో గుర్తొచ్చాయి. ఆనాటి సాంఘిక పరిస్థితులు, చెల్లా చెదురైన ఎన్నో సంగతులని ఈ నవల తిరిగి ముడివేసి స్పష్టత తెస్తుంది అనిపించింది. చదవాలని చాలా కోరికగా ఉన్నా, పేజీల సంఖ్యా మరియు గ్రాంధిక తెలుగు అంటే కొంచెం వెనుకాడుతున్నాను. చదవాలనుకునే వారికి మీ రివ్యూ చాలా సహాయపడుతుంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి