సోమవారం, మార్చి 27, 2017

విశ్వనాథ 'చిన్న కథలు'

'కవి సమ్రాట్' విశ్వనాథ సత్యనారాయణ పేరు తలచుకోగానే 'వేయిపడగలు' లాంటి బరువైన రచనలు గుర్తుకురావడం సహజం. అప్రతిహతంగా సాగిపోయే ఆయన రచనా ధోరణిని గమనించిన వారెవరికైనా విశ్వనాథ చిన్న కథలు రాశారు అనగానే ఒక సందేహం, ఒకింత ఆశ్చర్యం కలగడం సహజం. పాతిక ముప్ఫయి పేజీల నిడివి ఉన్న కథలు రాసేసి వాటికి చిన్న కథలన్న పేరు పెట్టేసి ఉంటారన్న సందేహం కలగడమూ కద్దు. వీటన్నింటికీ జవాబు శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్ ప్రచురించిన 'చిన్న కథలు' సంకలనం. ఒక్క పేజీ మొదలు పది పన్నెండు  పేజీల వరకూ నిడివి ఉన్న మొత్తం ముప్ఫయి ఒక్క కథలున్నాయీ సంకలనంలో.

ఇప్పటికే అనేక కథా సంకలనాల్లో ప్రచురితమైన 'జీవుని యిష్టము' మొదలు, స్వలింగ సంపర్కం ఇతివృత్తంగా తీసుకుని రాసిన 'ఇంకొక విధము' వరకూ ప్రతి కథా దేనికదే ప్రత్యేకమైనది. 1926 మొదలు 1960 మధ్య కాలంలో అనేక పత్రికల్లో ప్రధమ ముద్రణ పొందిన ఈ కథలని అదే వరుసక్రమంలో సంకలనం చేయడంతో పాటు, తొలిముద్రణ తాలూకు వివరాలని ప్రచురించడం పాఠకులకి మంచి వెసులుబాటు. మొదటిసారి చదవగానే నిగూఢంగా అనిపించే కొన్ని కథలు, ప్రచురణ తేదీని ఆధారంగా చేసుకుని నాటి సామాజిక, రాజకీయ పరిస్థితులని దృష్టిలో ఉంచుకుని చదవడం ద్వారా రచయిత హృదయాన్ని గ్రహించడానికి ఈ తేదీలు ఉపయుక్తమవుతాయి.

శాతవాహనుల కాలంలో ఆంధ్రదేశం అత్యంత ధనిక దేశం. రోమ్ దేశానికి చెందిన అందమైన యువతులు ఆంధ్ర చక్రవర్తులకి చామరగ్రాహిణులు పనిచేసే నిమిత్తం సముద్రాలు దాటి వచ్చేవారు. ఒక్క యువతికి చామరగ్రాహిణి (చక్రవర్తికి వింజామర వీచే పని) ఉద్యోగం దొరికినట్టయితే రోమ్ లో ఆ కుటుంబం దశ తిరిగినట్టే. చక్రవర్తి పంపే నజరానాలతో వాళ్ళో చిన్నసైజు జమీందారులుగా మారాల్సిందే. గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి దగ్గర ఆ ఉద్యోగంలో చేరి, చక్రవర్తి  మీద మనసు పడిన హెలీనా కథే 'చామరగ్రాహిణి.' నీగ్రోల పాలిట దేవుడిగా మారిన హిషీఖేయ్ కథ 'య్యో ర్హిషీ ఖేయ్' కాగా, స్త్రీలు మోహించేంతటి సౌందర్యవంతుడైన గ్రీకు యువకుడి కథ 'డయాన్ థస్.'


భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగంతో పాటు వారి అలకలు గృహ ఛిద్రాలు మెజారిటీ కథలకి ఇతివృత్తాలు. అందం విషయంలో భార్యాభర్తల మధ్య పోటీ అన్నది సంకలనంలో మొదటి కథ 'భావనా సిద్ధి' ఇతివృత్తం. పేదింటి అంధురాలు రాధని వివాహం చేసుకున్న ఆస్థిపరుడైన చంద్రశేఖరరావు కథ 'పరిపూర్తి.' అందగాడు, చదువుకున్న వాడు, ధనవంతుడు అయిన చంద్రశేఖర రావుకి తనమీద నిజంగానే ప్రేమ ఉందా అన్నది రాధ సందేహం. ఆమె సందేహ నివృత్తే కథకి ముగింపు. ఆదర్శాలు ఉన్నప్పటికీ ఇంట్లో వాళ్ళ ఒత్తిడికి తలొగ్గి, చదువు పూర్తి కాకుండానే శకుంతలని వివాహం చేసుకుని, ఆమె గర్భవతిగా ఉండగా నిజాం వ్యతిరేకపోరాటంలో పాల్గొని జైలుకెళ్లిన రాముడు, ఫలితాన్ని అనుభవించిన శకుంతలల కథ 'శకుంతల విధికి ఎవరు కర్తలు."

ప్రత్యేకంగా అనిపించే కథల్లో మొదట చెప్పుకోవాల్సింది 'ద్విజాత,' ఓ సినీనటి కథ! పాత తెలుగు సినిమాలతో ఏ కొంచం పరిచయం ఉన్న వాళ్ళకైనా కథ చివరికి వచ్చేసరికి ఆ నటి ముఖం కళ్ళకి కడుతుంది. చదివిన ప్రతిసారీ కొత్తగా అనిపించే కథ 'మాక్లి దుర్గంలో కుక్క.' తాత్విక ప్రధానంగా సాగే కథ 'ఏమి సంబంధము.' ఈ కథ ముగింపు బాగా వెంటాడుతుంది. వ్యవస్థ మీద వ్యంగ్య బాణాలేసే కథలకీ లోటు లేదు. 'రాజు,' 'పరిశోధకులు' లాంటివి మచ్చుకి కొన్ని. నవ్య కథనరీతులుగా ప్రచారంలో ఉన్న కథా రచనా పద్ధతులని విశ్వనాథ విరివిగా ఉపయోగించారనడానికి నిదర్శనంగా 'వెలుగు మెట్లు' లాంటి కథల్ని చూపొచ్చు.

మొత్తం మీద చూసినప్పుడు, విశ్వనాథ విస్తారంగానే కాక క్లుప్తంగా, పొదుపుగా కూడా రాయగలరు అని నిరూపిస్తుందీ పుస్తకం. వస్తువైవిధ్యం మాత్రమే కాదు, కథను నడపడంలోనూ ఏ కథకి ఆ కథ ప్రత్యేకంగా ఉండేలా తీర్చిదిద్దారు రచయిత. తొలినాటి కథలతో పోలిస్తే రానురాను గ్రాంధికం తగ్గి, వ్యావహారిక పలుకుబళ్లు పెరగడం ఈ కథల్లో చూడొచ్చు. కథా సాహిత్యాన్ని ఇష్టపడే వాళ్ళు తప్పక చదవాల్సిన ఈ పుస్తకం, విశ్వనాథ రచనల్ని చదవడం ఆరంభించాలనుకునే వారికి చక్కని ప్రారంభం అవుతుంది. నవలారచయితగా కన్నా, కథకుడిగా విశ్వనాథ ప్రత్యేకమని తెలిసిందీ పుస్తకం వల్ల. (పేజీలు 216, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

4 కామెంట్‌లు:

  1. వియద్గంగనూ కిన్నెరసానినీ ఒకేలా ప్రేమించగల విశ్వనాథను చూపిస్తాయీ కథలు.

    సెట్లో కాకుండా విడిగా విక్రయిస్తున్నారా ఇప్పుడు... ఓ పదిహేనేళ్ళ క్రితం విడిగా అమ్ముతుంటే కొనుక్కున్నా. కొన్నేళ్ళకి చేజారిపోయింది. తర్వాత కొందామంటే సెట్ లోనే ఉందన్నారు.

    అన్నట్టు... తెలుగు నూతన సంవత్సర (హేవిళంబి ఉగాది) శుభాకాంకలు.

    రిప్లయితొలగించండి
  2. @పురాణపండ ఫణి: అవునండీ, ఈ పుస్తకం ఒక్కటీ సెట్లో నుంచి బయటికి వచ్చింది.. సెట్ నిబంధన సడలిస్తే కొనుక్కోవాల్సిన పుస్తకాల లిస్టు ఉందండీ నాదగ్గర కూడా.. మీక్కూడా (కొంచం ఆలస్యంగా) ఉగాది శుభాకాంక్షలు!! ..ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  3. ఇప్పుడు చదువుతున్నాను. కథాంశాలు వెరైటీగా, కథలు నిడివి తక్కువగా ఉన్నాయని ఇప్పుడే ఇంట్లో అంటూ ఉన్నా ఈ విషయం. మీ వ్యాసం బాగుంది.

    రిప్లయితొలగించండి
  4. విశ్వనాధ వారు రాసిన మాక్లి దుర్గంలో కుక్క కథ చదివాను, చాలా ఆహ్లాదంగా అనిపించింది ఆ కథ, ఇందులో సమాజంలోని సమస్యలు, వ్యక్తుల వ్యక్తిత్వాలను చాల చక్కగా వర్ణిస్తారు ఆయన, ఇప్పుడు మరో సారి ఆ కథ గురించి చేస్తున్నప్పుడే ఈ వ్యాసం దొరికింది. చాల మంది పుస్తకాన్ని పరిచయం చేశారు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి