సృష్టికి విరుద్ధంగా ఏది జరిగినా అది పదిమంది దృష్టినీ యిట్టే
ఆకర్షించడం అత్యంత సహజం. ఆ అడివిలో కూడా అదే జరిగింది. ఎక్కడెక్కడి నుంచో
గుంపులు గుంపులుగా వచ్చిన చిలకలన్నీ కొమ్మల మీద వాలి ఉన్నాయి. ఆ అడివిలోని
చిలుక సమాజంలో పంచాయితీ జరగబోతోంది. తీర్పు చెప్పడానికి పెద్ద చిలక
సిద్ధంగా ఉంది. ఓ పెంటి చిలకకి కాకిపిల్ల పుట్టింది! ఆ చిలక పెనిమిటి
పంచాయితీ పెట్టించాడు. జరిగిన కథని చెప్పడం మొదలు పెట్టింది పెంటి చిలక.
'కథా మాంత్రికుడు' గోపిని కరుణాకర్ రాసిన 'బారతం బొమ్మలు' కథలో ప్రారంభ
సన్నివేశం ఇది.
రాశికన్నా వాశికి ప్రాధాన్యత ఇచ్చే కథా
రచయిత కరుణాకర్ కి బాగా పేరుతెచ్చిన కథల్లో 'బారతం బొమ్మలు' ఒకటి. చిత్తూరు
జిల్లాకి మాత్రమే ప్రత్యేకమైన సంప్రదాయం 'బారతాలు.' అక్కడి పల్లెల్లో
ఇప్పటికీ ఏటా బారతాలాటలు జరుగుతూనే ఉన్నాయి. పద్దెనిమిది రోజులపాటు సాగే ఈ
బారతాలు ఆడిస్తే, వేళకి వర్షాలు కురిసి, కరువుకాటకాలు ఉండవన్నది ఆ ప్రాంత
ప్రజల విశ్వాసం. తిరుమల కొండపై పుట్టిన కరుణాకర్ ఈ బారతాలని నేపధ్యంగా
తీసుకుని చెప్పిన కథ 'బారతం బొమ్మలు.' చిలక కడుపున కాకిపిల్ల పుట్టడం అనే
విచిత్రంతో పాఠకుల్ని యిట్టే కథలోకి తీసుకుపోయిన కరుణాకర్, అటుపై వాక్యాల
వెంట పరుగులు పెట్టిస్తారు.
నేరేడు పళ్ళ కాలంలో తన
పెనిమిటితో కలిసి మేతకి వెళ్ళిన చిలక, ఊహించని విధంగా ఓ డేగ బారిన పడింది.
రెక్కకి గట్టి దెబ్బ తగలడంతో ఎగరలేక ఓ చెట్టు మీద తల దాచుకుంది. ఆ చెట్టు
కింద చలి కాచుకుంటున్న ఓ తాత, తన మనవడికి చెప్పిన కథే 'బారతం బొమ్మలు.'
చలిమంట వెలుగులో తాత చేతిమీద ఉన్న దొరసాని పచ్చబొట్టుని చూసి ఆ కథ చెప్పమని
మనవడు అడగడంతో, తన నూనూగు మీసాల యవ్వన కాలంలో జరిగిన సంఘటనని మనవడికి
వివరంగా చెబుతాడా తాతయ్య. ఈ చెప్పడంలో దాదాపు అరవై-డెబ్భై ఏళ్ళ నాటి
చిత్తూరు ప్రాంతాన్ని, మరీ ముఖ్యంగా భాకరాపేట అడవీ ప్రాంతాన్నీ కళ్ళకి
కడతాడు.
నూరెకరాల సేద్యం కలిగిన రైతు పెద్దరెడ్డి దగ్గర
జీతగాడిగా ఉన్న మాదిగ చిన్నోడంటే గోలకొండ అబ్బా అనేది. అరవదేశం నుంచి రైలు
బండిలో నరసింగపురానికి వచ్చే బారతం బొమ్మలు - పంచపాండవులు, ద్రౌపదిల లక్క
బొమ్మలు - బండిలో వేసుకుని తేవడం కోసం బయలుదేరాడు చిన్నోడు. తిరుగు
ప్రయాణంలో, ఓ వయసులో ఉన్న కుర్రాడు రంగంపేట దగ్గర బండెక్కాడు, భాకరాపేటలో
దింపమని బతిమాలాడు. అది అడవి మార్గం. పైగా దొరల రాజ్యం. అయినింటి ఆడవాళ్ళు
ఒంటరిగా దొరికితే వదిలేవాళ్ళు కాదు దొరలు. కొంత ప్రయాణం జరిగాక చిన్నోడికి
అర్ధమయ్యింది, తన బండిలో ఉన్నది కుర్రాడు కాదనీ, మారువేషంలో ఉన్న దొరసాని
అనీ.
చిన్నోడు అడగడంతో దొరసాని నిజం ఒప్పేసుకుంది.
పెళ్లై పదేళ్ళు గడిచినా సంతానం కలక్క పోవడంతో, సవడమ్మ తిరణాలలో మొక్కు
తీర్చుకోడానికి వెళ్తోంది ఆమె. రంగంపేట చేరేసరికి తెల్ల దండు ఎదురు పడడంతో
వేషం మార్చి చిన్నోడి బండెక్కింది. ఓ దొరసానిని ప్రత్యక్షంగా చూడడం అదే
ప్రధమం చిన్నోడికి. "దొరసానులు దేవకన్నెలు. మనబోటి వాళ్లకి కనిపించరు" అని
చిన్నప్పుడు తల్లి చెప్పిన మాట ఇంకా గుర్తే అతనికి. అందుకే, తన బండిలో ఓ
దొరసాని ప్రయాణం చేయడాన్ని నిజమో, కలో తేల్చుకోలేని పరిస్థితుల్లో
పడిపోయాడు. ఆమె మాత్రం పూలు రాలినట్టు పలపలా నవ్వింది. పులిగుండు వాగులో ఎడ్లు నీళ్ళు తాగుతూ ఉండగా, నీటిలో ఉన్న చందమామతో ఆడుకుంటున్న దొరసాని ఉన్నట్టుండి వాగులో పడిపోయింది.
భారతాలకి
వెళ్ళవలసిన బొమ్మలు బూడిదగా ఎందుకు మారిపోయాయో, దొరసాని బొమ్మ చిన్నోడి
చేతిమీద పచ్చబొట్టుగా మారిన వైనమేమితో, కాకిని కన్న పెంటి చిలకకి చిలకల
పంచాయితీ విధించిన శిక్ష ఏమిటో తెలియాలంటే 'బారతం బొమ్మలు' కథ చదవాల్సిందే.
కథ పూర్తయ్యాక ఆలోచనల నుంచి ఓ పట్టాన తేరుకోలేక పోవడమే కాదు, చదువుతున్నంత
సేపూ ఒకటొకటిగా వచ్చే వర్ణనలూ ఓసారి ఆగి ముందుకు వెళ్ళమంటాయి పాఠకులని.
ప్రారంభమే "చీకటింట సుక్కలాకాశం మిణుకు మిణుకు మంటూ వుండాది. గుడ్డి సుక్క
నడిమింటి కొచ్చింది. గాలికి పలవరేణి మాను వూగింది.." అంటూ మొదలవుతుంది.
"కందిచేను సీతాకోకచిలుకల్ని పూసింది," "చింతచెట్టు కొంగల్ని పూసినట్టు
వుండాది," "చిలకల మొగాలు నల్లగా మాడిపోయినాయి.." లాంటి వర్ణనలెన్నో.
కరుణాకర్ రెండు కథా సంకలనాలు 'బారతం బొమ్మలు,' 'దీపం చెప్పిన కతలు' కలిపి 'గోపిని కరుణాకర్ కథలు' పేరిట సంకలనంగా ప్రచురించింది పాలపిట్ట బుక్స్. 'బారతం బొమ్మలు' తో సహా మొత్తం ఇరవై ఏడు కథలున్నాయి. కథలన్నీ ఓ ఎత్తూ, చివర్లో కరుణాకర్ 'వాగ్గేయకారుడిలా గానం చేస్తున్న కథలు' అంటూ రాసిన కథల వెనుక కథ ఒక ఎత్తూను. పల్లెల్నీ, ప్రకృతినీ, కథల్లో మార్మికతనీ ఇష్టపడే వాళ్ళు తప్పకుండా చదవాల్సిన కథలివి. (పేజీలు 276, వెల రూ. 150, అన్ని ప్రముఖ పుస్తకాలు షాపులూ).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి