గురువారం, మార్చి 09, 2017

ఘాజీ

రెండు గంటల నిడివి ఉన్న సినిమా. తొంభై శాతం సన్నివేశాలు జలాంతర్గామిలోనే. పాటలు, ఫైట్లు, కామెడీ లాంటి సగటు తెలుగు సినిమా ఫ్రేమ్ వర్క్ ని బద్దలు కొట్టుకుని బయటికి వచ్చికూడా, అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణనీ పొందుతోంది. ముప్ఫయ్ రెండేళ్ల సంకల్ప్ రెడ్డి అనే యువకుడు ఐదేళ్ల పాటు కలగని, రేయింబవళ్ళు శ్రమించి పరిశోధన చేసి తయారు చేసుకున్న స్క్రిప్ట్.. మొదట చిన్న బడ్జెట్ యూట్యూబ్ సినిమాగా నిర్మాణం ఆరంభమైనప్పటికీ, యువ కథానాయకుడు రానా దగ్గుబాటి దృష్టిలో పడడడంతో భారీ బడ్జెట్, బహుభాషా చిత్రంగా మారి తెలుగు, తమిళ హిందీ భాషల్లో దేశంలోనూ, విదేశాల్లోనూ కూడా మంచి వసూళ్లు రాబడుతున్న సినిమా 'ఘాజీ.'

మొదటి వారంలో హౌస్ ఫుల్ బోర్డులు, ఆ తర్వాత నా వ్యక్తిగత పనులూ కారణంగా ఈ సినిమా చూడడం బాగా ఆలస్యమైంది. రొటీన్ ని కొద్దికొద్దిగా బ్రేక్ చేసే సినిమాలు అప్పుడప్పుడూ వస్తూనే ఉంటాయి కానీ, బాక్సాఫీసు సూత్రాలుగా చెప్పబడుతూ వస్తున్నవాటిని అన్నింటినీ మొత్తంగా పక్కన పెట్టి కేవలం స్క్రిప్ట్ ని మాత్రమే నమ్ముకుని తీసేవి బహు తక్కువ. అదిగో, ఆ అరుదైన కేటగిరీ సినిమానే ఇది. భారత-పాకిస్తాన్ యుద్ధం (1971) నేపథ్యంలో, బంగాళాఖాతంలో ఈ రెండు దేశాల జలాంతర్గాములు తలపడినప్పుడు - మరీ ముఖ్యంగా పాకిస్తాన్ జలాంతర్గామి 'ఘాజీ' అన్ని విధాలుగానూ శక్తివంతంగానూ, భారత్ కి చెందిన 'ఐఎస్ 21' అన్ని విధాలుగానూ బలహీనంగానూ ఉన్న సమయంలో జరిగిన పోరు ఎలాంటిదన్నదే ఈ సినిమా.

భారత జలాల్లో కల్లోలం సృష్టించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందన్న వేగు అందగానే, అప్రమత్తమైన నావికాదళం 'ఐఎస్-21' ని సముద్రంలోకి పంపుతుంది. కెప్టెన్ విజయ్ సింగ్ (కేకే మీనన్) ఆవేశపరుడన్న విషయం బాగా తెలిసిన అధికారులు (ఓంపురి, నాజర్) దళంలో యువ అధికారి అర్జున్ వర్మ (రానా దగ్గుబాటి) కి కూడా ముఖ్యమైన నిర్ణయాలలో భాగస్వామ్యం వహించాల్సిందిగా ఆదేశిస్తారు. జలాంతర్గామి కంట్రోల్ మొత్తం దేవరాజ్ (అతుల్ కులకర్ణి) అనే అధికారి ఆధీనంలో ఉంటుంది. జలాంతర్గామి తీరం విడవడంతోనే విజయ్ సింగ్ స్వతంత్రంగా వ్యవహరించడం మొదలు పెడతాడు. పాక్ నౌక తారసపడిన ఎట్టిపరిస్థితుల్లోనూ ముందస్తు ఆదేశాలు లేకుండా ఫైరింగ్ జరపొద్దని, ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, "మనం వెళ్తున్నది యుద్ధానికే" అని ప్రకటిస్తాడు.


విజయ్ సింగ్ విపరీత ప్రవర్తన కారణంగా సిబ్బంది మొత్తం ఇబ్బందులు పడుతున్నప్పటికీ, క్రమశిక్షణ కారణంగా వారెవ్వరూ పెదవి విప్పరు. ఒక్క అర్జున్ మాత్రం కొంచం తరచుగా విజయ్ తో విభేదిస్తూ ఉంటాడు. వీళ్ళ ప్రయాణం సాగుతూ ఉండగానే, విజయ్ కారణంగా చిన్న ప్రమాదం జరిగి, జలాంతర్గామికి కొంత నష్టం జరగడం, దగ్గరలోనే ఉన్న మర్చంట్ నౌక ని పాకిస్తాన్ జలాంతర్గామి పేల్చేయడంతో ప్రమాదంలో ఉన్న కాందిశీకులని (తాప్సి, చిన్నపాప) అర్జున్ రక్షించి 'ఐఎస్-21' లో ఆశ్రయం ఇవ్వడం, శత్రు నౌకని పేల్చేయాల్సిందే అని విజయ్ ఆదేశించడంతో కథ పాకాన పడుతుంది. అటుపై ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొన్న 'ఐఎస్-21' బృందం, అర్జున్ నాయకత్వంలో వాటిని ఎలా అధిగమించింది? శత్రు నౌకని ఎలా నిలువరించింది అన్నది ముగింపు.

ఈ సినిమాకి తొలిహీరో స్క్రిప్ట్, రెండో హీరో దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఒకే ఒక్క సెట్ లో, ఎక్కడా విసుగు కలగని విధంగా సినిమా తీయడమే కాదు, రెండో సగానికి వచ్చేసరికి ప్రేక్షకుల్ని కూడా జలాంతర్గామి ప్రయాణికుల్ని చేసేశాడు దర్శకుడు. నావికాదళ సిబ్బందికి విధి నిర్వహణగా అనిపించేవన్నీ, సామాన్యుల దృష్టికి ఎలా కనిపిస్తాయి అన్నది తాప్సి పాత్ర ద్వారా చూపించాడు. నిజానికి తాప్సికి ఉన్న డైలాగులు అతి తక్కువ.. ఈ కారణంగానే అభినయానికి బాగా అవకాశం దొరికింది. తనను తాను డాక్టర్ గా పరిచయం చేసుకున్న ఈ కాందిశీకురాలు, ముగింపుకి ముందు అర్జున్ కి వైద్యం అవసరమైనప్పుడు చూస్తూ వెనుకనే నిలబడిపోయింది తప్ప విధి నిర్వహణ ఎందుకు చెయ్యలేదన్నది ప్రశ్నగా మిగిలిపోయింది.

సాంకేతిక విభాగాలన్నీ యధాశక్తి కృషి చేసి చక్కని సినిమాని ఇచ్చాయి. నటీనటులెవరికీ వంక పెట్టడానికి లేదు. అర్జున్ తో పాటు కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులకి కూడా కోపం వచ్చేసేలా ఉన్న విజయ్ ప్రవర్తనకి కారణాన్ని ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్ లో చెప్పి ఆ పాత్ర పట్ల అభిప్రాయాలని ఇట్టే మార్చేశాడు దర్శకుడు. క్లైమాక్స్ ని మరొక్క ఐదు నిమిషాలు పొడిగించి ఉంటే బాగుండేది అని తప్ప, ఇంకేరకమైన ఫిర్యాదులూ లేవీ సినిమా మీద. నెమ్మదిగానే అయినా, తెలుగు సినిమా ఎదుగుతోంది అని చెప్పుకోడానికి అవకాశం ఇఛ్చిన 'ఘాజీ' టీమ్ మొత్తానికి ధన్యవాదాలు చెప్పాల్సిందే..

9 వ్యాఖ్యలు:

DG చెప్పారు...

This may be a copy or remake of https://en.m.wikipedia.org/wiki/Crimson_Tide_(film) with change of names and countries

UG SriRam చెప్పారు...

@DG, So What?

వేణూశ్రీకాంత్ చెప్పారు...

ఈ మధ్య కాలంలో నాక్కూడా చాలా నచ్చిన సినిమా అండీ..

జయ చెప్పారు...

మీరు చెప్పిన ప్రతి అక్షరం సత్యం మురళి గారు. నాకైతే ఇంకో సారి చూడాలని ఉంది ఆ సినిమా.సినిమా అంతా కూడా చక్కటి అనుభవం. అది ఒక సెట్ లాగా అనిపించలేదు. లైఫ్ ఆఫ్ పై గురించిన వివరాలన్నీ గుర్తొచ్చాయి. ఆ సినిమా ఒక హాలివుడ్ స్థాయిలో తీసినట్లే అనిపించింది.

Lalitha TS చెప్పారు...

తప్పక చూస్తామండి ఇది :)

మురళి చెప్పారు...

@డీజీ: అవునండీ, రానా ఓ ఇంటర్యూలో చెప్పాడు కూడా.. ధన్యవాదాలు
@యూజీ శ్రీరామ్: ధన్యవాదాలండీ
@వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ

మురళి చెప్పారు...


@జయ: అవునండీ.. చాలా తక్కువ బడ్జెట్ లో, మంచి క్వాలిటీ తో తీశారు సినిమాని.. ధన్యవాదాలు..
@లలిత టీఎస్: తప్పక చూడండి.. ధన్యవాదాలు..

Hari Charan Vasimalla చెప్పారు...

మంచి సినిమా.తెలుగు లో ఇలాంటివి రావడం చాలా అరుదు...క్షణం సినిమా కూడా తెలుగు బలమే.

మురళి చెప్పారు...

@హరిచరణ్: 'క్షణం' గురించి విన్నాను కానీ చూడడం పడలేదండీ.. డిస్క్ లేదా యూట్యూబ్ లో చూడాలి.. ధన్యవాదాలు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి