ఆ సినిమాలు విడుదలై ఐదేళ్లు గడిచిపోయింది.. కొన్ని
జనాదరణ పొందాయి, మరికొన్ని వారం తిరక్కుండా థియేటర్ల నుంచి
నిష్క్రమించాయి.. అవీ ఇవీ కూడా టీవీ చానళ్లలో పదేపదే ప్రసారమై, ఇప్పుడా
సినిమాలు వస్తుంటే నిరాసక్తంగా ఛానల్ మార్చేసే దశకి చేరుకున్నాయి. ఇప్పుడు ఆ
సినిమాలకి పిలిచి అవార్డులు ఇస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 2012, 2013
సంవత్సరాలకి 'నంది' అవార్డులు ప్రకటించారు.. త్వరలో.. అంటే సంబంధీకులు
అందరికీ వీలు కుదిరినప్పుడు.. వీటిని బహుకరిస్తారు.. ఆతర్వాత మళ్ళీ కమిటీలు
వేసి మరో రెండేళ్ళకి.. అటుపై 2016 వంతు వచ్చేసరికి ఎన్నాళ్ళు పడుతుందో?
ఒకప్పుడు
'నంది' అవార్డుల ప్రదానం క్రమం తప్పకుండా ఉగాది పండుగ రోజున జరిగేది. ఒకటి రెండు రోజులు ముందుగా బహుమతి విజేతల వివరాలు ప్రకటించే వాళ్ళు. ఉగాది మర్చి/ఏప్రిల్
నెలల్లో వస్తుంది కాబట్టి, మునుపటి ఆంగ్ల సంవత్సరంలో విడుదలైన సినిమాలకి
దరఖాస్తులు కోరడం, స్క్రూటినీ వగయిరాలన్నీ కొత్త సంవత్సరం మొదటి రెండు మూడు
నెలల్లో పూర్తి చేసేసి, తెలుగు ఉగాది నాటికి టంచన్ గా బహుమతులు ఇచ్చేసే
వాళ్ళు. మర్నాడు పేపర్లో బహుమతి ప్రదానం ఫోటోలు, తర్వాత కొన్ని రోజులపాటు
బహుమతి విజేతల ఇంటర్యూలు.. ఇలా సాగేది టీవీ వచ్చే వరకూ. దూరదర్శన్ వచ్చినా,
ప్రత్యక్ష ప్రసారం చేసేది కాదు.. ఓ ప్రత్యేక కార్యక్రమంగా ఓ అరగంట పాటు
ప్రసారం చేసేది, తర్వాతెప్పుడో.
చూస్తుండగానే ప్రయివేటు
చానళ్ళు వచ్చి లైవ్ కవరేజీలు ఇవ్వడం మొదలు పెట్టాయి. అటు తర్వాత నాటకాలకి,
టీవీ కార్యక్రమాలకీ కూడా నందులు విస్తరించాయి. ఈ క్రమంలో సినిమా నందుల షెడ్యూలు నెమ్మదిగా దెబ్బతినడం మొదలు పెట్టింది. ఉగాది పండుగకి కాక,
తర్వాతెప్పుడో ఓ ప్రత్యేక వేడుక జరపడం మొదలు, ఒక్కో సంవత్సరం ఎంట్రీలు
పిలవడం ఆలస్యం అవ్వడం వరకూ వచ్చింది. ఇంతలో, అనుకూలం కాని ప్రభుత్వం
అధికారంలోకి వచ్చినప్పుడు సినిమా పెద్దలు మూకుమ్మడిగా ఉత్సవాన్ని
బహిష్కరించడం ఈ పండుగలో మరోకోణం. కేవలం బహుమతి గ్రహీతలు మాత్రమే హాజరై,
మిగిలిన ప్రముఖులెవరూ రాకపోవడం అప్పట్లో ప్రభుత్వ పెద్దలకి కోప కారణం
అయిందన్న వార్తలూ వచ్చాయి.
ఈ ఆలస్యాలు వగయిరా కేవలం సినిమా
నందులకే పరిమితం కాలేదు.. నాటక, టీవీ నందులకీ విస్తరించాయి. సినిమా, టీవీ
నందుల కన్నా నంది నాటకాలకి కష్టం ఎక్కువ. ఎంట్రీలు పిలవడం, జడ్జీల బృందం
ఆయా ఊళ్లు తిరిగి నాటకాలు చూసి, ప్రదర్శనకి ఎంపిక చేయడం, వారం పదిరోజుల
పాటు ప్రదర్శనలు.. అటుపై బహుమతుల ప్రదానం. నంది బహుమతుల ఎంపిక వెనుక
రాజకీయాలని గురించి సినిమా వాళ్ళు దాదాపు గుంభనంగానే ఉంటారు కానీ, నాటక
సమాజాల వాళ్ళు ఎప్పటికప్పుడు కుండ బద్దలు కొట్టేస్తూ ఉంటారు. నిజం
చెప్పాలంటే, ఎక్కువమంది ప్రేక్షకులకి ఆమోదయోగ్యమైన ప్రదర్శనలకు నందులివ్వడం
ఒక్క నాటకాల విషయంలోనే జరుగుతోంది, ఇప్పటికీ.
ఇక, టీవీ నందులు ఏ
ప్రాతిపదికన ఇస్తారన్నది ఎవ్వరికీ అర్ధం కానీ విషయం. ఛానల్ కి ఇన్ని అని ఓ
అప్రకటిత కోటా ఉంటుందన్న రూమర్ ఒకటి బాగా తిరుగుతూ ఉంటుంది, ఆ నందులోత్సవం
జరిగినప్పుడల్లా. అన్ని నందులకీ మూలమైన సినిమా నందులు ఐదేళ్ల క్రితం
ఆగిపోయాయి. ప్రత్యేక తెలంగాణా, సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమాలు ఉధృతంగా
జరిగిన ఆ రోజుల్లో నందుల గొడవ పట్టలేదెవరికీ. తర్వాత, రాష్ట్ర విభజన,
ఎన్నికలు, రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు, ఆస్తుల పంపిణీ.. ఈ
గొడవల్లో నంది నాటకాలు జరుగుతూనే ఉన్నప్పటికీ, సినిమా నందులని మాత్రం
పక్కన పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం, నందులకి బదులు వారి రాష్ట్ర సంస్కృతిని
ప్రతిబింబించే అవార్డులు ప్రదానం చేస్తామని ప్రకటించగానే, సినిమా నందుల
సంగతి చూడడం మొదలు పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
నాటకాల
నందులు కళాకారులకి జీవనభృతి ఇస్తున్నాయి.. సినిమాలు, టీవీలతో
పోల్చినప్పుడు నాటక ప్రదర్శనలు.. మరీ ముఖ్యంగా పోటీల్లో ప్రదర్శించే
నాటకాలు.. ఇప్పటికీ కొన్ని విలువలకి కట్టుబడి ఉన్నాయి. కాబట్టి, నంది
నాటకోత్సవాలు జరగాల్సిందే. కానీ, టీవీ, సినిమా రంగాలకి కోట్లాది రూపాయలు
ఖర్చు చేసి నంది బహుమతులు ఇవ్వాల్సిన అవసరం ఏమిటో ఏమాత్రం అర్ధం కావడం
లేదు. ఆయా నటీనటులకు కొత్తగా వచ్చే పేరేదీ ఉండదు.. ప్రభుత్వానికి ఖర్చు
మినహా, బహుమతి సొమ్ము విజేతలకు పెద్ద మొత్తమేమీ కాదు. బహుమతుల కారణంగా
సినిమాలు, టీవీ కార్యక్రమాల్లో విలువలు, నాణ్యత పెరుగుతున్నాయా అంటే జవాబు
నేతి బీరకాయలో నేతి చందమే.
నిజమే, సినిమాలంటే కేవలం భారీ బడ్జెట్
వి మాత్రమే కాదు.. కానీ, చిన్న సినిమాలకి థియేటర్లు దొరకనట్టే, బహుమతులూ
పెద్దగా దొరకవన్నది బహిరంగ రహస్యం. టిక్కెట్ రేట్ల ప్రత్యేక పెంపు, వినోదం
పన్ను రాయితీ లాంటి అనేక రూపాల్లో అయినవారి సినిమాలకి ప్రభుత్వం సహాయాలు
ఎటూ చేస్తూనే ఉంది. జనం మర్చిపోయిన సినిమాలకి, ఎప్పటికీ అవ్వని సీరియళ్ళకి
బహుమతుల పండుగ చేసి పెద్ద ఎత్తున డబ్బు వృధా చేయడం ఇప్పుడు అవసరమా?
చివరగా మీరు అడిగింది మంచి ప్రశ్న.
రిప్లయితొలగించండి@అన్యగామి: ధన్యవాదాలండీ
రిప్లయితొలగించండి