మల్లాది రామకృష్ణ శాస్త్రి రాసిన రెండు నవలలు
'కృష్ణాతీరం' 'తేజోమూర్తులు,' అసంపూర్ణ నవల 'క్షేత్రయ్య' కలిపి సంకలనంగా
విడుదల చేసింది విశాలాంధ్ర ప్రచురణ సంస్థ. నిజానికి, మూడూ అసంపూర్ణ నవలలు
అనిపించాయి చదవడం పూర్తిచేశాక. కథని ఫలాని చోట ఆరంభించాలి, ఫలానీ విధంగా
ముగించాలి లాంటి పట్టింపులేవీ మల్లాది వారికి ఉన్నట్టు కనిపించవు. ఫలితం,
మొదటి రెండు నవలలూ హఠాత్తుగా మొదలై, అంతే హఠాత్తుగా ముగిసినట్టుగా
అనిపిస్తాయి. 'క్షేత్రయ్య' కి అయితే సరిగ్గా కథ పాకాన పడుతున్న తరుణంలో
రచయిత కలం ఆగిపోయింది, మరి కొనసాగలేదు.
'కృష్ణాతీరం' నవల
అవనిగడ్డ గ్రామంలో అన్నప్ప అనే వైదిక బ్రాహ్మణుడి కథ. వృత్తి రీత్యా
పౌరాణికుడైన అన్నప్ప ప్రవృత్తి సంసారాలని మరమ్మతు చేయడం. సొంత లాభం
బొత్తిగా చూసుకోని వాడేమీ కాదు కానీ, పొరుగువారి మేలు కోరుతూ ఉంటాడు.
ఒక్కగానొక్క కూతుర్ని ఊళ్ళో ఉన్న సంపన్న గృహస్థు రామావధాన్లు ఇంటి కోడల్ని
చేయాలన్న కోరిక కలుగుతుంది. అనుకోని అవాంతరాల వల్ల ఆ సంబంధం తప్పిపోయి,
తిరుపతి సంబంధం చేసుకుని సంతోషంగానే ఉంటుంది కూతురు. ఆ పిల్ల పెళ్లయ్యాక
అన్నప్పకి బుచ్చన్న పుడతాడు. అయితే, అక్కడ రామావధాన్లు ఇంట్లో ఇబ్బందులు మొదలవుతాయి. అన్నప్ప మధ్యవర్తిత్వం చేసి పెళ్లిచేసి రామావధాన్లు కూతురు అలిగి పుట్టింటికి వచ్చేయడం, అవధాన్లు గారి అబ్బాయి వేరే కులం పిల్లని పెళ్ళిచేసుకుని ఇల్లరికం వెళ్లిపోవడంతో బారికరావుడైపోయిన అవధాన్లు కాశీకి ప్రయాణం కట్టేస్తాడు. ఆ ఇంటి ఇల్లాలి బాధ చూడలేక ఆ ఇద్దరు పిల్లల కాపురాలు చక్కదిద్దే పని చంకనెత్తుకుంటాడు అన్నప్ప. అయితే, ఈ కథ అన్నప్ప దగ్గర మొదలవ్వదు. అతని కొడుకు బుచ్చన్న ఆర్ధిక పరిస్థితి దగ్గర మొదలై అన్నప్ప రోజుల నాటికి వెళ్లి, రామావధాన్లు కూతురు కాపురం చక్కబడబోతుండగా ముగుస్తుంది.
ఈ కథ కాని కథని కడకంటా ఆసక్తికరంగా చదివించేది
కాశీ మజిలీ కథల్ని తలపించే కథనం. ఒక కథ నుంచి మరో కథలోకి, అక్కడి నుంచి
ఇంకొక కథలోకి పాఠకులని అనాయాసంగా లాక్కుపోయే కథనం. ఆ కథనంతో పోటీ పడే జాను
తెనుగు భాష. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచనల్లో గోదావరి మాండలీకం ఎంత
సొగసుగా పలుకుతుందో, అంతే సొగసుగా కృష్ణాతీరపు మాండలీకం వినిపిస్తుంది
మల్లాది వారి రచనల్లో. అక్కడక్కడా ఉరుదూ, అరబ్బీ పదాలు లడ్డూలో పటిక
పలుకుల్లా తగులుతూ ఉంటాయి తప్ప, మిగిలినదంతా అచ్చమైన తెలుగే.
కథ
సంగతి ఇలా ఉండగా, పాత్రలన్నీ బహుమంచివి. కలికానికైనా 'చెడు' అన్నది
కనిపించదు. మరి కథ నడవడం ఎలాగ? అన్నప్ప పరిష్కరించేసే పాటి, వడ్లగింజలో
బియ్యపుగింజ తరహా సమస్యలు కేవలం కథ కోసం కనిపిస్తాయంతే. 'తేజోమూర్తులు'
సైతం నూటికి నూరుపాళ్లూ ఇంతే. ఎటొచ్చీ ఆ కథా స్థలం 'తవిశపూడి' అనే -
ఊహల్లో మాత్రమే ఉంటుందేమో అనిపించేసే - అందమైన పల్లెటూరు. ఆ ఊళ్ళో చెట్టూ
చేమా, రాయీ రప్పా కూడా కథలు వినిపించేస్తాయి. వాటి కథలు వినిపించే
హడావిడిలో పడి, నవలా రచయిత నవలానాయకుడి కథని పూర్తి చేయడం మర్చిపోయారేమో
అన్న సందేహం కలిగేస్తుంది.
వివాహం విఫలమై ఆత్మహత్యా ప్రయత్నం
చేసుకోబోయిన సీతమ్మని రక్షించి ఆశ్రయం ఇస్తుంది పూటకూళ్ళ ఇల్లు నడుపుకునే
వితంతువు అఖిలాండమ్మ. అక్కడ సీతమ్మకి తారసపడ్డాడు వెంకట్రామయ్య. దేవుడి
పటం ఎదుట పసుపుతాడు కట్టి, ఆమె కడుపున 'కోనయ్య' పడగానే మాయమైపోయాడు.
అతనికోసం ఎదురుచూపుల్తోనే జీవితం ముగిసిపోయింది సీతమ్మకి. విజయవాడలో హోటలు
వ్యాపారంలో చేయితిరిగిన కోనయ్యకి తండ్రిని చూడాలనిపించి తవిశపూడి కి
ప్రయాణం పెట్టుకున్నాడు, అది కూడా ఆ ఊరి వాడు, తన నేస్తం ముదారు సాహెబ్ తో
కలిసి. ప్రయాణం నిండా కథలు.. ఆ ఊళ్ళో అడుగుపెట్టింది మొదలు కథలే కథలు.
తవిశపూడిలో
ప్రతి గడపకే కోనయ్య ఆత్మీయుడిగానే కనిపిస్తాడు. అప్పటివరకూ కడుపులో
దాచుకున్న కథల్ని అతని చెవినేసి బరువు దింపుకుంటూ ఉంటారు. అలా చెప్పని
వాళ్ళ కథలు చెప్పేందుకు ముదారు ఉండనే ఉన్నాడు. ఏ కథకి ఆ కథే ప్రత్యేకం
కానీ, ఊరి మొగలో వెలిసిన అమ్మవారు, వెంకట్రామయ్య ఉంచుకున్న సుబ్బాముల కథలు
కొంచం ప్రత్యేకం. సీతారామయ్య గారబ్బాయి శ్రీరాములు కథనుంచే 'సీతారామయ్యగారి
మనవరాలు' సినిమాకి మూలమైన 'నవ్వినా కన్నీళ్లే' నవల పుట్టిందేమో అన్న
సందేహం కూడా కలిగింది. ఈ కథలన్నీ కంచికి చేరి ఇహనో ఇప్పుడో కోనయ్య తండ్రిని కలుస్తాడనుకుంటూ ఉండగా కథయిపోయింది పొమ్మంటారు రచయిత.
అన్నట్టు,
ఈ కోనయ్య కథా, అడివి బాపిరాజు గారి 'కోనంగి' నవలానాయకుడు కోనంగేశ్వర రావు
కథా దాదాపు ఒక్కలాంటివే. ఇద్దరూ బందరు ప్రాంతవాసులే కూడా. ఇక, 'క్షేత్రయ్య'
కి వచ్చేసరికి కథానాయకుడు వరదయ్య బాల్యం గడిచి, యవ్వనంలో ఉండగా మరదలు బాలా
రుక్మిణితో సరసం ఆరంభించగానే 'అసంపూర్ణం' అని కనిపించి ప్రాణం ఉసూరు
మంటుంది. ఆద్యంతాలు లేకపోతేనేమీ, ఆద్యంతమూ ఆసక్తి సడలకుండా చదివించే
నవలలివి. మల్లాదివారి కథలతో పోల్చినప్పుడు సులువుగానే కొరుకుడు పడతాయి
కూడా. (పేజీలు 226, వెల రూ. 190, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).
ఈ కృష్ణాతీరంలోనే కాదూ గోదారోళ్ళు మా కృష్ణా వాళ్ళ కంటె తక్కువేనంటారు... అందుకే మరాకృశా గారంటే గుర్ర్... :)
రిప్లయితొలగించండిఅసంపూర్ణంగా అనిపించడం...! మరాకృశా రచనా శైలి మౌలికంగానే అలా ఉంటుందేమో కదా. ఆయన కథల్లో ఆ అనుభవం. కథను గీతల్లో కంటె గీతల మధ్యనే ఎక్కువ చెబుతారు. ఒకోదశలో అసలేం చెబుతున్నారో అర్ధం చేసుకోవడమూ కష్టమే. పాఠకుడి మేధని గౌరవిస్తూనే దానికి పరీక పెడతారు గురువుగారు.
నిజానికి ఈ వ్యాసానికీ, వనితాదిన ప్రత్యేక రచన 'కొందరు నాయికలు'కూ నిన్ననే కామెంట్లు పెట్టాను. అవి మీ వరకూ చేరినట్టు లేవు. ఇప్పుడు మళ్ళీ అదంతా రాయలేక... ;)
@పురాణపండ ఫణి: కవిత్రయాన్ని తక్కువచేసి, భాగవతాన్ని మెచ్చుకోలు మాట అనిపించారండీ అన్నప్ప చేత.. కృష్ణ మీద ఆయన అభిమానం అలాంటిది. ఎంత చేసినా, వరుసలో భారతం తర్వాతే భాగవతం కదండీ.. ఆద్యుడు నన్నయ, తిరుగేముంది చెప్పండి? అన్నట్టు, మీ వ్యాఖ్యల కోసం స్పామ్ లో కూడా వెతికానండీ, బ్లాగర్ మింగేసినట్టుంది :( ..ధన్యవాదాలు
రిప్లయితొలగించండి