బుధవారం, మార్చి 22, 2017

దాహం -1

మిట్ట మధ్యాహ్నానికీ, సాయంత్రానికీ మధ్య సమయం. పనివాళ్ళు, డ్రైవరు పిలుపుకి అందుబాటులో ఉన్నారు. మిగిలిన అందరూ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. ఎవరినీ పిలవాలనిపించలేదు. నేరుగా కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను. కారు గేటు దాటుతుంటే, సెక్యూరిటీ గార్డు వంగి సలాం చేశాడు. ఎక్కడికి డ్రైవ్ చేయాలో నాకు తెలీదు.. కానీ, కాసేపు ఒంటరిగా గడపాలి.

నా సమయం ఎంత విలువైనదో, ఒక్కో నిమిషం ఖరీదూ ఎన్ని వేల రూపాయలకి సమానమో నాకు తెలియంది కాదు. సమయం విలువ గుర్తుకురాగానే, ఇన్నేళ్ల జీవితంలో నేను ఒక్కో మెట్టూ ఎదుగుతూ నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని చుట్టి రావాలనిపించింది.

ఎవరా చక్రవర్తి? ఇలాంటి కోరికే కలిగి గుర్రం మీద బయల్దేరాడట. ఎప్పుడో అరవయ్యేళ్ళ క్రితం అమ్మ చెప్పిన కథ. ఏనాటి అమ్మ.. ఏనాటి ఊరు.. తల్చుకోవడం ఇష్టం లేక, ఆ ఆలోచనలు వెనక్కి నెట్టేస్తూ వచ్చాను ఇన్నాళ్లూ.. అంతమాత్రాన అవన్నీ మర్చిపోయానని కాదు. అసలు, బాల్యాన్ని మర్చిపోవడం అన్నది సాధ్యమయ్యే పనేనా? 

నాన్న ఉన్నన్నాళ్ళూ రోజులు సంతోషంగానే గడిచాయి. తిండికీ, బట్టకీ లోటుండేది కాదు. బాగా గారం చేసి ఆలస్యంగా బళ్ళో వేశాడు నన్ను. నాతో పాటు చెల్లెళ్ళిద్దరినీ బడికి పంపించేది అమ్మ. ఐదో తరగతిలో ఉండగా ఒకరోజున క్లాసు మధ్యలో నన్ను పిలిచి, చెల్లెళ్లని తీసుకుని ఇంటికి వెళ్ళిపోమన్నారు మేష్టారు. ఎందుకో అర్ధం కాలేదు.

పుస్తకాలతో వెళ్లేసరికి ఇంటి గుమ్మంలో నాన్న శవం.. ఏడుస్తూన్న అమ్మ. మమ్మల్ని చూసి అమ్మ ఏడుపు ఇంకా పెరిగింది. చెల్లెళ్ళిద్దరూ అమ్మని చూస్తూనే గొల్లుమన్నారు. నాకెందుకో ఏడుపు రాలేదు. చూస్తూ ఉండిపోయాను. ఆ తర్వాత చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు ఏం చెప్తే అది చేశాను.. ఏమేం చేశానో నాకు గుర్తే లేదు.

దినకార్యం అవ్వడంతోనే బంధువులంతా ఎక్కడివాళ్ళు అక్కడ సద్దుకున్నారు. నాన్న చేసిన అప్పులకి ఉన్న పొలాన్ని చెల్లు వేయగా, ఉండడానికి ఇల్లు మిగిలింది. వేసవి సెలవులిచ్చే వరకూ బళ్లోకి వెళ్ళొచ్చాం నేనూ, చెళ్ళెళ్ళూ. వేసవిలోనే ఆకలి ఎలా ఉంటుందో మొదటిసారి తెలిసింది మాకు.

ఆ వేసవి జ్ఞాపకం రాగానే ఏసీ కార్లో కూడా నెత్తిన ఎండ చురుక్కు మంటున్నట్టూ, కాళ్ళు బొబ్బలెక్కి మండుతున్నట్టూ అనిపించేస్తోంది. అద్దాల్లోంచి బయటికి చూస్తే క్రమశిక్షణగా నిలబడ్డ పచ్చని చెట్లు, ఎత్తైన భవనాలు. నిత్యం కోట్లాది రూపాయల లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆ భవనాల్లోనే నడుస్తూ ఉంటాయి. ఆ చెట్లు, భవనాల్లాగే నా సంస్థల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా క్రమశిక్షణతో ఉంటారు. ఉండితీరాలి. అలాంటి వాళ్ళకే నా దగ్గర చోటు. 

వ్యాపారాలు విస్తరించడం మొదలు పెట్టిన కొత్తలో ఉద్యోగుల్నే ఒకరి మీద ఒకరిని గూఢచారులుగా నియమించేవాడిని. ఎక్కడ ఎవరు తోక జాడించబోతున్నారన్నా ముందుగానే నాకు తెలిసిపోయేది. రానురానూ నా ప్రమేయం లేకుండానే ఉద్యోగుల మధ్య పరస్పర శత్రుత్వం అన్నది వర్క్ కల్చర్ లో భాగంగా మారిపోయింది. ఫోన్ ట్యాపింగులు, క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు లాంటివన్నీ పనిని మరింత సులభం చేశాయి.

డ్రైవ్ చేస్తూ నా హోటల్ వరకూ వచ్చేశాను. మిగిలిన ఎస్టేట్ కన్నా కొంచం ప్రత్యేకంగా ఉంటుంది ఫైవ్ స్టార్ హోటల్. నా మనసులో కూడా ఈ హోటల్ ది ప్రత్యేకమైన స్థానమే. హోటల్ని చూస్తూనే ఆలోచనలు మళ్ళీ గతంలోకి పరుగులు తీస్తున్నాయి.

నాన్న పోయిన తర్వాత వచ్చిన ఆ వేసవి, ఎండలతో పాటు ఆకలి మంటల్నీ పట్టుకొచ్చింది మాకోసం. ఇంట్లో ఉన్న డబ్బు ఖర్చు పెట్టించి, శాస్త్ర ప్రకారం దినకార్యాలు చేయించిన బంధువులెవరూ ఆ తర్వాత మేమెలా ఉన్నామో అని తొంగి చూడలేదు. మమ్మల్ని చూడ్డానికి రాని వాళ్ళ ఇంటి గడప తొక్కి, సాయం అడగడం అమ్మకి ఇష్టం లేకపోయింది.

"ఆకలేస్తన్నాదా అబ్బయ్యా?" వీధిలో మడత మంచం మీద పడుకుని దొర్లుతుంటే, ఆవేళ రాత్రి నా కాళ్ళ దగ్గర కింద కూర్చుని అమ్మ అడిగిన మాట బాగా జ్ఞాపకం. నన్నెప్పుడూ ముద్దుపేరుతోనే పిలిచేది అమ్మ.

"ఏం సేద్దారయ్యా.. మీ నాయిన సూత్తే మనల్ని నడిమద్దెన ఇడిసిపెట్టేసేడు. సుట్టపోల్లెవరూ తొంగిసూట్టం లేదు.. అయినా ఒకల్లెంతకని సూత్తార్లే.." తనలో తను మాట్లాడుకుంటున్నట్టుగానే ఉంది.

"పొద్దుంలెగ్గానే నీకో పంజెబుతాను, సేత్తావా?" ..ఎందుకూ, ఏమిటీ అని అడక్కుండానే నేను సరే అన్నందుకు సంబరపడి ఇంట్లోకి వెళ్ళిపోయింది.

మర్నాడు పొద్దున్న లేచేసరికి వంటపొయ్యి ముందు ఉంది అమ్మ. పొయ్యి మీద పెద్ద గిన్నెలో ఇడ్లీలు ఉడుకుతున్నాయి. చెల్లెళ్ళిద్దరూ పొయ్యి ముందు కూర్చుని వంటవ్వడం కోసం ఎదురు చూస్తున్నారు. చిన్న సిల్వర్ కేను తోమి బోర్లించి ఉంది. ఆ పక్కనే, ఎండు తామరాకుల బొత్తి.

ఇడ్లీ వాయి పొయ్యి దిగడంతోనే, చెల్లెళ్ళిద్దరికీ చెరి రెండూ పెట్టి, "నువ్వూ తిందువు రా" అంది. నాకు తినాలనిపించలేదు. "ఇప్పుడు కాదు" అన్నాను ముక్తసరిగా. మిగిలిన ఇడ్లీలు, కేన్లో జాగ్రత్తగా సర్ది, చిన్న గిన్నెలో చట్నీ వేసి కదలకుండా ఇడ్లీల మధ్యలో పెట్టింది. కేనూ, ఆకుల కట్ట చేతిలో పెడుతూ, ఇడ్లీలెలా అమ్మాలో చెప్పింది. అమ్మకి మాత్రం పూర్తిగా తెలుసా ఏంటి?

"సిన్నోడివని బేరాలాడతారు, అరువెట్టమంటారు.. బేరాలు, అరువులు అయి రెండూ మాత్రం కుదరదని సెప్పెయ్యి. డబ్బు సేతిలో ఎడితేనే సరుకు.."

బేరం ఆడే అవకాశం ఏమాత్రం ఇవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ అరువుకి అవకాశం ఉండకూడదు. ఈ రెండే నా వ్యాపార రహస్యాలు, ఇవాళ్టికి కూడా. అయితే, ఈ సూత్రాలు నేను అమ్మే చోట మాత్రమే. అదే నేను కొనాల్సి వస్తే ఎంత చిన్న వస్తువైనా గీసి గీసి బేరమాడతాను. డబ్బులున్నా సరే తర్వాత ఇస్తానని చెబుతాను. ఇంత పెద్ద కస్టమర్ ని వదులుకోవడం ఇష్టం లేక సరే అంటారు అవతలి వాళ్ళు.

రానురానూ అవతలివాళ్ళూ తెలివి మీరుతున్నారని నాకొడుకులిద్దరూ అప్పుడప్పుడూ నాకు చెబుతూ ఉంటారు, అది కూడా నా మూడ్ ని బాగా గమనించి. అయితే నా మూడో కొడుకు మాత్రం నేనేది చేస్తే అదే ముమ్మాటికీ సరైనది అంటాడు. ఒక్కమాటలో చెప్పాలంటే "రేపు సూర్యుడు పడమరన ఉదయిస్తాడు" అని నేనంటే, తెల్లారి సూర్యోదయం కోసం పడమటి దిక్కున వెతుకుతాడు.

నిజానికి నాకిద్దరే కొడుకులు. ఈ మూడోకొడుకు అనే వాడు నా ఒకానొక వ్యాపార రహస్యం. నమ్మకంగా, కష్టపడి పనిచేసే ఉద్యోగస్తుడికి నా మూడోకొడుకు హోదా వస్తుంది. అదేమీ మామూలు విషయం కాదు. మొత్తం ఉద్యోగుల మీద పెత్తనం, వ్యవహారాలు అన్నింటిలోనూ సంప్రదింపు.. ఓ మామూలు ఉద్యోగి కల్లో కూడా ఊహించనివెన్నో అతనికి  అనుభవానికి వస్తాయి. దీంతో రోజులో ఇరవై నాలుగుగంటలూ అతనికి ఉద్యోగం తప్ప మరో ధ్యాస ఉండదు. నామాట జవదాటే ప్రశ్నే ఉండదు. అతని శక్తి, ఆసక్తి సన్నగిల్లినా, అతని మీద నా నమ్మకానికి బీటపడినా, మూడోకొడుకు స్థానంలో మరో ఉద్యోగి వచ్చేస్తాడు.

ఈ మూడోకొడుకు అనేది ఒక అశాశ్వితమైన పదవి అని తెలిసీ, దానికోసం విపరీతంగా పోటీ పడుతూ ఉంటారు నా ఉద్యోగులు. కనీసం ఒక్క రోజన్నా నా మూడో కొడుగ్గా ఉంటే చాలనుకునే వాళ్ళు ఉన్నారనడంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. మూడోకొడుకు స్థానం నుంచి నెట్టివేయబడిన వాళ్ళ వల్ల నాకేదైనా సమస్య వస్తుందేమో అని నా భార్యా బిడ్డలకి ఏమూలో చిన్న భయం. కానీ, వెళ్లిపోయిన వాళ్ళెవరికీ అంత శక్తి లేదని నాకు బాగా తెలుసు.

తిరిగి వెళ్ళడానికి ముందు కాసేపు నడవాలనిపించి కారుని పార్క్ చేశాను. కారు తాళం తప్ప నా దగ్గర ఇంకేమీ లేదు. డబ్బుతో సహా ఏదీ దగ్గరుంచుకునే అలవాటు లేదు. మొబైల్ ఫోన్ కూడా ఇంట్లోనే ఉంది. ఇంకా పూర్తిగా సాయంత్రం అవ్వకపోవడం వల్ల కొంచం వేడిగానే ఉంది వాతావరణం.

వేడి నాకు కొత్త కాదు.. తలమీద వేడి వేడి ఇడ్డెన్ల కేను, కాళ్ళ కింద ఎండ వేడి.. నోట మాట పెగిలే పరిస్థితి లేకపోయినా ఓపిక తెచ్చుకుని "ఇడ్లీలండీ.. ఇడ్లీలూ..." అంటూ కేక పెట్టుకుంటూ తిరిగిన మొదటి రోజున కొన్న వాళ్ళ కన్నా నావైపు వింతగా చూసిన వాళ్ళే ఎక్కువ. ఓపక్క "పాపం" అని జాలి పడుతూనే, మరోపక్క బేరాలాడ్డం, డబ్బులు రేపు తీసుకోమనడం చూశాక, అమ్మెందుకలా చెప్పిందో బాగా అర్ధమయ్యింది.

ఓ ఇంట్లో పెద్దావిడ, పిల్లల్ని ఊరుకోబెట్టడం కోసమేమో "అవి చద్ది ఇడ్డెన్లర్రా.. మీకు నే వేడిగా చేసిపెడతాగా.." అనడం వినిపించింది. అది మొదలు నా కేక మారింది.. "వేడేడి ఇడ్లీలండీ..." అన్న పిలుపు వింటూనే, నిజంగా వేడివో కాదో చూద్దామని పిలిచే వాళ్ళు కొందరు. బళ్ళో నాతో చదువుకున్న స్నేహితుల ఇళ్లలో ఇడ్లీలు అమ్మడానికి కూడా నేనేమీ సిగ్గు పడలేదు.

ఇంటికి తిరిగొచ్చేసరికి నాలుగు ఇడ్లీలు మిగిలాయి. అమ్మా నేనూ చెరో రెండూ తిన్నాం. ఆ ఇడ్లీల రుచి ఇవాళ్టికీ గుర్తుంది నాకు. వారం గడిచేసరికి నాకు సులువుగా ఇడ్లీలమ్మడం ఎలాగో తెలిసిపోయింది. ఏ ఇళ్లలో కొంటారో, ఎవరు కొనరో పసిగట్టగలిగాను. రెండు వారాలు గడిచేసరికి, మధ్యలో ఇంటికి వెళ్లి ఇంకో వాయి ఇడ్లీలు సర్దుకుని వెళ్లాల్సి వచ్చింది.

నెల్లాళ్ళవుతూనే మధ్యాహ్నం పూట ఉల్లిగారెలేసి ఇవ్వడం మొదలుపెట్టింది అమ్మ. క్షవరం చేయించుకోకపోవడంతో కేను పెట్టుకోడానికి, గాడుపు కొట్టకుండా చెవులు కప్పుకోడానికి అనువుగా మారింది నా జుట్టు. ఇడ్లీలు అమ్మేటప్పుడు పర్లేదు కానీ, గారెలు మోసుకు వెళ్లేప్పుడు కాళ్ళు కాలిపోయేవి. ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే ఇంట్లో నాన్న తోలు చెప్పులు కనిపించాయి.

రెండు రోజుల పాటు ఓ ప్లేటు ఇడ్లీ, ఓ ప్లేటు గారెలు కుట్టుకూలిగా ఊరికే ఇచ్చే ఒప్పందం మీద ఆ చెప్పుల్ని నా సైజుకి మార్పించుకున్నాను. ఆవేళ రాత్రి అమ్మ  "ఇంక మనకి పర్లేదబ్బయ్యా.." అంది ధైర్యంగా.

ఆరోజుల్లోనే ఊళ్ళో వాళ్ళు నా వెనుక అమ్మ గురించి ఏవో మాట్లాడుకునే వాళ్ళు. నాకర్ధమయ్యేది కాదు. ఆ మాటలకి అర్ధం తెలిసేనాటికి మేమా ఊరు విడిచిపెట్టేశాం.

ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ రోడ్డు మీద నడుస్తున్నాను. అయితే, ఈ రోడ్డు నేను వేయించుకున్నది. నా కాళ్ళకి ఇంట్లో వేసుకునే మామూలు చెప్పులున్నాయి. చుట్టూ పచ్చని చెట్లున్నాయి. ఒంటిమీద షరాయి, మల్లుచొక్కా హాయిగానే ఉన్నాయి. తలమీద ఏ బరువూ లేదు. అయినా, ఉండాల్సినంత హాయి లేదీ నడకలో.

అవును, అప్పుడు నావయసు పదేళ్లు, ఇప్పుడు డెబ్బై ఏళ్ళు. బాధ్యతలు బదలాయించి, విశ్రాంతి తీసుకోవాల్సిన వయసా ఇది? అసలు విశ్రాంతి అనే మాటకి అర్ధం ఉందా? ఇంట్లో ఉదయం విన్న మాట మరోసారి గుర్తొచ్చింది. బోర్డు మీటింగ్ ఉంది ఇవాళ. కొడుకులు, కోడళ్ళు కూడా బోర్డులో ఉన్నారు. చిన్న కొడుకు, కోడల్ని తొందర పెడుతున్నాడు మీటింగ్ కి టైం అయిపోతోందని.

"అక్కడికెళ్లి మనం చేసేదేముంది? ఆయన చెప్పినవాటికి తలూపి రావడమే కదా?" ఆ మాటలు నా చెవిన పడిన విషయం వాళ్ళిద్దరికీ తెలీదు. ఇంకెవరికీ నేను చెప్పలేదు.

పైన ఎండకో, కోడలి మాటలు గుర్తొచ్చినందుకో గొంతు తడారినట్టుగా ఉంది. దాహం కదూ ఇది? ఇప్పుడు నాకిక్కడ నీళ్లు దొరుకుతాయా?

 (ఇంకా ఉంది)

8 కామెంట్‌లు:

  1. చానాళ్ళకి!!

    మీ కథలు చదువుతూంటే.. ప్రతీ చిన్న సంఘటన, వివరం కథకి ఉపకరించేలా ఉంటాయని (ఉండాలనీ) అర్ధమవుతోంది. 'ఇడ్లీలు.. వేడేడి ఇడ్లీలు'గా రూపాంతరం చెందడం భలే నచ్చేసింది. :) 'అబ్బయ్య' కథ మొదలే ఆకర్షించాడు.

    రిప్లయితొలగించండి
  2. మూడో కొడుకు concept కొత్తగా అనిపించింది - కథ ఈ భాగం బావుంది.

    రిప్లయితొలగించండి
  3. బావుంది బావుంది. తర్వాత.. :)

    రిప్లయితొలగించండి
  4. @కొత్తావకాయ: నిజమండీ, చాలారోజులయ్యింది.. మొదలే ఆకర్షించినందుకు సంతోషంతో పాటు, చివరివరకూ అది నిలబడుతుందా అన్న ప్రశ్న కూడానండీ నాకు :) ..ధన్యవాదాలు
    @లలిత టీఎస్: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  5. @శ్రీనివాస్ పప్పు: లాభం లేదండీ, మీరు ఉలిక్కిపడేలాంటిది ఏదో ఒకటి రాయాల్సిందే ఇక :) ..ధన్యవాదాలు
    @ఎన్నెన్ మురళీధర్: వచ్చేస్తోందండీ :) ..ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  6. హమ్మాయ్యా...మొదటి పార్ట్ చదివేసాను
    భలేగా రాసారు...సెకండ్ పార్ట్ చదువుతాను ఇప్పుడు :)

    రిప్లయితొలగించండి
  7. @పద్మార్పిత: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి