సోమవారం, మార్చి 13, 2017

జీడిపళ్ళ పులుసు

ఆదివారం పూటా బజార్లో తిరుగుతుంటే ముక్కుకి సోకిన గతజన్మ స్మృతి లాంటి ఒకానొక వాసన దశాబ్దాల వెనక్కి తీసుకెళ్లింది. అదేమిటో అర్ధం కావడానికి కొన్ని క్షణాలు పట్టింది. అయ్యాక నాకే తెలియకుండా వెతుకులాట ఆరంభించాయి నా కళ్ళు. రోడ్డుకి ఓ పక్కన సైకిల్ నిలబెట్టి, ఆ సైకిల్ కి కట్టిన మూడు బుట్టల్లోనుంచీ పళ్ళని ఎంచి చూపిస్తూ నాబోటి వాళ్ళని ఆకర్షిస్తున్నాడో ఆసామీ. ఆ బుట్టలో ఉన్నవి 'జీడిపళ్ళు' గా పిలుచుకునే జీడిమామిడి పళ్ళు. వీటినే ముంతమామిడి పళ్ళు అని కూడా అంటూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో. బేరమాడకుండా ఓ బుజ్జి బేగ్గుడు పళ్ళు తీసుకుని, మిగిలిన పనులు పూర్తి చేసుకుని ఇంటికొచ్చా.

తాళం తీసుకుని ఇంట్లోకొచ్చి చేసిన మొదటి పని సదరు పళ్లతో చేయదగ్గ వంటకాల్ని ఇంటర్నెట్లో వెతకడం. ఆశ్చర్యంగా, వంటకాలేమీ కనిపించలేదు. చిన్నప్పుడు తిన్న చారూ, పులుసూ గుర్తొచ్చాయి. నాలుక ఆ రుచుల్ని గుర్తు చేసుకున్నంత చురుగ్గా, మెదడు వండే విధానాన్ని గుర్తు చేసుకోలేకపోతోంది. అవునుమరి, బొత్తిగా వంటింటి వైపు చూడని రోజులు కదా అవి. ఏవిటి సాధనం అని ఆలోచిస్తూ ఉండగా 'ఫోన్ ఇన్' ఆప్షన్ గుర్తొచ్చింది. "పులుసు పెట్టుకోవచ్చు.. మీకెటూ సాంబార్ చేయడం వచ్చు కదా.. కొంచం అటూ ఇటూ గా అదే పధ్ధతి" అంటూ మొదలై, పళ్ళని ముక్కలుగా ఎలా కోయాలి మొదలు పులుసుకి ఏ పిండి పెట్టాలి వరకూ వివరాలు వచ్చేశాయి.

చూసి నేర్చుకున్నదైనా, చదివినదైనా, విన్నదైనా సరే ఎంతోకొంత మార్పు చేయకపోతే నాకు తోచదు. దినుసులో, పాళ్లో మార్చి ప్రయత్నం చేసి చూడడం వల్ల నష్టం లేదుకదా అనుకుంటాను.. ఇలాంటి సందర్భాల్లో ఎటూ తినేది నేనొక్కణ్ణే కాబట్టి. సాంబార్ చేసే గిన్నెలో సగానికి నీళ్లు పోసి, స్టవ్ మీద వేడిచేస్తూ, మరోపక్క ట్యాప్ కింద పళ్ళని కడగడం మొదలు పెట్టాను. సహజంగానే కొంచం జిడ్డుగా ఉంటాయి కదా. లిక్విడ్ సోప్ వేయాలన్న కోరికని బలవంతంగా అణచుకుని, కడిగిన పళ్ళని చాపింగ్ బోర్డు కి మార్చా. నీళ్లు పొంగు రావడంతో చిటికెడు పసుపు వేసి, పళ్ళని పెద్ద పెద్ద ముక్కలుగా కోసి నీళ్ళలోకి జారవిడిచా. పులుసు, సాంబారుకి ముక్కలేవైనా పెద్దగా ఉంటేనే బావుంటాయి. పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చి పడేసి, చిన్న కప్పు నీళ్లలో చింతపండు నానబెట్టా.ఫోన్లో ఖర్చు వెచ్చాల మొదలు వేసవిలో పెరగబోయే కరెంటు బిల్లు వరకూ రకరకాల కబుర్లు అవుతున్నాయి.. రెండో స్టవ్ వెలిగించి, బాండీ పెట్టి, నూనె వేడవ్వగానే మిరియాలు, ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించి, స్టవ్ ఆపేశాను. కప్పులో చింతపండు నానడంతో రసం తీసి ఉడుకుతున్న ముక్కల్లో పోసి, ఓ బెల్లంముక్క, చారెడు ఉప్పూ కూడా జారవిడిచా. సాంబార్ గిన్నెలో పొంగు ఆగింది. బాండీలో వేగి చల్లారిన పోపుని మిక్సీ జార్లోకి మార్చి, మెత్తగా పొడి కొట్టేసరికి పులుసు మళ్ళీ పొంగడం మొదలయ్యింది. మిక్సీ లో పొడిని పులుసులోకి చేర్చి కలయతిప్పాను. అటు పక్క ఫోన్ ఎందుకో మ్యూట్ లోకి వెళ్ళింది. ఓపిగ్గా వేచి ఉండాలన్నది అనుభవం నేర్పిన పాఠం.

పులుసు మరుగుతున్న వాసన.. మళ్ళీ నాస్టాల్జియా.. జీడిపండు ముక్కలతో సమస్య ఏమిటంటే, ఇవి ఉడికాయో లేదో ఓ పట్టాన తెలీదు. చూడ్డానికి మరీ రబ్బరు ముక్కల్లా ఉంటాయి కానీ, ఉప్పూ, పులుసుతో పూర్తిగా ఉడికాక రుచి అద్భుతం అంతే.. గిన్నెలో కోలాహలం మొదలవ్వడంతో తర్వాతి ఘట్టం గుర్తొచ్చింది. ఫోన్ అన్ మ్యూట్ అయ్యింది. పెద్దగా కష్ట పడకుండానే వరిపిండి డబ్బాని వెతికి పట్టుకుని, రెండు స్పూన్ల పిండి ఓ కప్పులోకి తీసుకుని, నీళ్లు పోసి కలుపుతూ పల్చని గంజిలా తయారు చేసి, ఆ మిశ్రమాన్ని సాంబారుగిన్నెలో కలిపేశాను. మళ్ళీ పొంగు చల్లారింది. కాస్త రుచి చూసి, కొంచం ఉప్పు చేర్చి, ఇంకా ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే పోపు గుర్తొచ్చింది.

తక్కువ మంటలో స్టవ్ వెలిగించి పులుసు గరిటె వేడిచేసి, సగానికి నూనె పోసి, అది వేడెక్కుతూ ఉండగానే ఇంగువ, మెంతులు, ఆవాలు వేసి, అవి మాడిపోకుండా జాగ్రత్త పడుతూ వేగిన మరుక్షణం "ధప్పళం తెర్లుతుంటే క్షీరసాగర మధనంలా కోలాహలంగా ఉండవలె - పోపు పడితే తొలకరిలా ఉరిమి రాచ్చిప్పలో ఉప్పెన రావలె" అన్న బుచ్చిలక్ష్మిని జ్ఞాపకం చేసుకుంటూ సాంబారు గిన్నెలో ఉప్పెనని సృష్టించేసి, స్టవ్ ఆపేశాను. కాల్ అవ్వడంతోనే, చవులూరించే జీడిపళ్ళ పులుసు స్పెషల్ డిష్ గా సండే స్పెషల్ లంచ్ పూర్తి చేసేశాను. పూర్వాశ్రమంలో ఎప్పుడో మద్రాసు స్నేహితులు చేసిపెట్టిన మావిడిపళ్ళ పులుసుని కూడా ఓసారి ప్రయత్నించాలనిపించింది, పులుసన్నం తినగానే..

6 వ్యాఖ్యలు:

కొత్తావకాయ చెప్పారు...

పురాస్మృతులు.. :)

Lakshmi Madiraju చెప్పారు...

super

Lalitha TS చెప్పారు...

జీడిమామిడిని తల్చుకునే బోల్డు ఏళ్లయింది - ఇంక వాటితో చేసిన పులుసు రెసిపీతో మీ బ్లాగు ఒట్టి బ్లాగు కాదు - బ్లాఘుమఘుమ :)

Hima bindu చెప్పారు...

జీడీ పళ్ళు అంటే గొంతు అంతా వగరు చుడానికి నోరు ఊరించే పండుతో ఇలా కూడా ..మామిడి పండ్లతో పులుసు అంటే మైండ్ బ్లాంక్ అవ్వుతుంది .... జయహో మురళి గారు మీకే సాధ్యం

మురళి చెప్పారు...

@కొత్తావకాయ: మీకూనా?!! ధన్యవాదాలు
@లక్ష్మి మాదిరాజు: ధన్యవాదాలండీ..

మురళి చెప్పారు...

@లలిత టీఎస్: అబ్బో అబ్బో.. 'బ్లాఘుమఘుమ' పేరు భలేగా ఉందండీ.. ధన్యవాదాలు
@హిమబిందు: లేదండీ, పులుసులో అస్సలు వగరు ఉండదు.. కాకపోతే బాగా ఉడికించాలి ఉప్పు, పులుసు, బెల్లం వేసి.. మావిడిపళ్ళ పులుసు తిన్నాను కానీ ఎప్పుడూ ట్రై చేయలేదండీ.. ఈ సమ్మర్ లో ఏమన్నా కుదిరితే చూడాలి :) ..ధన్యవాదాలు

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి