మంగళవారం, ఫిబ్రవరి 28, 2017

టాంక్ బండ్ కథలు

పుస్తకాల షాపు 'న్యూ అరైవల్స్' లో టాంక్ బండ్ ఫోటో ఉన్న కవర్ పేజీ చూడగానే హైదరాబాద్ గుర్తొచ్చేసింది. పుస్తకం చేతిలోకి తీసుకుని పేజీలు తిప్పుతుండగా "కథలు బాగున్నాయి సార్, చదవండి" అని సలహా ఇచ్చాడు షాపబ్బాయి. ఫలితంగా నలభై మూడు చిన్నకథలున్న సంకలనం నా చదవాల్సిన పుస్తకాల జాబితాలో చేరింది, ఓ రెండు వారాల క్రితం. చదువుతున్న పెద్ద పుస్తకాల మధ్య బ్రేకుల్లో అప్పుడో కథ, ఇప్పుడో కథ చొప్పున పూర్తి చేసేయొచ్చు అనుకుంటూ మొదటి రెండు మూడు కథలు చదివానో లేదో, మొత్తం పూర్తి చేసి కానీ పక్కన పెట్టలేమని అర్ధమయిపోయింది.

జంటనగరాల ప్రజలు వ్యాహాళికి వెళ్లే అనేకానేక ప్రదేశాల్లో టాంక్ బండ్ ఒకటి. నల్లని నీళ్లలో నిలువెత్తు బుద్ధ ప్రతిమ, కొంత కాలం క్రితం వరకూ తెలుగు వెలుగుల విగ్రహాలు, పచ్చని పచ్చిక వీటితో పాటు అనునిత్యం అక్కడ సమయం గడిపే వందల, వేల ప్రజానీకం. చూసే కన్ను ఉండాలే కానీ, కథలకి లోటేం ఉంటుంది? 'విపుల' 'చతుర' పత్రికల సంపాదక బాధ్యతలు నిర్వహిస్తున్న రచయిత చంద్రప్రతాప్ కంటికి కనిపించిన కథలన్నింటికీ ఈ సంకలనంలో చోటు దొరికింది. మెజారిటీ కథల నిడివి రెండు-మూడు పేజీలు కాగా, అతికొద్ది కథలు మాత్రం నాలుగు పేజీలకి విస్తరించాయి.

విడవకుండా చదివించే కథనాన్ని గురించి మొదట ప్రస్తావించాలి. కొన్ని సాధారణ కథలకి సైతం మెరుపు ముగింపు ఇచ్చి, ఆయాకథలు గుర్తుండిపోయేలా చేశారు రచయిత. టాంక్ బండ్ ని జీవనాధారం చేసుకున్న చిరు వ్యాపారులు, యాచకులు, వేశ్యలు, ద్యూటీ చేసే పోలీసులు, షికారుకు వచ్చే అనేక వయసుల వాళ్ళు, ప్రాణం తీసుకునే ప్రయత్నం చేసే అభాగ్యులు.. వీళ్లందరి కథలూ ఆపకుండా చదివిస్తాయి. జీవితం పట్ల రచయితకి ఉన్న ఆశావహ దృక్పధం కథలన్నింటిలోనూ మెరుస్తుంది. ఫలితం కొన్ని కథల ముగింపులో కించిత్ నాటకీయత కనిపించినా, 'అలాంటి కథలకి ఆ తరహా ముగింపే జరగాలి' అని పాఠకులని ఒప్పించేలా రాయడం రచయిత ప్రతిభే.


నిజానికి ఈ సంకలనంలో ఉన్న కథల తాలూకు వస్తువు పాతదే. ప్రేమ-పెళ్లి వైఫల్యం, నిరుద్యోగం, వృద్ధాప్య సమస్యలు, పేదరికం... ఇవన్నీ కథా సాహిత్యంలో విస్తృతంగా చర్చకి వచ్చిన ఇతివృత్తాలే. ఎందరో రచయితలు, ఈ సమస్యలని తమదైన దృష్టికోణం నుంచి కథలుగా మలిచారు. అయితే, చంద్రప్రతాప్ టాంక్ బండ్ ని కథా స్థలంగా ఎంచుకోవడంతో పాటు మానవతా సందేశాన్ని కథల్లో ఇమిడ్చే ప్రయత్నం చేశారు. అధికభాగం కథలకి ఆశావహ ముగింపునే ఇచ్చారు. అలతి మాటలతో కథల్ని నడిపించడంతో పాటు సందర్భానుసారంగా కోటబుల్ కోట్స్ ని సంభాషణల్లో పొదిగారు.

రచయితకి టాంక్ బండ్ పై ఉన్న ప్రేమని పాఠకులకి పట్టించే కథ 'సౌదామిని ఆంటీ!' అప్పటికి ముప్ఫయి ఎనిమిది కథల్లో టాంక్ బండ్ ని భిన్న కోణాల్లో చూసిన పాఠకులకి, ఈ కథలోని తండ్రి పాత్రలో రచయితని పోల్చుకోవడం పెద్ద కష్టం కాదు. ఒక ప్రదేశం మీద ఇంతటి ప్రేమ ఉండడం, అది ఏళ్ళ తరబడి కొనసాగడం ఆశ్చర్యమేమీ కాదు. తరచి చూసుకుంటే ప్రతి ఒక్కరికీ అలాంటి అనుబంధం ఉండే స్థలాలు ఉంటూనే ఉంటాయి. స్థలంతో పాటు అక్కడి అనేక జీవితాలని తడిమి చూపిన కథలివి. వేశ్యల్లోనూ, హిజ్రాల్లోనూ, చివరికి పోలీసుల్లోనూ మంచితనాన్ని చూసిన/చూపిన రచయిత ఆశావహ దృక్పధం పట్ల మాత్రం ఆశ్చర్యం కలగక మానదు.

'చతుర' మాసపత్రికలో మూడున్నరేళ్ల పాటు ప్రచురితమైన ఈ కథల్ని పుస్తక రూపంలో తీసుకొచ్చింది శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్. అతికొద్ది అచ్చుతప్పులు మినహా ప్రచురణకి సంబంధించి ఫిర్యాదులు లేవు. కథలు చదువుకునేందుకు మాత్రమే కాక, తక్కువ మాటల్లో ఎక్కువ కథని ఎలా చెప్పొచ్చో తెలుసుకోడానికి రిఫరెన్స్ గా కూడా ఉపయోగ పడుతుంది ఈ పుస్తకం. వెనుక అట్టమీది రచయిత పరిచయంలో ప్రస్తావించిన అముద్రిత రచనలన్నీ అచ్చులోకి రావాల్సిన అవసరం ఉందనిపించింది, పుస్తకం పూర్తి చేశాక. (పేజీలు 177, వెల రూ. 100, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

2 కామెంట్‌లు:

  1. మురళిగారు: మీ పుస్తకసమీక్షలు కొత్తపుస్తకాలు కొనాలి అనుకున్నప్పుడు మంచి రిఫరెన్స్ లా అనిపిస్తాయి - ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి