శుక్రవారం, ఆగస్టు 08, 2014

కృష్ణవేణి-17

నాలుగు రోజులై రంగశాయి సినిమా హాలుకి వెళ్ళడం లేదు. కృష్ణవేణి జ్వరపడింది. కొన్నాళ్ళుగా కొంచం తరచుగా ఆమెకి జ్వరం రావడం, రెండుమూడు రోజులకి తగ్గిపోడం మామూలైపోయింది. ఈసారి మాత్రం వారం రోజులైనా జ్వర తీవ్రత తగ్గు ముఖం పట్టే ఛాయలేవీ కనిపించడం లేదు. మగతలో ఉన్న ఆమెని ఒక్కదాన్నీ ఇంట్లో వదిలేసి పనిలోకి వెళ్ళడానికి అతనికి మనసొప్పడం లేదు.

బన్ రొట్టె అంటే అసహ్యం కృష్ణవేణికి. ఆమెకోసం జావ కాచడం నేర్చుకున్నాడు. ఏదో వేళలో ఆమెకి కొంచం పట్టించి, తనూ కొంత తాగి భోజనం అయింది అనిపిస్తున్నాడు. ఇల్లంతా ఘాటైన మందుల వాసన. మధ్యాహ్నం జావ తాగాక కొంచం ఓపిక వచ్చినట్టు అనిపించింది కృష్ణవేణికి. తలగడలకి ఆనుకుని మంచం మీద కూర్చుని, రంగశాయిని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడడం మొదలు పెట్టింది.

"ఇది మాయక్కకొచ్చిన జబ్బే.. నాకు బాగా తెలుత్తున్నాది. వొయిజ్జానికి లొంగేది కాదు. సంపేసేదే కానీ, బతకనిచ్చేదసలే కాదు. మాయక్క నెత్తీ నోరూ మొత్తుకుని సెప్పేది.. ఏ వొయిజ్జవూ పంజెయ్యదే అని.. నేనినిపించుకోలేదు.. ఉప్పుడు నువ్వూ అదే పంజేత్తన్నావు.." అలుపు తీర్చుకోడానికి ఆగింది. వినడం ఇష్టం లేనట్టుగా ముఖం పెట్టాడు రంగశాయి.

"నాకు తెల్సు.. నువ్వు నన్నిలాగొదిలెయి లేవని.. నీకెంత కట్టంగా వుంటాదో నాకన్నా బాగా ఇంకెవలికీ తెల్దు.. అయినాగానీ నాకు సెప్పక తప్పదు.. అనాసరంగా కట్టపడకు.. అప్పుల పాలవ్వకు.." మాట్లాడుతూ ఉండగా దగ్గొచ్చి, కళ్ళనీళ్ళు తిరిగాయి కృష్ణవేణికి. ఆమెని జాగ్రత్తగా పట్టుకుని, సరిగా కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగించాడు.

"ఉప్పటికిద్దరు డాట్టర్లని మారిసేవు. ఆల్లు రాసిచ్చిన మందులల్లా అట్టుకొత్తన్నావు.. ఎంత సదూలేందాన్నయినా ఎంతవుతాదో నాకు తెల్సు.."

తన నోటిమీద వేలుంచుకుని, ఆమెని మాట్లాడొద్దని సైగ చేస్తూ "అయ్యన్నీ ఉప్పుడెందుకు.. నేనున్నాను గదా సూసుకోటాకి.." అన్నాడు రంగశాయి.

"ఇయ్యాల కూంత ఓపికొచ్చింది.. నాలుగు మాటలు సెప్పుకోవాలనిపింతంది. అడ్డెట్టకుండా ఇను.. ఇదేటీ, అదేటీ అనొద్దు," కళ్ళతోనే బతిమాలింది.

ఆ కళ్ళలో మునుపటి కాంతి మచ్చుకైనా కనిపించడం లేదు. ఆమెని పరీక్షగా చూశాడు. జుట్టు చాలా రాలిపోయింది. కళ్ళు గుంటలు కట్టాయి. ముఖం పీక్కు పోయి ఉంది. పెదాలు ఎండిపోయాయి.

ఆలోచనల్లో ఎక్కడో పుట్టిన చిన్న భయం క్షణంలో ఒళ్ళంతా పాకిందతనికి. బయట పడకుండా ఉండడం కోసం సద్దుకుని కూర్చున్నాడు. కానీ, కృష్ణవేణి అతన్ని గమనించడంలేదు. తన ఆలోచనల్లో తనుంది.

"నీమీద మనసెందుగ్గలిగిందో ఇయ్యాల్టికీ ఇసిత్తరవే నాకు. కలిసో ఇంట్లో ఉంటావని కల్లో కూడా అనుకోలేదు. కానైతే అదురుట్టవో, మరోటో.. అవుకాసం దొరికింది. ఆ తరవాత.." ఆగింది ఒక్క క్షణం.

"తరవాత పెతీ ఆడదానికీ కలిగే ఆసే.. ఇంతా కాదు.. ఇసిత్తరవూ కాదు.. అది నాకూ కలిగింది. నీతో ఓ బిడ్డని కనాలని.. నీకెప్పుడూ సెప్పలేదు.. సెప్పాలనిపించలేదు. మా సిన్నమ్మంటావుండేది.. నలుగుర్నడిసే దార్లో గడ్డి మొల్దని.. ఆలీసంగా కనబడ్డాడీ మడిసి అనుకున్నాను.." గుక్క తిప్పుకుంది.

రంగశాయి కళ్ళలో బాధతో పాటు, ఆశ్చర్యమూ కనిపించిందామెకి. ఎందుకో ఉన్నట్టుండి ఆమెకి దుఃఖం పొంగుకొచ్చింది.

"ఏదో దక్కలేదన్న బాద లేదు నాకు.. దక్కింది శానా ఎక్కువని తెల్సు. నేనెల్లిపోటం కాయవనీ తెల్సు.. నువ్వెంత బాద పడతావన్నదీ తెల్సు.. అన్నీ తెల్సి, ఏవీ సెయ్యలేక పోతన్నాను సూడు..." వెక్కిళ్ళు పెట్టింది కృష్ణవేణి. తనే తమాయించుకుంది.

"సూడు.. నీ కోసం నేనేటీ సెయ్యలేను.. నాసేతుల్లో ఏటీ లేదు. అలాగని నిన్నిలా వొదిలెయ్టాకి మనసొప్పటం లేదు.. నేసెప్పేది నీకేమాత్తరం నచ్చదని తెల్సు నాకు. కానీ సెబుతున్నా.." ఆయాసంతో ఆగింది.

"సెప్పే ముందో మాట సెబుతాను, ఆలకించు. బుద్ది తెలిసేక నేనేనాడూ ఎవురికీ.. ఆకరికా దేవుడిక్కూడా.. సెయ్యెత్తి దండవెట్టిందాన్ని గాదు.. ఎట్టాలనిపించలేదు.. ఇయ్యాల నీకు సేతులెత్తి దండవెడతన్నాను.. నా మాట తీసెయ్యకు.. నేనెల్లిపోయాక ఉంకో పెల్లి సేసుకో.. ఈ ఒక్క కోరికా తీరుసు.." గదిలోనుంచి బయటికి వెళ్ళిపోయాడు రంగశాయి.

పది నిమిషాలన్నా గడవక ముందే మళ్ళీ గదిలోకి వచ్చాడు. అలాగే కూర్చుని ఉంది కృష్ణవేణి. మూసుకున్న రెప్పల నుంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. తువ్వాలుతో ఆమె ముఖం తుడిచాడు. భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి తీసుకున్నాడు. ఆమెని తన వొళ్ళో పడుకో బెట్టుకుని చిన్నగా జోకొట్టడం మొదలుపెట్టాడు.

"నా మాట తీసెయ్యవుగదా.." అడుగుతోంది కృష్ణవేణి.. అది మెలకువో, మగతో, నిద్రో తెలియడం లేదు.


మరో నాలుగు రోజులు మామూలుగానే గడిచిపోయాయి. ఐదో రోజు కూడా మామూలుగానే తెల్లారింది. కానీ, కృష్ణవేణి నిద్రలేవలేదు. మతిపోయిన వాడిలా కూర్చున్నాడు రంగశాయి.

ఆ వీధిలో ఎవరికీ అంత త్వరగా తెల్లారదు. ఎండెక్కుతూ ఉండగా ఎవరో తొక్కుతున్న సైకిలు వెనుక కేరియర్ మీద కూర్చుని వచ్చాడు కాశీ. చూడగానే పరిస్థితి అర్ధమయ్యింది అతనికి.

"ఇదేట్రా సాయీ ఇలాగయ్యింది? పది రోజులై రాపోతంటే ఆలు కాడికెల్తా సూసెల్దారనొచ్చేను.." కాశీ చేతులు గట్టిగా పట్టుకున్నాడు రంగశాయి.

"ఈ కాలు కాదు గానీ, కదల్టాకి ఇంకోడి సాయం కోసం సూడాల్సొత్తన్నాది. ఇయ్యన్నీ సరే గానీ, పరిత్తితేటిప్పుడు? కారేక్రమం జరిపించాల.. డబ్బుల మాటేటి? నీ కాడున్నాయా?" ఏమీ మాట్లాడలేదు రంగశాయి.

"ఎదవ డబ్బురా నాయినా.. అది నేకుండా ఏదీ జరగదు.. నీకాడేటీ లేవని తెలుత్తున్నాది గానీ, గుమత్తా గోరికీ, దొరీతే ఓనరు గోరిక్కూడా ఓ మాట సెప్పి డబ్బట్టుకొత్తాను. నువ్వెక్కడికీ కదలకు.. ఇలాటప్పుడిల్లు కదలగూడదు.. ఉప్పుడే వొచ్చెతానొరే.."

బయల్దేరబోతున్న కాశీని ఆపి ఏమేం తేవాలో చెప్పాడు రంగశాయి. ఒక్క క్షణం రంగశాయిని తేరిపారా చూసి, సైకిలెక్కాడు కాశీ.

అతను తిరిగి వచ్చేసరికి చుట్టుపక్కల ఆడవాళ్ళు నలుగురైదుగురు చేరారు అక్కడ. కబురు తెలిసి ఒక్కొక్కళ్ళూ వస్తున్నారు. తల దగ్గర వెలుగుతున్న నూనె దీపం చూస్తే తప్ప, వీధిలో చాపమీదున్న కృష్ణవేణి నిద్రపోతున్నట్టుగా అనిపిస్తోంది రంగశాయికి.

కాశీని చూస్తూనే ఆత్రంగా ఎదురెళ్ళి పూలబుట్ట అందుకున్నాడు. దేవుడికి పూజ చేస్తున్నంత శ్రద్ధగా పూలతో అలంకరించాడు కృష్ణవేణిని. ఉదయం నుంచీ మొదటిసారిగా అప్పుడు వచ్చింది అతనిలో కదలిక. కాశీ భుజం మీద తలపెట్టుకుని శబ్దం రాకుండా ఏడ్చాడు రంగశాయి. అతని భుజం తడుతూ ఉండిపోయాడు కాశీ.

జరగాల్సింది చూడాలంటూ చుట్టుపక్కల వాళ్ళు కంగారు పెట్టేవరకూ కదల్లేదు వాళ్ళు. ఎగిసి పడిన చితిమంటలు తగ్గు ముఖం పట్టేవరకూ శ్మశానంలోనే ఉండిపోయిన రంగశాయి, వీరబాహుడి పోరు పడలేక అర్ధరాత్రి వేళ రోడ్డు మీదకి వచ్చాడు.

ఆ తర్వాత, ఆ చుట్టుపక్కల ఎవరికీ అతను కనిపించలేదు.

(ఇక ముగింపే ఉంది)

9 కామెంట్‌లు:

  1. ఇన్నాళ్ళూ ఒక్కొక్క భాగం కొంచం కొంచం చదివి మళ్ళీ ఉత్సుకత ఆపుకోలేక తరవాయి భాగం కోసం ఎదురుచూడ్డం(ఎదురుచూపులే తియ్యనా అని తెలిసినా)ఆ టెన్షన్ తట్టుకోలేక అంతా అయ్యాకే చదువుదామని అట్టేపెట్టుకుని ఈ రోజే పూర్తిచేసానండీ.కొత్తవకాయ గారు చెప్పినట్టు అక్షరమక్షరం అద్భుతం అంతే మరోమాటలేదు.
    నిజంగా ఒక్కోచోట మసకబారిన చూపుతో చదవాల్సొచ్చిందండీ.

    "సువేగా"- ఎప్పటిదండి ఇది భలే గుర్తు చేసారు,మా పెద్దాయన మిల్లులో పనిచేసినప్పుడు అమలాపురం వెళ్ళేవారు దీనిమీదే,ఆయనకి తెలీకుండా ఈ బండి తొక్కిన నా మొట్టమొదటి అనుభవం మర్చిపోలేను.
    "మైలుతుత్తం వేసి ఉడికించిన మైదా"
    "ఆర్టోస్ డ్రింక్ సీసాలు"
    "ఆసాదులు గరగల్ని తలమీదపెట్టుకుని"

    చిన్ననాటి జ్ఞాపకాల్ని ఎన్నెన్ని తట్టిలేపారో సామీ ధన్యోస్మి. మీరు మా గోదారోళ్ళవడం మా అదురుట్టం నిజంగా.

    రిప్లయితొలగించండి
  2. "...... నిమ్మళంగా చెబుతాను, సరేనా" (కృష్ణవేణి-16) అంటూనే అటు తిరిగి మెల్లిగా ఫాస్ట్ ఫార్వర్డ్ బటన్ నొక్కేసారా? మీరు బలేవోరండి బాబూ.

    సీరియస్లీ, మంచి కధ చదివామనే తృప్తి కలిగించారు (నా మటుకు గోదావరి జిల్లా నోస్టాల్జియా పక్కన పెట్టినా కూడా మంచి కధ అనిపించింది). మనుష్యుల మధ్య పరిచయాలు, సంబంధాలు, ఫ్రస్టేషన్లు, వాటికి ముగింపులు బాగా చిత్రీకరించారు.

    రిప్లయితొలగించండి

  3. లక్ష్మి, తన బ్రతుకు తెరువుకోసం మళ్ళీ నాటకం వేయాలన్న ఆశ అడియాశ అవటం సంఘం లోని ఆధునికతను చూపినా, పాపం అనిపించింది. లక్ష్మి, రమాదేవి లాంటి వాళ్ళ జీవితాన్ని మీరెంతో గమనించారనిపిస్తోంది మురళిగారు. పదిహేనేళ్ళు ముందుకు జరిపేసి కాలంలో వచ్చిన మార్పుని చాలా సహజంగా చూపించారు.

    శెట్టి హొటెల్ ఉదంతం కూడా నాకు చాలా నచ్చింది మురళిగారు.

    పదమూడవ ఎపిసోడ్ లో ఎక్కువగా నాకు రెండు చుక్కల కథనం (..) కనిపించింది. ఒకప్పుడు మీరు ఈ చుక్కలు పెట్టటం గురించి నేర్చుకున్న విషయం రాసారు కదూ:) మంగళగౌరి రంగశాయిని వదిలించుకున్న విధానం రంగశాయిమీద సానుభూతిని పెంచింది.

    ఉగాది ముందర గ్రామదేవత జాతర గురించి పనిలో పనిగా మాలాంటి వాళ్ళకి చెప్పేసారు. ఆసాదులు,గరగలు సంక్రాంతి పండగలాగా ఊహించుకున్నాను. కాని సరైన బొమ్మ చూపించారు. బాగుందండి.

    కృష్ణవేణి ని పంపించేసారు. ఇప్పుడు రంగసాయి ఏమౌతాడండి. ఇప్పుడన్నా తన కొడుకు గుర్తొస్తాడా!

    అందరినీ మీ ఎదురుగ్గా కూచో పెట్టుకుని కథ చెప్పారు.
    ఇంకొక్క ఎపిసోడ్ లోనే పూర్తి చేసేస్తున్నారా? ఎందుకండి.....






    రిప్లయితొలగించండి
  4. కడదాకా సుఖంగా ఉంచుతారనుకుంటే ఇలా కడతేర్చారేమిటండీ..

    రిప్లయితొలగించండి
  5. @కొత్తావకాయ: అతి పెద్ద ప్రశంస!! ధన్యవాదాలండీ..
    @పప్పు శ్రీనివాస రావు: ఎంత శ్రద్ధగా చదివారో అసలు!! రాస్తున్నప్పుడు నాకు మైలుతుత్తం మైదా వాసన ముక్కుకి సోకింది.. ఆర్టోస్ రుచి నాలుక్కి గుర్తొచ్చింది (ముఖ్యంగా ద్రాక్ష).. కో-ఇన్సిడెన్స్ ఏమిటంటే నేనూ మొదట 'నడిపింది' సువేగానే అండీ. 'కిరసనాయిలు బండి' అని దానికో ముద్దు పేరు కూడానూ. నేనూ అన్నీ గుర్తు చేసుకుంటూ రాశాను.. ధన్యవాదాలండీ..
    @విన్నకోట నరసింహా రావు: కథ ప్రకారం తప్పలేదండీ మరి.. నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. @జయ: మీ 'గమనింపు' బాగా నచ్చిందండీ.. ప్రతి చిన్న విషయాన్నీ గమనిస్తూ, కథకి లింక్ చేసుకుంటూ చదివి మీరు చేసిన అలాలిసిస్ ఎంత సంతోషాన్నిచ్చిందో చెప్పలేను.. ప్రతి కథకీ ముగింపు తప్పదు కదండీ మరి.. ధన్యవాదాలు.
    @జ్యోతిర్మయి: తప్పలేదండీ :( సుఖంగా ఉంచెయ్య గలిగితే బాగుండునని ఎన్నిసార్లు అనుకున్నానో రాస్తున్నప్పుడు.. ...ధన్యవాదాలండీ.

    రిప్లయితొలగించండి
  7. ఏకబిగిని చదివాను. ఒక పాశ్చాత్య సంగీతకారుడెవరో తన సింఫొనీకి నోట్సుగా రాశాడుట - ఇది విన్నాక, శ్రోతలు చప్పట్లు కొట్టడం లాంటివేం చెయ్యకుండా నిశ్శబ్దంగా వెళ్ళిపోవాలి అని. కృష్ణవేణి చదవడం పూర్తయ్యాక మిగిలింది ఆ భావనే. ఈ రెండు మాటలు చెప్పడం కూడా అనవసరమే.

    రిప్లయితొలగించండి
  8. @నారాయణ స్వామి: మీ వ్యాఖ్య చూస్తూనే ఒక్క క్షణం తబ్బిబ్బు పడ్డానండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి