బుధవారం, ఆగస్టు 06, 2014

కృష్ణవేణి-16

ఫాల్గుణ మాసం పూర్తికావొస్తూ ఉండడంతో వసంతాగమన ఛాయలు కనిపిస్తున్నాయి అక్కడక్కడా. వేపచెట్టు మీద కోయిల గొంతు సవరించుకోనా వద్దా అన్న ఆలోచనలో ఉన్నట్టుంది. అమ్మవారి గుడి పూజారి పేర్రాజు, కోయిలని ఏమాత్రం పట్టించుకోకుండా వేప కొమ్మల్ని కోసి తోరణాలతో గుడిని అలంకరిస్తున్నాడు. ఉగాదికి కొంచం ముందుగా గ్రామదేవత జాతర.

వీధి గుమ్మంలో రాశిగా పోసి ఉన్న లేత మావిడాకులని గుమ్మాలకి కడుతున్నారు పంతులుగారు. బట్టతలా, కళ్ళజోడూ వచ్చినా ఆయనలో చురుకు తగ్గలేదు. ఇల్లు కడిగి ముగ్గులు పెడుతున్న సరస్వతమ్మ మాత్రం ఆయాసపడుతూ, ఇదివరకటి ఓపిక తగ్గిపోయినందుకు నిట్టూరుస్తోంది.

చీకటి పడుతూనే బిందెడు మంచి నీళ్ళు మూత, చెంబుతో సహా తెచ్చి వీధరుగు మీద పెట్టేసింది. పంతులుగారు తెచ్చిన పూలతో పది పన్నెండు చిన్నచిన్న మాలలల్లి పక్కన పెట్టింది.

అమ్మవారి గుడి దగ్గర డప్పు మీద దెబ్బ పడడంతోనే ఊళ్ళో హడావిడి మొదలయిపోయింది. కుర్రాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు కానీ, పెద్దవాళ్ళందరూ గుడి దగ్గరకి చేరారు, వాళ్ళతో పాటే చిన్నపిల్లలూ.

రంగురంగుల పైజమాలు, వాటిమీద మెరుపుల మెరుపుల గౌన్లు వేసుకుని, కాళ్ళకి గజ్జెలు కట్టుకున్న ఆసాదులు గరగల్ని తలమీద పెట్టుకుని లయబద్ధంగా ఆడడానికి సిద్ధ పడిపోయారు. పదిమంది ఆసాదుల్లో ఇద్దరు ఆడవాళ్ళు. ఓ పక్క డప్పులు, మరోపక్క డోలూ సన్నాయి మోగేస్తున్నాయి. రెండు గుంపులుగా విడిపోయిన ఆసాదులు రెండు చోట్లా నృత్యం చేస్తున్నారు.

తలపాగాల్లో జాగ్రత్తగా అమర్చిన ఇత్తడి గరగలు తళతళా మెరుస్తున్నాయి. కుండలంతంత ఉన్న ఆ గరగలు ఏమాత్రం కదలకుండా లయబద్ధంగా ఆడుతున్నారు ఆసాదులు. చిన్నపిల్లలు నోళ్ళు తెరుచుకుని చూస్తున్నారు ఆ సంబరాన్ని.

నేలమీద పరిచిన బరకం మీద రెండు రూపాయల నోటు పెట్టి,వెల్లకిలా పడుకుని లయబద్ధంగా కదులుతూ కంటి రెప్పతో ఆ నోటుని అందుకోడం లాంటి విద్యలు ప్రదర్శించారు ఆసాదులు.అర్ధరాత్రి అవుతూ ఉండగా సాంబ్రాణి ధూపాలతో అమ్మవారి ఊరేగింపు ఊళ్లోకి బయల్దేరింది.

పంతులుగారి ఇంటి దగ్గర ప్రత్యేకంగా ఆగి ఆటాడడం, తాంబూలం పుచ్చుకుని వెళ్ళడం రివాజు ఆసాదులకి. ఆట అవుతూనే, అలవాటు చొప్పున గరగలన్నింటికీ పూలదండలతో అలంకరించేందుకు సిద్ధపడింది సరస్వతమ్మ.

డప్పుల వాళ్ళు బిందెలో నీళ్ళు తాగుతూ ఉండగా, ఒక్కో ఆసాదూ ఆమె ముందు తల వంచి గరగకి దండ వేయించుకుంటున్నారు. చివరలో నిలబడ్డ స్త్రీని పరీక్షగా చూసింది సరస్వతమ్మ.

తలమీంచి గరగని తీసి చేత్తో పట్టుకుని, "నేనండమ్మా.. రమాదేవిని.. బావున్నారా?" నవ్వుతూ అడిగింది రమాదేవి.

"ఎక్కడో బాగా తెలిసిన మొహంలా కనిపిస్తోంది.. ఎవరా అనుకున్నాను? నువ్వేమిటమ్మా ఇక్కడ? నాటకాల్లో వేసే దానివి కదా?" ఆశ్చర్యంగా అడిగింది సరస్వతమ్మ.

"అదంతా పెద్ద కతమ్మా.. ఇయ్యాల రాత్రంతా జాగారవే.. పొద్దున్నే ఒచ్చి కనిపింతాను.. సెలవిప్పిచ్చండి," అంటూనే ముందు వెళ్తున్న ఆసాదుల్లో కలిసిపోయింది రమాదేవి.

"ఫలహారానికి వచ్చెయ్యమ్మా," వెనుకనుంచి చెప్పింది సరస్వతమ్మ.


తెల్లారుతూనే చీరలో వచ్చింది రమాదేవి. అలసట, నిద్రలేమితో పాటు ఇంకేదో తేడా కనిపిస్తోంది ఆమె ముఖంలో. ఇంట్లో చాలా మార్పే కనిపించిందామెకి. అలికి, ముగ్గులేసి ఉండే నట్టిల్లు గచ్చుతో మెరుస్తోంది. పెద్ద రేడియో స్థానాన్ని పోర్టబుల్ టీవీ ఆక్రమించింది.

"ఇలా అయిపోయావేమిటి రమాదేవీ? నాటకాల నుంచి గరగల్లోకి ఎప్పుడొచ్చావు?" పళ్ళెంలో ఉప్పుడు పిండి, చిన్న గిన్నెలో మెట్ట వంకాయ కాల్చి చేసిన పచ్చడి వేసి అందిస్తూ అడిగింది సరస్వతమ్మ.

"ఏనాటి నాటకాలమ్మా.. మనూల్లో ఆడే పదేనేల్లయిపోతంది.. ఆ తరవాత ఏడాదో, రెండేల్లో.. ఈదిలో తెరకట్టి సినిమాలు ఆడిచ్చటం వొచ్చాక నాటకాలు సూసేవోల్లు లేరు, ఆడిచ్చే వోల్లూ లేరు.. మర్నాలాటోల్లు బతకాలగదా.. నేను తినాల.. పిల్లలకెట్టుకోవాల," ఓసారి వీధిలోకి చూసింది.

"పనికోసం నెతుక్కుంటంటే తెల్సింది.. ఆడాసాదులు తొక్కువున్నారని.. కాలికి గెజ్జె కట్టటం అలవోటైన ఇజ్జే గదమ్మా.. పైగా దైవ కార్యం.. నాల్డబ్బుల్తోపాటు, కూతంత పున్యమూ వొత్తాది గదా అనేసి..." మంచినీళ్ళు తాగడం కోసం ఆగింది రమాదేవి.

"వయసు పెరిగిందనుకో.. అయినా ఇదివరకటి కళ కనిపించడం లేదు రమాదేవీ? ఆరోగ్యం బాగుండడం లేదా?" మరికొంచం ఉప్పుడు పిండి వడ్డిస్తూ అడిగింది సరస్వతమ్మ.

"మీరు మాత్తరం ఎంత మారిపోయేరు? పంతులుగారూ అంతే.. గబాల్న సూత్తే గుర్తట్టలేకుండా అయిపోయేరు," ఒక్క క్షణం ఆగింది.

"నా కతేం సెప్మంటారు సెప్పండి. నాటకాల్లాగే ఇదీ ఏడాది పొడూతా ఉండే పనేం కాదు. జాతర్లున్నప్పుడే సేతినిండా పని.. ఇస్సూత్తే దేవుడి సేవ.. అంటున్నప్పుడు సెయ్యకూడదుగదా. ఆయడ్డు రాగూడదని మాత్తర్లు వోడేను శాన్నాల్లు.. ఒద్దే వోడకూడదంట. తెలిసేతలికే ఒంట్లో తేడా పెట్టేసింది. ఒకటనిగాదమ్మా, పడాల్సినయి, పడకూడనియి అన్నీ పడ్డాను.." రమాదేవి గొంతులో బాధ తాలూకు జీర.

"చఛ.. బాధ పడకమ్మా.. నీ బతుకు నువ్వు బతుకుతున్నావు కదా.. బాధలు వొస్తూ పోతూ ఉంటాయి.." ఓదార్పుగా అంది సరస్వతమ్మ.

"నాకు మాత్తరం రాటవే తప్ప పోటం కనబడ్డం లేదమ్మగారూ.. మొగోడు సరైనోడైతే ఆడది ఎంతైనా కమ్ముకు రావొచ్చు. మా మాయున్నాడు సూడండి.. కల్సిరాపోగా నన్ను రోడ్డుమీదెట్టేడు. నాటకాలునన్ని రోజులు బానే ఉండేవోడు. తరవాత ఇంకేపన్లోనూ తిరంగా కుదురుకోలేదు.. మన్నారాయన్రావు గోరు రొండు మూడు సార్లు కొయిటా ఎల్లొచ్చేరన్తెల్సి ఆరిద్వారా ఈసా కార్డుకి ప్రెయిత్నం సేసేను.. పనవ్వలేదు..," ఆగి గుటక మింగింది రమాదేవి.

"మొగోడికి ఇంట్లో ఆడదేగదమ్మా లోకువ. పైగా నేనందర్లాటాడదాన్నీ గాదు.. గుడ్లిప్పుకుని నలుగుర్లోనూ గెంతులేసిందాన్ని.. నిజంగా గెంతులేసినన్నాలూ నోరిప్పలేదు. బేరాలు పోయిన కాన్నించీ ఆన్నోటికి సుతీ పతీ లేకండా పోయింది.. ఎవురికి సెప్పుకోవాలమ్మా.." ఉన్నట్టుండి మాట్లాడ్డం ఆపి, మౌనంగా ఉండిపోయింది రమాదేవి. టీ తెచ్చి ఇచ్చింది సరస్వతమ్మ.

"ఇంటింటికో కథమ్మా.. ఆడదానికే పెడతాడు భగవంతుడు," అంది చెయ్యి తుడుచుకుంటూ. కాసేపటి తర్వాత నోరిప్పింది రమాదేవి.

"ఓ రకంగా కృష్ణేని అదురుట్టవొంతురాలు అనిపిత్తా ఉంటాది. దానికోసం పెల్లాం, కాపరం వొదిలేసుకున్నాడో మొగోడు. నేనూ అందర్లాగే ఇదెన్నాల్లు సాగుద్దిలే, పెల్లాన్నే ఒదిలేసినోడికి కృష్ణేనో లెక్కా అనుకున్నాను.." ఆసక్తిగా చూసింది సరస్వతమ్మ.

"కానమ్మా, ఆల్ల ముందర ఏ మొగుడూ పెల్లవూ సాల్రంటే నమ్మండి. నా కల్లతో సూసింది సెబుతున్నాను. అచ్చరాలా పువ్వుల్లో పెట్టి సూసుకుంటన్నాడు దాన్ని.. దిట్టి తగిలేట్టున్నారిద్దరూను.." చెబుతున్నదల్లా పంతులుగారు రావడం చూసి మాట్లాడడం ఆపేసింది రమాదేవి.

"ఏమ్మా.. బావున్నావా?" అని పలకరించి, లోపలికి వెళ్ళారాయన.

"ఎల్లొత్తానమ్మా.. ఇన్నేల్లైనా ఈ రమాదేవిని ఇంకా గుర్తెట్టుకున్నారు, సంతోసం.. దేవుడు సల్లగా సూత్తే వొచ్చే ఏడాది మల్లీ కనిపింతాను."

బొట్టు పెట్టించుకుని, వెళ్ళడానికి లేస్తూ "పలారం శానా బాగున్నాదమ్మా," అంది రమాదేవి.

"కుక్కర్లో చేశానమ్మా," అంది సరస్వతమ్మ సంతోషంగా.

(ఇంకా ఉంది)

4 కామెంట్‌లు:

  1. మీ బ్లాగును క్రమం తప్పకుండా చదువుతున్నానండీ..చాలా చక్కగా సాగిపోతోంది. పంతులు గారికి పిల్లలు ఉంటే బాగుండును. నేను అందులో ఒదిగిపోవచ్చు. చిన్నప్పుడు మా నాన్నగారి నాటకాల సందడి గుర్తుకొని వస్తోంది. సరస్వతమ్మ మాదిరిగానే మా అమ్మ గారు కూడా వచ్చినవారికి వండి వడ్డించి పంపించే వారు. ఈ రెండు పాత్రల్ని ఇలాగే సాగిపోనీయండి ప్లీజ్..

    రిప్లయితొలగించండి
  2. ఒక్క ఊపులో కథని పదేళ్ళు ముందుకు తీసుకుపోయారుగా...

    రిప్లయితొలగించండి
  3. పదిహేనేళ్ళు గడిచిపోయాయన్నమాట. రంగశాయి, కృష్ణేణీ బావున్నారు. కథ ఇంకేం మలుపు తిరగబోతోందో!
    మీ బ్లాగు వాకిట్లోనే కూర్చున్నామని త్వరగా కానిచ్చేరు. నింపాదిగా చెప్పండి.

    రిప్లయితొలగించండి
  4. @Unknown: పంతులుగారు-సరస్వతమ్మ లాంటి జంటలు ఇంకా ఉన్నాయని తెలిసి సంతోషంగా ఉందండీ.. ఇప్పటివరకూ వాళ్ళ పిల్లల అవసరం రాలేదు కథకి.. ముందుముందేవన్నా వస్తుందేమో :) క్రమం తప్పకుండా చదువుతున్నండుకూ, అభిప్రాయం పంచుకున్నందుకూ ధన్యవాదాలు.
    @పురాణపండ ఫణి: సిట్యుయేషన్ డిమాండ్ చేసింది ఫణి గారూ.. డిమాండ్ చేసింది :)) ..ధన్యవాదాలండీ.
    @జ్యోతిర్మయి: అబ్బే అస్సలు లేదండీ.. నిమ్మళంగా చెబుతాను, సరేనా :) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి