"ఊరుకున్న వాళ్లకి ఉల్లీ, మిరియం పెట్టడం" అనేది
మా ఇంట్లో కొంచం తరచూ వినిపించే మాట. ఋషి మూలం, నదీ మూలం, భాషా మూలం ఇలాంటి
వాటి జోలికి వెళ్ళద్దని కదా పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. పైగా, అటునుంచి
వినిపించే మాటల్ని వెతుక్కుంటూ వెళ్తున్నామని తెలిస్తే ఇంకేమన్నా ఉందా? అలా
అని ఊరుకున్నా, పదేపదే వినిపించే మాటల ప్రభావం ఎంతోకొంత ఉండకుండా ఉండదు
కదా.
లేత బెండకాయలు చూడగానే ముద్దొచ్చాయి. ముందుగా వాటిని ఫోటో
తీయాలనిపించింది. ఆ తర్వాత కూర వండేయాలనిపించింది. అంతే కాదు, రొటీన్ కూరలు
ఎప్పుడూ చేసుకునేవే.. ఏదన్నా వెరయిటీ ప్రయత్నిస్తే.. అన్న ఆలోచనా
వచ్చేసింది. అదిగో, సరిగ్గా అప్పుడే ఈ ఉల్లీ మిరియం గుర్తొచ్చింది
అప్రయత్నంగా. ఎప్పుడూ కళకళ్ళాడే ఉల్లిపాయల బుట్ట ఖాళీగా కనిపించింది.
ఎవ్వరూ చెయ్యకపోతే కొత్త వంటలు ఎలా పుడతాయి అనిపించేసి,
బెండకాయలతో ఓ సరికొత్త వంటకం చెయ్యడానికి నడుం కట్టాను. స్టవ్ వెలిగించే
ముందే దినుసులు ఏమేం ఉన్నాయో చూసుకోడం విధాయకం కదా. వంటనూనె కొంచమే ఉంది.
పెద్ద డబ్బాలోంచి తియ్యడం కొంచం క్లిష్టమైన పని. కాబట్టి, ఉన్న నూనె తోనే
వంట కానిచ్చేయడం క్షేమానికి క్షేమం, ఆరోగ్యానికి ఆరోగ్యం.
బాండీ వేడిచేసి, నూనె వెయ్యకుండా మిరియాలు, ధనియాలు, జీలకర్ర
వేడి చేయడం మొదలుపెట్టా. "చిట్టి చిట్టి మిరియాలు.. చెట్టుకింది పోసి..
బొమ్మరిల్లు కట్టి..." తర్వాతేమిటబ్బా? అని ఆలోచిస్తూ ఉండగానే బాండీలో
సుగంధ ద్రవ్యాలు (?) వేగిపోయినట్టుగా అనిపించేసింది. వాటిని మిక్సీ జార్
లోకి మార్చి, కాస్త నూనె పోశాను బాండీలో. నూనె కాగే లోగా బెండకాయలు కడిగి,
తుడిచి, కూర కోసం సమంగా తరిగేశా.
వేడెక్కిన నూనెలో బెండకాయ ముక్కలు వేసి, మూత పెట్టకుండా
వేగనిస్తూ, జార్ ని మిక్సీ లో పెట్టి ఓతిప్పు తిప్పుతూ ఉంటే గుర్తొచ్చింది..
"అల్లం వారింటికీ.. చల్లకి పోతే.. అల్లం వారి కుక్కా.. భౌ భౌ మన్నదీ.."
ఫ్రిజ్ లో అల్లం కూడా లేదు. కాబట్టి కూరలో అల్లం వెయ్యక్కర్లేదు. ముక్కలు
వేగాయనిపించాక, పసుపు, ఉప్పు జల్లి, ఓ క్షణం ఆగి జార్ లో పొడిని కూడా జల్లి
మూత పెట్టకుండా వేగించడం సాగించా.
బాండీలో వేగుతున్న వంటకాన్ని పరాగ్గా చూస్తే మాడుమొహం వేసిన
వేపుడులా ఉందే తప్ప, కూర కళ ఏకోశానా లేదు. వేపుడుని కూరగా మార్చాలంటే
ఏవిటి సాధనం? ...గ్రేవీ. ఎస్, ఏదన్నా గ్రేవీ వేసేసి దీన్ని కూరగా
మార్చేయవచ్చు. సమయానికి ఉపాయం తట్టినందుకు నన్ను నేను అభినందించుకుంటూ
గ్రేవీ కోసం పనికొచ్చేవి ఏమేం ఉన్నాయా అని వెతికితే పచ్చి కొబ్బరి,
జీడిపప్పు కనిపించాయి.
కాసిన్ని కొబ్బరి ముక్కలు, నాలుగైదు జీడి పలుకులు కలిపి
మిక్సీలో పొడికొట్టి కాసిన్ని పాల చుక్కలు కలిపి ఇంకో తిప్పు తిప్పితే
గ్రేవీ సిద్ధం. మూత పెట్టకపోవడం వల్ల పొడి పొడిగా వేగిపోయాయి బెండకాయ
ముక్కలు. వాటి మీద గ్రేవీ పోసి, మూత పెట్టి, మూత మీద నీళ్ళు పోసి, మంట బాగా
తగ్గించేశా. తదుపరి కర్తవ్యం ఏమిటా అనుకుంటూ ఉండగా 'గార్నిష్'
గుర్తొచ్చింది. కొత్తిమీర తరిగి సిద్ధం పెట్టేశాను.
బాండీ మూత తీసి చూస్తే అందమైన కూర సిద్ధం. కొత్తిమీర జల్లేసి, సర్వింగ్
బౌల్ లోకి మార్చేశా. గ్రేవీ వల్లనుకుంటా కొంచం జిగురొచ్చింది. వేడి వేడి
అన్నం, గోధుమ రొట్టె రెంటితోనూ బాగుంది కూర. మరీ ఘాటైన వంటలు ఇష్టపడే వాళ్ళ
సంగతి చెప్పలేను కానీ, కొత్తవి ప్రయత్నం చేయాలి అనుకునే వాళ్లకి
నచ్చుతుందనిపించింది.
మొత్తానికి మంచి ఎక్స్పెరిమెంటే చేసారండి. చూట్టనికైతే బాగానే ఉంది మరి:))
రిప్లయితొలగించండి@జయ: ఏమాటకామాటేనండీ.. రుచి కూడా బావుంది :) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి