బుధవారం, ఆగస్టు 27, 2014

నాటకరంగం

తెలుగు నాటకరంగం ఎటు వెళ్తోంది? గడిచిన ఏడాది కాలంగా చూసిన నాటక ప్రదర్శనలని గుర్తు చేసుకున్నప్పుడు అప్రయత్నంగానే ఈ ప్రశ్న వచ్చేసింది. 'నాటకం' అన్న పేరే తప్ప ఎక్కువగా ప్రదర్శనలు జరుపుకుంటున్నవీ, పరిషత్తులు జరుగుతున్నవీ నాటికలే. పౌరాణికాలని పక్కన పెడితే, తెలుగులో ప్రదర్శనా యోగ్యమైన నాటకాలు వేళ్ళమీద లెక్కించదగినన్ని.

మూడు గంటల పాటు నాటకం వెయ్యాలంటే దానికి ఎంతో పరిశ్రమ అవసరం. రసభంగం గానీ అయినట్టయితే, ప్రేక్షకులకి కలిగే శ్రమ వర్ణనాతీతం. కారణాలు ఏమైతేనేం, ఇప్పుడు నాటకం అంటే నలభై నుంచి యాభై నిమిషాల నిడివి ఉండే సాంఘిక నాటిక. ఒకట్రెండు స్త్రీపాత్రలు సహా ఐదారుగురు నటులు, అదే సంఖ్యలో సాంకేతిక నిపుణులు. ఓ రెండు, మూడు నెలల రిహార్సల్స్. అటుపై రాష్ట్రంలో జరిగే అన్ని పరిషత్తులలో వీలైనన్ని చోట్ల పాల్గోవడం. ఆర్నెల్లో, ఏడాదో గడవగానే మరో కొత్త నాటిక పనులు మొదలు.

రెండు దశాబ్దాల క్రితం వృత్తి నాటకాలు దాదాపుగా కనుమరుగై, పరిషత్తులు అంతంత మాత్రంగానే ఉన్న తరుణంలో తెలుగు నాటకం మనుగడ ప్రశార్ధకం అయ్యింది. ఆ సమయంలోనే రాష్ర ప్రభుత్వం 'నంది నాటకోత్సవాలు' మొదలు పెట్టడంతో నిజంగానే నాటకరంగానికి ఊపు వచ్చింది. మూసివేత దశకి వచ్చిన నాటక సంఘాలు కొత్త ఊపిరి పోసుకున్నాయి. కొందరు పాత నాటకాలకి మెరుగు పెడితే, మరికొందరు సరికొత్త నాటకాలతో పోటీకి సిద్ధ పడ్డారు.

ప్రభుత్వం అటు పౌరాణికాలు, ఇటు సాంఘికాలు రెంటినీ  ఆదరించే విధంగా నంది నాటకోత్సవాలని రూపు దిద్దడమే కాక, బహుమతి పొందిన నాటకాలు అన్ని ముఖ్య పట్టణాల్లోనూ ప్రదర్శించే విధంగానూ కార్యక్రమం తయారు చేసింది. కొన్నేళ్ళ పాటు ఉత్సాహంగా జరిగిన నంది నాటకాలు కాలక్రమేణా ప్రభుత్వం నిర్వహించే అనేక తంతుల్లో ఒకానొక తంతుగా మారిపోయాయి. తెరవెనుక రాజకీయ కారణాలూ ఇందుకు దోహదం చేశాయన్న మాటా పైకొచ్చింది.


ఒకప్పుడు హైదరాబాద్ రవీంద్రభారతి లో మాత్రమే జరిగిన నాటకోత్సవాలు తర్వాతి కాలంలో ఒక్కో సంవత్సరం ఒక్కో పట్టణంలో అన్న పద్ధతికి మారాయి. రాన్రానూ నాటకోత్సవాలు జరిగాయో, లేదో తెలియని పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు, రాష్ట్ర  విభజన తర్వాత ప్రశ్నార్ధకంగా ఉన్న అనేకానేక కార్యక్రమాలలో నంది నాటకాలు ఒకటి. సినిమా విషయంలో అయితే కళకి ఎల్లలు లేవు కానీ, నాటకం విషయం వచ్చేసరికి పరిమితులు ఏమన్నా వస్తాయేమో చూడాలి. ప్రతి విషయమూ రాజకీయాలతో ముడి పడుతున్న సందర్భం ఇది.

నాటకాల నాణ్యత విషయానికి వస్తే అటు నాటక రచయితల్లోనూ, పరిషత్తు నిర్వాహకుల్లోనూ శ్రద్ధ సన్నగిల్లుతోందేమో అన్న సందేహం క్రమంగా పెరుగుతోంది. నాటికలు, అయితే ఎనభైల నాటి మెలోడ్రమటిక్ పద్ధతిలో లేదా వర్తమాన విషయాలు అన్నింటినీ కవర్ చేసేయాలన్న ఆత్రుతతో వార్తలని తలపిస్తున్నట్టుగా ఉంటున్నాయి చాలావరకు. రాశి పెరిగినంతగా వాసి పెరగలేదన్నది సత్యం. ఒకవేళ ఎక్కడన్నా ఓ మంచి నాటిక వచ్చినా, దాని ప్రదర్శనా కాలం ఏడాదికన్నా తక్కువే ఉంటోంది.

నటీనటుల విషయానికి వస్తే, రంగస్థలం మీద కెరీర్ మొదలు పెట్టి టీవీల్లో అవకాశాలు సంపాదించుకున్నవాళ్ళు నాటకాన్ని విడిచిపెట్టలేదు. నాటకాల నుంచి సినిమాలకి వెళ్ళిన వాళ్ళతో పోలిస్తే, రంగస్థలంతో వీళ్ళ అనుబంధం ధృడంగా కొనసాగుతోందనే చెప్పాలి. పెరుగుతున్న ఖర్చులకి తగ్గట్టు పారితోషికాలు పెరక్క పోయినా, సినిమాలు, టీవీలు, క్రికెట్ మ్యాచ్ల వంటి కారణాలకి ఆడిటోరియాలు సగం మాత్రమే నిండుతున్నా నిబద్ధతతో నటిస్తున్నారు వీళ్ళు.

కళా మాధ్యమాలు అన్నింటిలోకీ నాటకం ఓ ప్రత్యేకమైన, శక్తివంతమైన మాధ్యమం. కాలానుగుణ మార్పులు ఉంటాయే తప్ప నాటకానికి ఏదో అయిపోతుందన్న భయం అక్కర్లేదు. 'నాటకరంగం మరణశయ్య మీదుంది' లాంటి రాజకీయ ప్రకటనలని నమ్మాల్సిన పనిలేదు. ఏదో జరుగుతుంది.. నాటకరంగానికి ఓ కొత్త వెలుగొస్తుంది.

2 కామెంట్‌లు: