చిన్నప్పుడు.. మూలగదిలో ఉన్న సందుగం పెట్టె నిండా
రకరకాల పుస్తకాలు. అవేవీ చదువుకునే క్లాసు పుస్తకాలు కాదు కాబట్టి రోజూ
వాటితో పనుండదు. బడి సెలవులప్పుడు, మరీ ముఖ్యంగా వేసంకాలంలో ఏళ్ళ తరబడి
నాకు కాలక్షేపం అందించిన ఆ పెట్టె నిజానికి ఓ జ్ఞాపకాల భోషాణం. ఆ పెట్టెలో
ఎప్పుడూ పెరుగుతూ ఉండే 'జ్యోతి' 'యువ' పుస్తకాలు ఎన్నెన్నో సెలవుల్ని
క్షణాల్లా గడిపేశాయి నాకు.
అదిగో, ఆ పుస్తకాల్లో ఆసక్తిగా
అనిపించిన పేర్లలో రెండు మరీ ప్రత్యేకమైనవి. ఒకటి వపా అనబడే వడ్డాది పాపయ్య
అయితే, రెండోది బాపూగా పిలవబడే సత్తిరాజు లక్ష్మీనారాయణ. వపా నీటి వర్ణ
చిత్రాలు కవర్ పేజీలనీ, చివరి పేజీలనీ మెరిపిస్తే, బాపూ రేఖా చిత్రాలు,
కార్టూనులు లోపలి పేజీలకి ప్రత్యేకతని అద్దేవి. వీళ్ళిద్దరి గురించీ నాకు
తెలియకుండానే చాలా విషయాలు తెలుసుకున్నాను నెమ్మదినెమ్మదిగా.
రచయితలు,
రచయిత్రులు పుస్తకాలు ప్రచురించుకున్నప్పుడు వాటికి బాపూ చేత కవర్ పేజీ
బొమ్మ వేయించుకోడాన్ని ఓ గౌరవంగా భావిస్తారు. పుస్తకం ప్రూఫ్ ప్రతితో పాటు,
ఓ చెక్కుని బాపూకి పంపడం, బొమ్మతోపాటు అభినందనలు చెబుతూ చెక్కుని తిప్పి
పంపించడం దాదాపుగా ఒక రివాజు. ఓసారి, ఒక రచయిత్రి విషయంలో మాత్రం బాపూ
చెక్కుని క్యాష్ చేసుకున్నారు. అదే సమయానికి నా మిత్రులొకరు బాపూ పక్కన
ఉండడం తటస్తించింది.
"చెక్కు బొమ్మకి కాదు, పుస్తకం చదివినందుకు,"
అన్నారట బాపూ. చమత్కారంతో పాటు, కొన్ని బొమ్మల వెనుక ఉండే చిత్రకారుడి
'శ్రమ' కూడా కనిపిస్తుంది కదూ మనకి. బాపూ బొమ్మలు లేని వంశీ కథని ఊహించగలమా
అసలు? సి. రామచంద్ర రావు రాసే కథలకోసం ఎదురు చూసినా, 'మూలింటామె' చదివి,
స్పందించి నామినికి ఉత్తరం రాసినా ఇదంతా సాహిత్యం మీద బాపూకి ఉన్న అభిమానం
తప్ప మరొకటి కాదు. చిత్రకారుడు సాహిత్యాభిమాని అయితే ఎంత చక్కని బొమ్మలు
దొరుకుతాయో పాఠకులకి. బాపూ బొమ్మని రెండు సార్లు చూడాలి - కథ చదవక ముందు,
చదివిన వెంటనే.
బొమ్మల బాపు, సినిమాల బాపు అని రెండు రకాలు.
ఇద్దరూ ఒక్కటే అనిపించదు ఎందుకో. (వంశీ విషయంలోనూ ఇంతే). బాపూ సినిమాల
కన్నా అందులో గోదారి గొప్పగా నచ్చేస్తుంది. 'ఏదో ఏదో అన్నది ఈ మసక
వెలుతురు' పాటలో సంగీత బావుంటుందా, గోదారి బావుంటుందా అంటే గబుక్కున జవాబు
చెప్పడం కష్టం. బాపూ బొమ్మలు చాలా వాటిల్లో పుస్తకాలో, పుస్తకాల అలమర్లో
తప్పకుండా కనిపిస్తాయి. తన సినిమాల్లో కూడా కనీసం కొన్ని ఫ్రేముల్లో అయినా
సరే బుక్ రాక్ కనిపించి తీరాలి. చదివే అలవాటుని ప్రోత్సహించడానికి తనవంతు
కృషి. ఎంత గొప్ప ఆలోచనో కదా!
బాపూకి దక్కాల్సినంత గౌరవం
దక్కలేదు అన్న ఫిర్యాదు చాలా మంది నుంచి చాలా సార్లే విన్నాను. నాకెందుకో
ఎప్పుడూ అలా అనిపించలేదు. బహుశా, నాకు తెలియకుండానే వపాతో పోల్చి చూడడం
వల్ల కాబోలు. శ్రీకాకుళంలోని తన చిన్న డాబా ఇంట్లోనే జీవితం మొత్తాన్ని
గడిపేసిన వపా గుర్తొస్తూ ఉంటాడు ఈమాట విన్నప్పుడల్లా. కేవలం చిత్రకారుడు
మాత్రమే కాక సినిమా దర్శకుడు కూడా కావడం వల్లే బాపూకి ఇప్పుడున్నంత
పేరొచ్చిందనిపిస్తూ ఉంటుంది. సినిమాలే లేకపోతే బాపూలాంటి అంతర్ముఖుడు
ప్రపంచం ముందుకు వచ్చేవాడా అసలు?
ఎనభయ్యేళ్ల పరిపూర్ణ జీవితం
చూసిన వాడు బాపు. నచ్చిన చదువు చదువుకుని, ఇష్టమైనన్ని బొమ్మలు గీసుకుని,
తీయగలిగినన్ని సినిమాలు తీసుకుని, అనేకానేకమంది అభిమానుల్ని ఒకే ఒక్క
ముళ్ళపూడి వెంకటరమణనీ సంపాదించుకుని, తన అభిరుచులైన సంగీత సాహిత్యాలని
విడిచిపెట్టకుండా జీవితాన్ని ప్రతిక్షణం జీవించాడు బాపు. తను గీసే
బొమ్మల్లాంటి అందమైన, రాసే అక్షరాల్లాంటి సొగసైన జీవితాన్ని గడిపాడు బాపు.
ఇలాంటి బాపూకి మరణం ఉంటుందా? భౌతికంగా ఎల్లకాలం ఉండడం ఎవరికీ సాధ్యం కాదు.
తెలుగు ఉన్నన్నాళ్ళు తెలుగు వాళ్ళ హృదిలో స్థిరంగా ఉండే కొందరిలో బాపూ
ఒకడు. ఒకేఒక్క బాపూకి అక్షరాంజలి.
వ.పా., బాపు ఇద్దరూ కూడా నాకు ప్రాణం. మీ అక్షరాంజలికి నా కృతజ్ణతలు. ఏడుపొస్తోందండి. రమణ గారు వెళ్ళిపోయిన తరువాత, ఎందుకో అనిపించింది ఇంక ఈయన కూడా ఎక్కువ కాలం ఉండరని.
రిప్లయితొలగించండి(మీ పెయింటింగ్స్ చూపించండి...)
Sir.... I think you have forgotten the pictures in "AMARAVATHI KATHALU"..... No one can except Bapu garu make such wonderful drawings....
రిప్లయితొలగించండిdhanyavaadaalu kanukolakullo thene binduvulu vaatanthata avey raalayi, aa raathalu, aa geethalu kallatho choodagaligaamani.
రిప్లయితొలగించండిanjaneyulu
పరమపదించె నయ్యొ మన 'బాపు ' - మహోన్నత కార్టునిస్టు; చి
రిప్లయితొలగించండిత్తరువుల సృష్టిలో యశము దాల్చు మహాద్భుత శిల్పి; అక్షరాల్
పరువపు కన్నె సోయగపు వంపుల రీతి లిఖించు స్రష్టయున్;
తెర పయి తెల్గు సంస్కృతికి దృశ్య మనోజ్ఞత గూర్చు దర్శకుం
డరయ - తెలుంగు లోకమున అంద మికెట్టుల బట్ట గట్టురో!
ఆ.వె. రాత ఘనుడు రమణ గీత ఘనుడు బాపు
రిప్లయితొలగించండిరాత గీత భువిని రాజ్యమేలె
రాత నిన్న చనెను గీత నేడు చనెను
రాత గీత దివిని రాజ్యమేలు
@జయ: అవునండీ.. గత మూడేళ్ళలో బాగా వొంగిపోయారు.. పెయింటింగ్ నాకిప్పుడు గతజన్మ జ్ఞాపకం లెండి.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@కిరణ్ కుమార్: మర్చిపోవడం కాదండీ.. ఏ కొన్నింటిని ప్రస్తావించినా, ఇంకా చాలా బొమ్మలు మిగిలిపోతాయి కదా.. నిజం, బాపూ బొమ్మలు లేని 'అమరావతి కథలు' ఊహకి కూడా అందవు. ధన్యవాదాలు.
@ఆంజనేయులు: అవునండీ.. పెద్ద విషాదం ఇది.. ..స్పందనకి ధన్యవాదాలు.
@డా. ఆచార్య ఫణీంద్ర: ఎంత చక్కని పద్యం అల్లారండీ! ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@శ్యామలీయం: అవునండీ, రాజ్యమేలేందుకే... ...ధన్యవాదాలు.