పొద్దు
వాటారబోతోంది. వాతావరణం గంభీరంగా ఉంది. నలుగురు పెద్ద మనుషుల్లోనూ ఇద్దరు
కుర్చీల్లోనూ, మరో ఇద్దరు ముక్కాలి పీటల మీదా కూర్చున్నారు. గోడకి ఆనుకుని
కూర్చున్నాడు రంగశాయి. గుమ్మానికి ఆనుకుని నిలబడింది మంగళగౌరి. ఈశ్వరబాబు,
సుగుణ వాళ్ళ గుమ్మానికి చేరబడ్డారు.
గంట దాటింది పంచాయితీ మొదలయ్యి. పెద్ద
మనుషులు టీలు పూర్తి చేసి చుట్టలు కూడా వెలిగించారు. తనవల్ల తప్పుందని ఒప్పుకోవడంలేదు మంగళగౌరి.
"కాపరాల్సేసుకునే ఇల్లలో ఇల్లాంటియ్యి కుదరవని సెప్పండి
దానికి. సంసార్లుండే ఇల్లియ్యీ.." సాగదీశాడు ఈశ్వరబాబు.
"ఓయబ్బో సంసారాలు.. అందరి సంసారాల కతా అందరికీ తెలుసున్నాదే.. ఇది నా
ఇల్లు. నా పక్కన ఉండలేనోల్లు ఏరే ఇల్లు సూసుకోవొచ్చు. అంత కట్టపడి
ఉండక్కర్లెద్దు," తనూ తగ్గకుండా సమాధానం చెప్పింది మంగళగౌరి.
"పెల్లాన్నలా
ఒదిలేసేవేట్రా నువ్వూ.. నాలుగు తగిలిత్తే దార్లోకొచ్చేది," తమ్ముడి మీద
పడ్డాడు ఈశ్వరబాబు. రంగశాయి ఏమీ మాట్లాడలేదు. మంగళగౌరి ఊరుకోలేదు.
"పెట్లో
ఉన్న పెల్లాం పట్టుసీర దానికి తెలకుండా అట్టూపోయి ఉంచుకున్న దానిక్కట్టబెట్నోడు కూడా నా గురించి మాట్టాడేవోడే.." ఆ మాటలు వింటూనే తల
వంచుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది సుగుణ. పళ్ళు పటపటా కొరికాడు ఈశ్వరబాబు.
"సూడండొలే.. మీ ఇద్దరికీ పెల్లయ్యింది. ఓ కొడుకుట్టేడు. ఆ
కుర్నాకొడుకుని అమ్మమ్మోలింటికి తోలేహేరు. ఇక్కడ సూత్తే మీ ఇద్దరిదీ
తలోదారి కిందా కనిపింతన్నాది. కాపరవన్నాక ఏయో ఉంటానే ఉంటాయి. ఎవులో ఒకలు
తగ్గాల. పలానీ వోల్లింట్లో ఇల్లాగంట అని మాటడిపోవాల్సొత్తాది. కులానికి సెడ్డపేరు," ఆగి అందరివైపూ చూశాడో పెద్దమనిషి.
"సిన్నోల్లు కాదుగదా ఇద్దరికిద్దరూను. ఆలోసించుకోండోపాలి. బాబొరే రంగసాయీ..
అదేవన్నా పరాయిదంట్రా.. అక్క కూతురే గదా నీకు.. ఎంత సక్కగా సూసుకోవాలి
సెప్పు? ఏదో సిన్న పిల్ల.. అయినియ్యేయో అయిపోయేయి.. సదిరేసుకోండి. కుర్రోన్ని
తెచ్చుకుని ఎట్టుకున్నారంటే అన్నీ అయ్యే దార్లోకొత్తాయి.." ఆ పెద్దమనిషే చాలా ఓపికగా మాట్లాడాడు. చూసి ఊరుకున్నాడు రంగశాయి.
"ఏటాన్ని బతివాలేది. ఆడేవీ మీక్కబురెట్టి పిల్లేదు గదా.. మిమ్మల్ని
పిలిసిన పెద్దమడిసి అడుగో అక్కడున్నాడు.. ఆడికే సెబుతున్నాను. ముసల్దిచ్చిన
ఈ ఇల్లు నాది.. ఎనకున్న కొబ్బురు సెట్లు కూడా నాయే. ఆటి పలసాయం సరిపోద్ది
నాకు. అమ్మా బాబూ ఉన్నారు, తోడ బుట్టినోల్లు ఉన్నారు. ఇంకోడి దయా
దాచ్చిన్యం అక్కర్లెద్దు నాకు," స్పష్టంగా చెప్పింది మంగళగౌరి.
"అది
కాదొలే.. మొగుడూ పెల్లాం అన్నాక కొంపా కాపరం ఉండాలి గదంటే," ఇందాకటి
పెద్దమనిషే మళ్ళీ అని, "నువ్వు నీ ఇట్టం వొచ్చినట్టు ఉంటానంటే ఎల్లాక్కుదురుతాదీ?" అనడిగాడు.
"ఎందుక్కుదరదూ.. మా రాజాలాగా కుదుర్తాది. నా ఇంట్లో నేనుంటన్నాను.
ఒకల్ల సొమ్ము తింటం లేదు.. ఒకల్ల జోలికెల్లటం లేదు. నా జోలికి కూడా
ఎవల్లూ రాకండా ఉంటే బాగుంటాది.." అంది మంగళగౌరి.
"మర్నీ మొగుడు.. ఆడి
మాటేటి?" రంగశాయిని చిరాగ్గా చూస్తూ అడిగాడు రెండో పెద్ద మనిషి. గోడ బీట నుంచి గడప నెరజలోకి బారుగా పాకుతున్న నల్లచీమల్ని శ్రద్ధగా చూస్తున్నాడు రంగశాయి.
"ఆన్ని కట్టుకున్నాను.. కొడుకుని కన్నాను.. కాబట్టే ఈ ఇల్లూ, సెట్లూ నాయి. ఆడి సంగతా, సంపాయిచ్చట్టుకొచ్చి నా సేతిలో ఎడితే కూడెడతాను. వొద్దనుకుంటే ఆడిట్టం. ఆణ్ణి నేనేటీ అడగను.. ఆడూ నన్నేటీ అడక్కూడదు. నేను ఎవుల్లకీ ఏటీ సెప్పుకోవక్కర్లెద్దు," స్థిరంగా చెప్పింది మంగళగౌరి.
ఈశ్వరబాబు పులుకూ పులుకూ చూస్తున్నాడు. ఈ తగువెలా తీర్చాలో
అర్ధం కాలేదు పెద్దమనుషులకి.
"నువ్వేటంటావురా?" నలుగురూ కూడబలుక్కుని
అడిగారు రంగశాయిని.
"ఇల్లూ, సెట్లూ వొదిలేసుకుంటాను.. దానిట్టవైనట్టు
సేసుకోమనండి," అన్నాడు రెండో ఆలోచన లేకుండా.
తమ్ముడికేదో అన్యాయం
జరిగిపోతున్నట్టు అనిపించింది ఈశ్వరబాబుకి. "బాగా ఆలోసిచ్చేవేరా,"
తమ్ముణ్ణి గాభరాగా అడిగాడు. అన్నగారి కళ్ళలోకి చూసి, తలూపాడు రంగశాయి.
"అంటే.. ఇంక ఈడికీ దానికీ ఏ
సమ్మందం లేనట్టేనా? ఆడు కట్టు గుడ్డల్తో బయిటికి నడాలా?" అడిగాడు ఈశ్వరబాబు.
"కాపరం తల్లే.. ఇంకోసారి ఆలోసిచ్చుకో..
మీయమ్మోలతో ఆలోసింతావా పోనీ?" పెద్దమనుషులు అడిగారు మంగళగౌరిని.
"ఇందులో ఆలోసించటాకేటుంది? సిన్న పిల్లలం కాదని మీరే సెప్పేరు
గదా.. మాకు పట్టంలేదు. ఎవుల్ల దారి ఆల్లం సూసుకుంటన్నాం అంతే.." అనేసింది.
"అయితే.. నా తమ్ముడు ఉంకో పెల్లి సేసుకోవొచ్చు గదా?" పెద్దమనుషులని అడిగాడు
ఈశ్వరబాబు.
"ఇల్లూ, సెట్లూ నాకొదిలేసి మారాజులాగా సేసుకోవొచ్చు.. సమ్మందాలు
సూసుకోమని సెప్పండి," అంది మంగళగౌరి.
ఈశ్వరబాబు ని పక్కకి పిలిచి "ఎంతయినా
పరాయిది కాదు కదంట్రా.. అల్లరిసెయ్యక సూసీ సూన్నట్టూరుకో. ఇందులో నీ తమ్ముడి తప్పూ
ఉందొరే.. ఆడు సరింగా సూడక పోబట్టే గదా.. దాన్దారి అది సూసుకున్నాది," అని
చెప్పాడో పెద్దమనిషి.
"ఆడదిలాటిదైనప్పుడు ఎవుడు మాత్రం ఏం సేత్తాడు
మాయ్యా," లోగొంతుతో అన్నాడు ఈశ్వరబాబు, బీడీ వెలిగించుకుంటూ.
"సూద్దార్లేరా.. నాల్రోజులోతే అన్నీ అయ్యే సదురుకుంటాయి," పెద్దమనిషి మాట
వినిపించుకోలేదు ఈశ్వరబాబు.
సూర్యాస్తమయం అవుతూ ఉండడంతో గూళ్ళకి చేరే హడావిడిలో ఆకాశంలో గుంపులు గుంపులుగా
ఎగురుతున్న పక్షులు కనిపించాయి, కూర్చున్న చోటినుంచి లేస్తున్న రంగశాయికి.
పెద్దమనుషులు ఇంకా బయల్దేరక ముందే, తన బట్టల
సంచీ సైకిలుకి తగిలించుకుని అన్నా వదినలకి చెప్పి సైకిలెక్కాడు,
"ఎదురుసూత్తా ఉంటాది.." అనుకుంటూ.
(ఇంకా ఉంది)
ఉత్త సెప్పడవేటండి. ఎప్పుడు రాత్తారా అని ఓ ఎదురు సూత్తంటేను.
రిప్లయితొలగించండిమొత్తం ఐపోయాక కామెంటుదామనుకున్నాను.బాగుందని ప్రత్యేకం చెప్పక్కరలేదు కదా:)))మళ్ళీ బంగారు బ్లాగు రోజులొచ్చాయనుకోమంటారా:)))ఎంత పోట్లాడినా సరే గోదారి పక్షపాతమొదులుకోరు కదా:))
రిప్లయితొలగించండి@జ్యోతిర్మయి: అయ్ బాబోయ్.. మా బాస.. మా బాస.. రాసేతన్నానండీ.. ఆలీసెం నేదసలు!
రిప్లయితొలగించండి@సునీత మన్నే: చూడబోతే గోదారి వాళ్ళకన్నా మిగిలిన వాళ్ళకే ఎక్కువ నచ్చినట్టుందండీ కృష్ణవేణి.. మీ ఫీడ్ బ్యాక్ నాకెంతో ఉపయోగం, మిగిలిన భాగాలు రాయడానికి.
అన్నారు కాబట్టి చెబుతున్నానండీ, పట్టుమని పది రోజులు కూడా ఎప్పుడూ గుంటూరులో లేను నేను.. ఆ ఊరి కథ ఎలా రాయగలను చెప్పండి? :) మీరు మొదలుపెట్టకూడదూ సరదాగా.. ..ధన్యవాదాలు.
'కృష్ణవేణి' రంగశాయి కథేనండీ అసలు. మరీ నచ్చేస్తున్నాడు.
రిప్లయితొలగించండి@కొత్తావకాయ: మీరెలా అనుకుంటే అలా అండీ :) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి