వయసు తెచ్చిన మార్పు పంతులుగారిలో కన్నా
సరస్వతమ్మలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇంట్లోనే నాలుగడుగులు వెయ్యాలన్నా కష్ట
పడుతోందామె. ఆయన పూజా పునస్కారాలతో కాలం గడుపుతూ ఉంటే, ఆవిడ ఎక్కువ సమయం టీవీ ముందు కాలక్షేపం చేసేస్తోంది.
ఇల్లు పాతబడిపోయి వెనకవైపు పెంకు జారిపోతోంది, ఎన్ని మరమ్మతులు చేయించినా. మొత్తం
కప్పంతా మార్చాలనే చెబుతున్నారు చూసిన మేస్త్రీలందరూ.
కుర్చీలో కూర్చుని,
భోజనాల బల్ల మీద కూరలు తరుక్కుంటున్న సరస్వతమ్మ, బట్టల మూటతో వస్తున్న
రత్తాల్ని చూసి, చేతిలో పని వదిలేసి ముందు గదిలోకి వచ్చింది, కొంగుతో చేతులు
తుడుచుకుంటూ.
"మియ్యి నాలుగు సీర్లు, రైకలు, లోపల్లంగాలు. పంతులు గారియి
నాలుగు పంచిలు, నాలుగు సొక్కాలు. ఇయ్యి కాకండా రెండు దుప్పట్లు, మూడు
తువ్వాళ్లు. బేగీ లెక్క సూడండమ్మా.. అవతల పనున్నాది," అంది రత్తాలు
హడావిడిగా.
"చూస్తున్నా ఉండవే.. నీకంతా కంగారే.. ఏవిటీ అంత అర్జెంటు పని?" అడిగింది సరస్వతమ్మ.
"సచ్చిమూర్తి
గోరి దినవారం బోజినానికెల్లాలి.. తినేసి సెయ్యి కడుక్కుని
ఒచ్చియ్యిలేంగదమ్మా.. ఏదొక పనుచ్చుకోవాల.." గోడకి జేరబడుతూ అంది రత్తాలు.
"మాయగా వెళ్లిపోయాడే పాపం," పాత డైరీలో పద్దు వెతుకుతూ అంది సరస్వతమ్మ.
"మరేనండమ్మా.. ఒద్దేరోజులు మంచాన్నడకుండా ఎల్లిపోయేరు.. ఇంతకీ ఆ కోళ్ళుగోరు బంగార్తల్లి. ఎంతబాగా సూసుకున్నాదో మాంగోర్ని.. "
"నీ కోడలికి మాత్రం ఏం తక్కువే? చక్కదనాల పిల్ల..
అన్నట్టు, మొన్న పేరంటంలో నా కొత్త చీరకి మరకయ్యిందే.. నీ కోడలికి చెప్పి
జాగ్రత్తగా పోగొట్టించు.." చెప్పింది సరస్వతమ్మ.
"ఏం సక్కదనాలో లెండమ్మా.. దానికల్లిప్పుడు ఐదరాబాదు
మీదున్నాయి. దానన్న అక్కడ పంజేత్తన్నాడుగదా.. మా వోడిక్కూడా పంజూత్తాను
ఒచ్చియ్య మన్నాడంట.. ఇదేమో మావోన్ని ఒకిటే కొరికేత్తన్నాది.."
"ఉద్యోగం అవుతుందన్నమాట మీవాడికి.. మంచిదే కదే"
"మన పెసిరెంటుగోరి మేడ కన్నా శానా పెద్దయ్యంట మేడలు.. పిప్పరమెంట్లో ఏయో కామాలమ్మా అంటారంట.." ఆలోచనలో పడింది.
"అవా.. అపార్ట్మెంట్లు అంటారే వాటిని.."
"ఆ
అయ్యే అయ్యే.. అందులో ఆచ్మన్ పనంట. ఆల్లే ఇల్లు కూడా ఇత్తారంట.. ఇత్తిరీ
కూడా సేసుకో వొచ్చంట.. మా సచ్చెవన్నయ్యోలు గూడా దెగ్గిర్లోలొనే ఉన్నారంట.
ఏయో శానా సెబుతున్నాదిలెండి.. మావోడేటంటాడో మరి. బేగీ లెక్క సూసెయ్యండమ్మా
ఎల్లొచ్చేత్తాను," కంగారు పెట్టింది.
"వచ్చే వచ్చే.. ఇదివరకటి ఓపిక ఉండట్లేదే
అమ్మా.. నా చీరలు ఉతుక్కి వెయ్యడం ముందెప్పుడన్నా చూశావా నువ్వు?" లోపల్నుంచి అడిగింది సరస్వతమ్మ.
"డాకటేరు
కాడికి ఎల్లి సూపించుకోండమ్మా.. మనూరికి నరసమ్మొచ్చిందిగదా.. ఆయమ్మకి
సెప్పినా ఏయైనా మందులిత్తాది?" సలహా చెప్పింది.
"నరసమ్మెవరే
రత్తాలూ?" ఆశ్చర్యంగా అడిగింది సరస్వతమ్మ.
"అయ్యో.. బలేటోరే అమ్మగోరూ..
గవమెంటోల్లు మనూరికి నరసమ్మనంపేరు.ఏ ఊల్లో ఉజ్జోగం అయితే ఆ ఊల్లోనే ఉండాలంట. ఆయమ్మి మొగుడు
రైసు మిల్లులో పంజేత్తాడంట. అద్దిలికిల్లు దొరూతాదా అంటా ఊరంతా
తిరిగింది మొన్న. సివరాకరికి ఆ గౌరమ్మ ఇల్లు కాలీగా ఉన్నాది గదా.. అందులో
జేరతానన్నాది," వివరంగా చెప్పింది రత్తాలు.
"ఎవరూ, మన మంగళగౌరి ఇల్లా?"
"అవునమ్మా..
ఆయమ్మ పేరు మీదేగదా సెలామణి. కట్టుకున్నోన్ని తరివేసింది.. ఉంచుకున్నోడు పెల్లి సేసుకుని ఈయమ్మినొగ్గేసేడు. దరిజాగా పుట్టింటికెల్లిపోయింది .
ఆల్లనెవులూ అడగరో ఏటో. ఇయ్యే మా ఇల్లల్లో జరీతే ఏడు మనూలోల్లనేత్తారు.." నిష్టూరపడింది రత్తాలు.
"అమ్మగోరూ.."
ఉన్నట్టుండి గొంతు తగ్గించింది తనే.
"ఏవిటే?" డబ్బు లెక్క చూస్తూ
అడిగింది సరస్వతమ్మ.
"ఆ బాబు జాడ తెలిసిందంటమ్మా.. రంగసాయి బాబు
కనబడ్డాడంట. పదేల్లైపోయిందిగదా కనపడకండా పోయి.. ఆసొదిలేసుకున్నారా
అన్నా వొదినీను. తిరపతి కాడో ఎక్కడో నాకు సరింగా తెల్దు కానీ
అక్కడుంటన్నాడంట," రహస్యం విప్పింది.
"సుగునమ్మేవీ సెప్పలేదా మీకూ?"
ఆరాగా అడిగింది. లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది సరస్వతమ్మ.
"ఆయమ్మదంతా
గుట్లెండమ్మా.." సాగదీస్తూ గుమ్మం దాటింది రత్తాలు.
మధ్యాహ్నం భోజనాలయ్యి, పంతులుగారు కునుకు తీస్తూ ఉండగా పేరంటం శనగలనుంచి
కొబ్బరి ముక్కలు వేరు చేస్తున్న సరస్వతమ్మ, వీధిలో అలికిడైతే తలెత్తి
చూసింది.
"మా తోడికోల్లండి.." తనతో పాటు వచ్చిన
ఆడమనిషిని సరస్వతమ్మకి
పరిచయం చేసింది సుగుణ. సన్నగా, పొట్టిగా, చామన చాయలో ఉందామె. కర్ర శరీరం.
కాయకష్టం చేసే మనిషని చూస్తేనే తెలిసిపోతోంది. ముతక అంచున్న కలనేత చీర
కట్టుకుంది. నూనె రాసి బిగ్గా అల్లుకున్న జడలో పెద్ద చామంతి పువ్వు
పెట్టుకుంది.
"ఇటెంపోల్లే గానీ తిరపద్దగర
రేనిగుంట్లో తిరపడ్డారండీల్లు.. మా మరిదిగోరు ఎక్కడెక్కడో తిరూతా ఐదారేల్ల కితం
ఈల్లుండే సోటికి ఎల్లేరంట.. ఈయమ్మి పెనివిటి లారీ డైవరు సేసేవోడంట..
పెమాదంలో పోయేడు. ఈల్లిద్దరికీ కలిసింది.. పెల్లి సేసుకున్నారు," చాపమీద కూర్చుంటూ వివరం చెప్పింది
సుగుణ.
ఇద్దరికీ టీ పట్టుకొచ్చి ఇస్తూ, "చాలా మంచివాడమ్మా
రంగశాయి.. పోనీలే ఇన్నాళ్ళకైనా ఈ ఊరు, మేవందరం గుర్తొచ్చాం మీ ఆయనకి,"
సరదాగా అంది సరస్వతమ్మ. నవ్వేసి ఊరుకుందామె.
"రాజాబాబుకి సమ్మంధం సూసేరంటండి మాయాడమొడుసుగారి పిల్లలు. మొన్నే గనపతొచ్చి కబురు సెప్పేడు.
ఈల్ల గురించి కూడా అప్పుడే తెల్సింది. సిన్న మాయ్యని పెల్లికి
పిలుత్తానత్తమ్మా అన్నాడు. రేపే పెల్లి. అన్నదమ్ములిద్దరూ ఎల్తారు. ఈయమ్మి
నాకాడుంటాది," చెప్పింది సుగుణ.
పక్కనే ఉన్న పెంకుటిల్లు దాదాపు శిధిలావస్థలో ఉంది. ఆవరణ అంతా
పిచ్చి మొక్కలు మొలిచి ఉన్నాయి.
"ఆ ఇంట్లోనేనాండీ రిగాల్సల్సు
జరిపించింది.." ఉన్నట్టుండి అడిగిందామె. ఆ ప్రశ్నవింటూనే ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు సుగుణ, సరస్వతమ్మ.
చాలా మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ "అవునమ్మా, మీ ఆయన చాలా బాగా వేశాడు
నాటకంలో," గుర్తు చేసుకుంటున్నట్టుగా చెప్పింది సరస్వతమ్మ.
"నాకంతా
తెల్సండి," నవ్విందా మనిషి. కాసేపు ఎవరూ ఏమీ మాట్లాడలేదు.
కాసేపటికి
సరస్వతమ్మే "పిల్లలా అమ్మా" అని అడిగింది. "లేరండి" అని క్లుప్తంగా
చెప్పిందామె.
సంభాషణ సాగడంలేదు. ఇబ్బంది ముగ్గురికీ తెలుస్తోంది.
కాసేపు చూసి, "ఎక్కడి పన్లక్కడే ఉండిపోయినియ్యండి.. ఎల్లొత్తాం
మరి.." అంది సుగుణ. తోటికోడలు కూడా లేవడానికి సిద్ధపడింది.
"బొట్టుంచుతాను" అంటూ కుంకుమ
భరిణె కోసం లోపలికి వెళ్ళింది సరస్వతమ్మ. ఆకాశం మబ్బు పట్టి ఉంది. ఏ
క్షణంలో అయినా వర్షం మొదలయ్యేలా ఉంది.
బొట్టు పెట్టి, వీధి గుమ్మం వరకూ సాగనంపడానికి వెళ్ళింది
సరస్వతమ్మ. ఉన్నట్టుండి చినుకులు మొదలయ్యాయి. చీర కొంగు
జాగ్రత్తగా తలమీదికి లాక్కుందామె.
"అడగడం మర్చేపోయేను.. నీ పేరేవిటమ్మా?"
అడిగింది సరస్వతమ్మ.
వేగంగా అడుగులేస్తున్నదల్లా ఒక్కసారి ఆగి, వెనక్కి
తిరిగి చెప్పింది..
"క్రిష్ణవేనంటారండి.."
(అయిపోయింది)
* * *
నా మడిసికి...
చక్కటి కథను అందించారండీ..పంతులు గారి ఇల్లు పాత పెంకుటిల్లు. దీన్ని నేయించాలంటే తీరదు. వదిలేయాలంటే ప్రాణం ఒప్పదు.. మా పాత ఇంటినే గుర్తు చేశారు. అంతే లేండి..గుర్తులు అలాగే ఉంటాయి. కథ మొత్తం మళ్లీ చదవాలనిపించిందండీ..ప్రతీ రోజు నెమలికన్ను చెక్ చేస్తూ వచ్చా..పంతులుగారు, సరస్వతమ్మ గారు లాంటి దంపతులు ఉన్నారండీ. పార్వతీ పరమేశ్వరులు ఉన్నట్లు. ఈ జనరేషన్ కు చూపించాలి కదా..
రిప్లయితొలగించండిసంపూర్ణంగా ఉంది కధ..
రిప్లయితొలగించండిమనసున మల్లెల మాలలూగాయి..
ఇలా ఎండ్ చేసారా ? బా రాసారండి ! ప్రతి పార్ట్ చదువుతూ వస్తున్నా అంతా అయ్యాక కామెంట్ పెడదామని :-))) బావుందండి నిజంగానే ఈ చివరి పార్ట్ ఊహించలేకపోయాను
రిప్లయితొలగించండి_/\_
రిప్లయితొలగించండిమొత్తానికి వృత్తం ఆ విధంగా పూర్తయింది. మీ బలం నెరేషన్. కథ చెక్కడానికి మీరు తీసుకున్న శ్రద్ధ అక్షరమక్షరంలో కనిపించింది.
రిప్లయితొలగించండిWow.. wonderful narration and story. Thank you so much!
రిప్లయితొలగించండినా కన్నీళ్ళు చాలా విలువైనవని నాకో నమ్మకం, పొగరూ.. మీ అక్షరాలు ఆ గట్టు తెంచేసినందుకు గర్వంగా, సంతోషంగా ఉందండీ. గోదారబ్బాయ్ గారూ, హృదయపూర్వక అభినందనలు!
రిప్లయితొలగించండిఎక్కడైపోయింది...మీ కృష్ణవేణి మా మనసుల్లో అలా గుర్తుండిపోతుంది. గొప్ప కథనం.
రిప్లయితొలగించండిమాండలికంలో వ్రాయడం కష్టమైన పని. మంచి రచన అందించినందుకు ధన్యవాదాలు మురళి గారు.
"నా మడిసికి"
రిప్లయితొలగించండిమనిషి పోతె మాత్రమేమి మనసు ఉంటది
మనసుతోటి మనసెపుడో కలసిపోతది
సావు పుటక లేనిదమ్మ నేస్తమన్నది
జనమ జనమ కది మరీ గట్టి పడతదీ
పాడుతా తియ్యగా సల్లగా....
(ఎందుకో తెలీదుకానీ ఆత్రేయ గుర్తొచ్చాడండీ)
ఫాస్ట్ గా ఓ పేద్ద లీప్.ఏమి చేస్తారు ఈ పాత్రలని అనిపించింది.అంటే కృష్ణవేని చావు దాకా కధలో మార్పులేదన్నమాట. ఆ తరువాత ముగింపు ఊహించకుండా భలే కొసమెరుపునిచ్చారు:)) ఇంకొన్ని ఇలాంటి మంచి నవలికలు మీ నుంచి ఆశిస్తూ అభినందనలు:))
రిప్లయితొలగించండిమురళిగారు, నాకు అర్ధమవ్వటానికి చాలా....చాలా సేపు పట్టింది. ఊహాతీతపు ముగింపు.నాకెందుకో మనసులో 'అరుంధతి' తళుక్కుమంది. నేను చదివిన చాలా కొద్ది కథల్లో ఇది కూడా ఓ మరపురాని కథ.
రిప్లయితొలగించండి'If there ever comes a day when we can not be together,keep me in your heart, I will stay there for ever'.....
very heart touching. kaani ending enduko nachaledandi. kotha krishaveni tana paata identity vadulukovalsivachidi kada.
రిప్లయితొలగించండి@Unknown: పెంకుటింటి సమస్యని ఎంత బాగా అర్ధం చేసుకున్నారండీ అసలు!! మొత్తం చదివి, అభిప్రాయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి@ధాత్రి: ఓహ్.. నాకు చాలా ఇష్టమైన పాటని గుర్తు చేశారు!! ధన్యవాదాలండీ..
@శ్రావ్య: మీ నుంచి ఒకట్రెండు ఫిర్యాదులు ఉంటాయని ఊహించానండీ.. మొత్తం అభిప్రాయం ఒకేసారి చెప్పడం వల్ల, మీకు జవాబులు దొరికేశాయేమో బహుశా :) ..ధన్యవాదాలు
రిప్లయితొలగించండి@Murthy Ravi: _/\_ (కీ బోర్డ్ అంతా వెతికి మీకోసం నేర్చుకున్నానండీ :) )
@పురాణపండ ఫణి: అవునండీ శాఖా చంక్రమణం!! బలంతో పాటే, బలహీనతలు కూడా చెబుతారని ఆశించాను. అన్నట్టు, ఈ సందర్భంగా ఒక విషయం.. ఈ 'కృష్ణవేణి' ఇలా రావడం వెనుక 'లవ్ లీ' కి మీరు రాసిన వ్యాఖ్య కూడా ఒక కారణం. ప్రత్యేక ధన్యవాదాలు మీకు.
రిప్లయితొలగించండి@Padmaja Esarapu: మొత్తం చదివి, అభిప్రాయం పంచుకున్నందుకు ధన్యవాదాలండీ..
@కొత్తావకాయ: ఏం చెప్పమంటారండీ!! కొన్ని సన్నివేశాలు రాసినప్పుడు అనుభవించిన స్ట్రగుల్, ఎమోషన్స్, మరికొన్ని రాసేప్పుడు చేసిన టైట్ రోప్ వాక్.. వీటన్నింటినీ మర్చిపోయేలా చేసింది మీ వ్యాఖ్య. రాస్తున్నప్పుడు నాక్కలిగిన అనుభూతే, పాఠకులకీ కలిగిందంటే అంతకన్నా ఏం కావాలి?! ఎప్పటికప్పుడు మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలండీ..
రిప్లయితొలగించండి@జ్యోతిర్మయి: నిజమండీ.. అయిపోలేదు.. రెండు రోజులుగా రోజూ ఉదయమే చేయాల్సిన పనుల జాబితాలో 'కృష్ణవేణి రాయడం' చేర్చుకుని, అంతలోనే తీసేస్తున్నాను నేను. అంతగా అలవాటైపోయింది. మాండలీకం.. నిజమేనండీ.. కొన్ని మాటలు, పలుకుబళ్ళు ఇప్పుడు వినిపించడం లేదసలు.. క్రమం తప్పకుండా చదివి, అభిప్రాయం పంచుకున్నందుకు ధన్యవాదాలండీ.
@శ్రీనివాస్ పప్పు: మన'సు'కవి గురించి ఒక్క మాటలో చెప్పగలమా చెప్పండి! ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@సునీత మన్నే: ఒకటి కాదండీ, రెండు లీపులు :) తప్పలేదు నాకు. కథలో మలుపుల కోసం అన్నాళ్ళు ఆగాల్సి వచ్చినప్పుడు చెయ్యగలిగేది అదే కదండీ మరి.. ఈ స్పందన చూస్తుంటే నాకూ రాయాలనే అనిపిస్తోందండీ.. అన్నీ కలిసిరావాలి మరి.. ధన్యవాదాలండీ..
@జయ: చిన్న 'అరుంధతి' ముక్కు పచ్చలారని పిల్లండీ. ఇక్కడ అలాకాదు కదా.. ఆమె కూడా జీవితాన్ని చూసిన మనిషి.. ఒకే ఈడు వాళ్ళు దాదాపుగా. చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారు!! ధన్యవాదాలండీ.
రిప్లయితొలగించండి@Enki: ఎవరి ఐడెంటిటీ వారిదండీ.. ఇక్కడి నుంచీ మొదలు పెడితే మరో కథ అవుతుంది కదా! ..ధన్యవాదాలు.
మురళిగారూ, మొత్తం కథ ఈ రోజే చదివాను. ఆపటానికి లేకుండా చదివించారు. కథ చదివినప్పుడు పాఠకుడు ఏ తృప్తి కోరుకుంటాడో, ఆ తృప్తితో ముగించారు. రంగశాయి, కృష్ణవేణిల మధ్య అనుబంధం మేఘసందేశం లో నాగేశ్వర్రావుని, జయప్రదను గుర్తు చేసింది.
రిప్లయితొలగించండి@MURALI: మిత్రులొకరు వ్యాఖ్యల్లోనే 'శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డేన్స్ ట్రూప్' ని జ్ఞాపకం చేసుకున్నారండీ. మరొకరు మెయిల్లో 'పాకుడురాళ్ళు' నవలని జ్ఞాపకం చేసుకున్నారు!! నిశితంగా చదివి, అభిప్రాయం పంచుకున్నందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఅబ్బ, ఇవ్వాళ్టికి మొత్తం చదివేసాను!
రిప్లయితొలగించండిఅయినా ముందు చెప్పిన మాటే ఇప్పుడూ చెపుతున్నాను.
ఇది వ్రాసింది, నెమలికన్ను మురళిగారా లేక పసలపూడి వంశీగారా అని సందేహం వస్తోంది.
కథలో మీరు పెట్టిన పేర్లలో చమత్కారం బాగుంది. గోదావరి ఒడిలో(ఒడ్డులో) జరిగిన కథలో హీరోయిన్ పేరు కృష్ణవేణి. మొగుడిని రాచి రంపానపెట్టే ఒక భార్య పేరు మంగళగౌరి. నా అనుమానం కరక్టయితే, మీరు (ఈ కథ అంతా చూసిన)పంతులుగారి అబ్బాయి అయి ఉండాలి. ఏమయినా, మరో మంచి గోదావరి కథ కథని మాకు అందించినందుకు మీకు అభినందనలు.
@బోనగిరి: పేర్లు పెడుతున్నప్పుడు అనుకున్నానండీ, అసలు ఎవరైనా గమనిస్తారా అని.. ఎంత నిశితంగా చదివారసలు!! మీ అనుమానం భలేగా ఉందండీ :) ..ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి@ మురళీ గారూ,
రిప్లయితొలగించండిమీ 'కృష్ణవేణి' ఆపకుండా చదివించేసిందండీ. మీ గోదారి యాస, కథాకథనాలు వంశీని గుర్తు చేశాయి. నాటకం ప్రహసనం నడిచినంతసేపూ 'కనకమాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్' బాగా గుర్తొచ్చింది. మీ శైలిలో ఎప్పుడూ కనపడే మెరుపులు ఇందులో కూడా చాలాచోట్ల ఒక క్షణం చదవడం ఆపి ఆలోచనలో పడేసాయి. కృష్ణవేణి కోరిన ప్రకారం రంగశాయి మళ్ళీ పెళ్ళైతే చేసుకుంటాడని అనుకున్నాను గానీ చివర్లో మరో కృష్ణవేణిని చూడటం మాత్రం భలే కొసమెరుపు అనిపించింది. మొత్తంగా మీ కృష్ణవేణి ఎప్పటికీ గుర్తుండిపోతుందని గట్టిగా చెప్పగలను. మీనుంచి ఇలాంటివి మరిన్ని చదవాలని ఆశిస్తూ.. హృదయపూర్వక అభినందనలు.
@మధురవాణి: మీ వ్యాఖ్య చూడగానే నాకు బ్లాగు మొదలు పెట్టిన తొలిరోజులు గుర్తొచ్చాయండీ.. శ్రద్ధగా చదివి, మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమురళిగారూ,
రిప్లయితొలగించండిముందుగా ఆలస్యానికి మన్నించాలి. మీ కృష్ణవేణి గురించి నాలుగు మాటలు వీలైనంత వివరంగా చెప్పాలన్న ఆశ ఇన్నాళ్ళకు తీరనుంది.
మొట్టమొదటగా నన్ను కట్టిపడేసిన విషయం కథనమండీ. అద్భుతంగా ఉంది. ముఖ్యంగా బ్లాగులో వ్రాస్తూ ఏ భాగానికా భాగం పద్ధతిగా విడగొట్టిన తీరు కథకుడిగా మీ ప్రతిభంతా చెప్పింది. ఒకటికి రెండు సార్లు వెనక్కు వెళ్ళి, నేనేమైనా మిస్ అయ్యానా అని తరచి తరచి చదివాను. బ్లాగులో భాగాలుగా నేనెప్పుడైనా ఏదైనా వ్రాసే అవకాశం వస్తే, ఈ పద్ధతి ఇంత నేర్పుగానూ వాడుకోగలనేమో ప్రయత్నిస్తాను.
కథలో చెప్పీ చెప్పకుండా వదిలేసిన కొన్ని సంఘటనలను అవకాశం రాగానే ఎంత బలంగా వాడుకున్నారో చూసినప్పుడూ అంతే ఆశ్చర్యమనిపించిందండీ..కృష్ణవేణి ని ఆఖరు ప్రయాణానికీ పూలతో అలకరించి పంపించడం - వెంటాడిందండీ. చాలా.
రంగశాయి ఒంటరితనం - అంతర్ముఖలకు జీవితంలో సరైన తోడు దొరక్కపోతే ఎంత విలవిల్లాడతారో పొదుపుగా చెప్పేశారు. అక్కడే, వాళ్ళ భార్యలో గలగలా వరదలా ఏదనిపిస్తే అది చెప్పగల దుడుసుదనాన్నీ చూపెడుతూ - అసంతృప్తి ఇద్దరిదీ అయినా ఒకరినే ఎందుకంతలా కాల్చేసిందో సునాసయంగా చెప్పడం కూడా నచ్చింది.
భాష. సంభాషణల్లో ఒకలానూ, మనుషులను బట్టీ నేపథ్యాలను బట్టి - అక్కడక్కడానే అయినా రచయిత మాటలొచ్చినప్పుడూ ఎంత పకడ్బందీగా మార్చుకుంటూ వెళ్ళారో చూసీ అలాగే ముచ్చటపడ్డాను.
ముగింపు ఓ కొసమెరుపు లాంటిదీ కథకి. ఎందుకా కొత్తమ్మాయి అని ఆలోచించినప్పుడల్లా అప్పటి పాఠకుల మనః స్థితిని బట్టి ఎన్నో కారణాలు తట్టే అవకాశమిచ్చి వదిలేశారు. దాని ద్వారా మరిన్ని రోజులు రంగశాయి గుర్తుండిపోయేలా చేశారు కూడా.
ఇలాంటి ఒక కథను ఇంత బిగితో అల్లిన మీకు హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు.
@మానస చామర్తి: మీ వ్యాఖ్య చదవగానే, కథని మీరెంత శ్రద్ధగా చదివారో అర్ధమయ్యిందండీ.. మీకు ఇంతగా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు.. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి