బుధవారం, ఆగస్టు 20, 2014

గుడి

మనిషికి సమాజం పట్ల బాధ్యత ఉంది. సమాజానికీ మనిషి పట్ల బాధ్యత ఉంది.  అయితే, సమాజానికి ఉన్న బాధ్యత మనిషి జీవించి ఉన్నప్పుడే కాదు, మరణించాక కూడా కొనసాగుతుంది. ఇంకా చెప్పాలంటే మనిషి మరణం తర్వాత సమాజం నిర్వహించాల్సిన బాధ్యత అత్యంత ముఖ్యమైనది. మృతదేహం కారణంగా మిగిలిన సమాజానికి ఎలాంటి ఇబ్బందీ రానివిధంగా అంత్యక్రియలు నిర్వహించాల్సింది సమాజమే, మరీ ముఖ్యంగా మరణించింది ఓ అనాధ అయినప్పుడు.

అనాధగా జీవితాన్ని మొదలు పెట్టి, ఎంతో జీవితాన్ని చూసిన తర్వాత చివరి రోజుల నాటికి మళ్ళీ అనాధగా మిగిలిపోయిన విశ్వనాథుడికి ఉన్న బెంగాల్లా ఒక్కటే. తన ఊపిరి ఆగిపోయాక, అంత్యక్రియల బాధ్యతని సమాజం కాక, 'తనమనిషి' నిర్వహించాలని. తను జీవితపు చరమాంకంలో ఉన్నానని రూఢిగా తెలిసిన మరుక్షణం, తనకి అంత్యక్రియలు నిర్వహించే మనిషి కోసం అన్వేషణ ఆరంభించాడు విశ్వనాథుడు.

ఓ శివాలయంలో దర్శనం టిక్కెట్లు అమ్మే పనిలో కుదురుకున్న ఆ వృద్ధుడి అన్వేషణ, ఆ గుడికి క్రమం తప్పకుండా వచ్చే 'రవీంద్ర' ని చూడడంతో ముగిసింది.మామూలు మధ్యతరగతి గృహస్తు రవీంద్ర. అతన్ని అమితంగా ప్రేమించే భార్య కామాక్షి, టీనేజ్ కూతురు లావణ్య ఇదీ అతని కుటుంబం. మొట్టమొదటిసారి విశ్వనాథుడు తన కోర్కెని రవీంద్ర ముందు ఉంచినప్పుడు ఎలా స్పందించాలో అస్సలు అర్ధం కాదు రవీంద్రకి. అందుకే, ఏ సమాధానమూ చెప్పడు. కానీ, విశ్వనాథుడు విడిచిపెట్టలేదు.


రవీంద్ర పెట్టే గడువులు తూచా తప్పకుండా పాటిస్తూ, ఏ మాత్రం విసుగూ విరామం లేకుండా అతనిచుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ఈ క్రమంలో కామాక్షికీ, లావణ్యకీ కూడా పరిచయం అవుతాడు విశ్వనాథుడు. అతడి కోర్కెని మన్నించడానికి ఎట్టకేలకి అంగీకరిస్తాడు రవీంద్ర. ప్రతిరోజూ ఉదయాన్నే తనే వచ్చి రవీంద్రకి కనిపిస్తానని షరతు పెడతాడు విశ్వనాథుడు. కనిపించని రోజున, రవీంద్ర తనిచ్చిన మాటని నిలబెట్టుకునేందుకు సిద్ధపడాలి.  ఇంతకీ, రవీంద్ర ఆ పని చేయగలిగాడా? విశ్వనాథుడి అంతిమ యాత్ర ఎలా జరిగింది? ఈ ప్రశ్నలని జవాబిస్తూ ముగుస్తుంది సినీ రచయిత జనార్దన మహర్షి రాసిన 'గుడి' నవల.

గత శతాబ్దపు ఎనభయ్యో దశకంలో విరివిగా విడుదలైన యండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకట కృష్ణమూర్తిల నవలలు చదివిన వాళ్లకి 'గుడి' నవలలో  కనిపించే కొత్తదనం బహు స్వల్పం. ప్రతి పేజీలోనూ ఆ ఇద్దరు రచయితలూ గుర్తొచ్చి తీరతారు. అంతే కాదు. ఈ నవలకి ముందు మహర్షి విడుదల చేసిన 'వెన్నముద్దలు' సంకలనంలో చాలా కవితల్ని సందర్భోచితంగా నవలలో వాడుకున్నారు. దీనితో 'వెన్నముద్దలు' మళ్ళీ చదువుతున్న భావన అదనం.

నవరసాలనీ బ్యాలన్స్ చేయడం కోసం కాబోలు, లావణ్య-రమణల సినిమాటిక్ ప్రేమకథని విశదంగా రాశారు. నవలలో నాటకీయత పాళ్ళు అత్యధికం. రవీంద్ర కుటుంబం, రవీంద్ర-కామాక్షిల అనుబంధం, రమణ కుటుంబం, చివర్లో విశ్వనాథుడు ఇచ్చే ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, వాటికి వచ్చే స్పందన... ఇదీ అని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదేమో. చదువుతుంటే చాలాసార్లు స్టేజీ నాటకంగా బావుంటుంది అనిపించిన ఈ నవల ఆధారంగానే కె.విశ్వనాథ్-ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంబినేషన్లో 'దేవస్థానం' సినిమా తీశారట. సినిమా పెద్దగా ఆడినట్టు లేదు. నాటకీయతని ఇష్టపడే వాళ్లకి నచ్చే నవల ఇది. (శ్రావణి-శర్వాణి ప్రచురణ, పేజీలు  151, వెల రూ. 100).

4 వ్యాఖ్యలు:

వేణూశ్రీకాంత్ చెప్పారు...

సినిమాలో లావణ్య పాత్ర లేదండీ... స్వల్పంగా మార్పులు చేసినట్లున్నారు. నాటకీయత ఉన్నాకూడా సినిమాలో విశ్వనాథ్, బాలు గార్లు ఉండడం వల్ల ఇద్దరి పాత్రలకీ సరిపోయిందనిపించింది. ఆసక్తీ సమయం ఉంటే సినిమా ఈ లింక్ లో చూడవచ్చు ప్రయత్నించండి.

https://www.youtube.com/watch?v=bOR7YBa52EE

గీతిక బి చెప్పారు...

Nice post Murali garu and thank you for the link వేణూశ్రీకాంత్ garu.

అజ్ఞాత చెప్పారు...

నవల చదవలెదు కాని, ఈ సినిమా టివిలో చూసానండి. కొంచెం నెమ్మదిగా నడిచినా, బాగుంది. మంచి మాటలు ఉన్నాయి సినిమాలో.

మురళి చెప్పారు...

@వేణూ శ్రీకాంత్: నవలలో విశ్వనాథుడి పాత్ర కె. విశ్వనాథ్ కోసమే రాసినట్టు ఉందండీ.. లంకెకి ధన్యవాదాలు. కొంచం చూశాను.. పూర్తి చెయ్యాలి..
@గీతిక: ధన్యవాదాలండీ
@బోనగిరి: సినిమా చూస్తానండీ.. చాలా మార్పులే చేసి ఉంటారనిపిస్తోంది.. ధన్యవాదాలు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి