బుధవారం, జులై 30, 2014

కృష్ణవేణి-13

ఉగాది పండగ దగ్గర పడుతూండగానే ఊళ్ళో హడావిడి మొదలయ్యింది. గుడి దగ్గర లైటింగ్ పెడుతున్నారు. చిన్నచిన్న బల్బుల సీరియల్ దండలతో పందిరి వేస్తున్నారు కుర్రాళ్ళు. చందర్రావు దగ్గరుండి పని చేయిస్తున్నాడు.

తెల్లారితే మైక్ సెట్టు బిగించాలి. వ్యాపారంలోకి దిగాక ఊళ్ళో వచ్చిన మొదటి బేరం. పైగా దేవుడి కార్యం. నాలుగు డబ్బులు మిగుల్చుకోడం కన్నా, పేరు తెచ్చుకోడం మీదే దృష్టి పెట్టేడు.

మెడ్రాసు, బొంబాయి చూసొచ్చిన వాడని అప్పటికే అందరూ ప్రత్యేకంగా చూస్తున్నారు. బెల్బాటం ఫ్యాంట్లు, పూల చొక్కాలతో మాంచి హడావిడి చేసేస్తున్నాడు పెళ్లి కావాల్సిన చందర్రావు.

"ఇంట్లో లైటెలగడం లేదు. మొగోడికి ఇయ్యేయీ పట్టవు. ఓసారొచ్చి సూత్తావా?" చందర్రావు ముఖంలోకి చూస్తూ అడిగింది మంగళగౌరి.

చీకటి పడ్డాక వెళ్ళాడు. పడకగదిలో లైటు పది రోజులై పనిచేయడం లేదు. ముక్కాలిపీట మీద నిలబడి, బేట్రీ లైటు చూపించమన్నాడు.

"ఇయ్యింట్లో బేట్రీ లైటు కూడానా?" అని సాగదీస్తూ దీపం పట్టుకొచ్చింది. 

జేబులో ఉన్న టెస్టర్ తో హోల్డర్ పరీక్షిస్తున్న చందర్రావు ఎందుకో వెనక్కి తిరిగి చూసేసరికి దీపం వెలుగులో తనని కళ్ళతోనే తడిమి తడిమి చూస్తూ కనిపించింది మంగళగౌరి. మరుక్షణం పీటమీద నుంచి జారి పడబోయాడతను.

ఒంటి చేత్తో అతన్ని ఒడుపుగా పట్టుకుంది మంగళగౌరి. ఆమె రెండో చేతిలో ఉన్న దీపం ఒక్క క్షణం రెపరెపలాడి, మరుక్షణం ఆరిపోయింది. గంట తర్వాత రుమాలుతో ముఖం తుడుచుకుంటూ బయటికి నడిచాడు చందర్రావు.

అది మొదలు, ప్రతి సాయంత్రం శ్రద్ధగా తయారవ్వడం మొదలుపెట్టింది మంగళగౌరి. చాలా రోజుల తర్వాత పూలు బేరం చేసి కొనడమే కాదు, చీకటి పడుతూనే స్నానం చేసి, చాకింటి చీర, జడలో పూలతో సిద్ధమవుతోంది.


ఓ పక్క లైటింగు, మైకుసెట్టు చూసుకుంటూనే,  కాస్త రాత్రవ్వగానే వచ్చి తలుపు కొడుతున్నాడు చందర్రావు. బొంబాయి నుంచి కొని  తెచ్చుకున్న సెంట్లు, కొత్త మోడల్ బనీన్లు బయటికి తీశాడు. పండగ హడావిడి పూర్తయ్యి, లైటింగ్ విప్పే నాటికి మంగళగౌరి ఇంట్లోకి నేరుగా వచ్చేసేంత చనువొచ్చేసింది చందర్రావుకి.

వాళ్ళిద్దరి రహస్యం ఆ వీధిని దాటి, ఊరి పొలిమేరని చుట్టే సమయానికి సూరమ్మ ఎదురుగా  కూర్చుని ఉన్నాడు రంగశాయి.

"అమ్మకి రోజులైపోయేయి.. ఎల్లిపోయింది..  పోయిందాంతో మనవూ పోలేం కదరా బాబా.. ఇలగైపోతే ఎలాగరా తమ్ముడా," తమ్ముణ్ణి చూసి బావురుమంది సూరమ్మ.

రాజాబాబుని ఆడిస్తున్న రంగశాయి పట్టి చూస్తే తప్ప గుర్తుపట్టలేని విధంగా ఉన్నాడు. మనిషి చిక్కిపోయాడు. మాసిన తల, గడ్డం, లోతుకి పోయిన కళ్ళు.. ఎప్పుడూ ఏదో పరధ్యానం.

చిన్న కూతురి పెళ్లి ముహూర్తం దగ్గర పడడంతో పనులతో ఊపిరి సలపడం లేదు సూరమ్మకి.

"పండగొచ్చెల్లింది.. నీకేవన్నా తెలిసిందేరా?" టీ ఇస్తూ అడిగిన ప్రశ్నకి జవాబు రాలేదు.

"సూసుకుని తొక్కరా సైకిలు.. బుర్రెక్కడో ఎట్టుకుంటే రోడ్డు మీద కట్టంరా బాబా," సైకిలెక్కిన రంగశాయికి జాగ్రత్త చెప్పింది సూరమ్మ.

రాజాబాబు ని చూడ్డానికి వెళ్లి వచ్చినట్టు తెలిసి రంగశాయి మీద విరుచుకు పడిపోయింది మంగళగౌరి.

"పాల్డబ్బా కొంటం సేతకాదు కానీ, పేవలు మల్లీనీ.. ఈటికేం లోట్లేదు మనకి.." తను అనదల్చుకున్నవన్నీ అనేసింది కానీ, రంగశాయి విన్నట్టు లేడు.

"నీతో మాట్టాడినా ఒకటే.. గోడతో మాట్టాడినా ఒకటే.. అంత మాట్టాన్నోడివి ఇంటికెందుకూ రాటం? నీకోసం ఇక్కడెవులూ ఎదురు సూసెయ్యటం లేదు.."

పరాగ్గా ఉన్న రంగశాయి ఒక్కసారి తేరిపార చూశాడు మంగళగౌరిని. అతన్ని సాధిస్తూనే అన్నం కంచం తెచ్చి ముందు పెట్టింది. ముద్ద కలిపి నోట్లో పెట్టుకుంటున్నా ఆమె నోరు మూతపడలేదు. కాసేపు అన్నం కెలికి చెయ్యి కడిగేసి, సినిమా హాలుకి బయల్దేరాడు.

ఎక్కడో ఆలోచిస్తూ రిజర్వుడు గేటు దగ్గర టిక్కెట్లు చించుతున్న రంగశాయి ఉన్నట్టుండి ఉలిక్కి పడ్డాడు. తన ఎదురుగా ముగ్గురు ఆడవాళ్ళు.. మధ్యలో ఉన్నది కృష్ణవేణి!  ఆమె కూడా పరాగ్గానే ఉంది. రంగశాయిని చూడనేలేదు.

వాళ్ళు లోపలి వెళ్ళాక, కర్టెన్ కొద్దిగా తప్పించి ఎక్కడ కూర్చున్నారో చూశాడు. అతని కళ్ళలోకి నెమ్మది నెమ్మదిగా వెలుగొస్తోంది. ఇంటర్వెల్ టైం కి పూర్తిగా మనుషుల్లో పడ్డాడు రంగశాయి. కేంటీన్ కి వెళ్లి మూడు ఆర్టోస్ డ్రింకు సీసాలు తీసుకున్నాడు.

ఇంటర్వల్ బెల్ మోగగానే, నేరుగా వాళ్ళ సీట్ల దగ్గరికి వెళ్లి ముగ్గురి చేతుల్లోనూ కూల్డ్రింక్ సీసాలు పెట్టాడు. అప్పుడు చూసింది కృష్ణవేణి రంగశాయిని పరీక్షగా. అతన్ని గుర్తు పట్టిన సూచనగా ఆమె కళ్ళలో చిన్నగా మొదలైన వెలుగు పెరిగి పెద్దదైంది.

"ఎంత కట్టపడ్డా అక్కని బతికిచ్చుకోలేపోయేను. ఇక్కడకి తీస్తెచ్చుకుందారంటే రానని గొడవ. డాట్టర్ల కాడికి తిప్పేను... వొయిజ్జం సేయించేను. సివరాకరికి ఈ సేతుల్లోనే దాన్సివర్రోజులు ఎల్లిపోయేయి.. మాయమ్మ కన్న సంతానంలో నేనొక్కద్దాన్నే అయిపోయేను," రంగశాయి భుజం మీద తలపెట్టుకుని ఉద్వేగంగా చెబుతోంది కృష్ణవేణి. ఆమె ఇంట్లో ఉన్నారు ఇద్దరూ. 

"నువ్వేటిలా అయిపోయేవు?" అడిగింది ఉన్నట్టుండి. తన తల్లి అనారోగ్యం మొదలు తను రాజమండ్రి వెళ్లి రావడం వరకూ అన్నీ వివరంగా చెప్పాడు రంగశాయి.

"నువ్వు మల్లీ రామిండ్రీ రాపోయేతలికి నాకేం తెల్లేదు.  ఇంతలోకే అక్కలా సేస్సింది.. మొన్నే వొచ్చేనిక్కడికి.. ఊసూ పలుకూ లేకుండా కూకుంటన్నానని మా సిన్నమ్మోల్ల పిల్లలు బలంతాన సినిమాకి లేవదీసేరు.. రాటం మంచిదే అయ్యిందిలే.. ఉండు, వొంట సేత్తాను.."

వంటగదిలోకి వెళ్ళిన కృష్ణవేణిని, ఖాళీ బియ్యం డబ్బా పలకరించింది.

(ఇంకా ఉంది) 

సోమవారం, జులై 28, 2014

కృష్ణవేణి-12

అమావాస్య రాత్రులు కావడంతో ఊరంతా చీకటిగా ఉంది. నట్టింట్లో పడక్కుర్చీలో వాలి రేడియోలో వస్తున్న నాటకాన్ని శ్రద్ధగా వింటున్నారు పంతులుగారు. రేడియో మీద ఓ చెవి వేసి, వంటింట్లో రాత్రి వంట చేస్తోంది సరస్వతమ్మ.

నాటకం పూర్తవుతూ ఉండగా వీధిలో ఏదో అలికిడి అవ్వడంతో కుర్చీలోంచి లేచి "ఎవరదీ?" అంటూ బయటికి వచ్చారు పంతులు గారు.

రోడ్డు వారగా రెండు సైకిళ్ళు ఆగి ఉన్నాయి. నలుగురు మనుషులు మసగ్గా కనిపిస్తున్నారు. ఓ ఆకారం ఆడమనిషిదని స్పష్టంగా తెలుస్తోంది.

"నమస్తండీ.. నేను బాబుగారూ లష్మిని," అందా స్త్రీ, ఓ మగవాడితో కలిసి లోపలి వస్తూ. ఆమె నడకలో చిన్న ఇబ్బంది తెలుస్తోంది.

"ఏమ్మా.. ఇంత చీకటడి వచ్చారు.. రండి రండి," అని ఆహ్వానిస్తూనే "లక్ష్మీ వాళ్ళూ వచ్చారు" అని లోపలికి ఓ కేకేశారు పంతులుగారు. అరుగు మీద కూర్చుంది లక్ష్మి. వాకిట్లో ఉన్న కొబ్బరిచెట్టుకి ఆనుకుని నిలబడ్డాడతను.

"కాలికేమయ్యిందమ్మా?" అడిగారు మంచినీళ్ళు ఇస్తూ.

ఎత్తిపోసుకుని, చెంబు జాగ్రత్తగా పక్కన పెట్టి "అదంతా పెద్ద కద బాబుగారూ.. ఏం సెప్మంటారు," అని ఒక్క క్షణం ఆగింది లక్ష్మి.

"గతేడాది సంవచ్చరాదికి మీ ఊల్లో నాటకం ఆడేరు కదా. నాక్కుదరాపోతే కృష్ణేన్ని బుక్ సేసేరు.. మేవప్పుడు అమలాపారం పక్కనూల్లో నాటకవాడేం. మీకిక్కడ సిమ్మెంటు స్టేజీ ఉన్నాది కానండీ, అక్కడ సెక్క బల్లల్తో స్టేజీ కట్టేరు. రెండ్రంగాలయిపోయి మూడో రంగంలో నేను డేన్సు కడతా ఉంటే ఉన్నట్టుండి స్టేజీ కూలిపోయింది.." గుర్తు చేసుకుంటూ ఆగింది.

"అయ్యయ్యో.. తెలియలేదమ్మా మాకు" అన్నారు పంతులుగారు.

"గబాల్న కిందడిపోయేనండి. కాలి మీదో బల్లడిపోయింది.. లేవలేపోయేను.. నాటకవాగిపోయింది. అప్పుటికప్పుడు అమలాపారం ఆస్పత్రికి తీసూపోయేరు. పేనం పోతాదనుకున్నాను బాబుగారూ.. కాలిరింగిందన్నారండి. ఎక్కడెక్కడో తిరిగేం. సివరాకరికి ఎల్లూరండి, అరవ దేశం.. అక్కడ ఆప్రేసన్ సేసేరండి. అంతా బానే ఉన్నాది కానీ సిన్న అవుకు నిలిసిపోయిందండి," ఆగింది లక్ష్మి.

"అయ్యో.. పెద్ద కష్టమే అమ్మా.. కాలక్షేపం ఎలా మరి?" అడిగారు పంతులు గారు.

"పొట్ట తిప్పలు తప్పవు కదా బాబుగోరూ. కూతంత నయవయ్యేక మా ఊల్లోనే కాపీ ఒటేలు ఎట్టేనండి. ఈయన మా బావగోరండి.. ఈరంతా సహాయంగా ఉంటన్నారు మాటకీ, మంచికీ," చెట్టు కింది మనిషిని పరిచయం చేసింది.

లోపలినుంచి టీలు వచ్చాయి. వాళ్ళిద్దరికీ ఇచ్చి, రోడ్డు మీద వాళ్ళని కూడా పిలవమన్నారు పంతులుగారు. వచ్చి టీలు పుచ్చుకున్నారు వాళ్ళు.

"ఏవిటోనమ్మా భగవంతుడి లీల. పడే వాళ్ళకే పెడతాడు పరీక్షలన్నీ. ఇంతకీ, నావల్లయ్యేది ఏవన్నా ఉందా?" అడిగారు పంతులుగారు.


"ఉపకారం కావాలి బాబుగారూ. మీ వల్లే అవ్వాలి. ఏడెనిమిదేల్లుగా ఫీల్డులో ఉన్నాను. నాటకం అంటే నాకెంతిదో మీకు పెచ్చేకం సెప్పక్కర్లెద్దు. కుర్రోల్లు నలుగుర్ని సేర్సి డ్రామా ఒకటి తయ్యారు సేసేను. రిగాల్సల్సు కూడా సేత్తన్నాం. పండగొత్తన్నాది కదా బాబూ.. మాయందు దయుంచి ఒక్క సేన్సు ఇప్పిచ్చేరంటే.. మీకు తెల్సు కదా ఈ లష్మి స్టేజీ మీద ఎలా సేత్తాదో..."

పంతులుగారు ఆలోచనలో ఉండిపోయారు.

"ఇద్దరు ఈరోయిన్లండి. ఒకేసం నేను కడతాను. ఇంకో ఏసానికి మా వోల్ల పిల్లనే తయ్యారు సేత్తన్నాను. కావాలంటే క్లబ్బు డేన్సు కూడా ఎట్టింతాను. తాంబూలం దెగ్గిర కూడా పేసీ లేదు బాబుగారూ.. మీరెలాగంటే అలాగే.. నేను పేసీ మడిసిని కాదు.. మీకు తెలందేవుంది.." అంటూ పంతులుగారి వైపు చూసింది.

"కుర్రాళ్ళు నాటకం అంటే ఒప్పుకోడం లేదమ్మా. గతేడాది వేసిన వాళ్ళలో ఒకళ్ళిద్దరు ఊగేరు, ఈ ఏడు కూడా నాటకం ఆడదాం అని. కానీ, ఎవరూ కలిసి రావడం లేదు. అందరూ సినిమాల మీద పడిపోయారు. వీధిలో తెరకట్టి సినిమాలేస్తుంటే ఇంకా నాటకం ఏవిటి అంటున్నారు. వాళ్ళని బట్టి పోవాల్సిన వాళ్ళం కదమ్మా మనం.." చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు పంతులు గారు.

"మీరే ఇంతమాటనేత్తే ఎల్లాగ బాబుగారూ.. మీ మాటెవురు కాదంటారు సెప్పండి? మీరు దయదల్డం లేదు.. అవుక్కాలేసుకుని ఇదేం నాటకం ఆడతాడని కామాల," బాధగా అంది లక్ష్మి.

"అయ్యయ్యో.. అదేం మాటమ్మా.. నా చేతిలో ఉంటే చెయ్యనా నేను? ఇంతల్లా అడిగించుకునే మనిషినా?" అన్నారు పంతులు గారు.

"కష్టపెట్టుకోకండి బాబుగారూ.. మీ మీద ఆసెట్టుకుని వొచ్చేను. మల్లీ ఒక్కసారి స్టేజీ ఎక్కితే సాలనున్నాది. కుర్రోల్లూ కలిసొచ్చేరు. ఉంకొక్కసారాలోసించండి బాబూ," బతిమాలింది లక్ష్మి. ఒక్క క్షణం ఆగి, నోరు విప్పారు పంతులుగారు.

"చందర్రావనీ.. మా ఊరి కుర్రాడేనమ్మా. కొత్తగా లైటింగు, మైకుసెట్ల వ్యాపారంలోకి దిగాడు. అతనే సినిమాలు కూడా తెచ్చి వేస్తానన్నాడు. మా వాళ్ళు నాలుగు సినిమాలు బుక్ చేసేశారు. ఒక్క నాటకం ఖర్చుకే నాలుగు సినిమాలు వస్తున్నాయని లెక్క చెప్పారు.." మాట్లాడకుండా ఉండిపోయింది లక్ష్మి.

పంతులుగారు లోపలికి వెళ్లి, కొంత డబ్బు తీసి సరస్వతమ్మ చేతికి ఇచ్చారు. చెక్క బీరువా లోంచి జాకెట్ ముక్క తీసి, మడతల్లో ఆ డబ్బు పెట్టింది సరస్వతమ్మ.

"అయితే ఉట్టి సేతుల్తోనే అంపుతున్నారన్న మాట. శానా ఆసెట్టుకునొచ్చేను బాబుగారూ.. ఇలాగవుతాదనుకోలేదు.. అమ్మగారెలా ఉన్నారు? సెప్పేసి సెలవుచ్చుకుంటాను," అంటూండగానే "రామ్మా లక్ష్మీ లోపలికి" అని పిలిచింది సరస్వతమ్మ.

"విన్నానమ్మా.. పాపం, ఊహించని ప్రమాదం కదా.." అంది ఆమే.

"కనిపించెల్దారని అమ్మగారూ.. ఎల్లొత్తాను," అంది లక్ష్మి.

"బొట్టుంచుతాను, ఉండమ్మా.." అంటూ కుంకుమ భరిణె, జాకెట్ ముక్కతో వచ్చింది సరస్వతమ్మ. జాకెట్ ముక్క అందుకుని, రెండు చేతులూ ఎత్తి దండం పెట్టింది లక్ష్మి, "చల్లగా ఉండండమ్మా" అంటూ.

"చీకట్లో వచ్చారు.. జాగ్రత్తగా వెళ్లి రండి" అన్నారు పంతులుగారు.

"మాకాడ బేట్రీ లైట్లున్నాయి బాబుగారూ" అంది లక్ష్మి, సైకిలెక్కుతూ.

(ఇంకా ఉంది)

శుక్రవారం, జులై 25, 2014

కృష్ణవేణి-11

ఉన్నట్టుండి రాజమ్మకి అనారోగ్యం చేసింది. బొంగరంలా తిరిగే మనిషి కాస్తా  మంచం నుంచి లేవడానికి కష్ట పడుతోంది. ఊళ్ళో ఆరెంపీ 'డాక్టర్ గారు' తనకి తెలిసిన వైద్యం అంతా చేసి చివరికి చేతులెత్తేశాడు.

"నా వైద్యానికి లొంగడం లేదు. చూడబోతే కామెర్లలా ఉన్నాయి. వెల్ల మందు వాడి చూడండి" అని చెప్పేసి వెళ్ళిపోయాడు.

చిక్కి శల్యమైపోయింది రాజమ్మ. మనిషి ఆర్చుకుపోతోంది. ఈశ్వరబాబు, సుగుణ రోజూ తొంగి చూసి వెళ్తున్నారు తప్ప, వైద్యం విషయం ఏమీ మాట్లాడడం లేదు. ఊళ్ళో ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళు కూడా రాజమ్మని చూసి  కామెర్లు అని తేల్చడంతో, మందు కోసం 'వెల్ల' బయల్దేరాడు రంగశాయి.

తన మీద కోపంతో మంగళగౌరి చంటాడిని పుట్టింట్లో వదిలేసి రావడం, కృష్ణవేణి ని వెతుక్కుంటూ తను రాజమండ్రి బయలుదేరడం, వస్తూనే తల్లి అనారోగ్యంతో మంచాన పడడం..ఇవన్నీ నిన్ననో మొన్ననో జరిగినట్టుగా అనిపిస్తున్నాయి.

"నాకున్నది మాయక్కొక్కర్తే. అదేమో మంచానడింది. నాతో వొచ్చెయ్ మంటే ఈ రామిండ్రీ ఒదిలేసి రానంటాది.. సూత్తా సూత్తా దాన్నిడిసిపెట్టి నేన్రాలేను. ఇంకొన్నాల్లిక్కడుండక తప్పదు నాకు. కుదిర్నప్పుడల్లా ఒత్తా ఉండు.. సైకిలు మీద కాదేం.." తనని సాగనంపుతూ కృష్ణవేణి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి రంగశాయికి.

తల్లిని తల్చుకుని బాధ పడ్డాడు కాసేపు. అన్నీ ఉండీ సుఖపడలేని ప్రాణం. "నాయీ అయ్యే పోలికలేమో," అనుకున్నాడు.

ఎక్కడెక్కడి నుంచో మందు కోసం వచ్చిన వాళ్ళు బారులు తీరి ఉన్నారు ఓ పెద్ద ఇంటి ముందు. ఆవరణలో అక్కడక్కడా బెంచీలు ఉన్నాయి. రోడ్డుని ఆనుకుని పెద్ద పెద్ద చెట్లు నీడనిస్తున్నాయి. దగ్గర ఊళ్ళ వాళ్ళు రోగులని వెంటబెట్టుకుని వచ్చారు.

వరుసలో కూర్చుని ఎదురు చూడగా చూడగా రెండు గంటల తర్వాత వచ్చింది రంగశాయి వంతు. తెల్లటి జులపాల జుట్టు, పొడవు గడ్డం ఉన్న నల్లని మనిషి మఠం  వేసుకుని కూర్చుని ఉన్నాడు అరుగు మీద.

నుదుటి మీద పెద్ద కుంకుమ బొట్టు మెరుస్తోంది. పక్కనే మరచెంబు, గ్లాసు. కొంచం దూరంలో కల్వం, జాడీల్లో కొన్ని ఔషధాలున్నాయి. రోగ లక్షణాలు ఒకటికి రెండు సార్లు అడిగి చెప్పించుకున్నాడు. ఏమేం తింటోంది, ఎంత సేపు నిద్రపోతోంది లాంటి వివరాలు కూడా అడిగి తెలుసుకుని అప్పుడు ఇచ్చాడు ఔషధం.

"పథ్యం చాలా జాగ్రత్తగా చేయించాలి" హెచ్చరికగా చెప్పాడా పెద్దాయన.


తల్లికి బాలేదని తెలిసి చూడడానికి వచ్చింది సూరమ్మ, రాజాబాబుని చంకనేసుకుని. మంచంలో ఉన్న రాజమ్మని చూసి కన్నీళ్లు పెట్టుకుంది.

"నీ సిన్న మనారాలికి పెల్లి కుదిరింది. నువ్వొచ్చి దెగ్గిరుండి సెయ్యించాల.. నీ సేత్తో నాలుగచ్చింతలు దాన్నెత్తినెయ్యాల.." అంది తల్లి చేతులు పట్టుకుని.

నీరసంగా నవ్వింది రాజమ్మ. "బాజ్జెతలు తీరిపోతన్నాయన్న మాట. ఒడ్డున పడతన్నావు తల్లే.. సంతోసం.. ఇప్పుడీ సంటోడి సాకిరి వొచ్చి పడింది నీకు," అంది నెమ్మదిగా. ఓ చెవి ఇటే వేసి ఉంచిన మంగళగౌరి తారాజువ్వలా లేచింది.

"మంచానున్నోల్లు బానే ఉంటారు. సెయ్యలేక మేం సత్తన్నాం మద్దిన," అనేసరికి, రాజమ్మ కన్నా ఎక్కువగా కష్టపెట్టుకుంది సూరమ్మ.

"కడుపుకి అన్నం తింటన్నావా గెడ్డి తింటన్నావే నువ్వు? ఏం సేత్తన్నావు శాకిరీ? ఎంతమందికి వొండోరుత్తున్నావూ అంట.. నా సేత సేయించుకున్నప్పుడు మరీ? ఒక్కనాడు సెయ్యి సాయానికి రాగలిగేవంటే నువ్వూ?" అంటూ కడిగేసింది కూతుర్ని.

తల్లి అలా మాట్లాడుతుందని ఊహించలేదు మంగళగౌరి. ఒక్క క్షణం బిత్తరపోయింది. మరుక్షణం తేరుకుని, పక్క  వాటా వైపు చెయ్యి చూపించి "ఏం? ఆయినగోరూ కొడుకే గదా.. పయిగా పెద్ద కొడుకు. తొంగి సూసి ఎల్లిపోతాడా? కనీసం దగ్గిరెట్టుకుంటానని అనగలిగేడా?" అంది మంగళగౌరి.

"నువ్వు మాటాడకొలే.. లోపల్నడు ముందల," కసిరింది సూరమ్మ. తల్లివైపు కొరకొరా చూసి వంటింట్లోకి విసవిసా వెళ్ళింది మంగళగౌరి. కాసేపటి తర్వాత మొదలైన ధనాధనా శబ్దాలు, సూరమ్మ వంటింట్లోకి వెళ్ళేవరకూ అవుతూనే ఉన్నాయి.

అది మొదలు, సూరమ్మ బయల్దేరి వెళ్ళే వరకూ ఆమెతో పన్నెత్తి మాట్లాడలేదు మంగళగౌరి. తల్లికీ, తమ్ముడికీ వంద జాగ్రత్తలు చెప్పి, రాజాబాబుని చంకనేసుకుని బయల్దేరింది సూరమ్మ.

వెల్ల మందు గుణం చూపించినట్టే చూపించినా, ఉన్నట్టుండి రోగం తిరగబెట్టేసింది రాజమ్మకి. కొడుకులిద్దరినీ చెరో పక్కా కూర్చోబెట్టుకుని, ఓ రాత్రంగా అవస్థ పడి తెల్లవారు జామున ప్రాణాలు వదిలేసింది. చాలాసేపటి వరకూ జరిగిందేమిటో అర్ధం కాలేదు రంగశాయికి.

తండ్రి పోయే నాటికి అతను చిన్నవాడు. ఎక్కడా రోగాలనీ, చావులనీ చూసినవాడు కాదు. ముందుగా తెరుకున్నది ఈశ్వర బాబే. దగ్గర బంధువులకి కబుర్లు వెళ్ళాయి. ఆడవాళ్ళ ఏడుపులు వినిపించడంతోనే చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ వచ్చేశారు. జరగవలసిన ఏర్పాట్లు చూడడం మొదలు పెట్టారు. శవం లేస్తే తప్ప వీధిలో పొయ్యి వెలగడానికి లేదు.

సూరమ్మకి చివరిచూపు అందాలని  ఆరాట పడుతున్నారు తమ్ముళ్ళిద్దరూ. చివరి నిమిషంలో వచ్చిందామె. నలుగురు ఆడవాళ్ళు కష్టపడినా పట్టి నిలపలేక పోయారు. నిలువెత్తు రాజమ్మ పిడికెడు బూడిదగా మారిపోయింది.

ఆస్థి పంపకాలు ఏనాడో అయిపోయాయి. ఇక మిగిలిందల్లా రాజమ్మ ఒంటిమీద ఉన్న కొద్దిపాటి బంగారం, కాసిన్ని చీరలు. తల్లి బంగారం కూతురికే అన్నారు బంధువులు. అభ్యంతరం చెప్పలేదు ఎవరూ.

"మనారాలి పెల్లి కోసవని నీ కూతురు అప్పులయిపోకండా కాసేవా అమ్మా" అంటూ పొగిలి పొగిలి ఏడ్చింది సూరమ్మ.

తల్లి మరణం అందరికన్నా ఎక్కువగా బాధ పెట్టింది రంగశాయిని. తన చుట్టూ అంతా ఖాళీ ఖాళీగా ఉన్నట్టు అనిపించింది అతనికి. ఇంట్లో మిగిలింది అతను, మంగళగౌరి. ఆమెతో ఏం మాట్లాడాలి? ఆమె అడిగే వాటికి ఏం చెప్పాలి? తల్లి ఉన్నంతకాలం చిన్న చిన్న విషయాలు చాలావాటిని  సర్దుబాటు చేసేసేది. ఇప్పుడిప్పుడు తనకి మతి స్థిమితం తప్పుతుందేమో అన్న భయం కలుగుతోంది రంగశాయికి.

చాలా రోజుల తర్వాత కృష్ణవేణి పదే పదే గుర్తొచింది. ఆమెని చూడాలనిపించి రాజమండ్రి బయల్దేరాడు. ఆ పాతకాలపు డాబా ఇంటి గుమ్మానికి తాళం కప్ప వేలాడుతూ పలకరించింది. పక్క వాళ్ళెవరూ కనిపించలేదు.

"మేం మొన్నే దిగేం.. వొచ్చిన కాన్నించీ ఆయింటికి తాలవేసే ఉన్నాది.." ఎదురింటామె పైట సర్దుకుంటూ చెబుతుండగానే, ఉసూరుమని కాళ్ళీడ్చుకుంటూ వెనక్కి తిరిగాడు రంగశాయి.

(ఇంకా ఉంది) 

బుధవారం, జులై 23, 2014

కృష్ణవేణి-10

హ్యాండిల్ బార్ కి ఒకవైపు వేలాడదీసిన చిన్న ఇనప బకెట్టు నిండా మైలుతుత్తం వేసి ఉడికించిన మైదా, రెండోవైపు ఉన్న సంచీలో దొంతులుగా వాల్ పోస్టర్లు. వెనుక కేరేజీకి ఓ పెద్ద కట్ట పోస్టర్లు. ఎండ చుర్రు మంటోంది. హ్యాండిల్ ని జాగ్రత్తగా బ్యాలన్సు చేసుకుంటూ సైకిలు తొక్కుతున్నాడు రంగశాయి.

చుట్టుపక్కల పది పన్నెండు ఊళ్ళకి సైకిలు మీద వెళ్లి పోస్టర్లు అతికించి రావాలి. హాలు వాళ్ళ దగ్గర నుంచి జీతం కాకుండా నాలుగు రాళ్ళు రాలేది ఇప్పుడే. రాజాబాబు వచ్చాక తెలియకుండానే ఇంటిఖర్చు పెరిగింది. పైగా, మంగళగౌరి ఖర్చు పెట్టిందంటే ఇక అడగడానికి కూడా ఏమీ ఉండదు.

"ఎదరెదర ఎలాగుంటాదో.." అని ఆలోచించుకుంటూ సైకిలు పోనిస్తున్న రంగశాయి, తననెవరో పిలిచినట్టు అనిపించి బ్రేకేశాడు.

"కూతంత కాపీ పుచ్చుకుని ఎల్దురు రండి బాబా," కాఫీ హొటేలు శెట్టి మర్యాదగా పిలుస్తున్నాడు.

చెట్టుకి సైకిలు చేరేసి, పాక హోటల్లోకి అడుగు పెట్టాడు. కొబ్బరాకు దడిమీద ఎర్రమట్టితో మెత్తి, ఆపై సున్నం కొట్టారు. నున్నగా అలికిన నేలమీద సున్నం ముగ్గులు మెరుస్తున్నాయి. ఉన్న రెండు బల్లల్లోనూ ఒకదానిమీద కూర్చున్నాడు రంగశాయి.

సత్తుగ్లాసుతో మంచినీళ్ళు పట్టుకొచ్చి పెట్టి "ఏడేడిగా రొట్టి ముక్క కాలుత్తాను.. నా సంతోసానికి బాబా," అంటూనే పొయ్యిలో మంట ఎగసందోశాడు శెట్టి.

కాసిన్ని నీళ్ళు ముఖాన జల్లుకుని, తువ్వాలుతో తుడుచుకుంటున్న రంగశాయితో "ఎన్టీ వోడి బొమ్మా బాబా? శాన్నాల్నించి వోయిదా పడతాన్నట్టున్నాది గదా," అడిగాడు శెట్టి.

జవాబు కోసం చూడకుండా, "మా మీద్దయ సూపించాల్తవరు.. ఎన్టీ వోడి కొత్త పోస్టరు మనోటల్లో ఏసేరంటే మొత్తం ఒటేలంతా కలకల్లాడిపోద్ది," అన్నాడు బతిమాలుతున్నట్టుగా.

రొట్టి ముక్క తిని చెయ్యి కడుక్కుని పోస్టర్ ఒకటి తెచ్చి హోటల్లో అతికించాడు రంగశాయి. శెట్టి ముఖం మతాబాలా వెలిగిపోయింది.

"ఎంతబాగున్నాది.. సాచ్చాత్తూ ఎన్టీ వోడే మన ఒటేలుకి ఒచ్చేసినట్టున్నాది," అంటూ మురిసిపోయి, మీగడ వేసి ప్రత్యేకంగా చేసిన టీ ని గాజు గ్లాసులో పోసి అందించాడు భక్తిగా.

"రేపన్నించి కుర్రకారంతా మన ఒటేల్లోనే ఉంటారు బాబా," సంబరపడ్డాడు.

రంగశాయి బయల్దేరబోతూ ఉంటే గల్లాపెట్టె నుంచి ఓ నోటు తీసి బలవంతంగా అతని చేతిలో పెట్టాడు శెట్టి.

"మద్దినేలయితే బోయినం ఎట్టుకుందును.. ఏదీ కాని ఏలయిపోయింది," అన్నాడు బయటికి వచ్చి సాగనంపుతూ.


"పాల్డబ్బా ఏదీ?" గుమ్మం లోనే నిలదీసింది మంగళగౌరి.

రెండు రోజులుగా రంగశాయి బయల్దేరుతుంటే గుర్తుచేస్తోంది, రాజాబాబుకి పాల డబ్బా తెమ్మని. ఏమీ మాట్లాడలేదు రంగశాయి. ఉండబట్టలేక రాజమ్మ కలగజేసుకుంది.

"నీ కాడ పాలున్నాయి గదంటే.. సంటోడికుప్పుడు డబ్బా పాలెందుకూ?"

అంతెత్తున లేచింది మంగళగౌరి. "మూడో నెల దాటేక అందరూ డబ్బా పాలే పోత్తన్నారు. ఉంటే మాత్తరం డబ్బా పాలోత్తే తప్పేటీ?"

కోపాన్ని తమాయించుకుని "డబ్బా పాలు మంచియి కాదే.. తప్పాపోతే అది ఏరే దారి," అంది రాజమ్మ.

కాళ్ళు కడుక్కుని వచ్చిన రంగశాయిని మళ్ళీ నిలదీసింది "రేపట్టుకొత్తావా?" ...అప్పటికీ ఏమీ మాట్లాడలేదు రంగశాయి. ఉయ్యాల్లో నిద్దరోతున్న రాజాబాబుని చూస్తూ, మంగళగౌరి తిట్లు వినడానికి సిద్ధ పడిపోయాడు. అయితే, ఆమె నోరిప్పలేదు.

రాత్రి భోజనాలయ్యి, ఆమె పడకింటికి వచ్చేసరికి రాజాబాబుని ఒళ్లో వేసుకుని ముద్దులాడుతున్నాడు రంగశాయి. పిల్లాడిని అందుకుని, తన పక్కలో వేసుకుని అటువైపు తిరిగి పడుకుంది మౌనంగా.

మర్నాడు ఉదయాన్నే రాజాబాబుని చంకనేసుకుని బయల్దేరింది మంగళగౌరి.

"ఇంత పొద్దున్నే ఎందాకే?" అన్న రాజమ్మకి "ఏట్లోకి" అని శాంతంగా సమాధానం చెప్పింది. చూస్తూ ఉండిపోయాడు రంగశాయి.

మూడోరోజు పదిగంటల వేళకి ఒంటరిగా గుమ్మంలోకి వచ్చిన మంగళగౌరిని చూసి "సంటోడేడే" అని కంగారుగా అడిగింది రాజమ్మ. వీధరుగు మీద సైకిలు తుడుచుకుంటున్నాడు రంగశాయి.

"పాల్డబ్బా కొన్లేని మొగోడికి కొడుకెందుకంటా? మా నానకాడ ఇడిసిపెట్టి ఒచ్చేసేను. మనకంటే పిల్లలక్కర్లెద్దు కానీ, సంటోడికి లోటు సేసే మడిసి కాదు మా నాన" చాలా మామూలుగా చెప్పింది మంగళగౌరి.

"ఇంకా పాలిడిసిపెట్లేదే" బాధ పడింది రాజమ్మ.

"ఇత్తా ఉంటే ఎన్నాలైనా తాగుతాడు.." మంగళగౌరి ఇంకా మాట్లాడుతూనే ఉంది, సైకిలెక్కేశాడు రంగశాయి.

కోపాన్నంతటినీ కాళ్ళలోకి తెచ్చుకుని సైకిలు తొక్కుతున్నాడేమో, అతనికి తెలియకుండానే కృష్ణవేణి ఇంటిముందు ఆగింది సైకిలు. గుమ్మానికి వేసిన తాళంకప్ప పలకరించింది.

"ఆలక్కోలింటికి ఎల్లింది బాబుగోరూ.. శాన్నాల్లయ్యింది.. ఇంకా రాలేదు" పక్కింటి ముసలమ్మ చెప్పింది.

"అదొత్తే ఏటన్నా సెప్మంటారా.." ముసలమ్మ ప్రశ్న గాలిలో ఉండగానే సైకిలు ఆ వీధి దాటేసింది.

ఎండని పట్టించుకునే స్థితిలో లేడు రంగశాయి. ఆకలిదప్పులు అతన్ని ఆపడం లేదు. గుండెల్లో మొదలయిన మంట పిక్కల్లోకి పాకి బలంగా సైకిలు తొక్కిస్తోంది అతనిచేత. కేవలం అతని అదృష్టం, ఏ ప్రమాదమూ జరక్కుండా రాజమండ్రి చేరుకున్నాడు, కనుచీకటి పడే వేళకి.

కృష్ణవేణి చెప్పిన గుర్తులు జ్ఞాపకం చేసుకుంటూ మెరక వీధికి చేరుకోగానే పెద్దగా కష్ట పడకుండానే కనిపించిందామె. ఓ చిన్న పాతకాలపు డాబా ఇంటి వీధరుగు మీద కూర్చుని ఉంది. పసుప్పచ్చ చీర, ఎర్ర జాకెట్టు.. జడలో మల్లెలు, గులాబీలు. అప్పుడే స్నానం చేసి వచ్చినట్టుగా ఉంది.

చెమటలు కక్కుతూ, ఎర్రటి కళ్ళతో సైకిలు దిగిన రంగశాయిని చూసి విస్తుపోయింది కృష్ణవేణి. వీధి తలుపేసి, అతన్ని లోపలి తీసుకెళ్ళి ముందుగా మంచినీళ్ళిచ్చింది. ఆ వెనుకే టీ పట్టుకొచ్చింది. తాగుతూ ఉండగానే, లుంగీ చేతిలో పెట్టి స్నానం చేసి రమ్మంది.

తల తుడుచుకుంటూ వచ్చిన రంగశాయిని మంచం మీద కూర్చోబెట్టి, కంచంలో వేడి వేడి అన్నం, బంగాళా దుంపల కూర తెచ్చి అందించింది. ఆత్రంగా అన్నంలో కూర కలిపిన రంగశాయి మొదటి ముద్దని ఆమె నోటికి అందించాడు. అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది ఒక్క క్షణం.

భోజనం అయ్యాక, మంచానికి రెండో చివర కూర్చుని అతని కాళ్ళు ఒత్తడం మొదలు పెట్టింది. ఒక్కుదుటన లేచి ఆమె ఒళ్ళో తలపెట్టుకున్నాడు రంగశాయి. అతని వెన్ను రాస్తూ ఉండిపోయింది కృష్ణవేణి, నిశ్శబ్దంగా.

(ఇంకా ఉంది)

సోమవారం, జులై 21, 2014

కృష్ణవేణి-9

"నిన్ను సూత్తాకి నీ బాబొచ్చేడొరేయ్.. ఆడేదో పెద్ద కలకటేరో, జడిజీవో అనుకుంటావు కామాల. సినేమా ఆల్లో గేటు కీపరు.. కానొరే, కలకటేరుకైనా పెల్లాం, బిడ్డల కోసం టయం ఉంటాది.. నీ బాబుకి మాత్తరం అస్సలు ఉండదురోయ్," చంటి పిల్లాడిని ఒళ్ళో వేసుకుని ముద్దులాడుతోంది మంగళగౌరి.

రంగశాయి వెళ్లేసరికి అతని తల్లి రాజమ్మ అక్కడే ఉంది. మంచినీళ్ళ గ్లాసుతో వచ్చి పలకరించింది సూరమ్మ. కాళ్ళూ, చేతులూ కడుక్కుని పిల్లాడిని చేతుల్లోకి తీసుకున్నాడు రంగశాయి. అప్పటిదాకా ఆడుతున్నవాడు కాస్తా ఉన్నట్టుండి 'కెవ్వు' మన్నాడు పిల్లాడు. శివాలెత్తేసింది మంగళగౌరి.

ఆ హడావిడి సద్దుమణిగాక రాజమ్మే విషయం కదిపింది, కూతుర్నీ, కొడుకునీ ఎదురుగా కూర్చోపెట్టుకుని. "సూడండొలే.. సంటోడికి మూడో నెలొచ్చేసింది. బారసాల్జేసుకుని తీసికెల్టం ఇదాయకం. అల్లుడికి సెప్పి ఆ యేర్పాటేదో సేత్తే..."

ఆమె మాటలు పూర్తవ్వనే లేదు, అడ్డు తగిలాడు రంగశాయి. "ఎందుకమ్మా.. నన్ను సూత్తానే మీదడిపోతంది. ఒచ్చి మాత్రం ఏం సేత్తాది సెప్పు.. ఈదెక్కి డేన్సు కట్టటవే గదా.." ఉలిక్కి పడింది సూరమ్మ.

"అలగనెయ్యకురా బాబా. ఇదీ, నువ్వూ కాపోతే నాకెవులున్నార్రా.. నేనే సెబుతున్నాను కదా. నా కూతురు అందర్లాటిది కాదు. దాని బాబు దాన్నలా తయ్యారు జేసేడు. నేను మంచీ సెడ్డ సెబుతానే ఉన్నాను కానీ, ఏనాడూ నా మాట పెడసెవ్వే.." అంటూ తమ్ముడి వైపు తేరిపార చూసింది. చూపు తిప్పుకున్నాడు రంగశాయి.

"మీ ఇద్దరూ దాన్ని కాయకపోతే నేనేవైపోతాన్రా.. ఇంకో పిల్ల పెల్లికెదిగింది.. ఇద్దరు కుర్రోల్లున్నారు.. ఆల్ల మంచీ సెడ్డా సూడాలి. కట్టుకున్నోడు సూడబోతే ఒట్టి పెడద్రపు సచ్చినోడు.. నా మొకం సూడండ్రా కాంత.." కళ్ళనీళ్ళు తిరిగిపోయాయి సూరమ్మకి. కూతుర్నలా చూసి నిలువునా నీరయిపోయింది రాజమ్మ.

"ఊరుకోలే.. ఏడుత్తావెందుకు? ఆడుమాత్రం ఏలుకోనన్నాడా? మొగోన్నలా ఎంట్రుకి ముక్క కింద తీసి పారేత్తంటే ఆడికి మాత్తరం ఎలాగుంటాది సెప్పు? నువ్వూ కాపరం సేసేవు, నలుగు బిడ్డల్ని కన్నావు. దాన్లాగే ఉన్నావంటే? ఉంటే నిన్ను బతకనిచ్చేవోల్లా? కూతంత మంచీ సెడ్డా సెప్పంపవే దానికి.. నేనేదో ముసిల్దాన్ని. కట్టుకున్నోడి మాటన్నా సెవినెట్టాలిగదంటే..." రాజమ్మింకా ఏదో మాట్లాడేదే, మధ్యలో మంగళగౌరి వచ్చి కలగజేసుకోక పోతే.

"ఏటీ గూడుపుటానీ? ముగ్గురూ కూడేరంటే నామీదే గావాల. సూడండొలే.. నేనిల్లాగే ఉంటాను. ఎవుడు అరిసి గీపెట్టినా, ఏడిసి మొత్తుకున్నా ఇల్లాగే ఉంటాను. ఇట్టవయ్యిందా, తీసుకెల్లండి. లేపోతే ఇక్కడే ఇడిసిపెట్టెయ్యండి..నాకో ముద్ద నా బాబుకి బలువు కాదు. సెవులు కొరుక్కోటాలు, ఏడిసి ముకం తుడుసుకోడాలు అక్కల్లెద్దు," గబగబా చెప్పేసి పడగ్గది వైపు చర్రున వెళ్ళిపోయింది మంగళగౌరి.

ముగ్గురిలో ఒక్కరూ నోరిప్పలేదు. మర్నాడు వెళ్లి బారసాలకీ. ప్రయాణానికీ ముహూర్తం పెట్టించుకుని వచ్చింది సూరమ్మ.


"సంటోడి పేరు రాజుగాడన్న మాట! బావున్నాది కదా మాయ్యా," సంబరపడ్డాడు గణపతి.

"రాజాబాబు" సరిచేసింది మంగళగౌరి. చంటి పిల్లాడిని జాగ్రత్తగా ఒళ్ళో వేసుకుని ముఖంలో ముఖం పెట్టి "రాజాబాబూ.. రాజాబాబూ" అంటూ ముద్దులాడుతున్నాడు గణపతి.

గూడు కట్టిన ఒంటెద్దు బండి గుమ్మంలో ఆగి ఉంది. సారి కావిడి, ట్రంకుపెట్టి, రెండు చేతి సంచులు బండిలోకి చేర్చారు అప్పటికే. ఎండుగడ్డి మీద చాప పరిచి మంగళగౌరినీ, రాజమ్మనీ బండి ఎక్కించారు.

గణపతి దగ్గరనుంచి రాజాబాబుని అందుకుని ముద్దాడి మంగళగౌరికి అందిస్తూ "జాగరత్తొలే," అని మాత్రం అంది కూతురితో.

"ఒచ్చి దింపుదారన్నా ఇక్కడ జరుగుబాట్నేదమ్మా.. నువ్వే సూసుకోవాల," తల్లికి చెబుతూ కళ్ళు తుడుచుకుంది సూరమ్మ. బండి వెనుకే సైకిలు మీద బయల్దేరాడు రంగశాయి.

చీర ఉయ్యాల్లో నిద్రపోతున్న రాజాబాబుని చూస్తూనే ఆలోచనలు మరోవైపుకి వెళ్ళడం లేదు రంగశాయికి. నోట్లో వేలేసుకుని అమాయకంగా నిద్రపోతున్న పిల్లవాడిని అలా ఎంతసేపు చూసేవాడో, మంగళగౌరి వచ్చి పక్కన కూర్చోకపొతే.

చిన్న ప్రింటున్న తెల్ల వాయిల్ చీర, తెల్ల జాకెట్ వేసుకుంది. జడలో మల్లెదండ భుజం మీద పడుతోంది. పిఠాపురం సెంటు వాసన తెలుస్తోంది. నములుతున్న వక్క పలుకు ఇంకా నోట్లోనే ఉంది.

"ఏటలా సూత్తన్నావ్?" అడిగింది. ఏమీ మాట్లాడలేదు రంగశాయి.

"ఓయబ్బో.. మాకు తెల్దేటీ.. నేనే కదా మొగోణ్ణి.. కొడుకుని కనేసేను అనే కదా" కిలకిలా నవ్వింది.ఆమెవైపు చూసి చిన్నగా నవ్వాడు.

"ఎన్నాల్లై పోయిందో తెల్సా" అతని మెడ చుట్టూ చేతులేసింది. ఇద్దరూ మంచం మీద వాలిన క్షణానికి ఉన్నట్టుండి చల్లబడిపోయాడు రంగశాయి.

గదిలోనుంచి బయటకి వెళ్తుంటే వెనకనుంచి "య్యే... వొంట్లో గీనీ తేడా సేస్సిందా?" అన్న ప్రశ్న వినిపించింది.

వీధరుగు మీద కూర్చుని బీడీ వెలిగించాడు. కొంచం దూరంలో కనిపిస్తున్న స్టేజీని చూడగానే కృష్ణవేణి గుర్తొచ్చింది. ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాయి. రంగశాయి గదిలోకి వెళ్లేసరికి, రాజాబాబుని పక్కలో వేసుకుని గాఢ నిద్రలో ఉంది మంగళగౌరి.

(ఇంకా ఉంది)

శుక్రవారం, జులై 18, 2014

కృష్ణవేణి-8

సరస్వతమ్మకి ఊపిరి సలపకుండా ఉంది. లేత కొబ్బరి చెక్కలు కోరి, రోటి పచ్చడి రుబ్బి పెరుగులో కలిపింది. అప్పటికే చిన్న జాడీలో అల్లప్పచ్చడి సిద్ధం చేసింది. ఓ పొయ్యి మీదకి ఇడ్లీ పాత్ర ఎక్కించి, రెండో పొయ్యి మీద మినపరొట్టి కాలుస్తోంది. పళ్ళాలు, మంచినీళ్ళ చెంబులు సిద్ధం చేసింది. 

కనుచీకటి  పడుతూ ఉండగా వచ్చారు కృష్ణవేణి, రమాదేవీ. వాళ్ళ వెనుకే వచ్చిన పంతులు గారు, "అవ్వలేదా ఇంకా?" అని అడిగారు సరస్వతమ్మని. 

"అయిపోవొచ్చింది.. వచ్చే వచ్చే" అందావిడ, జాడీ లోంచి తీసిన మాగాయలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలూ, పెరుగూ కలుపుతూ. 

"....అందాల నటి కృష్ణవేణి రోజా, సరోజ గా ద్విపాత్రాభినయం చేసే అద్భుత నాటకం 'పగబట్టిన త్రాచు' మరికొద్ది సేపట్లో..." పక్కూరికి వెళ్ళిన ఒంటెద్దు బండిలో మైకు నుంచి అలలుఅలలుగా వినిపిస్తున్నాయి మాటలు.

ఒక్కో పళ్ళెం లోనూ నాలుగేసి ఇడ్డెన్లు, సగం రొట్టి ముక్క పెట్టి,  కాచిన నెయ్యి అభికరించి, పచ్చళ్ళు వేసి ఆడవాళ్లిద్దరికీ చెరో పళ్ళెం అందించింది సరస్వతమ్మ. 

"మీరూ తినేద్దురుగాని" అని పంతులుగారితో  అంటూ ఉండగానే "ఇప్పుడు కాదు.." అంటూ హడావిడిగా బయటికి వెళ్ళిపోయారాయన. 

"అయ్ బాబోయ్.. వొద్దే ఎట్టేసేరు ఇన్ని తిన్లేనమ్మగారూ.. కూంత తీసేద్దురూ," బతిమాలింది రమాదేవి. 

"తినకపోతే ఎలాగమ్మా.. మీ ఇంటికి వెళ్ళేదాకా మళ్ళీ ఏమీ దొరకవు మీకు.." వాళ్ళతో మాట్లాడుతూనే టీకి నీళ్ళు పెట్టింది. మౌనంగా తింటోంది కృష్ణవేణి. ఇడ్డెన్లు పట్టుకొచ్చిన సరస్వతమ్మ ఇద్దరి పళ్ళాల్లోనూ చేరి రెండూ వడ్డించ బోయింది. వద్దుగాక వద్దన్నారిద్దరూ. వాళ్ళు టీ తాగుతూ ఉండగానే పంతులుగారు హడావిడిగా లోపలికొచ్చారు.

"సత్యం కంగారు పడుతున్నాడమ్మా మేకప్పులకి టైము సరిపోదని.. గుర్తుంది కదమ్మా కృష్ణవేణీ.. ముందు సరోజ వేషం నీది.. క్లబ్ డేన్స్ అయ్యాక రోజా వేషం .. జాగ్రత్తగా చెయ్యండి" అన్నారు. 

ఇద్దరూ మేకప్పులకి బయల్దేరబోతుంటే "ఒక్క నిమిషం ఆగండమ్మా" అంది సరస్వతమ్మ. జాకెట్ ముక్కలు, కుంకుమ భరిణెతో వచ్చి రమాదేవికి బొట్టు పెట్టి జాకెట్ ముక్క చేతిలో పెట్టింది. ఆ పళాన వంగి ఆవిడ కాళ్ళకి దండం పెట్టేసింది రమాదేవి "మీయాసీరోదాలు కావాలమ్మగారూ" అంటూ.

"బొట్టుంచుతాను  రామ్మా కృష్ణవేణీ" అంటూ పిలిచి రెండో జాకెట్ ముక్క ఆమె చేతిలో పెట్టింది. ఏమీ మాట్లాడలేదు కృష్ణవేణి. "వెళ్ళొస్తావండీ" అని చెప్పి బయల్దేరారు ఇద్దరూ. 

"మీరు సూత్తారు కదమ్మా నాటకం" అడిగింది రమాదేవి. నవ్వుతూ తలూపుతూ "జాగర్తమ్మా" అంది సరస్వతమ్మ. 

స్టేజీని ఆనుకుని ఉన్న ప్రహారీ గోడ వెనుక కొత్తగా కట్టిన కొబ్బరాకుల దడిలో మేకప్పులు మొదలు పెట్టాడు సత్యం. జాలీ ఫేస్ పౌడరులో కొబ్బరినూనె కలిపి తయారు చేసిన పేస్టుని ఒక్కొక్కరి ముఖాలకీ పూసి, అది ఆరుతూ ఉండగానే ముందుగా సిద్ధం పెట్టుకున్న పచ్చికొబ్బరి పుల్లని కాటుక భరిణెలో ముంచి ఆడవాళ్ళిద్దరికీ కాటుక, కనుబొమలు, మగవాళ్ళకి మీసకట్లు దిద్దాడు. 

ఇసకేస్తే రాలనంతగా పోగుపడ్డారు జనం. ఆవరణంతా ఒకటే గోలగోలగా ఉంది. స్టేజీకి తెరలు కట్టి సిద్ధం చేశారు. రమాదేవి వాళ్ళ మాయ లైటింగ్ ఏర్పాట్లు చేసేశాడు. హార్మోనిస్టు, పక్క వాద్యాలని సిద్ధం చేసుకుని స్టేజికి ఒక పక్కగా మైకులు అమర్చుకుని కూర్చున్నాడు. పంతులు గారు అందరి దగ్గరికీ హడావిడిగా తిరుగుతూ జాగ్రత్తలు చెబుతున్నారు. 

సన్నగా మంచు పడుతోంది. పందిరి దగ్గర బజ్జీల కొట్టు పెట్టేసిన ప్రసాదం అప్పుడే మిరపకాయ బజ్జీలు, శనగ వడలు వేడివేడిగా వేసి అమ్మడం మొదలు పెట్టేశాడు.

ఘోషా పాటించే ఇళ్ళలో ఆడవాళ్ళందరూ ఓ పక్కగా కూర్చున్నారు. సరస్వతమ్మ ఉంది వాళ్ళలో. సినిమా పాటలు మోగిస్తున్న మైకు ఆపేసి, నాటకం మొదలవ్వ బోతోందన్న ప్రకటన చేయించేశారు పంతులుగారు. ఆవరణంతా నిశ్శబ్దం అలముకుంది. 

ముదురు నీలం రంగు తెరవెనుక నటీనటులందరూ వరసగా నిలబడి ముందుగా వినాయక ప్రార్ధన, ఆ వెనుకే 'వందే వందే కళామతల్లీ... ' పాడారు. 

తను పరీక్ష పాసయ్యాననంటూ కృష్ణవేణి నారాయణరావుకి సంబరంగా చెప్పడం మొదటి సన్నివేశం. నారాయణరావు స్నేహితులు అతన్ని చేతులూపి ప్రోత్సహించారు. కృష్ణవేణిని చూసి కుర్రాళ్ళు ఈలలేశారు.


ప్రామ్ప్టింగ్ కి ఒక్కరు సరిపోక తెరకి రెండు వైపులా ఇద్దరిని ఏర్పాటు చేయాల్సి వచ్చింది పంతులుగారు. నారాయణరావుకీ కృష్ణవేణికీ డ్యూయట్ మొదలవ్వగానే రంగు కాగితాలు, పూలు, చిల్లర డబ్బులు స్టేజి మీదకి ఎగరేశారు కుర్రాళ్ళు. 

విలన్ వేషం వేసిన సత్యమూర్తి డెన్ కనిపించగానే క్లబ్ డేన్స్ వస్తుందని ఊహించేశారు కొందరు. "క్లబ్ డేన్స్ .. క్లబ్ డేన్స్" అంటూ కేకలు మొదలు పెట్టారు. వాళ్ళ అంచనా తప్పు కాలేదు.

ఒక్కసారిగా లైట్లు ఆరి వెలిగేసరికి రమాదేవి ప్రత్యక్షం అయ్యింది స్టేజీ మీద. చిన్న నిక్కరు, నడుము వరకూ రాని బనియన్ వేసుకుంది. కాళ్ళకి సాక్సులు, బూట్లు, విరబోసుకున్న జుట్టు, తలమీద టోపీ. ఆమె డేన్స్ చేస్తూ ఉంటే రంగు రంగుల లైట్లని ఆమె మీదకి ఫోకస్ చేస్తున్నాడు మాయ.

పాట అవుతూనే రెండు గుప్పిళ్ళ నిండా రంగు కాగితాలు గాల్లో ఎగరేసి తెరవెనక్కి మాయమైపోయింది రమాదేవి. ''వన్స్ మోర్' లని పట్టించుకోకుండా నాటకంలో తర్వాతి సీన్ మొదలైపోయింది. 

పొరుగూళ్ల  నుంచొచ్చిన కొందరు తిరుగుముఖం పట్టారు. చీర చుట్టుకుని వచ్చి ఆడవాళ్ళకి కొంచం దూరంగా కూర్చుని నాటకం చూస్తోంది రమాదేవి. 

"స్టేజీ ఎక్కి గెంతులెయ్టానికి లేని సిగ్గు ఉప్పుడెందుకో.. ఆ కురస గుడ్డలతోనే కూకోవొచ్చు గదా.. సీర సుట్టుకోటం దేనికంటా?" సరస్వతమ్మ దగ్గర నిష్టూరపడింది ఒకావిడ. 

"స్టేజీ మీద డేన్స్ చెయ్యడం ఆమె వృత్తి.. స్టేజీ దిగిపోయాక మనలాంటి ఆడదే కదమ్మా" సరస్వతమ్మ మాటలు అక్కడ ఎవరికీ రుచించలేదు.

రంగశాయి, కృష్ణవేణి పోటీ పడి నటించేస్తున్నారు స్టేజీమీద. కృష్ణవేణి కి ప్రామ్ప్టింగ్ బాగా కావాల్సి వస్తోంది. నారాయణరావుతో చీరల్లో కనిపించిన కృష్ణవేణి ఇప్పుడు రెండు జెడలు, లంగా వోణీల్లో ఉంది. 

విజిల్స్ మోతలో సగం డైలాగులు వినిపించడం లేదు ఎవరికీ. అయినా నాటకం రక్తి కట్టింది అనిపించడానికి అవేవీ అడ్డంకి కాలేదు. 

నాటకం అవుతూనే ఉత్సాహవంతులు కొందరు కృష్ణవేణికీ, రమాదేవికీ నగదు బహుమతులు చదివించారు. పొరుగూరి నుంచి వచ్చిన ఓ వృద్ధ కళాకారుడు వాళ్ళిద్దరినీ భుజం తట్టి ప్రోత్సహించాడు. 

జనం ఇంటి ముఖం పడుతూ ఉండగానే నటీనటులందరూ మేకప్పులు కడుక్కునే పనిలో పడ్డారు. బట్టలు మార్చుకుని, బయల్దేరడానికి సిద్ధ పడుతున్న కృష్ణవేణికి రంగశాయి ఒక్కడూ కూర్చుని బీడీ కాల్చుకుంటూ కనిపించాడు. 

"మాయక్కోలింటికి రామిండ్రీ ఎల్తన్నాను.. అక్కకి బాలేదంట.. రొండు మూన్నెల్లు అక్కడే ఉండాల్సొత్తాదేమో.. అదుండేది మెరకీదిలో.." అంటూ గుర్తులు చెప్పింది. 

అన్యమనస్కంగా తలూపాడు రంగశాయి. 

వెనక్కి వెనక్కి చూస్తూ ఇంటిముఖం పట్టింది కృష్ణవేణి. 

(ఇంకా ఉంది)

బుధవారం, జులై 16, 2014

కృష్ణవేణి-7

మొదటి ఆటకి  పల్చగా  ఉన్నారు జనం. బెంచీ క్లాసుకి వచ్చిన వాళ్ళందరినీ టిక్కెట్లు చించి హాల్లోకి పంపించి, గేటు పక్కన ఉన్న బల్లమీద కూర్చున్నాడు రంగశాయి. 

"ఏట్రా బాబా.. పన్లో ఉన్నావో, మానేహేవో తెల్డం లేదు మాకు.. ఓ రోజొత్తే నాల్రోలెగ్గొడతన్నావ్.. ఏటి కత?" చనువుగా వచ్చి పక్కన కూర్చుని పలకరించాడు కాశీ, రిజర్వుడు క్లాసు గేటు కీపరు. 

"కొడుకుట్టేడ్రా.. ఆయడావిడి," అన్నాడు రంగశాయి.

"సెప్పవేట్రా.. అయినాగానొరే ఇల్లాగా సెప్పేది? బుడ్డేది? కక్కా ముక్కా యేయీ?" హడావిడి చేశాడు కాశీ. నవ్వేసి ఊరుకున్నాడు రంగశాయి.

"అదికాదుగానొరే కానుపు మీయావిడగ్గదా.. నువ్విన్నాల్లు నాగా ఎట్టేసేవేట్రా.. ఆ గుమస్తా గోరు పూటా గొడవే అనుకో..అందులోనా ఇది ఇంగ్లీసు బొమ్మ కదా.. మద్ది మద్దిన సీన్లు కలుపుతున్నారు.. కుర్రనాయాల్లు ఎర్రెక్కిపోతన్నారనుకో"  గొంతు తగ్గించి చెప్పాడు కాశీ.

"ఎన్టీ వోడి కొత్తబొమ్మ రిలీజయ్యేవొరుకూ ఇదే ఆడింతారేమో.. జనాల్తగ్గేరప్పుడే," అన్నాడు రంగశాయి. 

"తగ్గటవేటేహే.. ఇజీవోడ నించి కొత్త సీన్లట్టుకొచ్చేరు.. రేపన్నించి కలుపుతారంట.." కబుర్లు అవుతూ ఉండగానే ఇంటర్వల్ మోగింది. ఇద్దరూ ఎవరి గేటు దగ్గర వాళ్ళు నిలబడ్డారు, బయటికి వెళ్ళే వాళ్లకి గేట్ పాసులు ఇవ్వడం కోసం. సినిమా మొదలయ్యాక, నేల గేటు కీపరు కూడా వచ్చి కలిశాడు. 

"పండక్కి కొత్త బొమ్మట్టుకొత్తే లైనుకెల్తావేట్రా పోస్టర్లట్టుకునీ?" రంగశాయిని అడిగాడు కాశీ. 

ఉన్నట్టుండి నాటకం గుర్తొచ్చింది రంగశాయికి. "రిగాల్సల్ ఎన్నాల్లుంటాదో పంతులుగార్నడగాలి," అనుకున్నాడు. 

"లైను మీదకెల్తేనే నాలుగు డబ్బుల్రా.. ఎదవ కాల్నొప్పొచ్చి సైకిలు సరింగా తొక్కలేపోతన్నాన్నేను," అన్నాడు కాశీ.

రెండో ఆటకీ అంతంతమాత్రంగానే ఉన్నారు జనం. ఒక్క నేల క్లాసు మాత్రం కళకళలాడుతోంది. బెంచీ గేటు దగ్గర టిక్కెట్లు చించుతున్న రంగశాయి యధాలాపంగా రిజర్వుడు గేటు వైపు చూసి ఉలిక్కి పడ్డాడు.

కృష్ణవేణి, పక్కనే ఎవరో మగ మనిషితో లోపలికెళ్తోంది. నల్లపూలున్న తెల్ల శిల్కు చీర, నల్ల జాకెట్టు వేసుకుంది. తల నిండా జాజిదండ, ఎర్ర గులాబీలు. మగమనిషి నల్లగా, ఎత్తుగా, లావుగా ఉన్నాడు. తెల్ల బట్టలేసుకుని షోగ్గా తయారయ్యాడు.

కృష్ణవేణి భుజం చుట్టూ వేసిన అతని చేతికి ఉన్న రెండు ఉంగరాలూ తళుక్కున మెరిశాయి లైటు వెలుగులో. అతనిమీద వాలి నడుస్తున్న కృష్ణవేణి ఎటూ చూడడం లేదు. గేటు మూసేసి బల్లమీద కూర్చుండి పోయాడు రంగశాయి. అతని రెండు చేతులూ జుట్టులోకి వెళ్ళిపోయాయి అప్రయత్నంగా.

"మాయాయినప్పుడే ఒచ్చెల్లిపోయాడు. ఈ రిగాల్సలు కాదు కానీ, ఆడి మొకం సూసి ఎన్నాల్లైపోతందో.." కృష్ణవేణి మాటలు గుర్తొచ్చాయి. 

"ఎవడాడు? కృష్ణవేణి మొగుడా? పెళ్లయ్యిందా కృష్ణవేణికి. సూడబోతే డబ్బున్నోడిలాగే ఉన్నాడు.. మరి నాటకాలాట్టం ఎందుకు? మొగుడయ్యి ఉండడు.. కచ్చితంగా కాదు.. మొగుడైతే సూత్తా సూత్తా ఈబొమ్మకి తీసుకొత్తాడా.. ఆడే మొగుడైతే అంత సిన్నిల్లు ఎందుకుంటాది.. మొగుడు కాపోతే మరాడెవడు?" ప్రశ్నలూ, జవాబులూ జోరీగల్లా ముసురుకున్నాయి.


టీ తాగితే తప్ప లాభం లేదనుకుంటూ కేంటీన్ వైపు నడిచాడు రంగశాయి. టీ తాగుతూ ఉండగానే అతన్ని వెతుక్కుంటూ వచ్చేశాడు కాశీ. 

"ఓర్నువ్విక్కడున్నావా.. నీకోసవే నెలుకుతున్నాను. నా గేటు సూసుకోరా కాంత.. నేను బయలెల్తాను.. పెద్ద జెనం లేర్రా.. మొత్తం ఓ పదిమందున్నారంతే. ఇంట్రెల్లో నేలోల్లు దూరిపోకండా సూడు సాలు," అంటూ హడావిడిగా బయల్దేరాడు కాశీ.

సరిగ్గా ఆట మొదలైన ముప్పావుగంటకి ఇంటర్వల్. తన గేటు దగ్గరే నిలబడినా, రంగశాయి దృష్టంతా రిజర్వుడు మీదే ఉంది. ముగ్గురో నలుగురో బయటికి వెళ్ళారు కానీ వెళ్ళిన వాళ్ళలో 'వాళ్ళు' లేరు. ఆట మొదలవ్వనిచ్చి రిజర్వుడు గేటు దగ్గర నిలబడ్డాడు. లోపలికి చూడాలన్న కుతూహలాన్ని అణచుకోవడం అతని వల్ల కావడం లేదు. 

చప్పుడు చెయ్యకుండా లోపలికెళ్లి గుమ్మం పక్కగా నిలబడ్డాడు. చీకట్లో ఆకారాలు కనిపించడం లేదు. కాసేపటికి చీకటి అలవాటయ్యింది. తనకి కాస్త ముందున్న వరసలో ఓ చివరికి కూర్చుని కనిపించారు వాళ్ళిద్దరూ. ఆమె అతని చెవిలో నోరు పెట్టి ఏవిటో చెబుతోంది. అతని చెయ్యి ఆమె భుజం చుట్టూనే ఉంది. ఇద్దరూ సినిమానీ, హాలునీ కూడా పట్టించుకునే స్థితిలో లేరు. 

ఇదీ అని చెప్పలేని బాధేదో కలిగింది రంగశాయిలో. సత్యమూర్తిని దూరాన్నే నిలబెట్టే కృష్ణవేణి.. నారాయణరావుని చెయ్యేసి ముట్టుకోనివ్వని కృష్ణవేణి.. ఇలా మరో మగాడితో ఇంత సన్నిహితంగా మసలడం కొత్తగానూ, వింతగానూ ఉందతనికి.

చప్పుడు చెయ్యకుండా బయటికి వచ్చేసి బల్లమీద కూలబడ్డాడు మళ్ళీ. మట్టి రోడ్డు మీద చలిగాలిలో సైకిలు ప్రయాణం, తనని ఇంట్లోకి తీసుకెళ్లడం, వర్షం కురుస్తున్న రాత్రి కోడిగుడ్డట్టూ అన్నం కలిసి పంచుకోడం.. ఒకటేమిటి.. జరిగినవన్నీ సినిమా రీల్లా గింగిరాలు తిరుగుతున్నాయి కళ్ళముందు. 

ఆట అయిపోయిందన్న సూచనగా కొట్టిన బెల్లు విని స్పృహలోకొచ్చాడు రంగశాయి. జనం ఒక్కొక్కరే బయటికి వస్తున్నారు. ఎందుకో తెలీదు, బెంచీ గేటు తలుపు చాటుగా నిలబడ్డాడు రంగశాయి. వాళ్ళిద్దరూ బయటికి వెళ్తూ కనిపించారు. 

వాళ్ళని పూర్తిగా వెళ్ళనిచ్చి, రిజర్వుడు క్లాసులోకి వెళ్ళాడు నెమ్మదిగా. లైట్లన్నీ వెలుగుతూ దేదీప్యమానంగా ఉంది హాలు. కృష్ణవేణి కూర్చున్న కుర్చీ.. ఆమె అప్పుడే లేచి వెళ్ళిన జాడ తెలుస్తోంది. బయటికి రాబోతూ, కుర్చీ వెనక్కి చూస్తే ఏదో వస్తువు కనిపించింది. 

దగ్గరికి వెళ్లి వంగి చేతిలోకి తీసుకున్నాడు. ఎర్ర గులాబీ.. కొన్ని రేకులు రాలిపోయాయి అప్పటికే. ఆ పువ్వుని దోసిట్లో ఉంచి ముఖానికి దగ్గరగా తీసుకుంటూ ఉండగా, హాల్లో లైట్లన్నీ ఒక్కసారిగా ఆరిపోయాయి. 

(ఇంకా ఉంది)

సోమవారం, జులై 14, 2014

కృష్ణవేణి-6

"ఓయమ్మోయ్.. నా వొల్ల కాదొలేయ్.. నేను పల్లేనేయ్.. నీ తమ్ముడికి నా సేతుల్లో ఉన్నాదేయ్.. ఆడి రగతం కళ్ళ సూత్తానేయ్..." మంగళగౌరి అరుపులు వీధి వీధంతా వినిపిస్తున్నాయ్.

"ఓరుసుకోయమ్మా.. మా తల్లి గదా.. ఒక్క సిటం ఓరిసేవంటే పండంటి కొడుకునెత్తుతావు.. నా మాటినుకోయమ్మా.." గోరు వెచ్చని ఆముదాన్ని మంగళగౌరి కాళ్ళకి మర్దన చేస్తూ నచ్చచెబుతోంది మంత్రసాని.

పెరట్లో పొయ్యి మీద వేడి నీళ్ళు కాగుతున్నాయి. సూరమ్మ ఇంట్లోకీ, బయటకీ కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతోంది.

"ఏడే ఆ సచ్చినోడు.. ఎక్కడ సచ్చేడే.. నా పేనం పోతన్నాదే ఇక్కడ.. నేను బతూతానో సత్తానో తెలకుండా ఉన్నాదే.. ఆడు కంట బడితే సంపేసి పోతానే..." మంగళగౌరి కేకలు వెక్కిళ్ళ లోకి దిగుతున్నాయి.

చుట్టుపక్కల నాలుగిళ్ళలో ఆడవాళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నారు. మగవాళ్ళు బితుకు బితుకుమంటూ చూస్తున్నారు. ఉన్నట్టుండి పెద్దగా అరుస్తూ, అంతలోనే మూలుగుతూ, చిన్ననాటి నుంచీ నేర్చిన తిట్లన్నీ రంగశాయి మీద ప్రయోగిస్తోంది మంగళగౌరి.

విని విని విసుగెత్తిన మంత్రసాని "పెతి సయితీ పురిటి మంచం ఎక్కుతానే మొగున్నిబూతుల్లంకించుకునేదే.. ఒల్లు పచ్చన్నా ఆరకముందే ఎల్లి ఆడిపక్కన తొంగునేదే," అనేసింది. అంత బాధలోనూ కస్సున లేచింది మంగళగౌరి.

"ఇయ్యన్నీ నేనొక్కద్దాన్నే ఎందుకు పడాల? ఆడెందుకు సుక పడిపోవాల.. సెప్పుమీ," మంత్రసాని ఏమీ మాట్లాడలేదు.

"నిన్ను కట్టుకున్నాకా ఆ సన్నాసికింకా సుకం గూడానా," అని గొణుక్కుంది సూరమ్మ.

కబురందుకున్న రంగశాయి సైకిలు దిగేడు. మంగళగౌరి హడావిడి అంతా వింటున్న మగవాళ్ళు అతన్ని లోపలి వెళ్ళనివ్వలేదు.

"తొలిసూలుగదబ్బాయా.. ఇలాగే ఉంటాది.. గాబరడిపోకు.. పండంటి మొగ పిల్లోడుడతాడు.. నాకు మంచి బగుమతీ ఇవ్వాల," అని రంగశాయికి చెప్పింది మంత్రసాని.

మంగళగౌరి కేకలు వింటుంటే ఏమీ తోచడం లేదు రంగశాయికి. తనేదో పెద్ద తప్పు చేసినట్టుగా అనిపిస్తోంది. అందరూ తనని చూసి నవ్వుతున్నట్టుగా అనిపించి, ఎవరివైపూ చూడలేక పోతున్నాడు. ఆ ఇంట్లో ఉండలేడు.. అలా అని వెళ్లిపోనూలేడు.

మంత్రసాని ఒక్కర్తికే అతని అవస్థ అర్ధమయినట్టుంది. మధ్య మధ్యలో వచ్చి ధైర్యం చెప్పి వెళ్తోంది. సూర్యాస్తమయం అవ్వబోతూ ఉండగా ఉన్నట్టుండి మంగళగౌరి కేకలు ఆగిపోయాయి.ఇంట్లో నుంచి పసిబిడ్డ ఏడుపు వినిపించింది.

మగవాళ్ళు ఎవ్వరికీ లోపల ఏం జరుగుతోందో అర్ధం కాలేదు. సూర్యుడు గోదాట్లోకి కుంగాక లోపలి నుంచి కబురొచ్చింది.

"మగ పిల్లాడు.. తల్లీ బిడ్డా క్షేమం"

కబురు వింటే తప్ప రంగశాయి మనుషుల్లో పడలేక పోయాడు. పక్కింటావిడ టీ పెట్టి పంపింది.

"మాయ్యా.. నీకు కొడుకుట్టేడు మాయ్యా.. నాకు పెద్ద పారిటీ సెయ్యాలి మాయ్యా" అంటూ గంతులేస్తున్నాడు గణపతి. అప్పుడు అర్ధమయ్యింది రంగశాయికి, తను తండ్రినయ్యానని.

"ఓ కొడుక్కి తండ్రి" ఈ ఆలోచన రాగానే పసివాడిని చూడాలని తహతహ మొదలయ్యింది. మరుక్షణం మంగళగౌరి గుర్తొచ్చి భయమూ కలిగింది. ఏమంటుంది మంగళగౌరి? తనకి పెళ్లాన్నే కాదు, పిల్లాడిని చూడడమూ చేతకాదంటుంది.. ఇంకా ఎన్నైనా అంటుంది.. ఎన్నాళ్ళైనా అంటుంది.

"అందరూ ఇలాగే ఉంటున్నారా? నా ఒక్కడికే ఇలా అవుతోందా?" కొబ్బరిచెట్టు కింద వాల్చిన మడత మంచం మీద కూర్చున్న రంగశాయి ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. పిల్లాడిని చూడ్డానికి రమ్మని లోపలి నుంచి కబురొచ్చేసరికి అతనీ ప్రపంచంలో లేడు.

నెమ్మదిగా పురిటి మంచం దగ్గరికి వెళ్ళిన రంగశాయి పొత్తిళ్ళలో ఏదో కదలడాన్ని చూశాడు మొదట. గాల్లో ఆడుతున్న చిన్ని చిన్ని కాలూ, చెయ్యీ కనబడ్డాయి. దీపం ఒత్తి పెద్దది చేసి, పసివాడికి దగ్గరగా దీపం ఉంచిన మంత్రసాని, పిల్లాడిని చూడమనట్టుగా సైగ చేసింది.


రెప్ప వెయ్యడం మర్చిపోయాడు రంగశాయి. మంగళగౌరి వైపు చూసే ధైర్యం లేకపోయింది అతనికి. ఓ క్షణం తర్వాత తప్పక చూపు తిప్పితే ఆమె నిద్రపోతూ కనిపించింది. "హమ్మయ్య" అనుకున్నాడు తనకి తెలియకుండానే.

"బాబా.. నా బగుమతి," గుసగుసలాడింది మంత్రసాని. జేబులో చెయ్యిపెట్టి చేతికందిన డబ్బు తీసి ఆమె చేతిలో పెట్టాడు, కలలో ఉన్నట్టు. నోట్లు చూసుకున్న మంత్రసాని ముఖం చింకి చేటంతయ్యింది.

భోజనం చేశాననిపించి మడతమంచం మీదకి చేరిన రంగశాయికి చాలాసేపు నిద్రపట్టలేదు. పిల్లవాడి ఏడుపు ఉండుండీ వినిపిస్తూనే ఉంది.

మర్నాడు రిహార్సల్ కి వెళ్లేసరికి అందరూ అతనికోసమే ఎదురు చూస్తున్నారు.

"నిన్నంతా ఎక్కడికెల్లేవెహే.. సెప్పా పెట్టకుండా సెక్కేసేవు.." అందరితరపునా అడిగాడు సత్యమూర్తి.

సైకిల్నున్న సంచిలోంచి పెద్ద పొట్లం తీసి అందరికీ మిఠాయుండలు పంచాడు రంగశాయి, "కొడుకుట్టేడు," అని చెబుతూ.

మిఠాయి అందుకుంటూ అతని కళ్ళలోకి ఒక్క క్షణం సూటిగా చూసింది కృష్ణవేణి. మరుక్షణం చూపు తిప్పేసుకుంది.

"ఉంకో ఉండ తీసుకో కృష్ణేనీ.. రుసిగా ఉన్నాది బెల్లం మిటాయి" అన్నాడు సత్యమూర్తి.

రిహార్సల్ మొదలయ్యింది. రంగశాయి పరధ్యానంగా ఉండడం కృష్ణవేణి దృష్టిని దాటిపోలేదు.

"అందరికీ డైలాగులు నోటికి రావాలి.. ఏదన్నా డైలాగు మర్చిపోతే అలా నోరు తెరుచుకుని నిలబడి పోకండి.. మామూలుగా నడుస్తూ కర్టెన్ దగ్గరకి వస్తే, వెనక నుంచి ప్రామ్ప్టింగ్ ఇస్తాం.. మొత్తం నాటకం ప్రామ్ప్టింగ్ మీదే నడవదు.. డైలాగులు గుర్తుండాలి మీ అందరికీ," ఓపిగ్గా చెప్పారు పంతులుగారు.

రిహార్సల్ పూర్తవుతూనే, "ఇయ్యాల నువ్వు మా ఇంటికి రాక తప్పదు కృష్ణేనీ," అన్నాడు సత్యమూర్తి.

అందుకోసమే చూస్తున్న దానిలా, "అయ్యో.. అదెంత బాగ్గెం.. ఇప్పుడు సరాసరి మీ ఇంటికే" అంది నవ్వుతూ. ఒకటి కాదు, రెండు కాదు.. అరడజను వెలక్కాయలు అడ్డంగా పడ్డాయి సత్యమూర్తి గొంతులో.

"ఆసికాలడతన్నావు," అన్నాడు బలహీనంగా.

"బలేటోరే.. మా నాన్నగారికి కూడా సెప్పేసి ఒచ్చేనియ్యాల. పలానీ సచ్చిమూర్తిగోరు రోజూ ఆల్లింటికి పిలుత్తున్నారు అంజెప్పేనో లేదో, పెద్దోరు పిలిసినప్పుడు ఎల్లి రావాలి.. ఇయ్యాల తప్పకుండా ఎల్లొచ్చెయ్యి అని మరీ మరీ సెప్పేరు.. నడండి ఎల్దారి," అంది కృష్ణవేణి.

"నా బుర్ర పంజెయ్యట్లేదు కృష్ణేనీ.. ఇయ్యాల మాయాడోల్లు పుట్టింటికి ఎల్లేరు.. నిన్ను తీసికెల్లి మంచినీల్లిచ్చి పంపెయ్ మంటావా సెప్పు?" అన్నాడు.

అస్సలు తగ్గ దలచుకోలేదు కృష్ణవేణి. "అసలు కోడి పలావు మీకు కుదిరినట్టు ఆడోల్లకి కూడా కుదరదంటగదా.. కుర్రోల్లందరూ ఒకిటే సెప్పుకోటం.. కోన్ని కాల్సి బోరు పీకిచ్చెత్తే పలావెంతసేపూ.." కుర్రాళ్ళందరూ పైకి కనిపించకుండా నవ్వుకుంటున్నారు, సత్యమూర్తి అవస్థ చూసి.

"ఇయ్యాల కాదు గానీ.. ఉంకోపాలొద్దూగాని కృష్ణేనీ.. అగ్గో మన బండి.. మాయాడోల్లని తీసుకురానాకెల్తంది.. నిన్ను జాగర్తగా మీ ఇంటికాడ దింపేత్తాడు బండోడు.. ఎల్లొచ్చెయ్ మరి.. సందలడి పోతంది.."

కృష్ణవేణి ని బండెక్కించి, ఊపిరి పీల్చుకున్నాడు సత్యమూర్తి.

(ఇంకా ఉంది)

శుక్రవారం, జులై 11, 2014

కృష్ణవేణి-5

రిహార్సల్ జరిగే పెంకుటిల్లు రోజూ కన్నా కోలాహలంగా ఉంది. వీధరుగు నిండా జనం నిలబడిపోయి ఉన్నారు. ఎప్పుడూ లేనిది వీధి గుమ్మం తలుపు లోపల నుంచి గడియ వేసేసి ఉంది. ఉన్న రెండు కిటికీల దగ్గరా  ఒకరినొకరు తోసుకుంటూ లోపలికి తొంగి చూస్తున్నారు పిల్లా పెద్దా. 

లోపలున్న పెద్ద వసారాలో ఉన్న నాలుగు కుర్చీలూ  ఓ గోడ వారకి వేసి ఉన్నాయి. పంతులుగారు, మరికొందరు వాటిలో కూర్చుని ఉన్నారు. మరో గోడ వార పరిచిన చాపల మీద నటులు కూర్చుని ఉన్నారు. కృష్ణవేణి, రంగశాయి, నారాయణరావు ఓ పక్కగా నిలబడి చూస్తున్నారు. 

కొంగు చుట్టూ తిప్పి, చీర కుచ్చిళ్ళతో కలిపి రొంటిన దోపి మెరుపు తీగలా డేన్స్ చేస్తోంది రమాదేవి. పచ్చని పసిమి ఛాయ. చెయ్యెత్తు మనిషి. ఎత్తుకు తగ్గ బరువు. ముక్కుపొడుం రంగు సాదా చీర కట్టుకుంది. మెళ్ళో పసుపుతాడు లోపలికి, కట్టుతీగకి  చుట్టిన ముత్యాల దండ పైకీ వేసుకుంది. పిలక జడలో పువ్వులు పెట్టుకోలేదు.

భుజాలు, నడుము కదిలిస్తూ ఉన్న ఆ కాస్త చోటులోనే గిరగిరాలు తిరుగుతూ రమాదేవి డేన్స్ చేస్తుంటే చూస్తున్న అందరూ రెప్ప వెయ్యడం మర్చిపోయారు.ఇంకొక్క మాట చెప్పాలంటే, ఆ పూట కృష్ణవేణి ని చూసినవాళ్ళు ఎవరూ లేరు. ఆమె కూడా రమాదేవి డేన్స్ నే చూస్తోంది, తదేకంగా.డేన్స్ ముగించి, పైట కొంగుతో ముఖం తుడుచుకుంటూ పంతులు గారి దగ్గరకి వచ్చి నిలబడింది రమాదేవి. 

"నా యిజ్జ మీకు తెలంది కాదు బాబుగోరూ. మాటనుకునే ముందు సేసి సూపింతం ఇదాయకం గదా. మీరే పాటంటే అది. ఎల్లారీస్వరి రికార్డులన్నీ ఉన్నాయి నా కాడ. పలానీ పాటకి డేన్స్ కట్టు రమాదేవీ అనండి.. రెండో మాట లేకుండా సేత్తాను," చేతులు జోడించింది.

"ఉంకో మాట.. ముందే సెప్పలేదనేరు.. మీరింకా నాటకం లైటింగుకి ఎవర్నీ బుక్ సెయ్యలేదంట గదా. ఆ బుకింగు కూతంత మా మాయకి ఇప్పిచ్చేరంటే..." ఆమె మాట పూర్తవుతూ ఉండగానే పంతులు గారు లేచి నిలబడ్డారు. ఆ వెంటే మిగిలిన పెద్ద మనుషులు కూడా. వాళ్ళతో పాటు రమాదేవి, మాయ  పెరటివైపుకి వెళ్ళారు. 

"చూడమ్మా రమాదేవీ.. కుర్రాళ్ళు సరదా పడుతున్నారని నాటకం వేస్తున్నాం తప్ప బాగా డబ్బులుండి కాదు. పందిట్లో మిగిలిన కార్యక్రమాలన్నీ షరా మామూలే. ఇది ఎగస్ట్రా ప్రోగ్రాం. ఇప్పటివరకూ కృష్ణవేణికి ఇస్తున్నదొక్కటే ఖర్చు మాకు. ఆ అమ్మాయిది హీరోయిన్ వేషం.. ఏదో తిప్పలు పడుతోంది.. నీకున్నది ఒక్క పాటే.. మరి నీ తాంబూలం విషయం, లైటింగ్ విషయం ఓ మాట అనేసుకుంటే.." పంతులు గారి మాట పూర్తవ్వలేదు.

"ఎంతమాట బాబుగారూ. డబ్బు మడిసినా నేను? మీ ఊరోళ్ళు మరేదత్తులని లక్ష్మి సెప్పింది. పెల్లయ్యిందాన్ని బాబూ.. పొట్ట తిప్పల కోసం ఈ డేన్సులు..మరేద ముక్కెం. అయినా ఆడదానికి అన్నేయం సేసే మడుసులా మీరు? ఈ ఆడదాని సొమ్ము మీకెందుకు?" రమాదేవి ఇంకా మాట్లాడేదే.. 

"ఎహె.. అయ్యన్నీ కాదు.. పోగ్రాంకి ఎంతిమ్మంటావో సెప్పు ముందు?" ఓ పెద్దమనిషి కస్సుమన్నాడు. రమాదేవి చెప్పిన అంకె విని ఉలిక్కి పడ్డారు అందరూ.

"ఏటమ్మా? ఏటసలు? సినిమా స్టారు రేటు సెప్పేత్తన్నావ్.. ఈరోయిన్ ఏసానికి బుక్ సేసిన కృష్ణేనికే అంత రేట్లేదు.. ఒక్క పాటకి.. మరీ అన్నేయం రమాదేవీ.." ఆ పెద్దమనిషే మాట్లాడాడు. అరగంట తర్వాత రమాదేవి తాంబూలం, లైటింగ్ చార్జీల బేరం పూర్తయ్యింది. 

"బాబుగోరూ, మీ ఊల్లో ఆడాలన్సెప్పి శానా తక్కూకి ఒప్పుకున్నాను.. ఎంతిత్తన్నారో బయటికి రాకండా సూడండి కాంత.." అంది రమాదేవి. 

"వీళ్ళకి నాలుగు పాటలున్నాయి. నువ్వో నాలుగు స్టెప్పులు నేర్పి వెళ్తే బావుంటుందమ్మా. మధ్యలో ఓ రోజు వీలు చేసుకుని వచ్చావంటే ఇంకా సంతోషం," అన్నారు పంతులుగారు. 

"మీరింతలా సెప్పాలా బాబుగారూ.. మన కారేక్రమం కదా.. నాకూ బాజ్జెత ఉన్నాది కదా," అంటూనే హీరోలకీ, హీరోయిన్ కీ డేన్స్ మెళకువలు నేర్పడం మొదలుపెట్టింది రమాదేవి.


ఇక ఆ పూటకి జనమంతా ఆకలి దప్పులు మర్చిపోయారు. వాళ్ళ కళ్ళూ, నోళ్ళూ తెరచుకునే ఉండిపోయాయి సాయంత్రం వరకూ. అందరికీ దండాలు పెట్టి, వాళ్ళ మాయ సైకిలెక్కేసింది రమాదేవి. అదిగో అప్పుడు తిరిగింది అందరి దృష్టీ కృష్ణవేణి వైపు.

కట్టుకున్న నీలం చీర కాస్త నలిగి ఉంది. జాకెట్ తడిసి ఒంటికి అతుక్కుపోయింది. పూలదండలో పూలు చాలా వరకూ రాలిపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే లంఖణం చేసిన దానిలా అయిపోయింది కృష్ణవేణి. 

"డేన్సింగ్ అలాట్లేదు కదా కృష్ణేనీ నీకు.. ఉంకోసారి సేత్తే అలాటైపోద్ది.. మేవంతా ఉన్నాం గదా.. గాబరడిపోకు," ధైర్యం చెబుతున్న సత్యమూర్తిని ఏమాత్రం పట్టించుకోలేదు. 

"రేయ్ సచ్చెవా.. కృష్ణేనికి కాంత టీ ఉన్నాదేమో సూడ్రా," ఈ పురమాయింపుని విననట్టుగా ఊరుకున్నాడు 'మేకప్' సత్యం. 

"ఉండిపోవచ్చు కదా.. పలావు సెయ్యింతాను," పాత పాటే మళ్ళీ పాడాడు సత్యమూర్తి. 

తనని కాదన్నట్టుగా ఊరుకుని, నేరుగా రంగశాయి దగ్గరికి వెళ్లి "కూతంత మా ఇంటికాడ దింపేద్దురూ నన్ను.. సీకటడిపోతంది" అంది కృష్ణవేణి. రంగశాయికి ఒక్క నిమిషం ఏమీ అర్ధం కాక చుట్టూ చూశాడు. ముందుగా తేరుకున్నది సత్యమూర్తే. 

"డేన్స్ కట్టి సిరాగ్గా ఉన్నట్టున్నాది కృష్ణేనికి. బేగీ దింపేసి రారా సాయిగా," అన్నాడు చుట్ట వెలిగించుకుంటూ.

పదినిమిషాల్లో ఊరి పొలిమేర దాటింది సైకిలు. మట్టి రోడ్డు పక్కనే పంట కాలవ. రెండు వైపులా పంట కెదిగిన వరిచేలు. వాటి పొలిమేరల్లో దూరంగా కనిపిస్తున్న కొబ్బరి తోటలు. చల్ది పొద్దు తిరిగింది. గబగబా సైకిలు తొక్కుతున్నాడు రంగశాయి.

"ఓపాలి ఆగుదారి," సైకిలెక్కాక కృష్ణవేణి మాట్లాడిన మొదటి మాట అది. సైకిలాపి అయోమయంగా చూశాడు రంగశాయి. 

"ఎదర కూకుంటాను," అంది కృష్ణవేణి. భుజానున్న తువ్వాలు తీశాడు. 

"సచ్చిమూర్తి గోరెప్పుడూ పలావనో, నీసు కూరనో అంటానే ఉంటాడు..ఏటో గానీ మరీ," అంది కబుర్లు మొదలెడుతూ. 

"ఎల్లి సూడోపాలి.. నీకే తెలుత్తాది," నవ్వాపుకుంటూ అన్నాడు.

"ఊకే బుజాలు, నడువూ తిప్పేసుకుంటే డేన్స్ అయిపోతాది కామాల.." కక్షగా అంది. 

"ఏటోలే.. క్లబ్బు సాంగంట. మన్దేటీ లేదు గదా.. నియ్యైతే మొత్తం నాలుగు డేన్సులు,"  లెక్క పెట్టాడు. 

"ఒప్పుకున్నాక తప్పుతాదా?" ముభావంగా అంది కృష్ణవేణి. ఇల్లొచ్చింది. సైకిలు దిగలేదు రంగశాయి. 

"బెట్టుసరి కామాల.. ఎవురు బతివాల్తారు బాబా మొగోన్నీ.." దీర్ఘం తీస్తూండగా, నవ్వుతూ సైకిలు దిగాడు. ఆమె తాళం తీస్తుంటే, గుమ్మంలో ఉన్న తామరాకు పొట్లాన్ని వంగి అందుకున్నాడు. 

"మాయాయినప్పుడే ఒచ్చెల్లిపోయాడు. ఈ రిగాల్సలు కాదు కానీ, ఆడి మొకం సూసి ఎన్నాల్లైపోతందో.."

చాలా ప్రశ్నలే అడగాలనుకున్న రంగశాయి పెదవి విప్పలేదు. 

"ఒల్లు పులిసిపోయింది బాబూ.. ఉడుకు నీల్లెడతాను.. తానం సేద్దారి.." కొంటెగా నవ్వింది కృష్ణవేణి. 

(ఇంకా ఉంది)

బుధవారం, జులై 09, 2014

కృష్ణవేణి-4

"అయ్యో మీకింకా తెల్దా? మా మరిదిగోరు కూడా ఓ ఈరో అంట.. దాంతో కల్సి డేన్సులేత్తాడంట. ఆయమ్మి పురిటికెల్లింది కదా.. అడిగేవోల్లెవరు.. అన్నగారి బయ్యం ఏనాడున్నాది గనక, ఇయ్యాల లేదనుకోటాకి..." సుగుణ మాటలు సాగిపోయేవే కానీ సరస్వతమ్మ ఆపింది.

"నిజంగా నాకు తెలీదమ్మా.. నా పనేదో నాది. ఈయన అడిగినప్పుడు టీ పెట్టి పంపడం అంతే.. ఎవరొస్తున్నారో చూసే తీరుబడి కూడా ఉంటుందా నాకు?"

"ఆమాట నిజవేలెండి.. మనకెక్కడ తీరతాది. మా పిల్లలు రిగాల్సల్ సూసొచ్చి సెప్పేరు.. సిన్నాన కూడా ఉన్నాడమ్మా నాటకంలో అనేసి. పెల్లాం పక్కన లేపోతే, మా మరిదిగారంత ధైర్నవంతుడు మరోడు ఉండల్లెండి," నవ్వుతూ అంది సుగుణ.

అంతలోనే మాట మార్చి, "ఎవరో కిష్ణవేణి అంటండీ.. నల్లగా ఉన్నాదంటగదా.. అందరితోనూ ఒకటే ఇకయికలు పకపకలూ అంట.. కాపరాలు కూలిత్తే తప్ప కళ్ళు సల్లబడని జాతి మడిసి మరీ.." అంటూ ఆగింది.

"కృష్ణవేణి అని వినడమేనమ్మా.. నేనూ చూడలేదు.. అయినా సుగుణా.. కలిసి స్టేజి మీద నాటకం ఆడితేనే కాపరాలు కూలిపోతాయా?" ... జవాబు లేదు సుగుణ దగ్గర.

"బయదెల్తానండి.. మల్లీ మబ్బట్టేసింది.. ఒంటకి పొద్దోతంది.. కనబడి సాల్రోజులైందని ఒచ్చాను.. ఈపట్టు మద్దినేలప్పుడు ఒత్తాను.. కూంతసేపు కూకోనాకి," అంటూ ఇంటికి బయల్దేరింది.

సరస్వతమ్మ మడికట్టుకుని పొయ్యి వెలిగిస్తూ ఉండగా హడావిడిగా వచ్చారు పంతులుగారు.

"ఇదో.. ఈ అమ్మాయి కృష్ణవేణి. మన నాటకంలో వేషం వేస్తోంది.. ఈపూట మనతోపాటే బోయినం చేస్తుంది," అన్నారు.

నారింజ రంగు మీద నల్ల చెమ్కీ పూలున్న పాలిస్టర్ చీర కట్టుకుంది కృష్ణవేణి. ఎర్రటి చిట్టిగులాబీలు మాల కట్టి జడలో పెట్టుకుంది. "పీట వాల్చుకుని కూర్చో అమ్మా.." వసారా వైపు వేలు చూపించింది సరస్వతమ్మ. గొడుగు పట్టుకుని బయటికి వెళ్ళారు పంతులుగారు.

వంటిల్లు సగం వరకూ కనిపిస్తోంది వసారాలోకి. సరస్వతమ్మ అత్తగారి హయాంలో బంధువులు మినహా ఇంకెవ్వరికీ ఇంట్లోకి ప్రవేశం ఉండేది కాదు. ఒక్క వంటిల్లు, దేవుడిగది విషయంలో మాత్రం ఆ నియమం కొనసాగిస్తోంది సరస్వతమ్మ. అడుగు సగానికి తడిపిన ఎర్రమట్టిని పల్చగా మెత్తి, ఆపై బూడిద జల్లి బోర్లించిన నాలుగు ఇత్తడి గిన్నెలున్నాయి వంటింట్లో.

పొయ్యిలో నిప్పులు కాసిన్ని తీసి కుంపట్లో వేసి, పెద్ద ఇత్తడి గిన్నెతో పొయ్యి మీద ఎసరు పెట్టింది సరస్వతమ్మ. ఓ చిన్న గిన్నెలో నీళ్ళు పోసి పప్పు కోసమని కుంపట్లో పెట్టింది. బియ్యం కడిగి పొయ్యి పక్కన పెట్టేసుకుని, వసారాలో కత్తిపీట వాల్చుకుని కూర్చుంది.

అప్పటివరకూ ఆమెనే తదేకంగా చూస్తున్న కృష్ణవేణి "మా ఇల్లల్లో వొంటకి దాకలు, సట్టిలు వోడతాం. గిన్నిలికి బూడిది రాసేరేటండీ?" అడిగింది ఆశ్చర్యంగా.


ఆనపకాయ అందుకుని పప్పులో వెయ్యడానికి చిన్న ముక్కలు, పులుసు కోసం పెద్ద ముక్కలూ తరుగుతున్న సరస్వతమ్మ "మడి వంటకి మసిగిన్నిలు పనికిరావమ్మా. ఇలా అడుగున మట్టి పెడితే మసి పట్టవు," అని చెబుతూ ఉండగానే "ముక్కలు సిన్నయ్యీ, పెద్దయ్యీ ఎందుకండీ?" అడిగింది కృష్ణవేణి.

ఆ వివరం విని, "మీ ఇళ్ళల్లో రోజూ పప్పుండాలి కావాల. మా ఇంట్లోనూ నీసు తినవండి.. కాయగూర్ల బోజనవే," అని నవ్వింది. ఓసారి చూసి ఊరుకుంది సరస్వతమ్మ.

"మాయక్క నూనెక్కువ ఏసేత్తాది కూరల్లో. ఏపుడు కూరలే సేత్తాది ఎప్పుడూను.. మా నాన్నగారు సంగీతం మేష్టారు కదండీ.. నూని తింటే గొంతు పోతాది అని కోప్పడతా ఉంటారు.." చెప్పుకుపోతోంది. ఎసట్లో బియ్యం పోసొచ్చి, మళ్ళీ కత్తిపీట ముందు కూర్చుంది సరస్వతమ్మ.

"పొద్దున్నే రిగాల్సల్ అన్నారండీ.. తీరాసూత్తే నారాయన్రావు గారు, రంగసాయి గారు ఊల్లో లేరు. మజ్జాన్నించి ఒత్తారంట ..ఒర్సానికి నేనిక్కడ సిక్కడి పోయేను.. పాపం మీకు శ్రమ," అంది కృష్ణవేణి.

"భలే దానివమ్మా.. మాతోపాటే నువ్వూను.. అరటికాయ కూర తింటావు కదా?" అడిగింది సరస్వతమ్మ, చెక్కు తీసిన అరటికాయలు నీళ్ళగిన్నెలో వేస్తూ.

"అక్క ఏపుడు సేత్తాది.. నేను మసాలా ఏసి కూరొండేత్తాను.. మీ ఒంటలయీ ఏరేగా ఉంటాయి కామాల.." అడిగింది కృష్ణవేణి.

అన్నం వార్చి, మూతమీద నిప్పులేసి పక్కన పెట్టి, పులుసు గిన్ని పొయ్యెక్కించింది సరస్వతమ్మ. కుంపటి మీద ఆనపకాయ పప్పు, చిన్న పొయ్యి మీద అరటికాయ కూర ఆవపెట్టి చేసేసి, నెయ్యి గిన్ని నిప్పుల్లో వెచ్చబెట్టింది. వంటింటి తలుపు ఒక్క క్షణం చేరేసి, దేవుడికి అవసర నైవేద్యం పెట్టేసి, మరుక్షణం పెరట్లో నుంచి అరిటాకు కోసుకొచ్చి కృష్ణవేణి పీట ముందు పరిచింది.

"అయ్యో.. పంతులు గార్ని రానియ్యండి. ఆయనా మీరూ తిన్నాక అప్పుడు తింటాను," అంది కృష్ణవేణి.

"ఆయనకి ఆలస్యం అవుతుందమ్మా. ఒచ్చినా ఎంతసేపు, ఒక్క క్షణంలో తిని చెయ్యి కడిగేస్తారు. నీకు మళ్ళీ రిహాల్సలుంది కదా," అంటూనే మంచినీళ్ళ చెంబు తెచ్చి ఆకుపక్కన పెట్టేసింది. వంటకాలతో పాటు, జాడీలో నుంచి తీసిన ఆవకాయ వడ్డించింది.

"మొహమాట పడకమ్మా.. వంటల్లో కారం తక్కువైతే ఆవకాయ నంజుకో.. నాజూకు తిండి తినకు.. మొత్తం అరిగే వరకూ డైలాగులు చెప్పిస్తారిప్పుడు," నవ్వుతూ చెప్పింది సరస్వతమ్మ.

కృష్ణవేణి పుల్లాకు మడిచి పెరట్లో దూరంగా పడేసి వచ్చేసరికి పంతులు గారు ఇంటికొచ్చారు. "ఎల్లొస్తానండీ" అని సరస్వతమ్మకి చెప్పి రిహార్సల్ ఇంటికి బయల్దేరింది కృష్ణవేణి.

"అయ్యో.. పప్పన్నం తిన్నావా కృష్ణేనీ.. నువ్వొచ్చినట్టు తెల్దు నాకు.. లేపోతే సేపలకూర తెచ్చేవోన్ని నీకు," సత్యమూర్తి పెద్ద గొంతుతో పలకరించాడు. ఓసారి చూసి ఊరుకుంది. ఇంతలో నారాయణరావొచ్చాడు.

"మీ ఇల్లెక్కడో తెల్దు నాకు.. లేపోతే పొద్దున్నే కబురు సెబుదును, రిహాల్సలు మద్దేన్నించని.." అప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదు కృష్ణవేణి. మిగిలిన నటులు ఒక్కొకరూ వస్తూ ఉండగానే, పంతులుగారు వచ్చేశారు.

హీరోయిన్ ని విలన్ బలాత్కరించే సీన్. విలన్ వేషం సత్యమూర్తి వేస్తున్నాడు. కృష్ణవేణి రెండు జబ్బలూ అతను పట్టుకుని గుంజితే, "ఛీ వదులు.. నీచుడా.. దుర్మార్గుడా" అంటూ డైలాగు చెప్పాలి.

సత్యమూర్తి ఆమెని పట్టుకోగానే కెవ్వుమంది. "ఏటండీ బాబూ మోటుతనం.. నాయి సేతులా ఇంకేవన్నానా?"

సత్యమూర్తి ఊరుకోలేదు. "ఏటి కృష్ణేనీ.. ఏటయ్యిందిప్పుడూ" అంటూ రుసరుసలాడాడు. మొత్తానికి రిహార్సల్ పూర్తయ్యింది.

"మన బండి అటెంపే ఎల్తన్నాది కృష్ణేనీ.. నిన్ను మీ ఇంటికాడ దింపెయ్మని సెప్తాను పాలేరోడికి," అన్నాడు సత్యమూర్తి.

దీపాల వేళవుతూ ఉండగా ఎడ్ల బండెక్కింది కృష్ణవేణి.

(ఇంకా ఉంది)

సోమవారం, జులై 07, 2014

కృష్ణవేణి-3

"అంటే.. కట్టుకున్న పెల్లం కన్నా ఎదవుజ్జోగం ఎక్కువైపోయిందన్న మాట్నీకు. ఆ  నాగేసర్రావు నీ కాడికొచ్చి బాబొరే రంగసాయీ నువ్వు గేటుకాన్నిలబడి టికీట్లు సింపితే తప్ప నా బొమ్మాడదురా బాబా అని బతివాలుకున్నాడా? మొకం సూడు మొకం..." అలుపు తీర్చుకోడానికి ఒక్క క్షణం ఆగింది మంగళ గౌరి. 

ఆమె మాట్లాడుతుంటే కదులుతున్న నల్లని పెదాలనీ, ముందు పళ్ళ రెండింటి మధ్యనా ఉన్న ఖాళీనీ తదేకంగా చూస్తున్న రంగశాయి అప్పటివరకూ నోరిప్పలేదు. 

"పురిటికంపేత్తే అదింక ఉన్నాదో పోయిందో సూడక్కర్లేదు కామాల.. లోకంలో మొగోల్లందరూ ఇలాగే ఉంటన్నారా? ఆడనా సయితులందరూ ఇలాగే కాపరాల్సేత్తన్నారా?" జవాబు కోసం ఆగింది.

"ఎందుకే.. గుమ్మం లోకొచ్చిన మొగుడి మీద ఓ ఇరుసుకు పడిపోతావ్.. ఉప్పుడే కదా సైకిలు దిగేడు.. ఓ సిటం ఆగొచ్చు కదంటే.." రంగశాయికి మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ కూతుర్ని కోప్పడింది సూరమ్మ. 

"ఓహో.. తమ్ముడని కావాల.. ఊకే ఎనకేసుకొచ్చేత్తన్నావు. పట్టుమని పది మైల్ల దూరం లేదు.. పది రోజులకా మొకం సూపించటం? పెల్లానికి కడుపు సెయిటం కాదు మొగతనం.. దాని మంచీ సెడ్డా సూడాల.." మంగళ గౌరి మాటల ప్రవాహం సాగిపోతూనే ఉంది. ఖాళీ చేసిన నీళ్ళ గ్లాసు అరుగుమీద పెట్టి, ఒక్క క్షణం ఆమె వైపు చూసి ఏటిగట్టు వైపు అడుగులేశాడు రంగశాయి. 

మాఘ మాసపు సాయంత్రం.. పల్చటి మంచుతెర కమ్ముకుంటున్నట్టుగా ఉంది గోదారి. అక్కడోటీ అక్కడోటీ పడవలు కనిపిస్తున్నాయి దూరంగా. ఏటి గట్టెక్కుతూనే గోదారి గాలి పలకరించింది. నారింజ రంగుకి తిరిగిన సూర్యుడు ఏ క్షణాన్నైనా గోదారిలోకి బుడుంగున జారిపోయేలా ఉన్నాడు. 

పక్షుల బారులు ఉండుండీ సూర్యుడి మీదుగా ఎగిరి వెళ్తున్నాయి. రావిచెట్టు కింద కూర్చుని గోదారినే తదేకంగా చూస్తున్న రంగశాయి, మోకాళ్లమీద తల పెట్టుకుని భోరున ఏడవాలనే బలమైన కోరికని కష్టమ్మీద నిగ్రహించుకున్నాడు. లేచి నిలబడి గట్టు వెంటే నడుస్తూ మనసు మళ్ళించుకునే ప్రయత్నంలో పడ్డాడు. 

"సూత్తానే సివంగిలా మీదడిపోద్దెందుకో?" ఆ ప్రశ్న వేసుకోడం ఎన్నోసారో లెక్క పెట్టుకోలేదు ఎప్పుడూ. 

చూస్తుండగానే కను చీకటి పడింది. ఎక్కడా మబ్బన్నది లేదు ఆకాశంలో. పాల చెంబులు, కాయగూరల బుట్టలతో పడవ దిగుతున్నారు రైతులు. ఎక్కడిదో రేడియో పాట ఉండుండీ వినిపిస్తోంది. 

"ఇక్కడున్నావా మాయ్యా.. అమ్మ నిన్ను బేగీ రమ్మంటంది.. అన్నానికి...," వగరుస్తూ వచ్చాడు గణపతి, మంగళ గౌరి తమ్ముడు. 

"నువ్వు నడిసీ మాయ్యా.. నేనుప్పుడే కొట్టు కాడికెల్లొచ్చేత్తాను.. అమ్మడిగితే నీ ఎనకమాలే ఒచ్చేతన్నానని సెప్పూ..." అంటూ పరిగెత్తాడు గణపతి.


వీధిలో పడక్కుర్చీలో కూర్చుని వేరుశనగ పప్పుండ కొరుక్కు తింటోంది మంగళగౌరి. "సైకిల్నున్న  సంచీ సవిరించేసిందన్న మాటప్పుడే" అనుకుంటున్న రంగశాయి వైపు నిస్సాకారంగా ఓ చూపు చూసి, తినడంలో పడిపోయింది మళ్ళీ.

"ఇంట్లో ఆడది తిన్నాదో లేదో కనుక్కోవాలి.. " కృష్ణవేణి మాటలు గుర్తొచ్చి, "అన్నం తిన్నావా?" అని అడిగాడు మంగళగౌరిని. 

"నీయంత గొప్పుజ్జోగం కాపోయినా మా నానా సంపాదిత్తన్నాడు.. పిల్లలకెట్టకుండా మాడిసేసే మడిసి కాదు," కోరగా వచ్చింది సమాధానం. 

కాళ్ళు కడుక్కుని, వసారాలో వాల్చిన పీటమీద కూర్చునేలోగా "కడుపుతో ఉన్న ఆడది టయానికి తినాలి.. ఏలా పాలా సూసుకోవాలి.. మనకేవన్నా తెలిత్తే కదా అసలూ.." అలుపొచ్చే వరకూ అంటూనే ఉంది మంగళగౌరి. 

"బాబు నోట్లోంచి ఊడి పడిందిరా బాబా.. అదే కోపం మడిసికి. ఆడితో నేను పడతన్నాను.. దీంతో నువ్వు పడాల," వీధి గుమ్మం వైపు ఓ కన్ను, తమ్ముడి విస్తరి వైపు మరోకన్ను వేసి మాట్లాడుతోంది సూరమ్మ.

"దానికి నేనేటీ సెప్పట్లేదు అనుకోమాకు. ఈ కూతురికి, ఆ తండ్రికి సెపుతానే ఉన్నా. ఇద్దరికిద్దరే నా పేనానికి.. ఆడదాన్ని, అలాటయ్యిందాన్ని. ఆణ్ణి కట్టుకున్నందుకు, దీన్ని కన్నందుకు నాకు తప్పదనుకో. సూత్తా సూత్తా నీకు కట్టబెట్టేనే అని బాద పడతా ఉంటాను.." చెంగుతో ముఖం తుడుచుకుంది.

"దానికి తెల్దు, సెప్తే ఇనిపించుకోదు.. ఎంచేపూ అజ్జెప్పినట్టే జరగాలంటాది. ఎట్టా కుదురుద్ది సెప్పు? సెప్పీ సెప్పీ నా పేణం ఇసిగింది కానీ, దాని మాట దాందే అనుకో. అలాగని బుర్ర తక్కువదా అంటే కాదు. మాసెడ్డ పట్టుదల మడిసి," అడుగుల చప్పుడు విని ఒక్కసారిగా మాట్లాడ్డం ఆపేసింది. 

గణపతిని చూసి "అక్కేం జేత్తందిరా?" అని అడిగింది. "గెదిలో మంచంమీదున్నాది"  అని చెప్పేసి, స్నానానికి వెళ్ళాడు గణపతి.

"ఇద్దరు మొగోల్ల మజ్జెన పుట్టిన ఆడ కూతురని నెత్తి నెట్టుకున్నాడు దాని బాబు. నానేమో ఇది పుట్టగానే నీ పెల్లాం అని పేరెట్టేసేడు. పైకెల్లిపొయి ఆయన బాగానే ఉన్నాడు. నువ్వు సూత్తే బొత్తిగా నోట్లో నాలిక లేనోడివి అయిపోయేవు.. ఇదేం తిండిరా నాయినా.. కూతంత పొరుటు కలపరా.." 

పెరట్లో తారట్లాడుతున్న కోడిని గంపకింద పెట్టేసి వచ్చి, మళ్ళీ అందుకుంది. "బయిటోడు ఎవడన్నా అయితే ఈపాటికి దీన్ని ఇడిసి పెట్టి పొయ్యే వోడు. సిన్నదానికి సమ్మందం ఏదీ రాకుండా పోయేది. ఉప్పుడు ఒచ్చీ ఓల్ల కోరికలూ... ఓయబ్బో సెప్పటాకి లేదులే..  రోజులెప్పుడూ ఒకలాగుండవురా.. కానుపైతే మడిసిలో ఏవన్నా మారుపొత్తాదేమో సూద్దారి.. అదేదో అంటా ఉంటాది, మనసులో ఎట్టుకోకు.. సరేగానొరే ఈస్వర బాబెలా ఉన్నాడ్రా?" పెద్ద తమ్ముడి వివరం అడిగింది సూరమ్మ.

"ముగ్గురు పిల్లలు కదక్కా.. ఆడిదాడికి సరిపోద్దేమో.. వొదిన గుట్టు మడిసి లేయే.. మాట బయటకి రానిత్తాదేటి?" అన్నగారి మీద అసూయ పడుతున్నానా అనిపించింది రంగశాయికి. ఒకే ఇంట్లో రెండు భాగాల్లో ఉంటున్నా పెద్దగా మాటల్లేవు అన్నదమ్ములు ఇద్దరికీ.

"ఏమాటకామాటేరా.. సుగుణమ్మ కాబట్టి ఆణ్ణి రోడ్డుమీద కీడిసేయకండా  నెత్తినెట్టుకుంటంది. పోన్లే.. ఆడదురుట్టం.. దాని పుట్టింటోల్లూ కాంత సూసేవోరే.. ఏదో లేరా.. ఇంటికో కత.." ఎంగిలి కంచం పెరట్లోకి పట్టుకెళ్ళింది సూరమ్మ. 

మంగళగౌరి అప్పటికి మాంచి నిద్దట్లో ఉంది. కొబ్బరి చెట్టు కింద వాల్చిన మడత మంచం మీద నడుం వాల్చాడు రంగశాయి. చల్లగాలి ఒళ్ళంతా తడుముతూ ఉంటే కృష్ణవేణి గుర్తొచ్చింది. ఆవేళ రాత్రి.. ఆ ముసురులో.. ఒక్క నిమిషం కూడా నిద్రపోనివ్వని కృష్ణవేణి. బోర్లా తిరిగిన రంగశాయికి ఎప్పటికో పట్టింది నిద్ర. 

(ఇంకా ఉంది)

శుక్రవారం, జులై 04, 2014

కృష్ణవేణి-2

"ఏటమ్మగోరూ.. నే యిన్నది నిజవేనా? మనూల్లో మల్లీ నాటకం ఆడతన్నారంట.." చాకింటి రేవు నుంచి తెచ్చిన బట్టలు లెక్కపెట్టి పక్కన పెడుతూ అడిగింది రత్తాలు. 

"నీ అమ్మ కడుపు బంగారం గానూ.. అప్పుడే నీదాకా వచ్చేసిందిటే.." నవ్వుతూ అడిగింది సరస్వతమ్మ. 

"మాట దాగుద్దేటమ్మా.. అయినా మనూరెంత? మొత్తం కలిసి ఐదొందల గడపన్నా ఉంటాదో, లేదో.. ఇంక రగిస్సాలు కూడానా?" తడువుకోలేదు రత్తాలు. 

"పంతులు గారివి నాలుగు పేంట్లు, ఆరు చొక్కాలు, మూడు పంచెలు పొడిస్త్రీ. రెండు దుప్పట్లు, నాలుగు తువ్వాళ్ళు ఉతుక్కి," కేలండర్ వెనకాల రాసిపెట్టుకున్న పద్దు చూసి చెప్పింది సరస్వతమ్మ.

"ఈపాలెవులో కిట్నేనంట గదమ్మా.. ఆడ మడిసి ఒక్కిర్తేనంట.. గత మాటు గావాల లచ్చివి అని ఆడ మడిసి, ఐదారు మంది మొగోల్లూ ఒచ్చి ఆడేరు నాటకం," రత్తాలు గుర్తుతెచ్చుకుంది. 

"అవునే.. ఈసారి మనూరి వాళ్ళే ఆడుతున్నారు. హీరోయిను వేషానికి మాత్రం అమ్మాయిని తీసుకొచ్చారు. చిన్న మావగారిల్లు ఖాళీగానే ఉంది కదా.. అక్కడే రిహార్సలో ఏదో చేసుకుంటున్నారు," తనకి తెలిసిన  సంగతులు చెప్పింది సరస్వతమ్మ. 

"ఎట్టెట్టా? అంతా మనూరోల్లేనా! ఈల్లకేం ఒత్తాదమ్మా నాటకం ఎయ్యడం? డేన్సులు కట్టగల్రా ఒకుల్లైనా? అసలు మనూల్లో ఎన్టీ వోడిలాగా డేన్సు కట్టే మొగోడు ఉన్నాడా అనీ.." దీర్ఘం తీసింది రత్తాలు. 

"చూద్దూగాని లేవే.. ఉగాది పండక్కి వేసేస్తారు కదా.. నీకు సరదాగా ఉంటే రిహార్సలు చూసెడుతూ ఉందువు," బియ్యం కొలుస్తూ అంది సరస్వతమ్మ.

"కూతంత పచ్చడి బద్దెట్టండమ్మా.. నోరు సవి సచ్చిపోయింది," బియ్యం మూటకట్టుకుంటూ అడిగింది రత్తాలు. 

అరిటాకు ముక్కలో చుట్టబెట్టిన ఊరగాయని జాగ్రత్తగా అందుకుంటూ "అమ్మా, సిన్న మాట" అంది గొంతు తగ్గిస్తూ. ఏవిటన్నట్టు చూసింది సరస్వతమ్మ.

"సాకల్దాని మాటని ఒగ్గీయకండి.. పంతులుగోరు బంగారం.. ఆ బాబుని అనుకుంటే కల్లోతాయి.. కానమ్మా అవతల ఆడ మడిసి.. పైగా ఆ ఊరి మడిసి.. మీ జాగర్తలో మీరుండండి. ఇలాగనీసినానని అనుకోకండి..బెమ్మకైనా పుట్టును రిమ్మ తెగులు..  కీడెంచి మేలెంచాల.. వొస్తానమ్మా.." 

రత్తాలు వెళ్ళిన వైపే చూస్తూ పరధ్యానంగా నిలబడిపోయింది సరస్వతమ్మ. గతేడాది నాటకంలో హీరోయిన్ వేషం వేసిన లక్ష్మికి ఇంట్లో ఓ పూట భోజనం పెట్టి, పడుకోనిచ్చినందుకే తోడబుట్టిన వాళ్ళతో సహా అందరూ తనని తప్పు పట్టారు. జాగ్రత్తలు చెప్పారు. 

అయిందేదో అయిపోయిందిలే అనుకుంటూ ఉంటే ఇప్పుడు మళ్ళీ నాటకం.. హీరోయినూ. తాడిచెట్టు కింద నిలబడి పాలే తాగినా, లోకం అనేది ఒకటి చూస్తూ ఉంటుంది కదూ.. ఇంట్లో మగాడికి తెలీదో, తెలిసినా పట్టించుకోడో అర్ధం కాదు.. దెబ్బలాడాల్సిన విషయాలా ఇవి? అలా అని ఊరుకుంటే.. ఎంతకాలం ఇలా? ..వీధిలోంచి వస్తూ పంతులుగారు కనిపించే వరకూ ఆవిడ ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. ఆయన్ని చూస్తూనే గిరుక్కున తిరిగి వంటింట్లోకి వెళ్ళిపోయింది. 

"వంటయ్యిందా? బోయినాలు చేశాక రిహార్సల్స్ పెట్టుకుందాం అంటున్నారు వాళ్ళు.. కొత్త మోజు కదా..." ఆయన మాటలు పూర్తికాకుండానే పీట వాల్చింది సరస్వతమ్మ.

"భాస్కర్రావు పాలంపుతానన్నాడు. వచ్చాక కాస్త టీ పెట్టి పంపు. పది పన్నెండు మంది ఉంటారు మొత్తం," వెండి భరిణె లో ఉన్న వక్క పలుకు తీసుకుంటూ అన్నారు పంతులు గారు. ఆయన తిన్న కంచంలో ఆవిడ అన్నం వడ్డించుకుంటూ ఉండగానే రిహార్సల్ కి రమ్మంటూ కబురొచ్చింది.


అందరూ ఆయన్ని చూస్తూనే లేచి నిలబడ్డారు. ఆకుపచ్చ రంగు ఉలిఉలీ చీరకట్టుకుంది కృష్ణవేణి. తలంటిన జుట్టుకి సవరం చేర్చకుండా జడవేసి, కనకాంబరాల మాల, గులాబీలతో సింగారించింది. ముఖం మీద పడుతున్న జుట్టుని వెనక్కి తోసుకుంటూ,  చేతికి కొత్తగా పెట్టుకున్న రిస్టు వాచీని మాటిమాటికీ చూసుకుంటోంది.

నారాయణరావుకీ కృష్ణవేణి కీ లవ్ సీను. పంతులు గారు సీను చదివి వినిపించి వాళ్ళిద్దరినీ నటించమన్నారు. ఇద్దరూ ఒకళ్ళ మొఖం ఒకరు చూసుకున్నారు మొదట. తర్వాత చుట్టూ చూశారు. అందరూ చూస్తూ ఉండడంతో మళ్ళీ ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుని, కూడబలుక్కున్నట్టుగా ఇద్దరూ బిక్క మొహాలతో పంతులు గారిని చూశారు. 

ఆయన విడివిడిగా రెండు పాత్రలూ చేసి చూపించారు. మళ్ళీ చెయ్యమన్నప్పుడు కృష్ణవేణి కాస్త పర్వాలేదు కానీ, నారాయణరావు మరీ తేలిపోతున్నాడు. అతన్ని జాగ్రత్తగా చూడమని చెప్పి, కృష్ణవేణి తో కలిసి ఆ సీన్ నటించారు పంతులు గారు. ఆయనలా కృష్ణవేణి చేతులు పట్టుకుని డైలాగులు చెప్పడం ఏదోగా అనిపించింది అక్కడున్న వాళ్ళలో కొందరికి. అయితే, ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఈసారి కాస్త పర్లేదనిపించాడు నారాయణరావు.

"పర్వాలేదు పర్వాలేదు.. కొత్తకదా.. నాలుగు సార్లు చేస్తే అదే వచ్చేస్తుంది," ధైర్యం చెప్పారు పంతులు గారు. 

రెండో సీను రిహార్సల్ అవుతూ ఉండగానే టీ వచ్చింది. గ్లాసుల్లో పోసిచ్చాడు సత్యం. ఏదో వంకన కృష్ణవేణిని పలకరించాలని అందరికీ ఉంది. కానీ, పంతులు గారి భయానికి ఎవరూ నోరిప్పడం లేదు. సత్యమూర్తి నోరు తెరిచాడు. 

"ఎప్పుడూ స్టేజీ ఎక్కలేదన్నావ్.. రిహాల్సలింగే అదరగొట్టేత్తన్నావ్ గదా కృష్ణేనీ.." 

సత్యమూర్తిని ఓరగా చూసి, ముసిముసిగా నవ్వుతూ పైట సర్దుకుంది కృష్ణవేణి. ఓ గంట తర్వాత, ఆవేల్టికి రిహార్సల్ పూర్తయ్యింది అన్నారు పంతులుగారు. కృష్ణవేణిని ఎవరు దింపాలి? అప్పుడు గుర్తొచ్చాడు రంగశాయి అందరికీ. 

"సాయి గాడు రాలేదా ఇయ్యాల?" అన్నాడు సత్యమూర్తి. ఎటో చూస్తూ ఊరుకుంది కృష్ణవేణి. 

"ఒరే నారాయనా.. కూతంత ఆ పిల్లని ఆల్లింటికాడ దింపేసి ఒచ్చెయ్ రా.. మీ ఇంట్లో నే సెప్తాన్లే," మళ్ళీ సత్యమూర్తే అన్నాడు. 

మాట్లాడకుండా వెళ్లి నారాయణరావు సైకిలెక్కింది కృష్ణవేణి. రిహార్సల్ లో డైలాగు చెప్పడానికి నోరు పెగలని నారాయణరావు, సైకిలు ఊరు దాటకముందే మాటల్ని కోటలు దాటించాడు. 

"మా వాడకట్టు మొత్తానికి హైస్కూల్లో సదివింది నేనొక్కన్నే తెల్సా.. మావోల్లు దూరవని పంపలేదు కానీ లేపోతే కేలేజీక్కూడా ఎల్లేవోన్ని.. అప్పుడంటే ఊరుకున్నాను కానీ, ఉప్పుడు నా మాటే పైనలు మా ఇంట్లో.. మాయమ్మ, నాన, మాయావిడ.. అందరికీ నామాంటంటే మా సెడ్డ గురి..." అతను చెబుతున్న కబుర్లలో సగం గాల్లో కలిసిపోతున్నాయి. 

కబుర్లేవీ వినకపోయినా, అతనికి వినిపించేలా మధ్య మధ్యలో "ఊ.. ఆ.." అంటోంది. నారాయణరావు బాల్యం, తొలియవ్వనం ఇంకా పూర్తవ్వనేలేదు, కృష్ణవేణి ఇల్లు దగ్గర పడింది. 

"ఆపేయ్.. ఆపేయ్.. ఇక్కడ దిగిపోతాను.. నీ సైకిలెక్కి వొచ్చినట్టు తెలిత్తే మా నాన్నగారు కోపంసేత్తారు బాబూ.." అంది, నారాయణరావు నిరాశని ఏమాత్రం పట్టించుకోకుండా. 

"ఎల్లొచ్చీ.. సందలడి పోతంది.. మీ వోల్లు సూత్తా ఉంటారు.." అంటూ అతన్ని సాగనంపి, తన ఇంటివైపు నడిచింది. 

తాళం వేసిన గుమ్మం, గడప దగ్గర తామరాకు పొట్లం పలకరించాయి కృష్ణవేణిని.

(ఇంకా ఉంది)

బుధవారం, జులై 02, 2014

కృష్ణవేణి-1

బురద రోడ్డు మీద కీచుమంటూ రిక్షా ఆగిందో లేదో, "క్రిష్ణవేనొచ్చేసింది రోయ్" అంటూ కోలాహలం మొదలయ్యింది పెంకుటింట్లో. వర్షపు జల్లు కొట్టెయ్యకుండా అడ్డుగా కట్టిన గోనెపట్టాని తప్పించుకుని, చీరకొంగు తలమీదికి లాక్కుంటూ రిక్షా దిగింది కృష్ణవేణి. ఆమెని సాంతమూ దిగనివ్వకుండానే నలుగురు కుర్రాళ్ళు రిక్షాని చుట్టుముట్టేశారు. ఓసారి ఒళ్ళు విరుచుకుని, జాకెట్లో నుంచి పర్సు తీసి, రిక్షా అతనికి డబ్బిచ్చి పంపేసింది.

"ఒచ్చేవా... బేగీ లోనకి రా.. జల్లొచ్చి పడ్డాదంటే సీర తడిసిపోద్ది," ఇంటి అరుగు మీదనుంచి కదలకుండానే పొలికేక పెట్టాడు సత్యమూర్తి. 

నలుగురు కుర్రాళ్ళనీ నవ్వు మొహంతో చూసి, అడుగులో అడుగేసుకుంటూ ఇంట్లోకి నడుస్తూ ఉండగానే ఎదురు జల్లు ముఖానికి కొట్టి రాసుకున్న జాలీ ఫేస్ పౌడర్ కరిగిపోయింది. కట్టుకున్న చౌకరకం గులాబీ రంగు నైలెక్స్ చీర కొంగుతో ముఖాన్ని సుతారంగా తుడుచుకుంటూ "ఇదేం ఊరండీ బాబూ.. ఒక్క రిక్షావోడూ రానంటే రానని గొడవ.. " అంది జనాంతికంగా. గొంతు కాస్త బొంగురుగా ఉంటేనేం, నోటి ముత్యాలు ఏరుకోడానికి బారుతీరి నిలబడ్డారు ఆబాలగోపాలం.

"ఎదవ ముసురట్టేసింది పొద్దున్నే. లేపోతేనా, నా బండేసుకుని ఒచ్చేసేవోడిని," దూరంగా ఉన్న పాకలో దర్జాగా నిలబడ్డ 'సువేగా' ని గర్వంగా చూసుకుంటూ చెప్పాడు సత్యమూర్తి.

"రేయ్.. కృష్ణేనొచ్చేసిందని పంతులు గారికి సెప్పేసి రారా" అని ఓ కుర్రాడికి పురమాయించాడు.

మరచెంబు లో ఉన్న సగం చల్లారిపోయిన టీ ని స్టీలు గ్లాసులో పోసి పట్టుకొచ్చి కృష్ణవేణి కి ఇచ్చాడు 'మేకప్' సత్యం. 

"తాగు.. కూతంత ఎచ్చగా ఉంటాది" అంటూ అవసరం లేకపోయినా నవ్వాడు.

కొంగు వదిలేసి, టీ గ్లాసు పుచ్చుకుంది. నుదుటి మీదకి పడేలా కత్తిరించిన జుట్టు, సవరం పెట్టిన జడలో మూడు మూరల కనకాంబరాలు పొడుగ్గా వేలాడుతున్నాయి. వాటికి పైన చెంప పిన్నుతో గుచ్చిన రెండు కడియం తెల్ల గులాబీలు. ఎత్తు మడమల ప్లాస్టిక్ చెప్పులు గుమ్మం బయటే వదిలేసింది. మెళ్ళో గొలుసు, చేతులకున్న గాజులూ చిలకలపూడివని తెలిసిపోతున్నాయి.

"పెద్దోల్లందరూ ఒచ్చి అడిగితే కాదన్లేక ఒప్పుకున్నాను కానీ, ఎప్పుడూ నాటకాలాల్లేదు బాబా. ఏవౌద్దో ఏటో.." కృష్ణవేణి రెప్పలల్లారుస్తుంటే, భుజం తట్టి ధైర్యం చెప్పాలనుకున్న సత్యమూర్తి, పంతులుగారు రావడం చూసి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. పిచ్చాపాటీ లో ఉన్నవాళ్ళంతా ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. కొంగు భుజం చుట్టూ కప్పుకుంది కృష్ణవేణి. 

"అందరూ వచ్చినట్టేనా?" అడుగుతూ కుర్చీలో కూర్చున్నారు పంతులుగారు. ఆయన చేతిలో అట్టవేసిన ఓ పుస్తకం, కాసిన్ని తెల్లకాగితం ఠావులు ఓ కలం ఉన్నాయి.

"మనం వెయ్యబోతున్న నాటకం పేరు 'పగపట్టిన త్రాచు.' ఎవరెవరు  ఏ పాత్ర వెయ్యాలో ముందే అనుకున్నాం కదా.." అంటూ అందరివైపూ చూశారు. 

"అమ్మా కృష్ణవేణీ..నీది హీరోయిన్ వేషం. ఇద్దరు హీరోయిన్లు ఉంటారు.. కవలపిల్లలు.. రోజా, సరోజ.. రెండూ నువ్వే వేస్తున్నావు. ఇవాల్టినుంచి రిహార్సల్స్ మొదలెడుతున్నాం. నెలన్నర టైం ఉంది. జాగ్రత్తగా చేసుకుంటే మాట పడకుండా నాటకం ఆడొచ్చు.." 

పంతులుగారి మాట పూర్తవుతూనే "పాట్ల గురించి కూడా ఓ మాటనేసుకుంటే బావుంటాది" అన్నాడు సత్యమూర్తి. 

"మొత్తం ఐదు పాటలు పెడదాం.. ఇద్దరు హీరోలకీ చెరో రెండు. ఒక క్లబ్ సాంగ్," ఈసారి కూడా అడ్డం పడ్డాడు సత్యమూర్తి "క్లబ్ సాంగ్ కి రమాదేవిని పిలుద్దారి" అంటూ. నాలుగు పాటల్లోనూ రెండు ఎన్టీ వోడివి, రెండు నాగేసర్రావ్వీ అని నిర్ణయం అయ్యింది.

రమాదేవి పేరు వినగానే కృష్ణవేణి ముఖం ఒక్క క్షణం రంగు మారింది. బయట పడకుండా "మరి నా డైలాగులూ అయ్యీ ఎలాగండీ. పాట్లంటే డేన్సు కట్టాలా? సీర్లూ అయ్యీ నేనే తెచ్చుకోవాలా?" 

ఇంకా ప్రశ్నలు అడిగేదే.. పంతులు గారు ఆపి, "అన్నీ మాట్లాడుకుందాం.. ఇంకా మొదలే కదా.. నీ డైలాగులన్నీ రాసిస్తాను.. ఇంట్లో కూడా చదూకుందువు గాని" అన్నారు. 

"ఆ మాత్రం సదువే ఒత్తే ఈ నాటకాలెందుకు?" ఈ మాట పైకి అనలేదు కృష్ణవేణి.


నట బృందాన్ని చుట్టూ కూర్చోబెట్టుకుని నాటకం మొత్తం చదివి వినిపించారు పంతులుగారు. హార్మోనిస్టు అప్పటికప్పుడే రాగవరసలు అనేసుకుంటున్నాడు. ఇద్దరు హీరోల్లోనూ ఓ హీరో వేషం వేస్తున్న రంగశాయి పంతులుగారు చదువుతున్నదంతా శ్రద్ధగా వింటున్నాడు. అతను మినహా మిగిలిన వాళ్ళంతా కృష్ణవేణి వైపు ఓర చూపులూ, దొంగ చూపులూ సంధిస్తున్నారు. 

రంగశాయిని చూస్తూ "ఏటీ మడిసి?" అనుకుంది కృష్ణవేణి.అప్పుడే అతన్ని పరీక్షగా చూసింది. చామన చాయలో సాదాగా ఉన్నాడు. మరీ పొడవూ, పొట్టీ కాదు. ఎత్తుకి తగ్గ బరువు. పెద్ద పెద్ద కళ్ళు అతని ముఖంలో ప్రత్యేక ఆకర్షణ. 

"రిహార్సల్స్ ఎవ్వరూ మానకూడదు.. అందరూ మనది అనుకుని వేస్తేనే నాటకం బాగుంటుంది. లేకపోతే అందరిముందూ అభాసు అవుతాం," అంటూ సభ చాలించి ఇంటిదారి పట్టారు పంతులుగారు.

"సందలడి పోతంది.. ఉప్పుడేం ఎల్తావు కానీ ఉండిపో కృష్ణేణీ.. కోడి పలావు సెయ్యింతాను.." సత్యమూర్తి చాలా ఉత్సాహపడుతున్నాడు. 

"అమ్మయ్యో.. మా నాన్నగారు కాల్లిరగ్గొడతారు బాబూ.." అంటూ గుండెల మీద చేతులు వేసుకుంది.  

"మీ పలావుకో దండం.. కూతంత ఎవరన్నా మా ఇంటికాడ దింపండి బాబ్బాబు.." కృష్ణవేణి నోరు తెరిచి అడిగినా ఉత్సాహవంతులు ఎవ్వరూ ముందుకు రాలేదు.. 

"మాయావిడి సంపేద్ది.." "మా బాబు గడపలో అడుగెట్నివ్వడు.."' అంటూ తప్పుకున్నారు. 

"ఒరే సాయిగా.. మీ ఇంట్లో ఎవర్లేరు గదరా.. పాపం కృష్ణేన్ని దింపేసి రారా.." రంగశాయి కి పురమాయించాడు సత్యమూర్తి. 

"నిజవే కదరా.. మీ యావిడ కానుపుకెల్లింది. మీయమ్మ ఊల్లో లేదు.. బంపర్ శాన్స్ రా బాబూ," అన్నాడు రెండో హీరో నారాయణరావు.

"గొప్ప మొగోడే దొరికాడు" అనుకుంటూ రంగశాయి సైకిలెక్కింది కృష్ణవేణి.

బురద రోడ్డులో నిమ్మళంగా వెళ్ళమని అందరూ ముక్త కంఠంతో జాగ్రత్తలు చెప్పారు రంగశాయికి. మబ్బులు పట్టడంతో సూర్యాస్తమయం జాడ తెలియడం లేదు. పంట కాల్వలో కప్పలు బెకబెక మంటున్నాయి. ఉండుండి చలిగాలేస్తోంది. ఊసూ పలుకూ లేకుండా సైకిలు తొక్కుతున్న రంగశాయిని ఏమని పలకరించాలో అర్ధం కాలేదామెకి.

ఉన్నట్టుండి సైకిలికి బ్రేకేశాడు రంగశాయి. చుట్టూ చీకటి. నరమానవుడు లేడెక్కడా. ఒక్క క్షణం గుండె గుబగుబలాడింది కృష్ణవేణికి. అదాటున సైకిలు దిగేసింది. 

"ఎనకాల సెక్రం లో గాల్తగ్గింది..నడటం లేదు" అన్నాడు ఆయాసంగా. చిరాకు అణచుకుంది.

"కూతంత ఎదర కూకుంటావా.. ఇంకెంత.. సగం దూరం ఒచ్చేశాం," అన్నాడు.

"తప్పుద్దా" అనుకుంటూ మడ్గార్ మీద కూర్చోబోతుంటే, ఆమెని ఆపి, తన మెడ చుట్టూ ఉన్న తువ్వాల్ని మడ్గార్ కి చుట్టాడు రంగశాయి.

ఒక్క క్షణం అతని వైపు చూసి సైకిలెక్కింది. దీక్షగా సైకిలు తొక్కుతున్నాడు. చీకటి, చలిగాలి, ఆడపిల్ల.. ఇవేవీ కదిలించడం లేదు అతన్ని. తన కాళ్ళకి తగులుతున్న అతని కాళ్ళు, తన చెంపకి తగులుగుతున్న అతని ఊపిరి ఆమెని ఇబ్బంది పెట్టడం లేదు ఎందుకో. 

"ఇక్కడే ఇక్కడే.." ఓ చిన్న బంగాళా పెంకుల ఇంటి ముందు సైకిలు ఆపించింది. చీకటి చిక్కబడింది అప్పటికే. కనీసం సైకిలు దిగకుండా వెనక్కి తిరుగుతున్న రంగశాయిని "లోనకొచ్చి ఎల్లొచ్చు" అంది కృష్ణవేణి.

"అగ్గిపెట్టి కొడితే తాలం తీత్తాను," అంది, జాకెట్లో నుంచి పర్సు తీసుకుంటూ.

గుమ్మంలో ఓ మెత్తని పొట్లం రంగశాయి కాలికి తగిలింది. కృష్ణవేణి వెలిగించిన హరికేన్ లాంతరు వెలుగులో పొట్లం విప్పాడు.  తామరాకులో కట్టిన జాజిపూల దండ, మూడో నాలుగో ఎర్ర గులాబీలు. వాటిని చూస్తూనే ఆమె కళ్ళు మిలమిల్లాడాయి. అప్పుడు చూశాడామెని పరీక్షగా. నల్లటి మనిషి. చిన్న కళ్ళు, కోటేరేసినట్టున్న ముక్కు, పల్చటి పెదాలు. గెడ్డం ఒంపు తిరిగి ఉంది.

"నా బుజాల కాడికొచ్చింది," అనుకున్నాడు మనసులో. 

ఇంట్లోకి వెళ్తూనే వంటగది, పక్కనే పడక గది. "కాసేపు కూకుంటే టీ ఎడతాను" అంటూ మంచం చూపించింది. టీ తాగుతూ ఉండగానే  భోజనం చేసి వెళ్ళమంది. వేడి వేడి అన్నం, కోడిగుడ్డు అట్టు పట్టుకొచ్చింది. 

మాటా పలుకూ లేకుండా తింటున్న రంగశాయిని చూసి, "ఇంట్లో ఆడది తిన్నాదో లేదో కనుక్కోవాలి," అంది కృష్ణవేణి.

ఒక్క క్షణం తబ్బిబ్బు పడినా, మరుక్షణంలో అన్నం ముద్దని ఆమె నోటికి అందించాడు. ఈసారి తబ్బిబ్బు అవడం కృష్ణవేణి వంతు. మరినాలుగు ముద్దలు అయ్యాకా, ఆమె గెడ్డానికి అంటిన మెతుకుల్ని వేలితో తుడవబోతుంటే చెయ్యి పట్టి ఆపేసింది. 

"సేత్తోనే తుడాలా ఏటి?" ఆ నవ్వులో అల్లరి. మబ్బు పట్టిన ఆకాశం నుంచి కుంభవృష్టి మొదలయ్యింది.

(కథ మొదలైంది)