సోమవారం, డిసెంబర్ 29, 2014

విశ్వనాథుని 'ఏకవీర'

ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఒకరు రాచ బిడ్డ, మరొకరు సాధారణ రైతు పుత్రుడు. ఆర్ధిక తారతమ్యాలు వాళ్ళిద్దరి స్నేహానికీ ఏమాత్రం అడ్డుగోడలు కాలేదు. వాళ్ళ మధ్య రహస్యమన్నది లేదు. పైగా, ఎవరికి పట్టరాని దుఃఖం కలిగినా నిస్సంకోచంగా రెండోవారి భుజం మీద తలవాల్చి కన్నీళ్లు పెట్టుకోగలరు. ఇద్దరూ ప్రేమలో పడి, విఫలమయ్యారు. తర్వాత ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. దురదృష్టం, అక్కడ కూడా వైఫల్యమే పలకరించింది వారిని. వాళ్ళిద్దరితో పాటు, వాళ్ళని ప్రేమించిన అమ్మాయిలు, పెళ్ళాడిన యువతుల కథ ఏ తీరం చేరిందన్నదే 'కవిసామ్రాట్' విశ్వనాథ సత్యనారాయణ రచించిన 'ఏకవీర' నవల.

విశ్వనాథ నవలల్లో నాకు 'ఏకవీర' అంటే ఓ ప్రత్యేకమైన ఇష్టం. ఎంత అంటే, ఇదే కథతో ఇదే పేరుతో ఎన్టీఆర్-కాంతారావు కథానాయకులుగా సినిమా వచ్చినా ఇప్పటివరకూ ఆ సినిమాని చూడనంత. 'అంతరాత్మ' తో నవలా రచన ప్రారంభించిన విశ్వనాథ రాసిన రెండో నవల ఇది. అంతే కాదు, ఆయన తన స్వదస్తూరీతో రాసిన ఏకైక నవల. మిగిలినవన్నీ ఆయన ఆశువుగా చెబుతూ ఉంటే వేరెవరో అక్షరబద్ధం చేసినవే. ముత్తు కృష్ణప్ప నాయకుడు మధురని పాలించే కాలం నాటి కథ ఇది. నాయక మహారాజు గారి ప్రధాన మంత్రులలో ఒకడైన ఉదయన్ సేతుపతి కుమారుడు కుట్టాన్ సేతుపతి, సామాన్యుడైన అతని స్నేహితుడు వీర భూపతిల జీవితాన్ని చిత్రించారీ నవలలో.

కథ వైగై నది ఒడ్డున మొదలై, ఆ ఇసుక తిన్నెలలోనే ముగింపుకి చేరుకుంటుంది. వైగై నది వర్ణనతో ఆరంభమయ్యే నవలలో మొదట కుట్టాన్ సేతుపతి పాత్ర ప్రవేశిస్తుంది. కుట్టాన్ తన విషాదాన్ని వీరభూపతితో పంచుకోవడం, అది విన్న వీరభూపతి తనకి కూడా అలాంటి కథే ఉందని చెప్పడంతో మొదలయ్యే 'తర్వాత ఏమయింది?' అన్న ఆసక్తి నవల ఆసాంతమూ కొనసాగుతుంది. కథా ప్రారంభానికి మూడునెలల క్రితం కుట్టాన్ కి 'ఏకవీర' తో వివాహం జరిగింది. కానీ, వారిద్దరూ అపరిచితుల్లాగే మసలుతున్నారు. కారణం, కుట్టాన్ తను ప్రేమించిన మీనాక్షిని మర్చిపోలేకపోవడం. అంతస్తుల అంతరం కారణంగా మీనాక్షితో పెళ్ళికి ఉదయన్ సేతుపతి అంగీకరించలేదు.


నిజానికి ఏకవీర కూడా వివాహానికి పూర్వం ఓ యువకుడితో ప్రేమలో పడింది. అతన్ని మర్చిపోయి, కుట్టాన్ ని ప్రేమించాలన్న ఆమె ప్రయత్నానికి అతని నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఇక, వీరభూపతిదో చిత్రమైన కథ. అతనో అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయికీ అతనంటే ఇష్టమే. ఆమె చాలా గొప్పింటి పిల్ల. పునుగు, కస్తూరీ పూసిన భూర్జ పత్రం మీద ఇతగాడితో ప్రేమలేఖ రాసి, పూలదండలో చుట్టి అతనిమీదికి విసురుతుంది కూడా. ఏం లాభం? సుగంధ ద్రవ్యాల సువాసనల కారణంగా ప్రేమలేఖ విషయం అతని తల్లిదండ్రులకి తెలిసిపోతుంది. గొప్పవాళ్ళ మీదుండే భయం చేత, ఆ అమ్మాయిని మరచిపోతానని ఒట్టు పెట్టించుకుంటారు కొడుకుచేత. ఒట్టైతే వేశాడు కానీ, వీరభూపతి ఆమెని కల్లో కూడా మర్చిపోలేక పోతున్నాడు.

కుట్టాన్ నిరాదరణ కారణంగా ఏకవీరకి తను ప్రేమించిన వాడు పదేపదే గుర్తొస్తున్నాడు. కనీసం అతని పేరన్నా తెలియదామెకి. తెలిసిందల్లా అతడు రాజపుత్రుడు కాడనీ, ఓ సామాన్య కుటుంబీకుడు మాత్రమే అని. తన దురదృష్టానికి చింతిస్తూ కాలం గడుపుతూ ఉంటుందామె. కుట్టాన్ సాయంతో రాజాస్థానంలో కొలువు సంపాదించుకుంటాడు వీరభూపతి. తల్లిదండ్రులు అతనికి వివాహం జరిపిస్తారు. గతాన్ని మర్చిపోదామనుకున్న వీరభూపతికి భార్య నుండి నిరాదరణ ఎదురవుతుంది. ఈ సంగతిని కుట్టాన్ తో పంచుకుంటాడతడు. సంభాషణలో వీరభూపతి వివాహమాడిన వనిత - కుట్టాన్ ప్రేమించిన - మీనాక్షి అని తెలుస్తుంది స్నేహితులిద్దరికీ. ఏకవీర, మీనాక్షి, కుట్టాన్, వీరభూపతుల కథ వైగై తీరంలో ఎలా ముగిసిందన్నదే 'ఏకవీర' నవల.

ఆపకుండా చదివించే కథనం ఈ నవల ప్రత్యేకత. అయితే, రాజపుత్రుడు, ధీరోదాత్తుడు అయిన కుట్టాన్ పదేపదే కన్నీళ్లు పెట్టుకోవడం మింగుడు పడదు. అలాగే మీనాక్షి పాత్ర చిత్రణకి సంబంధించి కొన్ని సందేహాలు మిగిలిపోతాయి. నవలంతా వర్ణనల మయం. సర్పాలంటే అత్యంత అభిమానం విశ్వనాథకి. నిద్రపోతున్న ఏకవీరని గోధుమ వన్నె త్రాచు తో పోల్చడం మొదలుకొని, రస చిత్రణలో అనేకచోట్ల సర్పాన్ని ప్రతీకగా వాడుకున్నారు. ఈ నవలలోని 'అమృతం' అనే చిన్న పాత్ర 'వేయిపడగలు' నాటికి 'గణాచారి' గా మారినట్టు అనిపిస్తుంది. కూచిపూడి భామాకలాపాన్ని నవల ముగింపు సన్నివేశంలో బహు చక్కగా ఉపయోగించుకున్నారు. తనే స్వయంగా రాయడం వల్ల కాబోలు, నవలని విస్తరించకుండా 124 పేజీల్లో క్లుప్తంగా ముగించారు విశ్వనాథ. 'ఏకవీర' విడిగా లభించడం లేదు. విశ్వనాథ సమగ్ర సాహిత్య గ్రంధావళి (118 పుస్తకాలు, వెల రూ. 8,282/-) లో లభ్యం.

3 వ్యాఖ్యలు:

Rajeswari Achyut చెప్పారు...

memu movie chusaamu.allage konta pata cheda pattina pustakaalalo(maa ammamma gaarinta) chadivaamu.malli gurtu chesaaru,madhyalo samanya mitrudu anyaayamavadam.charitra maaradu.

మురళి చెప్పారు...

@రాజేశ్వరి అచ్యుత్: సామాన్య మిత్రుడు ఒక్కడే కాదండీ..నవల కొత్త ప్రింట్ వచ్చింది.. వీలైతే మళ్లీ చదవండి.. ధన్యవాదాలు..

Rajeswari Achyut చెప్పారు...

DHANYAVADAALU

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి