బుధవారం, జులై 16, 2014

కృష్ణవేణి-7

మొదటి ఆటకి  పల్చగా  ఉన్నారు జనం. బెంచీ క్లాసుకి వచ్చిన వాళ్ళందరినీ టిక్కెట్లు చించి హాల్లోకి పంపించి, గేటు పక్కన ఉన్న బల్లమీద కూర్చున్నాడు రంగశాయి. 

"ఏట్రా బాబా.. పన్లో ఉన్నావో, మానేహేవో తెల్డం లేదు మాకు.. ఓ రోజొత్తే నాల్రోలెగ్గొడతన్నావ్.. ఏటి కత?" చనువుగా వచ్చి పక్కన కూర్చుని పలకరించాడు కాశీ, రిజర్వుడు క్లాసు గేటు కీపరు. 

"కొడుకుట్టేడ్రా.. ఆయడావిడి," అన్నాడు రంగశాయి.

"సెప్పవేట్రా.. అయినాగానొరే ఇల్లాగా సెప్పేది? బుడ్డేది? కక్కా ముక్కా యేయీ?" హడావిడి చేశాడు కాశీ. నవ్వేసి ఊరుకున్నాడు రంగశాయి.

"అదికాదుగానొరే కానుపు మీయావిడగ్గదా.. నువ్విన్నాల్లు నాగా ఎట్టేసేవేట్రా.. ఆ గుమస్తా గోరు పూటా గొడవే అనుకో..అందులోనా ఇది ఇంగ్లీసు బొమ్మ కదా.. మద్ది మద్దిన సీన్లు కలుపుతున్నారు.. కుర్రనాయాల్లు ఎర్రెక్కిపోతన్నారనుకో"  గొంతు తగ్గించి చెప్పాడు కాశీ.

"ఎన్టీ వోడి కొత్తబొమ్మ రిలీజయ్యేవొరుకూ ఇదే ఆడింతారేమో.. జనాల్తగ్గేరప్పుడే," అన్నాడు రంగశాయి. 

"తగ్గటవేటేహే.. ఇజీవోడ నించి కొత్త సీన్లట్టుకొచ్చేరు.. రేపన్నించి కలుపుతారంట.." కబుర్లు అవుతూ ఉండగానే ఇంటర్వల్ మోగింది. ఇద్దరూ ఎవరి గేటు దగ్గర వాళ్ళు నిలబడ్డారు, బయటికి వెళ్ళే వాళ్లకి గేట్ పాసులు ఇవ్వడం కోసం. సినిమా మొదలయ్యాక, నేల గేటు కీపరు కూడా వచ్చి కలిశాడు. 

"పండక్కి కొత్త బొమ్మట్టుకొత్తే లైనుకెల్తావేట్రా పోస్టర్లట్టుకునీ?" రంగశాయిని అడిగాడు కాశీ. 

ఉన్నట్టుండి నాటకం గుర్తొచ్చింది రంగశాయికి. "రిగాల్సల్ ఎన్నాల్లుంటాదో పంతులుగార్నడగాలి," అనుకున్నాడు. 

"లైను మీదకెల్తేనే నాలుగు డబ్బుల్రా.. ఎదవ కాల్నొప్పొచ్చి సైకిలు సరింగా తొక్కలేపోతన్నాన్నేను," అన్నాడు కాశీ.

రెండో ఆటకీ అంతంతమాత్రంగానే ఉన్నారు జనం. ఒక్క నేల క్లాసు మాత్రం కళకళలాడుతోంది. బెంచీ గేటు దగ్గర టిక్కెట్లు చించుతున్న రంగశాయి యధాలాపంగా రిజర్వుడు గేటు వైపు చూసి ఉలిక్కి పడ్డాడు.

కృష్ణవేణి, పక్కనే ఎవరో మగ మనిషితో లోపలికెళ్తోంది. నల్లపూలున్న తెల్ల శిల్కు చీర, నల్ల జాకెట్టు వేసుకుంది. తల నిండా జాజిదండ, ఎర్ర గులాబీలు. మగమనిషి నల్లగా, ఎత్తుగా, లావుగా ఉన్నాడు. తెల్ల బట్టలేసుకుని షోగ్గా తయారయ్యాడు.

కృష్ణవేణి భుజం చుట్టూ వేసిన అతని చేతికి ఉన్న రెండు ఉంగరాలూ తళుక్కున మెరిశాయి లైటు వెలుగులో. అతనిమీద వాలి నడుస్తున్న కృష్ణవేణి ఎటూ చూడడం లేదు. గేటు మూసేసి బల్లమీద కూర్చుండి పోయాడు రంగశాయి. అతని రెండు చేతులూ జుట్టులోకి వెళ్ళిపోయాయి అప్రయత్నంగా.

"మాయాయినప్పుడే ఒచ్చెల్లిపోయాడు. ఈ రిగాల్సలు కాదు కానీ, ఆడి మొకం సూసి ఎన్నాల్లైపోతందో.." కృష్ణవేణి మాటలు గుర్తొచ్చాయి. 

"ఎవడాడు? కృష్ణవేణి మొగుడా? పెళ్లయ్యిందా కృష్ణవేణికి. సూడబోతే డబ్బున్నోడిలాగే ఉన్నాడు.. మరి నాటకాలాట్టం ఎందుకు? మొగుడయ్యి ఉండడు.. కచ్చితంగా కాదు.. మొగుడైతే సూత్తా సూత్తా ఈబొమ్మకి తీసుకొత్తాడా.. ఆడే మొగుడైతే అంత సిన్నిల్లు ఎందుకుంటాది.. మొగుడు కాపోతే మరాడెవడు?" ప్రశ్నలూ, జవాబులూ జోరీగల్లా ముసురుకున్నాయి.


టీ తాగితే తప్ప లాభం లేదనుకుంటూ కేంటీన్ వైపు నడిచాడు రంగశాయి. టీ తాగుతూ ఉండగానే అతన్ని వెతుక్కుంటూ వచ్చేశాడు కాశీ. 

"ఓర్నువ్విక్కడున్నావా.. నీకోసవే నెలుకుతున్నాను. నా గేటు సూసుకోరా కాంత.. నేను బయలెల్తాను.. పెద్ద జెనం లేర్రా.. మొత్తం ఓ పదిమందున్నారంతే. ఇంట్రెల్లో నేలోల్లు దూరిపోకండా సూడు సాలు," అంటూ హడావిడిగా బయల్దేరాడు కాశీ.

సరిగ్గా ఆట మొదలైన ముప్పావుగంటకి ఇంటర్వల్. తన గేటు దగ్గరే నిలబడినా, రంగశాయి దృష్టంతా రిజర్వుడు మీదే ఉంది. ముగ్గురో నలుగురో బయటికి వెళ్ళారు కానీ వెళ్ళిన వాళ్ళలో 'వాళ్ళు' లేరు. ఆట మొదలవ్వనిచ్చి రిజర్వుడు గేటు దగ్గర నిలబడ్డాడు. లోపలికి చూడాలన్న కుతూహలాన్ని అణచుకోవడం అతని వల్ల కావడం లేదు. 

చప్పుడు చెయ్యకుండా లోపలికెళ్లి గుమ్మం పక్కగా నిలబడ్డాడు. చీకట్లో ఆకారాలు కనిపించడం లేదు. కాసేపటికి చీకటి అలవాటయ్యింది. తనకి కాస్త ముందున్న వరసలో ఓ చివరికి కూర్చుని కనిపించారు వాళ్ళిద్దరూ. ఆమె అతని చెవిలో నోరు పెట్టి ఏవిటో చెబుతోంది. అతని చెయ్యి ఆమె భుజం చుట్టూనే ఉంది. ఇద్దరూ సినిమానీ, హాలునీ కూడా పట్టించుకునే స్థితిలో లేరు. 

ఇదీ అని చెప్పలేని బాధేదో కలిగింది రంగశాయిలో. సత్యమూర్తిని దూరాన్నే నిలబెట్టే కృష్ణవేణి.. నారాయణరావుని చెయ్యేసి ముట్టుకోనివ్వని కృష్ణవేణి.. ఇలా మరో మగాడితో ఇంత సన్నిహితంగా మసలడం కొత్తగానూ, వింతగానూ ఉందతనికి.

చప్పుడు చెయ్యకుండా బయటికి వచ్చేసి బల్లమీద కూలబడ్డాడు మళ్ళీ. మట్టి రోడ్డు మీద చలిగాలిలో సైకిలు ప్రయాణం, తనని ఇంట్లోకి తీసుకెళ్లడం, వర్షం కురుస్తున్న రాత్రి కోడిగుడ్డట్టూ అన్నం కలిసి పంచుకోడం.. ఒకటేమిటి.. జరిగినవన్నీ సినిమా రీల్లా గింగిరాలు తిరుగుతున్నాయి కళ్ళముందు. 

ఆట అయిపోయిందన్న సూచనగా కొట్టిన బెల్లు విని స్పృహలోకొచ్చాడు రంగశాయి. జనం ఒక్కొక్కరే బయటికి వస్తున్నారు. ఎందుకో తెలీదు, బెంచీ గేటు తలుపు చాటుగా నిలబడ్డాడు రంగశాయి. వాళ్ళిద్దరూ బయటికి వెళ్తూ కనిపించారు. 

వాళ్ళని పూర్తిగా వెళ్ళనిచ్చి, రిజర్వుడు క్లాసులోకి వెళ్ళాడు నెమ్మదిగా. లైట్లన్నీ వెలుగుతూ దేదీప్యమానంగా ఉంది హాలు. కృష్ణవేణి కూర్చున్న కుర్చీ.. ఆమె అప్పుడే లేచి వెళ్ళిన జాడ తెలుస్తోంది. బయటికి రాబోతూ, కుర్చీ వెనక్కి చూస్తే ఏదో వస్తువు కనిపించింది. 

దగ్గరికి వెళ్లి వంగి చేతిలోకి తీసుకున్నాడు. ఎర్ర గులాబీ.. కొన్ని రేకులు రాలిపోయాయి అప్పటికే. ఆ పువ్వుని దోసిట్లో ఉంచి ముఖానికి దగ్గరగా తీసుకుంటూ ఉండగా, హాల్లో లైట్లన్నీ ఒక్కసారిగా ఆరిపోయాయి. 

(ఇంకా ఉంది)

4 కామెంట్‌లు: